తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, January 27, 2012

నిరుపహతి స్థలం...


నిరుపహతిస్థలం మృదుతరాసన మొళ్ళుణి సింపుదంబులం
నరపిద పుస్తకప్రతతి లేఖకవాచకసంగ్రహం నిరం
తర గృహనిశ్చితస్థితి విచారకసంగతి సత్కళత్ర సా
దరతయి నుళ్ళ సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియం

ఇదే భాషో గుర్తుపట్టారుగా, కన్నడం. మరి పద్యాన్ని కూడా గుర్తుపట్టారా? ఆఁ... అవునదే... పెద్దనగారి చాటువు. ఒకేసారి రెండు భాషల్లో సినిమా విడుదల చేసినట్టు పెద్దనగారు కూడా ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో యీ చాటువు చెప్పేరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పద్యం సూక్తిసుధార్ణవము అనే కన్నడ గ్రంథంలోది . ఈ గ్రంథం క్రీ.శ. 1240 ప్రాంతంలో కూర్చబడింది, అంటే సుమారు పెద్దనగారి కాలానికి మూడువందల సంవత్సరాల ముందరన్న మాట. ఇది ఒక సంకలన గ్రంథం. అంటే రకరకాల కావ్యాలనుండి ఏర్చికూర్చిన పద్యాల సంకలనం. అయితే యీ పద్యం ఏ కావ్యంలోనిదో స్పష్టంగా తెలియలేదు.

సరే మరి తెలుగుపద్యం బ్లాగులో తెలుగుపద్యం లేకపోతే ఎలా! చాలామందికి నోటికొచ్చే ఉంటుంది కాని తెలియనివాళ్ళ కోసం:

నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు  లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఈ తెలుగు పద్యాన్ని చెప్పినది పెద్దనగారో మరెవరో కచ్చితంగా తెలియదు. ఒకవేళ పెద్దనగారే అయితే మాత్రం, కన్నడపద్య స్ఫూర్తితోనే యీ పద్యాన్ని చెప్పుంటారనడంలో సందేహం లేదు. అయితే మాత్రమేం! కిట్టనివాళ్ళు వట్టి అనువాదం అని కొట్టిపారేస్తూ ఉంటారు గాని, మూలాన్ని సానబెట్టి మెరుగులు దిద్ది రాతినుండి రత్నాన్ని తయారుచెయ్యడం మన తెలుగు కవులకి వెన్నతో బెట్టిన విద్య. తెలుగుభాషపై నాకున్న పక్షపాతం అని మీరన్నా ఫరవాలేదు, నాకు మాత్రం కన్నడపద్యం కన్నా మన తెలుగుపద్యమే ఎంతో అందంగా ఉందనిపించింది. ఎందుకంటారా? చూడండి.

