తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, September 10, 2012

మృత్యుశోధన - శ్మశానం నుండి వైకుంఠం దాకా


ఈ మధ్య వరసగా మరణవార్తలు వినవలసి వచ్చింది. జువ్వాడి గౌతమరావుగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, నిన్నటికి నిన్న కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు. యాదృచ్ఛికంగా నిన్ననే కలంకలలు బ్లాగులో యీ టపా చదివాను - వేదన నుంచి శోధన లోకి (జాషువా, శ్రీశ్రీ ఊతగా). అందులో పద్యాలు చదువుతూంటే నా మనసుకూడా ఏవేవో ఆలోచనల్లోకి జారిపోయింది.

ఎవరైనా ప్రముఖులు కాలధర్మం చేస్తే సంతాపం ప్రకటిస్తాం. ఎవరికోసమా సంతాపం? వారి బంధువర్గానికా? వారెవరూ మనకి తెలిసుండకపోవచ్చు. వారి గురించి మనం సంతాపం ప్రకటించడం దేనికి? ఆ చనిపోయిన వాళ్ళు మన సమాజానికి ఏదో మేలు చేసినవాళ్ళయితే వాళ్ళనుండి యీ సమాజం మరింత మంచిని పొందే అవకాశం పోగొట్టుకుందని సమాజమ్మీద సంతాపమా అది? ఏమో! ఉదాహరణకు, భద్రిరాజుగారు భాషాశాస్త్రంలో, ప్రత్యేకించి ద్రవిడ, తెలుగు భాషల గురించి విశేషమైన, మౌలికమైన పరిశోధన చేసారు. తుదిశ్వాస విడిచేవరకూ దానికి సంబంధించి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అవన్నీ పూర్తయ్యేది ఎలాగ? రోహిణీప్రసాద్‌గారు, సంగీతమ్మీద, విజ్ఞానశాస్త్ర విషయాల మీదా ఎన్నెన్నో చక్కని వ్యాసాలు వ్రాసారు. కొద్ది కాలం కిందటి వరకూ వ్రాస్తూనే ఉన్నారు. అతనికి తెలుగుభాషంటే వల్లమాలిన అభిమానం. ఎన్నో అనువాదాలు కూడా చేసారు. వారు గతించడం వల్ల మరెన్నో మంచి వ్యాసాలను తెలుగుపాఠకులు కోల్పోయారు. అందుకు బాధగా ఉంది. అంటే ఇందులో ఎంతోకొంత స్వార్థం ఉందన్న మాట!

మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.

ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే  ఉంటాయి కదా. అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గురించి ఊహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. చావులో కూడా తన అస్తిత్వం నశించే స్థితిని మనిషి ఊహించలేడు! అందుకే "తన" శరీరం కాలుతూంటే, "తన" బంధువులెవరూ "తన" వెంట రారని అనుకోడం. ఇదొక రకంగా "అసంబద్ధమైన" (contradictory) ఊహ. ఒక వ్యక్తి ఉన్నంత వరకూ, ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వ ప్రపంచమూ నిత్యమైనదే, సత్యమైనదే. అందులో ఉండే వస్తువులు, మనుషులూ భౌతికంగా నిత్యం కాకపోవచ్చు. కాని జగమే అనిత్యం, అసత్యం కాకుండా పోవు!

ఇచ్చోట నే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!

