తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, September 10, 2012

మృత్యుశోధన - శ్మశానం నుండి వైకుంఠం దాకా


ఈ మధ్య వరసగా మరణవార్తలు వినవలసి వచ్చింది. జువ్వాడి గౌతమరావుగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, నిన్నటికి నిన్న కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు. యాదృచ్ఛికంగా నిన్ననే కలంకలలు బ్లాగులో యీ టపా చదివాను - వేదన నుంచి శోధన లోకి (జాషువా, శ్రీశ్రీ ఊతగా). అందులో పద్యాలు చదువుతూంటే నా మనసుకూడా ఏవేవో ఆలోచనల్లోకి జారిపోయింది.

ఎవరైనా ప్రముఖులు కాలధర్మం చేస్తే సంతాపం ప్రకటిస్తాం. ఎవరికోసమా సంతాపం? వారి బంధువర్గానికా? వారెవరూ మనకి తెలిసుండకపోవచ్చు. వారి గురించి మనం సంతాపం ప్రకటించడం దేనికి? ఆ చనిపోయిన వాళ్ళు మన సమాజానికి ఏదో మేలు చేసినవాళ్ళయితే వాళ్ళనుండి యీ సమాజం మరింత మంచిని పొందే అవకాశం పోగొట్టుకుందని సమాజమ్మీద సంతాపమా అది? ఏమో! ఉదాహరణకు, భద్రిరాజుగారు భాషాశాస్త్రంలో, ప్రత్యేకించి ద్రవిడ, తెలుగు భాషల గురించి విశేషమైన, మౌలికమైన పరిశోధన చేసారు. తుదిశ్వాస విడిచేవరకూ దానికి సంబంధించి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అవన్నీ పూర్తయ్యేది ఎలాగ? రోహిణీప్రసాద్‌గారు, సంగీతమ్మీద, విజ్ఞానశాస్త్ర విషయాల మీదా ఎన్నెన్నో చక్కని వ్యాసాలు వ్రాసారు. కొద్ది కాలం కిందటి వరకూ వ్రాస్తూనే ఉన్నారు. అతనికి తెలుగుభాషంటే వల్లమాలిన అభిమానం. ఎన్నో అనువాదాలు కూడా చేసారు. వారు గతించడం వల్ల మరెన్నో మంచి వ్యాసాలను తెలుగుపాఠకులు కోల్పోయారు. అందుకు బాధగా ఉంది. అంటే ఇందులో ఎంతోకొంత స్వార్థం ఉందన్న మాట!

మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.

ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే  ఉంటాయి కదా. అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గురించి ఊహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. చావులో కూడా తన అస్తిత్వం నశించే స్థితిని మనిషి ఊహించలేడు! అందుకే "తన" శరీరం కాలుతూంటే, "తన" బంధువులెవరూ "తన" వెంట రారని అనుకోడం. ఇదొక రకంగా "అసంబద్ధమైన" (contradictory) ఊహ. ఒక వ్యక్తి ఉన్నంత వరకూ, ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వ ప్రపంచమూ నిత్యమైనదే, సత్యమైనదే. అందులో ఉండే వస్తువులు, మనుషులూ భౌతికంగా నిత్యం కాకపోవచ్చు. కాని జగమే అనిత్యం, అసత్యం కాకుండా పోవు!

ఇచ్చోట నే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!

