తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, February 16, 2011

ఉదంకుడి కథ అయిపోయిందోచ్!

నిజానికి కిందటి టపాతోనే ఉదంకుడి కథ అయిపోయింది. మిగిలిందల్లా ఆ ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు ఎవరు, నాగలోకంలో ఉదంకుడికి కనిపించిన వింత దృశ్యమేమిటి అన్న సంగతులు తెలియడమే. ఆ తర్వాత ఉదంకుడి కథకీ సర్పయాగానికీ ఉన్న సంబంధం.
అసలు సంస్కృత భారతంలో వ్యాసుడు యీ సస్పెన్సుని చివరికంటా కథనంలో నిర్వహించ లేదు. ఆ పని చేసింది మన నన్నయ్యగారు. ఇంతకీ గురువుగారు ఉదంకుడికి చెప్పిన వివరం ఇది:

ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు సాక్షాత్తు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. ఉదంకుడు సేవించిన గోమయం అమృతం. నాగలోకంలో కనిపించిన ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వారు తెల్లని నల్లని దారాలతో నేస్తున్న మగ్గం అహో రాత్రాలు (పగలు, రాత్రి). పన్నెండు రేకుల చక్రం పన్నెండు నెలలతో కూడిన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. ఆ గుఱ్ఱం అగ్ని. గుఱ్ఱం ఎక్కి వచ్చిన దివ్యపురుషుడు ఇంద్ర సఖుడైన పర్జన్యుడు.
ఇంద్రుడు తన స్నేహితుడు కాబట్టి తన పని మీద వెళ్ళిన ఉదంకుడికి సహాయం చేసాడని, అమృత భక్షణం వల్లనే అతనికి నాగలోకంలో ఎలాంటి హాని జరగకుండా అతని పని సఫలమయిందని కూడా గురువుగారు ఉదంకుడికి వివరిస్తారు.

అంతా బాగానే ఉంది కాని మరి ధాత, విధాత, ఋతువులు మొదలైనవి ఎందుకు కనిపించాయి? ఈ ప్రశ్నకి అటు వ్యాసుడు కాని ఇటు నన్నయ్యగారు కాని సమాధానమివ్వడానికి ప్రయత్నించ లేదు. ఇలాంటి వాటివల్లనే మన పురాణేతిహాసాల్లో ఒక మార్మికత ఉందని అనిపిస్తుంది. అయితే కొందరికది ఏ కోశానా రుచించదు. కథని కథగానే చదువుకోవాలి కాని అందులో అంతరార్థాలని వెతకడం ఎందుకని అంటారు. అక్కరలేదనుకొనే వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి అంతరార్థం కోసం అన్వేషిస్తారు. దాన్నీ దీన్నీ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక రచనని లౌకికము, నైతికము, ఆధ్యాత్మికము అనే మూడు అంతరువుల్లో చూడడం మన భారతీయ సాహిత్యంలో ఒక సంప్రదాయం. అంటే కథ కథగా చదవడం ఒకటి, అది చెప్పే నీతిని అవగాహన చేసుకోవడం రెండు, అందులోని ఆధ్యాత్మికమైన అంతరార్థాన్ని గ్రహించడం మూడు. కవులు కూడా అదే దృష్టితో కావ్యాలని సృష్టించారని నమ్మకం. ముఖ్యంగా పైన చెప్పిన సన్నివేశాలవంటివి (ఉదంకుడు కాల సంబంధమైన ప్రతిరూపాలని చూడడం) కథలో వచ్చినప్పుడు, ఎందుకవి కథలో ఉన్నాయని ఆలోచించడం సహజం కదా. ఎవరికి తోచిన అర్థాలు వారు చెప్పుకుంటారు. ఎవరైనా వివరిస్తే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ కథలోని అంతరార్థం గురించి "శ్రీ మహాభారత వైజ్ఞానిక సమీక్ష" అన్న పుస్తకంలో శ్రీ తిరుమల వేంకట శ్రీనివాసాచార్యులుగారు ఇచ్చిన వివరణ క్లుప్తంగా ఇది:

ఉదంకుడు అంటే ఊర్ధ్వలక్షణము కలవాడు అనే అర్థం చెప్పుకోవచ్చు. ఉదంకుడు గురుపత్ని కోసం కుండలాలని సంపాదించే కార్యం నిజానికి దివ్యజ్ఞానం సంపాదించడం. ద్వాదశాదిత్యులలో ఒకరు "పుషా". ఇది భూమిని పోషించే సూర్య తేజం. పౌష్యుడు దానికి ప్రతీక. సత్యాన్ని ధర్మాన్ని దర్శించడానికి పూషా స్వరూపుడైన సూర్యుడిని ఉపాసించాలి. పుషాదిత్యుని జ్ఞానశక్తి పౌష్యాదేవి. సూర్యుని ప్రకాశము అతని శబ్దమే. రవము కలవాడు కాబట్టి రవి. ఆ శబ్దము వల్లనే జ్ఞానబోధ కలుగుతుంది. చెవి గ్రహించే శబ్దాన్ని ప్రకాశింప జేసేవి మనసు, బుద్ధి. అవే పౌష్యాదేవి కుండలాలు. అతీంద్రియ జ్ఞానార్జనకు ఈ రెండిటినీ సంపాదించే ప్రయత్నమే ఉదంకుడు చేసినది. ఆత్మలో అమృతత్వమున్నా అది ముందు గ్రహించ లేకపోయాడు ఉదంకుడు. అంతరింద్రియ జ్ఞానము బాహ్య దృష్టికి గోచరించదు కాబట్టి అంతఃపురంలో పౌష్యాదేవి ఉదంకునికి ముందు కనిపించలేదు. ఎప్పుడయితే ఆత్మశుద్ధి చేసుకున్నాడో అప్పుడతనికి కనబడింది.

తక్షకుడంటే వడ్రంగి. రూపంలేని శుద్ధ బ్రహ్మమనే చెట్టుని చెక్కి దేహాకృతిని నిర్మించే త్వష్టా ప్రాణానికి ప్రతిరూపం తక్షకుడు. శక్తిమయములైన (అతీంద్రియమైన) మనో బుద్ధులు, నామ రూపాత్మకమైన భౌతిక శరీరంలో త్వష్టాప్రాణము చేత బంధింపబడడమే తక్షకుడు కుండలాలని అపహరించడం. మన లోలోపల దాగిన అతీంద్రియ శక్తి రహస్యాలను తెలుసుకొనే విధానమును ఋషులు కనిపెట్టారు. దానికి "బిల్మవిద్య" అని పేరు. ఇదే కుండలినీ విద్య. బిలంలాంటి మూలాధారచక్రంలో పాములా చుట్టలు చుట్టుకొని నిద్రాణమై ఉంటుంది అథఃకుండలినీ శక్తి. దానిని మేల్కొలిపితే, అది స్వాధిష్ఠాన (నిప్పు), మణిపూర(నీరు), హృదయ (వాయు), ఉపరి (ఆకాశ) అనే పాంచభౌతికమైన చక్రాలు దాటుకొని, మనోమయమైన ఆజ్ఞాచక్రాన్ని ప్రవేశించగానే భ్రూ మధ్యమున ఉన్న జ్ఞాన నేత్రం విచ్చుకుంటుంది. ఉదంకుడు భూ బిలం ద్వారా పాతాళము సొచ్చి చేసిన నాగస్తుతి కుండలినీ శక్తి ప్రబోధమే. దానివల్ల అతడికి కాలజ్ఞానం కలిగింది. దానికి సూచనే కాల ప్రతిరూపాలు కనిపించడం. అశ్వరూపంలో దర్శనమిచ్చిన అగ్ని కుండలినీ శక్తి. మూలాధార చక్రం అపాన స్థానంలో ఉంటుంది. సంస్కృత భారతంలో గుఱ్ఱం వెనక భాగంలోని అపానంలోనే ఊదుతాడు ఉదంకుడు. అంటే కుండలినీశక్తిని మేల్కొల్పడమే. దాన్ని నన్నయ్యగారు ఎందుకో చెవిలో ఊదినట్టుగా మార్చారు.

అంటే ఉదంకుడి కథలోని అంతరార్థం కుండలినీయోగ సాధనన్నమాట!