ఈ పద్యంలో వ్యక్తిదృష్టికన్నా కూడా ఒక సామాజికదృష్టి కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తావించబడినది - ఒక కవి, ఒక రాజు, ఒక యిల్లాలు, ఒక చిత్రలేఖకుడు. వీరందరూ సమాజంలో ఒక గుర్తింపబడిన స్థానం కలిగిన వ్యక్తులు. ఈ పద్యంలో విశేషమేమిటంటే, వారి మరణాన్ని కవి ఆయా వ్యక్తుల గొప్పదనానికి ప్రతీకలైన వస్తువులు నశించిపోవడాన్ని వర్ణించడం ద్వారా చెప్పాడు. కమ్మని కలము నిప్పులలో కరిగిపోయింది. అధికారముద్రలు అంతరించాయి. నల్లపూసల చక్కదనం గంగలో కలిసిపోయింది. కుంచె నశించింది! అంటే ఆయా వ్యక్తులు సమాజానికి అందించిన సేవలు అంతరించిపోయాయని కవి వాపోతున్నట్టు ఉంది, పైన చెప్పుకున్నట్టుగా. ఒక సత్కవి మంచి కావ్యాలను సృష్టిస్తాడు. ఒక రాజన్యుడు చక్కని పాలన చేస్తాడు. ఒక యిల్లాలు ఇంటిని నేర్పుగా చక్కదిద్దుతుంది. ఒక చిత్రలేఖకుడు మంచి బొమ్మలెన్నిటినో గీస్తాడు. వారి మరణం వల్ల ఆయా మంచి పనులు వారి ద్వారా మరింక జరిగే అవకాశం ఉండదు. అంచేత ఇలాటి వ్యక్తుల మరణానికి సమాజం బాధపడుతుంది. ఒక మామూలు వ్యక్తి మరణిస్తే, అతని బంధువర్గంలో వాళ్ళు మాత్రమే బాధపడతారు. చావనేది ఎవరికైనా తప్పనిదే! ఇంతవరకూ ఆలోచనలన్నీ ఒక దారిలో సాగాయి.

కవుల కలాలు గాయకుల కమ్మని కంఠములీ శ్మశానపుం
గవనుల తొక్కిజూచెడి, యొకానొకనా డల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతి రంగమునం దిపుడెంతలేసి రే
ణువులయి మృత్తికన్ గలిసెనోగద కుమ్మరివావి సారెపై.

ఈ పద్యం చదివేసరికి బుద్ధి మరో దోవ దొక్కింది! కాళిదాసు భారవి శరీరాలు ఇంతలేసి రేణువులైతేనేమి అంతలేసి రేణువులైతేనేమి? అసలు వాళ్ళ శరీరాలగురించి ఆలోచించాల్సిన పనేమిటి? దివంగతులైన కవుల కలాలు గాయకుల కమ్మని కంఠాలు భౌతికంగా లేకపోవచ్చు గాక. వారు రచించిన గొప్ప కవిత్వమూ, పాడిన కమ్మని పాటలూ మనకు మిగిలి ఉన్నాయి కదా. కాళిదాస భారవుల కావ్యాలు ఇప్పటికీ నిలిచి ఉండడం వల్లనే కదా మనం వాళ్ళను తలచుకుంటున్నది. "సుకవి జీవించు ప్రజల నాలుకలపైని" అని యీ కవే (జాషువా) అన్నాడు. అంచేత కవులకు గాయకులకూ, ఏ కళాకారునికైనా, వారి కళ యీ లోకంలో ఉన్నంత కాలం వారి అస్తిత్వం ఆయా కళారూపాలలో బతికున్నట్టే కదా! అలాగే మంచి పరిపాలన చేసిన ఒక రాజు మరణించినా, గౌరవార్థంగా రాతి విగ్రహాలలోనే కాక, ప్రజల గుండెల్లోనూ జీవించే ఉంటాడు. అతని పరిపాలను గూర్చిన కథలు తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. అలాగే ఒక నాయకుడు కాని, ఒక శాస్త్రవేత్త కాని, ఒక వైద్యుడు, ఒక ఇంజినీరు - ఎవరైనా, సమాజానికి మేలు చేసిన, సమాజంపై తమదైన ప్రభావం చూపిన ప్రతి వ్యక్తీను. చావు వారి అస్తిత్వాన్ని చెరిపి వెయ్యలేదు! పైగా, వారి స్ఫూర్తితో మరింతమంది అదే దోవలో ప్రయాణించి, వారికి వారసులుగా ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారు కూడా. అంటే, ఎవరి జీవితమైతే కేవలం వ్యక్తిగతమైన బంధాలకు పరిమితం కాకుండా సమాజంతో ముడిపడిపోతుందో, అతని అస్తిత్వం కూడా సమాజంతో ముడిపడిపోతుంది. అపుడింక ప్రకృతిసిద్ధమైన, భౌతికమైన, వ్యక్తి మరణాన్ని గూర్చి చింతించాల్సిన అవసరమే లేదు!
ఈ ఆలోచనాసరళి, పూర్వకాలంలో మన దేశంలో ఉండేదేమోనని అనిపిస్తోంది. వ్యక్తినిష్ఠమైన దృష్టితో చూస్తే, వ్యక్తిగతమైన బతుకు, బంధాలు, జగత్తూ వట్టి మాయ అనీ, అనిత్యమనీ అనడం పెద్ద ట్రేష్ అనిపిస్తుంది. అదే, మనిషి అస్తిత్వాన్ని సమాజంతో ముడిపెట్టినప్పుడు అవి అర్థవంతంగానే అనిపిస్తాయి. పూర్వం కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఒక పెద్ద ఆలయం వంటి నిర్మాణాన్ని చేపట్టి కొనసాగించేవి. ఆ కుటుంబాల వారు వారి జీవితాన్ని దానికే అంకితం చేసేవారు. వాళ్ళు తమ అస్తిత్వాన్ని ఆ కట్టడంతో ముడిపెట్టేసి ఉంటారేమో! తాము భౌతికంగా లేకపోయినా, ఆ నిర్మాణం కొనసాగుతుందనే నిబ్బరం, వారికి మృత్యుభయం లేకుండా చేసేదేమో! ఏమో! ఇదంతా నా ఊహ!

