తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, January 14, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు!


సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈసారి పండక్కి ఊరు వెళ్ళలేదు. అంచేత తలపోతలు కలబోతలూ ఏమీ లేవు. చుట్టాలుపక్కాలతో కలవకపోతే పండక్కి, అందులోనూ సంక్రాంతికి  కళేముంటుంది? అయినా యథారీతి పొద్దున్నే లేచి యథాశక్తి భోగి మంట వేశాం. తమిళవాళ్ళు కూడా భోగి మంట వేస్తారు. డప్పులాంటి వాద్యాన్ని వాయించి మరీ! అయితే రెండు మూడిళ్ళవాళ్ళు తప్పించి పెద్దగా ఎవ్వరూ వెయ్యలేదు. నాలుగురోజులుగా తగ్గిందనుకున్న చలి మాత్రం మళ్ళీ బాగా తెలిసింది. తెలవారక ముందే లేచావేఁమో, యింకా కరగని పొగమంచు  మరింత వణికించింది! ఇక్కడది అరుదుగా మాత్రమే దొరికే అనుభవం.

మనసిభవుండు భోగి చలిమంటల చుట్టును పుష్పచాప శిం
జిని రవళించుచుం దిరిగె సిద్ధమనోరథుడై, వియోగినీ
జనములు దీర్ఘ యామినుల జార్చిన లోచన బాష్పవారి వీ
చెను బవనమ్మనంగ మెఱసెం దృణలగ్న తుషారబిందువుల్

ఈ కవిగారు మంచి సరసులే! భోగిమంటల చిటపటలు ఇతనికి మన్మథుని  వింటి చిరుమువ్వల సవ్వడిలా ఉందట. తన మనోరథం సిద్ధించిందన్న ఆనందంతో ఆ చెఱుకువిలుకాడు భోగిమంట చుట్టూ తిరుగుతున్నాడట. అతనలా సంబరం చేసుకుంటూ ఉంటే పాపం వియోగినులు మాత్రం తమ ప్రియుల నెడబాసి ఎంతో బాధపడుతున్నారు. కలిసి ఉన్న ప్రేయసీప్రియులను వేసవి పగళ్ళు ఎంతగా బాధిస్తాయో ("నలదమయంతులిద్దరు మనః ప్రభవానల బాధ్యమానలై" పద్యం గుర్తుందా, ఇంతకుముందు ముచ్చటించుకున్నాం!), వియోగంలో  ఉన్న (అంటే దూరదూరంగా ఉన్న) ప్రేయసి ప్రియులను శీతకాలపు రాత్రులు అంతగా బాధిస్తాయి.  వాళ్ళకు పగళ్ళు దీర్ఘాలయితే, వీళ్ళకు రాత్రులు దీర్ఘాలు. ఇది చలికాలం కదా. అంచేత వియోగినులకు దీర్ఘ యామినులు (రాత్రులు) ఎంతో కష్టాన్ని కలిగిస్తున్నాయి. వారి కన్నీటిని రేయి గాలి మోసుకొచ్చిందేమో అన్నట్టుగా ఉదయాన గడ్డిపోచలపై మంచు బిందువులు మెరుస్తున్నాయట!

భోగీ మంటతో పాటు మరో తప్పనిసరి అంశం ముగ్గులు. రంగు రంగుల ముగ్గులు. రంగవల్లికలు. కొందరు ధనుర్మాసం నెల్లాళ్ళూ పెడతారు కాని మేం మాత్రం పండగ మూడు రోజులే.

ఈ కవిగారి దగ్గర ఎంతందమైన రంగులున్నాయో చూడండి!

అరుణసరోరుహాక్షి సమదారుణ దృష్టులు, పుండరీక సుం
దరధవళాయతాక్షి తెలినవ్వుల చూపులు, మేచకోత్పల
స్ఫుర దురునేత్ర నీలి జిగి చూడ్కులు గూడి త్రివర్ణ శోభలం
గురియుచునున్న మ్రుగ్గులవిగో! భవనాంగణ శుభ్రసీమలన్

మూడు రంగులతో ముచ్చట గొలిపే ముగ్గులని మనకి చూపిస్తున్నారిక్కడ. కెందామరల్లాంటి కళ్ళున్న అమ్మాయిల చూపుల్లో ఎఱ్ఱదనం, తెలిదమ్మి పూవుల్లాంటి కళ్ళున్న అమ్మాయిల నవ్వుల చూపుల్లోని తెల్లదనం, నల్లకలువల కళ్ళ కలికి నెలతల చల్లని వెలుగు చూపుల్లోని శ్యామలత్వం - ఈ మూడు రంగులూ కలిసి మెరిసే రంగవల్లులు ఇళ్ళ ముంగిళ్ళలో వెలుగుతున్నాయట.

సంక్రాంతి పండగంటే అత్తవారింట్లో కొత్తల్లుళ్ళ సంబరాలు మామూలే. అయితే ఆ కొత్తదంపతుల వేడుక చూసి సర్వసాక్షి ఏమనుకున్నాడు? అది యీ కవిగారు చెపుతున్నారు. రవి గాననిచో కవి గాంచునే కదా!

భూతలనాకముల్ శ్వశురపూజ్యగృహమ్ములు, నవ్యనవ్య జా
మాతృవధూ వచోవలయ మంజులముల్ గనులార గాంచి, ఆ
శాతురుడైన సూర్యుడు సహస్రకరమ్ములతోడ నుత్తరా
శాతరుణోపగూహనము సల్పగ సాగెను  తేజితేరుపై

మామగారిళ్ళల్లో కొత్త దంపతుల ముచ్చట్లను చూసిన సూర్యునికి తన ప్రేయసిని కలుసుకోవాలనే కోరిక తొందరపెట్టిందట. అందుకే తన వేయిచేతులు సాచి ఉత్తరదిక్కనే సతిని కౌగిలించుకోవాలని  ఆ వైపు తన సప్తాశ్వరథాన్ని దౌడు తీయించాడట. అసలే మన్మథ ధ్వజమైన మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడాయె. సూర్యునికి ఆమాత్రం కోరిక కలగడంలో ఆశ్చర్యమేముంది!

ఇవీ ఈ యేటి సంక్రాంతి పద్యాలు. ఇంతకీ యీ పద్యాలు వ్రాసిన కవి శ్రీ శనగన నరసింహస్వామి. అతని "హేమంత సంక్రాంతి" అనే ఖండికలోనివి. బాగున్నాయి కదూ!

4 comments:

  1. కామేశ్వర రావు గారూ ! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు! పద్యాలు చాలా బాగున్నాయి

    ReplyDelete
  2. సంక్రాంతి శుభాకాంక్షలు!! పద్యాలు చాలా చక్కగా ఉన్నాయండి.

    ReplyDelete
  3. సంక్రాంతి శుభాకాంక్షలు

    ReplyDelete
  4. పద్యాలు చాలా బాగున్నాయి. మీకు,మిత్రు లందఱికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete