తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, December 29, 2009

గరికిపాటివారి శతావధానం సంపూర్ణం

గరికిపాటివారి శతావధానం దిగ్విజయంగా పూర్తయ్యింది. ఈ అవధానం పుణ్యమా అని ఈసారి అసలు ఊరు వెళ్ళివచ్చినట్టే లేదు. ఉన్న మూడు రోజులూ మూడు గంటల్లా గడిచిపోయాయి! ఉదయాన్నే ఎనిమిదిన్నరకల్లా బయలుదేరి శతావధాన సభకి వెళ్ళడం. మధ్యాహ్నం సుమారు ఒంటిగంటన్నర దాకా సభ. తర్వాత భోజనాలు. ఒక గంట విశ్రాంతి. మళ్ళీ నాలుగుగంటలకల్లా సభ ప్రారంభం. రాత్రి ఇంచుమించు తొమ్మిది దాకా.

గరికిపాటివారు ఆశువుగా అనర్గళంగా పద్యాలు చదువుతూ ఉంటే, బాగా ఎత్తునుంచి పడే ఒక జలపాతం కింద నించొని ఆ నీటి ధారలో ఆపాదమస్తకం తడుస్తున్న అనుభూతి. ప్రేక్షకులని అయస్కాంతంలా ఆకర్షించగలిగే శక్తి అతని మాటల్లోనూ, మాట తీరులోనూ ఉంది. బహుశా మూడువందల మంది పట్టే ఆడిటోరియం అనుకుంటా, ప్రతి రోజూ నిండుగానే ఉండేది. చివరి రోజయితే చాలామంది జనాలు కూర్చునే చోటులేక నించునే ఉన్నారు! నేను ఒక పృచ్ఛకుడి కావడం వల్లనూ కాస్త స్థానబలిమి ఉండడం వల్లనూ గరికిపాటివారికి అతిదగ్గరగా కూర్చునే అదృష్టం లభించింది. అతనొక పద్యపాదాన్ని చెప్పి, ఎలా ఉందని చిద్విలాసంగా మా వైపు చూడడం, మేము మా ఆనందాన్ని మొహంలోనూ, ఒక తల ఊపులోనూ చూపిస్తూ ప్రతిస్పందించడం, సరదాగా విసిరే హాస్యోక్తులనూ ఉద్వేగంతో పలికే కఠినోక్తులనూ తాదాత్మ్యంతో చెప్పే మధురోక్తులనూ మేము కూడా సంతోషంతో ఉద్వేగంతో తాదాత్మ్యంతో వినడం - ఇలాంటి అనుభవం నిజంగా అదృష్టమే.

సహజంగా ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా రాష్ట్రంలో ఈనాడు నెలకొన్న పరిస్థితుల గురించిన అంశాలు వచ్చాయి. దీని గురించి గరికిపాటివారు చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాజకీయ పరిపాలనా కారణాల వల్ల విడిపోవలసిన అవసరం ఉంటే విడిపోవడంలో తప్పులేదు. అది సమస్య కాదు. ఎంతటి వైవిధ్యమున్నా భాషా సంస్కృతులు ఒకటేనన్న గ్రహింపు ఉండి, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఉండడం చాలా అవసరం. స్వార్థ రాజకీయశక్తుల వల్ల ఇది చెడిపోతోందని అతను చాలా ఆవేదన చెందారు. ఎక్కడబడితే అక్కడ సమైక్యాంధ్ర బ్యానర్ల మీద "సమైఖ్యాంద్ర" అని వ్రాసి ఉండడం సమైక్యాంధ్ర మాట దేవుడెరుగు, ముందు తెలుగు భాషకి పట్టిన దౌర్భాగ్యాన్ని తనకి పదేపదే గుర్తుకుచేసిందని బాధపడ్డారు.

గరికిపాటివారికి ధారణా బ్రహ్మరాక్షసుడు అనే బిరుదు ఉంది కాని, అతను ధారలో కూడా బ్రహ్మరాక్షసుడే! ఒక సమస్య పూర్తి అయ్యీఅవ్వక ముందే పూరణ మొదటిపాదం అందుకోవడమంటే మరి మామూలువాళ్ళకి సాధ్యమా?! సరే ధారణ సంగతి చెప్పనే అక్కర లేదు. మొత్తం 75 పద్యాలను 32 నిమిషాలలో ధారణ చేసారు. అంటే ఒకో పద్యం ధారణ చెయ్యడానికి అరనిమిషం కూడా పట్టలేదన్న మాట! ఆ ప్రవాహ వేగం గురించి ఇంకా చెప్పేదేముంది! సాధారణంగా అవధానాలలో పద్యాలని ఎంత వేగిరం పూరిద్దామా అని చూస్తారు, వర్ణనలని కూడా. దీని వల్ల వీటిలో కవిత్వం పెద్దగా గుబాళించదు. కాని గరికిపాటివారికి ఈ విషయమై కాస్త తాపత్రయం ఎక్కువ. కాబట్టి కొన్ని చోట్ల ఆగి ఆలోచించడం జరిగింది. దాని ఫలితంగా కొన్ని అందమైన పూరణలు కూడా వచ్చాయి.

సమస్య, దత్తపదులు, వర్ణనలు, ఆశువులు అన్నీ కలిపి మొత్తం 101 పద్యాలు. ఇవన్నీ విజయభావనవాళ్ళు తమ బ్లాగులో పెడతారనుకుంటాను. పద్యప్రియులు వాటిని ఆస్వాదించవచ్చు. కొంత భాగం వీడియో తీసినట్టున్నారు కాని అది ఎప్పటికి వస్తుందో, ఇంటర్నెట్లో పెట్టగలనో లేదో తెలియదు.

ప్రస్తుతానికి, నేనిచ్చిన సమస్య ఇది:

భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్

ఆసక్తి ఉన్నవాళ్ళు పూరించడానికి, గరికిపాటివారి పూరణని నా పూరణని ఇవ్వడం లేదు. ప్రయత్నించి చూడండి.


పూర్తిగా చదవండి...

Saturday, December 19, 2009

శ్రీ గరికిపాటి నరసింహారావుగారి శతావధానం

వచ్చే శుక్రవారంనుంచి ఆదివారం వరకు మూడు రోజులు (డిసెంబరు 25, 26, 27) మా విజయనగరంలో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి శతావధానం జరగబోతోంది. ఇందులో నేనూ ఒక పృచ్ఛకునిగా పాల్గొనబోతున్నాను. నేనిచ్చే అంశం సమస్య. ఈ ఏడాది జనవరిలో వారి అష్టావధానంలో పాల్గొన్నాను. ఇంచుమించు ఏడాదికి మళ్ళీ ఇలా వారి శతావధానంలో పాల్గొనడం నా అదృష్టం.

వందమంది పృచ్ఛకులతో జరిగేది శతావధానం అని చాలామందికి తెలిసే ఉంటుంది. నిర్వాహకులకి అష్టావధానం కన్నా శతావధానం కష్టం. వందమంది పృచ్ఛకులని సమకూర్చుకోవడం ఒక కష్టం. పైగా దీనికి పట్టే సమయం ఎక్కువ. ఇప్పుడు జరగబోయే అవధానం మూడు రోజులు! అయితే అవధానికి మాత్రం అష్టావధానం కన్నా శతావధానం కొంత సులువు. జ్ఞాపక శక్తి (ధారణ) గట్టిగా ఉంటే చాలు. మొత్తం వందమంది పృచ్ఛకులున్నా ఉండే అంశాలు మాత్రం నాలుగే. సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు. ఇందులో ఆశువుకి చెప్పే పాతిక పద్యాలూ మళ్ళీ ధారణ చెయ్యక్కరలేదు. అష్టావధానంలో ఉండే నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి వంటి అంశాలు కష్టమైనవి. పైగా అందులో పలురకాల విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి (ఘంటా గణనం/పుష్ప గణనం, వ్యస్తాక్షరి మొదలైనవి).
అయితే చూసేవాళ్ళకి శతావధానం రోజుకి ఎనిమిది గంటలు, మూడురోజులపాటు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో అభిరుచి ఉన్నవాళ్ళకి మంత్రముగ్ధమైన వాతావరణం అనిపిస్తుంది. అందులోనూ గరికిపాటివారు "ధారణా బ్రహ్మరాక్షసులు" అని అనిపించుకున్న వారాయె! అయితే అవధానం రక్తిగట్టడానికి పృచ్ఛకులు అడిగే ప్రశ్నలు కూడా బాగుండాలనుకోండి.

ఆసక్తీ వీలు ఉన్నవాళ్ళు, మూడు రోజులూ సెలవు రోజులే కాబట్టి, రావచ్చు. మరిన్ని వివరాలకి ఇక్కడ చూడండి: http://vijayabhavana.blogspot.com/2009/12/blog-post_5240.html


పూర్తిగా చదవండి...

Friday, December 4, 2009

ఛందస్సుతో నడక - 4

ఛందస్సుతో నడక మొదలుపెట్టినప్పుడు అది ఎన్నాళ్ళు ఎంత దాకా సాగుతుందో నాకు తెలియదు. ఇప్పటికీ తెలియకుండానే ఉంది! :-) వృత్తాల గురించిన టపా అయిన వెంటనే తెలుగు ఛందస్సులకి (ఆటవెలది, తేటగీతి మొదలైనవి) దారి మళ్ళించ వచ్చనుకున్నాను. కాని దానికన్నా ముందు మరికొన్ని సంగతులు వివరించాల్సిన అవసరం ఉందనిపించిది. కిందటి టపాలో వృత్తాలలోనే భేదాలను (ఉత్పలమాల, మత్తకోకిల) గుర్తించే ప్రయత్నం చేసాను. తెలుగు ఛందస్సుల వైపు వెళ్ళడానికి ఇంకా మరికొంత సమయం ఉంది. మరికొన్ని విషయాలు ఇంకా ముచ్చటించుకో వలసినవి ఉన్నాయి.

కిందటి టపా వ్యాఖ్యలలో భా.రా.రె.గారు ఈ "తనన" గోల తనకి పూర్తిగా అర్థమైనట్టు లేదన్నారు. అంతకన్నా గణాల బట్టి (భరనభభరవ లాగా) వృత్తాన్ని గుర్తించడం సులువుగా ఉందన్నారు. వారలా అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మనకి చిన్నప్పుడు బాగా అలవాటైన పద్ధతి సులువుగా అనిపిస్తుంది. ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నం, ఛందస్సు అసలుసిసలు స్వరూపం ఆ గణాలలోనే ఉందా, లేక మరేదైనానా అన్న విషయాన్ని ఆలోచించడం. ఛందస్సుని నిర్వచించడానికి "గణ" పద్ధతి మేలైనదా లేక "నడక" మేలైనదా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలంటే, ఛందస్సు చరిత్ర కొంచెం పరిశీలించాలి.

ఆ చరిత్ర పుటల్లోకి తొంగి చూసే ముందు, మీకొక చిన్న అభ్యాస ప్రశ్న (exercise). ఒక మూడు పద్య పాదాలకి మన గురు-లఘు గ్రాఫులు కింద ఇస్తున్నాను. ఆ గ్రాఫుల బట్టి ఆ మూడు పద్యపాదాలూ ఒకే ఛందస్సుకి చెందినవో కావో గుర్తించండి చూద్దాం:




పై గ్రాఫులు ఈ మూడు పద్యపాదాలవీను:

1. శుక్లాంబరధరం విష్ణుం
2. అగజానన పద్మార్కం
3. ఇదం తుతే గుహ్య తమం

గ్రాఫుల మధ్య ఎలాంటి పోలిక తెలియడం లేదు కదూ! అన్నట్టు ఇందులో విరామాలు కూడా లేవు. అది అచ్చంగా అక్షరాలలోని గురు-లఘువుల క్రమమే. ఈ శ్లోకాలతో పరిచయం ఉన్నవాళ్ళకి ఈ మూడూ ఒకటే ఛందస్సుకి చెందినవన్న విషయం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి, ఈ మూడూ ఒకటే ఛందస్సు - అది అనుష్టుప్! మరి ఒకటే ఛందస్సైతే ఆ మూడు గ్రాఫులు ఎందుకంత తేడాగా ఉన్నాయి (విరామాల గోల లేకున్నా కూడా)? దీనికి జవాబు చాలా తేలిక. అనుష్టుప్ ఛందస్సు వృత్తం కాదు కాబట్టి! వృత్తాల కైతే ప్రతి పాదంలోనూ గురు-లఘువుల క్రమం కచ్చితమై ఉంటుంది. అన్ని ఛందస్సులకీ అలా ఉండదు. సరే, పోనీ ఏమైనా repetetive patterns అన్నా ఉన్నాయా ఇందులో? ప్రతిదీ ఎనిమిది అక్షరాల పాదం, చివరి అక్షరం గురువు. ఇవే ఆ మూడిటిలో ఉన్న సామ్యాలు. అదే ఆ ఛందస్సు నిర్వచనం కూడాను! ఈ అనుష్టుప్ ఛందస్సు వృత్తాల కన్నా కూడా ప్రాచీనమైనది.

ఈ అభ్యాసం వల్ల మనకి తెలుస్తున్న విషయాలు ఏమిటంటే:
1. అన్ని ఛందస్సులూ వృత్తాలు కావు.
2. వృత్తాలు కాని ఛందస్సులకి గురు-లఘు గ్రాఫులు పెద్దగా ఉపయోగ పడవు
3. ప్రతి ఛందస్సుకీ గురు-లఘువుల pattern (అసలు ఎలాంటి repetetive pattern) ముఖ్యం కాదు

గురు-లఘువులు (లేదా మాత్రలు) ముఖ్యం కాని ఛందస్సులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే మనం బళ్ళో ఛందస్సు చదువుకోవడం ఈ గురు-లఘువులతోనే మొదలుపెడతాం కాబట్టి. గురు-లఘువుల క్రమంతో సంబంధం లేని ఛందస్సు మనం నేర్చుకోలేదు కాబట్టి!

సరే ఇప్పుడు ఛందస్సు చరిత్ర మీద కాస్త దృష్టి సారిద్దాం. దీని గురించి ఇప్పటికే నా ఛందస్సు - కథా కమామీషు టపాలో వ్రాసాను. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేస్తాను. ఛందస్సు పుట్టుక రెండు రకాలుగా జరిగింది. ఒకటి ఋషుల వేదాలలోను. మరొకటి జానపదుల పాటలలోనూ. ఈ రెండిటిలో ఏది ప్రాచీనం అన్న విషయం మనకి తెలియదు, అది ప్రస్తుతానికి అప్రస్తుతం కూడా. వేద ఛందస్సు మార్పులు చెంది సంస్కృత కావ్య ఛందస్సు అయ్యింది. ఆ సంస్కృత కావ్య ఛందస్సు నుంచి కన్నడం, తెలుగు వంటి దేశభాషల కావ్యాలలోని ఛందస్సు పుట్టుకొచ్చింది. ఈ పరిణామ క్రమంలో కావ్య ఛందస్సు జానపద ఛందస్సు నుంచి చాలా లక్షణాలని స్వీకరించింది.

ఛందస్సు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అనే మాట - ఛందస్సు పద్యానికి చక్కని వినసొంపైన నడకని ఇస్తుంది, ఆ నడక మనసుని వెంటనే ఆకర్షిస్తుంది అని. ఇది నిజానికి నిజం కాదు, పూర్తిగా. ఈ మాట కేవలం జానపద ఛందస్సుకి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకో కాసేపట్లో చూద్దాం. ముందుగా వేదాలలోని ఛందస్సుని తీసుకున్నట్లయితే, అవి ప్రధానంగా అక్షర బద్ధమైన ఛందస్సులు. అంటే, అందులో మాత్రలు కాని, గురు-లఘువుల క్రమం కాని, ఇవేవీ ముఖ్యం కాదు. ప్రతి పాదంలోనూ ఉండాల్సిన అక్షరాల సంఖ్యని మాత్రమే నిర్దేశిస్తాయవి. గురు-లఘువుల నియమం ఏ కొన్ని అక్షరాలకో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చూసిన అనుష్టుప్ ఛందస్సు తీసుకుంటే, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. చివరి అక్షరం గురువు అవ్వాలి అన్నది మాత్రమే దాని నియమం. మరి ఇలాంటి ఛందస్సులో చెవికి స్పష్టంగా తెలిసే "నడక" ఎలా సాధ్యమవుతుంది? అసలు వేదాలలో ఛందస్సు ప్రయోజనం ఏమిటి? చెవికి ఇంపు గూర్చే నడక ఇవ్వడమా? కాదు. జానపద గీతాల్లాగ, మానసిక ఆహ్లాదాన్ని గూర్చడం కాదు కదా వేద మంత్రాల పని. అంచేత అందులో ఛందస్సు ప్రయోజనం వేరే ఉంది. వేదాలు ముఖే ముఖే వ్యాప్తి చెందినవన్న విషయం మనకి తెలుసు. వేద శ్లోకాలు వల్లెవేసి, కంఠస్థం చెయ్యడం ద్వారా గురువులనుంచి శిష్యులు నేర్చుకొనేవారు. ఇలా శ్లోకాలను గుర్తు పెట్టుకోడానికి, వాటిని ఇతరులకి నేర్పడానికి, ఆ శ్లోకాలకి కొంత నిర్దిష్టత అవసరం. మామూలుగా మనం మాట్లాడే వాక్యాలకి ఆ నిర్దిష్టత ఉండదు. అంచేత ఒకరు చెప్పిన వాక్యాలు అక్షరం పొల్లుపోకుండా తిరిగి ఒప్పచెప్పాలంటే ఇంచుమించు అసాధ్యం. ఈ సమస్యని అధిగమించే ఒక సాధనమే వేదాలలో ఛందస్సు. ఒక శ్లోకంలో ఇన్ని అక్షరాలు మాత్రమే ఉండాలి, అందులో కొన్ని అక్షరాలు గురువు లేదా లఘువే ఉండాలి అన్న నియమాలు ఆ చెప్పే శ్లోకానికి ఒక నిర్దిష్టతని ఇస్తాయి. వల్లెవేసి గుర్తుపెట్టుకోడానికి కూడా కొంత సులువవుతుంది. వేదాలలోని ఛందస్సు ప్రయోజనం ఇదే. ఛందస్సుతో పాటు, ఇతర వేదాంగాలైన వ్యాకరణము, నిరుక్తము, శిక్ష ద్వారా శ్లోకాలకి మరింత నిర్దిష్టత చేకూరుతుంది.