కనుగొనగదోయి భావలోచనము దెఱచి మామకీన ప్రచండ తేజోమహత్త్వ
మీ విషానలకీలా ప్రభావ దగ్దమై సమస్తము నడగు సృష్ట్యాది నుండి!
ఈ మదీయ కరాళ జిహ్వికలయందు జీవసముదయమెపుడైన జిక్కవలయు
ఈ విషానల ధూమరేఖావృతమయి కుందు జీవాళికదియె వైకుంఠపథము

ఈ శ్రీశ్రీ పద్యాలు చదివేసరికి ఎందుకో ఒక్కసారిగా నాకు పోతనగారి ప్రహ్లాదచరిత్రంలోని యీ పద్యం గుర్తుకువచ్చింది!

హరి సర్వాకృతులం గలండనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడు లేడని సుతున్ దైత్యుండు దర్జింప, శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్

ఇదొక విచిత్రమైన పద్యం! ఎక్కడున్నాడురా నీ శ్రీహరి అని హుంకరించిన తండ్రితో, నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, భూమ్యాకాశాలలో ఉన్నాడు. దిక్కులన్నిటా ఉన్నాడు. ఇక్కడా అక్కడా అని వెతకడమెందుకు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అని చెపుతాడు ప్రహ్లాదుడు. ఆలా ఉన్నాడున్నాడని ప్రహ్లాదుడంటూ ఉంటే, లేడు లేడని హిరణ్యకశిపుడు అదిలిస్తూ ఉంటే, విష్ణువు నరసింహాకృతి ధరించి, చరాచర జగత్తంతటా ఉద్దండ ప్రభావంతో కాచుకుని కూచున్నాడట. అంటే హిరణ్యకశిపుడు ఎక్కడ చూపించమంటాడో, ఆ అడిగిన ఉత్తరక్షణంలో నరసింహాకృతిలో బయటపడాలి కదా అని అలా ఉన్నాడు కాబోలు! - ఇది మామూలుగా అనుకొనే విషయం. కాని యీ సందర్భంలో నాకు మరొక చిత్రమైన విషయం స్ఫురించింది. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, విష్ణువు హిరణ్యకశిపుని దృష్టిలో మృత్యు స్వరూపం! అసలు విష్ణువు గూర్చి హిరణ్యకశిపునికి తెలిసిందే తన తమ్ముని మరణంతో. తన తమ్ముని మరణానికి కారణమైన వాడు విష్ణువు. ఆ విష్ణువుకోసమే లోకమంతా గాలిస్తూ ఉంటాడు కాని ఎక్కడా కనిపించడు! ఎంతవెతికితే నేమిటి, మృత్యువు కనిపిస్తుందా! ఆ మృత్యువుని జయించాలనే, ఘోరమైన తపస్సు చేస్తాడు. తన బుద్ధిబలంతో మృత్యువుని జయించగలననుకొని చాలా తెలివిగా వరాలను కోరతాడు, వాటిని పొందుతాడు. త్రిలోకాధిపత్యం సంపాదిస్తాడు. అయితేనేం! అతని అంతరాత్మలో విష్ణువుపై, అంటే మృత్యువుపై దృష్టి మరలదు. అతని అన్వేషణ ఆగదు సరికదా, తన ఆత్మజుని రూపంలో మరింత ప్రజ్వరిల్లుతుంది. విష్ణువు సర్వవ్యాపకత గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి కొడుకు ఎంత చెప్పినా, దాన్ని చెవినబెట్టడు. అతని దృష్టిలో విష్ణువు (అంటే మృత్యువు) తన దరికి రాలేడు! ఈ ఆలోచనలతో మళ్ళీ యీ పద్యం చదివితే అందులో కనిపించేదేమిటి? హిరణ్యకశిపుని మృత్యువు నరసింహాకృతిలో ఉంది. అది ఇక్కడా అక్కడా అని కాదు అంతటా ఉంది. అది ఎక్కడనుండి బయల్పడుతుంది అనేది హిర్ణయకశిపుని చేతిలోనే ఉంది! ఒకరకంగా ఆ నరసింహాకృతికూడా, తన వరాల ద్వారా స్వయంగా హిరణ్యకశిపుడే నిర్ణయించాడు.

