తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, January 28, 2011

ఉదంకుడి కథ - 2

ఉదంకోపాఖ్యానం మొదటి భాగం ఎంత వరకూ చెప్పుకున్నాం? కుండలాలని అడిగి తీసుకోడానికి వెళ్ళిన ఉదంకుడు, అంతఃపురంలో పౌష్యుని భార్య కనిపించక తిరిగివచ్చాడు కదా. వచ్చి పౌష్యుడితో ఆ విషయం చెపితే, పౌష్యుడిలా అంటాడు:

భూవినుత! నిన్ను ద్రిభువన
పావను నశుచి వని యెట్లు వలుకగ నగు న
ద్దేవి పవిత్ర పతివ్రత
గావున నశుచులకు గానగా దనవద్యా!

ఒక సంభాషణా రచనలో, నన్నయాది కవులు ఎంత జాగ్రత్త వహించారో తెలుసుకోడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ. ఏదో గణాలు, యతి ప్రాసలు కిట్టించేసి పద్యాలు వ్రాస్తే అది కవిత్వం అవ్వదు. కథా కావ్యంలో పాత్రల సంభాషణలకి ఎంతో ప్రాధాన్యముంటుంది. సంభాషణ పాత్రకి సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి. ఉదంకుడికి పౌష్య దేవి కనిపించలేదు. మహా పవిత్రురాలు కాబట్టి, శుచులకు (మనోవాక్కాయములు మూడిటా పరిశుద్ధులైన వాళ్ళు) మాత్రమే ఆవిడ కనిపిస్తుంది. ఉదంకుడికి కనిపించ లేదంటే అతడు పరిశుద్ధుడు కాడన్న మాట. అతను చూస్తే ముని. పైగా పవిత్రమైన గురు కార్యమ్మీద వచ్చినవాడు. అతణ్ణి పట్టుకొని నువ్వు అశుచివి అనడం అసమంజసం. కాని విషయం చెప్పాలి. అలాంటి సందర్భంలో ఒక రాజైన వాడు ఎంత సందర్భోచితంగా, చతురతతో మాట్లాడాలి. అది మనకీ పద్యంలో కనిపిస్తుంది. పద్యం ఎత్తుకోడమే "భూవినుత" అన్న సంబోధనతో మొదలయ్యింది. అంటే భూప్రజల చేత చక్కగా నుతింపబడే వాడా అని అర్థం. అంటే నువ్వంత గొప్పవాడివని నాకు తెలుసు అని ముందుగానే ప్రకటిస్తున్నాడు. అలా మూడు లోకాలలోకెల్లా పవిత్రమైనవాడివి నిన్ను అశుచి అని అనడం కుదురుతుందా? అయినా విషయం ఏమిటంటే, నా దేవేరి మహా పవిత్ర, పతివ్రత. అందువల్ల ఆవిడ ఆశుచులకి కనపడదు (కానన్=చూడ్డానికి, కాదు=అవ్వదు). అని చెప్పి, మళ్ళీ "అనవద్యా!" అన్న సంబోధనతో ముగించాడు. అనవద్యుడంటే దోషములేనివాడు. అంటే ఉదంకుని మీద తనకున్న అచంచల గౌరవాన్ని ప్రకటిస్తూనే, అసలు విషయం చెప్పాడన్న మాట. ఇలాంటి పద్యాలు Communication trainingలో ఉదాహరణలుగా చెప్పదగ్గవి!

అలా చెప్పబట్టే ఉదంకుడు చిన్నబుచ్చుకోకుండా, కోపగించుకోకుండా, నింపాదిగా ఆలోచించాడు. ఆలోచిస్తే, తాను ఎద్దు పేడని తిన్నానన్న సంగతి గుర్తుకువచ్చింది. ఒహో బహుశా అందుకే కాబోలు అశుచి దోషం తనకి కలిగిందని అనుకొని, శుభ్రంగా చేతులు కాళ్ళు ముఖము కడుక్కొని, తూర్పుకు తిరిగి ఆచమనం చేసి శుద్ధిచేసుకొని, పౌష్యుడి అనుమతి తీసుకొని మళ్ళీ అంతఃపురానికి వెళ్ళాడు. ఇప్పుడతనికి ఆ పౌష్యా దేవి కనిపించింది. అతనికి నమస్కరించి తన కుండలాలని సంతోషంగా ఇచ్చింది.

ఇదొక విచిత్రమైన సన్నివేశం. ఏ గోమయమాన్ని తింటే కార్యం సఫలమవుతుందని ఆ దివ్యపురుషుడు చెప్పాడో అదే ఆటంకమయ్యింది! ఎందుకిలా జరిగింది? అసలా దివ్యపురుషుడు ఎవరు, ఆ గొమయం ఏమిటి అన్న విషయం ప్రస్తుతానికి పక్కనపెడితే, ఉదంకుడు తాను తిన్నది గోమయమనే భావనతోనే ఉన్నాడు. అంటే మనస్సులో అతనికి శుచిత్వం లేదన్న మాట. అంచేత నిజంగా ఆ గోమయం వల్ల అతనికి అశుచి కలిగినా కలగకపోయినా, మనసులో అతనికా అపవిత్ర భావన కలిగింది కాబట్టి అతను అపవిత్రుడే అయ్యాడు. శుద్ధి చేసుకున్నాక, అతని మనసులోనున్న శంక పోయి అది పరిశుద్ధమయింది. అప్పుడతనికి పౌష్యుని భార్య కనిపడింది.

