తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, October 25, 2011

దీపావళి చందమామ

టపా శీర్షిక చూసి, అమావాస్య చంద్రుడిలా దీపావళి చందమామ యేమిటని కంగారు పడకండి :-) దీపావళి నాడు ఆకాశంలో చందమామ కనిపించడు కనుకనే యీ బ్లాగాకాశంలోనైనా అతణ్ణి ఉదయించేట్టు చేద్దామని చిన్న కోరిక. నరకుడిని కృష్ణుడు చంపాడనో, రావణుణ్ణి రాముడు చంపాడనో దీపావళి చేసుకుంటారన్నది పైపై మాటలేననీ, అసలు రహస్యం మరొకటి ఉందనీ నా అనుమానం. ఏమిటంటారా? చెపుతాను, సావధానంగా వినండి.

దీపావళి ఎప్పుడు వస్తుంది? అమావాస్యనాడు. అది శరత్కాలంలో వచ్చే ఒకే ఒక అమావాస్య. శరత్కాలమంటే వెన్నెలరాత్రులకి ప్రసిద్ధి. ఇప్పుడంటే నగరాల్లో ఆకాశం ఆకాశహర్మ్యాల ఆక్రమణ మధ్య బితుకుబితుకుమంటూ చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే మనకి కనిపిస్తుంది. చంద్రుడు అసలే తప్పిపోతాడు. విద్యుద్దీపాల కాంతిలో వెన్నెల వెలవెల బోతుంది. ఋతువులకీ కేలండరు పేజీలకీ మధ్య, ఈ కాలపు నగరవాసులకి పెద్దగా తేడా తెలియదు. పల్లెప్రజలకింకా వాటితో అనుబంధం ఉందనుకుంటాను. శరత్కాలంలో పిండారబోసినట్లు వెన్నెల కాయడమంటే ఏమిటో వాళ్ళకి బహుశా తెలుస్తుంది. నా అదృష్టం కొద్దీ చదువుకొనే రోజుల్లో హాస్టల్లో ఉండేటప్పుడు, ఈ వెన్నెల అందాన్ని జుఱ్ఱుకొనే అవకాశం నాకు దొరికింది. కార్తీకమాసంలో, అప్పుడప్పుడే మొదలవుతున్న చిరుచలిలో, హాస్టల్ టెర్రెస్ మీద పచార్లు చేస్తూ, శరదిందుచంద్రికా వరసుధాధారలని చకోరమై ఆస్వాదించడం అందమైన అనుభవం. ఒక తీపి జ్ఞాపకం.

సరే, ప్రస్తుతానికి వస్తే, అలాంటి శరత్కాలంలో వచ్చే ఒకే ఒక అమావాస్య రాత్రి, చీకటితో నిండిపోతే సహించడమెలా? అదుగో అందుకే, ఆ రాత్రి దివ్వెలతో లోకమంతా వెలుగులు నింపెయ్యాలని, దీపావళి పండగని చేసుకోవడం మొదలుపెట్టి ఉంటామని నా ఊహ. అందుకే నా బ్లాగుని కూడా యివాళ జాబిలి జిలిబిలి వెలుగులతో నింపాలని అనుకుంటున్నాను. దీనికి మరొక ప్రేరణ రెండు రోజుల కిందట నాగమురళిగారి బ్లాగులో పెట్టిన "ఆకాశంలో ఆంబోతు" టపా.

ఇంతకీ మనకిప్పుడు కనిపించే యీ చందమామ ఎక్కడివాడు? ఎలా ఉన్నాడు? పద్యాలు చదవడం మొదలుపెట్టండి, మీకే బోధపడుతుంది.

ఆ యెచటొ యున్న యైరమ్మదీయ సరసి
లోని వెన్నెల జలము లీ లోకమందు
బాఱుదల కేర్పరచు వెలిపైడి తూము
చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

కలువపూల చెలిమికాడు చందురుడు నడిమింట వెలుగుతున్నాడు. అతడెలా ఉన్నాడంటే - ఆకాశంలో ఎక్కడో మనకి కనిపించని చోట మెఱుపుతీగల కాంతులీనే సరసు ఉందిట. ఆ సరసంతా వెన్నెలనీరు నిండి ఉంటుంది. ఆ నీటిని మన భూమ్మీదకి పారించడానికి ఒక తూముని ఎవరో ఏర్పాటు చేసారట. అది వెలిపైడి తూము. తెల్లని బంగారంతో - అంటే వెండితో చేసిన తూము. ఆ తూమే యీ చందమామట!

