తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, October 10, 2011

కాటుకకంటినీరు...

కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!

ఈ పద్యమే చాలాసేపటినుండి హృదయంలో మాటిమాటికీ కదలాడుతోంది. నేను పోతనంత మహానుభావణ్ణి కాను కనక, ఆ శారదా స్వరూపం నాకు సాక్షాత్కరించలేదు. కాని మనసులో ఆ మూర్తి మరీమరీ మెదులుతూనే ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు. అసలు రాచరికమే లేదు. ఆకలికోసం "బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది. అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే, మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు. ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!

గుండె మండిపోతోంది. తెలుగు వార్తాపత్రికల్లో సాహిత్యపుటలు చదవడం మానేసి ఏడాదిపైగా అవుతోంది, చదవలేక. ఇవాళ ఒక అంతర్జాలపు లంకె ద్వారా వెళ్ళి ఒక పత్రికలోని వ్యాసం చదివాను, దురదృష్టవశాత్తు. దాని ఫలితమే యీ ప్రేలాపన. రేపు శరత్‌పౌర్ణమి. ఏవో నాకు తెలిసిన నాలుగు శరదృతు వర్ణనలు టపా పెడదామనుకున్నాను. మొత్తం మూడంతా పాడైపోయింది!

నాకు పోతనంత ఆర్ద్రతా లేదు, సరస్వతిని ఓదార్చే శక్తీ లేదు, అంత ఆర్ద్రంగా పద్యము రాయనూ లేను. ఏదోలా నా మనోభావాన్ని వ్యక్తం చేయబూనితే వచ్చిన వెఱ్ఱికేక యిది:

కుక్కలరీతి నొండొరులు కొట్టుకుజచ్చుచు నీ సుశీలమున్
పీక్కు తినంగ గెంతులిడు బిడ్డలపై మమకారమేల? నీ
వాక్కును నాల్కలన్ జెఱపివైచి మమున్నొక మూగజాతిగా
గ్రక్కున మార్చివేయగదె గాదిలి చూపక తల్లి భారతీ!

37 comments:

  1. ఎందుకండీ అంత విచారిస్తారు?! ’దిన’/వార్తా పత్రికల్లో మీరు చూసినవి సాహిత్యం పేజీలు కాదు, కామెడీ పేజీలు. ఆ కామెడీకే మీరలా బాధపడిపోతే ఎలా?? వెబ్ పత్రికల్లో, బ్లాగుల్లో చర్చలూ గట్రా మీరు చూడరా ఏమిటి? లేకపోతే చూస్తూనే ఉన్నా మీరింకా బండబారిపోలేదన్నమాట. బాబ్బాబు, కాస్త మీలోని ఈ సున్నితత్వాన్ని నిలుపుకునే ఉంచుకోండీ...

    మీవల్ల జరగాల్సిన గొప్ప పనులు చాలా ఉన్నాయి... తెలుగు తల్లి మీరు చేసే అర్చనలకోసం, అలంకారాలకోసం ఎదురు చూస్తోంది. మీరు ఇలా డీలాపడిపోతే ఎలా?

    ReplyDelete
  2. మీరే వ్యాసం చదివారో తెలీదు. మనిషనింతర్వాత అన్ని అంగాలు ఉంటాయి. సంస్కారులు ముఖాన్ని చూపి కప్పుకోవలసినవి కప్పుకుంటారు. కుసంస్కారులకు ఆ విచక్షణ ఉండదు. అది వారి ఖర్మ అంతే. మధ్యలో మనకెందుకు?

    ReplyDelete
  3. పౌర్ణమి కదండీ - పిచ్చి ప్రేలాపనలకు అడక్కుండానే ఊతం...మీది కాదండోయ్ ...వారిది.....ఏం ఫరవాలా! మన గుండెలు మండించుకోటం ఎందుకు? మూడు పాడుచేసుకోటమెందుకు? కళ్ళల్లో నీళ్ళు తిరిగించుకోటమెందుకు? మండినా, పాడైనా, తిరిగినా - పౌర్ణమికి అమావాస్యకి స్థిమితం తప్పే పిచ్చి ము.కొ లు పిచ్చి ము.కొ ల్లానే ఉంటారండి....ప్రకృతి నియమమది! ఆ నియమం మారేది లేదు కాబట్టి - వాడి పేరునో, వారి పేరునో సామూహిక తర్పణ చేయిద్దాం వీలుంటే....

    తప్పు తప్పు - సరస్వతీ పుత్రులు మీరే కంట తడిపెడితే - తల్లి మనసు ఇంకా బాధపడిపోతుందండీ బాబూ... కంట్రోల్, కంట్రోల్ ....ఓ టపా వెయ్యమని ఆజ్ఞ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, ఏసేస్తా!

    ReplyDelete
  4. సింహవాహినీ శ్రీశాంభవీ స్వయంకాలస్వరూపిణీ త్రిదేవి అయిన అమ్మవారికి రక్షణ కల్పిస్తామనే మనలాంటి, పోతనవంటి గూదరులను జూచి అమ్మవారి శారదవదనాన ఏ దరహాసము పుడుతుందోగద :)

    ఆ మాటంటే గుర్తుకువచ్చింది నా ఈ పజ్జం।
    ఈ పబ్బానికి ఈ పజ్జం మీ యింటనున్న శ్రీవాణీశారదమ్మకి నా అంకితం।

    మ।
    శారికాజనచైత్రరావము శారదాదరహాసమే।
    సౌరసింధువు సస్యదానము శారదాదరహాసమే।
    చారుశారదరాత్రకౌముది శారదాదరహాసమే।
    క్షారసాగరశుక్లఫేనము శారదాదరహాసమే॥

    ReplyDelete
  5. తప్పు తప్పు - సరస్వతీ పుత్రులు మీరే కంట తడిపెడితే - తల్లి మనసు ఇంకా బాధపడిపోతుందండీ బాబూ...

    avunu.

    మీరు చదివినది నేను చదివినదే అయివుంటుందనుకొంటున్నాను. సాహిత్యంలో కోటాలేమిటో అర్ధంకాక కాసేపు బాధనిపించింది

    బొల్లోజుబాబా

    ReplyDelete
  6. ఊరట మాటలు చెప్పినందరికీ కృతజ్ఞతలు.

    ReplyDelete
  7. కామేశ్వర రావు గారు,

    ఎంతటివాడికైనా ఒక క్షణం స్థైర్యం జారుతుందని నారదుడు తన కథనే చెప్పటం తోనూ, మీవంటివారు ఇట్లాంటి టపా పెట్టటం తోనూ తెలుస్తుందని నేనుభావిస్తున్నా అంతేకానీ మీకు నిజంగానే ఎన్నడూ ఎఱుగని సంఘటన ఎదురయ్యిందనో, మీరు డీలాపడ్డ స్థితి నుండీ కోలుకోలేకపోయారనో కలలో కూడా అనుకోను. ఎదో హనుమంతుని ముందు కుప్పి గెంతుల్లా నా స్పందన...

    మీకు తెలియనిది కాదు, ఎవరికి వారికి వారి జీవలక్షణం ఒకటుంతుంది. కల్పవృక్షాలకూ, విషవృక్షాలకూ వేర్వేరు పాఠకులు లేరు? బూతు సాహిత్యం భాగవత పుస్తకాలకన్నా ఎక్కువ సర్కులేషను, ముద్రణలూ పొందుతూంటే పొందవచ్చుగాక. అంతోంటిదానికి సున్నిత మనస్కులు మీరు అనసు పాడుచేసుకోవటం ఎందుకు?