ఉదంకుడికి కుండలాలని ఇస్తూ పౌష్యుని భార్య తక్షకుడి గురించి చెపుతుంది. తక్షకుడు ఒక నాగరాజు. అతడు చాలా రోజులుగా ఆ కుండలాలపై కన్నేసి ఉంచాడు. అతను చాలా మాయగాడు. ఆ తక్షకుడినుండి కాపాడుకుంటూ తీసుకువెళ్ళమని ఉదంకుడికి చెపుతుంది. సరే అని చెప్పి ఆ కుండలాలు తీసుకొని మళ్ళీ పౌష్యుడి వద్దకు వస్తాడు. అప్పుడా రాజు ఉదంకుడితో, మీరు మా అతిథి కాబట్టి మా యింట భోజనం చెయ్యనిదే వెళ్ళకూడదని అంటాడు. ఇది భారతీయ సంస్కారం, సంప్రదాయం. తొందరలో ఉన్నా, అడిగినప్పుడు కాదనకూడదని సరేనంటాడు ఉదంకుడు. భోజనం చేస్తూంటే అందులో ఒక తలవెండ్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడా అన్నాన్ని అసహ్యించుకొని, కోపించి, సరిగా పరీక్షించకుండా అశుద్ధాన్నం పెట్టావు కాబట్టి గుడ్డివాడవు కమ్మని పౌష్యుడిని శపిస్తాడు. పౌష్యుడు కూడా శాపానుగ్రహ సమర్థుడే. ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నీకు సంతానం కలగకుండు గాక అని ప్రతిశాపం పెడతాడు. సంతానోత్పత్తికి అన్నం మూలాధారమని వేదం చెపుతుంది. వెండ్రుక వచ్చిన దోషానికి అన్నాన్నే ఈసడించినందువల్ల అతను సంతానహీనుడయ్యాడన్నది ఇందులోని రహస్యం. ఉదంకుడప్పుడు, అయ్యో నేను సంతానహీనుణ్ణి కాలేను, శాపం ఉపహరించు అంటాడు. దానికి పౌష్యుడు ఇలా అంటాడు:

నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత, విప్రులయందు, నిక్కమీ
రెండును రాజునందు విపరీతము, గావున విప్రుడోపు, నో
పం డతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మఱింపగన్

ఇది బాగా ప్రాచుర్యం పొందిన పద్యం. ఇక్కడ పౌష్యుడు చెప్పదలుచుకున్నది తానిచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని. కాని దానికి హేతువు కూడా చెపుతున్నాడు. ఆ చెప్పడం కూడా ఎంతో సొగసుగా చెపుతున్నాడు. విప్రుల నిండుమనసు అప్పుడే చేసిన వెన్నతో సమానము. అంటే అంత మృదువైనది. కాని వాళ్ళ మాట మాత్రం దారుణమైన వజ్రాయుధమంత కఠినం (ఆఖండలుడు అంటే ఇంద్రుడు. అతని శస్త్రం వజ్రాయుధం). కాని రాజు విషయంలో ఈ రెండూ విపరీతం, అంటే ఇటునుంచి అటు. రాజు హృదయం వజ్రాయుధమంత కఠినమైనా వాక్కు వెన్నంత మెత్తగా ఉంటుంది! ఈ లక్షణాలు వాళ్ళ వాళ్ళ వృత్తులవల్ల వాళ్ళకి సంక్రమిస్తాయన్న విషయాన్ని అక్కడ వాడిన పదాల ద్వారా స్ఫురింపచేసాడు నన్నయ్య. విప్రుడంటే వేదాలు చదివినవాడు. నిరంతర వేద పఠనం వలన విప్రుల వాక్కు కాఠిన్యాన్ని పొందుతుంది. కాని వాళ్ళకి ఎవరిపైనా ద్వేషమో, కోపమో ఉండాల్సిన అవసరం లేదు. కఠినంగా ఆలోచించాల్సిన, ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు. రాజు అలా కాదు. రాజు రాజ్యాన్ని ఏలేవాడు. అతను నరపాలుడు. అంచేత అతని మనసు వివిధ విషయాలలో చీకాకు పొందుతూ ఉంటుంది. రాగద్వేషాలతనికి కలుగుతూ ఉంటాయి. అతనికి చాలామందితో కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మెత్తగా మాట్లాడవలసిన అవసరమూ ఉంది. ఈ లక్షణాల కారణంగా విప్రుడు తన శాపాన్ని వెనక్కు తీసుకోగలడుట, రాజు మాత్రం ఆ పని చెయ్యలేడట! అంతేకదా మరి. మాట కన్నా మనసు శక్తివంతమైనది.

