తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, January 24, 2009

కేశంతో క్లేశం!


ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోయిన కాలంలో, మనిషికి జుత్తు తెల్లబడడం అన్నది ఒక సమస్యగా ఉండేది కాదనుకుంటాను. ముసలితనంతో బాటే, ఆ ముసలితనానికి సూచనగా మాత్రమే రావడమూ, పెద్దరికానికి గుర్తుగా గౌరవంగా ఉండడమూ అందుకు కారణం కావచ్చు. అందుకే "తల పండడం" అంటే అనుభవంలోనో జ్ఞానంలోనో పరిపక్వత కలగడం అనే సదర్థంలో వాడేవారు. ఈ కాలంలో పండిన తలబట్టి జ్ఞానాన్ని కాదు కదా కనీసం వయసునైనా అంచనా వెయ్యడవంతటి బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు!
పండితే పండింది కాని, తెల్లని కాంతులీనుతూ నిగనిగలాడే జుత్తు మహా అందంగా ఉంటుంది. దాన్ని మన కవులు మరింత అందంగా వర్ణిస్తూ ఉంటారు.

తెల్లగా పండిన శబరి జుత్తుని విశ్వనాథ ముగ్గుబుట్టతో పోల్చారు. రాముడు శబరి ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి, కుశల ప్రశ్నలు వేస్తూ, "అవ్వ! నీ తలంతా ముగ్గుబుట్టలా అయ్యిందేవిటీ?" అంటాడు.
దానికి శబరి, "ప్రభువ! నీ ఆత్మ వాకిట రంగవల్లి పెట్టడానికే ఇంతగా పండింది" అని జవాబిస్తుంది!
సగం సగం పండిన జుత్తుది మరో సొగసు. వ్యాసుడు కాశీమీద కోపంతో తన భిక్ష పాత్రని విసిరికొట్టినప్పుడు, అతనికి గడ్డిపెట్టడానికి పార్వతీదేవి ఒక ముత్తైదువు రూపంలో వస్తుంది. ఆ వచ్చే దేవిని శ్రీనాథుడు ఇలా వర్ణిస్తాడు:
"వేనలి పాటపాట నరవేండ్రుకతో తిల తండులాన్వయ
శ్రీ నటియింప..."
ఆమె వెండ్రుకలు బియ్యం నువ్వులూ కలబోసినట్లున్నాయిట! దేవతలకైతే ముసలితనం లేదు కాబట్టి వాళ్ళ జుత్తెప్పుడూ నల్లగానే ఉంటుంది (ఇందుకు దేవ మునులు, ఋషులు మినహాయింపు :-). కానీ ఇక్కడ అమ్మవారు ముత్తైదువ రూపంలో వచ్చింది కాబట్టి ఆవిడ జుత్తుకూడా నెరిసిందన్నమాట!
పండు జుత్తు గురించీ, పండే జుత్తు గురించీ మన కావ్యాల్లో ఎలాంటెలాంటి వర్ణనలున్నాయో మరి కొంచెం లోతుగా పరిశీలించాలి.

ఇంతకీ, ఇప్పుడీ కేశోపాఖ్యానం మొదలెట్టడానికి ప్రేరణ ఇదిగో మన కొత్తపాళీగారి మీసము దిద్దరుగా అన్న టపా. పాపం అతని కళ్ళు బైర్లు కమ్మిన ఆ సంఘటన చదివేసరికి అలాటి సంఘటనే మరో కవికి కూడా కలిగిన విషయం గుర్తుకొచ్చింది. తన బాధని నలుగురితో పంచుకోడానికి కొత్తపాళీగారు టపా రాసినట్టే, ఆ కవిగారు ఏకంగా ఒక కావ్యమే రాసారు! దాని పేరు "పలిత కేశం". ఆ కవి దువ్వూరి రామిరెడ్డి. ఆ సందర్భాన్ని అతనిలా వివరించారు:

దారింబోయెడు బాటసారి యితర ధ్యానంబునందుండ, గా
ల్జారన్ మేల్కను రీతి నా మనసు స్వేచ్ఛాపుష్పకంబెక్కి ది
క్పారంబుల్ కడముట్టుచుండగ హఠాద్భంగంబు చేకూరె; గ
న్నారం గాంచితి దెల్లనైన యొక కేశాంకూరమున్ మీసలన్