ఆలోచిస్తే, ఇది మనుషులందరికీ వర్తించే విషయమే. మనిషి మృత్యువునుండి ఎంత దూరం పారిపోవాలనుకున్నా అది అతడిని వెన్నంటే వస్తుంది. తన బుద్ధి చాతుర్యంతో ఎలా తప్పించుకోవాలని చూసినా, రకరకాల రూపాలలో, విచిత్రమైన ఆకృతులలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక్కడా అక్కడా అని కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఒకో వ్యక్తికి ఒకో రూపంలో వస్తుంది. అది ఎలా అన్నది కూడా ఆ వ్యక్తి ద్వారానే, తనకు తెలియకుండానే నిర్దేశింపబడుతుంది కూడా! మృత్యువుని వ్యక్తిగతమైన దృష్టితో చూసినంత కాలం అది తన అస్తిత్వాన్ని చెరిపేసే ఒక మహమ్మారిలా ఆ వ్యక్తిని భయపెడుతునే ఉంటుంది. తన అస్తిత్వాన్ని వేరే దానితో ముడిపెట్టినప్పుడు ఆ భయం వీడిపోతుంది. ప్రకృతితో అస్తిత్వాన్ని ముడిపెడితే, కృశించిన శరీరాన్ని నశింపజేసి నూతన తనువుతో, చైతన్యంతో ప్రకృతి తనని తాను నిరంతరం పునరుజ్జీవింప చేసుకొనే ప్రక్రియగా అది కనిపిస్తుంది.  అప్పుడు, ఒక్క హిరణ్యకశిపునికే కాదు, శ్రీశ్రీ చెప్పినట్టు, మృత్యువు సర్వ జీవనాళికి వైకుంఠపథమే!

7 comments:

  1. Amazing truth....

    thanks!!

    But, indeed it is shocking to know about Rohiniprasad garu.

    ReplyDelete
  2. >> హిరణ్యకశిపుని మృత్యువు నరసింహాకృతిలో ఉంది. అది ఇక్కడా అక్కడా అని కాదు అంతటా ఉంది. అది ఎక్కడనుండి బయల్పడుతుంది అనేది హిర్ణయకశిపుని చేతిలోనే ఉంది!

    అవునాండీ? ఇది మీ సొంత థీరీయా?

