తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, February 16, 2011

ఉదంకుడి కథ అయిపోయిందోచ్!

నిజానికి కిందటి టపాతోనే ఉదంకుడి కథ అయిపోయింది. మిగిలిందల్లా ఆ ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు ఎవరు, నాగలోకంలో ఉదంకుడికి కనిపించిన వింత దృశ్యమేమిటి అన్న సంగతులు తెలియడమే. ఆ తర్వాత ఉదంకుడి కథకీ సర్పయాగానికీ ఉన్న సంబంధం.
అసలు సంస్కృత భారతంలో వ్యాసుడు యీ సస్పెన్సుని చివరికంటా కథనంలో నిర్వహించ లేదు. ఆ పని చేసింది మన నన్నయ్యగారు. ఇంతకీ గురువుగారు ఉదంకుడికి చెప్పిన వివరం ఇది:

ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు సాక్షాత్తు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. ఉదంకుడు సేవించిన గోమయం అమృతం. నాగలోకంలో కనిపించిన ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వారు తెల్లని నల్లని దారాలతో నేస్తున్న మగ్గం అహో రాత్రాలు (పగలు, రాత్రి). పన్నెండు రేకుల చక్రం పన్నెండు నెలలతో కూడిన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. ఆ గుఱ్ఱం అగ్ని. గుఱ్ఱం ఎక్కి వచ్చిన దివ్యపురుషుడు ఇంద్ర సఖుడైన పర్జన్యుడు.
ఇంద్రుడు తన స్నేహితుడు కాబట్టి తన పని మీద వెళ్ళిన ఉదంకుడికి సహాయం చేసాడని, అమృత భక్షణం వల్లనే అతనికి నాగలోకంలో ఎలాంటి హాని జరగకుండా అతని పని సఫలమయిందని కూడా గురువుగారు ఉదంకుడికి వివరిస్తారు.

అంతా బాగానే ఉంది కాని మరి ధాత, విధాత, ఋతువులు మొదలైనవి ఎందుకు కనిపించాయి? ఈ ప్రశ్నకి అటు వ్యాసుడు కాని ఇటు నన్నయ్యగారు కాని సమాధానమివ్వడానికి ప్రయత్నించ లేదు. ఇలాంటి వాటివల్లనే మన పురాణేతిహాసాల్లో ఒక మార్మికత ఉందని అనిపిస్తుంది. అయితే కొందరికది ఏ కోశానా రుచించదు. కథని కథగానే చదువుకోవాలి కాని అందులో అంతరార్థాలని వెతకడం ఎందుకని అంటారు. అక్కరలేదనుకొనే వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి అంతరార్థం కోసం అన్వేషిస్తారు. దాన్నీ దీన్నీ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక రచనని లౌకికము, నైతికము, ఆధ్యాత్మికము అనే మూడు అంతరువుల్లో చూడడం మన భారతీయ సాహిత్యంలో ఒక సంప్రదాయం. అంటే కథ కథగా చదవడం ఒకటి, అది చెప్పే నీతిని అవగాహన చేసుకోవడం రెండు, అందులోని ఆధ్యాత్మికమైన అంతరార్థాన్ని గ్రహించడం మూడు. కవులు కూడా అదే దృష్టితో కావ్యాలని సృష్టించారని నమ్మకం. ముఖ్యంగా పైన చెప్పిన సన్నివేశాలవంటివి (ఉదంకుడు కాల సంబంధమైన ప్రతిరూపాలని చూడడం) కథలో వచ్చినప్పుడు, ఎందుకవి కథలో ఉన్నాయని ఆలోచించడం సహజం కదా. ఎవరికి తోచిన అర్థాలు వారు చెప్పుకుంటారు. ఎవరైనా వివరిస్తే దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ కథలోని అంతరార్థం గురించి "శ్రీ మహాభారత వైజ్ఞానిక సమీక్ష" అన్న పుస్తకంలో శ్రీ తిరుమల వేంకట శ్రీనివాసాచార్యులుగారు ఇచ్చిన వివరణ క్లుప్తంగా ఇది:

ఉదంకుడు అంటే ఊర్ధ్వలక్షణము కలవాడు అనే అర్థం చెప్పుకోవచ్చు. ఉదంకుడు గురుపత్ని కోసం కుండలాలని సంపాదించే కార్యం నిజానికి దివ్యజ్ఞానం సంపాదించడం. ద్వాదశాదిత్యులలో ఒకరు "పుషా". ఇది భూమిని పోషించే సూర్య తేజం. పౌష్యుడు దానికి ప్రతీక. సత్యాన్ని ధర్మాన్ని దర్శించడానికి పూషా స్వరూపుడైన సూర్యుడిని ఉపాసించాలి. పుషాదిత్యుని జ్ఞానశక్తి పౌష్యాదేవి. సూర్యుని ప్రకాశము అతని శబ్దమే. రవము కలవాడు కాబట్టి రవి. ఆ శబ్దము వల్లనే జ్ఞానబోధ కలుగుతుంది. చెవి గ్రహించే శబ్దాన్ని ప్రకాశింప జేసేవి మనసు, బుద్ధి. అవే పౌష్యాదేవి కుండలాలు. అతీంద్రియ జ్ఞానార్జనకు ఈ రెండిటినీ సంపాదించే ప్రయత్నమే ఉదంకుడు చేసినది. ఆత్మలో అమృతత్వమున్నా అది ముందు గ్రహించ లేకపోయాడు ఉదంకుడు. అంతరింద్రియ జ్ఞానము బాహ్య దృష్టికి గోచరించదు కాబట్టి అంతఃపురంలో పౌష్యాదేవి ఉదంకునికి ముందు కనిపించలేదు. ఎప్పుడయితే ఆత్మశుద్ధి చేసుకున్నాడో అప్పుడతనికి కనబడింది.

తక్షకుడంటే వడ్రంగి. రూపంలేని శుద్ధ బ్రహ్మమనే చెట్టుని చెక్కి దేహాకృతిని నిర్మించే త్వష్టా ప్రాణానికి ప్రతిరూపం తక్షకుడు. శక్తిమయములైన (అతీంద్రియమైన) మనో బుద్ధులు, నామ రూపాత్మకమైన భౌతిక శరీరంలో త్వష్టాప్రాణము చేత బంధింపబడడమే తక్షకుడు కుండలాలని అపహరించడం. మన లోలోపల దాగిన అతీంద్రియ శక్తి రహస్యాలను తెలుసుకొనే విధానమును ఋషులు కనిపెట్టారు. దానికి "బిల్మవిద్య" అని పేరు. ఇదే కుండలినీ విద్య. బిలంలాంటి మూలాధారచక్రంలో పాములా చుట్టలు చుట్టుకొని నిద్రాణమై ఉంటుంది అథఃకుండలినీ శక్తి. దానిని మేల్కొలిపితే, అది స్వాధిష్ఠాన (నిప్పు), మణిపూర(నీరు), హృదయ (వాయు), ఉపరి (ఆకాశ) అనే పాంచభౌతికమైన చక్రాలు దాటుకొని, మనోమయమైన ఆజ్ఞాచక్రాన్ని ప్రవేశించగానే భ్రూ మధ్యమున ఉన్న జ్ఞాన నేత్రం విచ్చుకుంటుంది. ఉదంకుడు భూ బిలం ద్వారా పాతాళము సొచ్చి చేసిన నాగస్తుతి కుండలినీ శక్తి ప్రబోధమే. దానివల్ల అతడికి కాలజ్ఞానం కలిగింది. దానికి సూచనే కాల ప్రతిరూపాలు కనిపించడం. అశ్వరూపంలో దర్శనమిచ్చిన అగ్ని కుండలినీ శక్తి. మూలాధార చక్రం అపాన స్థానంలో ఉంటుంది. సంస్కృత భారతంలో గుఱ్ఱం వెనక భాగంలోని అపానంలోనే ఊదుతాడు ఉదంకుడు. అంటే కుండలినీశక్తిని మేల్కొల్పడమే. దాన్ని నన్నయ్యగారు ఎందుకో చెవిలో ఊదినట్టుగా మార్చారు.