భరముగ గుండెలో నెగిరిపడ్డటు లయ్యెను; జవ్వనంపు బం
గరుకలలెల్ల రెక్కలెదుగం బరతెంచెడు పక్షిశాబముల్
కరణి గులాయమున్ విడుట కన్నులగట్టె; క్షణంబునన్ మనో
హరమగు జీవితాంబరము నంబుదకశ్మలమై కనంబడెన్

విరియు రేకుల మంచుతుంపరులు బార
బ్రొద్దువొడుపున జలిగ్రాగు పూవునందు
జీడపురు వొండు చేరిన జాడ తోచె
మీసమున దెల్లవెంట్రుక మోసుగాంచ

పాపం అంతేనా, ఇంకా చూడండి దువ్వూరివారి బాధ. కొత్తపాళీగారికి ఇలాటి బాధ ఉన్నదో లేదో మరి :-)

చెలియది గాంచినం బరిహసించునొయేమొ! జపా సుమాంతరో
జ్వల మధురాధరాంచల లసన్మృదుహాసము మందగించునో!
యలకువచూపి వచ్చె ముసలాతడటన్న నిరాకృతిన్ ననుం
జులకన సేయునో యనుచు స్రుక్కి నిమేషము ధైర్యమూనితిన్

ఏమి పొరపొచ్చె మెరుగక యిన్నినాళ్ళు
ఆలుమగలము దాంపత్య మనుభవింప
బానకములోన బుడకట్లు వచ్చినావె
తెల్లవెండ్రుక, నీ తస్సదియ్య! నేడు

దాంతో కవి దాన్ని కత్తెరతో టపీ మనీ కత్తిరించెద్దామనుకుంటాడు. అప్పుడా పలితకేశం అతని కత్తెరకి దొరక్కుండా తప్పించుకొని, అతనితో సంభాషించడం మొదలు పెడుతుంది!

నేడు ఛేదించితివి, రేపు చూడు నన్ను
దొలువిధంబున మోసెత్తి తొంగిచూతు
బృథివి జనులకు గాలంబు వేయుచున్న
ప్రశ్న గుర్తును, బదులేమి పలుకగలవు?

అని నిలదీస్తుంది! నేను నీ శత్రువునికాదు మిత్రమునే అనికూడా అంటుంది. చీకట్లో కళ్ళు కనిపించని వాడికి నేను వెలుగు చూపిస్తాను అనికూడా అంటుంది! అయినా మన కవిగారి కోపం తగ్గదు.

అనియిటు ప్రేలెడు వెంట్రుక
తునుకంగని యంటి "నోసి తోరపు గర్వం
బున దేవదూత వీవే
యనుకొని రక్షించు మాటలాడెద వరెరే!

అని తిరస్కారంగా మాట్లాడతాడు.

"...మిమ్ము ననగూడదు గాని కవీశ్వరులౌట; మీ
రనినటు నేను నల్పతరమైన, ననుం బరిమార్పలేని మీ
ఘనతయు బుద్ధివైభవ వికాసము లంతకు దక్కువే గదా?"

అని ప్రశ్నించేసరికి కవి అవాక్కవుతాడు. దానితో,

కనుమోయీ, యిల రాజ్యభోగములు సౌఖ్యంబుల్ గృహారామముల్
ధన ధాన్యంబులు బంధుమిత్రులును గాంతాపుత్ర సౌభాగ్యముల్
పొనరన్, సర్వము శాశ్వతంబని తృషా లోలాంతరంగంబులన్
దినముల్ పుచ్చెడు మూఢ మానవునకున్ దీపంబు నందిచ్చెదన్

అని ఆ కేశం తత్త్వ బోధ మొదలుపెడుతుంది.

ఆసలుపెంచి తీర్చుకొన నర్థము నెట్టులొ సంగ్రహించు నా
యాసముతోడ జీవితము నంతయు బుత్తువు; నీదు చర్య వ్య
త్యాసము లేని యంత్రగతియౌ; జననంబును బెండ్లి బిడ్డలున్
గ్రాస నివాస; మంత దుదగాంచు జరిత్రము మృత్యుపూర్తిగన్

ఎంతమంది ఎన్ని మార్లు బోధించలేదీ తత్త్వం, అయినా అది నిత్య సత్యమై ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది! తత్త్వం చెప్పి ఊరుకోకుండా, కొంచెం హితబోధ కూడా చేస్తుంది:

దినమున కొక్క పూటయిన దిండికి లేక దరిద్ర మానవుల్
వనరుచునుండ నీ ధనము వాసనకట్టు బిగించికట్టి యే
యనుభవ మొందబోయెదవొ? యందర బీదల వేడియూర్పులం
దనరు దవాగ్ని నీ బ్రతుకు దగ్ధముసేయదె యొక్క పెట్టునన్!

ఇలా బోధ చేసుకుంటూ పోతున్నప్పుడు హఠాత్తుగా కవిగారికి ఒక విచిత్రమైన స్పృహ కలిగిందని నా కనిపిస్తుంది. ఇక్కడ ఈ హితబోధ ఎవరు ఎవరికి చేస్తున్నారు? కవిగారి మీసంలోని తెల్లవెంట్రుక కవికి చేస్తోంది. కాని నిజానికి ఆ వెంట్రుక గొంతులో ఆ మాటలు పలికిస్తున్నది కవే కదా! కవి పాఠకులకి చేస్తున్న హితబోధా ఇది? ఇలాంటి స్పృహ కవికి కలిగేసరికి ఒక్కసారి ఉలికిపడినట్టునాడు. ఇది పాఠకులకే కాదు, తనకి కూడా అనే ఆలోచన వచ్చిందిలా ఉంది! ఎందుకంటే, ఆ పలితకేశం మాటల్లో ఏం అంటున్నాడో చూడండి:

ఈ ప్రబోధమెల్ల నితరులకేయని
యనకు, నీకు సైత మన్వయించు;
బరహితోపదేశ పాండిత్యమని యెంతు
వేని, దాన నాకు హాని లేదు.

కవిగారికి ప్రత్యేకమైన బోధ ఉండాలి కదా. అంచేత ఆ పలితకేశం ఇలా కూడా అంటుంది:

పదిపదునాల్గువర్షముల పాటు కలంబును ముట్టకే సుఖా
స్పదమును నిర్విచారమగు వ్యర్థపు సోమరిజీవితంబు నీ
కొదవెను; నేనుగూడ మొనయొత్తితి; నిద్దుర మేలుకొమ్ము; నీ
యెద జిగిరించు భావములకిమ్ము మనోహర రూప సంపదల్

ఇలా ఉపదేశించిన ఆ పలితకేశనికి, ఎంతైనా కవి కదా, అతను దీటైన జవాబే ఇస్తాడు!

జననమొందిన ప్రాణికి జావు నిజము;
చావు చావని భయపెట్టలేవు నన్ను;
జావకే యుండినన శిలాశాశ్వతముగ
దాతముత్తాత లెచ్చట దాగినారు?

అని ధీమాగా అంటాడు. అంతేకాదు
"పరము సత్యంబె యైనను బరము కొరకు
నిహ సుఖంబుల బలియీయ నేల చెపుమ?"

అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఇది ఉమర్ ఖయాము తత్త్వం. దీనికి దేశభక్తిని కూడా జోడించి ఇలా అంటాడు కవి:

ఇహపరంబుల రెంట గ్రహింప గలుగు
నఖిల సుఖదుఃఖముల నేను అనుభవించి
పుట్టెదను మళ్ళి మా మాతృభూమియైన
భారతాఖండమండల భవ్య సీమ

ఉపనిషత్సార సందేశ ముజ్జ్వలాసి
కఠిన ధారాతళత్తళల్ గలసి పారు
నమృత గీత స్రవంతి రూపందుకొన్న
ఆర్యభువి మృత్యుభీతి నింద్యంబుగాదె?

ఇప్పుడిప్పుడె ముక్తి నే నిచ్చగింప
ఎన్ని కోటుల యేండ్లొ యీ పృథివి ప్రబలు
వేయి మార్లైన జన్మింప వీలుపడిన
బ్రతి తడవ గోరుకొందు నీ పావనోర్వి

అన్నికోట్ల ప్రజలు బద్ధులై శ్రమింప
నేను మాత్రము ముక్తి వాంఛింపనేమి?
అవయవంబులు కొన్ని దేహంబునందు
బ్రమదమొందునె మిగతవి బాధపడగ?

ఈ చివరి పద్యంలోని భావన అత్యద్భుతం!
దానితో ఈ కావ్యం పూర్తయితే దీని కవిత్వ విలువ మరింత పెరిగేది. కాని దురదృష్టవశాత్తూ అది జరగలేదు. స్వర్గ నరకాల గురించీ, ఆధునిక నాగరకత గురించీ చర్చ మొదలై చాలా సుదీర్ఘంగా సాగుతుంది. కవిత్వం పలచబడి (కనుమరుగై అనికూడా అనుకోవచ్చు!) సిద్ధాంత చర్చ విజృంభిస్తుంది. కవి విశ్వరూపం దాల్చి కవిత్వాన్ని మింగేసాడు! అయితే తాత్త్విక సిద్ధాంత చర్చ యిష్టమైన వాళ్ళు దీన్ని చదివి ఆనందిస్తారేమో!
మొత్తానికి కుక్కపిల్లా, సబ్బుబిళ్ళే కాదు తెల్ల వెంట్రుక కూడా కవితకి అనర్హం కాదని ఈ కావ్యం నిరూపించింది.


పూర్తిగా చదవండి...

Saturday, January 17, 2009

గరికిపాటివారి అవధానం వినండి


ఎక్కడికో వెళ్ళి ఒక జలపాతాన్ని చూసాం. ఎత్తైన కొండనుండి జాలువారే ఆ నిర్ఝరి అభంగ తరంగ మృదంగ నిస్వనానికి పరవశించిపోతాం. తిరిగి వచ్చి ఎవరికైనా దానిగురించి వివరించాలంటే ఎలా? ఓ సీసాలో ఆ జలపాతపు నీళ్ళు తెచ్చి, నేలమీదకి ఒంపి చూపిస్తే ఏవైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందికే గరికిపాటివారి అవధానం గురించి నేనిక్కడ ఎంత వివరించినా ప్రయోజనం ఉండదు.
ఆ వాగ్ఝరిలో మీరే స్వయంగా మునకలైయ్యండి. ఇదిగో ఇక్కడ:

గరికిపాటివారి అవధానం

ఈ అవధానంలో నన్ను కాస్త నిరాశపరచిన అంశాలు లేకపోలేదు. సత్యంపైనా, మొత్తం సాఫ్టువేరువాళ్ళపైనా గరికిపాటివారు గుప్పించిన విమర్శలు కొంచెం ఎక్కువనిపించాయి. చెప్పొద్దూ మనసు కాస్త చివుక్కుమంది కూడా! ఆఖరికి ఊరుకోలేక అనేసాను కూడా:

సాఫ్ట్వేరన్నను కోపమేల తమకున్ స్వామీ పరీక్షింపగా
సాఫ్ట్వేర్లో పనిచేయు వారి మనసుల్ సాఫ్టే సుమండీ!

అయినా అతనే మాత్రం తగ్గలేదు!
కావ్యవాచనంలో చదివిన పద్యాలు ఏ కావ్యంలోనివో చెప్పకపోవడం కూడా కొంత నిరాశ కలిగించింది.

అయినా అతని వాక్చాతుర్యం, ధార, ధారణ ఇలాటి చిన్న చిన్న లోపాలను పూర్తిగా పూరించేసాయి. పైగా, నా అవధానానికి నూటికి నూరు మార్కులు మీరివ్వక్కరలేదు, డబ్భై మార్కులొచ్చినా నాకు సంతోషమే అని చెప్పుకున్న అతని వినయం, నిజాయితీ నన్ను విస్మయపరిచాయి.

ఛందస్సంభాషణ గురించి ముఖ్యంగా చెప్పాల్సింది, మన చదువరిగారి వ్యాఖ్య ప్రేరణతో అడిగిన ఈ ప్రశ్నకి నేనూహించని సమాధానం నన్ను నిరుత్తరుణ్ణి చేసేసింది! నా ప్రశ్న:

"గురజాడయు శ్రీశ్రీ వీ
రిరువురిలో ఎవరటన్న ఎక్కువ ఇష్టంబు?"

