తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, November 19, 2012

దివ్వెలనెల


దివ్వెలనెల మొదలయ్యింది. నేలమీద నువ్వుల దివ్వె, నింగిపైన వెన్నెల దివ్వె. ఆకాశంలో వెలిగే ఆ రత్నదీపం శంకరునికి ఆభరణం. ప్రమిదలో దీపం అచ్చంగా జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే యిది పరమశివునికి యిష్టమైన నెల. అందులోనూ కార్తీక సోమవారం మరింత ప్రీతికరం. అంచేత యీ రోజు శివుని గురించిన పద్యం చదువుకుంటే పుణ్యంపురుషార్థమూను!

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!

శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!

ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".

ఈ పద్యంలో ఎంతటి భక్తి ఉందో అంతటి కవిత్వముంది. ఈ శతకమంతా అంతే! సంపదని మెరుపుతో పోల్చడంలో ఎంతో ఔచిత్యం ఉంది. సంపద కూడా మెరుపులాగే మనసుని ఆకట్టుకుంటుంది. కళ్ళను జిగేల్మనిపిస్తుంది. మెరుపు లాగానే అది కూడా అతి చంచలం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేం. అతి తక్కువ కాలం నిలుస్తుంది. సంపద అనే మెరుపు లేకపోతే సంసారమనే మేఘానికి అందమే లేదు. ఒక చిన్న పోలికలో లోతైన భావస్ఫూర్తి నిబంధించడం గొప్ప కవిత్వ లక్షణం! ఇక్కడ మరొక చమత్కారం ఉంది. కావ్యాలని శ్రీకారంతో మొదలుపెట్టడమనేది ఒక ఆనవాయితీ, "శ్రీ" శుభాన్ని సూచిస్తుందని. ఇక్కడ కూడా కవి శ్రీకారంతోనే శతకాన్ని మొదలుపెట్టాడు. అయితే అది శుభసూచకంగా కాక చంచలమైన సంపదని సూచించేందుకు వాడుకొని, దానినుండి తనని రక్షించమని ఈశ్వరుణ్ణి కోరుకొంటున్నాడు! అంటే సంపదమీద కవికి ఎంతటి తిరస్కృతి ఏర్పడిందో దీనివల్ల స్ఫురిస్తుంది. ఈశ్వరుని కరుణను శరత్కాలంగా వర్ణించడం కూడా మనోజ్ఞమైన పోలిక. చల్లని చూపుల వెన్నెలలు కురిపిస్తే అది శరత్తుకాక ఇంకేమవుతుంది. ఈ కార్తీకమాసమంతా ఆ ఈశ్వరుని కరుణాశరత్సమయమే కదా! ఈ మాసంలోనే భక్తుల హృదయసరసీరుహాలు నిండుగా విచ్చుకుంటాయి. వికసించిన ఆ పద్మాలలో శశిశేఖరుడు కొలువుంటాడు. అప్పుడిక బతుకంతా వెన్నెలే! చివరి పాదంలో "తామరతంపర" మళ్ళీ చక్కని అర్థస్ఫూర్తి కలిగిన పదం. "తామరతంపర" అంటే మంచి అభివృద్ధి, సౌభాగ్యం అనే అర్థాలు వస్తాయి. ఈ పదబంధానికి అసలు అర్థం "తామరల సమూహం". తామరల సమూహంతో ఎలా అయితే కొలను కళకళలాడుతుందో, అలాగే బతుకు శోభిస్తుందని వాడుకలో ఆ అర్థం స్థిరపడింది. ఇక్కడ సందర్భానికది చక్కగా అతికింది! శరత్కాలం కాబట్టి తామరతంపర. గణాలూ యతిప్రాసలూ సరిపోయినంత మాత్రాన అది పద్యమవుతుంది కాని కవిత్వం కాదు. ప్రతిపదమూ ఔచిత్యంతో కూడుకొని, లోతైన అర్థస్ఫూర్తితో, గాఢమైన అనుభూతిని మిగిల్చినప్పుడే అది చిక్కని చక్కని కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వమే నిలుస్తుంది. ధూర్జటి కవిత్వం అలాంటి కవిత్వం. అందుకే అతడు "స్తుతమతియైన ఆంధ్రకవి".

6 comments:

  1. బాగుందండీ.
    అందమైన పుష్పం జడివానలో తడిసి పోవడం... వెన్నెలలో వికసించడం...
    రెండు దృశ్యాలూ కళ్ళముందు మెదలగానే భగవంతుడి కరుణ ఏం చేస్తుందో, చేయగలదో స్పష్టంగా అర్ధమై మనసు పులకిస్తుంది కదా!

    ReplyDelete
  2. బాగుంది, ఎప్పటిలాగే! శ్రీవల్లి గారి కామెంటు కూడ బాగుంది.

    మీరు పోస్టేస్తే పండగొచ్చినట్టు :-)

    ReplyDelete
  3. నిజంగా నిజం. మీరు పోస్టేస్తే మాకు నిజంగా పండగే.

    ReplyDelete
  4. శ్రీవల్లీరాధికగారు, చంద్రమోహన్ గారు, నరసింహగారు, నెనరులు.

    >>అందమైన పుష్పం జడివానలో తడిసి పోవడం... వెన్నెలలో వికసించడం...
    శరత్కాలంలో విశేషం ఏమిటంటే, మబ్బులు వీడిన ఆకాశం నిర్మలంగా ఉండి, ప్రొద్దుటిపూట సూర్యకాంతీ, రాత్రి వెన్నెలా కూడా బాగా కాస్తాయి. దానివల్ల ఉదయం తామరలూ, రాత్రి కలువలూ కూడా చక్కగా వికసిస్తాయి(ట). ఇప్పుడా శరత్సమయానికీ, ప్రకృతి రామణీయకతకూ, ఈశ్వరుని కరుణకూ మన మనుషులందరం దూరమైపోయాం.

    ReplyDelete
  5. ఈమధ్య శరత్కాలంలో వికసించిన కలువలా అనే వర్ణన ఎక్కువ చదువుతున్నపుడు సందేహం కలిగింది. చలికాలంలో చేమంతుల జాతులు తప్ప (సహజమైన పరిస్థితుల్లో) మిగతా పూలెక్కువ పూయవనుకునేదాన్ని. ఈ వర్ణన ఏమిటా అనుకుంటుంటే....మీరు చక్కటి సమయంలో వ్రాసినారు.
    శరత్కాలపు కలువలా మీ లేఖనాలు అన్ని కాలాల్లో వికసిస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో "జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల" పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే www.cpbrown.org చూడండి

    ReplyDelete