ధారాశుద్ధి, చిక్కదనం రెండిట్లో ఏ ఒక్కటీ చెడకుండా కూర్చిన పద్యమిది. ఇతిహాసాన్ని కావ్యంగా మలచేటప్పుడు ఎలాంటి నేర్పు చూపించాలో, ఈ పద్యాన్ని దీని సంస్కృత మూలంతో పోల్చి చూస్తే తెలుస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు పరిశీలించవచ్చు. ఈ పద్యం గుఱించి విశ్వనాథవారు "సాహిత్యసురభి" పుస్తకంలో ఇచ్చిన వివరణ ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.yahoo.com/group/Chandassu/message/1072

పౌష్యుడలా వివరించి, కాబట్టి నువ్వే నీ శాపాన్ని తిరిగి తీసుకోమని ఉదంకుడిని కోరతాడు. సరే కొద్ది కాలంలోనే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్పి ఉదంకుడు అక్కడనుండి బయలుదేరతాడు. గురుకార్యం సఫలమయిందని సంతోషిస్తూ తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. తోవలో ఒక సరస్సు కనిపిస్తే, గట్టున ఒక చోటును శుభ్రం చేసి, కుండలాలని అక్కడ పెట్టి, స్నానానికని ఆ సరస్సులోకి దిగుతాడు. అంతదాకా తక్షకుడు ఉదంకుణ్ణి ఒక దిగంబరుడి వేషంలో అనుసరిస్తూనే ఉంటాడు. ఉదంకుడు ఎప్పుడైతే కుండలాలని విడిచి సరస్సులోకి వెళ్ళాడో అప్పుడా కుండలాలని చేత చిక్కించుకొని పరుగు లంకించుకుంటాడు. ఇది చూసిన ఉదంకుడు ఆ తక్షకుడి వెంటపడి అతడిని పట్టుకుంటాడు. వెంటనే ఆ తక్షకుడు మనిషి రూపాన్ని విడిచి, తన అసలు రూపమైన పాముగా మారి, ఒక పుట్టలోకి దూరి కుండలాలతో పాటు పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడుకూడా వాడి వెంటే ఆ పుట్టలోంచి నాగలోకానికి వెళతాడు. తక్షకుడైతే పాము రూపంలో చకచకా పుట్టలోంచి దూరిపోయి వెళిపోతాడు. మరి మనిషైన ఉదంకుడు ఎలా వెళ్ళగలడు అనే అనుమానం మనకి రావచ్చు. ఇక్కడే నన్నయ్య మితభాషిత్వం మనకి తెలుస్తుంది. ఉదంకుడు ఎలా వెళ్ళగలిగాడో వాచ్యంగా మనకి చెప్పడు. కాని దాన్ని ఇప్పటికే కథలో స్ఫురింపజేసాడు. ఒక్కసారి కిందటి టపాలో మొదట ఉదంకుడి గుఱించిన వర్ణనలో ఏముందో చూడండి. ఉదంకుడు అణిమాది సిద్ధ విద్యలన్నీ నేర్చినవాడు అని అక్కడుంది కదా. కాబట్టి ఆ విద్యలని (అందులో లఘిమ అన్నదొక విద్య. దాన్ని ఉపయోగించి మనిషి ఎంత చిన్నగానైనా మారిపోవచ్చు!) ఉపయోగించి వెళ్ళాడని మనం ఊహించవచ్చు. అరిటిపండు వలిచిపెట్టినట్టుగా ప్రతి చిన్న విషయాన్నీ అనవసరంగా విశదీకరిస్తే అది మంచి కవిత్వం అవ్వదు. పూర్వాపర సంబంధంతో పాఠకుడికి కొన్ని విషయాలని స్ఫురించేట్టు వ్రాసినప్పుడే అది చిక్కని కవిత్వం అవుతుంది.

నాగలోకం చేరిన ఉదంకుడికి నాగజాతి ప్రముఖులందరూ కనిపిస్తారు. వాళ్ళని నాలుగు పద్యాలలో స్తుతిస్తాడు. ఆ నాలుగూ పద్యాలూ నన్నయ్యగారి అద్భుత రచన!

మొదటగా ఆదిశేషుని (అనంతుడని కూడా అంటారు) స్తుతించే పద్యం:

బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అ
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్