    మరి హిరణ్యకశిపుడు మొదట్లో వైకుంఠానికి విష్ణువుని గెలవడానికి వెళ్ళినప్పుడు, విష్ణువు ఎందుక్కనబడలేదో? అదే నరసింహావతారంతో అప్పుడే చంపేసి ఉంటే బాగుండేది కదా? ఎందుకంతకాలం ఉపేక్షించేడు? ఈ సందర్భం లో భాగవతం లో అంటారు... విష్ణువు ఎందుక్కనబడలేదంటే, విష్ణువు హిరణ్యకశిపుడి మనసులోనే ఉండడంవల్ల. హ్మ్.. సరే మనసులోనో గుండెల్లోనో ఉన్నాడనుకోండీ, మరి చివర్లో నరిశింహవతారం తో బయటకి ఎలాగొచ్చేడు? ముందే వచ్చేసి చంపేసి ఉంటే బోల్డు టైము, ప్రహ్లాదుడు పుట్టడం అవన్నీ ఎవాయిడ్ చెయ్యొచ్చుకదా? అబ్బే అలాక్కుదర్దు. ఈ సృష్టి ఆయనది, ఆయనిష్టం వచ్చినట్టు ఆయనచేస్తాడు. మనకున్న ఒక్క ఛాయిస్ ఏమిటంటే, నవ్వుతూ అనుభవించడం. లేకపోటే చచ్చినట్టు ఏడుస్తూ అనుభవించాలి కనుక ఎలాగైనా.

    నే చెప్తాను వినండి. విష్ణువు ఎవర్నేనా చంపాలంటే, వాడి కర్మ పరిపక్వం కావాలి. తనచేతికి మట్టి (కర్మ) అంటుకోకూడదు. దానికోసం రకరకాల సాఫ్ట్ వేర్ రన్ చేసి, లూప్ హోల్స్ అన్నీ పట్టుకుని ఏడిపించి మరీ చంపుతాడు ఆయన. బలి ని పాతాళం లోకి తొక్కేసినప్పుడు కూడా ఇదే సంగతి. తను తొక్కేసాడనుకోండి, ఆ కర్మ ఇంకో జన్మ ఎత్తి అనుభవించాలి. అంచేత శుక్రాచార్యుడిచేత శాపం పెట్టిస్తాడు - గురువు ఆజ్ఞ ధిక్కరించినందుకు, సర్వనాశనం అవుతావు అని. ఓహో, ఇప్పుడు మన బాసు గారికి పనేమీ లేదు. అబ్బే నేను బలికి తన గురువుగారిచ్చిన శాపాన్ని చేసి చూపించానంతే, నాదేం లేదు అనేసి ఆయన్ని పాతాళం లోకి తొక్కేసి, చలో వాపస్ టు వైకుంఠం. మళ్ళీ ఇంకో రాచ్చసుడూ, వాణ్ణి చంపడానికి వెతికే లూప్ హోల్స్ కోసం ఇంకో సాఫ్ట్ వేర్!!

    ఇప్పుడు అర్ధం అయ్యిందా గురూ గారూ?

    (పనిలో పని, మీ పోస్ట్ మాత్రం అదుర్స్, ఎప్పటిలాగానే)

    ReplyDelete
  3. ఎవరి జీవితమైతే కేవలం వ్యక్తిగతమైన బంధాలకు పరిమితం కాకుండా సమాజంతో ముడిపడిపోతుందో, అతని అస్తిత్వం కూడా సమాజంతో ముడిపడిపోతుంది.

    You came dangerously close to Hegel, BhKR gArU :-)

    regards
    Madhav

    ReplyDelete
  4. అనామకులుగారు,

    నా పోస్టు నచ్చినందుకు సంతోషం.

    >>అవునాండీ? ఇది మీ సొంత థీరీయా?
    ఇందులో పెద్ద థియరీ ఏముందండీ? ఉదహరించిన పద్యంలో ఉన్నదే కదా. హిరణ్యకశిపుడు ఎక్కడ తనని చూపించమంటే అక్కడ ప్రత్యక్షమవ్వడానికి సిద్ధంగా అంతటా ఆ ఆకృతిలో నిండి ఉన్నాడని కదా పద్యం చెపుతోంది. అంటే హిరణ్యకశిపుడు చూపించిన చోటునుండే కదా నరసింహుడు అవతరించేది.

    >>మరి హిరణ్యకశిపుడు మొదట్లో వైకుంఠానికి విష్ణువుని గెలవడానికి వెళ్ళినప్పుడు, విష్ణువు ఎందుక్కనబడలేదో?
    హిరణ్యకశిపుడు వైకుంఠానికి వెళ్ళినట్టుగా ఎక్కడా భాగవతంలో లేదు.

    >>అదే నరసింహావతారంతో అప్పుడే చంపేసి ఉంటే బాగుండేది కదా? ఎందుకంతకాలం ఉపేక్షించేడు? చివర్లో నరిశింహవతారం తో బయటకి ఎలాగొచ్చేడు? ముందే వచ్చేసి చంపేసి ఉంటే బోల్డు టైము, ప్రహ్లాదుడు పుట్టడం అవన్నీ ఎవాయిడ్ చెయ్యొచ్చుకదా?

    ఈ ప్రశ్నలు చదివినప్పుడు నాకో సంగతి గుర్తుకొచ్చింది. మా అమ్మాయి కొంచెం చిన్నప్పుడు, అప్పుడప్పుడే చావుపుట్టుకల గురించి తెలుస్తున్న లేత వయసన్న మాట, ఒక రోజు హఠాత్తుగా ఒక ప్రశ్న సంధించింది. నాన్నా, పుట్టే వాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు ఎలాగూ చనిపోతారు కదా, ఇంతోటిదానికీ మరి పుట్టడం ఎందుకు అని. నాకు నోట మాట రాలేదు. ఏం సమాధానం చెపుతాను? మీ ప్రశ్నలు చదివితే ఆ ప్రశ్నే గుర్తుకొచ్చింది. ఈ ప్రశ్నలకూ కచ్చితమైన సమాధానం ఇదీ అని ఏమీ లేదు, నాకు తెలిసి. మనిషికి యింకా పూర్తిగా అర్థం కాని అనేక విషయాల్లో చావుపుటుకలు కూడా ఉన్నాయి. పుట్టుక గురించీ, చావు గురించీ కూడా చాలా విషయాలే తెలుసుకున్నాడు మనిషి, విజ్ఞానశాస్త్రం ద్వారా. కానీ సమాధానం లేని ప్రశ్నలు (బహుశా కొన్ని సైన్సు పరిధిలోకి రానివి) అనేకం మిగిలే ఉన్నాయి. ఎన్ని మందులు కనిపెట్టినా, మనిషి చావును తప్పించడం కాని, ఇదమిద్ధంగా నిర్ణయించడం కాని ఇంకా మనిషి చేతుల్లో లేని పని. పుట్టుక విషయంలో మరికాస్త ఎక్కువ అధికారాన్ని సంపాదించాడు. అయితే, అసలు వీటి అవసరం, పరమోద్దేశం ఏవిటన్న ప్రశ్నలకు సైన్సు సమాధానం చెప్పదు. అంచేత ఎవరికి తోచిన సమాధానాలు వాళ్ళు ఇచ్చుకోడమే. అలా ఇచ్చుకున్న సమాధానాలలో కర్మ సిద్దాంతం ఒకటి. ప్రతి దానికీ కార్యకారణ సంబంధం వెతికే బుద్ధి మనిషి బతుక్కి కూడా ఏదో కార్యకారణ సంబంధాన్ని ఊహించే క్రమంలోనే ఆ సిద్ధాంతం ఏర్పడింది. సరే, అసలు బతుక్కి అర్థమే లేదని కొట్టి పారేసేవాళ్ళది, అదొక సిద్ధాంతం.

    >>నే చెప్తాను వినండి. విష్ణువు ఎవర్నేనా చంపాలంటే, వాడి కర్మ పరిపక్వం కావాలి. తనచేతికి మట్టి (కర్మ) అంటుకోకూడదు. దానికోసం రకరకాల సాఫ్ట్ వేర్ రన్ చేసి, లూప్ హోల్స్ అన్నీ పట్టుకుని ఏడిపించి మరీ చంపుతాడు ఆయన.