శ్రీ వివస్వత్ప్రభా సమాశ్లిష్టమూర్తి
పార్వతీప్రాణనాథు శోభాశరీర
మమృతకళకును సముపోఢమైన వెలుగు
చెలగె నడిమింట గలువల చెలిమికాడు

నిత్యమూ ఐశ్వర్యప్రకాశంతో (విభూతితో) వెలిగే శోభాశరీరము కలవాడు పార్వతీప్రాణనాథుడయిన శివుడు. ఆ శరీరానికి అతి దగ్గరలో ఉన్నందువలన చంద్రునికి కూడా ఆ అమృత కళ లభించింది. అలాంటి కళతో వెలిగిపోతున్నాడీ కలువల చెలిమికాడు. ఇతడు కార్తీకమాసపు చంద్రుడు కాబోలు. అందుకే శివుని విభూతి వెన్నెలగా కురుస్తోంది!

బహుళ రాజనీతిపరముండు రాముండు
తాను హనుమబంపి వాని చర్య
యెట్టులెట్టులుండు నీక్షించు నన్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

ఈ పద్యం అర్థమయితే సందర్భమేమిటో యిట్టే తెలిసిపోతుంది! గొప్ప రాజనీతిజ్ఞుడట రామచంద్రుడు. హనుమంతుడిని సీతాన్వేషణకి పంపి, అతడెలా తన కార్యాన్ని నిర్వహిస్తున్నాడో స్వయంగా చూద్దామని వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడట ఆకాశంలోని యీ చంద్రుడు!

అదీ సందర్భం! హనుమంతుడు లంకలో సీతమ్మవారిని వెతుకుతూ ఉంటే పైనున్న చంద్రుడెలా ఉన్నాడో వర్ణించే పద్యాలివి.

మున్ను జూడనట్టి భూజాత గుర్తింప
బోవడేమొ కపివిభుండటంచు
దల్లిమోముపోల్కి దా జూపుచున్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

తాను సీతమ్మవారిని ఎప్పుడూ చూసింది లేదే! మరి ఆమెని పోల్చుకోవడం ఎలా? హనుమంతుడలా అవస్థపడుతూ ఉంటే, అతనికి సహాయం చెయ్యడానికి ఆ అమ్మ పోలికని తాను చూపిస్తున్నాడా అన్నట్టుగా వెలుగుతున్నాడట చందమామ. ఎంతటి అద్భుతమైన ఊహ!

చిన్ననాటినుండి చందమామ చందమామ అని మన పెద్దవాళ్ళు చెపితే మనమూ అలాగే పిలిచేస్తూ వచ్చాము కాని, అసలు చంద్రుడు మనకి మామ ఎలా అయినాడో మనమెప్పుడయినా ఆలోచించామా? జగాలని పాలించే తండ్రి నారాయణుడు. చల్లని తల్లి లక్ష్మీదేవి. చంద్రుడు మరి లక్ష్మీదేవి తమ్ముడే కదా. ఇద్దరూ పాలసముద్రం నుండే పుట్టారు కాబట్టి వారు తోబుట్టువులు. మరి అమ్మ తమ్ముడు మనకి మేనమామే కదా అవుతాడు. అదీ ఆ పిలుపు వెనక రహస్యం. ఆ సంబంధాన్ని ఇక్కడ అందంగా ఉపయోగించాడు కవి. సీత సాక్షాత్తు లక్ష్మీదేవి. అక్కా తమ్ముళ్ళ మధ్యన పోలికలుంటాయి కదా. ఆ పోలికలు చూపించడానికని వచ్చినట్టున్నాడట చంద్రుడు. ఏమిటా పోలిక? చివరి దాకా చదవండి తెలుస్తుంది.

ఆంజనేయుడు మందరమై వియన్మ
హాంబునిధి వేఱ త్రచ్చిన నమృతకుంభ
మిదియు నూతన ముదయించెనేమొ యనగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఇది మరొక అద్భుతమైన ఊహ. ఆకాశమనే పాలసముద్రాన్ని ఆంజనేయుడే మందరపర్వతమై చిలకగా, అందులోనుండి మళ్ళీ కొత్తగా ఉద్భవించిన అమృతకుంభమా అన్నట్టుగా ఉన్నాడట చంద్రుడు!

