మొన్న పోతన పద్యాల గురించి టపాయిస్తున్నప్పుడు, కరుణశ్రీగారి పద్యమొకటి గుర్తుకొచ్చింది:
అచ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్
మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!
పోతన కవితామాధుర్యాన్ని కొన్ని వస్తువులతో పోలుస్తున్నారిక్కడ. స్వఛ్చమైన జుంటితేనె, చంద్రబింబంనుండి స్రవించే అమృతరసము, గోర్వెచ్చని పాలమీగడ, అప్పుడే విచ్చుకున్న గులాబి మొగ్గలు - వీటికి అసూయ కలిగించేలా ఉంటుందట పోతన కవిత్వం. ఏదో రకంగా తాను చవిచూసిన మాధుర్యాన్ని మాటల్లో చెప్పాలన్న తాపత్రయమే కాని, నిజానికి ఆ మాధుర్యం అనుభవైకవేద్యమే కాని ఉపమానాలకి అందుతుందా! అంతటి మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఎక్కడినుండి వచ్చిందో, అని ఆశ్చర్యపోతున్నారు కూడా. అలా ఆశ్చర్యపడి ఊరుకో లేదు:
ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!
అని దానికొక అందమైన ఊహనికూడా జోడించారు. ఆ మాధుర్యం వెనక కారణం పంచదార అని కరుణశ్రీగారి ఊహ. అంటే అంత తియ్యగా ఉంటుంది అతని రచన అని! కరుణశ్రీ స్వయంగా ఒక కవి కాబట్టి కవితాత్మకమైన అలాంటి కల్పన చేసారు. ఒక వ్యక్తిలో కనిపించే అసాధారణ విశిష్టత గురించి ఏవో కల్పనలు చెయ్యడం మానవ సహజం కాబోలు. ముఖ్యంగా మన భారతీయులకి అది బాగా అలవాటనుకుంటాను. ఊహ, కల్పనే కావచ్చు. అయినా, ఏదో ఒక కారణం వెతకడం మనకొక సరదా.
ఈ మధ్య సౌందర్యలహరి చదువుతూ ఉంటే నాకూ అలాంటీ ఒక ఊహ కలిగింది. ఆ ఊహకి మూలమైన శ్లోకం:
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటామ్
వరత్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్
సకృన్నత్త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణా ఫణితయః
సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులవారు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించడం వల్ల కలిగే వివిధ శక్తుల గురించి వివరిస్తారు. ఈ శ్లోకంలో అమ్మవారి సరస్వతీ రూపాన్ని వర్ణిస్తున్నారు. శరత్కాలపు వెన్నెలంత స్వచ్ఛమైనది తెల్లనిది, చంద్రవంకతో కూడిన జటాజూటం కలిగినది, అభయ ముద్ర, వరద ముద్ర, అక్షమాల, పుస్తకము ధరించిన చేతులు కలిగినది, అయిన నీ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి తేనె పాలు ద్రాక్షరసముతో పోల్చదగిన తియ్యని కవిత్వ శైలి లభిస్తుంది అని అర్థం.
శరత్కాలానికీ శారదకీ ఉన్న అవినాభావసంబంధం ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది.
పోతన అలాంటి సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణమని నా ఊహ. పోతన ఆ రూపాన్ని ఆరాధించాడనడానికి ఏమిటి సాక్ష్యం అంటే, అతని యీ రెండు పద్యాలు:
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి!
ఇక రెండో పద్యం:
క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
అక్షమాల, పుస్తకము (చిలక, పద్మము కూడా) కలిగిన వాణీ స్వరూపాన్ని మ్రొక్కే పద్యమిది.
ఈ రెండు పద్యాలబట్టి పోతన సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన స్వరూపాన్ని ఆరాధంచాడనీ, పోతన కవితామాధుర్యం వెనకనున్న రహస్యం అదేనని ఊహించడం అసమంజసం కాదు కదా!
ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి. ఆ శక్తికి సంకేతం సరస్వతీ స్వరూపం. అలాంటి అనేక శక్తి రూపాలని ఆరాధించే పండుగ దసరా. పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:
హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
అందరికీ దసరా శుభాకాంక్షలు!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Monday, October 3, 2011
పోతన కవితామాధుర్య రహస్యం
Subscribe to:
Post Comments (Atom)
చాలా బాగుంది సార్ వ్యాసం
ReplyDeleteచివరి పద్యం నాకు చాలా ఇష్టం
బొల్లోజు బాబా
ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి. ఆ శక్తికి సంకేతం సరస్వతీ స్వరూపం.
ReplyDelete----------
అది అందరినీ వరించదుగా ! పుణ్య మూర్తులైన కొందరికే ఆ శక్తి లభించేది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
గురువుగారు
ReplyDeleteమీరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసే రోజు కోసం నేను ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. నిజంగా మీరీ ఉద్యోగం మానేసి తెలుగుని ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవాలి. డబ్బుల్దేవుంది, కుక్కని కొడితే రాల్తాయి అంటారు కదా? :-) మరోలా అనుకోకండి.