ఈ పద్యంలో వ్యక్తిదృష్టికన్నా కూడా ఒక సామాజికదృష్టి కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తావించబడినది - ఒక కవి, ఒక రాజు, ఒక యిల్లాలు, ఒక చిత్రలేఖకుడు. వీరందరూ సమాజంలో ఒక గుర్తింపబడిన స్థానం కలిగిన వ్యక్తులు. ఈ పద్యంలో విశేషమేమిటంటే, వారి మరణాన్ని కవి ఆయా వ్యక్తుల గొప్పదనానికి ప్రతీకలైన వస్తువులు నశించిపోవడాన్ని వర్ణించడం ద్వారా చెప్పాడు. కమ్మని కలము నిప్పులలో కరిగిపోయింది. అధికారముద్రలు అంతరించాయి. నల్లపూసల చక్కదనం గంగలో కలిసిపోయింది. కుంచె నశించింది! అంటే ఆయా వ్యక్తులు సమాజానికి అందించిన సేవలు అంతరించిపోయాయని కవి వాపోతున్నట్టు ఉంది, పైన చెప్పుకున్నట్టుగా. ఒక సత్కవి మంచి కావ్యాలను సృష్టిస్తాడు. ఒక రాజన్యుడు చక్కని పాలన చేస్తాడు. ఒక యిల్లాలు ఇంటిని నేర్పుగా చక్కదిద్దుతుంది. ఒక చిత్రలేఖకుడు మంచి బొమ్మలెన్నిటినో గీస్తాడు. వారి మరణం వల్ల ఆయా మంచి పనులు వారి ద్వారా మరింక జరిగే అవకాశం ఉండదు. అంచేత ఇలాటి వ్యక్తుల మరణానికి సమాజం బాధపడుతుంది. ఒక మామూలు వ్యక్తి మరణిస్తే, అతని బంధువర్గంలో వాళ్ళు మాత్రమే బాధపడతారు. చావనేది ఎవరికైనా తప్పనిదే! ఇంతవరకూ ఆలోచనలన్నీ ఒక దారిలో సాగాయి.

కవుల కలాలు గాయకుల కమ్మని కంఠములీ శ్మశానపుం
గవనుల తొక్కిజూచెడి, యొకానొకనా డల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతి రంగమునం దిపుడెంతలేసి రే
ణువులయి మృత్తికన్ గలిసెనోగద కుమ్మరివావి సారెపై.

ఈ పద్యం చదివేసరికి బుద్ధి మరో దోవ దొక్కింది! కాళిదాసు భారవి శరీరాలు ఇంతలేసి రేణువులైతేనేమి అంతలేసి రేణువులైతేనేమి? అసలు వాళ్ళ శరీరాలగురించి ఆలోచించాల్సిన పనేమిటి? దివంగతులైన కవుల కలాలు గాయకుల కమ్మని కంఠాలు భౌతికంగా లేకపోవచ్చు గాక. వారు రచించిన గొప్ప కవిత్వమూ, పాడిన కమ్మని పాటలూ మనకు మిగిలి ఉన్నాయి కదా. కాళిదాస భారవుల కావ్యాలు ఇప్పటికీ నిలిచి ఉండడం వల్లనే