    మీరు విష్ణువుని మనలాగే ఒక మనిషిగా భావిస్తూ ఈ వ్యాఖ్య చేసారు. కాని అతను మనలాంటి మనిషే అయితే, అతనికా సామర్థ్యం ఎలా ఉంటుంది? తన చేతికి మట్టి అంటితేనేం అంటకపోతేనేం అసలు? నేను పైన చెప్పినట్టుగా, మృత్యు విషయంలో మనిషికి అంతుపట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోనే దిశలో వచ్చిన ఒక సిద్ధాంతమే ఈ కర్మ పరిపక్వం కావడం వగైరా. ఆ సిద్ధాంతంలో విష్ణువు కాని, మరే దేవుడు కాని మనిషి చావుపుట్టుకలకూ, మనిషి జీవితానికీ కారకులు కారు. ఒక్క కర్మ మాత్రమే అన్నిటికీ కారణం. ఆ సిద్ధాంతాన్ని విష్ణువుకి ముడిపెట్టి, కర్మ పేరుతో విష్ణువు ఒకడిని నాశనం చేస్తాడనో, చంపుతాడనో చెప్పడం తప్పు. మీరు రెండు వేర్వేరు సిద్ధాంతాల మధ్య తికమక పడుతున్నారు.

    >>బలి ని పాతాళం లోకి తొక్కేసినప్పుడు కూడా ఇదే సంగతి.
    బలిని పాతాళానికి "తొక్కెయ్యడం" గురించి సరిగ్గా తెలియాలంటే, భాగవతం చదవాలి. ఇంతకుముందొక టపాలో దాన్ని గురించి చెప్పాను. ఇక్కడ చూడండి:
    http://telugupadyam.blogspot.in/2010/09/blog-post_23.html

    మాధవ్‌గారు,

    ఇప్పుడు మళ్ళీ హెగెల్‌ని తిరగేసే ఓపికలేదు కాని, ఏ రకంగా వచ్చానో మీరే చెప్పి పుణ్యం కట్టుకుందురూ. :-)

    ReplyDelete
  5. అంత పెద్ద విషయం ఏమీ కాదు లేండి. నేనీమధ్యే From Socrates to Sartre పుస్తకం T. Z. Lavine రాసినది, తీసి చదవడం మొదలు పెట్టి హెగెల్ దాకా రావడమూ, ఇంతలో మీ పోస్ట్ చూడడమూ జరిగింది. హెగెల్ ప్రకారం మనిషికి వ్యక్తిగతంగా ఏ నైతికత అంటూ విడిగా ఉండదు. అతని సమాజం నిర్ణయించిన నైతిక విలువలే అతనివి కూడా అని అంటూ ....The moral center of your life as an individual becomes, then, this larger life of the spirit of the whole people. the spirit of the unfolding of the Absolute.. అని అంటాడు. మీరు రాసింది చదివితే అదే గుర్తుకొచ్చింది. అంతే.

    మాధవ్

    ReplyDelete
  6. Forgive me for writing in English. Saw your post late.

    Yes, its so amazing that the so called "truths" change with "frames of reference". As an aetheist, I have this idea that religion, morality etc are made up as the glue to keep us social animals social :)

    Digression apart, the quintessential "existentialities" lead to these kind of theorisations is what I feel sir. Only because I am able to understand that there is a limit upto which goldfish in a bowl of water can observe and hence there might be a level of observation upto which only I can observe and so there MUST be some thing beyond this kind of logic makes us have this kind of "rationalisations" to maintain overall stability of social structure. If I was just the solitary organism in this whole cosmos and was miraculously able to sustain, will I have these thoughts? I feel not. For there will be no other source of information to frighten me with the foreknowledge of death and hence there will be no need for me to find justifications for my existance, there will be no reason for me to justify the thousands of billions of seconds of truth which apparently is nullified by another second of truth when something called life leaves me........so these things happen only because of society or others.

