తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, April 19, 2008

పెద్దోడు, చిన్నోడు (సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలు)


నిన్న రాత్రి కలలోకి రావుగోపాల్రావు వచ్చి, "బ్లాగన్నాక కూసింత ఇంటరేక్షనుండాలి. ఉత్తినే రాసూరుకుంటే బ్లాగుకీ వెబ్సైటుకీ తేడా ఏటుంది." అని తనదైన స్టైల్లో నా చెవిలో ఉదేసరికి నాకు తెలివి తెల్లారింది! సరే అలాగే చూద్దామనిపించింది. అందుకే నేను మొదలుపెట్టిన "ఛందస్సు - కథా కమామీషూ" పరంపరని కాస్తంత ఇంటరేక్టివ్వుగా నడపాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కాస్త తలో చెయ్యావెయ్యాలి.
నేను చెప్పదలచుకొన్న విషయాన్ని కాస్తంత టూకీగా చెప్పి ప్రశ్నలడిగి ఊరుకుంటాను. దానికి తెలిసిన వాళ్ళు
కామెంట్లలో జవాబులు రాయాలి. వేరే సందేహాలుంటే అవికూడా రాయొచ్చు. జవాబులు తెలీనివాటికి నాకు తెలుసున్న మేరకు నేను జవాబులిస్తాను. వీకెండు టైము. ఇదేమీ పరీక్ష, పోటీ కాదుకాబట్టి, జవాబులు తెలుసున్న వాళ్ళు నిస్సంకోచంగా రాయవచ్చు. తెలీని వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. సరేనా మరి!

కిందటిసారి "మాత్ర"ల గురించి మాట్లాడుకున్నాం కదా. కేవలం మాత్రలమీదే ఆధారపడి ఉండే ఛందస్సుని మాత్రా ఛందస్సు అంటారు. అంటే ఒక పాదానికి ఇన్నే మాత్రలుండాలీ, లేదా ఇలాటి మాత్రల వరుస ఉండాలీ అని నిర్దేశించే ఛందస్సన్నమాట. ఊదాహరణకి మనందరికీ తెలిసిన "దేశమును ప్రేమించుమన్నా" అన్న గురజాడ గేయం ముత్యాలసరం అనే ఛందస్సులో ఉన్నది. ముత్యాలసరం మాత్రాఛందస్సు. దీనిలో పాదాలు ఈ కింద మాత్రా సంఖ్యలుగల పదాలతో ఏర్పడతాయి.

3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 2 (మూడు నాలుగు మూడు దో!)

చివరి పాదంలో కొన్ని రకాలున్నాయి, అది వేరే విషయం. ముఖ్యంగా మాత్రాఛందస్సులో ఉండే పద్యాలు, పాడుకోడానికి గేయాల్లా ఉంటాయి. వీటి గురించి తర్వాత వివరంగా చూద్దాం.

ఒక అక్షరానికి ఒకటికానీ రెండు కానీ మాత్రలుంటాయని చెప్పానుకదా. దీనిబట్టి వాటికి మన పూర్వులు "గురువు" "లఘువు" అని నామకరణం చేసారు. రెండు మాత్రలున్న అక్షరం "గురువు". ఒకటే మాత్రున్న అక్షరం "లఘువు". గురువంటే పెద్దదనీ, లఘువంటే చిన్నదనీ అర్థం కాబట్టి అలా పేర్లు పెట్టారు. అన్నిటికన్నా పెద్ద గ్రహానికి "గురు"గ్రహం అని పేరు పెట్టినట్టుగా.
ఒక అక్షరాన్ని గురువా లఘువా అని నిర్ణయించడంలో కొన్ని తిరకాసులున్నాయి. అయితే, ఈ నిర్ణయం ఆ అక్షరాన్ని ఉచ్చరించే సమయాన్ని బట్టి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకొంటే, తికమక ఉండదు. ఏ అక్షరాన్ని పలకడానికి మామూలుకన్నా ఎక్కువ సమయం తీసుకొంటామో అది గురువు. తక్కినవి లఘువులు.