    దుర్గమ్మ తల్లీ, అటెన్పు కడగంటి చూపు కూడా పోనీయకుండా నన్ను దాటించెయ్యమ్మా అనుకుంటే పోలా? అవసరమైతే పరధనముల్ హరించి పరభామల జూచి సుఖింప గోరు మద్గురుతర మానసంబనెడి దొంగను బట్టి నిరూఢ దాస్య విస్ఫురిత వివేక పాశముల జుట్టి భవచ్చరణంబనే మరుత్తఱువున గట్టివేయగదే అన్నట్టు వేడుకుంటే పోలా?

    ReplyDelete
  8. టాపిక్కు కొంచం డైవర్టు చేసి కొన్ని ప్రశ్నలేస్తే మాస్టారి రూపమెత్తి నన్ను కోప్పడే సందర్భం తో మీరు మళ్ళి మీస్వస్వరూపం లోకి వచ్చేసి మా-స్టారౌతారని ఆశతో.. ఈ చిన్న ప్రయత్నం

    కాటుకకంటినీరు విషయం వచ్చింది కాబట్టి పద్యం emotional గా (సినిమా పరంగా చెప్పాలంటే 'ఆది' సినిమాలో జూనియర్ ఎంటీవోడు emotions పండించినట్టుగా) ఉంది no doubt, కానీ నిజంగానే కాటుకకంటినీరు చనుకట్టుపయింబడేట్టు హాటకగర్భురాణి ఏడుస్తుందంటారా? అది పోతనామత్యుడు రాసిన పద్యమే అంటారా? విష్ణు, నారాయణ, వాసుదేవోపాసనలే సాధనా సోపానలని హృదయస్థమైన ధర్మసూక్ష్మమని సూచించ తలపోసిన భాగవతాన్ని ప్రారంభించే ముందు పోతన కర్నాట కిరాట కీచకులు అని సంబోధిస్తాడా? నావిష్ణుః పృథివీపతిః అన్నదే సత్యమైతే కంసుడూ, జరాసంధుడూ ఇత్యాది రాక్షసులు కూడా విష్ణ్వాంశ గల్గినవారే అయ్యుండాలి కదా (వారిలో విష్ణ్వాంశ బహు కొంచమే ఉండచ్చు గాక). అట్లాంటిది ఇమ్మనుజేశ్వరాధములు అనో, కీచకులు అనో అకారణం గా పోతన సంబోధిస్తాడా?పైపెచ్చు కర్ణాట, కిరాట రాజులేమైనా తనను బలవంతం చేసారా ఆ కృతిని అంకితమిమ్మని? పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడత అన్నప్పుడు ఈ భాగవత కృతికి రాముడిది కదా కర్తృత్వమూ, స్వామిత్వమూ, అట్లాంటిది ఇది నాది అనీ, దానిని రాజాధములకు ఇవ్వనని పోతన అంటాడా? అందరిలో వసించేవాణ్ణి ఉపాసనచేయమంటున్న కృతిని రాజుకిస్తే భారతీదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తుందా?

    ఒకవేళ పోతనగారికి ఏ బలహీన క్షణం లోనో మిగిలిన కృతులనిచ్చినట్టే ఈ కృతిని కూడా ఏదో ఒక రాజుకంకితం ఇద్దామన్న ఆలోచనే వచ్చి ఉంటే, ఇచ్చే ముందు ఎంతో టెంప్టేషన్ కలిగించినా త్యాగరాజస్వామి వారు "ఓ మనసా, తేల్చి చెప్పెయ్యి నీకేది కావాలో... నిధి కావాలా? రాముని సన్నిధి కావాలా అని once for all అడిగి తేల్చుకున్నారు కదా అల్లా తనను తాను అడుగుకొని ఆపై ఇవ్వట్లేదు అని తేల్చుకుని ఉండేవాడు కదా.. ఆయన అకితం ఇస్తాననుకోనూలేదు, ఇచ్చినదీ లేదు కానీ భారతీదేవిమాత్రం ఎక్కడ ఇచ్చేస్తాడో అని తొందరపడిపోయి కన్నీరుమున్నీరుగా విలపించేస్తుందంటారా?

    ఇది ఎవరో నావంటి ఆకతాయి, పోతన వీరాభిమాని(అని ఊహించేసుకుంటూ), కొంచం భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకెళ్ళడానికి పోతనగారి పేరున తన పైత్యం చూపించి ఉండవచ్చేమో అని నా పిల్లి బుఱ్ఱకు అనిపిస్తున్నది. కాదంటారా?

    (మనలో మన మాట: పైపెచ్చు అంతక ముంచు చేసిన కావ్యాలు, రచనలూ కర్నాట, కిరాట రాజులకు అంకితమిచ్చినవే. అధములూ, కీచకులూ అని అప్పుడులేని దోషం ఇప్పుడు పోతనకు సడన్ గా కలిగింది అంటారా?)

    అధిక ప్రేలాపన చేసుంటే క్షమించండి. పెద్దమనసుతో తప్పుల్ని ఒగ్గేసి సందేహ నివృత్తి చేయండి. నా ఈ వ్యాఖ్య, లాజిక్కు చూసి ఆ భారతీదేవి గానీ మళ్ళీ భాధగానీ పడుతుందో ఏమో... అందుకే "నా ఈ అజ్ఞానం నుండీ జ్ఞానం వైపు అడుగేసేట్టు నన్ను అనుగ్రహించమ్మా " అని ఆవిడకి శత సహస్ర వందనాలు/ వేడికోలు

    ReplyDelete
  9. సనత్,
    ఇమ్మనుజేశ్వరాధముల పద్యం ప్రక్షిప్తమని పెద్దలు చెప్పేదే (భాగవత రహస్య ప్రకాశంలో మాస్టరు గారు కూడా అన్నమాటే). కానీ కాటుక కంటి నీరు ప్రక్షిప్తమని పెద్దలు అన్నట్టు నాకు గుర్తు లేదు... ఒకసారి భాగవత రహస్య ప్రకాశం మొదటి వాల్యూమ్ రెఫర్ చేసి చూస్తే బాగుంటుందేమో...

    ReplyDelete
  10. సనత్, కాటుక కంటి నీరు పద్యం వెనకాల ఒక కథ ఉంది. భాగవతాన్ని అంకితం ఇమ్మని పోతనని ఒక రాజు బలవంతం చేస్తాడు. నీ వ్యాఖ్య చదివితే ఆ కథ నీకు తెలిసి ఉండదేమో అనిపిస్తూంది.

