తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, April 14, 2008

సీతారాముల కల్యాణము చూతము రారండి!

ఉగాది అలా వెళ్ళిందోలేదో, ఇలా శ్రీరామనవమి వచ్చేస్తుంది. ఈ రెండు పండగలూ తెలుగువారు మురిపెంగా చేసుకొనే పండగలు. సీతారాముల కల్యాణం ఇంటింటా వేడుకే. మరి ఆ వేడుకని మనం కూడా జరుపుకోవద్దూ! అందుకే ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణకల్పవృక్షంలో జరిపించిన సీతారామ కల్యాణాన్ని చూద్దాం పదండి.

ఇదమిత్థమని నిర్ణయింపగా రాని దే
కోర్కియో రూపు గైకొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యా
శా బలం బవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటకివచ్చి ముగ్ధాకార
మెనయించి దర్శనమిచ్చినట్లు
తన సృష్టిలోని యుత్తమభావ మానంద
ముగ బొంగి బింబమై పొడిచినట్టు

లల యరుంధతియును నహల్యయును గోస
లాత్మజాతయు మువ్వురి యాననముల
కన్నను బవిత్ర మగుచు శృంగారభావ
మొడిసిపట్టిన ముఖచంద్రుడొకడు తోచె

ఇది సీతాదేవి గురించి కల్పవృక్షంలో మొదటి పద్యం. సీతాదేవిని రామచంద్రుడు మొదటిసారిగా చూసినప్పటి పద్యం.
ఇది, అది అని నిర్ణయించలేని ఏదో కోరికకి రూపం వచ్చినట్లు, ఎన్నో జన్మలనుండీ బలపడుతూ వస్తున్న ఆశ తుట్టతుదికి చేరుకున్నట్లు, తన ప్రాణాలు బయటకి వచ్చి సుందరమైన ఆకారంతో దర్శనమిచ్చినట్లు, మొత్తం తన సృష్టిలోని ఉత్తమమైన భావం ఆనందంగా పొంగి ఒక బింబంగా ఉదయించినట్లు ఉంది సీత మోము! అరుంధతి, అహల్య, కౌసల్య ముఖాల కన్న కూడా పవిత్రంగా కనిపించింది ఆమె మోము. అంతలోనే శృంగారభావాన్ని కూడా మూర్తీభవించిన చంద్రబింబంలా సీత ముఖం తోచింది! ఇంతకన్నా ఈ పద్యానికి వివరణ అనవసరం!

శ్రీరఘురామచంద్రునకు జిత్తము జానకిపై గరంబు వి
స్ఫారశరాస లస్తకముపై యుగపత్క్రియ జిత్రమయ్యె సం
ధారతి గోటికెక్కిన గుణంబు బిగించుట లాగు టింతయున్
నేర డెఱుంగ నొక్కసడి నిండిన శబ్దము కల్గు నంతకున్

మనసేమో జానకి మీద, చెయ్యేమో శివధనుస్సు మధ్యనుండే పిడి మీద ఒకే సారి లగ్నమయ్యాయట రామునికి! అల్లెతాడును బిగించడం, లాగడం ఏవి తెలియలేదతనికి, ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చినంతవరకూను!

మంజూషలోనె యమర్చి కోణంబందు
నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె
గాబోలు మంజూషికా వినిర్గమనంబు
వేళకే జ్యావల్లి బిగిసియుండె
దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి
కడ్డమ్ముగా వచ్చునంచు నెంచె
గాబోలు నడ్డంబుగా ధనుస్సును బూని
పిడిబాకువలె ద్రాడు వ్రీలలాగె

నతని దృష్టికి జానకి యాగలేదు
అతని కృష్టికి శివధనుస్సాగ లేదు
సీత పూజడవెన్నుగా శిరసు వంచె
జెరుకుగడవోలె నడిమికి విరిగె ధనువు

మంజూష అంటె పెట్టె. శివధనుస్సు పెట్టెలో తీసుకువచ్చారుకదా. ఆ పెట్టెలో ఉండగానే, చివరన నొక్కిపెట్టి అల్లెత్రాటిని కొప్పుకి కట్టి వేసాడేమో అన్నట్టుగా, ఆ విల్లుని పెట్టెలోంచి తీసే సమయానికే ఆ అల్లెత్రాడు బిగిసి కనిపించింది. అంటే అంత వేగంగా రాముడా పని చేసాడని ధ్వని. తాడిచెట్టంత పొడుగున్న ఆ విల్లు, సీతని చూడ్డానికి అడ్డం వస్తుందని అనుకున్నాడో ఏమో, రాముడు దాన్ని అడ్డంగా పట్టుకొని, పిడిబాకుని లాగినంత సులువుగా ఆ అల్లెత్రాడుని లాగాడు. అతని చూపులని జానకి తట్టుకోలేకపోయింది. అతని బలాన్ని ఆ శివధనుస్సు తట్టుకోలేకపోయింది. సీత సిగ్గుతో పూలజడ కనిపించేంతగా తలదించుకుంది. ఆ శివధనుస్సు చెఱుగ్గడలాగ
మధ్యకి విరిగిపోయింది! ఎంత పెద్ద శబ్దం చేస్తూ విరిగిందా విల్లు? భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్లు, పిడుగుల శబ్దాన్ని మించినట్టుంది ఆ శబ్దం. ఆ శబ్దం శివలోకంలోనూ, స్వర్గలోకంలోనూ, రాక్షసలోకంలోనూ, రాజలోకంలోనూ అంతటా ప్రతిధ్వనించింది!
ఆ తర్వాత పరశురాముడు రావడం, అతని విష్ణుధనుస్సుని రాముడు గ్రహించడం జరిగిపోయాయి. రామ లక్ష్మణ భరత శతృఘ్నులను, సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తులకిచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయం అయిపోయింది.
ఇక అంతా సీతా రాముల కల్యాణ వేడుకే! అదుగో పెళ్ళికూతుళ్ళను బుట్టల్లో తెస్తున్నారు...

తుమ్మెదలు పైని గ్రమ్మిన తమ్మి పూలు
నాల్గు తట్టలతో దెచ్చినారు మేన
మామ లంతలో జూడగా మధుర లజ్జ
లుదయమైన రాకన్నెల వదనములుగ

పైన తుమ్మెదలు కమ్ముకున్న తమ్మిపూలని నాలుగు బుట్టల్లోనూ తెచ్చారు మేనమామలు. ఇదేమిటా అని చూస్తే తెలిసింది అవి రాకుమార్తెల ముఖాలని! వాళ్ళని తెచ్చి తెరవెనక పెట్టారు. తెరకి అటు సీత, ఇటు రాముడు.

సంకల్పసంభవాస్థానమౌ తెర తోచి
పంచీకృతంబులౌ ప్రాణములును
దెరవెంక బ్రతిబింబ దీధితుల్ ప్రకటించి
తనకు మించిన మోహమున వెలింగి
తనుదాన రాముడయ్యును విస్మరించి త
త్ప్రతిబింబమునయందు రాముడగుచు
దెరదీసినంతన తెలిసి నిజస్వరూ
పంబు బ్రహ్మానంద పరిథి యగుచు

నెంతటి మహీయుడయ్యును నినకుల శిశు
వింతగ నణీయుడై సర్వసృష్టిసహజ
మైన విభ్రాంతి బొందె, మోహజమునైన
వికృతి నలుగురితో బాటు విస్తరించు

ఈ పద్యాన్ని వివరించాలంటే, ముహూర్తం కాస్తా దాటిపోతుంది. కాబట్టి, క్లుప్తంగా... తన పంచప్రాణాలూ ఆ తెరవెనక ప్రతిబింబించి, తనకన్నా కూడా అందంగా వెలుగుతున్నట్లుగా రాముడు విస్మయం పొందాడు! తనే రాముడై కూడా ఆ తెరవెనక తన ప్రతిబింబాన్ని చూసి రమ్యత్వం పొందాడు. అంతలో తెర (మాయ) తొలగింది. తన నిజస్వరూపాన్ని (అద్వైతాన్ని) తెలుసుకొన్నాడు. బ్రహ్మానందాన్ని పొందాడు. ఎంతటివాడికైనా మోహ విభ్రాంతి కలగడం సహజం. అది నలుగురితో పాటు (లోకంలో) విస్తరిస్తుంది. రాముడితో పాటు అలాంటి స్థితే ఆ అన్నదమ్ముల నలుగురికీ కలిగింది!
సుముహూర్తం అయిపోయింది. వధూవరులు ప్రక్కప్రక్కన కూర్చున్నారు.

ఎదురుబళ్ళైన లజ్జచే నెత్తరాని
ఱెప్పలవి యెత్తబడకుండ గ్రేవలందు
బ్రక్క గూర్చున్న యప్పటి ప్రసరణంబు
ప్రసవబాణుండు నేర్పిన ప్రథమ విద్య

రెప్పలని పైకెత్తి చూడ్డానికి సిగ్గు ప్రతిఘటిస్తోంది. అంచేత దించున్న రెప్పలతోనే, ప్రక్కచూపులు చూసుకొంటున్నారు. అలా చూసే నేర్పు, మన్మథుడు వాళ్ళకి నేర్పిన మొదటి విద్య!
అదుగో మంగళసూత్రధారణ జరుగుతోంది! సీత మెడలో రాములవారు మంగళసూత్రాన్ని కడుతున్నారు.
జడవెనకున్న ఆ మెడభాగం భర్త తొలిస్పర్శతో పులకించింది! మరి రామునికో...