ఇప్పుడు మీకు ప్రశ్నలు:

1. కొన్ని రకాలైన అక్షరాలు సహజంగా ఎప్పుడూ గురువులే. ఏమిటా అక్షరాలు?
2. కొన్ని సార్లు, "స్థానబలిమి కాని తనబలిమి కాదయా" అన్నట్టు, సహజంగా లఘువులైన అక్షరాలు కూడా గురువులుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు, ఎందువలన చేత?
3. పై రూలుకి కొన్ని చోట్ల మినహాయింపు ఉంది. ఎక్కడ ఎందుకూ?
4. కొన్ని పదాల ఉచ్చారణ కాలానుగుణంగా మారుతుంది. ఈ ఛందస్సు వల్ల ఒక ప్రయోజనం, వాటి పూర్వరూపం ఏమిటో చూచాయగానైనా తెలియడం. అలా గురు లఘు నిర్ణయం వల్ల తెలిసే ఒక ఉదాహరణ ఇవ్వగలరా? (క్లూ: ఇప్పటి చాలామంది పలికే విధానంబట్టి చూస్తే ఒక రకమైన అక్షరం గురువవ్వాలని అనుకొంటాం, కానీ అది ఛందస్సు ప్రకారం లఘువు!)

వీటికి సమాధానలు తెలిసికూడా మీరు చెప్పకపోతే, ఈ భేతాళుడు చెట్టెక్కి మళ్ళీ దిగడు:-)

మొత్తానికి జనాలందరూ కొంచెం కొంచెంగా జవాబులిచ్చేసి చేతులుదులిపేసుకున్నారు! సరే కానీండి, ఏంచేస్తాం, నాకు తప్పుతుందా మరి!

1. స: దీర్ఘాచ్చులతో కూడినవి (కా), "ఐ", "ఔ"ల తో కూడినవి (కై, కౌ), బిందువుతో కూడినవి (కం), విసర్గతో కూడినవి(దుః) అచ్చులుకాని, హల్లులుకాని. ఒక అక్షరం సహజంగా లఘువా గురువా అన్నది అందులోని అచ్చే నిర్ణయిస్తుందని గమనించే ఉంటారు.

2. స: ఒక అక్షరం పక్కన పొల్లున్నప్పుడు ఆ పొల్లుకూడా ముందటి అక్షరంలో భాగమై, ఆ అక్షరం గురువౌతుంది (రన్, చల్).
ఒక అక్షరం వెనకాల సంయుక్తాక్షరం ఉన్నప్పుడు ఆ అక్షరం గురువౌతుంది. ("కర్త" లో "క" గురువు, దీనిని "కర్" "త" అని పలుకుతాం కాబట్టి).
ఈ సందర్భాలలో ముందటి అక్షరమ్మీద ఊనిక ఎక్కువై, అవి పలకడానికి కొంచెం ఎక్కువసేపు పడుతుందికాబట్టి ఈ రూలు వర్తిస్తుంది.

3 స: ఏవుంది, ఏ చోట్లయితే వెనకాల సంయుక్తాక్షరం ఉన్నా, ముందు అక్షరానికి ఊనిక ఉండదో అలాటి చోట్ల ఈ రూలు వర్తించదు. రెండు పదాలున్నాయనుకోండి ఉ: "ఆమె స్త్రీ". ఇవి పలికేటప్పుడు "ఆమె"కి "స్త్రీ"కి మధ్య పలకడంలో కొంత సమయం ఉంటుంది కాబట్టి, మొదటి పదం చివరి అక్షరానికి ("మె"కి) సాధారణంగా ఊనిక ఉండదు. కాబట్టి అలాటప్పుడు పై రూలు వర్తించదు (ఇక్కడ "మె" లఘువే). అయితే కొంతమంది పద్యాలలో మీరు కలిపే చదవండి సుమా అని చెప్పి ముందు అక్షరాన్ని గురువు చేస్తూ ఉంటారు!
అలాగే కొన్ని సార్లు ఒకే పదమైనా (రెండుపదాలు సంధి జరిగి) కూడా సమ్యుక్తాక్షరం ముందలి అక్షరానికి ఊనికపడకుండా పలకే అవకాశం ఉంటుంది. అలాటప్పుడు వాటికి ఈ రూలు వర్తించకుండా ఉండవచ్చు!

4 స: "అద్రుచు", "విద్రుచు", "ఎద్రుచు", "పద్రిచి", "చిద్రుప" పదాలలో మొదటి అక్షరం మీద ఊనిక లేకుండా పలకాలి. కాబట్టి అవి లఘువులు. ఈ పదాలు "అదురుచు", "విదురుచు" మొదలైన పదాలకి రూపాంతరాలు.
వట్రసుడికి ముందున్న అక్షరానికి ఊనిక ఉండదు. కాబట్టి అవి సహజంగా లఘువులైతే, లఘువులే అవుతాయి (ఉ: సహృదయడు లో "స" లఘువే).