వేదాలనుంచి కావ్యలకి వస్తే, ఆదికావ్యమైన రామ్యాయణం తప్పించి, తర్వాతి కాలంలో వచ్చిన కావ్యాలలో చాలా వృత్తాల ప్రయోగం కనిపిస్తుంది. అక్షర ఛందస్సు నుంచి ఏర్పడ్డవే వృత్తాలు. అక్షర ఛందస్సు పాదంలోని అక్షర సంఖ్యని మాత్రమే నియంత్రిస్తే, అందులోని అక్షరాల గురు-లఘు క్రమాన్ని నియంత్రించేవి వృత్తాలు. ఒకో అక్షర ఛందస్సుకీ ఎన్ని వృత్తాలు ఉండగలవు అన్నది ప్రాచీన ఛందశ్శాస్త్రకారులు గణించేరు. అంటే permutations అన్న మాట. దీన్ని ప్రస్తారం అంటారు. పాదంలోని గురు-లఘువుల క్రమాన్ని నిర్దేశించడమే వృత్త నిర్వచనం చేసేది. వృత్త నిర్వచనంలో ఇప్పుడు మనకి కనిపించే "యమాతారాజభానసలగం" గణాల ప్రసక్తి లేనే లేదు. ఈ గురు-లఘు క్రమాన్ని గుర్తుపెట్టుకోడానికి, రక రకాల పద్ధతులు అవలంబించేవారు. మూడు లేదా రెండు అక్షరాలని కలిపి ఒక గణంగా ఇలా గుర్తించడాన్ని కనిపెట్టింది పింగళుడని అంటారు. ఇవి అక్షర గణాలు (అంటే అక్షరాల సమూహంతో ఏర్పడ్డ గణాలు). పింగళుడి ముందు నాలుగు/రెండు అక్షరాలని ఒక గణంగా గుర్తించే పద్ధతి అమలులో ఉండేదట. ఆ గణాలకి వేరే పేర్లు ఉండేవి. అంచేత మనం నేర్చుకున్న అక్షరగణాలు కేవలం గురు-లఘు క్రమం గుర్తుపెట్టుకొనడానికి ఉపయోగపడే సాధనమే కాని, వృత్త నిర్వచనానికి వాటి అవసరం లేదు. ఒకవేళ పదాలు అక్షర గణాన్ని అనుసరించే విరగాలి అన్న నియమం ఉంటే, వాటికి నిర్వచనంలో ప్రాధాన్యం ఉండేది. కాని అలాంటి నియమమేమీ లేదు.

సరే, అది అలా ఉంచితే, కావ్యాలలో ఛందస్సు ప్రయోజనం ఏమిటి? శ్లోకాలను సులువుగా గుర్తుపెట్టుకొనేటట్టు వాటికి నిర్దిష్టమైన రూపం ఇవ్వడం అన్న ప్రయోజనం ఎప్పుడూ ఛందస్సు చేస్తుంది. వృత్తాలు మరింత నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తాయి. అయితే, కావ్యాలలో మనోరంజన ప్రధానం కాబట్టి, చెప్పే విషయానికి అనువుగా, చెవికి ఇంపుగా ఉండేటట్టు పద్యాలని వ్రాసే ప్రయత్నం పూర్వ కవులు చేసారు. అందుచేతనే బహుశా వేల వేల వృత్తాల లోంచి కేవలం కొన్ని వందల వృత్తాలని మాత్రమే కావ్యాలలో ప్రయోగించారు. అందులోనూ వేళ్ళ మీద లెక్కబెట్టగల వృత్తాలే ఎక్కువ ప్రచారం పొందాయి. కవులు ఒకో వృత్తాన్ని ఒకో ప్రత్యేక సందర్భంలో ఎక్కువగా ప్రయోగించినట్టు కూడా కొన్ని దాఖలాలు కనిపిస్తున్నాయి. క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో దీనిని వృత్తౌచిత్యమని పేర్కొని దీని గురించి కొంత వివరించాడు. చెప్పే విషయాన్ని విన సొంపుగా (ఒక ప్రస్ఫుటమైన నడకతో) చెప్పే ప్రయత్నంలోనే, జానపద ఛందస్సుల ప్రభావం కావ్య ఛందస్సులలో కనిపిస్తుంది. ఆ ప్రభావం గురించి తెలుసుకొనే ముందు, అసలు జానపద ఛందస్సు అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా!

జానపదులలో సంగీతం సాహిత్యం బాగా పెనవేసుకుపోయి ఉంటాయి. అంటే జానపదుల పాటల్లో ఒకే పాటని వేరువేరు వరసల్లో పాడటం అన్నది సాధారణంగా ఉండదు. ఎందుకిలా అవుతుంది? జానపదుల పాటలకి "దరువు"(beat) ప్రధానం. ఆ దరువుకి తగ్గట్టు పదాలు సహజంగా విరుగుతాయి. ఉదాహరణకి ఎండ్రకాయ పాటలో ఈ రెండు చరణాలు చూడండి:

వరీమడీ నాటబోతి ఓరి మగడా - నేను
గెనుం వార మునుం బడితి ఓరి మగడా
గెనుం వార మునుం బడితి ఓరి మగడా - నన్ను
ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా

ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా - నాకు
ఒళ్ళు సర్తుబోసినాది ఓరి మగడా - నాకు
ఉలవపిండి పట్టెయ్ రా ఓరి మగడా - నువ్వు
రాతిరంత మేలుకోర ఓరి మగడా

*(ఇది త్రివిక్రం గారి "అవీ ఇవీ" బ్లాగునుండి సంగ్రహించబడింది :-)

ఇది మనకి మనం చదువుకుంటే వెంటనే దాని నడక తెలిసిపోతోంది. దీన్ని ఎవ్వరు పాడినా అదే నడకతో పాడగలరు. ఎందుకు? "తందనాన తందనాన తందనాననా - తాన, తందనాన తందనాన తందనాననా" అనే నడకకి తగ్గట్టుగా రెండు మూడు అక్షరాల చిన్న చిన్న పదాలతో ఉంది కాబట్టి. ఇది జానపద ఛందస్సు. జానపద ఛందస్సుకి ముఖ్య లక్షణాలు ఇవి:

1. ఇందులో repetitive patterns చిన్నగా ఉండి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఉదాహరణకి పై పాటలో "తందనాన" అన్నది మళ్ళి మళ్ళీ వస్తోంది.
2. ఈ repetitive patternsలో గురు-లఘు క్రమం ముఖ్యం కాదు. మొత్తం మాత్రల సంఖ్య ముఖ్యం. ఉదాహరణకి పై పాటలో "వరీ మడీ", "ఎండ్రకాయ", "ఉలవ పిండి" - వీటిలో గురు-లఘు క్రమం తేడా ఉన్నా మొత్తం మాత్రల సంఖ్య ఒకటే. మాత్రల మీద ఆధారపడే ఈ repetitive patternsని "మాత్రా గణాలు" అంటాం.
3. మాత్రా గణానికి తగ్గట్టు సాధారణంగా పదాలు విరుగుతాయి. ఒక వేళ కాని సందర్భంలో కూడా పాడేటప్పుడు అలా విరిచి పాడతారు.
4. మాత్రా గణాలకి నప్పడానికి ఒకోసారి అక్షరాలని సాగదియ్యడం, కుదించడం చేస్తారు. ఉదాహరణకి పై పాటలో "వరిమడి" అన్నది అసలు పదం. కాని నడక సరిపోవడం కోసం పాడేటప్పుడు "వరీమడీ" అని పాడతారు.
5. జానపద గీతాలలో, ఒకే రకమైన మాత్రా గణాలు ఎన్ని పాదాలకి ఉండాలన్న నియమం స్పష్టంగా ఉండదు.

అన్ని జానపద గీతాలకీ పై అన్ని లక్షణాలూ ఉంటాయని చెప్పలేను కాని సాధారణంగా ఈ లక్షణాలని గమనించవచ్చు. ఈ జానపద ఛందస్సునే "మాత్రా ఛందస్సు" అని కూడా అంటారు.

జానపదగీతాల నుంచి లలిత గీతాలు, వాటినుంచి సినిమా గీతాలు వచ్చాయి కాబట్టి, సినిమా పాటల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సంగీతంలో శాస్త్రీయ తాళాలు (మేళకర్త తాళాలు) ఛందస్సులో వృత్తాలవంటివైతే, చాపు తాళాలు మాత్రా ఛందస్సు వంటివి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పోలికలని మరికొంత వివరంగా పరిశీలించండి.

ఇది జానపద/మాత్రా ఛందస్సు!

జానపద ఛందస్సుల ప్రభావం కావ్యలపై ఉందని అన్నాను కదా. ఆ ప్రభావం ఏమిటో ఈపాటికి చూచాయగా మీకు తెలిసే ఉంటుంది. పైన చెప్పిన లక్షణాలలో 1, 3 లక్షణాలు కలిగిన వృత్తాలని కొన్నిటిని కవులు గుర్తించి, వాటిని తమ కావ్యాలలో అక్కడక్కడ ప్రయోగించారు. అలా వచ్చినవే మనం క్రితం టపాలో చూసిన "మత్తకోకిల", "లయగ్రాహి" వంటి వృత్తాలు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి - భుజంగ ప్రయాతం, పంచచామరం మొదలైనవి.
మత్తకోకిల ఛందస్సుని మళ్ళీ మీరు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అందుకే అలాంటి ఛందస్సులని వాటి నడకతో ("తాన తానన..." లాగ) గుర్తుపెట్టుకోవడం సులువు అవుతుంది.
మీరు జాగ్రత్తగా చూసి ఉంటే, కిందటి టపాలో నేనిచ్చిన మత్తకోకిల ఉదాహరణ నిజానికి మత్తకోకిల పద్యపాదం కాదు, యతి కుదరలేదు కాబట్టి. అది నేనెప్పుడో రాసుకున్న ఒక పాట పల్లవిలోనిది. ఆ పల్లవి ఇది:

నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో
గతము మరచెను వెఱ్ఱి హృదయము తేలిపోయెను హాయిలో

ఈ పల్లవిలో రెండో పాదం చూస్తే విషయం పూర్తిగా అర్థమవుతుంది! అది కచ్చితంగా మత్తకోకిల కాదు. కాని ఇది ఒక మాత్రా ఛందస్సు. దీని లక్షణం "3+4+3+4+3+4+3+2". ఇందులోని సంఖ్యలు మాత్రలని సూచిస్తాయి. మొదటి పాదం, రెండో పాదం కూడా ఇదే ఛందస్సులో ఉన్నాయి. అంటే "మత్తకోకిల" ఈ మాత్రా ఛందస్సుకి subset అన్న మాట!

ఈసారికి ఇక్కడతో ఆపుదాం. ఇప్పటికే ఎక్కువైపోయింది. మీ బుఱ్ఱలు వేడెక్కిపోయి ఉంటాయి :-) అందుకే ఈసారి ప్రశ్న సులువుగానే ఇస్తున్నాను. మాత్రా ఛందస్సుకి గ్రాఫు ఎలా గియ్యాలో ఆలోచించండి.


పూర్తిగా చదవండి...

Sunday, November 22, 2009

ఛందస్సుతో నడక - 3

మళ్ళీ నడక కొనసాగించే ముందు వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని ఒకసారి చూసుకుందాం. క్రిందటి మారు ఒక పద్య నిర్వచనాన్ని/ఛందస్సుని/నమూనాని (ఈ మూడూ ఒకటే) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. అలాగే పద్య నిర్మాణాన్ని (అంటే ఒక పద్య పాదాన్ని) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. ఒకే చందస్సులో ఉండే వివిధ పద్యాల గ్రాఫుల్లో తేడాలు ఎలా వస్తాయో గుర్తించాము. ఈ తేడాకి, పద్య పాదంలో ఉండే పదాల విభజన ప్రధాన కారణమని తెలుసుకున్నాము. గ్రాఫులో x-axisలో అక్షరాలని, y-axisలో గురు లఘువుల విలువలని తిసుకున్నాము. పదాల మధ్య వచ్చే విరామాన్ని కూడా ఒక అక్షరంగా పరిగణించి దానికి 1 విలువ ఇచ్చాము.

ఇప్పటి దాకా చేసిందీ చూసిందీ ఇది. వచ్చే టపాలో తెలుగు ఛందస్సులని గ్రాఫుల్లో గీసే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. కాని దానికింకా సమయం ఉంది. అంతకన్నా ముందు మరొక విషయాన్ని తెలుసుకోవాలి. క్రిందటిసారి రెండు పాటలని "తనన" భాషలో ఇచ్చి కనుక్కోండి చూద్దామన్నాను కదా. దాని వెనక ఒక కారణం ఉంది. అందులో మొదటి పాట రెండవ పాట కన్నా కనుక్కోడం సులువని నా ఆలోచన. రవి రాకేశ్వరుల ప్రయత్నాలు నా ఆలోచనని ఒక రకంగా నిరూపించాయనే అనుకుంటున్నాను. ఎందుకో మనం సులువుగానే ఊహించవచ్చు. అదేమిటంటే, మొదటి పాటలో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లయ ఉంది. అంటే? "తనన" అనేది మొదటి పాదంలో నాలుగు మార్లు వస్తోంది. అలాగే మొదటి రెండు పాదాలు ఒకటే "తనన"లు. మూడు నాలుగు పాదాల్లో కూడా ఇలాంటి సామ్యమే ఉంది. ఇది ఆ పాటకి ప్రస్ఫుటంగా కనిపించే ఒక నడకని ఇస్తోందన్న మాట. అలాంటి నడకని గుర్తించడం సులభం. అదే రెండో పాటలో అలా మళ్ళీ మళ్ళీ ఒకేలాగ వచ్చే "తనన"లు లేవు. అందువల్ల దానికి చదవగానే గుర్తుపట్ట గలిగేటంత ప్రత్యేకమైన నడక లేదు.

సరే, దీనికీ ఛందస్సుకీ ఏమిటి సంబంధం? అంటే, పాటల్లో లాగానే ఇలాంటి తేడాలు పద్యాలలో కూడా ఉన్నాయి! ఉదాహరణకి ఈ క్రింద "లయగ్రాహి", "మత్తకోకిల" అన్న రెండు ఛందస్సులకి (రెండూ వృత్తాలే) గ్రాఫులు ఇస్తున్నాను. లయగ్రాహి గురించి రాకేశ్వరగారు తన బ్లాగులో వివరంగా వ్రాసారు.



ఇప్పుడు ఈ గ్రాఫులని కిందటి టపాలో ఉన్న ఉత్పలమాల గ్రాఫుతో పోల్చి చూడండి. వృత్యనుప్రాసలో మళ్ళీ మళ్ళీ ఒకే అక్షరాలు వచ్చినట్టుగా, ఇక్కడ (లయగ్రాహి, మత్తకోకిల వృత్తాలలో) ఒకే గురు లఘు క్రమం మళ్ళీ మళ్ళీ వస్తోంది కదా. ఇలాంటి repetitive pattern మనకి ఉత్పలమాలలో కనిపించదు.

ఇప్పుడు మత్తకోకిలలో ఉన్న ఈ రెండు పాదాలు, వాటికి సంబంధించిన గ్రాఫులు పరిశీలించండి:


నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో


నా మనస్సు వ్యథన్ భరింపగ జాలకుండె క్షమింపవే


మొదటి ఉదాహరణలో ఛందస్సు నిర్వచనంలో ఉన్న repetitive patternని సరిగ్గా అనుసరించి పద్యం నడిచింది. అంటే అందులో పదాలు సరిగ్గా ఆ patternకి తగ్గట్టు ఉన్నాయి. రెండో ఉదాహరణలో అలా జరగడం లేదు. అవునా. అయినా రెండో ఉదాహరణని రెండు మూడు సార్లు చదివి చూడండ్ది. అది మత్తకోకిల నడకలోనే ఉందని సులువుగానే గ్రహించ గలుగుతారు. రెండు గ్రాఫులు చూసినా వాటి మధ్య పోలికలు బాగానే కనిపిస్తాయి (ముఖ్యంగా దీన్ని ఉత్పలమాల, దాని ఉదాహరణలతో పోల్చి చూస్తే తేడా బాగా తెలుస్తుంది). Pattern Recognitionతో కొంత పరిచయం ఉన్నవాళ్ళకి, repetitive patterns ఉన్నప్పుడు వాటిని గుర్తుపట్టడం సులువన్న విషయం తెలిసే ఉంటుంది.

అంతే కాదు, repetitive pattern ఛందస్సుకి ఒక ప్రత్యేకమైన నడకని ఇస్తుంది. ఆ ఛందస్సులో పద్యాలని అలాంటి నడకతో రాయడమే సాధ్యమవుతుంది! ఎంత విరగ్గొట్టి రాద్దామనుకున్నా ఇంచుమించు ఆ నడక వచ్చే తీరుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన నడక లేని ఉత్పలమాల లాంటి పద్యాలకి రకరకాల నడకలు వస్తాయి. అంటే నడక పరంగా చూస్తే, మత్తకోకిల లయగ్రాహి లాంటి వృత్తాలు చాలా rigid వృత్తాలన్న మాట. వీటిని nonelastic ఛందస్సు అని పిలవవచ్చు. ఛందస్సుకి ఎలాస్టిసిటీ అన్న విషయాన్ని శ్రీశ్రీ ఒకచోట ప్రస్తావించారు. కానీ దాని గురించి ఎక్కడా వివరించినట్టు లేదు. ఉత్పలమాలలాంటి వృత్తాలు పూర్తి elastic వృత్తాలు.

దీని సారాంశం రెండు ముక్కల్లో చెప్పాలంటే, Repetitive pattern ఉన్న ఛందస్సులకి రెండు ప్రత్యేకతలు ఉంటాయన్న మాట:

1. ఈ ఛందస్సులో ఉన్న పద్యాలని గుర్తుపట్టడం సులువు
2. ఈ ఛందస్సులో వ్రాసే పద్యాలకి ఒకటే ప్రత్యేకమైన నడక ఉంటుంది. దాని కారణంగా అది nonelastic ఛందస్సు అవుతుంది.

ఇంకొక విషయం. సంస్కృతంతో పోలిస్తే, తెలుగు వృత్తాలకి ఎలాస్టిసిటీ ఎక్కువ! ఎందుకంటారా, అదంతా "యతి" మహత్తు! సంస్కృతంలో యతి విరామాన్ని నిర్దేశిస్తుంది. అంటే సరిగ్గా యతిస్థానంలో ఉన్న అక్షరంతో ఒక కొత్త పదం మొదలవ్వాలన్న మాట. ఉదాహరణకి ఉత్పలమాలలో యతి స్థానం 10. కాబట్టి ఏ ఉత్పలమాల పద్యంలోనైనా పదవ అక్షరంతో కొత్త పదం కచ్చితంగా మొదలవ్వాలి. క్రితం టపాలో ఇచ్చిన రెండు ఉదాహరణలూ దీన్ని అనుసరించడం యాదృఛ్చికం!
"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి..." అన్న పద్యంలో ఈ నియమం పాటించబడ లేదు. యతిస్థానం లో "దం" అన్నది పదం మధ్యలో ఉంది. ఇది తెలుగు పద్యం కనక సరిపోయింది. ఇలాంటిది సంస్కృతంలో కుదరదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన గ్రాఫు రెండు భాగాలు అయిపోతుంది. యతి స్థానం ముందు వరకూ ఒక భాగం. తర్వాతది మరొక భాగం. ఈ రెండిటి మధ్య 1 విలువ ఉండే విరామం ఎప్పుడూ ఉంటుంది. దీనితో పద్యానికి కొంతవరకూ ఒక ప్రత్యేకమైన నడక అంటూ ఏర్పడుతుంది. అందులోని ఎలాస్టిసిటీ కొంత తగ్గుతుంది. అంతే కాదు, సంస్కృతంలో ప్రతి పాదం చివరకూడా ఇలాగే విరామం ఉండాలి. అంటే ఒకే పదం రెండు పాదాల్లోకి సాగకూడదన్న మాట. అంచేత ఒక పాదం పూర్తయ్యాక తప్పనిసరిగా చిన్న విరామం ఇచ్చి తరువాత పాదాన్ని చదవడం మొదలుపెడతాం. దీనివల్ల నడక మరింత సులభంగా తెలుస్తుంది. అదే తెలుగు పద్యాలలో అయితే ఈ నియమం లేదు. అంచేత తెలుగులో ప్రతిపాదం తర్వాత ఒక విరామం ఉండవలసిన పనిలేదు. అలా లేనప్పుడు, అలాంటి పద్యాలని గుర్తుపట్టడం మరింత కష్టం! అయితే దీనివల్ల పద్యాలకి ఎలాస్టిసిటీ మరింత పెరుగుతుంది.

ఇవాళ్టికి ఇక్కడకి ఆపుదాం. ఈసారి విషయం కొంచెం బరువైనట్టుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదివి, ఏమైనా సందేహాలుంటే నిరభ్యరంతరంగా అడగండి.

ఆ... ఆగండాగండి. ఈసారి మీ మెదడుకి మేత ఏమీ ఇవ్వలేదు కదూ! సరే, కిందటి టపా వ్యాఖ్యలలో "కన్నెపిల్లవని" పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రశ్న. అందులో "తనన తనన అన్న తాన అన్న తాళం ఒకటే కదా" అన్న వాక్యం గుర్తుందా? దీని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇప్పుడు ఆలోచించండి. ఆలోచించి, ఏమిటనుకుంటున్నారో చెప్పండి. సరేనా!


పూర్తిగా చదవండి...

Thursday, November 12, 2009

ఛందస్సుతో నడక - 2

క్రిందటిసారి నేనిచ్చిన మూడు ప్రహేళికలను పూర్తిచేసిన వాళ్ళకీ, ఆసక్తితో ప్రయత్నించిన వాళ్ళకీ అభినందనలు. మొదటి టపాలో రంగాన్ని మాత్రం సిద్ధపరుచుకున్నాము. అక్కడ వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇంక మొదలుపెడదామా. దీనికి కాస్త థియరీ అవసరం అవుతుంది మరి. మరీ బోరు కొట్టకుండా వివరించే ప్రయత్నం చేస్తాను.

ఆ థియరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీ మెదడుకి మేత. క్రితం సారి పద్యాలయ్యాయి కదా, ఈ మారు సరదాగా సినిమా పాటలు తీసుకుందాం. ఒక రెండు సినిమా పాటల పల్లవులని క్రింద ఇస్తున్నాను, "తనన" భాషలో. ఆ పాటలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!

మొదటిది:

తనన తనన తనన తనన తానానా
తనన తనన తనన తనన తానానా
తననన తననన తానన తానానా
తననన తననన తానన తానానా
తనన తనన తనన తాన

రెండోది:

తానా తననననన తానా
తానాన తానాన తాన తనానా
తానా తానా తానా
తానా తానా తానానా (అమెరికావాళ్ళ "తానా"కీ దీనికీ ఏ సంబంధం లేదని మనవి :-)

సరే, ఇంక అసలు విషయంలోకి వద్దాము. ఒక వాక్యమో లేదా వాక్య సముదాయమో పలికేటప్పుడు, అందులో ప్రతి అక్షరం పలకడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది అని ముందటి టపాలో చెప్పాను. ఒకో అక్షరాన్ని పలకడానికి తీసుకునే సమయం, ఆ అక్షరాన్నిబట్టి మారుతుంది కదా. ఉదాహరణకి దీర్ఘాలు ఉన్న అక్షరాలు, మామూలు అక్షరాల (హ్రస్వాలు) కన్నా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఉదాహరణకి "ఆకాశము" అన్నప్పుడు "శ", "ము" అనే అక్షరాలు పలకడానికి తీసుకునే సమయం కన్నా, "ఆ", "కా" అనే అక్షరాలు పలకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే "సంగతి" అన్నప్పుడు "సం" అనే అక్షరం ఎక్కువ సమయం తీసుకుంటుంది పలికేటప్పుడు. ఇలా పలకడానికి మామూలు కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలని "గురువులు" అని ఒక పేరుపెట్టారు. ఎక్కువ సమయం తీసుకోని మిగతా అక్షరాలని "లఘువులు" అని అంటారు. ఈ గురులఘువుల గురించి ఇంతకు ముందు "పెద్దోడు చిన్నోడు" అనే టపాలో వివరంగా వ్రాసాను. ఒక లఘువు పలకడానికి కావలసిన సమయాన్ని ఒక మాత్ర అని అంటారు. గురువుకయితే రెండు మాత్రల సమయం పడుతుందని సుమారుగా సంస్కృత ఛందస్సు వ్రాసినవాళ్ళు నిర్ణయించారు. తమిళ ఛందస్సులలో అయితే మరో కేటగిరీ కూడా ఉంది. తెలుగు ప్రధానంగా సంస్కృత ఛందస్సునే అనుసరిస్తుంది కాబట్టి మనకి ఉన్నవి గురువు, లగువు అని రెండే కేటగిరీలు.

అంచేత ఒక వాక్యంలో ఉన్న గురు లఘువుల క్రమం, లేదా మాత్రల క్రమం, ఆ వాక్యపు నడకని పట్టి ఇస్తుందన్న మాట. ఈ గురు లఘు క్రమంలో ఒక నియమాన్ని పెడితే, అది దాని నడకలో ఒక ప్రత్యేకతని తెస్తుంది. అలాంటి వాక్య సముదాయాలు పద్యం అవుతాయి. అయితే పద్యాన్ని నిర్వచించేటప్పుడు వాక్యాల ప్రసక్తి కాకుండా, పాదాలను నిర్వచిస్తాం. ఒక ప్రత్యేకమైన నడక కలిగిన అక్షర సముదాయాన్ని ఒక పాదం అంటాం. అలాంటి రెండు లేక అంత కన్నా ఎక్కువ పాదాల కలయిక ఒక పద్యం అవుతుంది. దీని గురించి నా మొదటి టపాలోను, "ఛందస్సు - కథా కమామీషు" టపాలోనూ మరి కొంచెం వివరించాను.

మనకి స్కూల్లో పరిచయమయ్యే మొదటి వృత్తం ఉత్పలమాల. "భరనభభరవ" అని కంఠస్థం చేస్తాం కదా. అంతకన్నా ముందే "యమాతారాజభానసలగం" అన్నది కూడా కంఠస్థం చేస్తాము. ఏమిటీ ఛందస్సు? ప్రతి పాదంలోనూ ఉండే గురు లఘువుల క్రమాన్ని నిర్దేశించే ఒక ఛందస్సు ఇది.
UIIUIUIIIUIIUIIUIUIU - ఇదీ ఆ గురు లఘువుల వరస. ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు. ప్రతి పాదంలోనూ అక్షరాలు సరిగ్గా ఇదే గురులఘువుల క్రమంలో ఉండాలన్నమాట. చిన్నప్పుడు మీ తెలుగు టీచరు ఇలాగే ఇదంతా చెప్పేటప్పుడు మీకు బోరుగా అనిపించలేదూ? అనిపించే ఉంటుంది! ఇప్పుడూ అలాగే ఉందా? సరే మనం మరికాస్త సరదా కోసం, కాస్త గ్రాఫిక్కుల జిమ్మిక్కులు చేద్దాం. ఈ గురులఘువుల క్రమాన్ని ఒక గ్రాఫులా గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం:


ఇదిగో ఇలా ఉంటుంది! లఘువుకి విలువ 2, గురువుకి విలువ 4 ఇచ్చానిక్కడ. ఎందుకో మరికొంత సేపట్లో తెలుస్తుంది. మొదలు చివరలని స్పష్టంగా చూపించడం కోసం ముందొకటి వెనకొకటి సున్నాలు తగిలించాను. బావుందా! ఉత్పలమాలలో ఉన్న ఏ పద్యాన్ని తీసుకుని ఈ గ్రాఫు గీసినా కచ్చితంగా ఇలాగే ఉంటుంది.

సరే ఇప్పుడిలాగే చంపకమాలని కూడా చూద్దాం:


ఉత్పల చంపకమాలలోని పోలిక ఇట్టే గుర్తుపట్టారు కదా!

సరే ఇంతకీ ముందు టపాలో మనం Pattern Recoginition వగైరా వగైరా మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఛందస్సుకీ ఇలాంటి గ్రాఫొకటి తయారుచేసుకుని, ఇచ్చిన పద్యానికి ఒక గ్రాఫు వేసి పోలిస్తే ఇట్టే తెలిసిపోతుంది, అవునా? మరి ఇందులో ఇంతగా ఆలోచించడానికీ ఏముంది? ఏమీ లేదంటే లేదు, ఉందంటే ఉంది. వృత్త పద్యాలని తీసుకుని చిన్నప్పుడు బడిలో చేసినట్టు గురువు లఘువు గుర్తుపట్టి, దాన్ని వృత్త నిర్వచనలాతో పోల్చి ఏ వృత్తమో సులువుగానే చెప్పవచ్చు. గురు లఘువులని గుర్తుపట్టడమే కొంచెం క్లిష్టమైన పని కాని, అది చేసిన తర్వాత కంప్యూటరు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ Pattern Recognition ఏమీ లేదు. గుర్తుపట్టాల్సిన సమాచారమంతా అచ్చు గుద్దినట్టు ఒకే మూసలో ఉంటే చాలా తేలికగా గుర్తుపట్టెయ్య వచ్చు. సమాచారంలో వైవిధ్యం ఉండి, కొంత శాతం గోల గజిబిజి ఉన్నప్పుడు, అందులోంచి నమూనాని వెలికి తియ్యడం అసలైన ఛాలెంజి. మరి ఇలాంటి వృత్త పద్యాలలో ఆ వైవిధ్యం ఎక్కడనుంచి వస్తుంది?

ఎక్కడ నుంచి వస్తుందంటే, పద్యాన్ని చదివేటప్పుడు వస్తుంది. మనం పద్యాన్ని చదవగానే, లేదా వినగానే ఆ ఛందస్సుని గుర్తుపట్టాలంటే ఎలా? పలికినప్పుడు ప్రతి ఉత్పలమాల పద్యం మనకి ఒకేలా వినిపించదు. ఒకో పద్యం ఒకోలా వినిపిస్తుంది. ఈ వైవిధ్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అందులో ఒక ప్రధానమైన కారణాన్ని తెలుసుకుందాము. మనము పద్యం చదివేటప్పుడు, సాధారణంగా ఒకే గుక్కలో చదువుకుంటూ పోము కదా. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుంటాము. ఎక్కడ? ప్రతి పదం తర్వాత ఒక అతి చిన్న విరామం తీసుకుంటాము. అలాగే వాక్యం పూర్తయినప్పుడు కూడా కొంత విరామం తీసుకుంటాము. మధ్య మధ్యలో తీసుకునే ఈ విరామాలు పద్యపు నడకలో చాలా తేడాలని కలిగిస్తాయి. ఉదాహరణకి ఉత్పలమాల పద్యాలలోవే, ఈ రెండు పాదాలు చదివి చూడండి:

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బోంకుచే

నీ కనుదోయి వెన్నెలలు నిండిన నా హృదయాంగణమ్ములో

చదువుకున్నారా. ఇంక వీటినే గ్రాఫుల రూపంలో చూద్దాము. విరామాలని ఒక అక్షరంగా భావించి, దాని విలువ 1 ఇచ్చి గ్రాఫుని గీస్తే, అవి ఇలా ఉంటాయి:



ఇప్పుడు చెప్పండి, ఈ రెండూ ఒకటే నమూనాకి (ఛందస్సుకి) చెందిన పద్య పాదాలని గుర్తించడం అంత సులువంటారా? కాదు కదా. పద్యాలని విని, వాటి నడకబట్టి ఛందస్సుని కనుక్కోవడంలో ఉన్న కష్టం చాలావరకూ దీని వల్లనే వస్తుంది. ఇలా పదాల మధ్య వచ్చే విరామాలలో తేడాల వల్ల, ఒకే ఛందస్సులోని పద్య పాదాలకి అనేక వేల రకాల నడకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిలోనూ ఉన్న విరామాల గోలని తొలగించి, అసలు నమూనాని గుర్తుపట్టడం ఒక పెద్ద సవాలు. ఆ పనిని మన మెదడు చక్కగా చెయ్యగలదు, తగిన సాధన చేస్తే!
కొంతమంది ఏం చేస్తారంటే, చదివినప్పుడు పదాలతో సంబంధం లేకుండా మూడేసి అక్షరాలని కలిపి చదువుకుని, నడకేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఉదాహరణకి, "నీ కనుదోయి..." పాదాన్ని, "నీకను దోయివె న్నెలలు నిండిన నాహృద యాంగణ మ్ములో". అలా చదువుకుంటే, ఉత్పలమాల పాదాలన్నీ సుమారుగా ఒకే నడకతో వినిపిస్తాయి. గుర్తుపట్టడం కాస్త సులువవుతుంది. దీని కన్నా కూడా మేలైన పద్ధతి మన మెదడనే కంప్యూటరుకి సాధ్యమైనంత ఎక్కువ "డాటా"ని అందివ్వడమే. అంటే ఒకే వృత్తంలో ఉన్న బోలెడు పద్యాలని మనం కంఠస్థం చేస్తే, ఆ వృత్త నడకని వినగానే గుర్తుపట్ట గలిగే ప్రజ్ఞని మన మెదడు సంపాదిస్తుంది. చక్కని నడకతో పద్యాలని వ్రాయడానికీ, ఆశువుగా పద్యాలని అల్లడానికీ ఈ ప్రజ్ఞ చాలా అవసరం.

వృత్తాలలో నడకని గ్రాఫులలో చూసే ప్రయత్నం చేసాము. వృత్తాల నిర్వచనంలో ఉన్న నిర్దిష్టత, వాటిని పద్యంగా నిర్మించేటప్పుడు (తద్వారా చదివేటప్పుడు) ఎలా లోపిస్తుందో తెలుసుకున్నాము. ఆ గోల ఎక్కడనుంచి వస్తుందో కూడా చూసాము. చేరాగారు వీటిని మూడు స్థాయిలగా వివరించారు ఒకచోట - నిర్వచనము, నిర్మాణము (రచించడం), నిర్వహణ (చదవడము). మనం నిర్మాణము, నిర్వహణ ఒకేలా ఉంటుందని అనుకున్నామిక్కడ. ఈసారికి ఇక్కడతో ఆపుదాం.

తర్వాత టపాలో మన తెలుగు ఛందస్సులని ఇలాగే పరిశీలిద్దాం. ఆటవెలది, తేటగీతి, కందం లాంటి ఛందస్సులని ఇలా గ్రాఫులలో ఎలా చూపించాలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఆలోచించండి. మీకేమైనా మంచి ఆలోచన వస్తే, నాతో పంచుకోండి. ఎందుకంటే ఎలా చూపించాలో ఇంకా నేను నిర్ణయించుకోలేదు.


పూర్తిగా చదవండి...

Wednesday, November 4, 2009

ఛందస్సుతో నడక - 1

ఒకోసారి ఏదైనా పాట వింటున్నప్పుడు హఠాత్తుగా మరో పాత పాట గుర్తుకొస్తుంది. "అరే! ఇది దానిలాగానే ఉందే" అనిపిస్తూ ఉంటుంది. కొందరికిలా సర్వధారాణంగా జరిగితే చాలామందికి ఎప్పుడో కాని ఇలా జరగదు. ఇది ఒక రకమైన రాగ జ్ఞానం. ఒకే రాగంలో ఉన్న రెండు పాటల మధ్యనున్న పోలికని గుర్తుపట్టే సామర్థ్యం ఇది. సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ రాగమేమిటో కూడా గుర్తుపడతారు. ఇలాంటి సామర్థ్యాన్నే సాంకేతికంగా Pattern recognition అంటాం. అచ్చ తెలుగులో చెప్పాలంటే నమూనాలని ఆనవాలు పట్టడమన్నమాట. ఒకటే నమూనానుంచి ఏర్పడిన రకరకాల మూర్తులని ఒకే నమూనాకి చెందినవిగా గుర్తుపట్టడం. మనిషి మెదడుకి ఈ శక్తి అమోఘంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటే, ఆ తర్వాత ఆ అక్షరాలని ఎన్ని రకాలుగా (రంగులు, ఫాంట్లు, టైప్ సెట్లు) ముద్రించినా, మరీ డాక్టరు దస్తూరీలా కాకుండా కాస్తో కూస్తో అర్థమయ్యేట్టు ఎంతమంది చేత్తో వ్రాసినా మనం గుర్తుపట్టగలం! ఇది నమూనాల ఆనవాలే కదా. ఇదే ఒక కంప్యూటరుతో చేయించాలంటే తల ప్రాణం తోక్కి వస్తుంది!