ఎన్నో అడవిచెట్లతోనూ (పాదపము అంటే చెట్టు), సముద్రాలతోనూ (అబ్ధి), కులపర్వతాలతోనూ, పూర్ణ సరః అంటే నిండైన సరస్సులతోనూ, సరస్వతీ అంటే నదులతోనూ, సహిత=కూడిన, మహా భూభారాన్ని, అజస్ర=స్థిరమైన, సహస్రఫణాళి=వేయిపడగలతో, దాల్చి, దుస్సహరత=భరింపశక్యము కాని మూర్తి కల విష్ణుమూర్తికి నిరంతరం పాన్పుగా ఉన్న నాగరాజు అనంతుడు, దుష్కృతాంతకుడు=పాపములని అంతమొందించేవాడు, మాకు ప్రసన్నుడు అవుగాక - అని ప్రార్థన.
ఇందులోని పదాల పొహళింపు పాము బుసని ఎలా ధ్వనిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, అది అనుభవైకవేద్యం. భావంలో కూడా ఆ అనంతుడు ఎంత గొప్ప భారాన్ని మోస్తున్నాడో సార్థకమైన పదాలతో ధ్వనింప చేసాడు నన్నయ్య. విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణుమూర్తి. అందుకే అతను దుస్సహతర మూర్తి. ఒక వైపు తన పడగలతో భూభారాన్ని మోస్తూ, మరొక వైపు ఆ దుస్సహతర మూర్తికి పానుపయ్యాడు, అది కూడా నిరంతరమూ! అంతే కాదు అక్కడ విష్ణుమూర్తికి ఉపయోగించిన పదం జాగ్రత్తగా చూడండి. అతను "జలధిశాయి". అంటే సముద్రంలో శయనించేవాడు. కాబట్టి అతని పానుపైన ఆదిశేషువు కూడా సముద్రంలోనే ఉండాలి కదా. ఇంత భారాన్ని మోస్తూ అతనున్నది అస్థితరమైన సముద్రంలో నన్న మాట! అతని పని ఇంకెంత కష్టమో! అహిపతి, దుష్కృతాంతకుడు అనే పదాలు, తనకు వచ్చిన కష్టాన్ని తొలిగించమని సూచించడానికి. అతను నాగరాజు కాబట్టి అతనికా శక్తి ఉంటుంది. పాపాలని పోగొడతాడు కాబట్టి, తన వల్ల దోషమేదైనా ఉంటే పోగొట్టమని. చివరనున్న "మాకు ప్రసన్నుడయ్యెడున్" అనడంలోని బహువచనం దేనికి అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇది తెలుగు పలుకుబడి. ఎప్పుడైనా దేవుడిని ప్రార్థించేటప్పుడు "మమ్మల్ని కాపాడు తండ్రీ" అనే అంటాం కాని "నన్ను కాపాడు తండ్రీ" అనడం ఆనవాయితీ కాదు. ఆ "మనం"లో మన కుటుంబం, దేశం, ప్రపంచం కూడా ఇమిడి ఉంది.

మంచి కవిత్వమంటే శబ్దార్థాల మేలికలయిక. దానికి యిలాంటి పద్యాలు మేలి మచ్చుతునకలు.

అనంతుడిని ప్రార్థించిన తర్వాత, ఉదంకుడు వాసుకిని ప్రార్థిస్తునాడు:

అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా
నురగల నెల్ల గాచిన మహోరగనాయకు డానమత్సురా
సుర మకుటాగ్రరత్నరుచి శోభిత పాదున కద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నుడయ్యెడున్

అరిది=అపురూపమైన తపశ్శక్తితో రాక్షసుల చేత (అమరుల అరులు అంటే దేవతల శత్రువులు) బాధలు పొందకుండా నాగులందరినీ రక్షించిన గొప్ప నాగనాయకుడు, ఆనమత్=నమస్కరించుచున్న దేవ రాక్షసుల కిరీటాల చివరనున్న రత్నకాంతులచే ప్రకాశించే పాదాలు గల పార్వతీపతికి అలంకారమైనవాడు అయిన వాసుకి మాకు ప్రసన్నుడు కావాలి.

అనంత వాసుకిల స్తోత్రంలో అంతర్భాగంగా హరిహరులని కూడా స్తుతించినట్టయ్యింది!

ఆ తర్వాత ఐరావతుడనే సర్పరాజుని, చివరకి తక్షకుడిని ప్రార్థిస్తాడు ఉదంకుడు. ఎలా ప్రార్థించాడు, ఆ ప్రార్థనకి మెచ్చి ఆ నాగరాజులు ఉదంకుడికి కుండలాలని తిరిగి ఇచ్చేసారా లేదా అనే విషయాలు తర్వాతి టపాలో చూద్దాం.

పూర్తిగా చదవండి...

Friday, January 21, 2011

ఉదంకుడి కథ - 1

"వింటే భారతం వినాలి, తింటే గారలే తినాలి"

మొన్న సంక్రాంతి పండక్కి ఎంచక్కా గారెలు తినడం అయింది! భారతం వినాలంటే ఏ మల్లాదివారో చెపుతూంటేనే వినాలి. వారి భారత ప్రవచనాలు సీడీలుగా వచ్చాయో లేదో తెలీదు, వెతకాలి. అసలు భారతమే "వినిపించబడింది". ఒక్క భారతమనేవి, రామాయణమూ, అష్టాదశ పురాణాలూ కూడా ఎవరో ఎవరికో వినిపించినవే కదా. పూర్వం కావ్యాలు కూడా ఇలా ఒకరు చెపితే పదిమంది వినడమే కాని చదవడం తక్కువే. ఆధునిక కాలంలో చదివే పద్ధతి బాగా వ్యాపించి వినిపించే పద్ధతి వెనకబడింది. టీవీ ఛానళ్ళ ధర్మవా అని అది మళ్ళీ ముందుకొస్తోంది. సరే, అందాకా పుస్తకంలో మల్లిన నరసింహారావుగారు చేస్తున్న మహాభారత పరిచయం చదువుకోవచ్చు. ఆ స్ఫూర్తితోనే భారతంలోని ఉపాఖ్యానాలని మరింత వివరంగా పరిచయం చెయ్యాలనే ఊహ కలిగింది. ఎంతదాకా సాగుతుందో చూడాలి మరి!