కరరుహంబులు చర్మంబు గాకపోయె
నవియు బులకించునేమొ ప్రియా గళాత్త
మైన స్పర్శసుఖాప్తి, బ్రియాగళంబు
నంటి బాధించు వీనికేలా? సుఖంబు

పాపం అతని గోళ్ళు మాత్రమే సీత మెడని తాకుతున్నాయి. అవి చర్మం కాదు కదా, అంచేత వాటికి స్పర్శ లేదు. లేకపోతే అవికూడా పులకించేవే! అయినా ప్రియతమ గళాన్ని నొక్కి బాధించే వీటికి సుఖం ఎందుకు?
మొత్తానికి సూత్రధారణ జరిగిపోయింది. ఇంక తలంబ్రాల వేడుక!

నాలుగవ పాలుగా నింద్రనీల మణులు
మణులు కలియంగ బోసిరో యనగ బొలిచె
ముత్తెములు చతుర్దంపతి తను స
మాత్త నీలరక్తచ్ఛవుల్ హత్తుకొనగ

ఆ నలుగురు దంపతులు ముత్యాల తలంబ్రాలు పోసుకొంటున్నారు. అవి, ముప్పావువంతు మణులూ, పావువంతు నీలాలూ కలిపి పోసినట్టుగా కనబడ్డాయి. ఆ లెక్కలేవో మీరే ఆలోచించి తేల్చుకోండి.

అలుపములు రెండుమూడు ముత్యాలు నిలిచి
సీత పాపటలో జిరుచెమట పోసె
హత్తుకొని గందపూత ముత్యాలు రెండు
రామచంద్రుని మేన దారకలు పొలిచె

రెండు ముత్యాలు సీత పాపిటలో చిక్కుకొని చెమట బిందువుల్లా మెరిసాయి. రాముని ఒంటిపై గందపుపూతకి రెండు ముత్యాలు అంటుకొని తారకల్లాగ కనబడ్డాయి. ఇది శృంగార రసధ్వని. అనుభవైక వేద్యం.

చంద్రరేఖపైని సన్నని తెలిమొయి
ళ్ళాడినట్లు ముత్తియమ్ములాడె
దల్లిమేనిపైని, నల్లని యాకాశ
మట్లు రామచంద్రుడందె యుండె

నల్లని ఆకాశంలా రాముడున్నాడు. నెలవంకపైన తెల్లమబ్బులు తూగాడుతున్నట్టు పక్కనే సీతాదేవి తలపై ముత్యాలు కదలాడుతున్నాయి. అంతలోనే ఇదిగో చిరుజల్లులు కురిసాయి.

ప్రతి చైత్రశుద్ధనవమికి
వితతంబుగ తెలుగునేల విరిసెడు జల్లుల్
సితముక్తా సదృశంబులు
ప్రతనులు తలబ్రాల వేళ వచ్చె జిటపటల్

ఈ చిటపట చిరుజల్లులు ప్రతి చైత్రశుద్ధ నవమినాడు తెలుగునేలపై కురుస్తాయి. ఇవి అచ్చు ఆ తలంబ్రాల ముత్యాల్లాగే ఉన్నాయి!
ఇలా పరమానందంగా, పరమ రమణీయంగా సీతారాముల కల్యాణం జరిగింది!

మంగళం కోశలేంద్రాయ
మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ
స్సార్వభౌమాయ మంగళం!

11 comments:

  1. విశ్వనాథ వారి కల్పవృక్షాన్నించి రమణీయమైన సీతాకళ్యాణ ఘట్టాన్ని సందర్భోచితంగా వినిపించినందుకు అనేక ధన్యవాదాలు.

    ReplyDelete
  2. cakkani padyAlanu aMdiMcinaMduku kRtaj~natalu.

    ReplyDelete
  3. రిజిస్టర్డ్ పెళ్లి చేసుకోవాలనుకునే వాడికి కూడా - సంప్రదాయమైన పెళ్లితంతుపై మోజును పెంచేట్టుంది ఈ ఘట్టం. :) భద్రాచలంలో ఈ పర్వదినాన జరిగే వేడుకను ప్రత్యక్ష(రిలే)ప్రసారం చేస్తారు రేడియోలో. మంచి పండితుడు వ్యాఖ్యానం చెబుతూవుంటే వింటానికి చాలా బాగుంటుంది. మీ టపా చూస్తే అలాగే వుంది.