    Otherwise, why is it that even from a overall societie's point of view should the truth change? That life, though short, is not real? When we go to the ONE truth which does not change i.e death makes us part with all what we are, we search for some kind of justifications to continue to live inspite of that ultimate hurtful truth. if the utlimate truth is imprinted in our minds all the time, yes, we will not have all the atrocities etc BUT, will we have life at all? I feel not. Will there be a society at all? I feel not. Who will have the motivation to do anything with the ultimate truth in consciosu mind at all times that whatever we do, we will not have it for eternity? There shall be a standstill if that happens except for the basicest needs or the opposite may happen...that we may have extreme atrocities than now because of conscious acknowledgement that we can never have this world forever so lets enjoy" it as much as we can now...an extreme form of oshoism I guess.

    So, I feel that whatever perspective we conjure up, we do that only to consciosuly defy the "ultimate truth" so that "life" as we know, goes on........I do not use conjure up, rationalisation etc in derogatory or negative connotations. These are labels to processes thats all. In this way, even SriSri's description of death as a "vaikunTha patham" is only a sweet coating for the bitter pill, I feel. as are the concepts like the rebirths, like attaching oneself to the nature and hence being in an endless cycle of recyling etc are..............sweet coatings for a bitter pill that we all have to swallow.


    I do understand that all these thoughts are very jumbled and confusing, even to me they appear so.....just my two pence. But, just writing the above I have a new doubt now......how is that just one second of life (death) is said to be the truth and not the other of the billions of seconds of life (life)? If life is an illusion or temporary, then death is even more temporary is it not sir? its only our attachment to this "life" and so called fear that we will loose it.......its only the "fear" which makes us make that one second of full stop the truth and not all the other billion seconds of commas that we have.....in effect its only our greed rather than anything else which makes the death more important truth than life. Is it not so?

    ReplyDelete
  7. భావకుడన్ గారు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    >>so there MUST be some thing beyond this kind of logic makes us have this kind of "rationalisations" to maintain overall stability of social structure... so these things happen only because of society or others.

    Yes, it could be that. But this thought of yours and the reasoning that you gave itself could be a "rationalization" of something that is beyond our experience! This could be also true with concepts of rebirths and Atma etc. They could just be some sort of rationalizations or sweet coatings to get along with the life as you mentioned. But this kind of thinking (that is there in the previous statement) itself could be a rationalization that our current human mind gives to those that are beyond its logic and experience.

    >> If life is an illusion or temporary, then death is even more temporary is it not sir? its only our attachment to this "life" and so called fear that we will loose it.

    Here I have to switch to Telugu in order to explain my thoughts.
    జగత్తు లేదా జీవితం మిథ్య వేరేదో సత్యం అనే పదాలలో అర్థం అది "భ్రాంతి"/"అబద్ధం" అని మామూలుగా మనం ఇప్పుడనుకొనే అర్థాలలో పూర్వ తత్త్వవేత్తలు వాడలేదు. సత్యం అనే దానికి నిర్వచనం నాకు అర్థమైనంతవరకూ - నిత్యమూ, శాశ్వతమూ అని. ఈ నిర్వచనం తీసుకున్నప్పుడు, మనిషి బ్రతుకులో నిత్యమైనదీ (ప్రతి మనిషికి తప్పకుండా ప్రాప్తించేది), శాశ్వతమైనదీ (ఒక మార్పులేని దశ) ఏమైనా ఉన్నదా? అని ఆలోచించినప్పుడు, మరణం ఒక్కటే కనిపిస్తోంది. మరణమంటే భయం కొన్ని రకాల ఆలోచనలకు కారణం కావచ్చు కాని, ఈ మౌలికమైన తత్త్వంలో భయానికి చోటులేదని నాకనిపిస్తోంది.
    ఏది ఏమైనప్పటికీ, మరణం గురించిన జ్ఞానం/ఎరుక మనిషికి ఉంది. దానినుండి ఏ మనిషీ తప్పించుకోలేడు (ఆ ఎరుక నుండి). దానికతడు ఎలా స్పందిస్తాడన్నది వ్యక్తీకీ వ్యక్తికీ తేడా ఉంటుంది.

    ReplyDelete