అంటే ఉదంకుడి కథలోని అంతరార్థం కుండలినీయోగ సాధనన్నమాట!

ఇంతకీ ఈ కథకీ, జనమేజయుడు చేసిన సర్పయాగానికి ఏవిటి లంకె అన్న విషయం ఉండిపోయింది కదా. గురుపత్ని కార్యాన్ని నిర్వహించి, గురుదక్షిణ చెల్లించి, గురువు ఆశీసులతో విద్య ముగించుకొని జనమేజయుని దగ్గరకు వెళతాడు ఉదంకుడు. కుండలాలని అపహరించిన తక్షకుడి మీద అతని కోపం ఇంకా చల్లారదు. అందుకు ప్రతీకారంగా జనమేజయునితో సర్పయజ్ఞం చేయించాలని అతని ఆలోచన. జనమేజయుడే ఇతని ప్రతీకారం ఎందుకు చెల్లిస్తాడంటే, జనమేజయుని తండ్రి పరీక్షిత్తుని చంపినది తక్షకుడే కనక! అది వేరే కథ. జనమేజయుని దగ్గరికి వెళ్ళి, గురుకార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించిన సమయంలో తక్షకుడు నిష్కారణంగా తనని మోసగించి మహాపకారం చేసాడని చెప్తాడు. ఆ తక్షకుడు పరీక్షిత్తుని చంపిన విషయాన్ని కూడా గుర్తుచేస్తాడు. గుర్తుచేసి ఇలా అంటాడు:

కాదన కిట్టిపాటి యపకారము దక్షకు డేక విప్ర సం
బోధన జేసి చేసె నృపపుంగవ, నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదర సంహతిం హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్

"సంబోధన" అంటే వాడుకలో ఉన్న అర్థం పిలుపు. కాని ఈ పదానికి రెచ్చగొట్టడం, ప్రబోధించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడా అర్థం తీసుకోవాలి. ఒక బ్రాహ్మణుడి ప్రేరణ చేత కాదనకుండా తక్షకుడు నీ తండ్రికి ఇంతటి మహాపకారాన్ని చేసాడు. కాబట్టి నువ్వు అనేక బ్రాహ్మణులు కూడి చేయించే సర్పయాగంలో చెలరేగే మహోగ్ర అగ్ని శిఖలలో ఆ తక్షకాడితోబాటు సర్పజాతి నంతటినీ భస్మం చెయ్యి. అని ఉదంకుడు జనమేజయుడిని సర్పయాగానికి ప్రోత్సహిస్తాడు.

"ధ"కి "ద"కి ప్రాస వెయ్యవచ్చుననడానికి ఈ పద్యం ఒక ప్రమాణం. మిగిలిన అక్షరాలకి ఈ సడలింపు లేదు! "కాకోదరము" అంటే పాము. దీనికి కాక+ఉదరము (కాకి కడుపు) అనే అర్థం కొందరు చెప్పారు కాని ఇది కర్కోటకము(ఇది కూడా పాముకి పర్యాయపదమే) అన్న పదానికి ప్రాకృత రూపం అవ్వవచ్చని మరి కొందరు భావిస్తున్నారు. బహుశా అదే సరైనదేమో అని నాకనిపిస్తుంది. "హుతవహుడు" అంటే యజ్ఞ హవిస్సుని (హుతము) తీసుకొనే వాడు, అగ్ని.

ఒక్క తక్షకుడు చేసిన తప్పుకి సర్పజాతి అంతా ఎందుకయ్యా బలికావడం అని అడుగుతాడేమో ఆ రాజని, ముందుగానే దానికి సమర్థింపుగా ఇలా అంటాడు ఉదంకుడు:

ప్రల్లదుడైన యొక్క కులపాంసను చేసిన దాన దత్కులం
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? కావునన్ మహీ
వల్లభ తక్షకాధము నెపంబున సర్పములెల్ల నగ్నిలో
ద్రెళ్ళగ సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసన్నిధిన్