దీనికి గరికిపాటివారిచ్చిన సమాధానం...లంకెలో ఆడియోని దిగుమతి చేసుకొని విని తెలుసుకోండి :-)

ఈ ఆడియోని రికార్డు చేసి, జాలానికి ఎక్కించి, అందరితో పంచుకునే వీలు కలిగించిన తెలుగు సాంస్కృతిక సంస్థ - భారతీయ విజ్ఞాన సంస్థ(IISc) వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.


పూర్తిగా చదవండి...

Wednesday, January 14, 2009

సంక్రాంతి శుభాకాంక్షలు


అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

బేతవోలు రామబ్రహ్మంగారి "కొత్తగోదావరి" పద్య కవితా సంపుటినుంచి సంక్రాంతి పద్యాలు మీకోసం.

లలి మునుమాపువేళ చదలన్ తెలి ముగ్గిడబూని ముందు చు
క్కల నిడి వాని సౌరు గనగా నిలుచున్న నిశామృగాక్షి అ
వ్వల నరుదెంచుచున్న ప్రియవల్లభు గాంచిన సంభ్రమాన ము
గ్గొలికెనొ చేతినుండి యననొప్పెను పౌషపు పండువెన్నెలల్

రాత్రి అనే సుందరి ఆకాశంలో ముగ్గు వెయ్యడానికి ముందు చుక్కలని పెట్టింది. ఆ చుక్కలే ఎంతో అందంగా కనిపిస్తే, వాటిని చూస్తూ నిలుచుండి పోయింది. ఇంతలో తన భర్త వస్తూ ఉండడం చూసిన తొట్రుపాటులో ఆ ముగ్గు కాస్తా ఒలికి పోయింది. పుష్య మాసం పండు వెన్నెల ఆ ఒలికిన ముగ్గులా ఉంది.

ఉదయమనంగ నేగి రెటకో మరి మీ కలవాట యయ్యె ని
య్యది యని మూతి మూడ్చుకొను నామెకు తారలహార మిచ్చి బి
ట్టదిమి కవుంగిలింపగ నిశాధిపు డత్తఱి జారెనో నిశా
మదవతి మేల్ముసుంగనగ మంచు తెరల్ కనుపట్టె నింపుగన్

"ఉదయాన్నే ఎక్కడకో వెళిపోయి రాత్రి దాకా ఇంటికి రాకపోవడం మీకు బాగా అలవాటైపోయింది" అని అలకతో ఆ నిశామృగాక్షి మూతి ముడుచుకుంది. అప్పుడామె భర్త ఆమె అలక తీర్చడానికి తారల హారాన్ని బహుమతిగా ఇచ్చి కవుగిలించుకున్నాడు. ఆ సమయంలో ఆ నిశా మదవతి మేలిముసుగు జారింది. అది మంచు తెరలగా కనిపించింది.

సంపెగ మొగ్గకున్ తుద పసందుగ నిల్చిన మంచుబొట్టుపై
నింపుగ సూర్యకాంతి యొకడెట్టులొ సోకగ "నాన్న మీద కో
పింపగ నౌనె మీ"కని నిజేశు రుషారుణితేక్షణాళి సా
ధింపుల గాసివెట్టెడు సతీమణి ముంగర ముత్తెమౌనకో

సంపెంగ మొగ్గ మీద ఒక మంచు బిందువు. దానిపైన ఒక సూర్య కిరణం ప్రసరించింది. అదెలా ఉంది? తన నాన్నపై (లేదా బిడ్డపై) కోపిస్తారెందుకని ఒక భార్య తన భర్తని కోపపు చూపులతో సాధించేటప్పుడు ఆమె ముక్కుపై మెరిసే ముక్కెరలా ఉంది. చూపులు కోపంతో అరుణిమని సంతరించుకుని సూర్య కిరణాల్లా ఉన్నాయి. సరే ఆమె ముక్కెలాగూ సంపెగ మొగ్గే!