    ReplyDelete
  11. మురళీ ఒకవేళ రాజెవరైనా బలవంతం చేసినా (రహస్య ప్రకాశం రిఫర్ చేసి మళ్ళీ వస్తాకానీ) కర్నాట కిరాట "కీచకులు" వంటి పద ప్రయోగం భాగవతంలో నేన్చదువుకున్నంత వరకూ ఎక్కడా కనిపించలేదు. అందునా ఇది తన స్వంతం విషయం అనుకో... ఒకవేళ తెర వెనుక కథ ఉన్నా అంకితం ప్రసక్తి భాగవత రచన పూర్తయ్యినతరువాత వచ్చి ఉంటుందా? ముందే వచ్చి ఉంటుందా? ఒక వేళ ముందే వచ్చి ఉంటే భాగవతము "తెలిసి పలుకుట" చిత్రంబు శూలికైన తమి చూలికైన అని తలపోసిన పోతన వాసుదేవోపాసన చేయలేకపోయుంటాడా? తాను నమ్మనిది పోతన రాశుంటాడా?
    ఆ పద్యం యొక్క ప్రయోజనం పోతనలోని ఉదాత్తతనూ ఎలివేట్ చేయడానికి అన్నట్టు ఉంటుంది కాదనగలమా?
    అంత ఉదాత్తమైన భాగవతాన్ని రాయబోతున్నాడని తెలిసిన భారతీ దేవి దానిని వ్రాయ సమర్థత కల్గిన పోతనపై మాత్రం అపోహ పెట్టుకుంటుందనీ కంటనీరు పెట్టుకుంటుందని ఎక్కడ బలహీన క్షణం లో ఇచ్చేస్తాడని అపోహ పడి ఉంటుందని తాను గ్రహించాననీ ఆవిడకి అంతటి దుర్గతి రాకూడదని తలచి ఆ పద్యాన్ని చెప్పి ఆవిడ మనసు కుదుట పరచానని పోతన తనగురించి తానే చెప్పుకున్నాడని అంటే మనసొప్పటం లేదు.

    లక్ష్మనూడంటే కొంచం ఆవేశపడి ఉంటాడు కానీ పలికించెడివాడు రామ భద్రుడైతే ఇంకొకళ్ళను అందునా కృతిని అంకితమిమ్మని బలవంతం చేసినంత మాత్రాన కీచకులు అంటాడా? కైకనే ఏమాట అనక కాల వశమన్నవాడు ఏడవకమ్మా అని పోతనచేత పలికిస్తాడంటే నమ్మకం గా లేదు

    నావరకు నా రాముడు, నా పోతనా ఎప్పటికీ అటువంటి తేలిక మాట అనరుగాక అనరు (నాది పిల్లి బుఱ్ఱ ఆలోచనేనేమో.. తెలీదు)

    ReplyDelete
  12. సరిగ్గా నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంటే ఇమ్మనుజేశ్వరాధముల పద్యం విషయంలో చేశారు మాస్టరు గారు. కానీ కాటుకకంటినీరు గురించి ఏమన్నారో గుర్తు రావడం లేదు. కానీ నీ మాటలతో నేను అంగీకరిస్తున్నాను. అదే ఆర్గ్యుమెంటు దీనిక్కుడా అప్లై చెయ్యొచ్చు. కాబట్టి కాటుకకంటినీరు పద్యం కూడా ప్రక్షిప్తమే అయ్యి ఉండాలి.

    ReplyDelete
  13. సరస్వతీ ఋక్కులలో ఆవిడని పెట్టుబడిగా పెట్టుకుని వాడుకుంటున్నారు గానీ ఆవిడని తెలియకున్నారు అన్నారు అంటే ఏమి పలికినా అన్నిట్లోనూ ఉన్నది ఆవిడే అనే కదా. సరస్వతీ దేవి చెత్త చెత్త రచనలలో ఉన్నది నేను కాదు, ఎవరికో అంకితమిస్తే, అట్లాంటి కావ్యాల్లో నన్ను రాస్తే నేను బాధపడతాను అని పక్షపాతం చూపిస్తుందన్నట్టు పలకటం అతిశయోక్తి అలంకారం తో లేని భావాలను ఆపాదించినట్టు అనిపిస్తోంది నాకు. తప్పంటావా?

    చెత్త మీదనుండి సాగే గాలి ముక్కు మూసుకుంటుందా? పూల పరిమళం ఎందుకు మోసుకుపోవటం లేదు అని గుణ గణనం చేస్తుందా? ఉచితానుచితాలు చూస్తుందంటావా? సరస్వతీ దేవి అట్లా భావించి ఉంటుందంటే నావరకు నాకు నమ్మకం కలగటం లేదు.

    రాక్షసులు తనపై జీవులను బాధపెడుతున్నారనే బాధపడి భూభారాన్ని తగ్గించమని కోరుకుంటుందే కానీ రాక్షసుడు పుట్టగానే అన్యాయం అయిపోయినట్టు బాధపడ్డట్టుగా ఎక్కడా రచనలేదు కదా, అంకితం ఇస్తే కృతి మొత్తం అపవిత్రం అయిపోతుందని పోతన/ సరస్వతీ భావించటం, అది జరగకుండా సరైన సమయం లో కళ్ళు తెరిచినట్టు రాయటం అంత సమంజసం కాదేమో కదా.

    ReplyDelete
  14. మురళీ నీ వ్యాఖ్య చూడక ముందు నా చివరి వ్యాఖ్య రాశాను.. పోస్టు చేశాక అప్డేటయ్యింది.... :-)

    ReplyDelete
  15. బహుశా కామేశ్వర రావుగారనుభవించిన మానసిక వేదనే ఎవరికో కలిగి ఉంటుంది (అది కలగటం సహజమే) ఎవరి మాటల్లోనో చెబితే అంతగా బుఱ్ఱకెక్కుతుందో ఎక్కదో అప్పటికాలానికి ప్రమాణికం గా ఉన్న ఉత్తమ కావ్యాల్లో జొప్పించేస్తే ఇకపై రాబోయే తరాలవారు అటువంటి తప్పులను చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో చేసిన రచన అయ్యుండచ్చు... ఏది ఏమైనా పద్యం మాత్రం నిజంగానే కదిలించి వేస్తుంది.. (పోతనది కాకపోయినా).

    కాబట్టి కామేశ్వర రావుగారు నేను మీతో సహ వేదనను అనుభవిస్తున్నా.. మీకు త్వరలోనే ఊరటకలగాలనీ ప్రశాంత చిత్తత చేకూరాలనీ, పిచ్చి రచనలతో ఒకవేళ అమ్మవారి పాదాలు అపవిత్రమైపోయి ఉండుంటే వెంఠనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆణిముత్యాలవంటి రచనలతో, టపాలతో అభిషేకించి మా అందరిపై ఆ పాద తీర్థాన్ని ప్రోక్షణ చేయాలనీ కోరుతున్నా...

    ReplyDelete
  16. సనత్ గారు,

    కాటుకకంటినీరు పద్యం పోతన నోటినుండి వచ్చిందనడానికి మీ మనసొప్పడం లేదు. దాన్ని కాదనడానికి నేనెవరిని!?
    "నావరకు నా రాముడు, నా పోతనా ఎప్పటికీ అటువంటి తేలిక మాట అనరుగాక అనరు" - అని తేల్చి చెప్పాక నిజానికి చర్చిండానికి ఏమీ లేదు. అయినప్పటికీ నాకు తెల్సిన కొన్ని విషయాలు, నా ఆలోచనలూ ఇక్కడ పంచుకోవాలని (చర్చకోసం కాదు) ఇది వ్రాస్తున్నాను.