ఇంతకీ ఈ కథకీ, జనమేజయుడు చేసిన సర్పయాగానికి ఏవిటి లంకె అన్న విషయం ఉండిపోయింది కదా. గురుపత్ని కార్యాన్ని నిర్వహించి, గురుదక్షిణ చెల్లించి, గురువు ఆశీసులతో విద్య ముగించుకొని జనమేజయుని దగ్గరకు వెళతాడు ఉదంకుడు. కుండలాలని అపహరించిన తక్షకుడి మీద అతని కోపం ఇంకా చల్లారదు. అందుకు ప్రతీకారంగా జనమేజయునితో సర్పయజ్ఞం చేయించాలని అతని ఆలోచన. జనమేజయుడే ఇతని ప్రతీకారం ఎందుకు చెల్లిస్తాడంటే, జనమేజయుని తండ్రి పరీక్షిత్తుని చంపినది తక్షకుడే కనక! అది వేరే కథ. జనమేజయుని దగ్గరికి వెళ్ళి, గురుకార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించిన సమయంలో తక్షకుడు నిష్కారణంగా తనని మోసగించి మహాపకారం చేసాడని చెప్తాడు. ఆ తక్షకుడు పరీక్షిత్తుని చంపిన విషయాన్ని కూడా గుర్తుచేస్తాడు. గుర్తుచేసి ఇలా అంటాడు:

కాదన కిట్టిపాటి యపకారము దక్షకు డేక విప్ర సం
బోధన జేసి చేసె నృపపుంగవ, నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదర సంహతిం హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్

"సంబోధన" అంటే వాడుకలో ఉన్న అర్థం పిలుపు. కాని ఈ పదానికి రెచ్చగొట్టడం, ప్రబోధించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడా అర్థం తీసుకోవాలి. ఒక బ్రాహ్మణుడి ప్రేరణ చేత కాదనకుండా తక్షకుడు నీ తండ్రికి ఇంతటి మహాపకారాన్ని చేసాడు. కాబట్టి నువ్వు అనేక బ్రాహ్మణులు కూడి చేయించే సర్పయాగంలో చెలరేగే మహోగ్ర అగ్ని శిఖలలో ఆ తక్షకాడితోబాటు సర్పజాతి నంతటినీ భస్మం చెయ్యి. అని ఉదంకుడు జనమేజయుడిని సర్పయాగానికి ప్రోత్సహిస్తాడు.

"ధ"కి "ద"కి ప్రాస వెయ్యవచ్చుననడానికి ఈ పద్యం ఒక ప్రమాణం. మిగిలిన అక్షరాలకి ఈ సడలింపు లేదు! "కాకోదరము" అంటే పాము. దీనికి కాక+ఉదరము (కాకి కడుపు) అనే అర్థం కొందరు చెప్పారు కాని ఇది కర్కోటకము(ఇది కూడా పాముకి పర్యాయపదమే) అన్న పదానికి ప్రాకృత రూపం అవ్వవచ్చని మరి కొందరు భావిస్తున్నారు. బహుశా అదే సరైనదేమో అని నాకనిపిస్తుంది. "హుతవహుడు" అంటే యజ్ఞ హవిస్సుని (హుతము) తీసుకొనే వాడు, అగ్ని.

ఒక్క తక్షకుడు చేసిన తప్పుకి సర్పజాతి అంతా ఎందుకయ్యా బలికావడం అని అడుగుతాడేమో ఆ రాజని, ముందుగానే దానికి సమర్థింపుగా ఇలా అంటాడు ఉదంకుడు:

ప్రల్లదుడైన యొక్క కులపాంసను చేసిన దాన దత్కులం
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? కావునన్ మహీ
వల్లభ తక్షకాధము నెపంబున సర్పములెల్ల నగ్నిలో
ద్రెళ్ళగ సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసన్నిధిన్

కులనాశకుడైన ఒక్క దుర్మార్గుడివల్ల ఆ కులమంతా దూషింపబడటం కొత్త విషయమేమీ కాదు కదా. ఒక్క తక్షకుడి వల్ల సర్పజాతికంతటికీ ఆ దోషం చుట్టుకుంది. కాబట్టి ఆ పాములన్నీ అగ్నిలో మాడిపోయేట్టుగా నువ్వు సర్పయాగాన్ని తప్పకుండా చెయ్యి. అని సర్పయాగాన్ని సమర్థిస్తాడు ఉదంకుడు. ఇక్కడ మళ్ళీ నన్నయ్య కవిత్వశక్తి మనకి కనిపిస్తుంది. ఈ పద్యం సంస్కృత భారతంలో లేదు. రాబోయే భారత కథలో, దుష్టుడయిన ఒక్క దుర్యోధనుడి వల్ల ఎలా కురువంశమంతా నాశనమవుతుందో మనకీ పద్యంలో ధ్వనించడం లేదూ! నన్నయ్య అలా ధ్వనించాలనే వ్రాసాడా అంటే చెప్పలేం, అనవసరం కూడా. మనకి ఆ స్ఫూర్తి కలుగుతోందా లేదా అన్నది ముఖ్యం. "లేదండీ నేను మాటల అర్థాలు అల్లాగే తీసుకుంటాను. అవి ధ్వనించే విషయాన్ని గురించి నాకు పీకులాట లేదు", అంటే చెప్పగలిగేదేమీ లేదు. యద్భావం తద్భవతి!