సరే, మరిది మీకెంతవరకూ అర్థమయ్యిందో తెలుసుకోడానికి కొన్ని ప్రశ్నలు. ఈ కిందవాటికి గురులఘువులని గుర్తించండి:

1. విష్వక్సేనుడు
2. ప్రకృతి
3. ప్రాణముల్ బయటకివచ్చి ముగ్ధాకార
4. నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె
5. దెరదీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిథి యగుచు
6. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా

15 comments:

  1. ఆఁయ్! భేతాళుడు చెట్టెక్కిదిగలపోతే చాలా ప్రమాదాలున్నాయ్. అసలు చెట్టెక్కనీయకుండా ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి లాగేస్తా. మిగిలిన వాటికి తరువాత. నాకా అవకాశం మిగిలుంటే... :)

    చివరి ప్రశ్నకు మాకు తెలిసిన సమాధానం: వట్రువసుడి.

    ReplyDelete
  2. భేతాళుడిని చెట్టెక్కనీయకుండా నే చేయు ప్రయత్నమ్మిదది..

    1. విసర్గలున్నవి
    2. పక్కనే సంయుక్తాక్షరమున్నప్పుడు
    3. ఆ పక్క సంయుక్తాక్షరము వేరే పదానిదై యున్నప్పుడు..(నిన్ననే దాశరధీ శతకంలో ఆ రూలుకీ మినహాయింపు చేసుకుని ఓ లఘువుని గురువగా పరిగణించడం చదివాను)
    4. అద్రచు లాంటి పదాలు, మీరింతకు మున్నే ఇలాంటి పదాలు వాడి ఓ వృత్తాన్ని వ్రాసారుగా..

    ReplyDelete
  3. ఇదేం బాలేదు.
    పాఠం మొదలుపెట్టకుండానే ప్రశ్నలడిగేసారు.

    ముందర క్లాసులలో చదువుతున్న పిల్లలు అప్పుడే చక చకా సమాధానాలు చెప్పేసారు :)

    పోనీలెండి చక్కని విషయాలు తెలిసాయి.

    ReplyDelete
  4. రానారెగారు, గిరిగారు,

    సరైన సమాధానాలు చెప్పేసారు! మొదటి ప్రశ్నకి విసర్గలొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి కదా.
    వీలైతే కొంచెం వివరణ కూడా ఇవ్వండి, ఎందుకు అన్నదానిగురించి (reasoning).

    @ప్రవీణ్ గారు,
    అదేదో సినిమాలో ప్రకాష్ రాజు ఉపన్యాసం గుర్తుందా మీకు. "నే చెప్పబోయే విషయం గురించి మీకు తెలుసా" అని అడుగుతాడు:-)
    పాఠం తెలుసున్న వాళ్ళచేత తెలీనివాళ్ళకి చెప్పించడం మన గురుకులాల్లో చేసేవారట, ఈ మధ్యనే గరికపాటివారు చెప్పగా విన్నాను ("ఏకసంథాగ్రాహి" అన్న పదం ఎలావచ్చిందన్న దానిగురించి చెప్తూ చెప్పారు). తెలిసిన వాళ్ళకి revision, తెలీనివాళ్ళకి నేర్చుకోవడం ఒకేసారి అయిపోతాయి, అదీ కిటుకు!

    ReplyDelete
  5. ఇవీ నా సమాధానాలు..

    1. మ, గగ
    2. న
    3. ర, న, జ, మ, గ
    4. ర, త, ర, గ,
    5. స, జ, న, స, య, య, య, భ, నల, ల
    6. భ, ర, న, భ, భ, ర, వ

    ReplyDelete
  6. గిరిగారు,
    నేను గురులఘువులని గుర్తుపట్టమంటే, మీరేవేవో అక్షరాలు రాస్తే నాకెలా అర్థమవుతుందండీ:-)
    అయినా మరొక్కసారి సరిచూసుకొని I, U గుర్తులతో (ల, గ అయినా ఓకే) జవాబు రాయండి, మార్కులు కావాలంటే:-)

    ReplyDelete
  7. ప్రస్తుతానికి నిరసన సంగతిని దయచేసి పక్కనబెట్టేయండి :)

    "దిగద్రావి"లో సంధి వున్నదనుకోవడం నేను చేసిన తప్పు. అంతేనా మాస్టారూ?

    6. UII UIU III UII UII UIU IU

    దిగ+త్రావి=దిగద్రావి ఔతుంది కదా? మీ వివరణ కావాలి.

