ఇవాళనుంచి శరన్నవరాత్రులు మొదలువుతున్నాయి. శరదృతువు మొదలయ్యిందన్నమాట. వెన్నెల నెలలు.
శరత్తుకీ శారదకీ ఎంత దగ్గర సంబంధమో, వెన్నెలకీ కవిత్వానికీ అంతటి స్నేహం. చంద్రునికి మనస్సుని మైమరపించే మహత్తేదో ఉంది. పున్నమి జాబిలిని, పిండారబోసినట్టు నింగి అంతా పరుచుకొనే చల్లని వెన్నెలని తనివితీరా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందా మహత్తు.
శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై
ఇది నన్నయ్యగారి మొదటి పద్యం. ఇదేంటి ఇదతని ఆఖరి పద్యం కదా అని అప్పుడే ఆశ్చర్యపడ్డారా! మొదటి పద్యమంటే, నా బ్లాగులో నన్నయ్యగారి గురించి నేను వ్రాస్తున్న మొదటి పద్యం యిది అని. అతని చివరి పద్యంతో యిలా మొదలు పెట్టడం, యిదియొక చమత్కారము :-)
ఈ పద్యాన్ని మీరు రాగయుక్తంగా చదువుకోవలసిన అవసరం లేదు, మామూలుగా చదువుకున్నా చాలు. ఒక రెండు మూడు మార్లు మళ్ళీ మళ్ళీ చదువుకొని ఆ పదాలపొహళింపు, ఆ ధార, ఆ అక్షర మాధుర్యంలో మునకలు వెయ్యండి.
నన్నయ్యగారు తన కవిత్వానికున్న లక్షణాలు అని చెప్పుకున్నవాటిలో అక్షర రమ్యత ఒకటి. రమింప జేసే అక్షరాల సంఘటన అని అర్థం. ఆ రమ్యత్వమంతా యీ పద్యంలో కనిపించడం లేదూ! ఇది ఎలా సాధించారు అంటే, అది ఒక ఆల్కెమీ. ఏదో - "ర" అన్న అక్షరం పదేపదే వచ్చినందువల్లనో, మొదటి రెండు పాదాలలో ప్రాస స్థానంలో "స" అక్షరానికి ఇచ్చిన ఊనిక వల్లనో - ఇలా రకరకాలుగా అనుకోవడం వొట్ఠి మన పరిమితమైన బుద్ధికి తట్టే పైపై అంశాలే తప్ప అసలు రహస్యం అంతుపట్టదు. ఇందులో గమనిస్తే మరో విశేషం - అనునాసికాక్షర శబ్దాలన్నీ యిందులో వినిపిస్తాయి, జాగ్రత్తగా వింటే (పంక్తులంజారు అన్న పదాలలో ఙ్, ఞ్, ఇలా...). ఇవన్నీ కూడా ఇందులోని మధుర నాదానికి కారణమయ్యుండవచ్చు.
అవి శారద రాత్రులు. ఉజ్వలంగా ప్రకాశించే తారహారాలతో అందగించిన రాత్రులు. అప్పుడే వికసిస్తున్న తెల్లకలువల పుప్పొడి దట్టంగా అలుముకున్న తెమ్మెర కమ్మదనం నిండిన రాత్రులు. కప్పురపు తావిలా తెల్లగా అంతటా పరచుకున్న అమృతాంశుని (చంద్రుని) వెన్నెలతో పరిపూర్ణమవుతున్న రాత్రులు. వెన్నెల తెల్లగా చల్లగా ఉంటుంది కర్పూరంలాగా. మరి కర్పూరపు సువాసన వెన్నెల కెక్కడిది? కలువపూల పుప్పొడి నిండిన వెన్నెల కాబట్టి దానికా సుగంధం కూడా అబ్బింది!
ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళకే యిలాంటి రాత్రులలోని మధురిమ అనుభవానికి వస్తుంది.
ఈ "శారద రాత్రులు..." అన్న పద్యానికి ముందు యింకొక పద్యం ఉంది. అది శరదాగమనాన్ని వర్ణించే పద్యం. అదొక పరమాద్భుతమైన పద్యం:
భూసతికిన్ దివంబునకు బొల్పెసగంగ శరత్సమాగమం
బా సకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో
పాసిత రాజహంసగతి భాసి(తి) ప్రసన్న సరస్వతీక మ
బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై
దీనికి అర్థం చెప్పడం చిన్నపని కాదు.
భూదేవికి స్వర్గానికీ శరత్కాలంలో అందమైన కలయిక జరిగింది (లేదా భూమ్యాకాశాల రెంటితోనూ శరత్తు కలిసింది). ఆ కలయిక సర్వానందకారియై (ప్రమోదము అంటే సుగంధము అనికూడా అర్థం వస్తుంది) విలసిల్లినది. అది ఎలా ఉంది? మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతోంది. లేదా, మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంస నడకలా ఉంది. ప్రసన్న సరస్వతితోను, అబ్జాసనుడైన బ్రహ్మతోను శోభిస్తున్న బ్రహ్మ వాహనమైన హంసలాగా ఉంది. లేదా, మహర్షి మండలము చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతున్న ప్రసన్న సరస్వతితోను, బ్రహ్మతోను శోభిస్తున్న హంసలాగా ఉంది.
దీని గురించి వి.వి.ఎల్. నరసింహారావు గారు తన "నన్నయ్య కవిత్వము - అక్షరరమ్యత" అనే పుస్తకంలో యిలా వివరించారు:
---
శరత్సమాగమ విలాసము షడ్విధముగా భావింపబడినది.
1. భూసతికిని దివంబునకును పొలుపు గూర్చుట. ఇది నేలకు నింగికి అందమగు సంబంధము గూర్చుట.
2. ప్రసన్న సరస్వతీకమై ఉండుట. వానకాలపు వరదల ఉరవడివలని బురద అడగిపోగా కలతదేరి సరస్వతి (నది) సుప్రసన్నముగా నుండుట.
3. సరస్వతి మహర్షిమండలోపాసిత యగుట. తీర్థ సంసేవన వ్యాజమున మహర్షులు సరస్వతిని శరత్తులో నుపాసించుట.
4. సరస్వతి రాజహంసగతి భాసిని యగుట. సరస్వతీ నది యందు రాయంచ లందముగా నడచుట యని భావము. ప్రసన్నమగు కవితా సరస్వతి రాజహంస గమనము కలది యనియు భావము.
5. అబ్జాసన శోభితంబగుట. అబ్జాసనుడనగా బ్రహ్మ. ప్రసన్న సరస్వతీకమగు శరత్తు బ్రహ్మమయముగా నుండె ననుట.
6. శరదాగమము అబ్జజుయానముతో సమానముగా నుండెను. యానమనగా గజాది వాహనమనియు నర్థము. అబ్జజు యాన మనగా బ్రహ్మవాహనమగు దివ్య హంస మనియు నర్థము. బ్రహ్మ సంచారము గలది యగుటయే కాక శరదాగమము దివ్య హంసముతో సమానముగ ఉన్నదనియు భావము.
తత్త్వమరసి చూడ బ్రహ్మాధీన గతియైన సరస్వతీ తత్త్వము యిందు లక్షింపబడినట్లు దోచును. ఇది మహర్షి మండలోపాసితమైన తత్త్వము. ఈ తత్త్వము సుదూర మన్వేషింప దగినది.
---
పైనిచ్చిన రెండు పద్యాల గురించీ, దానికి ముందరి పద్యాల గురించీ మోహన రావుగారు ఈమాటలో వ్రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.
ప్రకృతి పరంగా చూస్తే, శరత్కాలంలో మేఘాలు తొలగి, ఆకాశం నిర్మలంగా మారుతుంది. దానితో నక్షత్రాలూ చంద్రుడూ చక్కగా ఆకాశంలో ప్రకాశిస్తాయి (రాజహంస - రాజు అనే హంస = చంద్రుడనే హంస అనికూడా అర్థం స్ఫురిస్తుంది). నదులు వరద ఒత్తిడి తగ్గి, తేటబారి ప్రసన్నంగా ఉంటాయి. అందులో కలువపూలు (అబ్జము అంటే కలువపూవని కూడా అర్థం వస్తుంది) బాగా వికసిస్తూ కనిపిస్తాయి. హంసలు మానస సరోవరాన్ని చేరుకొనేది కూడా యీ శరత్తులోనే (పక్షుల వలస). మొత్తమంతా తెల్లని వెన్నెలతో నిండిపోయి ఉంటుంది.
ఈ చిత్రమంతా మనకి యీ పద్యంలో కనిపిస్తుంది. ప్రకృతి వర్ణన చేస్తూనే అంతర్గతంగా ఆధ్యాత్మిక చింతన చెయ్యడం మహర్షులైన మన కవులకి సొంతం. మన సనాతన ధర్మంలో కనిపించేది ప్రకృతి ఆరాధనే. ప్రకృతిని తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని దాని విధ్వంసానికి ఒడిగట్టే వాళ్ళని రాక్షసులన్నారు. మన కాలమానం ప్రకృతికిని అనుసరించి వెళ్ళేది. మన పండగలు మనలని ప్రకృతితో కలిపే సాధనాలు!