మొత్తానికి జనమేజయుని సర్పయాగం వెనక ఇంత కథ ఉంది! ఇంతకీ జనమేజయుడు సర్పయాగం చేసాడా, సర్పాలు యాగాగ్నిలో పడి మసి కాకుండా ఎవరైనా కాపాడారా? ఇదంతా మరొక కథ. మళ్ళీ నాకు కోరిక తీరిక కలిగినప్పుడు చెప్పుకుందాం!

పూర్తిగా చదవండి...

Monday, February 7, 2011

ఉదంకుడి కథ - 3

దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావిత శక్తిశౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫురత్
పావక తాపి తాఖిల విపక్షులు నైన మహానుభావు లై
రావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యెడున్

నాగ వంశంలో అనంతుడు, వాసుకి తర్వాత శక్తివంతుడైన నాగరాజు ఐరావతుడు. అతని వంశం వారిని ఐరావతులంటారు. ఇరావతి అనే నది దగ్గర నివసించేవారు కాబట్టి వీరు ఐరావతులయ్యారని కొంతమంది ఊహ. అర్జునుడి భార్య ఉలూచి నాగ కన్య. ఆమె ఐరావత వంశానికి చెందినదే. ఉలూచికి పుట్టిన కొడుకు పేరు ఇరావంతుడు!

ఈ నాగ స్తోత్రంలో నన్నయ్య ఒక చక్కని ప్రణాళికని అనుసరించాడనిపిస్తుంది. ముందుగా వైకుంఠవాసుడైన అనంతుడిని, ఆ తర్వాత కైలాసవాసుడైన వాసుకిని స్తుతించి అప్పుడు దేవ మనుష్య లోకాలలో తిరుగాడే ఐరావతులని స్తుతించాడు. చివరిగా కేవల భూ సంచారి అయిన తక్షకుడిని స్తుతించాడు. సంస్కృత భారతంలో ఉదంకుడు ఐరావత తక్షకులని మాత్రమే స్తుతించినట్టుగా ఉంది. ఈ ఐరావతులు చాలా ప్రతాపవంతులు, శక్తివంతులు, శూరులు. అపారమైన విషంతో కూడిన కోపాగ్నిలో శత్రువులని కాల్చేస్తారు. అలాంటి భీకర సర్ప రాజులైన ఐరావతులు తనకి ప్రసన్నమగుగాక అని ప్రార్థిస్తున్నాడు ఉదంకుడు.

గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై
ధాత్రి బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షు డీక్షణ
శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు బ్రసన్నుడయ్యెడున్

పైన చెప్పిన ప్రణాళిక పద్య నిర్మాణంలో కూడా గమనించవచ్చు. "బహువన పాదపాబ్ధి..." అంటూ సమాసబంధురంగా మొదలుపెట్టిన ఆ పద్య రచనని ఈ పద్యంతో ఒకసారి పోల్చిచూడండి. ఈ నాలుగు పద్యాలూ ఒకదానికన్నా ఒకటి బిగువు తగ్గుతూ వస్తాయి. చెప్పే వస్తువులోని గురుత్వాన్ని, సమాసబంధురతతో ధ్వనింపజెయ్యడం నన్నయ్య ప్రవేశపెట్టిన ఒకానొక పద్యశిల్పం.