పాటలలో రాగాలని గుర్తుపట్టినట్టుగానే పద్యాలలో ఛందస్సుని గుర్తుపట్టవచ్చు. అంటే ఒక పద్యాన్ని చదవగానే లేదా వినగానే అదే ఛందస్సులో మనకి బాగా తెలిసిన ఇతర పద్యాలు గుర్తుకు రావడమన్నమాట. ఉదాహరణకి:

కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద

అని మూడు పాదాలు చెప్పగానే, వేమన పద్యాలు చదువుకున్న ఎవరైనా నాల్గవ పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అని పూరిస్తారు. ఈ పద్యాన్ని చదవగానే మనకి వేమన పద్యాలు గుర్తుకొస్తాయి. ఈ పద్యం అలాగే ఉందన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అది ఆటవెలది ఛందస్సు అని కాని, ఆ ఛందస్సు స్వరూపం కాని తెలియాల్సిన అవసరం లేదు. అలాగే మరో ఉదాహరణ:

పిల్లులు పిల్లలు బెట్టును
నల్లను త్రావెడి కతాన నల్లి యనబడెన్
అల్లురు దశమోగ్రహములు
వెల్లుల్లికి తీపి లేదు ...

అని ఆపగానే, వినరా సుమతీ అని పూర్తి చెయ్యడానికి కంద ఛందస్సు తెలియాల్సిన పనిలేదు. ఇదెలా సాధ్యం?! వేమన, సుమతీ శతకాలు కంఠస్థం చేసిన వాళ్ళకి ఆయా ఛందస్సుల నమూనాలు మెదడులో ముద్రపడి ఉంటాయి. ఈ పద్యాలని చూడగానే మెదడు గుర్తుపట్టేస్తుంది!

ఇప్పుడు మరో పద్యం చూద్దాం:

సిరి గల నాడు మైమరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్
పొరి పొరి చేయనైతి నని పొక్కిన గల్గునె? గాలి చిచ్చు పై
కెరలిన వేళ, డప్పి గొని కీడ్పడు వేళ, జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె? ...

దీన్ని పూరించాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది, యీ శతకాన్ని ఇంతకుముందు చదివిన వాళ్ళకి కూడా. అంటే ముందు ఉదాహరణలతో పోలిస్తే, ఇక్కడున్న నమూనని గుర్తుపట్టడానికి కొంత పరిశ్రమ అవసరమవుతోంది. ఎందుకు? ఒక కారణం - ఈ శతకం వేమన, సుమతీ శతకాలంత ప్రాచుర్యం పొందకపోవడం అనుకోవచ్చు. కాని అదొక్కటే కారణం కాదు. వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం.

ఇప్పుడు ఇంకొక పద్యం:

నీ మనసు తెలుసుకొని నడచుకొనెద నేను, చెలి! నిజము నే మునుపటి నీ ప్రియుడను గాను, నమ్ముమో ప్రేయసీ! కలిసిమెలిసి గడిపెదము జీవితమును

ఇది నేను పద్యంలాగా నాలుగు పాదాలు విడగొట్టి ఇవ్వలేదు (ఇచ్చినా కస్ఠమే అనుకోండి!). ఇందులో ఛందస్సుని కనుక్కోండి చూద్దాం! మీ జుట్టు కాస్త మీ చేతిలోకి వస్తే నా పూచీ కాదు సుమా :-) పై పద్యాలలో ఛందస్సు అంత సులువుగా తెలిసిందే మరి ఇదెందుకు ఇంత కష్టం?

ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెడదాం. కొత్తగా ఏదో నేను కనిపెట్టి చెప్పబోవటం లేదు. మనందరికీ తెలుసున్న విషయాలే, కాని అంతగా గుర్తించని విషయాలు.

ఛందస్సు వేద పురుషుడి పాదాలని చెప్పబడింది. అంటే ఛందస్సు పద్యాలకి నడకనిస్తాయన్న మాట. నాకు సంగీతం పెద్దగా తెలీదుకాని, పాటకి తాళం ఏమి చేస్తుందో, కాస్త అటు ఇటుగా పద్యానికి ఛందస్సు అదే చేస్తుందనుకుంటాను. ఒక వాక్యాన్ని లేదా వాక్య సముదాయాన్ని పలికేటప్పుడు, అందులోని ప్రతి అక్షరం పకలడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది. ఆ ప్రత్యేక క్రమమే ఛందస్సు. అందుకే ఛందస్సు పద్యం నడిచే తీరుని నిర్దేశిస్తుంది.

అర్థమయ్యీ అవ్వనట్టు ఉందా? ఇప్పుడే కదా నడక మొదలుపెట్టాం. మెల్లిగా అన్నీ అవే అర్థమవుతాయి. వచ్చే టపాలో దీని గురించి మరింత వివరిస్తాను. ప్రస్తుతానికి ఒక చిన్న క్విజ్:

ఈ మధ్యనే మొదలుపెట్టిన ఒక పుస్తకంలో ఈ కిందనిచ్చిన శ్లోకాలు చదువుతూ ఉన్నాను. ఇలాంటి శ్లోకాలు ఎక్కడో విన్నానే అని అనిపించింది. ఒక అయిదు నిమిషాల తర్వాత తట్టింది. వీటిలాగే ఉండే ఆ మరో శ్లోకాలు బాగా తెలుసున్నవే! తెలుగువాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు తప్పక వినే ఉంటారు. నేను చదివిన శ్లోకాలలో ఒక రెండు:

సత్యం న మే విభవనాశకృతాస్తి చింతా
భాగ్యక్రమేణ హి ధనాని భవంతి యాంతి
ఏతత్తు మాం దహతి నష్ట ధనాశ్రయస్య
యత్ సౌహృదాదపి జనాః శిథిలీ భవంతి

కిం త్వం భయేన పరివర్తిత సౌకుమార్యా
నృత్యప్రయోగ విశదౌ చరణౌ క్షిపంతీ
ఉద్విగ్న చంచల కటాక్ష విసృష్ట దృష్టిః
వ్యాధానుసార చకితా హరిణీవ యాసి

ఈ శ్లోకాల నమూనాతో ఉన్న మరో ప్రసిద్ధ శ్లోకాలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!


పూర్తిగా చదవండి...

Sunday, October 25, 2009

ఛందస్సుకి పురస్కారం

భాషా సంబంధమైన విషయాలలో విశేషమైన కృషి చేసినవారికి ప్రతి ఏడు సి.పి.బ్రౌన్ పేరు మీద శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారు పురస్కారాన్ని ఇస్తున్నారు, 2007 సంవత్సరం నుంచీ అనుకుంటాను. ఈ ఏడాదికి ఈ అవార్డు శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు గారికి, ఛందస్సులో వారు చేసిన, చేస్తున్న కృషికి గాను ఇస్తున్నారని మొన్ననే తెలిసింది.

ఈ వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. మూడు రకాలుగా సంతోషం (త్రిగుణీకృతం అన్నమాట!). నాకిష్టమైన అంశం ఛందస్సు గురించి చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వడం ఒకటి. నేనెంతో గౌరవించే సహృదయులు మోహనగారికి రావడం రెండు. భాషాశాస్త్రంలో ప్రత్యేకమైన డిగ్రీలు లేని ఔత్సాహికునికి గుర్తింపు రావడం మూడు. ఇది ఔత్సాహికులందరికీ ఎంతో ప్రోత్సాహకరం.

ఈమాట పాఠకులకి, రచ్చబండ ఛందస్సు గ్రూపులలో ఉన్నవాళ్ళకి మోహన రావుగారు పరిచితులే అయ్యుంటారు. నాకు తెలిసి, సుమారు పదేళ్ళుగా మోహన రావుగారు ఛందస్సు గురించి అనేక విశేషాలని ఈ గ్రూపులలో పంచుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవాటిలో కొన్ని:

1. ఎన్నో కొత్త కొత్త వృత్తాలని పరిచయం చెయ్యడం. ఒక వృత్తానికి ప్రతి పాదంలోనూ నియతమైన అక్షర సంఖ్య, గురులఘు క్రమం ఉంటాయి. గురు లఘు క్రమంలో చూపగలిగే వైవిధ్యం వల్ల, కొన్ని వేల వృత్తాలు ఏర్పడతాయి. అలాంటి వృత్తాలలో చాలా కొన్ని వాటిని మన పూర్వకవులు విరివిగా వాడారు. అంత విరివిగా వాడని వృత్తాలు కొన్నైతే, అసలు వాడనివి చాలా ఉన్నాయి. అలా విరివిగా వాడని వృత్తాలని, అసలు వాడని వృత్తాలని (కొత్తగా పేర్లు పెట్టి) ఎన్నిటినో వారు సోదాహరణంగా పరిచయం చేసారు. వృత్తాలే కాక, అనేక ఉపజాతి పద్యాలు, రగడలు పరిచయం చేసారు.

2. గర్భ బంధ కవిత్వాలలో విశేషమైన కృషి చేసారు. ఏ ఛందస్సులో ఎలాంటి గర్భ కవిత్వం సాధ్యమవుతుందో గణిత శాస్త్రాధారంగా నిరూపించారు. దీనికోసం వీరు చందన అనే సాఫ్ట్వేరుని కూడా తయారు చేసారు.

3. ఛందోమృతబిందువులు అనే శీర్షికతో ఛందస్సులోని విశేషాలని ఎన్నిటినో చిన్న చిన్న పాయింట్లుగా అందించారు.

4. మోహన రావుగారి మాతృభాష కన్నడం! అది చాలా ఏళ్ళు నాకు తెలియదు. వారికి కన్నడ తెలుగు భాషలలో ఉన్న గొప్ప ప్రావీణ్యం వలన, కన్నడ తెలుగు భాషల్లోని ఛందస్సులని తులనాత్మకంగా పరిశీలిస్తూ చక్కని పరిశోధన చేసారు.

5. అన్నిటికన్నా ప్రత్యేకించి చెప్పుకోవలసినది నన్నెచోడుడు కుమారసంభవంలో ఉపయోగించిన ఛందస్సు ఆధారంగా నన్నెచోడుని కాల నిర్ణయం గురించి చేసిన ప్రతిపాదనలు. ఇది ఈమాటలో చదవవచ్చు.

ఛందస్సు మాత్రమే కాక, వీరికి ప్రాచీన శాసనాలు, కావ్యాల గురించి మంచి పరిజ్ఞానం, తెలుగు కన్నడ తమిళ భాషలలో చక్కని ప్రావీణ్యం ఉన్నాయి. వీరి రచనలు ఈ-గ్రూపులలోనూ ఈమాటలోనూ (బహుశా మరికొన్ని అమెరికా పత్రికలలోనూ) తప్ప ఇంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవాళ్ళందరికీ చాలా విలువైనది అవుతుందనడంలో సందేహం లేదు.

మోహనగారికి నాకూ కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నా (వ్యావహారిక భాషలో పద్యాలు వగైరా విషయాలలో) అవి మా ఆత్మీయతకి ఎప్పుడూ అడ్డు రాలేదు. ఎవ్వరినీ ఎప్పుడూ నొప్పించ కూడదనుకునే స్వభావం వారిది. వృత్తి రీత్యా Biologist అయినా, మాతృభాష కన్నడమైనా, తెలుగు భాషా సాహిత్యాలపై వారికున్న విశేష అధికారం, అభిమానం అమోఘమైనవి. సి.పి.బ్రౌన్ పురస్కారం వీరి కృషికి తగిన గుర్తింపు. ఈ సందర్భంగా వారికి నా బ్లాగు ముఖంగా శుభాకాంక్షలు!


పూర్తిగా చదవండి...

Tuesday, September 29, 2009

విజయదశమి శుభాకాంక్షలు (కించిత్తు లేటుగా:-)

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు (కించిత్తు లేటుగా:-).
ఈ లేటుకి ఒక (మంచి)కారణం ఇవాళ సాయంత్రం మా అమ్మాయి సంగీతపాఠశాలవాళ్ళ కార్యక్రమానికి వెళ్ళడం. ఇక్కడ తమిళనాట విజయదశమి రోజు విద్యాదేవి పూజ చాలా నమ్మకంతో చేస్తారు. అందుకే ఇవ్వాళ చాలా స్కూళ్ళకి సెలవు కూడా లేదు. కొత్త పాఠాలు ప్రారంభిస్తారు! అలాగే సంగీతం, నాట్యం మొదలైనవి నేర్పించే "కళా"శాలలు (ఒక ఏరియాలో కనీసం ఒక మూడైనా ఉంటాయి!) యీ రోజొక వేడుకగా కార్యక్రమాలను నిర్వహించి పిల్లల చేత స్టేజిమీద ప్రదర్శనలిప్పిస్తారు. అలాంటి ఒకానొక కార్యక్రమంలో కాస్త హడావిడిగా ఉండి, ఇదిగో ఇప్పుడు తీరిక దొరికింది! మా అమ్మాయి స్కూలువాళ్ళు ఏర్పాటుచేసిన వేదిక కొంచెం చిన్నదే కాని, అది జనంతో కిక్కిరిసిపోవడం నన్ను చాలా ఆశ్చర్యంలో ముంచెత్తింది! ఆ గురువుల ఉత్సాహం (ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు ఒక డైబ్భయ్యేళ్ళ ముత్తైదువ), తల్లిదండ్రులలో ఉన్న అభిరుచి చూస్తే చాలా ఆనందం అనిపించింది.

సరే, నా గోల పక్కన పెడదాం. నవరాత్రులలో కొలిచే ముగురమ్మలు, ఆ ముగురమ్మల మూలపుటమ్మ గురించిన పద్యమాలిక ఇదిగో. ఇందులో కొన్ని పద్యాలు సుప్రసిద్ధాలే. మిగిలవి ఎవరివో పోల్చుకొనే ప్రయత్నం చెయ్యండి! వీటి అర్థ తాత్పర్యాలు మరోమారు తీరిగ్గా ముచ్చటించుకుందాం.

అంబనవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ భా
వాంబర వీథి విశ్రుత విహారి ననున్ గృపజూడు భారతీ!

వాణికి జరణానత గీ
ర్వాణికి నేణాంకశకల రత్నశలాకా
వేణికి బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాస్తి యొనర్తున్

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుకవారిజపుస్తక రమ్యపాణికిన్

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మకడు పాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

సామజయుగ్మ మింపలర జల్లని నీరు పసిండికుండలన్
వేమఱు వంచివంచి కడు వేడుకతో నభిషిక్త జేయగా
దామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
కామునితల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్

హిమధరాధరమండలేశ్వరు కులపాలి
కా మణితనువల్లికా ప్రసూన
యసితకంధర సింధురాజనాంబర ఘోర
గంధబంధనకర గంధలహరి
సంతత శివభక్తి సామరస్యజ్ఞాన
సారమరంద నిష్యంద ధార
పరమహంసోత్తంస భావభృంగవ్రాత
తన్మయావస్థ ప్రదానకేళి

నిఖిలవిద్యా రహస్య వాణీపరాగ
పాలికాపూరితాఖండ పద్మజాండ
పేటియై యొప్పు చంద్రార్థ జూటకోటి
జోటి గొల్చెద జ్ఞానప్రసూన కలిక

కాసరాసురరాజ కంఠ నిర్గతరక్త
పంకంబు శ్రీపాదపద్మలాక్ష
చండముండాహవ సంభ్రమస్తనజాత
ఘర్మవాఃకణరాజి కంఠమాల
రక్తబీజాది మర్దన సమయాట్టహా
సము మోమునకు లోధ్ర సుమరజంబు
శుంభనిశుంభ రక్షోవీర సంహార
వేళ గప్పిన ధూళి మేలుముసుగు

గాగ నేదేవి వీరశృంగారమూర్తి
యగుచు శోభిల్లు నట్టి దుర్గాంబ గొలుతు
గనకముఖరీ సమాఖ్య గంగాప్రతీర
హాటకాచలతుంగ శృంగాగ్రగేహ

చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల
నవతంస కుసుమంబు నందున్న యెలదేటి
రుతి కించి దంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
దుందీఫలంబు దుందుడుకు జెంద
తరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు
లింగిలీకపు వింతరంగు లీన

నుపనిషత్తులు బోటులై యోలగింప
బుండరీకాసనమున గూర్చుండి మదికి
నించు వేడుక వీణవాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత!

కనకస్తనోపరి గ్రైవేయ మణికాంతి
కర్ణతాటంకంబు గాడిపఱుప
కమ్రనితంబాగ్ర కాంచికింకిణులతో
గరకంకణధ్వనుల్ కలతబూన
మౌళిక్లప్త శశాంక మాలాతపములపై
ఫాలస్థలీజ్యోతి పాఱువెట్ట
తత్కాల విచలితాధర హాస మాధుర్య
మాత్మప్రసన్నత నగడుపరుప

పాలితాన్యోన్య లంఘన స్పర్థములును
చాలితాన్యోన్య సౌందర్య సరసములును
నైన పలుకులగూడిక ననగ నొప్పు
శారదామూర్తి నా యెద జాలుగాక

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ ,
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురిణాః ఫణితయః


పూర్తిగా చదవండి...

Saturday, September 19, 2009

శారద రాత్రులు

ఇవాళనుంచి శరన్నవరాత్రులు మొదలువుతున్నాయి. శరదృతువు మొదలయ్యిందన్నమాట. వెన్నెల నెలలు.
శరత్తుకీ శారదకీ ఎంత దగ్గర సంబంధమో, వెన్నెలకీ కవిత్వానికీ అంతటి స్నేహం. చంద్రునికి మనస్సుని మైమరపించే మహత్తేదో ఉంది. పున్నమి జాబిలిని, పిండారబోసినట్టు నింగి అంతా పరుచుకొనే చల్లని వెన్నెలని తనివితీరా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందా మహత్తు.

శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై

ఇది నన్నయ్యగారి మొదటి పద్యం. ఇదేంటి ఇదతని ఆఖరి పద్యం కదా అని అప్పుడే ఆశ్చర్యపడ్డారా! మొదటి పద్యమంటే, నా బ్లాగులో నన్నయ్యగారి గురించి నేను వ్రాస్తున్న మొదటి పద్యం యిది అని. అతని చివరి పద్యంతో యిలా మొదలు పెట్టడం, యిదియొక చమత్కారము :-)

ఈ పద్యాన్ని మీరు రాగయుక్తంగా చదువుకోవలసిన అవసరం లేదు, మామూలుగా చదువుకున్నా చాలు. ఒక రెండు మూడు మార్లు మళ్ళీ మళ్ళీ చదువుకొని ఆ పదాలపొహళింపు, ఆ ధార, ఆ అక్షర మాధుర్యంలో మునకలు వెయ్యండి.
నన్నయ్యగారు తన కవిత్వానికున్న లక్షణాలు అని చెప్పుకున్నవాటిలో అక్షర రమ్యత ఒకటి. రమింప జేసే అక్షరాల సంఘటన అని అర్థం. ఆ రమ్యత్వమంతా యీ పద్యంలో కనిపించడం లేదూ! ఇది ఎలా సాధించారు అంటే, అది ఒక ఆల్కెమీ. ఏదో - "ర" అన్న అక్షరం పదేపదే వచ్చినందువల్లనో, మొదటి రెండు పాదాలలో ప్రాస స్థానంలో "స" అక్షరానికి ఇచ్చిన ఊనిక వల్లనో - ఇలా రకరకాలుగా అనుకోవడం వొట్ఠి మన పరిమితమైన బుద్ధికి తట్టే పైపై అంశాలే తప్ప అసలు రహస్యం అంతుపట్టదు. ఇందులో గమనిస్తే మరో విశేషం - అనునాసికాక్షర శబ్దాలన్నీ యిందులో వినిపిస్తాయి, జాగ్రత్తగా వింటే (పంక్తులంజారు అన్న పదాలలో ఙ్, ఞ్, ఇలా...). ఇవన్నీ కూడా ఇందులోని మధుర నాదానికి కారణమయ్యుండవచ్చు.

అవి శారద రాత్రులు. ఉజ్వలంగా ప్రకాశించే తారహారాలతో అందగించిన రాత్రులు. అప్పుడే వికసిస్తున్న తెల్లకలువల పుప్పొడి దట్టంగా అలుముకున్న తెమ్మెర కమ్మదనం నిండిన రాత్రులు. కప్పురపు తావిలా తెల్లగా అంతటా పరచుకున్న అమృతాంశుని (చంద్రుని) వెన్నెలతో పరిపూర్ణమవుతున్న రాత్రులు. వెన్నెల తెల్లగా చల్లగా ఉంటుంది కర్పూరంలాగా. మరి కర్పూరపు సువాసన వెన్నెల కెక్కడిది? కలువపూల పుప్పొడి నిండిన వెన్నెల కాబట్టి దానికా సుగంధం కూడా అబ్బింది!

ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళకే యిలాంటి రాత్రులలోని మధురిమ అనుభవానికి వస్తుంది.

ఈ "శారద రాత్రులు..." అన్న పద్యానికి ముందు యింకొక పద్యం ఉంది. అది శరదాగమనాన్ని వర్ణించే పద్యం. అదొక పరమాద్భుతమైన పద్యం:

భూసతికిన్ దివంబునకు బొల్పెసగంగ శరత్సమాగమం
బా సకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో
పాసిత రాజహంసగతి భాసి(తి) ప్రసన్న సరస్వతీక మ
బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై

దీనికి అర్థం చెప్పడం చిన్నపని కాదు.

భూదేవికి స్వర్గానికీ శరత్కాలంలో అందమైన కలయిక జరిగింది (లేదా భూమ్యాకాశాల రెంటితోనూ శరత్తు కలిసింది). ఆ కలయిక సర్వానందకారియై (ప్రమోదము అంటే సుగంధము అనికూడా అర్థం వస్తుంది) విలసిల్లినది. అది ఎలా ఉంది? మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతోంది. లేదా, మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంస నడకలా ఉంది. ప్రసన్న సరస్వతితోను, అబ్జాసనుడైన బ్రహ్మతోను శోభిస్తున్న బ్రహ్మ వాహనమైన హంసలాగా ఉంది. లేదా, మహర్షి మండలము చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతున్న ప్రసన్న సరస్వతితోను, బ్రహ్మతోను శోభిస్తున్న హంసలాగా ఉంది.

దీని గురించి వి.వి.ఎల్. నరసింహారావు గారు తన "నన్నయ్య కవిత్వము - అక్షరరమ్యత" అనే పుస్తకంలో యిలా వివరించారు:
---

శరత్సమాగమ విలాసము షడ్విధముగా భావింపబడినది.
1. భూసతికిని దివంబునకును పొలుపు గూర్చుట. ఇది నేలకు నింగికి అందమగు సంబంధము గూర్చుట.
2. ప్రసన్న సరస్వతీకమై ఉండుట. వానకాలపు వరదల ఉరవడివలని బురద అడగిపోగా కలతదేరి సరస్వతి (నది) సుప్రసన్నముగా నుండుట.
3. సరస్వతి మహర్షిమండలోపాసిత యగుట. తీర్థ సంసేవన వ్యాజమున మహర్షులు సరస్వతిని శరత్తులో నుపాసించుట.
4. సరస్వతి రాజహంసగతి భాసిని యగుట. సరస్వతీ నది యందు రాయంచ లందముగా నడచుట యని భావము. ప్రసన్నమగు కవితా సరస్వతి రాజహంస గమనము కలది యనియు భావము.
5. అబ్జాసన శోభితంబగుట. అబ్జాసనుడనగా బ్రహ్మ. ప్రసన్న సరస్వతీకమగు శరత్తు బ్రహ్మమయముగా నుండె ననుట.
6. శరదాగమము అబ్జజుయానముతో సమానముగా నుండెను. యానమనగా గజాది వాహనమనియు నర్థము. అబ్జజు యాన మనగా బ్రహ్మవాహనమగు దివ్య హంస మనియు నర్థము. బ్రహ్మ సంచారము గలది యగుటయే కాక శరదాగమము దివ్య హంసముతో సమానముగ ఉన్నదనియు భావము.

తత్త్వమరసి చూడ బ్రహ్మాధీన గతియైన సరస్వతీ తత్త్వము యిందు లక్షింపబడినట్లు దోచును. ఇది మహర్షి మండలోపాసితమైన తత్త్వము. ఈ తత్త్వము సుదూర మన్వేషింప దగినది.

---

పైనిచ్చిన రెండు పద్యాల గురించీ, దానికి ముందరి పద్యాల గురించీ మోహన రావుగారు ఈమాటలో వ్రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

ప్రకృతి పరంగా చూస్తే, శరత్కాలంలో మేఘాలు తొలగి, ఆకాశం నిర్మలంగా మారుతుంది. దానితో నక్షత్రాలూ చంద్రుడూ చక్కగా ఆకాశంలో ప్రకాశిస్తాయి (రాజహంస - రాజు అనే హంస = చంద్రుడనే హంస అనికూడా అర్థం స్ఫురిస్తుంది). నదులు వరద ఒత్తిడి తగ్గి, తేటబారి ప్రసన్నంగా ఉంటాయి. అందులో కలువపూలు (అబ్జము అంటే కలువపూవని కూడా అర్థం వస్తుంది) బాగా వికసిస్తూ కనిపిస్తాయి. హంసలు మానస సరోవరాన్ని చేరుకొనేది కూడా యీ శరత్తులోనే (పక్షుల వలస). మొత్తమంతా తెల్లని వెన్నెలతో నిండిపోయి ఉంటుంది.

ఈ చిత్రమంతా మనకి యీ పద్యంలో కనిపిస్తుంది. ప్రకృతి వర్ణన చేస్తూనే అంతర్గతంగా ఆధ్యాత్మిక చింతన చెయ్యడం మహర్షులైన మన కవులకి సొంతం. మన సనాతన ధర్మంలో కనిపించేది ప్రకృతి ఆరాధనే. ప్రకృతిని తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని దాని విధ్వంసానికి ఒడిగట్టే వాళ్ళని రాక్షసులన్నారు. మన కాలమానం ప్రకృతికిని అనుసరించి వెళ్ళేది. మన పండగలు మనలని ప్రకృతితో కలిపే సాధనాలు!

ఈ శరదృతువులో, అంటే వచ్చే రెండు నెలలూ వీలైనంత వెన్నెల నా బ్లాగునిండా నింపాలని ఒక ఆలోచన. వీలు చిక్కినప్పుడల్లా, మన కావ్యాలలో శరత్కాలానికి, చంద్రునికి, వెన్నెలకీ సంబంధించిన అందమైన వర్ణనలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
మీరు కూడా మీ మీ బ్లాగుల్లో ఆ పని చెయ్యవచ్చు. అంత కన్నా ముఖ్యంగా, ఈ రెండు నెలల్లో వచ్చే రెండు పున్నములలో కనీసం ఒక్క రోజు, ఆ పున్నమి జాబిలి వెండి వెలుగులని మనసారా ఆస్వాదించడం మాత్రం మరవద్దు.


పూర్తిగా చదవండి...

Saturday, August 29, 2009

తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!

చాన్నాళ్ళ కిందట ఛందస్సు యాహూ గ్రూపులో ఒక చిన్న సమస్య ఇచ్చాను. తెలుగు భాషలో అన్నిటికన్నా అందమైనవని మీకనిపించే పది పదాలు తీసుకొని వాటితో పద్యం రాయమని. అప్పుడు నేను రాసిన పద్యం, యీ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గుర్తుకువచ్చింది:

అలకలు నటియించి అటువైపు తిరిగిన
చెలి మోములోనున్న చిలిపిదనము
బుజ్జి పాపాయిని పొత్తిళ్ళ లాలించు
అమ్మదనములోని కమ్మదనము
ఏరువాకల నాళ్ళ నిగురొత్తు వరిచాళ్ళ
జనపదమ్ములోని జానుదనము
వేసవి నడిరేయి వెన్నెల చిలికించు
నెలవంక నవ్వులో చలువదనము

కన్నె సరిగంచు పరికిణీ కలికిదనము
ఎంకిపాట పల్లవిలోని పెంకిదనము
కలిపి వడపోత పోసిన తెలుగుదనము!
తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!

ఇప్పుడు మళ్ళీ యీ పద్యాన్ని చదివితే యిందులో యిష్టమైన ఆ పదిపదాలనీ గుర్తించడం కష్టమవుతోంది. అన్ని పదాలూ అందంగానే కనిపిస్తున్నాయి మరి!

తెలుగువాడిగా తెలుగుభాషని నరనరాన యింకించుకున్న భాగ్యం కన్నా యీ జన్మకి ఇంకేం కావాలి!


పూర్తిగా చదవండి...

Sunday, August 23, 2009

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె...

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

కరుణశ్రీగారి ఉదయశ్రీలో తెలుగు పిల్లలకి వినాయకుని గురించి చెపుతున్న పద్యాలు:
(క్రిందటేడు ఈ పద్యాలని పూర్తిగా వినే తీరిక లేక వెళ్ళిపోయిన వినాయకుడు ఈ ఏడు గుర్తుపెట్టుకుని మరీ వినిపించమని అడిగాడు!)

ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరువెత్తివచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
'నల్ల మామా' యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి లెమ్ము జోహారు లిడగ

తిలకమ్ముగా దిద్దితీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడుకోట్ల దేవతలపై
చల్లని చూపులు వెల్లివిరియ

గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమొ
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు పట్ట
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము

కొలుచువారలకు ముంగొంగు బంగారమ్ము
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించువారికి చేతిచింతామణి
భావించువారల పట్టుగొమ్మ
దాసోహ మనువారి దగ్గర చుట్టమ్ము
దోసిలొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించిన వారి కానంద మందార
మర్థించు వారల కమృతలహరి

జాలిపేగుల వాడు లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు
చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు
అక్కరో! అర్ఘ్యపాత్రము నందుకొనవె

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరికపూజకె తలకాయ నొగ్గు

పంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుములం దించి కలుము లందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక!


పూర్తిగా చదవండి...

Sunday, August 2, 2009

మా చిన్నారి పద్యాలు

నేను పద్యాలు చదవడం చూసి మా అమ్మాయి శ్రీవాణి (ఒకటో క్లాసు చదువుతోంది) తను కూడా చదువుతానంది. తన పద్యాలు కూడా ఇంటర్నెట్లో పెట్టమంది. తనకి వచ్చిన కొన్ని పద్యాలు చదివి వింపించింది. మీరూ వినండి. మీ పిల్లలకి కూడా వినిపించండి.

ఉప్పుకప్పురంబు...


అల్పుడెపుడు పలుకు...


అనగననగ రాగ...


మేడిపండు జూడ...


అక్కరకు రాని చుట్టము...


ఉపకారికి ఉపకారము...


శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో...


పూర్తిగా చదవండి...

Monday, July 20, 2009

అర్జునుడిపై ద్రౌపది అభిమానం

మాగంటి వంశీగారు మొదలుపెట్టిన ఆడియో పుస్తకాల ప్రయత్నంతో నాలో నాటుకున్న ఆలోచన, మొన్న కొత్తపాళీ, రవిగార్ల ప్రయత్నాలు చూసి మొలకెత్తి, భాస్కర రామిరెడ్డిగారు మొన్నటి టపాలో పెట్టిన కామెంటుతో చిగురించి, ఇదిగో ఇప్పుడిలా ఫలించింది.
నాకు సంగీతం రాదు, నేను రాగయుక్తంగా పద్యాలని పాడలేను. కాబట్టి అవి "వినసొంపు"గా అయితే ఉండవు. అసలందుకే వీటిని వినిపించడం ఎందుకని ఊరుకున్నాను. కాని భాస్కర్ గారు అన్నట్టు కనీసం పదాల సమాసాల ఉచ్చారణ, ఆసక్తి ఉన్నవాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందని ఇప్పుడిలా సాహసం చేస్తున్నాను. ధైర్యం ఉన్నవాళ్ళు వినవచ్చు :-)

ప్రస్తుతం మనం విరాటపర్వంలో ఉన్నాం కదా. ద్రౌపది తనకు కీచకునివల్ల కలిగిన అవమానాన్ని భీముడికి వివరించి, తన బాధని అతనికి చెప్పుకుంటున్న సన్నివేశం. ఎలాంటి పాండవులు ఎలా అయిపోయారు అని దుఃఖపడుతోంది ద్రౌపది. ధర్మరాజు గొప్పతనం గంభీరంగా వర్ణించింది. అలాంటి అతను ఇప్పుడిలా పరుల పంచన చేరాడే అని వాపోయింది. భీముని బలపరాక్రమాలు సొగసుగా వర్ణించింది. అలాంటివాడు గరిటపట్టుకున్నాడే అని బాధపడింది. ఇప్పుడు అర్జునుడి వంతు.



తొడరిన హరునైన దోర్బలంబున దన్ను
మిగులంగనీడను మేటి మాట
యమరేంద్రు నర్ధాసనమునకు నైన న
ర్హుండెంతయును నను రూఢిమాట
జమునిల్లు సొచ్చిన జంతువు నైనను
గాచు నెమ్మెయి నను రాచమాట
దను గోరి యూర్వశి దాన వచ్చిననైన
లోలుండు గాడను మేలిమాట

శౌర్యవైభవప్రాభవశౌచములకు
నొరులకైన గైవారమై యుల్లసిల్లు
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె
యెందు గలుగునె యర్జును నీడువాడు

ఇది కాస్త సులువుగా అర్థమయ్యే పద్యమే.

తొడరిన = ఎదిరించిన, హరునైన = శివుడినైనా, దోర్బలంబున = తన భుజబలంతో, మిగులంగనీడు = మించనియ్యడు, అను మేటి మాట
ఎదిరించినవాడు శివుడైనా తన భుజబలంతో తనని ఓడించనివ్వకుండా చెయ్యగలవాడు. అంటే అతనితో సరిసమానంగా తన శక్తి చూపించగలడు అని అర్థం. అలాంటి గొప్ప మాట,

అమరేంద్రున్ = ఇంద్రుని, అర్ధాసనమునకైన = అర్ధ సింహాసనానికైనా, అర్హుడు ఎంతయు = ఎంతైనా తగినవాడు, అను రూఢి మాట = అని నిశ్చయంగా చెప్పగలిగే మాట
ఇంద్రుని అర్ధ సింహాసనానికి కూడా అర్హుడితను అని నిశ్చయంగా చెప్పగలిగిన మాట,

జమునిల్లు సొచ్చిన = యముని ఇంట్లోకి వెళ్ళిపోయిన, జంతువు నైనను = జంతునునైనా సరే, కాచు నెమ్మెయి = ఎలాగైనా రక్షిస్తాడు, అను రాచమాట = అనే క్షత్రియోచితమైన మాట
యమపురికి వెళ్ళిన జంతువునైనా ఎలాగైనా కాపాడగలడనే క్షత్రియోచితమైన మాట,

తను గోరి యూర్వశి = తనని వరించి ఊర్వశి, తాన వచ్చిననైన = తానే వచ్చినా కూడా, లోలుండు కాడను = చంచలుడు కాడనే, మేలి మాట = మంచి మాట
ఊర్వశి స్వయంగా తనని కోరివచ్చినా చలించడనే మంచిమాట,

శౌర్య, వైభవ, ప్రాభవ శౌచములకు = శౌర్య, వైభవ, ప్రాభవ, శీలములకు సంబంధించి
ఒరులకైన = వేరేవాళ్ళకైతే, కైవారమై = పొగడ్తగా వట్టి స్త్రోత్రంగా, ఉల్లసిల్లున్ = ప్రకాశిస్తాయి
శౌర్యము, వైభవము, ప్రాభవము, శీలముల గురించిన యీ మాటలన్నీ వేరేవాళ్ళకైతే (అర్జునుడికి కాకుండా), అవి వట్టి స్తోత్రాలుగా మాత్రమే ప్రకాశిస్తాయి.

ఒక్కరునికి ఇవియెల్లను నిక్కము అట్టె = ఒక్కడి విషయంలో మాత్రం ఇవన్నీ నిజమే

అర్జును ఈడువాడు = అర్జునుడికి సమానమైనవాడు, ఎందు కల్గునె = ఎక్కడైనా ఉంటాడా!