    ReplyDelete
  8. రానారెగారు,
    రైఠో! ఇది నేను మూడవ సమాధానంలో చివర చెప్పినదానికి ఉదాహరణ. మిరన్నట్టు అది సంధి జరిగిన పదమే. అయినా శ్రీనాథడు, "గ" మీద వత్తిచ్చి చదవకండని నిర్దేశించాడు! కాబట్టి మనం అలానే చదవాలి:-)
    ఇది నాకు తెలిసి "ర"వత్తుకి మాత్రమే వర్తిస్తుంది. "తలబ్రాలు" అన్నది ఒకటే పదం అయినా, అది పలికినప్పుడు సాధారణంగా ముందున్న "ల" మీద ఊనిక లేకుండా, "తల బ్రాలు" అనే పలుకుతాం. ఇదీ అలానే.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. కామేశ్వర రావుగారు,
    చివరి పద్య పాదం నా కింతకు ముందు తెలియదండి, కాని ఉత్పలమాల పాదమని ఊహించాను.ప్రసిధ్ధి పొందిన తెలుగు పద్యాలు నాకంతగా తెలియవు కూడాను. ఆ మాటకొస్తే, ఈ మధ్యనే మన కవి దిగ్గజాలు వ్రాసిన పద్యాలు చదవడం మొదలు పెట్టాను.మీరు పరిచయం చేస్తున్న మంచి పద్యాలు చదివి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను..
    గిరి

    ReplyDelete
  11. మాస్టారూ, మొత్తానికి నాకొక విషయం స్పష్టమైంది. గురులఘువుల నిర్ణయం శబ్దాశ్రయమేనని. అందుకే కదా వట్రసుడిగల హ్రస్వాక్షరాన్ని లఘువంటున్నాం. అలాగే తలబ్రాలు లోని ల. సరిగా అర్థం చేసుకున్నానా?

    నా 'రైఠో'ని మీరూ వాడుతున్నారే! నాకిది దేవయ్య యిచ్చాడు. దేవయ్య మీకూ తెలుసుగా?

    ReplyDelete
  12. రానారెగారు,
    సరిగానే చెప్పారు.
    నాకు రైఠో అన్నదెక్కడినుంచి వచ్చిందో తెలీదుకానీ, మీరన్న దేవయ్య మిస్‌మేరీ సినిమాలో అతననేనా?

    గిరిగారు,
    అయితే ఆ పద్యం ఇదుగో:
    భూధరరాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరా
    రాధనకేళి కౌతుకపరాయణయై ధరియించె బాండుర
    క్షాధృతి పూర్వకంబుగ ప్రగాఢ పయోధరమండలీ సము
    త్సేధ విశీర్ణసంహతులజెల్లు మహీరుహవల్కలంబులన్

    శ్రీనాథుని పద్యం.

    ReplyDelete
  13. బానే ఉంది వ్యవహారం అని మీరు నవ్వకపోతే చెప్పాలి, ఈ పద్యం పూర్తిగా చదివిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు, ఇంటర్ తెలుగువాచకంలో ఈ పద్యం ఉందని..

    ReplyDelete
  14. గురువర్యా
    చాలా రోజులకు చూసాను, నన్నూ శిష్యుణ్ణి చేసుకోండి. లేకుంటే విద్యాధరుని లాగా చేసి, నేను శాపగ్రస్తుడిని కావాల్సి వస్తుంది :-)


    గిరి గారు,
    నాకు నచ్చిన పద్యాలలో ఒకటి ఇది. నాకు
    గుర్తున్నంత వరకు మేము ఇది తొమ్మిదో తరగతిలో "పార్వతీ తపస్సు" అనే పాఠంలో నేర్చుకున్న పద్యం అది.



    గురువుగారు,
    ఇంకో పద్యం నాకు మొత్తం గుర్తు లేదు కాని, చాలా ఇష్టం

    అనిన న్గన్నులు జేవురింప నధరంబల్లల్లాడ వెలుత్పునహ్పునః .......

    అంటూ అది తెలిస్తే తెలియ చేయ గలరని మనవి.

    ReplyDelete
  15. @భావకుడన్,
    నేనూ ఈ పద్యాలు తొమ్మిదో తరగతిలో చదువుకున్నవే.
    కాబట్టి మనం సహపాఠులమే కాని గురుశిష్యులం కాదు :-)
    "అనిన న్గన్నులు జేవురింప" పద్యం ఇందీవరాక్షుని వృత్తాంతం అనే పాఠంలోనిది. ఇది పెద్దన మనుచరిత్రలోని వృత్తాంతం. ఇది పద్యం:
    అనిన న్గన్నులు జేవురింప నధరంబల్లాడ వ్రేల్లత్ పునః
    పునరుద్యద్భృకుటీ భుజంగయుగళీ ఫూత్కార ఘోరానిలం
    బన నూర్పుల్ నిగుడన్ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్
    జినుకన్ గంతు దిదృక్ష రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్

    ReplyDelete