మహీధరము అంటే కొండ. భూమిని అవి మోస్తున్నాయి కాబట్టిట! గోత్ర మహీధరములు అంటే కులపర్వతాలు. భూమిని మోస్తున్న పర్వతాలలో ముఖ్యమైనవివి. ఇవి ఏడు. మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము. ఈ ఏడు పర్వతాలలోను అనేక అడవులు (విపినములు), పొదరిళ్ళు (నికుంజములు) ఉంటాయి. అక్కడా, కురుక్షేత్రంలోను, ఇలా నానా ప్రదేశాలలోనూ భూమి అంతటా స్వేచ్ఛగా అశ్వసేనుడితో కలిసి విహరిస్తూ ఉంటాడట తక్షకుడు. అశ్వసేనుడు తక్షకుడి కొడుకు. గొప్ప బలము, గర్వము, పరాక్రమము కలిగినవాడీ తక్షకుడు. ఈక్షణశ్రోత్రము అంటే పాము. ఈక్షణమంటే కన్ను. శ్రోత్రమంటే చెవి. అంటే కన్నులే చెవిగా కలిగినది. పాముకి ఇతర జంతువుల్లా చెవులుండవు. బూరా ఊదితే పాము నాట్యమాడేది నిజానికి ఆ బూరా ఊదేవాడి కదలికల బట్టి కాని ఆ శబ్దం విని కాదు. ఈ పేరు పాముకి అందుకు వచ్చింది. సంస్కృత భాషలో ఒకే వస్తువుకి అనేక పర్యాయపదాలు ఉండడానికి కారణం వాళ్ళు ఆయా వస్తువులని అన్ని రకాలుగా దర్శించి అర్థం చేసుకొని దానికి తగిన సంజ్ఞలని ఏర్పరచడం వల్లనే! సంస్కృత భాష వస్తే భాషాజ్ఞానంతో పాటు వస్తుజ్ఞానం కూడా కలుగుతుందన్న మాట.

నాగరాజులందరినీ ఉదంకుడిలా స్తోత్రం చేసినా ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. అయితే అంతలోనే ఉదంకుడికి ఒక విచిత్రమైన అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక ఇద్దరు స్త్రీలు నలుపు తెలుపు దారాలతో ఒక వస్త్రాన్ని నేస్తూ ఉన్నారు. ఆ పక్కనే పన్నెండు అడ్డ కఱ్ఱలతో (spokes) ఉన్న ఒక చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు కుఱ్ఱవాళ్ళు కనిపించారు. ఆ పక్కనే ఎత్తైన గుఱ్ఱాన్ని అధిరోహించిన మహా తేజోవంతుడయిన ఒక దివ్యపురుషుడు కనిపించాడు. అతన్ని చూసి ఉదంకుడు విశేష మంత్రాలు చదువుతూ భక్తితో స్త్రోత్రం చేస్తాడు. అప్పుడా దివ్యపురుషుడు ప్రసన్నుడై, నీ కోరికేమిటో చెప్పు నెరవేరుస్తానని అంటాడు. ఉదంకుడెంతో సంతోషించి, నాగులందరూ తనకి వశమై తన కుండలాలు తనకి తిరిగి ఇచ్చెయ్యాలని కోరుకుంటాడు. అప్పుడా దివ్యపురుషుడు అలా అయితే ఈ గుఱ్ఱం చెవిలో ఒక్కసారి ఊదమంటాడు. ఉదంకుడలాగే ఊదుతాడు. అంతే ఒక్కసారిగా:

పాతాళైక నికేతనాంతరమునన్ బర్వెం దదశ్వాఖిల
స్రోతో మార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్, పన్నగవ్రాతముల్
భీతిల్లెన్, భుజగాధినాథు మనమున్ భేదిల్లె, గల్పాంత సం
జాత ప్రోద్ధత బాడబానల శిఖా శంకాధి కాతంకమై

విశేషమైన పద్యాలని సందర్భానికి తగ్గట్టు చెక్కడంలో మహాకవులు ఎంతటి శిల్పనిర్మాణ నిపుణులో ఇలాంటి పద్యలు పరిశీలిస్తే తెలుస్తుంది. పద్యం ఎత్తుగడ ఎలా ఉంది, మధ్యలో ఎలా సాగి, చివరికి ఎలా పూర్తయ్యింది, ఆసక్తి ఉన్నవారు జాగ్రత్తగా గమనించండి.

కల్పాంతమంటే మహా ప్రళయకాలం. అలాంటి ప్రళకాలంలో పుట్టి ప్రజ్వరిల్లుతున్న బడబానల జ్వాలలేమో అన్నంత భయంకరంగా పుట్టాయి ఉగ్ర దహనార్చులు. అంటే తీవ్రమైన అగ్నిజ్వాలలు. ఎక్కడ నుండి పుట్టాయి? ఆ ఆశ్వ అఖిల (సర్వమైన) స్రోతో మార్గము (ఇంద్రియ మార్గమైన అవయవాలు, దేహము) నుండి. అలా పుట్టిన ఆ జ్వాలలు పాతాళలోకమనే భవనమంతటా వ్యాపించాయి. దానితో సర్పాలన్నీ భయంతో వణికిపోయాయి. నాగరాజు గుండె బద్దలయింది. దండం దశగుణం భవేత్ అన్నట్టు ఆ దెబ్బకి తక్షకుడు లొంగాడు:

శంకర నిభుడగు విప్రు భ
యంకర కోపాగ్ని యొక్కొ యనుచున్ జాతా
తంకుడయి కుండలంబు లు
దంకునకును దెచ్చియిచ్చె దక్షకు డంతన్

అదంతా శివుడంతటి విప్రుని కోపాగ్ని కాబోలు అనుకుంటూ తక్షకుడు భయపడి (జాత=పుట్టిన, ఆతంకుడయి=భయం కలవాడై) కుండలాలని ఉదంకుడికి తెచ్చి యిచ్చాడు.

మొత్తానికలా కుండలాలని తిరిగి సంపాదించాడు ఉదంకుడు. అయినా అతనికొక సమస్య వచ్చిపడింది. కుండలాలని నాలుగు రోజుల్లో తీసుకురమ్మని గురుపత్ని ఆజ్ఞ. ఈ రోజే నాల్గవ రోజు. ఇంత తొందరగా ఇప్పుడక్కడకి చేరుకోడం ఎలా? ఇలా చింతిస్తున్న ఉదంకుడిని చూసి, విషయం గ్రహించి, ఆ దివ్యపురుషుడు, మనసుకన్నా వేగమైన తన గుఱ్ఱాన్ని ఎక్కి వెళ్ళమని అంటాడు. అతని మాట ప్రకారం ఉదంకుడు ఆ గుఱ్ఱాన్ని ఎక్కి క్షణ కాలంలో గురువుగారి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే గురుపత్ని స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, వ్రతానికి సిద్ధమై ఉంటుంది. కుండలాలని ఎప్పుడు తెస్తాడా అని ఉదంకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుండలాలతో వచ్చిన అతడిని చూసి సంతోషించి, ఆ కుండలాలు ధరించి తాను చేయదలచుకున్న వ్రతం చేసుకుంటుంది. అప్పుడతని గురువు ఉదంకుడిని ఇలా అడుగుతాడు:

ఈ యున్న పౌష్యుప్రోలికి
బోయి కడుం బెద్ద దవ్వు పోయినయట్ల
త్యాయత విమల తపో మహి
మా! యిన్ని దినంబులేల మసలితి చెపుమా!

ఇక్కడున్న పౌష్యుని ఊరికి (పురము వికృతి ప్రోలు) వెళ్ళి రావడనికి ఎదో పెద్ద దూరం వెళ్ళివచ్చినట్లు ఇన్ని రోజులెందుకు పట్టింది? అని అడిగారు గురువుగారు. "ఈ యున్న" అన్నది అచ్చమైన తెలుగు నుడికారం. సంభాషణని దానితో మొదలుపెట్టడంతో పద్యానికి ఒక సహజత్వం సొగసు అబ్బింది. ఇక్కడ ఉదంకునికి వాడిన విశేషణం గమనించండి, "అత్యాయత విమల తపో మహిమా!". అంటే ఎంతో గొప్పదైన స్వచ్ఛమైన తపోమహిమ కలవాడా అని. అంతటి తపోమహిమ కలిగినవాడికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్న. అంతటి తపోమహిమ కలవాడు కాబట్టే ఆ కార్యాన్ని సాధించాడని ధ్వని.

గురువుగారు అలా అడిగేసరికి జరిగిందంతా పూస గుచ్చినట్లు చెపుతాడు ఉదంకుడు. తోవలో వెళుతూ ఉంటే ఎద్దునెక్కిన దివ్యపురుషుడు కనిపించిన విషయం మొదలు, తక్షకుడు కుండలాలని దొంగిలించడం, నాగలోకంలో చూసిన అద్భుతదృశ్యం, అక్కడ జరిగిన వింతలు విశేషాలు అన్నీ వివరిస్తాడు. చెప్పి, ఇదంతా ఏమిటి నాకు వివరించండి స్వామీ అని అడుగుతాడు.

ఆ గురువుగారు వివరించిన రహస్యమేమిటి? అందులోని అంతరార్థం ఏమయ్యుంటుంది? ఇంతకీ ఈ కథకీ జనమేజయుని సర్పయాగానికి ఉన్న సంబంధం ఏమిటి?

ఇవన్నీ తెలియాలంటే మరో టపాకోసం మీరు ఎదురుచూడల్సిందే! :-)

పూర్తిగా చదవండి...