ఇది దీని అర్థం. ఎవరి శౌర్యాన్నైనా పొగడాలంటే "వీడు శివుడినైనా ఎదిరించగల మొనగాడురా అంటాం". ఇది అతిశయోక్తి. నిజంగా శివుడు యుద్ధానికి వస్తే ఎదురించగల నరుడెవడు? ఒక్క అర్జునుడు తప్ప! అర్జునుడు పాశుపతాస్త్రం గురించి తపస్సు చేసినప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసిన సంగతి మనకి తెలుసు కదా. కాబట్టి అర్జునుడి విషయంలో ఆ మాట అతిశయోక్తి కాదు, నిజమే. మిగతా విషయాలు కూడా అంతే. ఇంద్రుని అర్ధాసనం, జంతు రక్షణ, ఊర్వశి వలచి వచ్చినా కాదనడం. ఇక్కడ అర్జునుడు జంతువుని రక్షించిన కథ ఏమిటో తెలియడం లేదు. వ్యాఖ్యానాలలో "గో రక్షణ" అని మాత్రం ఇచ్చి ఊరుకున్నారు.

ఈ పద్య రచనని ఇంతకుముందు పద్యాలతో పోల్చిచూడండి. ధర్మరాజు గురించిన పద్యంలో గాంభీర్యమూ, భీముని గురించిన పద్యంలో సొగసూ ఉంటే, ఈ పద్యంలో అభిమానంతో కూడిన గర్వం కనపడటం లేదూ! ఆ భావమంతా "ఎందు గలుగునె అర్జును నీడువాడు!" అనడంలో ఉంది. ధర్మరాజంటే ద్రౌపదికి చాలా గౌరవం. అంతకు మించి ఆ పద్యంలో మరేమీ కనిపించదు. అదే భీముడైతే, కాస్త చనవుంది. అయినా అతడంటేనూ ప్రేమతోకూడిన గౌరవం ఉంది. వాళ్ళిద్దరూ దైవాంశ సంభూతులనే దృష్టి ఎక్కువగా ఉంది. అదే అర్జునుడి దగ్గరకి వచ్చేసరికి, ఈ పద్యంలో అతడు అచ్చంగా మనిషే. మామూలు మనుషులకి సాధ్యం కాని పనులని చేసిన గొప్ప మనిషి. అంచేత అతనికి సాటి రాగలవాడు మరొకడు లేడు. అతణ్ణి భర్తగా పొందడం ద్రౌపదికి గర్వం. అందుకే అతను చేసిన పనులన్నీ వివరంగా వర్ణించింది. ధర్మజ భీముల విషయంలో అతిశయోక్తి అవసరమయ్యింది. అదే అర్జునుడి విషయంలో అవసరం లేదు. మిగతావాళ్ళ విషయంలో అతిశయోక్తులు కూడా ఇతని విషయంలో స్వభావోక్తులైపోతాయి కదా మరి! ధర్మజ భీముల విషయంలో భాషకీ, చెప్పే తీరుకీ ప్రాధాన్యం ఉంది. ఠీవిగా, సొగసుగా పద్యాలు నడిచాయి. అదే అర్జునుడి విషయంలో అది అవసరం లేదు. అతను చేసిన పనులు వివరిస్తే చాలు. అందుకే భాష, పద్యపు నడక యీ పద్యంలో సాధారణంగా ఉన్నాయి.
జాగ్రత్తగా గమనిస్తే, చివరన "ఒక్కడి విషయంలో మాత్రం ఇవన్నీ నిజమే" అన్న తర్వాత, ఆ ఒక్కడూ ఎవరన్నది ద్రౌపది చెప్పిందా? "ఎందు కలుగునె అర్జును నీడువాడు" అని అనేసింది. అంటే అక్కడ ఆ ఒక్కడూ అర్జునుడు అని మనం అన్వయించుకోవాలి. ఇది ద్రౌపది మనస్థితిని అద్దంపడుతూ, సహజంగా సాగే సంభాషణా శైలి. అర్జునుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ మైమరచిపోయింది ద్రౌపది. ఆ ఒక్కడూ అర్జునుడే అని ప్రత్యేకించి చెప్పాలని ఆమెకి తట్టనే లేదు! అలా అర్జునుడి గురించిన తలపులలో మునిగిపోయిన ఆమె, "అర్జునుడికి ఈడైనవాడు ఎక్కడా లేడు" అని తనలో తానే ఆనందపడుతూ, గర్వపడుతూ ఆ మాటే బయటకి అనేసింది!

ఇంత ఆలోచించి పద్య రచన చేస్తాడు కాబట్టే తిక్కన గొప్ప కవి అనిపించుకున్నాడు! పూర్వం కవిత్వమంటే, ఆత్మాశ్రయమైన గాఢానుభూతి మాత్రమే కాదు. కథా కావ్యాలలో ఈ అనుభూతి పాత్రలని ఆశ్రయించుకొని ఉంటుంది. అందుకే, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణలూ ఇవన్నీ విశిష్టంగా నిర్వహించడం గొప్ప కవిత్వ లక్షణంగా ఉండేది. ఈ కాలపు కవిత్వ నిర్వచనం వీటికి ఆపాదించి, ప్రాచీన కావ్యాలలో అక్కడక్కడే కవిత్వం కనిపిస్తుందని కొంతమంది అభిప్రాయపడతారు. ఇది సమంజసం కాదని నా ఉద్దేశం. కావ్య రచన మొత్తాన్నీ కవిత్వంగానే పరిగణించాలి.
ఇక్కడ నాకు వీలునుబట్టి కొన్ని కొన్ని పద్యాలని ఎంచుకొని వివరిస్తూ పోతున్నాను కాని, ఆయా కావ్యాలలో ఇవే కవిత్వమున్న పద్యాలని ఎవరూ అనుకోకండి. ఇలా విడిగా పద్యాలు చదవడం కన్నా, మొత్తం కావ్యాన్ని చదివితే మరింతగా బావుంటుందది. ముఖ్యంగా తిక్కన విషయంలో మరీను. ఉదాహరణకి, పై పద్యం తర్వాత వచ్చే యీ పద్యాలు చూడండి. ఇందులో ద్రౌపది ఆర్తి ఎంతగా మనసుకి హత్తుకుంటుందో స్వయంగా అనుభవించండి.


అరయనతండు మానధను డక్కట రంగమునందు నిల్చి సుం
దరులకు నాట సూపెడు విధం బతిదీనము దాని జూచి యే
పురపుర బొక్కుదుం గడుపు బ్రోచికొనన్ లఘువృత్తి కిమ్మెయిన్
జొరనగువాడె దేవపతిసూనుడు దైవముచేత సూచితే!


మగలకు మేటియైన బలమర్దన నందను బేడిజేయగా
దగునె విధాత నీకునని దైవము దూరుదు నోర్వరాని నె
వ్వగ దలకొన్న నెంతయును వందుదు నిద్దురవస్థ యెన్నడో
తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమిసేయుదున్


పూర్తిగా చదవండి...

Thursday, July 16, 2009

మూర్ఖోపాఖ్యానం

రామాయణంలో పిడకల వేటలాగా, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తిక్కన భారతం మధ్యలో యీ మూర్ఖోపాఖ్యానం! నేనేం చెయ్యను, హఠాత్తుగా నాకీ పద్యాలు ఇవ్వేళ (మళ్ళీ) గుర్తుకొచ్చాయి మరి. గుర్తుకు రావడం వెనక ఒక కారణం ఉంది కాని, అదిక్కడ చెప్పడం సభ్యత కాదు, అవసరమూ లేదు. అసలీ పద్యాలు (వచ్చిన వాళ్ళకి), ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో భర్తృహరి రాసినా, ఆ తర్వాత ఎప్పుడో లక్ష్మణకవి తెలుగు చేసినా, వీటికి కాలదోషం పట్టకుండా (అదే expire అవ్వకుండా) ఉండడానికి మనవేఁ కారణం. మూర్ఖులున్నంత వరకూ ఇవి నిలిచే ఉంటాయి!

బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయ దూషితా
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితం

బోద్ధలగువారు మత్సరపూర్ణ మతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజు లబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు

తెలిసినవాళ్ళేమో అసూయాపరులు, ప్రభువులేమో గర్వాంధులు. ఇతరులకి విని బోధపరచుకొనే తెలివిలేదు. చెప్పాలనుకున్న సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది.

మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా
యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటకు తియ్యవచ్చు, నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతోకూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు, పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. మూర్ఖుడి మనసుని మాత్రం ఒప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు! (సంస్కృతంలో మొండిపట్టుపట్టిన మూర్షుడు అని ఉంటుంది)

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప లేము

ప్రయత్నిస్తే ఇసుకలోంచి చమురుని తియ్యడం సాధ్యమవచ్చేమో. ఎండమావి వెంటబడి అందులో నీరు తాగవచ్చునేమో. కొమ్మున్న కుందేలుని వెతికి పట్టుకోవచ్చేమో. ఇవేమీ చేసే అవకాశం లేదు కాని కనీసం చెయ్యవచ్చేమో అని ఆలోచించవచ్చు. కాని మూర్ఖుని మనసుని ఒప్పించే, మార్చే ప్రయత్నాన్ని మాత్రం ఊహలో కూడా చెయ్యలేము!

కరిరాజున్ బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింప, దీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుం జింద యత్నించు, ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్

మదపుటేనుగును తామరతూళ్ళతో కట్టడానికి ప్రయత్నించేవాడు, దిరిసెనపువ్వులతో వజ్రాన్ని కోయ్యాలనుకునేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చాలని చూసేవాడు, మంచిమాటలతో మూర్ఖులకి చెప్పే ప్రయత్నం చేసేవాడు వీళ్ళందరూ ఒకలాంటి వాళ్ళేనట!


ఈ పద్యాలు చదివినప్పుడల్లా, భర్తృహరి ఎంతమంది ఎలాంటి మూర్ఖులని కలిసి వాళ్ళతో వాదించాల్సి వస్తే ఇంతలా యీ మూర్ఖపద్ధతిని వర్ణించేవాడూ అనిపిస్తుంది. ఆ బాధ ఏవిఁటో తెలుసుకాబట్టి, అతని మీద జాలికూడా కలుగుతుంది.

మూర్ఖులు చాలా రకాలుగా ఉంటారు. తాము మూర్ఖులమని తెలియని వాళ్ళు కొందరైతే, తెలిసిన వాళ్ళు మరికొందరు. వీళ్ళు తెలుసున్న మూర్ఖులన్న మాట! మళ్ళీ ఇందులో, కొంతమంది తమ మూర్ఖత్వానికి సిగ్గుపడి మౌనంగా ఉండలనుకొనేవారు కొందరైతే, తమ మూర్ఖత్వానికి తాము గర్వపడుతూ, దానికి రకరకాల పేర్లుపెట్టి విజృంభించేవారు మరికొందరు.
వీళ్ళందరూ కాక మూర్ఖులలో మరో రకం కూడా ఉన్నారు. అదెవరో తెలుసా, ఇదుగో పైన చెప్పినట్టు, మూర్ఖుల మనసు మార్చలేమని తెలిసి తెలిసీ వాళ్ళతో వాదనకి దిగేవాళ్ళున్నారు చూడండీ, వాళ్ళది తెచ్చిపెట్టుకున్న మూర్ఖత్వం!

నా స్నేహితుడొకడు మొన్నొకసారి హఠాత్తుగా ఓ పొడుపుకథ పొడిచాడు. "ఒరేయ్! జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది కదా. అలాగే మూర్ఖుడూ మూర్ఖుడూ రాసుకుంటే ఏం రాలుతుంది(తాయి) చెప్పుకో?" అని అడిగాడు. నేను చాలాసేపు ఆలోచించి... రకరకాలుగా ప్రయత్నించి... చించి... ఆఖరికి ఓటమిని ఒప్పేసుకొని వాడినే జవాబు చెప్పమన్నాను. అప్పుడు వాడు, "ఈ మాత్రం తెలీదా, బ్లాగులలో కామెంట్లు!" అని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి చక్కా జారుకున్నాడు!
"హు... వాడంతే...వాడొక నిజమైన బ్లాగరి (బ్లాగ్ + అరి = బ్లాగులకి శత్రువు)!" అనుకొని వాడన్నమాటని తీవ్రంగా కొట్టిపారేసాననుకోండి. వాడి మాటలకి మీరెవ్వరూకూడా ఏవీఁ "ఫీలు" కాకండేం.

పిడకలవేట సమాప్తం. తర్వాత పోస్టులో తిరిగి మనం తిక్కన దగ్గరికి వెళ్ళిపోదాం.


పూర్తిగా చదవండి...

Monday, July 6, 2009

నీ వలమూపులావు...

కిందటిసారి ద్రౌపది ధర్మరాజుగురించి చెప్పిన పద్యాన్ని వివరించాను కదా. ఇప్పుడు భీముడి గురించి చెప్పిన పద్యం చూద్దాం. ఇది భీముడి గురించి అతనితోనే చెపుతున్న పద్యం అన్నమాట. అంచేత ఇది మరికాస్త సొగసుగా ఉంటుంది!

నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో
త్రావనిభృద్దిశాకరుల కారయ నూఱటపట్టు గాదె సం
భావన భూజనంబులకు బండువు గాదె మహోగ్ర కోప రే
ఖా విభవంబు వైరులకు గాలము చేరువ కాదె పావనీ!

దీనికి ఆడియో నాకెక్కడా దొరకలేదు. కొత్తపాళీగారిలా నా గొంతు అందరికీ వినిపించే సాహసం నేను చెయ్యలేను :-) అంచేత ఎవరికి వారు పాడుకుని ఆనందించండి! పాడుకునేటప్పుడు "నాగకూర్మ గోత్రావనిభృద్దిశాకరుల కారయ" అన్న సమాసాన్ని ఒక్క గుక్కలోనే అనడం మర్చిపోకండి. "మహోగ్ర కోప రేఖా విభవంబు" అనేటప్పుడు "ఖా" మరో పాదంలోకి వెళుతోంది కాబట్టి దానికి కాస్తంత ఊనిక (అదే force/stress) ఇవ్వండి. ఇంక చివరనున్న "పావనీ" అన్న సంబోధనని ఎంత మనోహరంగా సాగదియ్యగలిస్తే అంతగా తియ్యండి. మొత్తంగా భావయుక్తంగా పాడుకోండి. ఇంతకీ ఏవిటా భావం?

వలమూపు - కుడి భుజం, లావు - బలం

ఎత్తుకోడంతోనే "నీ వలమూపులావు" అనే అందమైన అచ్చతెలుగు సమాసంతో పద్యాన్ని ఎత్తుకుంది ద్రౌపది. ఎందుకు? ఇక్కడొక భార్య తన భర్తతో మురిపెంగా మాట్లాడుతోంది. ఆప్యాయంగా మాట్లాడుతోంది, ఆంతరంగికంగా మాట్లాడుతోంది. ఆ మురిపెం అంతా ఆ చక్కని తెలుగు సమాసంలో ఉంది. పైగా "నీ" అని ముద్దుగా ఏకవచన ప్రయోగం కూడానూ!
ఈ ఎత్తుగడని "ఎవ్వాని వాకిట..." పద్యపు టెత్తుగడతో పోల్చి చూడండి, ఎంత తేడానో. అక్కడ చెపుతున్నది ధర్మరాజు గురించి భీమునితో. అందుకా ఠీవి, ఆ గాంభీర్యం అవసరమయ్యింది. ఇక్కడ నేరుగా భీమునితో అతని గురించే చెపుతోంది. అందుకే యీ చనవు.

మును నేల వహించిన - ఇంతకుముందు భూమిని మోసిన (అంటే ఇప్పుడు మొయ్యటం లేదన్న మాట!). ఎవరు?

నాగ కూర్మ గోత్రావనిభృత్ దిశాకరులకు ఆరయ ఊరటపట్టు కాదె :

నాగ - ఆదిశేషువు, కూర్మ - తాబేలు, గోత్ర అవనిభృత్ - అవనిభృత్ అంటే భూమిని ధరించేవి అంటే పర్వతాలు. కుల పర్వతాలు, దిశాకరులు - ఎనిమిది దిక్కులా ఉండి భూమిని మోసే దిగ్గజాలు.
చూద్దునుకదా, వీటన్నిటికీ నీ ఒక్క కుడి భుజ బలమే ఊరటపట్టు అయింది కదా! అంటే ఇప్పుడు భూభారాన్నంతా నువ్వే నీ కుడి భుజం మీద మోస్తున్నావు అని భావం. రాజు తన భుజ బలంతో భూభారాన్ని వహిస్తాడు అని కవిసమయం. అది ఆ రాజు పరాక్రమానికి చిహ్నం.
"వలమూపులావు" అన్న చిన్న తెలుగు సమాసం తర్వాత "నాగకూర్మ..." అన్న పెద్ద సంస్కృత సమాసం. ఎందుకు? అంత పెద్ద, భారమైన పనిని ఇంత చిన్న చేత్తో (భుజంతో) నువ్వు చేస్తున్నావని ధ్వనించడానికి. అది భీముని పరాక్రమాన్ని మరింతగా ధ్వనిస్తోంది కదా!
శబ్దశక్తి తెలుసున్న కవిత్వం ఇది. వాక్శక్తి తెలిసినవాడు కాబట్టే తిక్కన కవిబ్రహ్మ అయ్యాడు. ఎక్కడ తెలుగు పదాలు వెయ్యాలో, ఎక్కడ తద్భవాలు వాడాలో, ఆ రెంటినీ పద్యాలలో ఎంత సొగసుగా అతకాలో తిక్కనకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. దానికి యీ పద్యం ఒక మచ్చుతునక. మన ప్రాచీన సాహిత్యమంతా వట్టి సంస్కృతభూయిష్టమే అనుకోడం శుద్ధ భ్రమ. అది ఉత్త అనువాదమనో లేదా అర్థంకాని భాష అనో నిరసించి చదవనివాళ్ళనీ, చదవక్కరలేదనేవాళ్ళనీ చూసి జాలిపడ్డం తప్ప వేరే చెయ్యగలిగింది ఏమీ లేదు.

