ఎక్కడికో వెళ్ళి ఒక జలపాతాన్ని చూసాం. ఎత్తైన కొండనుండి జాలువారే ఆ నిర్ఝరి అభంగ తరంగ మృదంగ నిస్వనానికి పరవశించిపోతాం. తిరిగి వచ్చి ఎవరికైనా దానిగురించి వివరించాలంటే ఎలా? ఓ సీసాలో ఆ జలపాతపు నీళ్ళు తెచ్చి, నేలమీదకి ఒంపి చూపిస్తే ఏవైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందికే గరికిపాటివారి అవధానం గురించి నేనిక్కడ ఎంత వివరించినా ప్రయోజనం ఉండదు.
ఆ వాగ్ఝరిలో మీరే స్వయంగా మునకలైయ్యండి. ఇదిగో ఇక్కడ:
గరికిపాటివారి అవధానం
ఈ అవధానంలో నన్ను కాస్త నిరాశపరచిన అంశాలు లేకపోలేదు. సత్యంపైనా, మొత్తం సాఫ్టువేరువాళ్ళపైనా గరికిపాటివారు గుప్పించిన విమర్శలు కొంచెం ఎక్కువనిపించాయి. చెప్పొద్దూ మనసు కాస్త చివుక్కుమంది కూడా! ఆఖరికి ఊరుకోలేక అనేసాను కూడా:
సాఫ్ట్వేరన్నను కోపమేల తమకున్ స్వామీ పరీక్షింపగా
సాఫ్ట్వేర్లో పనిచేయు వారి మనసుల్ సాఫ్టే సుమండీ!
అయినా అతనే మాత్రం తగ్గలేదు!
కావ్యవాచనంలో చదివిన పద్యాలు ఏ కావ్యంలోనివో చెప్పకపోవడం కూడా కొంత నిరాశ కలిగించింది.
అయినా అతని వాక్చాతుర్యం, ధార, ధారణ ఇలాటి చిన్న చిన్న లోపాలను పూర్తిగా పూరించేసాయి. పైగా, నా అవధానానికి నూటికి నూరు మార్కులు మీరివ్వక్కరలేదు, డబ్భై మార్కులొచ్చినా నాకు సంతోషమే అని చెప్పుకున్న అతని వినయం, నిజాయితీ నన్ను విస్మయపరిచాయి.
ఛందస్సంభాషణ గురించి ముఖ్యంగా చెప్పాల్సింది, మన చదువరిగారి వ్యాఖ్య ప్రేరణతో అడిగిన ఈ ప్రశ్నకి నేనూహించని సమాధానం నన్ను నిరుత్తరుణ్ణి చేసేసింది! నా ప్రశ్న:
"గురజాడయు శ్రీశ్రీ వీ
రిరువురిలో ఎవరటన్న ఎక్కువ ఇష్టంబు?"
దీనికి గరికిపాటివారిచ్చిన సమాధానం...లంకెలో ఆడియోని దిగుమతి చేసుకొని విని తెలుసుకోండి :-)
ఈ ఆడియోని రికార్డు చేసి, జాలానికి ఎక్కించి, అందరితో పంచుకునే వీలు కలిగించిన తెలుగు సాంస్కృతిక సంస్థ - భారతీయ విజ్ఞాన సంస్థ(IISc) వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Saturday, January 17, 2009
గరికిపాటివారి అవధానం వినండి
Subscribe to:
Post Comments (Atom)
గరిక పాటి గారి అవదానం నేను కూడా విన్నాను
ReplyDeleteఎవరు అన్నారో కాని ఆయన బ్రహ్మరాక్షసుడు అని
నిజంగానే ఆయన అవధానం లో బ్రహ్మరాక్షసుడు
అవదానం విన్న నా జన్మ ధన్యం
Even I heard Garikapaati gaari avadaanam it was very nice. Till now I can’t forget it. His voice is still ringing in my ears. Don’t know who told that he is
ReplyDeleteBRAHMARAAKSHASA that is really true.
In that avadaanam he is really BRAHMARAAKSHASA
I enjoy the avadaanam very much
The storis they told in the avadaanam I came home and told my children and my husband also
What ever they told in the avadaanam I wrote it in a book, then again I came home and read it
I went there because I saw the invitation in jalleda .com
I am very much thankfull to jalleda .com
Excellent work! Mee blog chaala bagundi!
ReplyDeletethanks for sharing. "bharata vijnana samstha" ante IISc ya?
ReplyDeletesir ganaalu saripoledu istambu kaadu istam ayithene ganaalu saripotai
ReplyDeleteఆటవెలది:-
ReplyDeleteగరికపాటి వారి ఘనత భైరవభట్ల
తెలుగు పద్యమందు తెలియ జేసి
బ్లాగు పాఠకులకు పరమాద్భుతంబైన
విషయ మందజేసి విశద పరచె.
అట్టీ కామేశ్వర రావూగారూ! అభినందనలండి.
శార్దూలము:-
సాఫ్ట్వేరన్నను కోపమేల తమకున్ స్వామీ పరీక్షింపగా
సాఫ్ట్వేర్లో పనిచేయు వారి మనసుల్ సాఫ్టే సుమండీ! యనన్
సాఫ్ట్వేరంచు { సాఫ్ట్ + వేర్ ? అంచు } వచించి యుండు నతడున్. సత్యంబొకో? కాదొకో?
సాఫ్ట్వేరన్నను సత్యమొక్కటెటులౌన్ ? సాహిత్య సద్ / { బ్లాగ్ } భూషణా!
నా అభిప్రాయం సరయినదేనంటారా?
సార్,
ReplyDeleteనా కంప్యూటరులో గరికపాటి వారి అవధానం విందామంటే మంటనక్క క్రాష్ అయి డిస్కనక్ట్ అవుతుంది.ఏమి చేయాలో ఎలా ఈ పరిస్థితిని దాటాలో చెప్పరూ.
ఉమదేవిగారు, నెనరులు.
ReplyDeleteఉమగారు, ఓ మీరు అవధానానికి వచ్చారా!
సోమశేఖర్ గారు, అవునండి IIScనే.
రామకృష్ణారావుగారు,
మీరు గరికిపాటివారి కన్నా సం"పన్నలు" అయ్యారండి! :-)
నరసింహగారు,
మీరు ఆ ఆడియోని Online వినడం కాకుండా Download చేసుకొని వినడానికి ప్రయత్నించండి.
@శివరామకృష్ణగారు,
రెండో పాదం వరకే అనుకుంటే గణాలు సరిపోవు కాని అక్కడితో ఆగాలని లేదు కదా! మరో సారి గరికిపాటివారి సమాధానంతో పూర్తి పద్యం వినండి. సందేహం తీరుతుంది :-) ఇంతకీ మీక్కూడా బ్లాగున్నట్టు చెప్పనేలేదేం?
అన్నట్టు మరో విషయం తక్కిన బ్లాగర్లకి చెప్పాల్సింది ఉంది. ఈ శివరామకృష్ణగారే గరికిపాటివారి చేత "నివురు గప్పిన నిప్పు" అనిపించుకునేట్టుగా కావ్య పఠనం (క్షమించాలి గానం :-) చేసిన పృఛ్చకుడు.
ఓహో "ఎవరు గప్పిన నిప్పు" అని అవధానిని ఆశ్చర్యపరచిన శివరామకృష్ణ గారు వీరేనా :) నమస్కారమండి.
ReplyDeleteకామేశ్వరరావు గారూ, పొల్లుబోకుండా అంతా రికార్డు చేసారు. నేగూడా అవధాన సభలో ఉన్నట్టే ఉంది అదంతా వింటూంటే.
"జానామి ధర్మం నచమే.."
"ఆతడాతండు కాడేని మీరు నాకనవసరము.." - వీటి గురించి తెలుసుకోవడం ఆనందం కలిగించింది.
