తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, August 23, 2009

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె...

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

కరుణశ్రీగారి ఉదయశ్రీలో తెలుగు పిల్లలకి వినాయకుని గురించి చెపుతున్న పద్యాలు:
(క్రిందటేడు ఈ పద్యాలని పూర్తిగా వినే తీరిక లేక వెళ్ళిపోయిన వినాయకుడు ఈ ఏడు గుర్తుపెట్టుకుని మరీ వినిపించమని అడిగాడు!)

ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరువెత్తివచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
'నల్ల మామా' యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి లెమ్ము జోహారు లిడగ

తిలకమ్ముగా దిద్దితీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడుకోట్ల దేవతలపై
చల్లని చూపులు వెల్లివిరియ

గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమొ
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు పట్ట
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము

కొలుచువారలకు ముంగొంగు బంగారమ్ము
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించువారికి చేతిచింతామణి
భావించువారల పట్టుగొమ్మ
దాసోహ మనువారి దగ్గర చుట్టమ్ము
దోసిలొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించిన వారి కానంద మందార
మర్థించు వారల కమృతలహరి

జాలిపేగుల వాడు లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు
చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు
అక్కరో! అర్ఘ్యపాత్రము నందుకొనవె

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరికపూజకె తలకాయ నొగ్గు

పంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుములం దించి కలుము లందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక!

11 comments:

  1. ఈ రోజు ఉదయంనుండి ఎందుకో మనసులో "పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి" అన్న మాటలు పదే పదే గింగురుమంటున్నాయి. ఇప్పుడిక్కడ పూర్తి కావ్యం! ఇంతకంటే హృద్యంగా వినాయకుడిని పిల్లలకు పరిచయంచేసే పద్యాలు తెలుగు సాహిత్యంలో లేవని నా అభిప్రాయం. నెనర్లు.

    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. చిన్నపిల్లల మనసుకు హత్తుకునేలా చిన్ని పోలికలు, సరదా సంగతులతో కరుణ శ్రీ గారి పద్యాలు రమణీయం గా ఉన్నయి. పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. అయ్యో నిన్ననే ఈ టపా వచ్చివుంటే నా తెలుగు క్లాసు చిన్నారులకి వీటిని వల్లె వేయించేదాన్నే అనుకున్నాను. సందర్భానుసారంగా అందించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. ఎంత సరళంగా ఉన్నాయండి!

    ReplyDelete
  5. మా పసుపు ముద్ద గణపతి అంత ముద్దుగా ఉన్నయ్యి :)

    ReplyDelete
  6. వడకుగుబ్బలి అంటే ఏమిటి మాస్టారూ?

    ReplyDelete
  7. 'ఇడుములం దించు' ప్రమాదకరమైన ప్రయోగం. :-)

    పద్యాలు ఓలిగలంత కమ్మగా వున్నాయి! చదివాక ఒక సంగతి గుర్తొచ్చింది.

    కవిత్వమంటే యిట్లా వుండాల్నని - పెద్దన - తేటతెలుగులో పదహైదు సంస్కృతంలో పదహైదు - మొత్తం ముప్పై పాదాల పద్యం చెప్పి, తన వామపాదానికి సాక్షాత్తూ శ్రీకృష్ణదేవరాయనితోనే గండపెండేరం తొడిగించుకున్నాడని విన్నాను. ఆ పద్యమూ దానిమీద మీ వ్యాఖ్యానమూ అందించవలసిందిగా ఈ బ్లాగుపాఠకుల తరఫున కోరుతున్నాను. మన్నించండి.

    ReplyDelete
  8. పెద్దన గారి పద్యమిదిగో, ఇక వ్యాఖ్యానమే తరువాయి. కామేశ్వరరావు గారు, పద్యం అక్కడక్కడ అర్థమయ్యింది, స్థూల విశేషం బోధపడింది కానీ - తమరు విశదీకరిస్తే బావుంటుంది.

    ====

    పూత మెఱుంగులుం బసరూపున బెడంగులుఁ జూపునట్టి వా
    కైతలు? జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మన గమ్మ నన్వలెన్
    రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
    ద్దాతరి తీపులో యనగఁ దారసిలన్వెలెన్ లోఁ దలంచినన్
    బాతిగఁ బైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటీ
    కూతల నన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
    జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
    ల్మూతల చన్నుదోయి వలె ముచ్చటగావలెఁ బట్టి జూచినన్
    డా తొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
    వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంట నూదినన్
    గాతలఁ దమ్మిచూలి దొరకైవసపుం జవరాలి సిబ్బెపు
    న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బి గుబ్బ పొం
    బూతల నూనెకాయ సరిపోడిమి కిన్నెర మెట్టుబంతి సం
    గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళ పంతుకా
    సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్
    మ్రోతలనుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గులీ
    రీతిగ సంస్కృతం బుపచరించెడు పట్టున భారతీ వధూ
    టీ తపనీయగర్భ నికటీభవ దానన పర్వ సాహితీ
    భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మతప్రభా
    పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమర్భటీ
    జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికామృదం
    గాతత తే హితత్తహితహాధిక ధంధణు ధాణు ధింధిమి
    వ్రాతనుయానుకూల పదవార కుహూద్వహ హారికింకిణీ
    నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝూళఝళీ మరంద సం
    ఘాత వియధ్ధునీ చకచక ద్వికచోత్పల సార సంగ్రహా
    యాత కుమార గంధవహ హారి సుగంధవిలాస యుక్తమై
    చేతము చల్లము జేయవలె జిల్లనఁ జల్లవలెన్ మనోహర
    ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసా
    దాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్

    ReplyDelete
  9. గిరి గారూ చిన్న చిన్న తప్పులు దొర్లినట్లనిపిస్తుంది. సరిచేయగలరు.

    ReplyDelete
  10. వడకు = ఉత్తరపు దిక్కు, గుబ్బలి = కొండ
    వడకుగుబ్బలి = ఉత్తరాన ఉన్న కొండ = హిమవత్పర్వతం

    >>'ఇడుములం దించు' ప్రమాదకరమైన ప్రయోగం. :-)
    సాభిప్రాయమైన ప్రయోగం. దేవుని చేతలు ఎప్పుడూ అలా అటూ ఇటూగానే ఉంటాయి మరి. వాటిని ఎలా అన్వయించుకుంటామన్నది మన చేతుల్లో ఉన్న పని!

    పెద్దన ఉత్పలమాలికని వీలుచూసుకొని వివరించే ప్రయత్నం చేస్తాను. కాని ఇలాటివాటికి ప్రతిపదార్థ తాత్పర్యాలు వెతకడం ఒక అందమైన బొమ్మని లోపల ఏముందో అని పగలగొట్టి చూడ్డంలా ఉంటుందేమో అని నా అనుమానం.

    ReplyDelete
  11. 'నల్ల మామా' యంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుఱ్ఱ

    ఇలాంటి భలే భలే అనిపించే ప్రయోగాలే మొత్తమూను. బావుందండీ. మంచి పద్యాలు పరిచయం చేసారు.

    వడకుగుబ్బలి వడకించును :)

    ---

    రానారెగారండీ: "నతేతరాతిభీకరమ్" అని వినాయకుడినే మరి ఆదిశంకరులు సంబోధించారు కదా. ఇడుములందించు అయ్యింది కదా అక్కడ :)

    ReplyDelete