అన్నట్టు అష్టదిగ్గజాలకి (రాయలకొలువులో అష్టదిగ్గజాలు కాదు, ఎనిమిది దిక్కలా ఉన్న ఏనుగులు) పేర్లున్నాయి తెలుసా? ఐరావణ(త), పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. వీటి పేర్లూ, అవి ఏ ఏ దిక్కులని మోస్తాయి అన్న విషయమ్మీద ఏకాభిప్రాయం లేదు. ఈ ఏనుగుల భార్యల పేర్లు కూడా పురాణాల్లో ఉన్నాయి. అభ్ర, కపిల, పింగళ, అనుపమ, తామ్రపర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి.

సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, ఇంకా ద్రౌపది ఇలా అంటోంది.

సంభావన - దానధర్మాలు, భూజనంబులకు పండువు కాదె - ప్రజలందరికీ పెద్ద పండగే
అతను ప్రజలకి చేసే దానధర్మాలతో వాళ్ళు నిత్యం పండగజరుపుకుంటారట.

మహోగ్ర కోప రేఖా విభవంబు - భీకరమైన కోపం అతను రేఖామాత్రంగా చూపించినా, దాని ఆధిక్యానికి
వైరులకు కాలము చేరువ కాదె - శత్రువులకి కాలం దగ్గరపడినట్టే!
భీముడు తన కోపం రేఖామాత్రంగా చూపించినా అది అతని శత్రువులకి కాలం దగ్గరపడ్డట్టే అని. ఈ కాలం దగ్గరపడ్డం ఇప్పటికీ మనం వాడే పలుకుబడి (కొంచెం ఆధునికంగా చెప్పాలంటే టైం దగ్గరపడిందిరోయ్ అన్నది).

ఇక్కడితో చెప్పవలసిందంతా అయిపోయింది. భీముని భుజబలం, అతని దాతృత్వం, అతని శౌర్యం అన్నీ పొగిడింది. కాని పద్యం పూర్తవ్వలేదు. ఆ చివర్న ఏ మాట వెయ్యాలి? ఇక్కడ మళ్ళీ తిక్కనగారికి శబ్దం మీద ఉన్న పట్టు కనిపిస్తుంది. చివర్న యీ "పావనీ" అన్న సంబోధన ఎంత ఆత్మీయంగా వినిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. "నీ"తో మొదలుపెట్టిన పద్యాన్ని మళ్ళీ "నీ"తోనే ముగించాడు. పావని అంటే పవన కుమారుడు, వాయుపుత్త్రుడు. ఇది సాధారణంగా హనుమంతునికి వాడతారు. కాని భీముడుకూడా వాయువు కుమారుడే కదా. అక్కడ ధర్మరాజు గురించి చెప్పిన పద్యంలో "ధర్మసుతుడు" అని పూర్తయ్యింది. ఇక్కడ పావనీ అని. భీముని దైవాంశని ద్రౌపది సూచిస్తోందన్న మాట! ఈ పదంలో ఇంత ప్రత్యేకత ఉంది.

తిక్కనలాంటి కవి మన తెలుగుసాహిత్యానికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కవిత్వాన్ని మనం నిలుపుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉంది.


పూర్తిగా చదవండి...

Monday, June 29, 2009

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు...

మొన్న రవిగారు తన కామెంటుతో ఒక మంచి పద్యాన్ని గుర్తుచేసారు. తీగలాగారు - డొంకంతా కదిలింది!

తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది. తెలుగు కవిత్వమ్మీద ఆసక్తీ అభిమానం ఉన్నవారెవరైనా తప్పకుండా చదివి తీరాల్సిన కావ్యం విరాటపర్వం. అవును తిక్కన తీర్చిదిద్దిన విరాటపర్వం అచ్చంగా ఒక కావ్యమే!

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు

నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు

ముందు యీ పద్యాన్ని ఇక్కడ ఘంటసాల శ్రావ్యమైన గొంతులో వినండి. తర్వాత మీదైన గొంతుతో ఎలుగెత్తి కొన్ని సార్లు చదువుకోండి/పాడుకోండి. మన పద్య కవిత్వం మనలో మనం మౌనంగా చదువుకోడానికి కాదు. వినడానికీ, పాడుకోడానికీను. ఇలా గొంతెత్తి పాడితే అది మీ నోటికీ, గొంతుకీ, శ్వాసకీ మంచి ఎక్సర్సైజు కూడాను! నా మాట నమ్మండి.

అయ్యిందా? సరే, ఇప్పుడింక దీని అర్థ తాత్పర్యాలలోకి వెళదాం.

ఎవ్వాని వాకిట - ఎవని వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత, అడగు - అణగు (అణిగిపోతుందో)
అతని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.

ఎవ్వాని చారిత్రము - ఎవని చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో

ఎవ్వని కడకంట - ఎవని కనుతుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే, చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో

ఎవ్వాని గుణలతలు - ఎవని గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.

అతడు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు

అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఈ చాంతాడు సమాసం ఎందుకో ఈపాటికి అందరూ గ్రహించే ఉంటారు. ఇందులో అందమంతా పొహళింపులోనూ, ఆ కుదింపులోనూ ఉంది. మామూలు వాక్యాలలో చెప్పాలంటే అవసరమయ్యే విభక్తి ప్రత్యయాలు సమాసాల్లో అదృశ్యమైపొతాయి. క్రియలు విశేషణాలుగా మారిపోతాయి. "మహా ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము" - మామూలు భాషలో చెప్పాలంటే "మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది" అని చెప్పాలి. సమాసంలో అన్ని పదాల అవసరం ఉండదు. పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది. కవిత్వం తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది.

ఇంతకీ ఎవరితను? కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాకు కొడుకైన యుధిష్టిరుడు. పాండవుల్లో పెద్దతను. ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా? కాదు. అని ఒక అర్థం. ఇతను సాధారణ మనిషా? కాదు, స్వయానా యమధర్మ రాజు కొడుకు అని మరో అర్థం.

ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం యిది. సాధారణంగా ఎవరికీ ధర్మరాజంటే మంచి అభిప్రాయం ఉండదు. అది చాలా సహజం. కానీ యీ పద్యాన్ని చదివాక "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!" అనుకోక మానరెవరూ. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ వర్ణించాడు. మళ్ళి మూడవపాదం అతని సంపద, వైభవం. నాల్గవపాదం మళ్ళీ అతని కీర్తి ప్రసిద్ధి. ఇన్నీ అయ్యాక అసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసంలో దట్టించి చెప్పాడు. అది అతని ప్రతాపం. క్షత్రియులకి అతి ముఖ్యమైన గుణం. చివరాఖరికి అతను సాధారణ మానువుడే కాదు అని తేల్చేసాడు. అవును ఇన్నీ ఉంటే అతను మామూలు మనిషి అవుతాడా? పైగా దైవాంశ సంభూతుడు!

ఇదీ తిక్కన పద్యశిల్ప నైపుణ్యం. తీసుకున్నది సీస పద్యం. దానిలో ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తించాలి. పద్యం ఎలా ఎత్తుకుని ఎలా నడిపించి ఎలా ముగిస్తే అది వినేవాళ్ళ గుండెల్లో ముద్రపడిపోతుందో అలా నడిపించాడు. అందుకే యీ పద్యం అంత ప్రసిద్ది పొందింది.

సరే ఇంతకీ యీ పద్యాన్ని ఎవరు చెప్పారు? దీని కథా కమామీషు ఏమిటి? నర్తనశాల చూసినవాళ్ళు యిది బృహన్నల భీమ ద్రౌపదులకి చెపుతున్న పద్యమని అనుకుంటారు. ఆ సినిమాలో అక్కడ సన్నివేశానికి తగ్గట్టు అలా చూపించారు. కాని భారతంలో యీ పద్యం చెప్పింది బృహన్నల కాదు.

ద్రౌపది!

ఇది చదివుతున్న చాలామంది ఒక్కసారి కుర్చీల్లోంచి లేచే ఉంటారు! మరి ద్రౌపది ధర్మరాజు గురించి ఇంత గొప్పగా చెపుతుందని ఊహించడం కష్టమే కదా. అక్కడే ఉంది చమత్కారం. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?
సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:

"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు
గాన, బతుల విధమ కాక యే శైలూషి
గాననంగ రాదు కంక భట్ట

అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"

"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!

సరే ఇదంతా అయిపోయాక, తనలో రగులుతున్న బాధ తీరే మార్గమేదీ అని ఆలోచించి, భీమసేనుడికి చెప్పుకోడానికి వస్తుంది. కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది. తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. "మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ" అంటుంది. "ఇంతా జరిగాక మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూసావుగదా, ఇంక నేనేమనాలి?" అని నిలదీస్తుంది. నన్నా కీచకుడలా తనిన్నప్పుడు ధర్మరాజు ఎలా చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే నేనా కీచకుణ్ణీ విరటుణ్ణి కూడా అక్కడికక్కడే చంపేసేవాడినని, అదే జరిగితే మళ్ళీ మనం వనవాసానికి వెళ్ళాల్సి వచ్చేదనీ, అప్పుడందరూ ద్రౌపదినీ తననే తప్పుబట్టే వారనీ చెపుతాడు. అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని తిట్టకూడదని అంటాడు. అప్పుడు మళ్ళి ద్రౌపది అందుకుంటుంది. నేను పొందిన బాధలోనీ కోపంలోనీ అలా అన్నానే కాని నాకు ధర్మం తెలియక కాదు, ధర్మరాజు గొప్పదనం తెలియకా కాదు అంటుంది. ధర్మరాజు గుణగణాలని పొగడ్డం మొదలుపెడుతుంది. అప్పుడా వరసలో చెప్పిన పద్యమే యీ పైన చెప్పిన పద్యం.
ధర్మరాజుని పొగిడి ఊరుకోదు. అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది. ఆ తర్వాత వరుసగా భీమసేనణ్ణి, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనీ పేరుపేరునా పొగుడుతుంది. వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది. చివరికి తనంత దానికి వచ్చిన కష్టాలని చెప్పుకుంటుంది. అన్నీ అయ్యాక మళ్ళీ చివరాఖరికి ఏమిటంటుంది?

ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ
వలసె ధర్మతనూభవు వలన జేసి
దాయ లొడ్డిన మాయజూదంపుటురుల
బడి కులంబున కతడిప్పాటు దెచ్చె

ఇదీ ద్రౌపది వాక్పటిమ. ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ!

ఇంచుమించు ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే. కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా తీర్చిదిద్దాడు. సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి, పాండవులందరి గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే, దీనంతటికీ కారణం ధర్మరాజే అని ముగిస్తుంది. భీముడు ఆ తర్వాత మాట్లాడతాడు. కాని తెలుగు భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి. అది తిక్కన రచనలోని నేర్పు.

విరాటపర్వంలోని మరిన్ని ఆణిముత్యాలని ముందుముందు రుచిచూద్దాం!

మళ్ళీ చెపుతున్నాను. తెలుగు కవిత్వం అంటే ఆసక్తి అభిరుచి ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన కావ్యం తిక్కన విరాట పర్వం (ఆ మాటకొస్తే భారతమంతానూ!).


పూర్తిగా చదవండి...

Monday, June 22, 2009

తెలివి యొకింత లేనియెడ...

భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:

యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం
తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం:

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్

బహుశా యిది నాకు చాలాసార్లు అనుభవమయ్యింది కాబట్టి బాగా హత్తుకొని ఉంటుంది. చాలాసార్లు అనుభవం అయ్యిందంటే, ఎన్నిసార్లు అనుభవమైనా ఆ రోగం కుదరలేదని అర్థం! ఎప్పటికైనా కుదురుతుందనే ఆశ. నాలాగే యీ రోగం చాలామందికి ఉందన్న సంగతి తెలుసుకొని ఊరటపొందాలో మరింత బాధపడాలో మాత్రం తెలియటం లేదు. అందుకే సిసలైన తెలివిగలవాళ్ళు తక్కువైపోతున్నారు. నా అదృష్టం కొద్దీ యీ రోగంలేని ఆరోగ్యవంతులైన విజ్ఞుల సాంగత్యం నాకు కలిగింది.
ఇప్పటి Personality Development నిపుణులకి యీ శ్లోకాన్ని కాని వినిపిస్తే, "This is sheer inferiority complex of this poet" అని కొట్టిపారేస్తారేమో! "ఇలాటివి నువ్వు చదివి వంటపట్టించుకుంటే యిక నీ జన్మలో బాగుపడవు, జీవితంలో ముందుకి వెళ్ళలేవు" అని బెదరగొట్టే అవకాశమూ లేకపోలేదు. "ఇది పాచ్చింతకాయ పచ్చడి, యీ కాలంలో యిది పనికిరాదు. మనకి తెలిసింది గోరంతైనా తెలుసున్నది కొండంత అని చూపించుకోవాలి. చూపించుకోడమే కాదు అదే నిజమని నమ్మాలి కూడా. అవతలవాడసలు నీకన్నా తెలివైనవాడు ఎలా అవుతాడు?" ఇలా లెక్చరు మొదలుపెడతారు కూడా!
బహుశా ఇప్పుడున్న సమాజంలో "విజయం"(success) సాధించడానికి ఈ ధోరణి అవసరమే కావచ్చు. కాని ఎప్పుడైతే మనం మనకి సర్వం తెలుసు, లేదా మనకి తెలిసినది మనం విశ్వసించేదీ నూటికి నూరుపాళ్ళూ నిజం, మరొకళ్ళ దగ్గర మనమేదీ నేర్చుకోలేం అనే స్థితికి వస్తామో అప్పుడు బుద్ధిజీవిగా మనం చచ్చిపోయినట్టే అని నేననుకుంటాను. ఎందుకంటే మనిషి మెదడుకున్న అతి ముఖ్యమైన శక్తి నేరుచుకోవడం తెలుసుకోవడం (దీన్నే గ్రహణ శక్తి అంటారు). ఇది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండి వయసు మీదపడే కొద్దీ తగ్గుతుందంటారు. నా మనసెప్పుడూ ఆ పసితనాన్ని కోల్పోకూడదని నా కోరిక.

ఎప్పటి శ్లోకం ఇది! భర్తృహరి కాలం సరిగ్గా తెలియదు కాని ఉజ్జాయింపుగా రెండువేల సంవత్సరాల కిందటివాడనుకోవచ్చు. అప్పుడతను చెప్పిన సుభాషితాలు ఇన్నేళ్ళుగా ఎలా నిలిచాయి?! కాగితాలులేవే. పుస్తకాల ప్రచురణ లేదే. కంప్యూటర్లు లేవే. సీడీలు లేవే. వీటన్నిటికన్నా కూడా సమర్థవంతమైన టెక్నాలజీ ఒకటుంది. అది మనిషి మనసు. "సుకవి జీవించు ప్రజల నాలుకల మీద" అన్నారు కదా జాషువా. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి! ఇదే పద్ధతిలో మనకి చాలా సారస్వతం కొన్ని వేల యేళ్ళుగా ప్రసారమవుతూ వచ్చింది. ఈ పద్ధతివల్ల కలిగిన సిసలైన లాభం - ఈ చెప్పిన విషయాలని ప్రజలు తమ హృద్గతం చేసుకోడం. అంటే వీటిని మనసారా నమ్మి ఆచరించడం.
ఏ దేశానికైన సంస్కృతికైనా అయా దేశానికి లేదా సంస్కృతికి చెందిన పౌరులు ఆచరించవలసిన కొన్ని నీతి సూత్రాలు, నైతిక విలువలు (Moral values) ఉంటాయి. ఇవి కాలానుగుణంగా మార్పు చెందుతూ ఊండవచ్చు. కాని ఏ కాలంలోనైనా ఇవి ఉండకుండా పోవు. వీటిని ఆ ప్రజలందరి చేత ఎలా ఆచరింపజెయ్యాలి? ఇది చాలా కష్టమైన విషయం! మన సంస్కృతి కొన్నేళ్ళ క్రితం వరకూ దీనికోసం ఎంచుకున్న మార్గం సాంస్కృతిక ప్రచారం - ఇది ప్రధానంగా కళల ద్వారా, సంప్రదాయాల ద్వారా జరిగేది. ఈ నైతిక విలువలు ప్రజల జీవితంలో భాగమై పోయేవి. దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ నీత్రి సూత్రాలని పాటించని వాళ్ళు అరుదుగానే ఉండేవారని ఊహించవచ్చు.
సరే, ఇప్పుడు మనకా నీతి సూత్రాలు పనిచెయ్యవు. నిజమే! వీటన్నిటినీ కట్టకట్టి ఏ అరేబియా సముద్రంలోనో పడేద్దాం. మంచిది. ఇప్పుడు మన సమాజంలో మనం పాటించాల్సిన నీతి సూత్రాలేంటి? మనది సర్వ తంత్ర స్వతంత్ర దేశం. ఈ దేశ పౌరులుగా మన రాజ్యాంగానికి మనం బద్ధులమై ఉండాలి. మన రాజ్యాంగంలో Fundamental Duties అని ఉన్నాయని ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో చదువుకున్నాం. అంతకు మించి ఎందరికి వాటి గురించి తెలుసు? తెలిసినవాళ్ళు ఎంతమంది వాటిని పాటిస్తున్నారు? మనకి కావలసిందల్లా మనం చేసే పనులు చట్టబద్ధమా కాదా అని. అది తేల్చడానికి కోర్టులు! చట్టం నుంచి తప్పించుకోగలిగినంత వరకూ అందరూ దొరలే! ఇప్పుడు మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలో ప్రజలు తప్పులు చెయ్యకుండా ఉండేట్టు చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నమూ లేదు. తప్పు చేస్తే విచారించి శిక్షించడానికి తప్ప! తప్పు చేస్తే విచారించి శిక్షించాల్సిన వ్యవస్థ ఉండాలి, కాదనడం లేదు నేను. అది మనకి ఎప్పుడూ ఉంది. But that should be for exceptions. ఇప్పుడు నీతిగా బతక గలగడం ఒక exception అయి కూర్చుందే!
మనం నమ్మిన నీతిని ప్రజల మనసుల్లోకి వెళ్ళేలా చేసి, అది వారి జీవితంలో భాగం కాగలిగినప్పుడే దాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యడం సాధ్యం. లేని నాడు కోట్లకి కోట్లు రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఖర్చు పెడుతూనే ఉంటాం. వాటికి అందనంత ఎత్తులో అవినీతి ఎప్పుడూ తాండవం చేస్తూనే ఉంటుంది! దీనికి ప్రత్యామ్నాయం వెతకాలంటే మనం కళలనీ సాహిత్యాన్ని ఆశ్రయించాలి. వాటికున్న శక్తిని తక్కువ అంచనా వెయ్యడం సబబు కాదు. మొన్న మొన్న జాతీయోద్యమ కాలంలో ప్రజలలో దేశభక్తిని రగల్చడానికి ఇవి ఎంతగా సాయపడ్డాయో మనకి తెలుసు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు వయోజనవిద్య కుటుంబనియంత్రణ మొదలైన విషయాల ప్రచారానికి ప్రభుత్వం కళలని వాడుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది మధ్యలో ఎప్పుడో తెగిపోయింది. నీతిశతకాలకీ, వీథి భాగవతాలకీ, హరికథలకీ, నాటకాలకీ కాలం చెల్లిపోయింది సరే. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన "కళ" సినిమా. దీనిద్వారానైనా ఎందుకు మన ప్రభుత్వం ప్రచారం చెయ్యకూడదు? ఓ సినిమాలో ఓ పెద్ద హీరో తన మేనకోడలి హత్యకి ప్రతీకారంగా విలన్ని చంపాలనుకుంటాడు. ఒక హీరోయిన్ ఇది తప్పుకాదా అంటుంది. "అలనాడు రాముడు వాలిని చెట్టుచాటునుండి చంపాడు. అవసరమైనప్పుడు అలా చెయ్యడం న్యాయమే!", అని మన హీరోగారి జవాబు. దానికి జనాలు ఈలలూ చప్పట్లూనూ! చట్టవిరుద్ధమైన పనిని అంత బహిరంగంగా ప్రోత్సహిస్తున్న ఆ సినిమా అసలెలా సెన్సారవ్వకుండా విడుదలయ్యింది? అని నిలదీసేవాడు ఒక్కడూ లేడు. ఇది ఏదో ఒకటో రెండో సినిమాల్లో కనిపించే ధోరణి కాదే! మరి దీని గురించి ఒక్కడూ గొంతు పెగల్చడేం? రామాయణమ్మీద విరుచుకుపడమంటే మాత్రం మనకి అమితోత్సాహం!
ఇప్పటికీ మన దేశంలో ఒక సగటు పౌరునికి రక్షణకోసం ప్రభుత్వం ఖర్చుపెట్టే నిధులు అమెరికాలాంటి ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అనీ, అయినా మన దేశ పౌరుడికున్న భద్రత, ఆ ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువనీ అమర్త్య సేన్ చాలా స్పష్టంగా చెప్పారు. సాంస్కృతికంగా మనకున్న నైతిక విలువలే దీనికి కారణమై ఉండాలని కూడా అన్నారు. ఇప్పటికైనా ఈ విషయమై అందరూ కళ్ళు తెరిచి ఏదైనా చేస్తే బాగుంటుంది.