భారతంలో అసలు కథతో బాటు కొసరు కథలు మధ్యమధ్యలో చాలానే వస్తాయి. వీటినే ఆఖ్యానకాలని, ఉపాఖ్యానాలని అంటారు. అసలు, భారతం మొదలవ్వడమే ఈ కొసరు కథలతో మొదలవుతుంది. అందులో మొదటగా వచ్చే కథ ఉదంకుడి కథ. అసలు భారతం కథని వైశంపాయనుడు జనమేజయునికి సర్పయాగం సందర్భంలో చెప్తాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, అంటే అర్జునుడికి స్వయానా మునిమనవడన్న మాట. జనమేజయుడు సర్పయాగం ఎందుకు చేసేడు అన్నదానికి కారణం ఉదంకుడి కథలో దొరుకుతుంది. ఆ రకంగా భారత కథ చెప్పబడడానికి మూల బీజం ఉదంకుడి కథ! ఈ కథంతా సౌతి (సూతుని కుమారుడు) శౌనకాది మునులకు చెప్తాడు. ఈ ఉదంకుడి కథ చాలా చిత్ర విచిత్రమైనది. పక్కా జానపద సినిమాలాగా ఉంటుంది! సంస్కృత మహాభారతంలో ఇది చాలా పెద్దదిగానే ఉంటుంది కాని నన్నయ్యగారు అనవసరమైన విషయాలని ఎడిట్ చేసి స్థూలంగా సొంపుగా మనకి చెప్పారు. ఒక విశేషం ఏవిటంటే, సంస్కృతంలో ఇది చాలా వరకు గద్యంలోనే సాగుతుంది. కాని తెలుగులో ఎక్కువ పద్యాలలో సాగుతుంది. అంతే కాదు ఎన్నో సొగసైన, ప్రసిద్ధమైన పద్యాలిందులో ఉన్నాయి.

సరే, ఇక అసలు కథలోకి ప్రవేశిస్తే... అననగనగా ఉదంకుడనే (ఉతంకుడని కూడా అంటారు) ముని ఉన్నాడు. అతను పైలముని శిష్యుడు (సంస్కృత భారతంలో వేద ముని శిష్యుడని ఉంది). అతడెలాంటి వాడంటే,

పంకజభవ సన్నిభు డఘ
పంక క్షాళన మహా తపస్సలిలు డనా
తంక మతి పైలశిష్యు డు
తంకుండను మునివరుండు తద్దయు భక్తిన్

పంకజభవుడంటే బ్రహ్మ కదా. అతని సన్నిభుడు అంటే బ్రహ్మవంటి వాడు (బ్రహ్మచారి) అని అర్థం. పాపమనే (అఘము) బుఱదని (పంకము) కడిగి వేయగల (క్షాళన) మహాతప్పస్సనే నీరు కలవాడు. ఎలాంటి శంకలూ లేని మనసు కలవాడు. ఎంతో భక్తితో పైలముని దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అపరిమిత నిష్ఠాపరుడై గురువుగారికి పరిచర్యలు చేస్తూ, అణిమాది అష్టసిద్ధులతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాడు.

విద్య పూర్తయిన తర్వాత గురుదక్షిణ చెల్లించడం అప్పటి ఆనవాయితీ కనక గురువుగారి దగ్గరకి వెళ్ళి ఏ గురుదక్షిణ సమర్పించుకోవాలని అడుగుతాడు. ఆ గురువుగారు, నాకేం అక్కరలేదు కాని నా భార్యకి ఏమైనా అవసరమేమో కనుక్కోమంటాడు. ఆ గురుపత్ని ఉదంకుడిని ఒక వింతైన దక్షిణ కోరుకుంటుంది. పౌష్యుడనే రాజుంటాడు. అతని భార్య కుండలాలు ఒక నాలుగురోజుల్లో తనకి తెచ్చి యిమ్మని అడుగుతుంది. ఆ కుండాలాలకి ఏం మహిమ ఉందో మరి! సరే గురుపత్ని కోఱిక చెల్లించడానికి ఉదంకుడు బయలుదేరుతాడు. అడవి మార్గంలో వెళుతూ ఉంటే మధ్యలో మహోక్షాన్ని (పెద్ద ఎద్దు) ఎక్కి ఉన్న ఒక దివ్యపురుషుడు దర్శనమిస్తాడు. కనిపించి, ఆ వృషభ గోమయాన్ని (పేడని) భుజిస్తే, బయలుదేరిన కార్యం సఫలమవుతుందని చెపుతాడు. ఎవరా దివ్యపురుషుడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. :-) భారతం చదివే పాఠకుడికీ తెలియదు, ఉదంకుడికి కూడా తెలియదు. అయినా అతడు దివ్యపురుషుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి, అతను చెప్పినట్టు చేస్తే తన కార్యం సఫలమవుతుందని నమ్మి, ఉదంకుడు ఆ గోమయాన్ని తిని గబగబా పౌష్యుని దగ్గరకి వెళతాడు. వెళ్ళి ఆ రాజుతో వచ్చిన విషయం ఇలా చెప్తాడు:

ఏను గుర్వర్థ మర్థినై మానవేశ!
కడగి వచ్చితి నిపుడు నీ కడకు వేడ్క
దండితారాతి! నీ దేవి కుండలమ్ము
లిమ్ము నా పూన్కి యిది సఫలమ్ము గాగ

