తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, May 22, 2010

మన్మథుడి విజయరహస్యం

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే

ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.

లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.

మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.

ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.

తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన

శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.

శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!


పూర్తిగా చదవండి...

Wednesday, May 5, 2010

అంతర్జాలంలో మరో కల్పవృక్షం

కల్పవృక్షం అంటే మళ్ళీ రామాయణ కల్పవృక్షం అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఇది వేరే కల్పవృక్షం. అదేమిటో తెలియాలంటే ఈ పద్యం చదవండి:

పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి
కవుల దనుపుచు నర్థసంగ్రహణబుద్ధి
రోసి డస్సినవారల గాసిదీర్చు
గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ!

ఇది శ్రీ పాలూరి శంకరనారాయణగారు వ్రాసిన పద్యం.

పత్రం అంటే రెండర్థాలు. ఒకటి ఆకు. రెండు కాగితం. అలాగే ఫలము అంటే పండు, ప్రయోజనము. పత్ర పత్రానికి మంచి ఫలం ఉండేది కల్పవృక్షం. కోరిన కోరికలన్నిటినీ ఫలింప జేసేది కాబట్టి. అలాగే ప్రతి కాగితమూ ప్రయోజనవంతంగా ఉండే పుస్తకం ఒకటుంది. అది కవులని తృప్తిపరుస్తూ ఉంటుంది. అర్థాలు తెలుసుకొనే ప్రయత్నంలో అలసిపోయేవారికి చెట్టులా సేదదీరుస్తుంది కూడా. అర్థవంతమైన కవిత్వాన్ని వ్రాసేందుకు కవులకూ, ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులకూ కూడా ఉపయోగపడుతుందన్న మాట! అవును అదే నిఘంటువు. ఇప్పుడు చాలామంది తెలుగువాళ్ళకు దాని అర్థం తెలియాలంటే దాన్నే ఆశ్రయించాలేమో! తేలిక భాషలో చెప్పాలంటే డిక్షనరీ.
సరే మరి ఆకుల్లేకుండా పళ్ళు మాత్రమే ఉన్న చెట్లెక్కడైనా ఉంటాయా? మనిషి టెక్నేంద్రజాలానికి ఆ మాత్రం సాధ్యం కాకుండా పోతుందా! జంతర్ మంతర్ అంతర్జాలంలో ఉన్న డిక్షనరీలన్నీ "అపర్ణలే" (అంటే కాగితాలు లేనివే) కదా. తెలుగులో ఇప్పటికే బ్రౌన్ డిక్షనరీ అంతర్జాలంలో ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కనీసం నా బ్లాగులో పద్యాలు చదివేవాళ్ళు, నేను పొద్దులో ఇచ్చే గడితో కుస్తీ పట్టేవారు ఈ బ్రౌణ్యాన్ని ఉపయోగించే ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ దొరికిన మరో వరం ఆంధ్రభారతి నందనవనంలో కొత్తగా వెలసిన నిఘంటు కల్పవృక్షం. ఇందులో బ్రౌణ్యమే కాకుండా, శబ్దరత్నాకరం, మరి రెండు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు కూడా కలిపి ఉన్నాయి! ఈ నిఘంటువుల నుండి విడివిడిగా కాని అన్నిట్లో కలిపి కానీ కావలసిన పదాలను వెతుక్కోవచ్చు. ఆ వెతుకులాట పదాలలో (ఆరోపాలలో) కాని, మొత్తం వాటి అర్థాలలో ఎక్కడైనా కాని చేసుకోవచ్చు. శొధన (అదే, తెలుగు భాషలో చెప్పాలంటే సెర్చి) సులువు చేసుకోడానికి మరెన్నో వెసలుబాట్లు కూడా ఉన్నాయక్కడ. ఇంకెందు కాలస్యం, వెంటనే ఆ ఫలాలని ఆరగించడం మొదలుపెట్టండి! అన్నట్టు మరో విషయం. ఇది ఇంకా ఎదుగుతున్న చెట్టు. అంటే ఇందులో మరెన్నో నిఘంటువులు చేరబోతున్నాయన్న మాట!

బ్రౌను డిక్షనరీ ఒక యూనివర్సిటీ వాళ్ళ కృషి ఫలితమైతే, ఈ కొత్త నిఘంటువు కేవలం ఇద్దరి కృషి ఫలితం. వారు శ్రీ వాడపల్లి శేషతల్ప శాయిగారు, శ్రీ కాలెపు నాగభూషణ రావుగారు. వారి వెనక అజ్ఞాతంగా మరెవరైనా ఉన్నారేమో తెలియదు. తెలుగు మీద అభిమానమున్న వాళ్ళందరూ వారి కృషికి జోహార్లు చెప్పాల్సిందే. మన వంతు సహాయం కూడా చెయ్యవచ్చు. ఎలాగో అక్కడున్న Aboutలో ఇచ్చిన్న వివరాలని చూడండి.
పూర్తిగా చదవండి...