కన్నడంలో "మృదుతరాసనం" అని చెప్పి ఊరుకున్నారు కాని తెలుగులో "ఊయల మంచ"మని ఎంత చక్కగా బొమ్మకట్టి చూపించారు! ఒక రసిక కవికి అంతకన్నా మృదుతరాసనం ఏముంటుంది! ఆ రసికతే పద్యమంతా కనిపిస్తుంది. కన్నడ పద్యం, ఒక బుద్ధిమంతుడైన పండితకవి తనకి కావలసిన సామగ్రి చిట్టా ఏకరువు పెట్టినట్టుంది. మరి తెలుగు పద్యమో! సరస రమణీయంగా, అచ్చంగా ఓ కవి చెప్పినట్టుగానే ఉంది. కన్నడ కవి కోరుకున్నది సత్కళత్ర సాదరత, అంటే మంచి భార్య తనని సాదరంగా చూసుకోవడం. దానికి దీటుగా తెలుగు కవి కోరుకున్నదేమిటి? "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడెము". కన్నడ పద్యంలో "ఇంపు దంబులం" ఇక్కడ "కప్పురవిడెము" అయ్యింది. అవతల భార్య తన రాకకై వేచి చూస్తోంది. ఇతను రాకపోయేటప్పటికి తన చెలికత్తె ఒకర్తికి  తాంబూలాన్ని యిచ్చి దూతగా పంపింది. కప్పురవిడెము పంపడంలోని ఆంతర్యం రసజ్ఞులు గ్రహించగలరు. కన్నడ పద్యంలో ఉటంకించిన "నిరంతర గృహనిశ్చిత స్థితి", "సత్కళత్ర సాదరత" అనే అంశాలిందులో ఎంత చక్కగా ధ్వనిస్తున్నాయో గమనించండి.  ధ్వని కలిగినదే మంచి కవిత్వం. ఇక, కన్నడ పద్యంలోని "ఒళ్ళు ఉణిసి" అంటే మంచి భోజనం, తెలుగులో "ఆత్మకింపయిన భోజన" మయింది. కన్నడంలోని "విచారక సంగతి", తెలుగులో "ఒప్పు తప్పరయు రసజ్ఞు" లయ్యారు. కేవలం విచారణ, విశ్లేషణ ఉంటే సరిపోదు. ఒప్పు తప్పులు తెలిస్తే చాలదు. వారు రసజ్ఞలై ఉండాలి. లేదంటే ప్రతి దానికీ ఏదో ఒక నెరసు చూపిస్తూ కవిత్వాన్ని బొత్తిగా ఆస్వాదించలేని వారవుతారు. భాస్కరశతకంలో "చదువది ఎంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. కవిత్వాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞత చాలా ముఖ్యం. అలాగే, కన్నడంలో "లేఖకవాచక సంగ్రహం", తెలుగులో "ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము" లయ్యారు. వట్టి లేఖక వాచక సంగ్రహ ముంటే చాలదు. వాళ్ళు ఎలాంటి వారై ఉండాలో మన తెలుగు కవి చెపుతున్నాడు. వాళ్ళు ఊహ తెలియగల వారై ఉండాలి. ఇది చాలా విశేషమైన అంశం. ఆ రోజులలో కవికి లేఖకులుండేవారు. కవి చెపుతూ ఉంటే పక్కనే కూర్చొని ఒక వ్రాయసకాడు దానిని తాళపత్రాలమీద లిఖించేవాడు.  ఆధునిక కాలంలో కూడా విశ్వనాథ వారికి యిలానే లేఖకులుండేవారు. కవితాధార అవిశ్రాంతంగా సాగుతూ ఉంటే దాన్ని అంత వేగంగానూ లేఖకుడు  పట్టుకొని వ్రాయాలంటే మరి ఆ లేఖకునికి కవి చెపుతున్న విషయమ్మీద చక్కటి అవగాహన ఉండాలి. పైగా మధ్యలో ఏదైనా ఒకచోట ఆ వేగాన్ని అందుకోలేకపోతే, అక్కడ కవి చెప్పినది ఏమిటో ఊహించగలిగే ప్రజ్ఞ ఉండాలి. లేదంటే కుంటినడకే అవుతుంది. కవిత్వం ధ్వని ప్రధానం కాబట్టి, దాన్ని చదివే పాఠకులకి కూడా అందులోని ధ్వని గ్రహించ గలిగే ఊహశక్తి ఉండాలి. లేకపోతే ఎంత గొప్ప కవిత్వం రాసీ ఏమిటి ప్రయోజనం? అందుకే ఇవన్నీ దొరికితే తప్ప లేకపోతే కవిత్వం వస్తుందయ్యా అంటున్నాడీ కవి. దాన్ని సొగసైన తెలుగు నుడికారంలో చెపుతున్నాడు "ఊరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే!" అని.

పాతకాలపు కవిత్వాన్ని నిరసించేందుకు కొంతమంది యీ పద్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు.
"ఏకాంతము, చెలికత్తె తెచ్చి యిచ్చిన కర్పూర తాంబూలమూ, ఉయ్యాల మంచమూ, మంచి భోజనమూ - కవిత్వం రాయాలంటే యివన్నీ కావలట! ఇదేమి కవిత్వం, వట్టి భోగపు కవిత్వం." అని పెదవి విరుస్తూ ఉంటారు. నిజమే, ఆ కాలంలో వచ్చినది  చాలా వరకూ కడుపునిండిన కవిత్వమే. మరి ఆ పద్యంలో తర్వాత చెప్పినవాటి సంగతేమిటి? తప్పొప్పులు తెలిసిన రసజ్ఞులు, ఊహ తెలిసిన లేఖక పాఠకులు. ఏ కాలాంలోనైనా మంచి కవిత్వం రావడానికి అవసరమైనవే కదా యివి. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనకి నచ్చిన కవి, మనకి నచ్చిన అంశాన్ని గూర్చి ఏది రాసినా దాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడమూ, కానప్పుడు అథః పాతాళానికి తొక్కెయ్యడమూ రసజ్ఞత అనిపించుకుంటుందా? అలా చేసినప్పుడు మంచి కవిత్వం వస్తుందా? ఇప్పటి విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలివి. ఈ కాలంలో "లేఖకులు" లేరు. కాని వారి స్థానంలో యిప్పుడు ప్రచురణకర్తలున్నారు. సంపాదకులున్నారు. వాళ్ళకుండాల్సిన లక్షణం "ఊహ తెలియడం". ఇక పాఠకుల సంగతి సరేసరి! ఇక్కడొక అనుమానం రావచ్చు. కవిత్వం అనేది కవి వ్యక్తిగత విషయం. పాఠకులూ, విమర్శకులూ, సంపాదకులూ బయటవారు. కవి తనకోసం రాసుకుంటాడు కాని వీళ్ళకోసం కాదు కదా. అందువల్ల, ఒక కవి మంచి కవిత్వాన్ని రాయగలగడానికి వీరంతా ఎందుకూ? - అని. నిజమే, ఇక్కడ చెప్పినదాన్ని ఒక కవికి వ్యక్తిగతంగా అన్వయించడం అంత సమంజసం కాదు. సామాజికంగా అన్వయించుకోవాలి. అంటే, ఒక భాషలో, సమాజం నుండి మంచి కవిత్వం రావాలీ అంటే, ఆ భాషాసమాజంలో రసజ్ఞులైన విమర్శకులు, ఊహ తెలిసిన పాఠకులు సంపాదకులు తప్పకుండా ఉండాలి. మంచి కవిత్వానికి గుర్తింపు, ప్రచారం లభించినప్పుడే అది సమాజంలో నిలుస్తుంది. ఆ బాధ్యత, పైన చెప్పిన ముగ్గురిదీ. ఈ పద్యం మనకా విషయాన్ని గుర్తు చేస్తుంది.