గురువుగారి కార్యమై నీ దగ్గరకి అర్థినై వచ్చాను. నీ భార్య కుండలాలు ఇచ్చి నా ప్రయత్నాన్ని సఫలం చెయ్యమని కోరుతాడు. ఇక్కడున్న "గుర్వర్థ మర్థి" అనేది కాళిదాసు ప్రయోగం. వరతంతు ముని శిష్యుడు రఘు మహారాజును గురుదక్షిణ అడిగిన సందర్భంలో అతను కూర్చిన పదం. నన్నయ్య సరిగ్గా అలాంటి సందర్భంలోనే ఆ పదాన్ని తిరిగి ప్రయోగించడం కాళీదాసుమీదున్న గౌరవాన్ని ప్రకటించడానికే అయ్యుంటుంది! ఈ పద్యంలో నాలుగు పాదాల్లోనూ ప్రాస యతినే ప్రయోగించడం గమనించండి. నన్నయ్య సాధారణంగా ఎప్పుడూ, ఒక పాదంలో ప్రాసయతి వాడితే ఆ పద్యం అన్ని పాదాల్లోనూ ప్రాసయతినే వాడతారు.

ఈ పౌష్యుడు కూడా ఆ ముని శిష్యుడే. ఆ మహానుభావునికి వినియోగపడితే అంతకన్నా భాగ్యమేముంది తప్పకుండా తీసుకొమ్మంటాడు. మామూలుగా అయితే సేవకుడిని పంపించో, లేదా స్వయంగా వెళ్ళో భార్య దగ్గరనుండి ఆ కుండలాలని తీసుకువచ్చి ఉదంకుడికి ఇవ్వాలి. కాని ఈ రాజొక తిరకాసు పెడతాడు. ఉదంకుణ్ణే తన భార్య వద్దకు వెళ్ళి స్వయంగా అడిగి తీసుకోమంటాడు! ఉదంకుడు సరేనని అంతఃపురంలోకి వెళతాడు. వెళ్ళి చూస్తే అక్కడ మహారాణి కనిపించదు! అంతటా వెతికినా ఎక్కడా ఉదంకుడికి కనిపించదు. ఇంకేం చేస్తాడు. తిరిగి పౌష్యుడి దగ్గరకి వచ్చి జరిగింది చెప్పి, నువ్వే ఆ కుండలాలని తెప్పించి ఇప్పించని కోరుకుంటాడు.

పౌష్యుడి భార్య ఉదంకుడికి ఎందుకు కనిపించ లేదు? ఆ రాణి అంతఃపురంలోనే ఉందా లేదా? ఆ కుండలాలని రాజు ఇప్పిస్తాడా లేదా ఉదంకుడే తీసుకుంటాడా? ఇదంతా వచ్చే టపాలో చూద్దాం! కాస్త సస్పెన్సు ఉండకపోతే ఎలా.:-)

పూర్తిగా చదవండి...

Friday, January 14, 2011

సంక్రాంతి తలపోతలు

అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిసారిగా పోస్టుని షెడ్యూల్ చేసాను! అంచేత నిజంగా ఈ భోగీ నాడు ఇది పోస్టవుతుందో లేదో మరి తెలీదు. ఎందుకు షెడ్యూల్ చెయ్యాల్సి వచ్చిందంటే, నేనీ సంక్రాంతికి మా తాతగారి ఊరు వెళుతున్నానోచ్! అంటే పల్లెటూరన్న మాట. అక్కడ కంప్యూటరు ఇంటర్నెట్టు వగైరా ఉండవుగా మరి. సంక్రాంతి పండక్కి ఆ ఊరు వెళ్ళి ఎన్నో ఏళ్ళయిపోయింది. సంక్రాంతి పండుగంటే అది పల్లెటూళ్ళో జరుపుకోవలసిందే.