ఈ శరదృతువులో, అంటే వచ్చే రెండు నెలలూ వీలైనంత వెన్నెల నా బ్లాగునిండా నింపాలని ఒక ఆలోచన. వీలు చిక్కినప్పుడల్లా, మన కావ్యాలలో శరత్కాలానికి, చంద్రునికి, వెన్నెలకీ సంబంధించిన అందమైన వర్ణనలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
మీరు కూడా మీ మీ బ్లాగుల్లో ఆ పని చెయ్యవచ్చు. అంత కన్నా ముఖ్యంగా, ఈ రెండు నెలల్లో వచ్చే రెండు పున్నములలో కనీసం ఒక్క రోజు, ఆ పున్నమి జాబిలి వెండి వెలుగులని మనసారా ఆస్వాదించడం మాత్రం మరవద్దు.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Saturday, September 19, 2009
శారద రాత్రులు
Subscribe to:
Post Comments (Atom)
శారద రాత్రి సత్కవి విశాల శరన్నవరాత్రి. సత్కృతుల్
ReplyDeleteచేరగ, చేయగా తగిన శ్రీకర భావ పరంపరావృతం
బై రహిగొల్పు.నిక్కము.శుభైక గుణావహమైనదయ్య. మీ
తీరుపు చక్కనయ్య. వినుతింపగఁ దెల్పిరి, సత్కవీశ్వరా!
వెన్నెలంటే ఇష్టం లేనివారుండరేమో అనిపిస్తూ ఉంటుందండి..బాగా రాసారు. ఇవాళ పొద్దున్నే నేను కూడా "శరన్నవరాత్రులు" అని టపా పెట్టానండి.వీలైతే చూడండి.. http://trishnaventa.blogspot.com/2009/09/blog-post_19.html
ReplyDeleteఎంచేతో ఆ పై వ్యాఖ్య అలా గేప్స్ తో వచ్చిందండి..
ReplyDeleteఈ పద్యం గురించి మీరంతట మీరు రాస్తే చదవాలని చాలా కాలంగా ఎదురుచూశాను. అద్భుతంగా రాశారని మళ్ళీ చెప్పనక్కరలేదు.
ReplyDeleteఈ పద్యం మనసులో చదువుకుంటున్నప్పుడు - ఎలా ధ్వనిస్తుందంటే - ఓ పడవ వాడు పడవ నడిపేటప్పుడు మొదట తెడ్డు వేస్తాడు. పడవ కాస్త ముందుకు సాగుతుంది. తర్వాత మళ్ళీ తెడ్డు వేస్తాడు. మొదటి సారి వేసే తెడ్డుకు, ఆ తర్వాత వేసే తెడ్డుకు మధ్య సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తెడ్డు బలాన్ని బట్టి, నది వాలును బట్టి మారుతుంది.
తెడ్డు వేయటాన్ని ఊనిక, ఓ సపోర్టు అనుకుంటే - మొదటి పాదంలో "జ్జ్వ", "త్త" , "క్తు"..ఇవి తెడ్లు. మధ్యలో సాగినది పడవ ప్రయాణం. ఆ అక్షర రమ్యత కూడా - నదిలో పడవ ప్రయాణంలా హాయిగా ఉంది. నాకు కలిగిన అనుభూతి ఇది.
ఈ సారి ఎప్పుడైనా పడవలో వెళుతున్నప్పుడు, ఈ పద్యం చదువుకుంటూ సరిచూసుకోవాలి.
శరన్నవరాత్రీకౌముదివికసితసౌరభమలయమారుతవీచికల కోసం ఎదురుచూస్తాను.
కామేశ్వర్రావుగారూ, మీరు ఈ బ్లాగు మొదలు పెట్టిన వేళ ఎంతో శుభదినం. అంతకంటే చెప్పలేను.
ReplyDeleteరామకృష్ణారావుగారు, ధన్యవాదాలు.
ReplyDeleteతృష్ణగారు, మీ శరన్నవరాత్రుల విశేషాలు బాగున్నాయి. మీకు దసరా శుభాకాంక్షలు.
రవిగారు, పున్నమి వెన్నెల్లో నౌకా విహారం ఎప్పుడైనా చేసారా? అదో గొప్ప అనుభూతి!
కొత్తపాళీగారు, అమ్మో చాలా పెద్ద కాంప్లిమెంటు ఇచ్చేసారండీ! నెనరులు.
Sarada ratrulu gurinchi entha adbhuthamga rasarandi.. vennello viharisthunnattu ga vundi suma..
ReplyDeleteThank you
ReplyDelete