    1. కాటుకకంటినీరు, బాలరసాలసాల పద్యాలు రెండూ భాగవత అవతారికలో లేవు. ఇవి పోతన చాటువులుగా మాత్రమే ప్రసిద్ధి పొందాయి. ఇమ్మనుజేశ్వరాధములు పద్యం మాత్రం అవతారికలో ఉంది. అయితే యిది పోతన పద్యం కాదని కొంతమంది అభిప్రాయం. ఈ మూడు పద్యాలూ పోతనవే అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు, ప్రసాద రాయకులపతిగారు మొదలైన వారి అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ప్రత్యేకించి ఆధారాలేమీ లేనప్పుడు ఏదైనా ఊహే అవుతుంది.

    2. "నిజంగానే కాటుకకంటినీరు చనుకట్టుపయింబడేట్టు హాటకగర్భురాణి ఏడుస్తుందంటారా?" - ఈ సంగతి నాకు తెలియదు. నా వరకూ సరస్వతి అయినా, లక్ష్మి అయినా, దుర్గ అయినా శక్తికి సంకేతాలే. ఆ శక్తికి నిజంగా కనులు, ఆ కనులకు కాటుక, చనుకట్టుతో కూడిన రూపం ఉంటుందా అంటే, ఏమో! నా వరకూ అది భక్తుల హృదయాలలో రూపుకట్టే రూపం మాత్రమే. అంచేత నిజంగానే సరస్వతీ దేవి ఏడుస్తుందా, అందులో ఔచిత్యముందా అంటే, దానికి సమాధానం నా దగ్గర లేదు.

    3. "అది పోతనామత్యుడు రాసిన పద్యమే అంటారా?" - ఇది కాస్త ఆలోచించగలిగిన ప్రశ్న.

    అ)రాసి ఉండడు అనడానికి మీకున్న ఒక అభ్యంతరం "కర్ణాట కిరాట కీచకులు" అనే ప్రయోగం. "కీచకులు", "కూళలు", "మనుజేశ్వరాధములు" వంటి ప్రయోగాలని పోతన చెయ్యడని ఒక నమ్మకం. నా మటుకు నాకది అన్యాయంగా అనిపిస్తుంది. మనకి మనమే పోతన గురించి ఒక చిత్రాన్ని గీసుకొని, అతడిలా అని ఉండడు అనుకోడం ఏమి సమంజసం. తనని బాధించిన, లేకా దుర్మార్గులయిన రాజులపై తన అసహ్యాన్ని ప్రదర్శించే హక్కే పోతనకి లేకుండా చెయ్యడం కాదూ అది! పైగా ఇందులో అనౌచిత్యమేముంది? దుష్టులైన పౌండ్రక వాసుదేవులవంటి రాజులని ఉద్దేశించి "మనుజేంద్రాధమ" వంటి ప్రయోగాలు భాగవతంలో ఉన్నాయి. అధములని అధములని, దుర్మార్గులని కీచకులనీ సంబోధించడంలో అనౌచిత్యమేమాత్రమూ లేదని నా అభిప్రాయం.

    ఆ) రెండవది, అసలు సరస్వతీ దేవికి పోతన మీద అంత అపనమ్మకమా? అన్న ప్రశ్న. పైన చెప్పినట్టుగా సరస్వతీదేవి గురించి నేను చెప్పలేను. పోతనపై అలాంటి వత్తిడి కలగడానికి ఎంతయినా అవకాశం ఉంది. అంతకు ముందు కృతులని నరాంకితం చేసినవాడే కాబట్టి, దీనిని కూడా అలాగే చేస్తాడనీ చెయ్యాలనీ ఇతరులు కోరుకోడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ రాజులు, ఇతరలు దాని గురించి తనపై వత్తిడి తెచ్చే అవకాశమూ ఉంది. అలాంటి సందర్భంలో, తాను దీనిని నరాంకితం చేస్తే, తానిప్పుడు ఎంతో భక్తితో కొలిచే సరస్వతి బాధపడుతుందని పోతన భావించడంలో అసమంజసమైనదీ ఏమీ లేదు. అలాంటి భావావేశంలోంచి ఆ భారతీస్వరూపం రూపుకట్టడమూ, పోతన తన తల్లిని ఓదార్చి భరోసా ఇవ్వడంలో విడ్డూరమేమీ నాకు కనిపించడం లేదు.
    అసలు రాజుకి అంకితమిస్తే సరస్వతి బాధపడుతుందా? అనే ప్రశ్నకి, మళ్ళీ నా సమాధానం సరస్వతీదేవి గురించి నాకు తెలియదనే. పోతన మాత్రం బాధపడ్డాడు. భాగవతాన్ని సాక్షాత్తూ ఆ విష్ణువుకే అంకితమివ్వాలన్నది అతని దృఢ నిశ్చయం. ఎందుకంటే తానీ రచన ద్వారా కోరుకుంటున్నది కైవల్యం. అది ఇవ్వగలిగినది ఆ పరమాత్ముడే కాని రాజులు కాదు. తనకి ముక్తినిచ్చేంత పవిత్రమైన ఆ భాగవతాన్ని రాజులకి ఇవ్వడం పాపమని అతను భావించాడు. అందుకే అలా ఇవ్వబూనితే సరస్వతీదేవి బాధపడినట్లుగా భావించాడు.

    ఇ) పై కారణాల వలన పోతన ఆ పద్యం వ్రాసాడనుకోవడంలో నాకు అనౌచిత్యమేమీ కనిపించడం లేదు. ఇక, పోతన ఆ పద్యం వ్రాసే ఉంటాడనడానికి ఒక చిన్న ఊతం భాగవతం దశమస్కంధంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఊరికే రుక్మిణిని ఏవో మాటలతో ఏడిపిస్తాడు, అదేం సరదానో! రుక్మిణి ఆ మాటలకి బాధపడుతుంది. ఆ సందర్భంలో సీస పద్యం ఇలా మొదలవుతుంది:

    "కాటుక నెరయంగ కన్నీరు వరదలై
    కుచకుంభ యుగళ కుంకుమము తడియ"

    సరిగ్గా యీ "కాటుకకంటినీరు" భావమే! తనకి నచ్చిన ఒక భావాన్ని పోతన పలుచోట్ల ప్రయోగించడం భాగవతంలో చాలా చోట్ల కనిపించే విషయం. అందువల్ల, ఈ రెండు పద్యాలూ పోతన వ్రాసి ఉండడానికి చాలా అవకాశం ఉంది. ఈ భాగవత పద్యంలో పోతన భావాన్ని తీసుకొని సరస్వతీదేవి దుఃఖానికి అన్వయించి పోతనంత ఆర్ద్రంగానే మరొక కవి "కాటుకకంటినీరు" పద్యం వ్రాసాడని అనుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు.

    కాబట్టి నా దృష్టికి ఈ పద్యం ముమ్మాటికీ పోతనదే.

    ReplyDelete
  17. కామేశ్వర రావుగారు !! (పద్యం పై నా స్పందన ...)

    వైరపు భావనల్ తమదు 'వైఖరి' పల్కుటదెంత చిత్రమో
    భైరవభట్ల ధీమణి శుభమ్మగు స్వాంతన మానసాన చే
    కూరెడు గాత భారతిని కోరి సమర్చన చేసి పద్యకై
    వారముజేయు వేళ! తనువంతట పుల్కలు తీయు వేళలన్ !!