మా చిన్న్నప్పుడు చక్కగా సంక్రాంతి సెలవలకి కనీసం ఓ వారం రోజులకైనా వెళ్ళేవాళ్ళం మా తాతగారి ఊరికి. మా చిన్నాన్నల కుటుంబాలు, అత్తయ్య కుటుంబం అందరమూ కలిసేవాళ్ళం. ఇంక సందడే సందడి. పెద్ద మండువా ఇల్లు. ఎంతమంది వచ్చినా ఇరుకనిపించేది కాదు. ఇంటిముందు ఖాళీ జాగాలో ఒక పెద్ద చెట్టు, రకరకాల మొక్కలు. పెద్ద పెద్ద ఎత్తైన విశాలమైన అరుగులు. వాటికానుకొని వీథి చావిడి. ఆ చావిడిలో ఒక పక్క రెండు పెద్ద కఱ్ఱ బల్లలు. మరొక పక్క పెద్ద పడక్కుర్చీ. అందులో మా తాతగారు కూర్చునేవారు. తెల్లని పంచె, నుదుటన విభూది, మధ్యలో నామం. మా ఇద్దరు తాతగార్లు ఒకరేమో సంప్రదాయానికీ మరొకరూ ఆధునికతకూ నిలువెత్తు నిదర్శనంలా ఉండేవారు. వారి గురించి మరోమారు వివరంగా. ఈ తాతగారు ఆయుర్వేద వైద్యులు. చావిడిలోనే ఒక పక్కగా రెండు పెద్ద పెద్ద కల్వాలుండేవి, మందులు నూరడానికి. ఆ చావిడే మా తాతగారి ఆసుపత్రి. చావిడి చెరో వైపు రెండు చిన్న చిన్న గదులు, ధాన్యం వగైరా సరుకులుండేవి. చావిడి దాటి లోపలకి వెళితే ఒక పెద్ద గది. రెండువైపులా రెండు పెద్ద అల్మారాలు. అందులో ఆయుర్వేదానికి సంబంధించిన బోలెడన్ని పుస్తకాలు. తాళపత్ర గ్రంథాలు కూడా ఉండేవి! ఆ గది దాటి వెళితే వసారా. ఈ పెద్ద గదికి అటు ఇటూ రెండు పడక గదులు. ఈ మూడు గదులను కలుపుతూ ఆ వసారా. అది దాటగానే ఇంటి మధ్య మండువా. దానికొక వైపుగా డాబా మీదకి మెట్లు. మండువా దాటగానే మరొక వసారా. ఆ వసారాలో ఇనప గొలుసులతో పెద్ద చెక్క ఉయ్యాల. కనీసం ఒక నలుగురు పెద్దవాళ్ళు కూర్చుని ఊగవచ్చు! ఆ వసారా దాటగానే మధ్యలో మరొక హాలు. ఎడంవైపు మరొక పడగ్గది. కుడివైపు దేవుడి గది. ఆ హాలు దాటాక ఒక వరండా. దానికి కుడివైపున వంట గది. ఎడం వైపున చిన్న కొట్టు గది. ఆ వరండా కిందకి దిగడానికి మెట్లు. ఆ మెట్లు దిగితే పెద్ద పెరడు. ఎదురుగ్గా మధ్యలో తులసి కోట. పెరడంతా చెట్లు, మొక్కల మయం! కుడిపక్కగా పెద్ద గట్టు, గట్టు మీద బావి. దానికానుకొని నీళ్ళు నింపడానికి కుండీ. బావి గట్టుకానుకొని కిందన నీళ్ళ పొయ్యి. పెరట్లోనే ఒక పక్కకి వెనకగా ఆడవాళ్ళకి స్నానాల గది. ఇల్లంతా భూమికి ఒక అయిదడుగుల ఎత్తులో ఉండేది! ఇంటి చుట్టూ పెరడే!

పండగకి కనీసం మూడు రోజులముందైనా వెళ్ళేవాళ్ళం! తెల్లవారుఝాము నాలుగ్గంటలకి దేవుని భజనలతో ఊరేగింపు వచ్చేది. అది వస్తే ఇక లేవాల్సిందే! అప్పటికే కళ్ళాపి జల్లేసేవారు. వాళ్ళు వచ్చి వేళ్ళాక ముగ్గులు మొదలుపెట్టేవారు. పెద్ద పెద్ద ముగ్గులు! రకరకాల ముగ్గులు! సరే ఇక భోగీనాడు చెప్పేదేవుంది, నాలుగ్గంటలకే భోగిమంట వెయ్యడం ప్రారంభం. అబ్బో ఆ మంట ఒక రెండు మనుషుల ఎత్తుకి వెళ్ళేది! దాని దగ్గర కూర్చుంటే ఇక చలి గిలి జాంతానై. మెల్లిగా అయిదు అయిదున్నర దాకా అక్కడ గడిపి, ఆ తర్వాత స్నానాలు. పండగ స్నానాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుబ్బరంగా ఒంటికంతా నూనె పట్టించి, ఆ తర్వాత నలుగు పిండి రాసి, కాస్త ఆరాక దాన్ని బలంగా నలచడం. ఇలా రెండు మార్లు నలిచేవారు. ఇదంతా చెయ్యడానికి ఒకతను వచ్చేవాడు. బలిష్టంగా ఉండి అతను నలుగు పెడుతూంటే అబ్బో! ఒళ్ళంతా రక్తం జఱ్ఱు జఱ్ఱున పాకేది! అలా నలుగు పెట్టించుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళతో మా అమ్మో అత్తయ్యో ఒకరు కుంకుడు పులుసు పోస్తూంటే మరొకరు తల రుద్దేవారు. ఆ తలంటు కార్యక్రమం అయ్యేసరికి ఒళ్ళు గాల్లో తేలిపోయేది. అప్పుడెంచక్కా కొత్తబట్టలు వేసుకొని, పెద్దవాళ్ళందరికీ దణ్ణాలు పెట్టి, ఆశీర్వాదాలందుకొని, పండగ కట్నం దండుకొని, వేడివేడి ఇడ్లీలు లాగించి, ఆపైన ఆటలే ఆటలు! నేలాబండో, డీఫాటో, ఇంటి ముందు జాగాలో క్రికెట్టో. పెద్దవాళ్ళందరూ కూర్చొని చతుర్ముఖపారాయణం మొదలుపెట్టేవారు. కొంత సేపు వాళ్ళ దగ్గర కూర్చుని ఎవరెలా ముక్కలు సర్దుతున్నారు, ఎలా కలుపుతున్నారు, ఎలా ఆడుతున్నారు పరిశీలించడం. మా తాతగారు ఆడేవారు కాదు కాని మా నాయనమ్మ ఆడేది. ఆవిడ పేకలు పట్టుకొనే తీరు చాలా విచిత్రంగా ఉండేది. పక్కవాళ్ళు చూసినా ఏమీ అర్థమయ్యేది కాదు! మధ్యాహ్నమయ్యేసరికి ఘుమ ఘుమలాడే విందుభోజనం తయార్. భోజనాలయ్యాక నాలుగవుతోందనగా ఎవరింట్లో అయినా భోగిపళ్ళ వేడుక ఉంటే వెళ్ళడం. లేదా అలా రామాలయానికో, తోటలోకీ షికారు. రాత్రి ఫలహారాలు వేగిరం ముగించుకొని, మళ్ళీ పెద్దవాళ్ళు చతుర్ముఖపారాయణం మొదలుపెట్టేవారు. లేదంటే ఏవో పిచ్చాపాటీ కబుర్లు. రాత్రి ఎనిమిదిన్నర అయ్యేసరికల్లా పడకలే. వేసంకాలంలో అయితే డాబా మీద పడుకొనేవాళ్ళం కాని సంక్రాంతికి చలికదా అంచేత వసారాల్లో వరసగా బొంతలు పరిచేసేవారు. పెద్దలూ పిల్లలూ అందరూ అక్కడే. ఇలా పండగ నాలుగురోజులూ అసలు సమయం తెలియకుండా గడిచిపోయేది! ముక్కనువునాడు అనుకుంటా ఊరి బయట పెద్ద తిరనాళ్ళు జరిగేవి. అదో సంబరం.