కదా మనం వాళ్ళను తలచుకుంటున్నది. "సుకవి జీవించు ప్రజల నాలుకలపైని" అని యీ కవే (జాషువా) అన్నాడు. అంచేత కవులకు గాయకులకూ, ఏ కళాకారునికైనా, వారి కళ యీ లోకంలో ఉన్నంత కాలం వారి అస్తిత్వం ఆయా కళారూపాలలో బతికున్నట్టే కదా! అలాగే మంచి పరిపాలన చేసిన ఒక రాజు మరణించినా, గౌరవార్థంగా రాతి విగ్రహాలలోనే కాక, ప్రజల గుండెల్లోనూ జీవించే ఉంటాడు. అతని పరిపాలను గూర్చిన కథలు తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. అలాగే ఒక నాయకుడు కాని, ఒక శాస్త్రవేత్త కాని, ఒక వైద్యుడు, ఒక ఇంజినీరు - ఎవరైనా, సమాజానికి మేలు చేసిన, సమాజంపై తమదైన ప్రభావం చూపిన ప్రతి వ్యక్తీను. చావు వారి అస్తిత్వాన్ని చెరిపి వెయ్యలేదు! పైగా, వారి స్ఫూర్తితో మరింతమంది అదే దోవలో ప్రయాణించి, వారికి వారసులుగా ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారు కూడా. అంటే, ఎవరి జీవితమైతే కేవలం వ్యక్తిగతమైన బంధాలకు పరిమితం కాకుండా సమాజంతో ముడిపడిపోతుందో, అతని అస్తిత్వం కూడా సమాజంతో ముడిపడిపోతుంది. అపుడింక ప్రకృతిసిద్ధమైన, భౌతికమైన, వ్యక్తి మరణాన్ని గూర్చి చింతించాల్సిన అవసరమే లేదు!
ఈ ఆలోచనాసరళి, పూర్వకాలంలో మన దేశంలో ఉండేదేమోనని అనిపిస్తోంది. వ్యక్తినిష్ఠమైన దృష్టితో చూస్తే, వ్యక్తిగతమైన బతుకు, బంధాలు, జగత్తూ వట్టి మాయ అనీ, అనిత్యమనీ అనడం పెద్ద ట్రేష్ అనిపిస్తుంది. అదే, మనిషి అస్తిత్వాన్ని సమాజంతో ముడిపెట్టినప్పుడు అవి అర్థవంతంగానే అనిపిస్తాయి. పూర్వం కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఒక పెద్ద ఆలయం వంటి నిర్మాణాన్ని చేపట్టి కొనసాగించేవి. ఆ కుటుంబాల వారు వారి జీవితాన్ని దానికే అంకితం చేసేవారు. వాళ్ళు తమ అస్తిత్వాన్ని ఆ కట్టడంతో ముడిపెట్టేసి ఉంటారేమో! తాము భౌతికంగా లేకపోయినా, ఆ నిర్మాణం కొనసాగుతుందనే నిబ్బరం, వారికి మృత్యుభయం లేకుండా చేసేదేమో! ఏమో! ఇదంతా నా ఊహ!