    ReplyDelete
  18. ఆర్య 2 సినిమాలో శ్రధ్ధా దాస్ తో రచయిత భలేమంచి సవాందం చెప్పిస్తాడు, నాకది బాగా నచ్చుతుంది.

    ప్రశ్న: సంతోషంగా ఉన్నప్పుడేమిచెయ్యాలనిపిస్తుంది
    సమాధానం: ఆర్య ని hug చేసుకోవాలనిపిస్తుంది
    ప్రశ్న: బాధగా ఉన్నప్పుడేమిచెయ్యాలనిపిస్తుంది
    సమాధానం: ఆర్య ని మరింత గట్టిగా hug చేసుకోవాలనిపిస్తుంది.

    బాధకలిగినప్పుడు ఆ బాధని మర్చిపోయేంతటి మహోన్నతమైన పద్యాన్నొకటి (అసమాన సమాసాలతో) అందిస్తే అందరికీ కూడా మనసు ఆహ్లాదమైపోతుంది కదా... దానికి మీవంటివారు కడు సమర్థులు కదా!!
    ఉదా: కాకినాడలో గరికపాటివారి సహస్రావధానం లో వర్ణనాంశంగా "మహాసహస్రావధానాన్ని సహస్ర నేత్రాలతో చూచి ఆనందిస్తున్న పృచ్చకులకు ఆనాటి సభ సరస్వతీదేవియొక్క వీరవిహార లాస్యంగా కనపడి సరస్వతీదేవి యొక్క తాండవమును వర్ణించ"మని అడుగగా వారి పూరణ

    గళదానంద రసమ్ము ధీగగన గంగా స్వచ్చ తారంగ, రన్
    గ లసన్నీరజ బృంద మధ్య మధు మార్గ వ్యాప్త సద్భావనా
    విలసన్మోహన పద్య గాన రచనా విర్భూత మోద ప్రభా
    ఖిల సమ్మోహ వధాన పధ్ధతులతో గీర్వాణి నర్తించెడిన్ !!

    రసమ్ము, నర్తించెడిన్ అనే రెండు పదాలు తెలుగు విభక్తులను కల్గి ఉండగా మిగిలిన పద్యమంతా ఏక సమాసం నడిపించింది. అట్లాంటిదొక్కటి సంధించచ్చు కదా !!

    ReplyDelete
  19. కామేశ్వర రావుగారు !!

    నా ఆలోచనలు:
    (a)
    >>తనని బాధించిన, లేకా దుర్మార్గులయిన రాజులపై తన అసహ్యాన్ని ప్రదర్శించే హక్కే పోతనకి లేకుండా చెయ్యడం కాదూ అది! "బహుశా ఇటువంటి ఆలోచనతోనే ఎవరో ఈ పద్యాన్ని పోతన పేరిట ప్రచారం చేశి ఉండవచ్చు". రాగ ద్వేషాలకు అతీతతం గా భాగవతమార్గాన్ని (వాసుదేవోపాసన అందులో ఒక భాగమే కదా) మనసుకు పట్టించుకుని ఉంటే పోతనకు అసహ్యమూ/ హక్కూ వంటివి ఉంటాయంటారా? నా ఈ భావనకి ఊతం : మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే టపాలో మీరే చెప్పినట్టు (http://telugupadyam.blogspot.com/2008/03/blog-post.html) ఒక్క చెడు విశేషణాలు వాడని వాడు తన కృతిని అంకితమిమ్మని అడిగిన "పాపానికి"(లేదా బలవంతం చేశిన పాపానికి) అధముడనీ, కీచకుడనీ విశేషణాలను వాడతాడా? అంకితమిమ్మని అడగటం తప్పా? పాపమా? నాదృష్టిలో తప్పు మాత్రమే. పాపం కాదు. తప్పును సరిదిద్దుకోవచ్చు, పాపమును సరిదిద్దుకోలేము. ఫలితాన్ని అనుభవించవలసినదే అందరినీ ఇక్కట్లపాలు చేశిన హిరణ్యకశిపుడితో మాట్లాడేటప్పుడు "ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే" అని మీరు ఆ టపాలో భావించటం సబబైతే అంకితమిమ్మని అడగటం హిరణ్యకశిపుడి పాపాలకన్నా పెద్దదా?

    పైగా పోతనే భాగవత తత్త్వాన్ని ప్రథమ స్కంధం -56 వ గద్యం లో వివరిస్తూ "పుణ్య శ్రవణ కీర్తనుండైన కృష్ణుడు తన కథలను వినువారి హృదయమునందు నిలిచి శుభములాచరించుచు, అశుభములను పరిహరించును. ఈ సేవ వలన నిశ్చల భక్తి కలుగును. అప్పుడు చిత్తము రజస్తమస్సులలోను, అందు పుట్టిన కామ లోభాదులలోనూ చిక్కుకొనక సత్త్వ గుణముతో ప్రసన్న మగును. ఈ ప్రసన్నత వలన సంగములు విడిచిపోవును. అట్టివానికి ఈశ్వర తత్త్వజ్ఞానము సిధ్ధించును" అని అన్నాడు. పోతనకు ఆ తత్త్వజ్ఞానమలవడలేదని గానీ, భాగవత రచనానంతరము కూడా ఇంకా రాగద్వేషములతోనో, రోషావేశాది మనోధర్మములతోనో వర్తించి ఉంటాడని మీరు నిజంగానే భావిస్తున్నారా?

    (b)
    >>కాటుక నెరయంగ కన్నీరు వరదలై కుచకుంభ యుగళ కుంకుమము తడియ" సరిగ్గా యీ "కాటుకకంటినీరు" భావమే! తనకి నచ్చిన ఒక భావాన్ని పోతన పలుచోట్ల ప్రయోగించడం భాగవతంలో చాలా చోట్ల కనిపించే విషయం.అందువల్ల, ఈ రెండు పద్యాలూ పోతన వ్రాసి ఉండడానికి చాలా అవకాశం ఉంది.
    పోతనవారి "కాపీ" పద్యాలు అనే నాటపాలో (http://raata-geeta.blogspot.com/2010/11/blog-post.html) పోతన ఎవరి నుండీ స్ఫూర్తి పొందారో ఉటంకించా.. అయితే పోతనను స్ఫూర్తి పొంది అట్లే రచించిన పద్యాలూ, రచనలూ ఉన్నాయి

    పోతన భాగవతం లో "కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన్ గుంభిత చర్మ భస్త్రి గాక" అంటే
    రంగనాథరామాయణమున "పతి కౌగలింపని పడతి కాయంబు పవన గుంభిత చర్మ భస్త్రిగాకేమి" అనీ
    ఫణిభట్టు "కమలాక్షు మూర్తి నాకాంక్షు జింతింపదే మనము కాదది దఃఖ వనము గాని" అనీ అనుకరించలేదా?