తెలుగుకి ఒక 'స్టేండర్డ్' ఇవ్వడం, అవన్నీ అలా ఉంచితే మీలాంటి వాళ్ళే బాష చావకుండా ఉంచగలరు. లేకపోతే ఈ తెలంగాణా ఆ గొడవలూ అన్నీ కల్సి వచ్చే రోజుల్లో తెలుగు దారుణమైన కుక్క చావు చావడం నూరు శాతం నిజం అని నాకనిపిస్తోంది. తమిళానికి ఈ దరిద్రం లేదు. మనకే. ఇప్పటికే కొత్తపాళీ గారు అడిగిన చిన్న చిన్న పదాలకి అర్ధాలు చెప్పలేకపోతున్నాం. ఇప్పుడంతా "కేక" "అదుర్స్" "లైట్ తీస్కో" "ఉచ్చ పొస్కో" ఇదే తెలుగు.
రాబోయే ఇరవై సంవత్సరాల్లో పోతన ఎవడయ్యా అంటే "పోతనా?" అని ఆశ్చర్యపోయే తెలుగు వాళ్ళు ఆంధ్రా అంతా ఉంటారనడం అతిశయోక్తి కాదనుకుంటా. ఆ మధ్యన ఎవడో (కావాలనే "డో" అంటున్నాను) బ్లాగులో రాసేడు - తెలుగు సినిమాలో తెలుగు బహు బాగు పడిపోతూందిట ఎందుకంటే ఆ డైరక్టర్లందరూ ఓ బియ్యేనో బియస్సీనో చదివేసేర్ట. కాటుక కంటినీరు ... గుర్తుకొస్తోంది.
బాగుంది
ReplyDeleteకామేశ్ !! మంచి పద్యాలకు తాత్పర్యాన్ని, సమన్వయాన్ని పరిచయం చేశారు. నెనర్లు. మీకూ దసరా శుభాకాంక్షలు.
ReplyDeleteమొన్నామధ్య చాగంటి వారి భాగవత ఉపన్యాసం వింటూంటే, ఒక రహస్యాన్ని విచరించారు. బీజాక్షరాలను పఠించాలి అంటే దానికి అనువైన సమయమూ, నిష్ట మొదలైనవి అవసరం. అయితే మన తెలుగువారి పాలి కల్పవృక్షం పోతనామాత్యుడు మాత్రం అత్యంత కరుణతో పామరులైనవారుకూడా ఎప్పుడుపడితే అప్పుడు బీజాక్షర పఠించిన ఫలితం పొందేందుకు అనువైన అతి తేలిక మార్గాన్ని ఎవరికీ తెలియకుండా అందించేశారు అని అన్నారు.
శరన్నవరాత్రులలో అమ్మవారిని అర్చిస్తూ లలితా సహస్రనామాన్ని పఠిస్తాము. అందులో మకుటాయమానమైన మూల మంత్రాన్ని ఒక పద్యం లో నిక్షిప్తం చేసేసి పల్లె పల్లెల్లో, చిన్నారులు మొదలుకుని పండు ముదుసలి వరకూ, పామరులు మొదలుకుని పండితులవరకూ పఠించేట్టు అందివ్వటం వారి ప్రేమకు తార్కాణం అన్నారు.
ఆ పద్యమే "అమ్మలగన్నయమ్మ"
మహత్త్వమందించే మాతను అనుసంధానించుకునేందుకు బీజాక్షరం ఓం
కవిత్వమందించే మాతను అనుసంధానించుకునేందుకు బీజాక్షరం ఐం (సరస్వతి)
పటుత్వమందించే మాతను అనుసంధానించుకునేందుకు బీజాక్షరం హ్రీం (శక్తి నిచ్చే తల్లి, పార్వతి)
సంపదలనందించే మాతను అనుసంధానించుకునేందుకు బీజాక్షరం శ్రీం (లక్ష్మీ దేవి)
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ అంటే శ్రీమాత
వెరశి ఆ పద్యం రోజూ పఠిస్తే మనం న్యాసం చేసే మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇంతకాన్నా ఉత్కృష్టమైనదింకొకటి ఉంటుందా.. చూడండి ఎంత సుళువుగా పోతన మనకందించారో"
ఒక రహస్యాన్ని వివరించారు.*
ReplyDeleteబాబాగారు, ఆ పద్యం ఎందుకిష్టమో మరి చెప్పలేదు?
ReplyDeleteలక్కరాజుగారు, అవును అందరికీ ఆ శక్తి ఉండదు. ఒకవేళ ఉంటే, దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోం గదా! :)
సనత్ గారు, అవునండి చాగంటివారి వ్యాఖ్యానం నేనూ విన్నాను.
అనానిమస్ గారు,
>>"మీరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసే రోజు కోసం నేను ఆత్రంగా ఎదురుచూస్తున్నాను."
నేనూ ఆ రోజు కోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. :)
మీ ఆవేదన నాకు అర్థమయింది. అయితే, ఒకొళ్ళో ఏ కొందరో కలిసి భాషని ఉద్ధరించగలగడం పై నాకు అనుమానాలున్నాయి. నేను కంకణం కట్టుకొంటే తెలుగు బతుకుతుందని నాకు నమ్మకం కలిగిననాడు తప్పక ఆ పని చేస్తాను.
very good work on telugu poetry
ReplyDeleteHi,
ReplyDeletePothna gari Padyalanu adinchina variki manaskaru . Evarina "Bala rasala sala kavya kanyaka" padyanni mottham telugu lipi lo rasthe chala santhosam .
Krutaznathalu,
Saicharan
Ee website nirvahakulaki naa manah purvaka kruthagnathalu
ReplyDelete