ఇదీ మన తెలుగుపద్యం గొప్పదనం. మరో సంగతి మీరు గమనించారో లేదో. కన్నడ పద్యానికి యతి నియమం లేదు! ప్రాస ఒక్కటే ఉంది. తెలుగుపద్యానికి రెండూ ఉన్నాయి. అయినా తెలుగుపద్యం ఇంత కవితాత్మకంగా ఉందంటే దాని అర్థమేమిటి? వ్రాసే సత్తా  ఉండాలే కాని, మంచి కవిత్వం పుట్టించేందుకు యతిప్రాసల నియమాలు బంధకం కావనే కదా. నిజానికీ యతిప్రాసలు, అభివ్యక్తిలో పద్య నిర్మాణంలో కొత్తదనం కోసం కవిని ఆలోచింపజేసే ఉపకరణాలని నా అభిప్రాయం. ఆ సాధన చేసే ఓర్పు నేర్పు కవికి అవసరం. మంచి కవిత్వం అప్పుడే పండుతుంది.

పూర్తిగా చదవండి...

Saturday, January 14, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు!


సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈసారి పండక్కి ఊరు వెళ్ళలేదు. అంచేత తలపోతలు కలబోతలూ ఏమీ లేవు. చుట్టాలుపక్కాలతో కలవకపోతే పండక్కి, అందులోనూ సంక్రాంతికి  కళేముంటుంది? అయినా యథారీతి పొద్దున్నే లేచి యథాశక్తి భోగి మంట వేశాం. తమిళవాళ్ళు కూడా భోగి మంట వేస్తారు. డప్పులాంటి వాద్యాన్ని వాయించి మరీ! అయితే రెండు మూడిళ్ళవాళ్ళు తప్పించి పెద్దగా ఎవ్వరూ వెయ్యలేదు. నాలుగురోజులుగా తగ్గిందనుకున్న చలి మాత్రం మళ్ళీ బాగా తెలిసింది. తెలవారక ముందే లేచావేఁమో, యింకా కరగని పొగమంచు  మరింత వణికించింది! ఇక్కడది అరుదుగా మాత్రమే దొరికే అనుభవం.

మనసిభవుండు భోగి చలిమంటల చుట్టును పుష్పచాప శిం
జిని రవళించుచుం దిరిగె సిద్ధమనోరథుడై, వియోగినీ
జనములు దీర్ఘ యామినుల జార్చిన లోచన బాష్పవారి వీ
చెను బవనమ్మనంగ మెఱసెం దృణలగ్న తుషారబిందువుల్