కనుగొనగదోయి భావలోచనము దెఱచి మామకీన ప్రచండ తేజోమహత్త్వ
మీ విషానలకీలా ప్రభావ దగ్దమై సమస్తము నడగు సృష్ట్యాది నుండి!
ఈ మదీయ కరాళ జిహ్వికలయందు జీవసముదయమెపుడైన జిక్కవలయు
ఈ విషానల ధూమరేఖావృతమయి కుందు జీవాళికదియె వైకుంఠపథము

ఈ శ్రీశ్రీ పద్యాలు చదివేసరికి ఎందుకో ఒక్కసారిగా నాకు పోతనగారి ప్రహ్లాదచరిత్రంలోని యీ పద్యం గుర్తుకువచ్చింది!

హరి సర్వాకృతులం గలండనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడు లేడని సుతున్ దైత్యుండు దర్జింప, శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్

ఇదొక విచిత్రమైన పద్యం! ఎక్కడున్నాడురా నీ శ్రీహరి అని హుంకరించిన తండ్రితో, నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, భూమ్యాకాశాలలో ఉన్నాడు. దిక్కులన్నిటా ఉన్నాడు. ఇక్కడా అక్కడా అని వెతకడమెందుకు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అని చెపుతాడు ప్రహ్లాదుడు. ఆలా ఉన్నాడున్నాడని ప్రహ్లాదుడంటూ ఉంటే, లేడు లేడని హిరణ్యకశిపుడు అదిలిస్తూ ఉంటే, విష్ణువు నరసింహాకృతి ధరించి, చరాచర జగత్తంతటా ఉద్దండ ప్రభావంతో కాచుకుని కూచున్నాడట. అంటే హిరణ్యకశిపుడు ఎక్కడ చూపించమంటాడో, ఆ అడిగిన ఉత్తరక్షణంలో నరసింహాకృతిలో బయటపడాలి కదా అని అలా ఉన్నాడు కాబోలు! - ఇది మామూలుగా అనుకొనే విషయం. కాని యీ సందర్భంలో నాకు మరొక చిత్రమైన విషయం స్ఫురించింది. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, విష్ణువు హిరణ్యకశిపుని దృష్టిలో మృత్యు స్వరూపం! అసలు విష్ణువు గూర్చి హిరణ్యకశిపునికి తెలిసిందే తన తమ్ముని మరణంతో. తన తమ్ముని మరణానికి కారణమైన వాడు విష్ణువు. ఆ విష్ణువుకోసమే లోకమంతా గాలిస్తూ ఉంటాడు కాని ఎక్కడా కనిపించడు! ఎంతవెతికితే నేమిటి, మృత్యువు కనిపిస్తుందా! ఆ మృత్యువుని జయించాలనే, ఘోరమైన తపస్సు చేస్తాడు. తన బుద్ధిబలంతో మృత్యువుని జయించగలననుకొని చాలా తెలివిగా వరాలను కోరతాడు, వాటిని పొందుతాడు. త్రిలోకాధిపత్యం సంపాదిస్తాడు. అయితేనేం! అతని అంతరాత్మలో విష్ణువుపై, అంటే మృత్యువుపై దృష్టి మరలదు. అతని అన్వేషణ ఆగదు సరికదా, తన ఆత్మజుని రూపంలో మరింత ప్రజ్వరిల్లుతుంది. విష్ణువు సర్వవ్యాపకత గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి కొడుకు ఎంత చెప్పినా, దాన్ని చెవినబెట్టడు. అతని దృష్టిలో విష్ణువు (అంటే మృత్యువు) తన దరికి రాలేడు! ఈ ఆలోచనలతో మళ్ళీ యీ పద్యం చదివితే అందులో కనిపించేదేమిటి? హిరణ్యకశిపుని మృత్యువు నరసింహాకృతిలో ఉంది. అది ఇక్కడా అక్కడా అని కాదు అంతటా ఉంది. అది ఎక్కడనుండి బయల్పడుతుంది అనేది హిర్ణయకశిపుని చేతిలోనే ఉంది! ఒకరకంగా ఆ నరసింహాకృతికూడా, తన వరాల ద్వారా స్వయంగా హిరణ్యకశిపుడే నిర్ణయించాడు.

ఆలోచిస్తే, ఇది మనుషులందరికీ వర్తించే విషయమే. మనిషి మృత్యువునుండి ఎంత దూరం పారిపోవాలనుకున్నా అది అతడిని వెన్నంటే వస్తుంది. తన బుద్ధి చాతుర్యంతో ఎలా తప్పించుకోవాలని చూసినా, రకరకాల రూపాలలో, విచిత్రమైన ఆకృతులలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక్కడా అక్కడా అని కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఒకో వ్యక్తికి ఒకో రూపంలో వస్తుంది. అది ఎలా అన్నది కూడా ఆ వ్యక్తి ద్వారానే, తనకు తెలియకుండానే నిర్దేశింపబడుతుంది కూడా! మృత్యువుని వ్యక్తిగతమైన దృష్టితో చూసినంత కాలం అది తన అస్తిత్వాన్ని చెరిపేసే ఒక మహమ్మారిలా ఆ వ్యక్తిని భయపెడుతునే ఉంటుంది. తన అస్తిత్వాన్ని వేరే దానితో ముడిపెట్టినప్పుడు ఆ భయం వీడిపోతుంది. ప్రకృతితో అస్తిత్వాన్ని ముడిపెడితే, కృశించిన శరీరాన్ని నశింపజేసి నూతన తనువుతో, చైతన్యంతో ప్రకృతి తనని తాను నిరంతరం పునరుజ్జీవింప చేసుకొనే ప్రక్రియగా అది కనిపిస్తుంది.  అప్పుడు, ఒక్క హిరణ్యకశిపునికే కాదు, శ్రీశ్రీ చెప్పినట్టు, మృత్యువు సర్వ జీవనాళికి వైకుంఠపథమే!

పూర్తిగా చదవండి...