    లలితోద్యాన వనాంత సంచరణ ఆముక్తమాల్యదలో ఆద్రముతో కృష్ణదేవరాయల వారు "లలితోద్యాన పరంపరాశుకపికాలాపాభిరామంబు" అనీ పట్తణ వర్ణనలలో సామ్యమును ఆవిష్కరించలేదా

    కనుక పదాలు, భావాలు పోలిక కలిగినంత మాత్రాన అది వారి రచనే అనలేమని నా నమ్మిక

    అన్నింటికన్న ముఖయమైనదీ నిఖార్సైనదీ.. పోతన రామ భక్తుడన్నది నిర్వివాదాంశం. మిగిలిన కృతులగురించి (భోగినీ దండకం, న్వీరభద్ర విజయం ఇత్యాదివి) చేస్తున్నప్పుడు దైవ దర్శనం అవ్వటం, ఆదేశమందుకోవటం జరుగలేదు. భాగవతానికి మాత్రమే జరిగింది. ఆయనే ప్రత్యక్షమై, భవబంధాలు తెగునని ఆనతిచ్చి "మత్ నామాంకితముగా" భాగవతాన్ని తెలుగున వ్రాయమని ఆదేసమిస్తే(స్కంధం -1 గద్యం 15), తనతో పలికించి వ్రాయించుకుంటే ఆ భాగవతాన్ని తన ఇష్టదైవమైన రాముడిమాటను కాదని ఇతరులకు పోతన ఇస్తాడేమో అని ఊహ చేయటమే (చేసిన కవులెవరో గానీ) సమంజసం గా లేదు. ఎవరో బలవంతం చేసేసి బాధించిన బలహీన క్షణమునన ఇంతోటి పోతనా కర్తవ్య విముఖుడై, భవబంధాలు తెగునన్న రామాశీర్వాదాన్ని మరచినవాడై ఏమఱుపు పొందిఉంటాడనటానికి హేతువు కనిపించటం లేదు.

    ఇమ్మనుజేశ్వరాధములు వంటివి ప్రక్షిప్తం అనటానికి సహేతుకమైన కారణం ఉండనే ఉంది కనుక వ్యాకరణాన్ని చదువుకున్న మీవద్ద దానిపై వ్యాఖ్యానించటం లేదు. ఏది ఏమైనా కాటుక కంటి నీరు పద్యం కదిలించి వేస్తుందనటం లో ఎటువంటి సందేహమూ లేదు. పోతనది కాకపోతేనేం?

    ReplyDelete
  20. ఈ వాదన తెగేది కాదుకాని, అయినా సరదాకి :-):

    >>ఒక్క చెడు విశేషణాలు వాడని వాడు తన కృతిని అంకితమిమ్మని అడిగిన "పాపానికి"(లేదా బలవంతం చేశిన పాపానికి) అధముడనీ, కీచకుడనీ విశేషణాలను వాడతాడా?

    పోతనని ఆ రాజులు ఎన్ని కష్టాలు పెట్టేరో మనకి తెలుసా! ఆ రాజులు చేసిన ఎన్నెన్ని పాపాలని పోతన చూడవలసి వచ్చిందో మనకి తెలుసా! కేవలం అంకితమివ్వమని అడిగినందుకు అట్లా దూషించాడని ఎవరన్నారు?

    >> పోతనకు ఆ తత్త్వజ్ఞానమలవడలేదని గానీ, భాగవత రచనానంతరము కూడా ఇంకా రాగద్వేషములతోనో, రోషావేశాది మనోధర్మములతోనో వర్తించి ఉంటాడని మీరు నిజంగానే భావిస్తున్నారా?

    పరిపూర్ణ తత్త్వజ్ఞానం కలిగినవాడు, అసలు కావ్యాన్ని పలకనే లేడు! అలా కలిగిననాడు తాను వేరనీ, రాముడు వేరనీ, రాముడే తనతో పలికిస్తున్నాడనీ, అనుకొనే భేదభావమే పోతుంది. భాగవతం చదివితే మనకి తెలిసేది పోతన పరమభక్తుడు అయి ఉంటాడని. తత్త్వజ్ఞానం "తెలిసిన"వాడు అయి ఉండాలని. అంతేకాని రాగద్వేషాలకతీతమైన ముక్తి అతనికి లభించిందని అనుకోడం పూర్తిగా మన తృప్తికోసం చేసుకొనే ఊహే. భాగవతాన్ని మొదలుపెడుతూనే "శ్రీకైవల్యపదంబు జేరుటకునై" అని అన్నాడు కదా. అంటే ఆ కైవల్యపదం అతనికింకా లభ్యం కాలేదనే కదా. దాన్ని చేరుకోడానికి మార్గంగానే భాగవత రచన చేసాడు. "కాటుకకంటినీరు" వంటి పద్యాలు భాగవత రచన పూర్తిచేసాకనే వ్రాసాడా, అప్పటికి అతనికి కైవల్యం లభించ లేదా వంటి ప్రశ్నలకి సమాధానం లేదు. భాగవత రచన చేస్తున్నప్పుడో, పూర్తిచేసాకనో ఆ భగవంతుడే చివరిసారిగా పోతన భక్తిని పరీక్షించడానికి అలాంటి వత్తిడి కలిగించాడని కూడా ఊహించవచ్చు. ఆ పరీక్షకి నిలబడి చివరకి పోతన ముక్తి పొందాడన్న అందమైన కల్పన చేసుకోవచ్చు.

    >>పోతనను స్ఫూర్తి పొంది అట్లే రచించిన పద్యాలూ, రచనలూ ఉన్నాయి
    ఉన్నాయి. కాని వాటికి కర్తలెవరో మనకి తెలుసు. వాటి శైలిబట్టి అవి కచ్చితంగా పోతనవి కావనికూడా చెప్పవచ్చు. ఈ పద్యం విషయంలో అది సాధ్యం కాదు కదా.

    ReplyDelete
  21. గురువుగారు,

    మీరు వేలికేస్తే తలకీ, తలకేస్తే వేలికీ వేస్తున్నారు. మీవంటివారితో ఆడి గెల్వడం నావంటివాడికి సాధ్యమా?

    Okie, lets agree to disagree. :-)

    పోతన వ్రాసిన వంటి పద్యాల వలనే వేరేవారు వ్రాశారు కదా అంటే వారి పేరు మనకి తెలుసు కదా, శైలి లో తేడా ఉంది కదా అనో అంటారు. అదే శైలి తేడా " 'కీచకుల ' ప్రయోగం విషయం లో ఉంది కనుక ఇది పోతన కృతి కాదుకదా అంటే ఎందుకు కాకూడదు? పోతన మనవంటివాడే కాదా? రాగద్వేషాలు కలిగి ఉండకూడదా?అంటారు.

    అధములని పోతన శైలిలో లేదంటే కావ్యగత పాత్రల చిత్రణలో ఒక పాత్రతో (పౌండ్రక వాసుదేవుడు) ఇంకొకపాత్ర మాట్లాడినప్పుడు 'మనుజేంద్రాధమ ' వంటి ప్రయోగం ఉంది కదా అంటారు. ఇంకొకచో ప్రహ్లాదుడు లోక కంటకుడైన హిరణ్యాక్షుడి గురించి కూడా చెడుమాటమాట్లాడలేదు అంటారు కానీ అంకితమిమ్మని అష్టకష్టాలు పెట్టి ఉండచ్చు అని ఊహించమంటారు.. ఆ ఊహకి అనుగుణం గా కీచకులని ఉండవచ్చంటారు. చాటువు పోతన గారి పేరున వచ్చిందే కానీ నిజం గా ఏ కావ్యంలోనూ లేదు కాదా.. ఎక్కడో పోతనగారు కాటుక నెరయంగ కన్నీరు వరదలై అన్నది రాసింది చూచి ఎవరో ఆయన పేరిట రాశేసి ఉండచ్చు కదా అంటే "అందమైన కల్పన చేసుకోవచ్చు" కదా అంటారు

    రాముడు నాకంకితమిమ్మని ఆదేశించాడన్నప్పుడు పోతన ముందూ వెంకా ఆలోచించి ఉంటాడా అని అడిగితే చివరి సారి పరిక్షపెట్టి ఉండచ్చు కదా అంటారు.