సాగరఘోష దాదాపు 30 శాతం వరకు విన్నాను.. విన్నంతలో నేను గమనించినదిది -నరసింహారావు గారు చంపకమాల చాలా తక్కువగా రాస్తారు. శార్దూలం, మత్తేభం ఎక్కువగా రాస్తారు. ఎంచేతో గాని?
ఆయన ప్రవచనాలు, ప్రసంగాల సీడీలు అమ్మారని చెప్పారు. కొనుక్కున్నారా? హై.లో ఎక్కడ దొరుకుతాయో చూడాలి.
మొత్తం అవధానాన్ని నెట్టెక్కించినందుకు నెనరులు!
"ఉపప్లావ్యం నుండి బావా!" :)
దొరక్క దొరక్క దొరికింది అవకాశం... మేస్టారికి మార్కులు శిష్యుడు ఇవ్వడానికి. వినకముందే మీకు నూటికి నూటెనిమిది మార్కులిచ్చేస్తున్నాన్నేను. అసలెన్నొచ్చాయో విన్నాక చెప్తాను :)
ReplyDeleteమంచి పృఛ్చకాళి ..
ReplyDeleteకష్టమైన అవధానం.
తమ 240 అవధానాలలో కష్టమైన వాటిని లెక్కెడితే ఇది ఎన్నవదండీ అని అడగాలని ఉంది.
మీ ఇంటర్ నెట్టు లో ప్రశ్న ని, సాఫ్ట్ వేర్ ప్రశ్నని ప్రక్కదారి మళ్లించటం రుచించలేదు..
కావ్యపఠనం చేసినాయన పాదాల ఫోటో పెడితే దండం పెట్టుకునే వాడిని కదా అని ఆడుగుదామనుకున్నాను, ఏకంగా బ్లాగు చిరునామానే ఇచ్చారు సంతోషం ..
భవదీయుడు
ఊదం
బెంగుళూరులో ఉండి కూడా ఒక చక్కటి సాహిత్య కార్యక్రమాన్ని, మీవంటి వారిని కలిసే అవకాశాన్ని సద్వినియాగపరుచుకోలేకపోయానే అన్న బాధ ఉన్నా, ఈ అవధానాన్ని మొత్తం అందించి, వినే భాగ్యం కలిగించినందుకు మీకు మరీ మరీ నెనర్లు.
ReplyDeleteచాలా రంజింపచేసింది అవధానం, మరీ ముఖ్యంగా మీ ఛందస్సంభాషణం. అవధానంలో ఈ అంశం గురించి నేను ఇదే వినడం.
ఇకపోతే, ఒక ప్రశ్న. రా గణేష్ గారు నిషిద్ధాక్షరికిచ్చిన ఛందస్సు "ధృతవిలంబితం" అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? నేను మునుపెన్నడు దీనిని వినలేదు. అవధాని గారు దీనిని దాటేసి, కందంలో కానిచ్చేసారే.... దీనిపై మీ అభిప్రాయం?
భలే అవధానం
ReplyDeleteగరికపాటి వారి ఉపన్యాసాలు కొన్ని వున్నాను. (సుమారు 7/8 సంవత్సరాలక్రితం నుంచి)
మహానుభావుడు. పుంభావసరస్వతి అన్న మాట ఆయనకు కరక్టే కదూ.
ఆయన అవధానంలో ఉటంకించిన ఒమర్ ఖయ్యాం పద్యం ఇదే కదండి (పాదవిభజన నాకు రాదు మన్నించండి)
ఉండగ నొక్క పాకయు, పరుండగ చాపయు
రొట్టెలొక్కటో రెండొ భుజింప
డెందమలరింప శ్రీమతి చెంతనుండగ
పండుగ గాదె జీవితము.
A Book of Verses underneath the Bough,
A Jug of Wine, a Loaf of Bread-and Thou
Beside me singing in the Wilderness-
Oh, Wilderness were Paradise enow!
ధన్యవాదములతో
బొల్లోజు బాబా
మీ చందస్సంభాషణ హృద్యంగా ఉంది.