చల్ల చేసి రాత్రి చల్లపై జేసిన
వెన్నముద్దగాగ విడిచె ననగ
చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై
చెలగె మింట గలువచెలిమికాడు

రాతిరనే భామ వెన్నెల మజ్జిగని చిలికింది. మజ్జిగ చిలికితే పైన వెన్న ముద్దగా తేలుతుంది కదా. ఆ తేలిన వెన్నముద్దని అలాగే ఉంచేసిందిట. చిలికేటప్పుడా వెన్ననుండి కొన్ని తుంపరలు చెల్లాచెదరై చూట్టూ పడ్డాయి. ఆకాశం మధ్యలో వెలిగే చందమామ ఆ వెన్నముదట. చుట్టూ పరచుకుని ఉన్న చుక్కలే ఆ వెన్న తుంపరలట!
పైన అమృతమధనం పౌరాణికమైన కల్పనయితే, యిది పల్లెదనం నిండిన పోలిక. రెండిటిలోనూ ఉన్నది చిలకడమే! ఈ కవి ఊహ ఎంతగా ఆకాశాన్ని తాకుతుందో, దాని మూలాలు అంతగా నేలలోకి చొచ్చుకొని ఉంటాయి!

లంకలోన గలదు లావణ్యనిధి సీత
ప్రతిఫలించె నామె వదనసీమ
యాకసంపు సరసియం దన్నయట్లుగా
జెలగె మింట గలువచెలిమికాడు

కింద లంకలోనున్న సౌందర్యనిధి సీత మోము, పైన ఆకాశమనే సరస్సులో ప్రతిఫలిస్తోందా అన్నట్టుందట ఆ జాబిల్లి. అమ్మవారికీ చందమామకీ ఉన్న పోలిక యిదీ!

ఇవీ యీ చందమామ విశేషాలు. ఈపాటికే యీ కవి ఎవరో మీరు ఊహించే ఉంటారు. అవును విశ్వనాథ సత్యనారాయణగారే. రామాయణ కల్పవృక్షంలో సుందరకాండలో పూర్వరాత్రమనే ఖండములోని పద్యాలివు. ఈ సందర్భంలో చంద్రవర్ణన యిరవై పద్యాలలో సాగుతుంది. నాకు బాగా నచ్చిన కొన్ని పద్యాలిక్కడ పంచుకున్నాను. ఇదే సందర్భంలో వాల్మీకి కూడా చంద్రవర్ణన చేసారు. నాగమురళిగారి టపాలో వాటిని చదువుకోవచ్చు. రెండిటినీ పోల్చినప్పుడు నాకు తోచినది ఏమిటంటే - వాల్మీకి వర్ణనల్లో ఒక ముగ్ధ సౌందర్యం ఉంది. అమాయకమైన ఒక పల్లెదనముంది. అతను మౌని. అందులో కొన్ని కొన్ని విశేషాలు నిగూఢంగా స్ఫురిస్తాయి. విశ్వనాథ వర్ణన అలా కాదు. ప్రౌఢమైనది. ఒక నాగరీకుడయిన కవి చేసిన ఊహలుగా కనిపిస్తాయి. వాల్మీకి వర్ణన నేరుగా కథకి సంబంధం లేనిది. విశ్వనాథ వర్ణన కథకి అనుసంధానమైనది. వీటిలో వాచ్యత అధికం. అయినా మనోహరమైనవి, ఔచితీశోభితమైనవి. వాల్మీకి వాల్మీకే. విశ్వనాథ విశ్వనాథే. రామ రావణ యుద్ధమంటే రామ రావణ యుద్ధమే!

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

పూర్తిగా చదవండి...

Monday, October 10, 2011

కాటుకకంటినీరు...

కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!

ఈ పద్యమే చాలాసేపటినుండి హృదయంలో మాటిమాటికీ కదలాడుతోంది. నేను పోతనంత మహానుభావణ్ణి కాను కనక, ఆ శారదా స్వరూపం నాకు సాక్షాత్కరించలేదు. కాని మనసులో ఆ మూర్తి మరీమరీ మెదులుతూనే ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు. అసలు రాచరికమే లేదు. ఆకలికోసం "బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది. అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే, మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు. ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!

గుండె మండిపోతోంది. తెలుగు వార్తాపత్రికల్లో సాహిత్యపుటలు చదవడం మానేసి ఏడాదిపైగా అవుతోంది, చదవలేక. ఇవాళ ఒక అంతర్జాలపు లంకె ద్వారా వెళ్ళి ఒక పత్రికలోని వ్యాసం చదివాను, దురదృష్టవశాత్తు. దాని ఫలితమే యీ ప్రేలాపన. రేపు శరత్‌పౌర్ణమి. ఏవో నాకు తెలిసిన నాలుగు శరదృతు వర్ణనలు టపా పెడదామనుకున్నాను. మొత్తం మూడంతా పాడైపోయింది!