    ఏది ఏమైనా అది కావ్యగత ప్రక్షిప్తం కాదు గనక, అది చాటువైనప్పుడు ఎవరి రాస్తేనేమి చదువుకోవచ్చు గనుక నాకెటువంటి అభ్యంతరమూ లేదు.. ఇంతటితో ఈ వివాదాంశాన్ని దానిపై నా వ్యాఖ్యలనూ సమాప్తం గావిస్తున్నా.... చివరిగా ఒకే ఒక్క విషయం లో మీ సమాధానం ఔను/కాదులలో తెలుసుకుందామని చిన్ని కోరిక. "ఇమ్మనుజేశ్వరాధముల" పద్యం పోతన రచనేనా కాదా (Yes/No)

    ReplyDelete
  22. >>Okie, lets agree to disagree. :-)
    Sure! :-)

    >>"ఇమ్మనుజేశ్వరాధముల" పద్యం పోతన రచనేనా కాదా (Yes/No)

    ఏమో నాకు తెలీదు! :-) ఈ పద్యం "కాటుకకంటినీరు" పద్యమంతగా నన్ను హత్తుకోలేదు కాబట్టి దాని గురించి నేను పట్టించుకోను. అయితే, అది పోతన పద్యం కాదని యిచ్చిన వివరణలు (నేను చదివినవి), నాకు పెద్దగా తృప్తినివ్వ లేదు.

    ReplyDelete
  23. :-)

    ఇమ్మనుజేశ్వరాధముల ను ప్రక్షిప్తం అనటానికి కారణం ముందు గద్యం ఉత్తమ పురుష అసమాప క్రియ తో అంతమై
    ఇమ్మనుజేశ్వరాధములు, చేతులారంగ ప్రథమ పురుష సమాప క్రియ లో పలికి
    మళ్ళీ తరువాతి గద్యం ఉత్తమ పురుష అసమాప క్రియ తో కొనసాగటం సరిగ్గా అతకకపోవటంగా ఒక వ్యాఖ్య (వివరాలను చదివి అందివ్వగలను కానీ) వ్యాకరణ పరంగా అది మీకు సరైనదేననిపిస్తుందా (కుతూహలం తో అడుగుతున్నా). (అది పోతన రాసినదా కదా అని అడగటం లేదు)

    ReplyDelete
  24. సనత్ గారు,

    ఈ కిందనిచ్చిన వాక్యం వ్యాకరణబద్ధమవునో కాదో చెప్పండి:

    ---
    నేనీ రోజు ఉదయాన్నే నిద్ర లేచి, పళ్ళుదోముకొని, "ఈ కామేశ్వర్రావు ఈరోజుకి ఆఫీసుకి సెలవు పెట్టాడు. ప్రతిరోజూ ఆఫీసుకి వెళితే బోరు కదా!" అని, స్నానము చేసి వచ్చి, ఉదయఫలహారము తీసుకొని, తిరిగి హాయిగా నిద్రపోయాను.
    ---

    ఇందులో కొటేషన్సు ముందువరకూ అసమాపక క్రియలే ఉన్నాయి. కొటేషన్సులో సమాపకక్రియ ఉంది. ఆ తర్వాత మళ్ళీ అసమాపక క్రియలతో కొనసాగింది. ఇది వ్యాకరణపరంగా సరి ఎందుకయింది? మధ్యలో కొటేషన్సు వల్ల. అంత కన్నా ముఖ్యంగా ఆ తర్వాత వచ్చిన "అని" అన్న పదం వలన. ఇప్పుడు మళ్ళీ భాగవత అవతారిక చదవండి.

    ---
    వర్తమాన కవులకుం బ్రియంబు వలికి భావికవుల బహూకరించి ఉభయకావ్యకరణదక్షుండనై

    "
    1.
    2.
    "

    అని మదీయ పూర్వజన్మసహస్రచింత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనాకుతూహలుండనై...
    ---

    ఇది అక్కడున్నది. కొటేషన్సులో రెండు పద్యాలున్నాయి. ఒకటి "ఇమ్మనుజేశ్వరాధముల", రెండు "చేతులారంగ". ఆ తర్వాత వెంటనే వచ్చే గద్యలో మొదట "అని" అనే మాట ఉంది. ఇది ఆ ముందరి పద్యాలు రెండూ కొటేషన్సులో ఉన్నాయని సూచిస్తుంది. అందువల్ల ఇక్కడ వ్యాకరణదోషమేమీ లేదు. మరొక విషయం జాగ్రత్తగా గమనిస్తే, దీనికి ముందరున్న గద్యలన్నీ "అని" అన్న పదంతోనే మొదలవుతాయి. వాటన్నిటిలోనూ అసమాపకక్రియలే ఉన్నాయి. వాటి మధ్యన వచ్చే పద్యాలన్నిటిలోనూ ఉన్నవి సమాపకక్రియలే!

    సరే ఈ పద్యం ప్రసక్తి ఏలాగూ వచ్చింది కాబట్టి, పోతన యీ పద్యం చెప్పినది (తనలో తాను అనుకున్నది) రాముడు ప్రత్యక్షమవ్వక ముందర అన్న విషయం గమనించండి.

    ReplyDelete
  25. కామేశ్వర రావుగారు, వివరానికి ధన్యవాదాలు.
    భాగవత రహస్య ప్రకాశాన్ని మరల చదువుకుని వస్తా...

    ReplyDelete
  26. ఈ చర్చ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది... :-)
    కామేశ్వరరావు గారూ, మీ వివరణ బాగుంది కానీ, మీరన్న వాక్యం -
    << నేనీ రోజు ఉదయాన్నే నిద్ర లేచి, పళ్ళుదోముకొని, "ఈ కామేశ్వర్రావు ఈరోజుకి ఆఫీసుకి సెలవు పెట్టాడు. ప్రతిరోజూ ఆఫీసుకి వెళితే బోరు కదా!" అని, స్నానము చేసి వచ్చి, ఉదయఫలహారము తీసుకొని, తిరిగి హాయిగా నిద్రపోయాను >>
    చదివితే ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేమిట్రా సవ్యమైన వాక్యానికి మధ్యలో ఎవడో అడ్డదిడ్డంగా ’ఈ కామేశ్వరరావు...’ అన్న వాక్యాన్ని చేర్చాడు అనిపిస్తుంది. మొత్తం వాక్యం వ్యాకరణ సమ్మతమే అయినప్పటికీ, ’అని’ అన్న జిగురుని ఉపయోగించి ఎవడో అసందర్భంగా ఒక వాక్యం మధ్యలో మరో వాక్యాన్ని ఇరికించాడనిపిస్తుంది. కాదంటారా??