@చదువరిగారు:
ReplyDelete"ఆయన ప్రవచనాలు, ప్రసంగాల సీడీలు అమ్మారని చెప్పారు. కొనుక్కున్నారా?"
లేదండి. అవధానం అయ్యీ సరికి బాగా రాత్రైపోయింది. అప్పుడు మరి చూడ్డం అవ్వలేదు. మార్కెట్లో దొరుకుతాయనే అనుకుంటున్నాను.
@రాఘవగారు: నెనరులు. నాకు నేనన్ని మార్కులిచ్చుకోనండీ :-)
@ఊదంగారు:
"మంచి పృఛ్చకాళి .." - ఈ మాటన్నారు కాబట్టి వాళ్ళలో మరొకరిని పరిచయం చేస్తాను :-) పేరునుబట్టి ఊహించవచ్చు. దత్తపది ఇచ్చింది మా అమ్మగారు.
"మీ ఇంటర్ నెట్టు లో ప్రశ్న ని, సాఫ్ట్ వేర్ ప్రశ్నని ప్రక్కదారి మళ్లించటం రుచించలేదు.. "
అవునండి. నాకూ అంతే.
@శ్రీహర్షగారు:
అది "ద్రుత విలంబితం". అదొక వృత్తం. "నభభర" గణాలు. ఇది తెలుగులో ఎక్కువ ప్రయోగంలో లేదు. గణేష్ గారు సంస్కృత అవధాని కాబట్టి అదిచ్చారు. కాని తెలుగులో నిషిద్ధాక్షరికి కందమే సంప్రదాయం కాబట్టి దానిలోనే గరికిపాటివారు చేసారు. కందానికీ నిషిద్ధాక్షరికీ ఉన్న అవినాభావ సంబంధం గురించి వివరించాలంటే ఒక టపా అవసరం :-)
@బాబాగారు,
నెనరులు. గరికిపాటివారు ప్రస్తావించిన ఒమర్ ఖయాం పద్యం ఇది:
ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు రొట్టెలొక్కటో
రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా
పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్
దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే?
గరికిపాటివారు ఒకటి రెండు చోట్ల మార్చి చదివారు.
ఇది కరుణశ్రీగారి అనువాదం. ఇది మీరిచ్చిన దానికి అనువాదం అని అనుకోవచ్చు. కాకపోతే, ఒకే రకమైన భావాలు ఖయాం రుబాయితుల్లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కచ్చితంగా చెప్పలేం. మీరిచ్చిన ఇంగ్లీషు పద్యానికి ఇంకా దగ్గరగా వచ్చే మరో పద్యం కరుణశ్రీగారిదే ఇది:
కరమున పానపాత్ర, బిగికౌగిట చారు చకోరనేత్ర, అం
బరమున చంద్రరేఖ, యిటు ప్రక్కన చక్కని పూలతోట, అ
ద్దరి సెలయేరు, ముందర సుధామధు కావ్యము, కందళించు సుం
దర సుషుమా సుఖంకర దినంబులు మాకు క్షణంబులై చనున్!
ఇప్పటికి పూర్తిగా వినడం అయ్యిందండీ... ఒక్కటే మాట కాదు కాదు ఒక్కటే పద్యం చెప్తాను.
ReplyDeleteబ్రహ్మాండంబుగ సాగె నిద్ది కవి లావైనట్టి వైనంబు సు
బ్రహ్మణ్యున్ తలపించె నష్టవిధులన్ వైదుష్యముం గాంచగన్
బ్రాహ్మీపుత్రుడు ధారణాబలము చూపంగా తగెన్ ధీరుడై
బ్రహ్మేంద్రారియ? కాదు కాదతడు వాగ్బాణాసురుండే సుమా! :)
గురువు గారు,
ReplyDeleteనాకు ఛందస్సంభాషణలో చిన్న సందేహము.
ఉ. ఎక్కడ నుండి రాక యిటకెట్టుల సాగె ప్రయాణమండి బల్
చక్కగ నున్నదే వసతి సర్వము సౌఖ్యమునుండె తెల్పుమా?
