తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, October 24, 2012

అమ్మల పండగ


విజయదశమి శుభాకాంక్షలు!

దసరా అంటే అమ్మల పండగే. అది నవ దుర్గలు కావచ్చు, ముగురమ్మలు కావచ్చు, ముగురమ్మల మూలపుటమ్మ కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, శ్రీశైల భ్రమరాంబ కావచ్చు, తెలంగాణ బతుకమ్మ కావచ్చు, మా ఊరి పైడితల్లమ్మ కావచ్చు, ఇంటింట వెలసిన ఇలవేల్పులు కావచ్చు. ఎవరైనా అమ్మలే. వీరందరితో పాటు, మనకు ప్రత్యక్షంగా కనిపించే మనకు జన్మనిచ్చిన అమ్మ కూడా వారి అంశే. ఆ అమ్మను, తల్లిదనాన్ని పూజించే పండగ దసరా. ఆ మాతృమూర్తే శక్తి. సర్వ సృష్టికీ కారణభూతమైన శక్తి. చదువుల తల్లి, కలుముల తల్లి, శుభముల తల్లి. ఆ శక్తిని ఎందరు మహర్షులు ఎన్ని రూపాలుగా దర్శించారో! ఎందరు కవులు ఎన్ని రకాలుగా స్తుతించారో! ఆ శక్తే వేదమాత కూడా. వేద కాలానికి ముందునుండే భారతదేశంలో శక్తి ఉపాసన ఉందని చరిత్రకారులు చెపుతున్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటిసారిగా యీ శక్తి స్తుతి దేవీసూక్తంలో కనిపిస్తుంది. వాక్ అనే ఋషిపుత్రి (అంభృణి అనే ఋషి కుమార్తె) దర్శించిన సూక్తమిది. ఆ సూక్తాన్ని సస్వరంగా యిక్కడ వినండి:


ఆ తర్వాత కేనోపనిషత్తులో ప్రసిద్ధమైన ఇంద్రాగ్నివాయు గర్వభంగ సన్నివేశంలో ఆ పరాశక్తి యక్షిణి రూపంలో దర్శనమిస్తుంది. అటుపైన పురాణ వాఙ్మయంలో అనంతముఖాలతో విస్తరించి శంకరుల సౌందర్యలహరిలో పరమోత్కృష్టంగా విరాజిల్లింది.

మరొక విశేషమేమిటంటే, ఆంధ్ర కావ్యవాఙ్మయంలో లభ్యమవుతున్న తొట్టితొలి కావ్యమైన నన్నయ భారతంలో ప్రథమంగా ప్రస్తావించబడింది ముగురమ్మలే! శ్రీ వాణీ గిరిజ. ఈ ముగ్గురిని వక్ష, ముఖ, అంగములతో నిత్యమూ ధరిస్తారు వేదత్రయమూర్తులైన త్రిమూర్తులు. అంటే మనోవాక్కాయము లన్నమాట! త్రికరణశుద్ధిగా స్త్రీశక్తిని ఆరాధించమని మన ఆదిపురుషులు ముగ్గురూ చేసి చూపించారు :-)  అప్పుడే యీ లోకం నడుస్తుంది. అలాంటి సందేశంతో ఆంధ్రకావ్య సరస్వతి అవతరించింది. కవులందరూ సారస్వతేయులు. అంటే సరస్వతీపుత్రులు. అందుకే చాలామంది కవులు తమ కావ్య అవతారికలలో ఆ చదువుల తల్లిని ప్రార్థించారు.

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంజేయుము నాదు వాక్కులను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

అని పోతన భక్తితో ఆ తల్లిని తలచాడు. విచ్చుకున్న తామరలవంటి కన్నులు, పున్నమ చందమామవంటి మోము కలిగిన ఆ సరస్వతి జగన్మోహిని.

సింహాసనము చారు సితపుండరీకంబు
చెలికత్తె జిలుబారు పలుకుచిలక
శృంగారకుసుమంబు చిన్ని చుక్కలరాజు
పసిడికిన్నెరవీణె పలుకుదోడు
నలువ నెమ్మోముదమ్ములు కేళిగృహములు
తలుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
చక్కని రాయంచ యెక్కిరింత

యెపుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్రచందనమందార సారవర్ణ
శారదాదేవి మామకస్వాంత వీథి
నిండు వేడుక విహరించుచుండు గాత!  

అని తెలుగుపలుకుల సొబగుమీర వర్ణించాడు శ్రీనాథుడు. ఆమె సింహాసనం తెల్లని తామరపూవు. పలుకుచిలక ఆమె చెలికత్తె, అందంగా అలంకరించుకున్న సిగపూవు నెలరాజు. పసిడి కిన్నరె వీణ తన పలుకులకు సైదోడు. బ్రహ్మదేవుని నెమ్మోము దమ్ములు (అందమైన మోము తామరలు) ఆమె ఆట నెలవులు. సత్కవుల మనసులే ఆమెను పరిపూర్ణంగా ప్రతిఫలించే తళుకుటద్దాలు. వేద విద్యలలో ఆమె విహరిస్తూ ఉంటుంది. చక్కని రాయంచ ఎక్కిరింత. వాహనానికి చక్కని అచ్చ తెలుగు పదం ఎక్కిరింత. ఆ తల్లిని చూస్తే జాబిల్లి, మల్లెపూలు, పచ్చకర్పూరం, మంచిగంధం, కల్పవృక్షం గుర్తుకువస్తాయి. అంతటి తెల్లని కాంతి ఆమెది. అంతటి చల్లని స్వాంతం ఆ తల్లిది.

ఆ పలుకుల తల్లిని మంజువాణిగా మా తల్లిగారు ఇలా స్తుతించారు (మంజువాణీ శతకంలో):

కప్పురంబువోలె కమ్మదావిని జిల్కి
మల్లెపోలవోలె మనసుదోచి
కఠినమైన మనసు కరగించు కవితతో
మమ్ము బ్రోవుమమ్మ మంజువాణి!

ఈ విజయదశమినాడు మా అమ్మనూ, ఆమె అర్చించిన పలుకులమ్మనూ, అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాతనూ మనసా స్మరించడం కన్నా భాగ్యమేముంది!
మా ఇలవేలుపు కామేశ్వరీదేవి రూపంలో ఉన్న ఆ తల్లిని, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి మాటల్లో యిలా అభ్యర్థిస్తున్నాను:

జననాభావమనుగ్రహింపు మది నీ శక్యంబు కాదేని పై
జననంబందును నా కొసంగు మెటులో సంగీతసాహిత్యముల్
పనిలే దీ యుదరంపు బోషణకునై భాషాంతరమ్ముల్; జగ
జ్జననీ దీనికి నింత వ్యర్థపు బ్రయాసంబేల కామేశ్వరీ!

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. బైరవభట్ల గారు, విజయదశమి శుభాకాంక్షలు. మీ ఈ పద్య పఠనం ద్వారా చదువులమ్మని , ఆ జగన్మాతని స్మరిస్తూ నా ఈ విజయ దశమి ముగిసింది.

    ReplyDelete
  3. mee site.. naaku chaala nacchindi.. dhanyavaadalu.
    A.Krishna Rao
    www. indiagatekrishnarao.com

    ReplyDelete