    ReplyDelete
  27. ఇది అసలు పాయింటు.
    << మరొక విషయం జాగ్రత్తగా గమనిస్తే, దీనికి ముందరున్న గద్యలన్నీ "అని" అన్న పదంతోనే మొదలవుతాయి. వాటన్నిటిలోనూ అసమాపకక్రియలే ఉన్నాయి. వాటి మధ్యన వచ్చే పద్యాలన్నిటిలోనూ ఉన్నవి సమాపకక్రియలే! >>

    పద్యాలనీ, గద్యాలనీ కలిపి రాసేటప్పుడు ఇలాంటి కూర్పు రావడం సహజమే.

    ఇంతకీ ఇమ్మనుజేశ్వరాధముల పద్యం ప్రక్షిప్తమా కాదా అన్నదానిమీద నాకంటూ ఏ అభిప్రాయమూ లేదు.

    ReplyDelete
  28. సనత్ గారు, అలాగే తప్పకుండా.
    నాగమురళిగారు, అవును. నేను చెప్పదలుచుకున్న పాయింట్లు రెండు:
    1. అక్కడ వ్యాకరణదోషమేమీ లేదు
    2. అలాంటి వాడుకే అంతకుముందు పద్య గద్యల్లోనూ ఉన్నది.
    అంచేత ఆ పద్యం ప్రక్షిప్తమనడానికి ఆ కారణం సరికాదు.

    ReplyDelete
  29. గురువు గారు ! ఒక చిన్న trap గమనించానండోయ్

    >>రామభద్రుండ మన్నమంకితాంబుగ శ్రీ మహాభాగవతంబు( దెనుంగు సేయుము నీకు
    భవబంధములు దెగునని యానతిచి)

    రాముడు ప్రత్యక్షమవ్వకముందర అని మీరంటూంటే .. భాగవత రచన చేయాలని పోతన తనంత తానే సంకల్పించుకుని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని దేవతాస్తుతి, పూర్వ, వర్తమన కవి

    నమస్కారాలు చేశాడంటారా?? రాముడు కాదూ వచ్చి భాగవత రచన చేయమని ఆదేశించింది??

    అలాంటప్పుడు, నా ఉద్దేసం రామ దర్శన సంఘటన offline లో జరిగింది. అప్పుడు ఏకశిలా నగరానికి వచ్చి రచన చేయాలని సంకల్పించుకుని మొదలెట్టేటప్పుడు రచన ఓం

    ప్రథమం తో మొదలెట్టి శ్రీ కైవల్య పదంబు అని కావ్య రచనా క్రమాన్ననుసరించి వ్రాసి ఉండవచ్చు అనుకుంటున్నా. కాదంటారా (unlike మానిషాదః) అలాంటప్పుడు పోతన

    అనుకున్న దానినే పునరుక్తి దోషం గా రాముడు ఆదేసిస్తాడా?

    అదే నిజం అనుకున్నప్పుడు రాముడు ప్రత్యక్షమయ్యాడు, భాగవతం రాయమన్నాడు అని, పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామ భద్రుండట అనటం సమంజసం కాదంటారా?

    భాగవతం రాద్దామనుకున్నా, తుచ్చులైన రాజులకి ఇవ్వనుగాక ఇవ్వను అని నేను నిర్ధారించుకున్నా, అప్పుడు రాముడొచ్చి నువ్వు భాగవతం రాయి, నాకు అంకితం ఇవ్వు అని

    పునరుక్తిదోషం తో చెబితే రాముడి మాటను పోతన పలికినట్టా? పోతన ముందుగానే నిర్ధారించుకున్నదే / ఆలోచనలనే రాముడు పలికినట్టా? (చేసినట్టా?) నేను ఫలానా వారికి ఇవ్వను

    అని ముందుగా నిర్ధారించవలసిన అవసరం వచ్చి ఉంటుందని అంటారా? అదీ రామదర్శనం అయ్యిందని చెప్పుకోవాల్సిన ఆనందం కన్న ముందుగా..

    అదీ ఏమిటి? ఈ మొత్తమూ ఆ రెండు పద్యాలకోసం...పోతనే రాశాడని నిర్ధారణకి రావటానికి........

    కొంచం కంగాళీ అనిపించటం లేదూ?

    ఒక్కసారి ఊర్కే మా వాదనే కరెక్టనుకుని, ఇమ్మనుజేశ్వర పద్యాలు రెండూ లేవనుకుంటే, అప్పటిదాకా వ్రాయబోతున్నది భాగవతం అన్న పరిచయం రాదు, కాబట్టి భాగవతం వ్రాయమన్న

    రామాదేశం సమంజసం గా అనిపిస్తుంది. కాదంటారా?

    పైగా "ఇచ్చి, చెప్పె" అని జరిగిపోయినదానిని సూచిస్తున్నట్టు పోతన వ్రాశాడంటారా? శైలి లో ఇన్ని దోషాలు పెట్టేసుకుని అది పోతన పేర ప్రాచుర్యాన్ని కలిగించేటం నావరకు నాకు ఎందుకో..

    ఏమిటో.. ఎక్కడో... చిన్న సంశయం...

    ReplyDelete
  30. సనత్ గారు,

    మీ యీ సంశయం సమంజసమైనదే.
    మీరంటున్న రెండో పద్యం ఏమిటి?

    ReplyDelete
  31. హమ్మయ్య. ఓ మోస్తరుగానైనా నేను చెప్పినదానికి ఒకదానికి మీరు ఊ అన్నందుకు ధన్యవాదాలు. (తాత్కాలికానందమే అయినా..)

    నా ఉద్దేశంలో రెండు అంటే ఇమ్మనుజేశ్వర, చేతులారంగ (కలుగనేటికి తల్లుల కడుపుచేటు నాకు అంతగా నచ్చిన ప్రయోగం కాదు అందులోనూ అలసులు మందబుధ్ధి బలులు అల్పతరాయువులు అయిన మనుష్యుల గురించి తాపత్రయపడుతూ రాసిన భాగవతాన్ని పరిచయం చేయబోతూ....

    ReplyDelete
  32. అందుకే అడిగాను :-)
    "చేతులారంగ" పద్యానికి మీ సంశయం వర్తించదు. అది ఉన్నా ఎలాంటి గందరగోళమూ రాదు. పైగా, తర్వాతి గద్యలో ఉన్న "శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలుండనై" అన్నదానికి ఆ పద్యం ప్రోద్బలంగా ఉంటుంది. కాబట్టి ఆ పద్యం కచ్చితంగా ప్రక్షిప్తం కాదు అని నా అభిప్రాయం.

    ReplyDelete
  33. ఇవ్వాళ ఒక పుస్తకం లో దీనికి సంబంధించి ఒక వివరణ చదివి ఉన్నా. ముగించినతర్వాత ప్రస్తావించటం బాగుండదు కనుకు నా బ్లాగు లో టపా వ్రాశాను.

    ReplyDelete
  34. హనుమంతుని ముందు కుప్పిగంతులు అనుకోకపోతే ....
    కూడలి క్విజ్ చూసి జవాబివ్వండి - http://quiz.koodali.org/?p=8 బహుమతులు గెలుచుకోండి.

    ReplyDelete
  35. Yevaranna sahridayulu dayachesi, "bhagavatha rahasya prakasam" gurinchi vivaralu telupandi. Aa pustakam yekkad dorukutundi, yevaru rasaru ?

    ReplyDelete
    Replies
    1. భాగవత రహస్య ప్రకాశం శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు రచించారు. పుస్తకముల ప్రతికై నా మొబైల్ కు కాల్ చేయవచ్చు 9908611411

      Delete