ఎక్కడి నుండి వచ్చితినొ యెక్కడికేనిక యేగు వాడనో
చిక్కులు నాపుకొంచునట చిక్కిన శారదనడిగి చూడుమా!!
ఇక్కడ నాల్గవ పాదములో "అడిగి" అని మూడు లఘువులతో ఛంధస్సు సరిపోదు కదా? ఒక వేళ దానిని "అడ్గి" అని కుదిస్తే ఛందస్సు సరిపోతుంది.
ఇలా కుదించటానికి ఎమైనా వ్యాకరణ సూత్రాలు ఉన్నాయా?
సత్యనారాయణ గారు,
ReplyDeleteఅది "అడ్గి చూడుమా"నే అండి. ఇలాంటి కుదింపుకి గ్రాంధిక వ్యాకరణ సూత్రం ఏదైనా ఉందేమో నాకు తెలీదు కాని తెలుగు వాడుకలో ఇది సామాన్యంగా జరిగేదే. కావ్యాల్లో కూడా నన్నయ్య నాటి నుండి ఇది కనిపిస్తుంది. దీన్ని "పదమధ్యాజ్లోపము" అని భాషాశాస్త్రంలో అంటారు. తొడుగు - తొడ్గు, పొలతి - పొల్తి, ఉనికి-ఉంకి నన్నయ్య ప్రయోగాలు.
కామేశ్వర రావు గారు,
ReplyDeleteసంతోషమండీ, ఇప్పుడు తెలిసింది మీ పద్యవిద్య వెనుక రహస్యం...
మీ అమ్మగారు ఇచ్చిన పదాలను కూర్చటం, సమస్యా పూరణం లో ప్రాస,
అక్షరాలు లోపింపింపిచ్చే ఛందోభాషణుడు, మీ చేత "ఎందుకో" అనిపించకుండా నిషిద్ధాక్షరి చేసిన గణేష్ గారు...
వీళ్లందరూ కలిసి - ఒకే అవధానం లో .. కూచోవటం ..
అందుకే కష్టమైన అవధానం అన్నాను..
అక్కసు సమస్యాపూరణం రెండో పాదం లో వెళ్లగక్కినట్టున్నారు - అవధాని గారు ..
ఈ అవధానం గురించి కన్నడ పత్రికలు ఏమని రాసాయో తెలుసుకోవాలనుంది. రా.గణేశ్ గారు ఏదైనా కన్నడ పత్రికకు ఈ అవధానం గురించి నివేదిక రాసి ఉండొచ్చేమో!
ReplyDeleteదింపుకోవడం, వినడం రెండు అయినవి. లింకు ఇచ్చినందుకు పలునెనర్లు.
ReplyDeleteనాకు అవధానం absolutely rocked అనిపించింది. నేను ఇప్పటివఱకూ ఎప్పుడూ వినలేదు. stand up comedy కంటే ఈ sit in అవధానం ఎంతో బాగుంది.
నేను పూర్వమే గరికపాటి వారి అభిమానిని, వారి పాండురంగ మాహాత్మ్యము వీలయినపుడు భక్తి దూరదర్శన స్రవంతిలో చూస్తూనే వుంటాను.
మన యుగాది కవి సమ్మేళనానికిది నాకు ఎంతో స్ఫూర్తినచ్చింది.
మీ రాకేశ్వర
కామేశ్వర రావుగారు, గరికపాటి వారి అవధానం లంకె ఇప్పుడు active గా లేదు. click చేయటానికి లేదు. నేను ఈరోజే ఈ బ్లాగ్ చూస్తున్నాను. మీరు ఆ లింక్ పంపితే ధన్యుడ్ని. భద్రం కర్ణేభి: అన్నట్లు చెవులలో తుప్పు వదిలిన్చుకొంటాను. మీకు వీలువెంట ఫోన్ చేస్తాను. లింక్ మాత్రం lanpad@gmail.com పంపండి దయచేసి.
ReplyDeleteముందుగా ధన్యవాదాలతో,
చంద్రశేఖర్