అబ్బో! పద్యాన్ని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాను. మనసు కోతి కాబట్టి అదెప్పుడూ శాఖాచంక్రమణం చేస్తూనే ఉంటుంది. సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, లక్ష్మణ కవి యీ శ్లోకానికి చేసిన అనువాదం నాకంతగా నచ్చలేదు. ఎందుకంటే మూల శ్లోకంలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలని అనువదించకుండా వదిలేశాడు.
ఒకటి: "గజ ఇవ మదాంధః". ఏనుగువలె మదాంధుడినయ్యాను అని. మదము అంటే రెండర్థాలున్నాయి. గర్వం అన్న అర్థం ఒకటైతే, ఏనుగు చెక్కిళ్ళనుంచి కారే ద్రవం అని మరో అర్థం. ఇక్కడ ఏనుగు పరంగా మదం అంటే రెండవ అర్థం వస్తుంది. తన పరంగా గర్వం అన్న అర్థం వస్తుంది. అందుకక్కడ ఏనుగుతో పోలిక సమంజసం. కాని అనువాదంలో ఆ పదం లేదు. అంచేత ఆ ఔచిత్యం లేదు.
రెండు: గర్వమనే జ్వరం పోయింది అని సంస్కృతంలో ఉంది. ఇది చాలా హృద్యమైన పోలిక. ఇది కూడా అనువాదంలో లోపించింది.
అయినా తెలుగు పద్యం చదువుకోడానికి హాయిగా ఉంది!


పూర్తిగా చదవండి...

Sunday, June 14, 2009

పద్యంతో లెక్కల మేజిక్!


నాకు పద్యాలంటే ఎలా ఇష్టమో లెక్కలంటేనూ అలాగే ఇష్టం. మనవాళ్ళు పద్యాలలో కవిత్వం సృష్టించినట్టే లెక్కలుకూడా చేసారు. లెక్కలతో మేజిక్కులు చేసారు. అలాటి ఒక లాజిక్ మేజిక్ ఇప్పుడు మీ కోసం.
ఈ కింద ఇచ్చిన పద్యం ఒకసారి చూడండి:

1. అరి భయంకర చక్ర కరి రక్ష సాగర చాయ శ్రీ కర్బురసాటి యుగళ
2. నాళీక సన్నిభ నయన యండజవాహ వాణీశజనక వైభవ బిడౌజ
4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష వర జటి స్తుత శౌరి వాసుదేవ
8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల పాప భుజంగమ పరమ గరుడ
16. దోష శైలేశ శచిదక్ష ద్రుహిణి హేళి

ఇది సీస పద్యం. కాకపోతే ఎత్తుగీతి తేటగీతిలో ఒక పాదమే ఉంది. ఇది విష్ణుమూర్తి స్తోత్రం. ప్రస్తుతం మనం లెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని అర్థ తాత్పర్యాలు పక్కన పెడదాం (కావలసిన వాళ్ళు ప్రయత్నించవచ్చు).
ఇంతకీ వీటి ముందున్న నెంబర్లేమిటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.

ఇప్పుడు మీరు తెలుగులో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకోండి. కాకపోతే చిన్న చిన్న కండిషన్లు. అచ్చుల్లో "అ" ఒకటే తలుచుకోవాలి. హల్లుల్లో "ఙ్", "ఞ్" తలుచుకోకూడదు. అల్ప ప్రాణాలకీ మహా ప్రాణాలకీ తేడా లేదు ("ప", "ఫ" ఒకే అక్షరం. "చ", "ఛ" ఒకటే అక్షరం. ఇలా అన్నమాట). అలాగే "ర", "ఱ" కి తేడా లేదు. గుణింతాలకీ తేడా లేదు ("ప", "పా", "పి"... అన్నీ ఒకటే).

సరే ఒక అక్షరం తలుచుకున్నారా? ఇప్పుడు మీరేం చెయ్యాలంటే, మీరు తలుచుకున్న అక్షరం ఏయే పాదాల్లో ఉన్నాదో గుర్తించండి. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు అసలు అక్షరమే లెక్క, వత్తులు కాదు. అంటే "ప్ర" అన్నది "ప" తలుచుకున్నప్పుడే లెక్కలోకి వస్తుంది, "ర" తలుచుకున్నప్పుడు కాదు. ఒక అక్షరం ఒకే పాదంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వచ్చినా అది ఒకసారే లెక్క. ఆయా పాదాలకి సంబంధించిన సంఖ్యలని కలపండి. ఆ వచ్చిన సంఖ్యని నాకు చెప్పండి. ఉదాహరణకి "డ" తలుచుకున్నారనుకోండి. అది రెండు నాలుగు పాదాల్లో ఉంది. వాటికి సంబంధించిన సంఖ్యలు 2, 8. 2+8 = 10. మీరు నాకు 10 అని చెప్పండి. అప్పుడు మీరు తలుచుకున్న అక్షరం "డ" అని నేను చెప్పేస్తాను. మీరు తలుచుకున్న అక్షరం సరిగ్గా నేను చెప్పేస్తానన్న మాట.

దీనికి నా దగ్గర కంప్యూటరు ప్రొగ్రాములాంటిది ఏదీ లేదు. ఒక్క రెండు వాక్యాలు గుర్తుంచుకుంటే చాలు. అవేవిటో తర్వాత చెప్తాను. ముందు ఆట మొదలుపెడదామా?

అక్షరం తలుచుకొని నెంబరు చెప్పండి. కాయ్ రాజా కాయ్!


పూర్తిగా చదవండి...

Wednesday, June 3, 2009

బాల రసాల...

బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.

మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:

బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.

చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!


పూర్తిగా చదవండి...

Friday, May 29, 2009

జుగల్‌బందీ

నిన్న రాత్రి నేను గంధర్వలోకానికి వెళ్ళివచ్చాను. మీరు నమ్మరు కాని, ఇది నిజంగా నిజం!

టీవీ రొద కంప్యూటరు సొద కట్టిపెట్టి, స్టీరియో ఆన్ చేసాను. చేతిలో పుస్తకం తీసుకుని పక్కమీదకి ఒరిగాను.

आपको देख कर देखता रह गया!
क्या कहूँ और कहने को क्या रह गया!


మెల్లగా జగ్జీత్ సింగ్ పాట శ్రావ్యంగా మొదలయ్యింది.

మలయ పవను కౌగిలిలోనె పులకరించి
హాయిగా కంఠమెత్తు ప్రాయంపు వంశి
విశ్వమోహను జిలిబిలి పెదవులంటి
అవశమైపోయి ఏమి చేయంగ లేదు


కృష్ణశాస్త్రి గీతం మెత్త మెత్తగా మనసుకి హత్తుకోడం మొదలు పెట్టింది.

ఒకపక్క జగ్జీత్ సింగ్ మరోపక్క కృష్ణశాస్త్రి. ఇద్దరి సంగీతం ఒకేసారి - చుక్కా చుక్కా హృదయంలోకి ఇంకుతూ ఉంటే, చిక్కని మధువేదో గొంతులో బొట్టుబొట్టూ దిగుతున్న అనుభూతి. ఒక తీయని మైకం కమ్ముకుంటోంది.

ओ मेरे सामनेही गया... और मै...
रासतेकी तरहा देखता रह गया...


జగ్జీత్ సింగ్ గొంతులో భావం ఎంత బాగా పలుకుతుంది!

నాటి తుది సందె చీకటి కాటుకల విలీనమైపోవు రాజమార్గాన,
నీవు కదలిపోతివి విషాదసుఖమ్ము గూర్చి
సగము నిద్దురలో క్రమ్ము స్వప్న మటుల
ఆపుకోలేని మమత, ఘంటాపథమ్ము నడుమ పరువిడి,
నిలబడినాడ నట్టె


విషాదసుఖం! ఆ అనుభూతి కృష్ణశాస్త్రికి మాత్రమే తెలుసు.

కృష్ణశాస్త్రి నాకు సరిగ్గా సరైన వయస్సులోనే పరిచయమయ్యారు. మాకు ఇంటరులో అతని "అన్వేషణము" పాఠంగా ఉండేది. కృష్ణశాస్త్రి నాకు పరిచయమయ్యింది అప్పుడే! అప్పుడప్పుడే యవ్వనపు రెక్కలు వస్తూ వస్తూ ఉన్నాయి. ప్రపంచాన్ని నా కళ్ళతో చూడాలని కొత్తగా తెలుస్తోంది. ఎవో తెలియని కొత్త కొత్త భావాలు మనసుని గిలిగింతలు పెట్టే రోజులవి. సరిగ్గా అప్పుడు పరిచయమైన కవి కృష్ణశాస్త్రి. ఆ మాటలు కొత్త. ఆ భావాలు కొత్త. అప్పుడప్పుడే విచ్చుకుంటూన్న మొగ్గ రేకులపై, మెల్లిగా తుమ్మెద వాలినట్లు - ఆ కవిత్వం నా హృదయాన్ని తాకేది.

इश्ख की दास्तान है प्यारी
अपनि अपनि ज़बान है प्यारी


సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?


పాత రోజులు గుర్తుకు తెచ్చుకోడానికి కొంతమంది పాత ఫొటోలు చూస్తారు. కొందరు డైరీలో పాతపేజీలు తిరగేస్తారు. చదివిన పుస్తకాలని, విన్న పాటలని మళ్ళీ ఒకసారి స్పృశిస్తాను నేను. జ్ఞాపకాల జల్లుని కురిపిస్తున్నాయి జగ్జీత్ సింగ్ పాటలు. జ్ఞాపకాల పరిమళాలని విరజిమ్ముతునాయి కృష్ణశాస్త్రి కవితలు. ఒకేసారి, వాన జల్లులో తడుస్తూ తడి మట్టివాసన పీల్చిన అనుభూతి.

कल चौदवी की रात थी, शब् भर रहा चरचा तेरा
कुछ ने कहा ये चाँद है, कुछ ने कहा चहरा तेरा


నిన్న రాతిరి చికురంపు నీలికొనల
జారిపడిన స్వప్నమ్ము నిజమ్మొ ఏమొ
కోమ లామోద కౌముదీ కోరకమ్మొ
సుర విలాసవతీ ప్రేమ చుంబనమ్మొ


కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి - ఇంటర్ తర్వాత తెలుగు నేలకి దూరంగా కలకత్తాలో ప్రవాసం చెయ్యాల్సి వచ్చినప్పుడు నాకు తోడున్న మిత్రులలో వీళ్ళూ ఉన్నారు. ఈ పాత స్నేహితుల్ని పలకరించేసరికి ఆ పాతరోజులు గుర్తుకొచ్చాయి. కేంపస్ లో మా హాస్టల్ ముందు ఒక చిన్న సరస్సు. చుట్టూ కొబ్బరిచెట్లు. కొబ్బరీనెల సందుల్లోంచి జాలువారే వెన్నెల కిరణాల్లో తడుస్తూ, ఆ సరసు చుట్టూ చక్కర్లు కొట్టడం ఎంత మజాగా ఉండేదో! ఆలా నడుస్తూ నడుస్తూ "తలిరాకు జొంపముల సందుల త్రోవల నేలవాలు తుహినకిరణ కోమల రేఖవొ!" అని కృష్ణశాస్త్రి కవితలని స్మరించుకుంటూ ఉంటే అది మరెంత మజా! హాస్టల్ డాబా మీద, పున్నమి ఏకాంతంలో, కృష్ణపక్షం చదువుకోడం - అదో వింత అనుభూతి!

పాట మధ్యలో దీపక్ పాండె వాయులీన స్వరప్రస్తారం సమ్మోహనంగా వినిపిస్తోంది. అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా?

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
పడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనలపైని
తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ,
పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు
కడలిగా, పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమైపోయె నెడద


వాయులీన ప్రస్తారం తారస్థాయిని అందుకుంది.

పరువు పరువున పోవు నెదతో
పరువులెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరచి నడిరేయిన్


మరో కొత్త గజల్ మొదలయ్యింది.

तेरे कदमोंपे सर होगा... कज़ा सरपे खड़ी होगी...
फिर उस सजदे का क्या कहना... एक अनोखी बंदगी होगी...


ఏ మాటని ఎలా ఎంతవరకూ ఉచ్చరిస్తే అందులో భావం పలుకుతుందో - ఆ కళ సంపూర్ణంగా తెలిసిన గాయకుడు జగ్జీత్ సింగ్. జాగ్జీత్ సింగ్ నాకు కొంచెం ఆలస్యంగా పరిచయమయ్యారు. అవి డిగ్రీ అయిపోయి పీజీ చదువుతున్న రోజులు. పీజీలో కొత్తగా చేరిన రాజేష్ శుక్లా నాకితన్ని పరిచయం చేసాడు. తన రూములో ఉన్న కేసెట్ చూస్తూ ఉంటే, నీకు నచ్చుతాయి తీసుకెళ్ళి విను అని ఇచ్చాడు. ఆ కేసెట్ తెచ్చుకొని వాక్ మేన్ లో పెట్టి మొట్టమొదటిసారి జగ్జీత్ సింగ్ గొంతు విన్న ఆ క్షణం ఇంకా గుర్తే!

तुम्हें दानिस्ता महफ़िल में जो देखा हो तो मुजरिम
नज़र आखिर नज़र है बे-इरादा उठ गयी होगी


ఏను మరణించుచున్నాను ఇటు నశించు
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు...

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె
నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను
నేనె నాపయి వాలినా నేనె జాలి
నెదనెద గదించినాను, రోదించినాను


కృష్ణశాస్త్రి, జగ్జీత్ సింగ్. ఎన్నో ఏళ్ళనుంచీ ఇద్దరూ తెలుసు. అయినా, ఇద్దరినీ ఒకేసారి పలకరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇన్నాళ్ళూ రాలేదు. ఆశ్చర్యం!
ఇది కవిత్వాన్ని మించిన ఆల్కెమి!

अपनि होठों पर सजाना चाहताहूँ
आ तुझे मैं गुनगुनाना चाहताहूँ


నాకు మాత్రము గానమున్నంత వరకు
చాలు చాలు నీ ప్రణయనిశ్వాస మొకటి
మోసికొందునొ నా గీతములను నిన్ను
మూగవోదునొ రాయియైపోయి చిరము


మత్తు మనసంతా ఆవరిస్తోంది. నన్ను నేనే మరచిపోయే స్థితికి చేరువవుతున్నాను. బరువెక్కిన కన్నులు అక్షరాల వెంట చాలా మెల్లగా కదులుతున్నాయి. తెరలు తెరలుగా చెవులని సోకుతున్న గజల్.

कोई आंसू तेरे दामन पर गिराकर
बूंदको मोती बनाना चाहताहूँ


ప్రియతమా ఇక నిదురింతు పిలువబోకె
బాసిపోకు నిర్భాగ్యపు బ్రతుకు దాటి!
ప్రియతమా పొరలి పొరలి మొయిళులేవొ
మేలుకొననీవు రెప్పల వాలి అదిమి!


थक गया मैं करते करते याद तुझको
अब तुझे मैं याद आना चाहता हूँ


రెప్పలు మూసుకుపోయాయి. ఎక్కడో దూరం నుంచి వినిపిస్తోంది.

आखरी हिच्चकी तेरे ज़ानों पे आये... आखरी हिच्चकी... हिच्चकी... हिच्चकी

हिच्चकी మంద్రస్థాయికి... ఇంకా మంద్రస్థాయికి వెళ్ళిపోతోంది...

आखरी हिच्चकी तेरे ज़ानों पे आये...
मौत भी मै शायराना चाहताहूँ...


పూర్తిగా చదవండి...