ఆ యిల్లింకా అలాగే ఉంది. వెళ్ళడానికి మాకే తీరిక లేకుండా పోయింది! ఎప్పుడో అడపాదడపా ఒక్కరోజుకి వెళ్ళి వచ్చెయ్యడమే.

నా నాస్టాల్జియాలో పడి పద్యాల సంగతి మరిచే పోయాను! ఎప్పుడో నలభైలలో భారతి పత్రికలో వచ్చిన శ్రీ పాలెపు వెంకట రత్నంగారి ఈ సంక్రాంతి పద్యాలు మీ కోసం. ఈ కవిగారు కూడా నాస్టాల్జియాలో పడ్డారేమో అనిపిస్తుంది పద్యాలని చదివితే. కాని అప్పుటి పరిస్థితులు ఇప్పటికన్నా మెరుగ్గానే ఉండేవేమో! అసలు పరిస్థితులెలా ఉన్నా, పండగనాడైనా కొంచెం మంచి మాటలు చెప్పుకోవడం శుభప్రదం కాబట్టి వారు వర్ణించిన ఆనాటి పల్లెటూరి సంకురాతిరి శోభను మీరు కూడా ఊహించుకొని ఆనందించండి.

పౌషశ్రీ

ఒక ప్రాభాతికవేళ శీత ఘన బాధోద్వృత్తి నే సాలువా
సకలాంగంబులకున్ ముసుంగిడి సుఖాశన్ సుప్తినుండంగ "గొ
క్కొకురోకో" యని తామ్రచూడవర మాఘోషింప కన్విచ్చి, లే
చి కనుంగొంటి మనోజ్ఞ పౌష ప్రకృతిశ్రీ చిద్విలాసాకృతిన్

పచ్చనై కనుపట్టు భవ్యశాద్వలతలిన్ జాలుగా మంచుముత్యాలు చేరె
అరవిచ్చు చేమంతి విరిసోయగము మెచ్చి భ్రమరాళి వలగొని పాటపాడె
ముంగిళ్ళ జెలువాఱు రంగవల్లికలలో బంతి గొబ్బెమ్మలు పాదుకొనిరి
ప్రక్కవీథిని పాటపాడు సాతానిజియ్యరు కాలి చిఱుగజ్జియలు నదించె

గొబ్బితట్టెడు బాలికాకోమలాస్య
జనిత మృదుహాసలహరులు సంచరించె
బొలము చాయల వినిపించె బొలియగాని
గూర్చి పాడుచు గుప్పల నూర్చు సద్దు

ధవళాద్రి నిర్మలత్వము ధిక్కరించు నీ వెల్లపూసిన యిండ్ల తెల్లదనము
లక్ష్మీనివాస విలాసంబులం దెల్పు పసుపుగుంకుమల నొప్పెసగు గడప
లలరుదండల కాంతులొలుకబోసినవి సుందరశిల్పముల నొప్పు ద్వారసమితి
కమనీయ హేమ నిష్క సమాన కాంతుల ధాన్యరాసులతోడ దనరె బంచ

లెంత సౌభాగ్యసౌందర్యవంతురాల
వమ్మ! ఆగర్భధనవంతురాల పౌషి!
నీ విమల దివ్యతర కమనీయ సుషమ
కవి హృదయసీమ శతరత్న కాంతి నించె

చిన్నబావ ప్రయాణసన్నాహ మొనరింప మఱదలు చేసంచి మాటుపఱిచె
చీరపై జలతారు చారలు లేవని పుత్రిక నాన్నపై మోము ముడిచె
విందువంటకు సగ్గుబియ్యమేవీ యని వెలది నాథునితోడ విరసమాడె
చాటుగా మగనితో మాటలాడిన యాడబడుచు వధూనిక పరిహసించె

కృషి ఫలింపగ మంచి జోడెడ్లు కాడి
మేడి హలమును రైతు ప్రేమించి కొలిచె
సకల సౌభాగ్యకల్యాణ సదనమైన
స్వర్ణ సంక్రాంతి కాంతులు జగతి వరలు


పూర్తిగా చదవండి...