    చంద్రరేఖపైని సన్నని తెలిమొయిళ్ళాడినట్లు ... ఈ పద్యం చదువుతూవుంటే 'సీతారాముల కళ్యాణము చూతమురారండి' పాటలోని 'జానకి దోసిట కెంపుల ప్రోవై - రాముని దోసిట నీలపు రాశై' అనే పాదం గుర్తుకొచ్చింది.

    మొత్తానికి నాలాంటివాడు కూడా రామాయణకల్పవృక్షాన్ని చదివితే ఎంతోకొంత అర్థమౌతుందనే ధైర్యం కలిగించారు ఈ టపాతో. ఉదాహరణకు ఈ క్రింది పద్యం మామూలు వచనంలా వుంది.

    నతని దృష్టికి జానకి యాగలేదు
    అతని కృష్టికి శివధనుస్సాగ లేదు
    సీత పూజడవెన్నుగా శిరసు వంచె
    జెరుకుగడవోలె నడిమికి విరిగె ధనువు

    ఎప్పటిలాగే నాదో సందేహం మాస్టారూ:

    పై పద్యంలో మూడో పాదానికి "సీత సిగ్గుతో పూలజడ కనిపించేంతగా తలదించుకుంది." అని మీరు చెప్పిన భావం సందర్భోచితంగా సరిపోతుందిగానీ, 'పూజడ వెన్నుగా' ప్రతిపదానికీ అర్థం తీసుకుంటే కొద్దిగా మారుతుందేమోనని నా సందేహం. ఏమంటారు?

    [మీ తాజా టపాలో చెప్పిన భేతాళుడు మీరు కాదు, నేనే నేమో :)]

    ReplyDelete
  4. @రానారెగారు,
    రిజిస్టర్డ్ పెళ్లి చట్టంకోసం, సాంప్రదాయకమైన పెళ్ళి మనకోసం, మనవాళ్ళకోసం!
    "పూజెడ వెన్నుగా" గురించి మంచి ప్రశ్నే వేసారు. నాకూ ముందు చదివినప్పుడిలాగే సందేహం వచ్చింది. ఇప్పటికీ నాకు ఖచ్చితంగా సమాధానం తెలియదు కాని, "వెన్ను" అంటే "నడికొప్పు" అన్న అర్థం కూడా ఉంది. పూజడ వెన్నుగా అంటే, తలవెనకభాగాన ఉండే పూలజడ తలపైకి వచ్చినట్లుగా తలవంచిందని అర్థం చెప్పుకున్నాను. దురదృష్టవశాత్తూ రామాయణకల్పవృక్షం టీకా తాత్పర్యాలతో, నాకు తెలిసి ఎవరూ ప్రచురించ లేదు. కాబట్టి మన తంటాలు మనం పడవలసిందే! అసలు కల్పవృక్షానికి టీకా తాత్పర్యాలు కూడా సరిపోవు. వ్యాఖ్యానం కూడా ఉండాలి. అలా వ్యాఖ్యానం రాయగలిగే సత్తా ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇంకొక పదేళ్ళుపోతే వాళ్ళూ ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైన ఈ పుణ్యకార్యానికి పూనుకొంటే బాగుణ్ణు! లేకపోతే ఒక మహాకావ్యాన్ని వృధాచేసుకొన్న వాళ్ళమవుతాం...

    ReplyDelete
  5. కామేశ్వర రావు గారూ
    మొల్ల రామాయణం లోని 77,78 పద్యాలు 79 వచనం లో లక్ష్మణుడు చెప్పిన కదలకుమీ ధరాతలమ, ఉర్వీనందనకై, పద్యాలను కూడా న్యాఖ్యానించరూ దయతో-నరసింహ

    ReplyDelete
  6. మేస్టారూ, "పూజడ వెన్నుగా" అంటే పరిపక్వతకొచ్చిన (వరి)కంకులు ఎలా వాటి శిరస్సులు వంచుతాయో అలా అని అర్థం చెప్పుకోవాలేమో.

    ReplyDelete
  7. నరసింహగారూ,
    మీరడిగిన పద్యాలగురించి వీలుచూసుకొని రాయడానికి ప్రయత్నిస్తాను.

    రాఘవగారూ,
    మీరు చెప్పిన అర్థం ఇంకా బావుంది!

    ReplyDelete
  8. గురువు గారు,

    అదే పద్యంలోని మిగిలిన పాదాల సరళమయిన శైలిని బట్టి చూస్తే, "పూజడవెన్నుగా" లో మరీ నిగూఢమయిన అర్ధం లేదేమో అని నాకనిపిస్తోంది. సీత వెన్నంతటా ఉన్న జడతో(పొడుగాటి జడ అని చెప్పటానికి అలా ఉపమానాన్ని ప్రయోగించారని ఈ అర్భకుడి భావన). పొరపాటయితే మన్నించండి.

    ReplyDelete
  9. అప్పుడప్పుడు చదివి వెళుతున్నానండి మీ పోస్టులు, ముఖ్యంగా పద్యాల మీద మీరు చేస్తున్న రచనలు. వేరేగా అనుకోకపోతే ఓ చిన్న మాట. ఈ రచనలు ఒక బ్లాగుకు మాత్రమై పరిమితమవ్వల్సినవి కాదని నా అభిప్రాయం.

    ReplyDelete
  10. [ఈ రెండుమాటలు రాద్దామని పుస్తకాన్ని సంచీలో వేసుకుని తిరుగుతూ చాలా రోజులుగా జాప్యం చేస్తున్నాను.]

    కామేశ్వర రావుగారు చాలా చక్కని వ్యాఖ్య రాసారు. నాకు గుర్తొచ్చిన ఒక విషయం: ధనుస్సు చెరుకుగడలా విరిగిందనడం యాదృచ్ఛికమేమీ కాదు, మన్మధుడు చెరకు వింటి వేలుపు కదా, చెరకుగడ విరగడం అంటే శృంగారానికి పరాకాష్ట, జరగబోయే సీతారాముల ఆదర్శ దాంపత్యానికి ప్రతీక. ఈ విషయం విశ్వనాథ పావని శాస్త్రి గారి నోట విన్నాను.

    రామాయణ కల్పవృక్షానికి చాలా చక్కని వ్యాఖ్య ("కాళిదాసుకి మల్లినాథ సూరి లాగా, విశ్వనాథకి వడలి") వడలి మందేశ్వరరావు గారు రాసారు. "ఇది కల్పవృక్షం :కల్పవృక్ష కావ్యానుశీలనము" అజోవిభో వారి ప్రచురణ.

    an aside: నేను "రామాయణ కల్పవృక్షం" రెండు మాటలుగా భావించి ఈ పోస్టు కోసం "రామాయణ", "కల్పవృక్షం" "వృక్షం" అన్న మాటలతో ఈ బ్లాగులో గూగుల్ సహాయంతో వెతికితే రాలేదు. మీరు "రామాయణకల్పవృక్షం" ఒక మాటగా రాసారు. "రామాయణకల్పవృక్షం" అన్న మాట "రామాయణ", "కల్పవృక్షం" అన్న search terms కి match కాదు. తెలుగు agglutinative భాష కాబట్టి ఇలాంటి కొన్ని సందర్భాల్లో గూగుల్ సెర్చి సరైన ఫలితాలని ఇవ్వదు. ఇందుకోసం ఈమాట లో సురేష్ గారు "విస్తృత శోధన" ని తయారు చేస్తున్నారు.

    ReplyDelete
  11. పద్మగారు,
    అవును మీరన్నట్టు ఇక్కడ విల్లుని చెఱుకుతో పోల్చింది చెఱుకు మన్మథుని విల్లు కాబట్టే. విశ్వనాథవారు "కల్పవృక్ష రహస్యములు" అని తన కల్పవృక్షానికి తానే వ్యాఖ్య (బాలకాండకి మాత్రమే) రాసుకొన్నారు. అందులో ఈ విషయం ప్రస్తావించారు.
    అయితే, మన్మథుని విల్లు విఱిగిపోవడం (అది అశుభసూచకం కాదా?), శృంగారానికి పరాకాష్ట ఎలా అవుతుందీ అన్న చిన్న సందేహం మాత్రం ఉంది. రాముడు మన్మథుని జయించాడన్నదానికి అది సూచన అని సరిపెట్టుకున్నాను.
    వడలి మందేశ్వరరావుగారి పుస్తకం గొప్పదే. కాని అది కల్పవృక్షానికి పరిచయమే కాని వ్యాఖ్య కాదని నా అభిప్రాయం. కల్పవృక్షలోని అందాలు/విశేషాలు, వడలివారి పుస్తకంలో మహా అయితే ఓ అయిదు శాతం మాత్రమే ఉన్నాయనిపిస్తుంది.

    మీరన్న శోధన విషయం సురేశ్ గారు చెప్పారు. "రామాయణకల్పవృక్షం", partial search చేస్తే తప్ప Agglutination rulesకి చిక్కుతుందా?

    ReplyDelete