అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
బేతవోలు రామబ్రహ్మంగారి "కొత్తగోదావరి" పద్య కవితా సంపుటినుంచి సంక్రాంతి పద్యాలు మీకోసం.
లలి మునుమాపువేళ చదలన్ తెలి ముగ్గిడబూని ముందు చు
క్కల నిడి వాని సౌరు గనగా నిలుచున్న నిశామృగాక్షి అ
వ్వల నరుదెంచుచున్న ప్రియవల్లభు గాంచిన సంభ్రమాన ము
గ్గొలికెనొ చేతినుండి యననొప్పెను పౌషపు పండువెన్నెలల్
రాత్రి అనే సుందరి ఆకాశంలో ముగ్గు వెయ్యడానికి ముందు చుక్కలని పెట్టింది. ఆ చుక్కలే ఎంతో అందంగా కనిపిస్తే, వాటిని చూస్తూ నిలుచుండి పోయింది. ఇంతలో తన భర్త వస్తూ ఉండడం చూసిన తొట్రుపాటులో ఆ ముగ్గు కాస్తా ఒలికి పోయింది. పుష్య మాసం పండు వెన్నెల ఆ ఒలికిన ముగ్గులా ఉంది.
ఉదయమనంగ నేగి రెటకో మరి మీ కలవాట యయ్యె ని
య్యది యని మూతి మూడ్చుకొను నామెకు తారలహార మిచ్చి బి
ట్టదిమి కవుంగిలింపగ నిశాధిపు డత్తఱి జారెనో నిశా
మదవతి మేల్ముసుంగనగ మంచు తెరల్ కనుపట్టె నింపుగన్
"ఉదయాన్నే ఎక్కడకో వెళిపోయి రాత్రి దాకా ఇంటికి రాకపోవడం మీకు బాగా అలవాటైపోయింది" అని అలకతో ఆ నిశామృగాక్షి మూతి ముడుచుకుంది. అప్పుడామె భర్త ఆమె అలక తీర్చడానికి తారల హారాన్ని బహుమతిగా ఇచ్చి కవుగిలించుకున్నాడు. ఆ సమయంలో ఆ నిశా మదవతి మేలిముసుగు జారింది. అది మంచు తెరలగా కనిపించింది.
సంపెగ మొగ్గకున్ తుద పసందుగ నిల్చిన మంచుబొట్టుపై
నింపుగ సూర్యకాంతి యొకడెట్టులొ సోకగ "నాన్న మీద కో
పింపగ నౌనె మీ"కని నిజేశు రుషారుణితేక్షణాళి సా
ధింపుల గాసివెట్టెడు సతీమణి ముంగర ముత్తెమౌనకో
సంపెంగ మొగ్గ మీద ఒక మంచు బిందువు. దానిపైన ఒక సూర్య కిరణం ప్రసరించింది. అదెలా ఉంది? తన నాన్నపై (లేదా బిడ్డపై) కోపిస్తారెందుకని ఒక భార్య తన భర్తని కోపపు చూపులతో సాధించేటప్పుడు ఆమె ముక్కుపై మెరిసే ముక్కెరలా ఉంది. చూపులు కోపంతో అరుణిమని సంతరించుకుని సూర్య కిరణాల్లా ఉన్నాయి. సరే ఆమె ముక్కెలాగూ సంపెగ మొగ్గే!
మంజీర మణిరాజ పుంజాగత స్వఛ్చ
సింజాన మాధుర్య మంజిమములు
కరలీన లసమాన వరపీన సునవీన
తాళంబు మేళంబు నేలుకొనగ
నెత్తిమీదను బట్టి నేర్పుగా నిలబెట్టు
నక్షయంబగు గిన్నె నమరు వన్నె
వేదాంత సంగీత విన్యాస మొకవంక
నొకవంక తాళంబు నుల్లసిలగ
పాదభంగిమ లొకరీతి బడయకుండ
గంతులాడుచు పాటతో గలసిమెలసి
పాడు సాతాను జియ్యరు వట్టి రమ్య
శాబ్దికాడంబరము సేయు చలికి బిగిసి
అతను సాతాను జియ్యరు. అతని కాలి మువ్వలు, చేతిలో తాళాలు, నెత్తిమీద నేర్పుగా నిలబెట్టిన గిన్నె. ఒక వంక వేదాంతమూ మరో వంక సంగీతము ఇంకొకవంక తాళము. పాదభంగిమ తప్పకుండా ఆడుతూ పాడుతూ ఉన్న సాతాను జియ్యరు.