నాకు పోతనంత ఆర్ద్రతా లేదు, సరస్వతిని ఓదార్చే శక్తీ లేదు, అంత ఆర్ద్రంగా పద్యము రాయనూ లేను. ఏదోలా నా మనోభావాన్ని వ్యక్తం చేయబూనితే వచ్చిన వెఱ్ఱికేక యిది:

కుక్కలరీతి నొండొరులు కొట్టుకుజచ్చుచు నీ సుశీలమున్
పీక్కు తినంగ గెంతులిడు బిడ్డలపై మమకారమేల? నీ
వాక్కును నాల్కలన్ జెఱపివైచి మమున్నొక మూగజాతిగా
గ్రక్కున మార్చివేయగదె గాదిలి చూపక తల్లి భారతీ!
పూర్తిగా చదవండి...

Monday, October 3, 2011

పోతన కవితామాధుర్య రహస్యం

మొన్న పోతన పద్యాల గురించి టపాయిస్తున్నప్పుడు, కరుణశ్రీగారి పద్యమొకటి గుర్తుకొచ్చింది:

అచ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!

పోతన కవితామాధుర్యాన్ని కొన్ని వస్తువులతో పోలుస్తున్నారిక్కడ. స్వఛ్చమైన జుంటితేనె, చంద్రబింబంనుండి స్రవించే అమృతరసము, గోర్వెచ్చని పాలమీగడ, అప్పుడే విచ్చుకున్న గులాబి మొగ్గలు - వీటికి అసూయ కలిగించేలా ఉంటుందట పోతన కవిత్వం. ఏదో రకంగా తాను చవిచూసిన మాధుర్యాన్ని మాటల్లో చెప్పాలన్న తాపత్రయమే కాని, నిజానికి ఆ మాధుర్యం అనుభవైకవేద్యమే కాని ఉపమానాలకి అందుతుందా! అంతటి మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఎక్కడినుండి వచ్చిందో, అని ఆశ్చర్యపోతున్నారు కూడా. అలా ఆశ్చర్యపడి ఊరుకో లేదు:

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

అని దానికొక అందమైన ఊహనికూడా జోడించారు. ఆ మాధుర్యం వెనక కారణం పంచదార అని కరుణశ్రీగారి ఊహ. అంటే అంత తియ్యగా ఉంటుంది అతని రచన అని! కరుణశ్రీ స్వయంగా ఒక కవి కాబట్టి కవితాత్మకమైన అలాంటి కల్పన చేసారు. ఒక వ్యక్తిలో కనిపించే అసాధారణ విశిష్టత గురించి ఏవో కల్పనలు చెయ్యడం మానవ సహజం కాబోలు. ముఖ్యంగా మన భారతీయులకి అది బాగా అలవాటనుకుంటాను. ఊహ, కల్పనే కావచ్చు. అయినా, ఏదో ఒక కారణం వెతకడం మనకొక సరదా.

ఈ మధ్య సౌందర్యలహరి చదువుతూ ఉంటే నాకూ అలాంటీ ఒక ఊహ కలిగింది. ఆ ఊహకి మూలమైన శ్లోకం:

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటామ్
వరత్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్
సకృన్నత్త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణా ఫణితయః

సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులవారు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించడం వల్ల కలిగే వివిధ శక్తుల గురించి వివరిస్తారు. ఈ శ్లోకంలో అమ్మవారి సరస్వతీ రూపాన్ని వర్ణిస్తున్నారు. శరత్కాలపు వెన్నెలంత స్వచ్ఛమైనది తెల్లనిది, చంద్రవంకతో కూడిన జటాజూటం కలిగినది, అభయ ముద్ర, వరద ముద్ర, అక్షమాల, పుస్తకము ధరించిన చేతులు కలిగినది, అయిన నీ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి తేనె పాలు ద్రాక్షరసముతో పోల్చదగిన తియ్యని కవిత్వ శైలి లభిస్తుంది అని అర్థం.
శరత్కాలానికీ శారదకీ ఉన్న అవినాభావసంబంధం ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది.

పోతన అలాంటి సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణమని నా ఊహ. పోతన ఆ రూపాన్ని ఆరాధించాడనడానికి ఏమిటి సాక్ష్యం అంటే, అతని యీ రెండు పద్యాలు:

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి!

ఇక రెండో పద్యం:

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్

అక్షమాల, పుస్తకము (చిలక, పద్మము కూడా) కలిగిన వాణీ స్వరూపాన్ని మ్రొక్కే పద్యమిది.

ఈ రెండు పద్యాలబట్టి పోతన సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన స్వరూపాన్ని ఆరాధంచాడనీ, పోతన కవితామాధుర్యం వెనకనున్న రహస్యం అదేనని ఊహించడం అసమంజసం కాదు కదా!

ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి. ఆ శక్తికి సంకేతం సరస్వతీ స్వరూపం. అలాంటి అనేక శక్తి రూపాలని ఆరాధించే పండుగ దసరా. పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:

హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

అందరికీ దసరా శుభాకాంక్షలు!
పూర్తిగా చదవండి...