ఈ కవిగారు మంచి సరసులే! భోగిమంటల చిటపటలు ఇతనికి మన్మథుని  వింటి చిరుమువ్వల సవ్వడిలా ఉందట. తన మనోరథం సిద్ధించిందన్న ఆనందంతో ఆ చెఱుకువిలుకాడు భోగిమంట చుట్టూ తిరుగుతున్నాడట. అతనలా సంబరం చేసుకుంటూ ఉంటే పాపం వియోగినులు మాత్రం తమ ప్రియుల నెడబాసి ఎంతో బాధపడుతున్నారు. కలిసి ఉన్న ప్రేయసీప్రియులను వేసవి పగళ్ళు ఎంతగా బాధిస్తాయో ("నలదమయంతులిద్దరు మనః ప్రభవానల బాధ్యమానలై" పద్యం గుర్తుందా, ఇంతకుముందు ముచ్చటించుకున్నాం!), వియోగంలో  ఉన్న (అంటే దూరదూరంగా ఉన్న) ప్రేయసి ప్రియులను శీతకాలపు రాత్రులు అంతగా బాధిస్తాయి.  వాళ్ళకు పగళ్ళు దీర్ఘాలయితే, వీళ్ళకు రాత్రులు దీర్ఘాలు. ఇది చలికాలం కదా. అంచేత వియోగినులకు దీర్ఘ యామినులు (రాత్రులు) ఎంతో కష్టాన్ని కలిగిస్తున్నాయి. వారి కన్నీటిని రేయి గాలి మోసుకొచ్చిందేమో అన్నట్టుగా ఉదయాన గడ్డిపోచలపై మంచు బిందువులు మెరుస్తున్నాయట!

భోగీ మంటతో పాటు మరో తప్పనిసరి అంశం ముగ్గులు. రంగు రంగుల ముగ్గులు. రంగవల్లికలు. కొందరు ధనుర్మాసం నెల్లాళ్ళూ పెడతారు కాని మేం మాత్రం పండగ మూడు రోజులే.

ఈ కవిగారి దగ్గర ఎంతందమైన రంగులున్నాయో చూడండి!

అరుణసరోరుహాక్షి సమదారుణ దృష్టులు, పుండరీక సుం
దరధవళాయతాక్షి తెలినవ్వుల చూపులు, మేచకోత్పల
స్ఫుర దురునేత్ర నీలి జిగి చూడ్కులు గూడి త్రివర్ణ శోభలం
గురియుచునున్న మ్రుగ్గులవిగో! భవనాంగణ శుభ్రసీమలన్

మూడు రంగులతో ముచ్చట గొలిపే ముగ్గులని మనకి చూపిస్తున్నారిక్కడ. కెందామరల్లాంటి కళ్ళున్న అమ్మాయిల చూపుల్లో ఎఱ్ఱదనం, తెలిదమ్మి పూవుల్లాంటి కళ్ళున్న అమ్మాయిల నవ్వుల చూపుల్లోని తెల్లదనం, నల్లకలువల కళ్ళ కలికి నెలతల చల్లని వెలుగు చూపుల్లోని శ్యామలత్వం - ఈ మూడు రంగులూ కలిసి మెరిసే రంగవల్లులు ఇళ్ళ ముంగిళ్ళలో వెలుగుతున్నాయట.

సంక్రాంతి పండగంటే అత్తవారింట్లో కొత్తల్లుళ్ళ సంబరాలు మామూలే. అయితే ఆ కొత్తదంపతుల వేడుక చూసి సర్వసాక్షి ఏమనుకున్నాడు? అది యీ కవిగారు చెపుతున్నారు. రవి గాననిచో కవి గాంచునే కదా!

భూతలనాకముల్ శ్వశురపూజ్యగృహమ్ములు, నవ్యనవ్య జా
మాతృవధూ వచోవలయ మంజులముల్ గనులార గాంచి, ఆ
శాతురుడైన సూర్యుడు సహస్రకరమ్ములతోడ నుత్తరా
శాతరుణోపగూహనము సల్పగ సాగెను  తేజితేరుపై

మామగారిళ్ళల్లో కొత్త దంపతుల ముచ్చట్లను చూసిన సూర్యునికి తన ప్రేయసిని కలుసుకోవాలనే కోరిక తొందరపెట్టిందట. అందుకే తన వేయిచేతులు సాచి ఉత్తరదిక్కనే సతిని కౌగిలించుకోవాలని  ఆ వైపు తన సప్తాశ్వరథాన్ని దౌడు తీయించాడట. అసలే మన్మథ ధ్వజమైన మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడాయె. సూర్యునికి ఆమాత్రం కోరిక కలగడంలో ఆశ్చర్యమేముంది!

ఇవీ ఈ యేటి సంక్రాంతి పద్యాలు. ఇంతకీ యీ పద్యాలు వ్రాసిన కవి శ్రీ శనగన నరసింహస్వామి. అతని "హేమంత సంక్రాంతి" అనే ఖండికలోనివి. బాగున్నాయి కదూ!

పూర్తిగా చదవండి...