గడపల పచ్చబొట్టు లిడగా మునుముందుకొకింత వంగ గీ
ల్జడ నునుకుచ్చులున్ బుజములంబడి జోడుకు జోడుగాగ వ్రే
లెడు గతికిన్ జిరాకువడి లేమ శిరంబు నెగుర్చు వేళ మ్రో
వెడు మణిభూషణ ధ్వను లవే యవు పిల్పులు క్రాంతిలక్ష్మికిన్
గడపకి పసుపు బొట్టు పెట్టడానికి వంగిన అమ్మాయి కీల్జెడలోని కుచ్చులు బుజాలపై పడ్డాయి. దానితో చిరాకుపడి ఒక్కసారి తల పైకెగరేసింది. దానితో మెడలోని హారాలు గలగల మన్నాయి. అవి సంక్రాంతి లక్ష్మికి పిలుపులు కాబోలు!
అలరు పయంట బిఱ్ఱబిగియన్ దిగలాగి మరొక్క చక్కి గీ
ల్కొలిపి పదారవిందములకున్ దగు దూరమునుంచి పావడా
జిలుగు పసందుటంచు మొగచే దొడపైని కుదించి నొక్కి ము
గ్గుల నిడ వంగు కన్నె గనుగో మన మున్నత సీమలందెడున్
ముగ్గులుపెట్టే కన్నె వయ్యారమంతా ఇక్కడ కవి ఒలకబోసాడు.
జడను లాగిన బావపై నలుకతోడ
నురిమి చూచుడు కాశ్మీర మొకడు కంట
నుదిరిపడ నద్ది మూసి వేరొకట నతని
జూడ సిగ్గిల్లు మరదల చూడ్కి విందు
బావా మరదళ్ళ సరాగాలు లేని తెలుగు సంక్రాంతికి శోభ ఏముంది? కొంటె బావ తన జడలాగితే, ఆ కోణంగి ఒక కంట అలక మరో వంక సిగ్గులు జాలువారాయి!
అందమైన ప్రకృతి వర్ణనతో మొదలైన యీ కవిత మరుగుపడుతున్న తెలుగుదనాన్ని మరోసారి మనకి గుర్తు చేసి హఠాత్తుగా మాయమైపోయినట్టు లేదూ!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Wednesday, January 14, 2009
సంక్రాంతి శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!
ReplyDeleteమాయమయి పోతుంటే మా కామేశ్వర రావు మాష్టారు ఊరుకోకుండా వెనక్కు తీసుకువచ్చి మరీ మా అందరికీ విందు చేస్తున్నారు.కృతజ్ఞతలు.పండగ నాటి ఉదయం అంతా కళ్ళకు కట్టినట్టుందండీ.
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteఈ టపా చూడగానే వెంటనే చదవక, పిల్లాడు మిఠాయిని దాచుకుని నిదానంగా ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ తిన్నట్టుగా, ఒక్కో పద్యం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను.
ReplyDeleteధన్యవాదాలు.
సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteఅవధానం విశేషాలు ఎప్పుడు పంచుతారు?
భలే భలే. అద్భుతంగా ఉన్నాయండీ పద్యాలన్నీ. బావపై అలుకనీ కులుకునీ కూడ భలే చూపించారు.
ReplyDeleteఅమ్మో. ఇలాంటివి చదివినపుడే అనిపిస్తుంది చదవాల్సినవి చా...లా ఉన్నాయీ అని.