మంజీర మణిరాజ పుంజాగత స్వఛ్చ
సింజాన మాధుర్య మంజిమములు
కరలీన లసమాన వరపీన సునవీన
తాళంబు మేళంబు నేలుకొనగ
నెత్తిమీదను బట్టి నేర్పుగా నిలబెట్టు
నక్షయంబగు గిన్నె నమరు వన్నె
వేదాంత సంగీత విన్యాస మొకవంక
నొకవంక తాళంబు నుల్లసిలగ

పాదభంగిమ లొకరీతి బడయకుండ
గంతులాడుచు పాటతో గలసిమెలసి
పాడు సాతాను జియ్యరు వట్టి రమ్య
శాబ్దికాడంబరము సేయు చలికి బిగిసి

అతను సాతాను జియ్యరు. అతని కాలి మువ్వలు, చేతిలో తాళాలు, నెత్తిమీద నేర్పుగా నిలబెట్టిన గిన్నె. ఒక వంక వేదాంతమూ మరో వంక సంగీతము ఇంకొకవంక తాళము. పాదభంగిమ తప్పకుండా ఆడుతూ పాడుతూ ఉన్న సాతాను జియ్యరు.

గడపల పచ్చబొట్టు లిడగా మునుముందుకొకింత వంగ గీ
ల్జడ నునుకుచ్చులున్ బుజములంబడి జోడుకు జోడుగాగ వ్రే
లెడు గతికిన్ జిరాకువడి లేమ శిరంబు నెగుర్చు వేళ మ్రో
వెడు మణిభూషణ ధ్వను లవే యవు పిల్పులు క్రాంతిలక్ష్మికిన్

గడపకి పసుపు బొట్టు పెట్టడానికి వంగిన అమ్మాయి కీల్జెడలోని కుచ్చులు బుజాలపై పడ్డాయి. దానితో చిరాకుపడి ఒక్కసారి తల పైకెగరేసింది. దానితో మెడలోని హారాలు గలగల మన్నాయి. అవి సంక్రాంతి లక్ష్మికి పిలుపులు కాబోలు!

అలరు పయంట బిఱ్ఱబిగియన్ దిగలాగి మరొక్క చక్కి గీ
ల్కొలిపి పదారవిందములకున్ దగు దూరమునుంచి పావడా
జిలుగు పసందుటంచు మొగచే దొడపైని కుదించి నొక్కి ము
గ్గుల నిడ వంగు కన్నె గనుగో మన మున్నత సీమలందెడున్

ముగ్గులుపెట్టే కన్నె వయ్యారమంతా ఇక్కడ కవి ఒలకబోసాడు.

జడను లాగిన బావపై నలుకతోడ
నురిమి చూచుడు కాశ్మీర మొకడు కంట
నుదిరిపడ నద్ది మూసి వేరొకట నతని
జూడ సిగ్గిల్లు మరదల చూడ్కి విందు

బావా మరదళ్ళ సరాగాలు లేని తెలుగు సంక్రాంతికి శోభ ఏముంది? కొంటె బావ తన జడలాగితే, ఆ కోణంగి ఒక కంట అలక మరో వంక సిగ్గులు జాలువారాయి!

అందమైన ప్రకృతి వర్ణనతో మొదలైన యీ కవిత మరుగుపడుతున్న తెలుగుదనాన్ని మరోసారి మనకి గుర్తు చేసి హఠాత్తుగా మాయమైపోయినట్టు లేదూ!


పూర్తిగా చదవండి...

Sunday, January 4, 2009

బెంగుళూరులో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి అష్టావధానం


వచ్చే శనివారం (అంటే పదో తారీఖు) బెంగుళూరులో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి అష్టావధానం జరగబోతోంది. ఇది తెలుగు సాంస్కృతిక సంస్థ - భారతీయ విజ్ఞాన సంస్థ(IISc) ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనికి అందరూ ఆహ్వానితులే.
గరికిపాటివారి ధార, ధారణ, వాక్చాతుర్యం అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఆసక్తి, వీలు ఉన్నవాళ్ళందరూ వచ్చి ఆనందించవచ్చు.
ఇందులో నేను కూడా ఒక పృఛ్చకునిగా పాల్గొంటున్నాను. నా అంశం ఛందస్సంభాషణం. అంటే ఆవధానిగారితో పద్యాలలో సంభాషించడమన్న మాట. కొంచెం సాహసమే!
ఈ సందర్భంగా బెంగుళూరులో ఉన్న బ్లాగ్మిత్రులని కలుసుకొనే అవకాశం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను.
ఇది సాయంకాలం నాలుగున్నరకి మొదలవుతుంది. వివరాలకి ఇక్కడున్న ఆహ్వానపత్రిక చూడండి.


పూర్తిగా చదవండి...