కులనాశకుడైన ఒక్క దుర్మార్గుడివల్ల ఆ కులమంతా దూషింపబడటం కొత్త విషయమేమీ కాదు కదా. ఒక్క తక్షకుడి వల్ల సర్పజాతికంతటికీ ఆ దోషం చుట్టుకుంది. కాబట్టి ఆ పాములన్నీ అగ్నిలో మాడిపోయేట్టుగా నువ్వు సర్పయాగాన్ని తప్పకుండా చెయ్యి. అని సర్పయాగాన్ని సమర్థిస్తాడు ఉదంకుడు. ఇక్కడ మళ్ళీ నన్నయ్య కవిత్వశక్తి మనకి కనిపిస్తుంది. ఈ పద్యం సంస్కృత భారతంలో లేదు. రాబోయే భారత కథలో, దుష్టుడయిన ఒక్క దుర్యోధనుడి వల్ల ఎలా కురువంశమంతా నాశనమవుతుందో మనకీ పద్యంలో ధ్వనించడం లేదూ! నన్నయ్య అలా ధ్వనించాలనే వ్రాసాడా అంటే చెప్పలేం, అనవసరం కూడా. మనకి ఆ స్ఫూర్తి కలుగుతోందా లేదా అన్నది ముఖ్యం. "లేదండీ నేను మాటల అర్థాలు అల్లాగే తీసుకుంటాను. అవి ధ్వనించే విషయాన్ని గురించి నాకు పీకులాట లేదు", అంటే చెప్పగలిగేదేమీ లేదు. యద్భావం తద్భవతి!

మొత్తానికి జనమేజయుని సర్పయాగం వెనక ఇంత కథ ఉంది! ఇంతకీ జనమేజయుడు సర్పయాగం చేసాడా, సర్పాలు యాగాగ్నిలో పడి మసి కాకుండా ఎవరైనా కాపాడారా? ఇదంతా మరొక కథ. మళ్ళీ నాకు కోరిక తీరిక కలిగినప్పుడు చెప్పుకుందాం!

5 comments:

  1. చాల బాగా, పొందికగా సులభతరంగా వివరించారు.

    తిరుమల వేంకట శ్రీనివాసాచార్యులుగారి వలెనే శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు కూడా ఈ విధంగా ఇంకా ఎన్నో విషయాలను రహస్య ప్రకాశం చేశారు.

    ReplyDelete
  2. ఉదంకోపాఖ్యానం నిజానికి బ్రహ్మజ్ఞాన సాధన, లేక కుండలినీ సాధన అనే వివరణ అద్భుతంగా ఉన్నది. అందుకే అన్నారు కాబోలు నానృషిః కురుతే కావ్యమని.
    భారతంలో ఈ సంఘటన ఉన్నదోలేదో, ఖాండవ దహన ఘట్టంలో ఒక కథ వ్యాప్తిలో ఉన్నది - అగ్నిదేవుడు కృష్ణార్జునులతో ఇంద్రుని స్నేహితుడైన తక్షకుడు ఈ అడవిలో నివసిస్తుండడం వల్ల ఇంద్రుడు ఆ అడవికి ఏ ఆపదా రాకుండ కాపాడుతున్నాడు. దాన్ని దహించడానికి మీ సాయం కావాలి అంటాడు. అప్పుడే అగ్నిద్వారా గాండీవం, అక్షయ తూణీరాలు అర్జునుడికి లభిస్తాయి.
    మీకు తీరిక కుదిరినప్పుడు దీనిమీద కోరిక చేసుకుని ఈ విషయాన్ని కూడా రాయగలరు.

    ReplyDelete
  3. చాలా చక్కగా ఉదంకోపాఖ్యానాన్ని వివరించారు !
    అంతరార్థం ఇంకా అద్భుతం !
    మీకు త్వరలోనే కోరికా తీరికా కలగాలని కోరుకుంటున్నాం !

    ReplyDelete
  4. వసంత్ కిసోర్ గారు,

    మీ వంటి పెద్దల మెచ్చుకోలు నాకు దీవెన. ధన్యవాదాలు

    ReplyDelete