తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, October 25, 2009

ఛందస్సుకి పురస్కారం

భాషా సంబంధమైన విషయాలలో విశేషమైన కృషి చేసినవారికి ప్రతి ఏడు సి.పి.బ్రౌన్ పేరు మీద శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారు పురస్కారాన్ని ఇస్తున్నారు, 2007 సంవత్సరం నుంచీ అనుకుంటాను. ఈ ఏడాదికి ఈ అవార్డు శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు గారికి, ఛందస్సులో వారు చేసిన, చేస్తున్న కృషికి గాను ఇస్తున్నారని మొన్ననే తెలిసింది.

ఈ వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. మూడు రకాలుగా సంతోషం (త్రిగుణీకృతం అన్నమాట!). నాకిష్టమైన అంశం ఛందస్సు గురించి చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వడం ఒకటి. నేనెంతో గౌరవించే సహృదయులు మోహనగారికి రావడం రెండు. భాషాశాస్త్రంలో ప్రత్యేకమైన డిగ్రీలు లేని ఔత్సాహికునికి గుర్తింపు రావడం మూడు. ఇది ఔత్సాహికులందరికీ ఎంతో ప్రోత్సాహకరం.

ఈమాట పాఠకులకి, రచ్చబండ ఛందస్సు గ్రూపులలో ఉన్నవాళ్ళకి మోహన రావుగారు పరిచితులే అయ్యుంటారు. నాకు తెలిసి, సుమారు పదేళ్ళుగా మోహన రావుగారు ఛందస్సు గురించి అనేక విశేషాలని ఈ గ్రూపులలో పంచుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవాటిలో కొన్ని:

1. ఎన్నో కొత్త కొత్త వృత్తాలని పరిచయం చెయ్యడం. ఒక వృత్తానికి ప్రతి పాదంలోనూ నియతమైన అక్షర సంఖ్య, గురులఘు క్రమం ఉంటాయి. గురు లఘు క్రమంలో చూపగలిగే వైవిధ్యం వల్ల, కొన్ని వేల వృత్తాలు ఏర్పడతాయి. అలాంటి వృత్తాలలో చాలా కొన్ని వాటిని మన పూర్వకవులు విరివిగా వాడారు. అంత విరివిగా వాడని వృత్తాలు కొన్నైతే, అసలు వాడనివి చాలా ఉన్నాయి. అలా విరివిగా వాడని వృత్తాలని, అసలు వాడని వృత్తాలని (కొత్తగా పేర్లు పెట్టి) ఎన్నిటినో వారు సోదాహరణంగా పరిచయం చేసారు. వృత్తాలే కాక, అనేక ఉపజాతి పద్యాలు, రగడలు పరిచయం చేసారు.

2. గర్భ బంధ కవిత్వాలలో విశేషమైన కృషి చేసారు. ఏ ఛందస్సులో ఎలాంటి గర్భ కవిత్వం సాధ్యమవుతుందో గణిత శాస్త్రాధారంగా నిరూపించారు. దీనికోసం వీరు చందన అనే సాఫ్ట్వేరుని కూడా తయారు చేసారు.

3. ఛందోమృతబిందువులు అనే శీర్షికతో ఛందస్సులోని విశేషాలని ఎన్నిటినో చిన్న చిన్న పాయింట్లుగా అందించారు.

4. మోహన రావుగారి మాతృభాష కన్నడం! అది చాలా ఏళ్ళు నాకు తెలియదు. వారికి కన్నడ తెలుగు భాషలలో ఉన్న గొప్ప ప్రావీణ్యం వలన, కన్నడ తెలుగు భాషల్లోని ఛందస్సులని తులనాత్మకంగా పరిశీలిస్తూ చక్కని పరిశోధన చేసారు.

5. అన్నిటికన్నా ప్రత్యేకించి చెప్పుకోవలసినది నన్నెచోడుడు కుమారసంభవంలో ఉపయోగించిన ఛందస్సు ఆధారంగా నన్నెచోడుని కాల నిర్ణయం గురించి చేసిన ప్రతిపాదనలు. ఇది ఈమాటలో చదవవచ్చు.

ఛందస్సు మాత్రమే కాక, వీరికి ప్రాచీన శాసనాలు, కావ్యాల గురించి మంచి పరిజ్ఞానం, తెలుగు కన్నడ తమిళ భాషలలో చక్కని ప్రావీణ్యం ఉన్నాయి. వీరి రచనలు ఈ-గ్రూపులలోనూ ఈమాటలోనూ (బహుశా మరికొన్ని అమెరికా పత్రికలలోనూ) తప్ప ఇంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవాళ్ళందరికీ చాలా విలువైనది అవుతుందనడంలో సందేహం లేదు.

మోహనగారికి నాకూ కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నా (వ్యావహారిక భాషలో పద్యాలు వగైరా విషయాలలో) అవి మా ఆత్మీయతకి ఎప్పుడూ అడ్డు రాలేదు. ఎవ్వరినీ ఎప్పుడూ నొప్పించ కూడదనుకునే స్వభావం వారిది. వృత్తి రీత్యా Biologist అయినా, మాతృభాష కన్నడమైనా, తెలుగు భాషా సాహిత్యాలపై వారికున్న విశేష అధికారం, అభిమానం అమోఘమైనవి. సి.పి.బ్రౌన్ పురస్కారం వీరి కృషికి తగిన గుర్తింపు. ఈ సందర్భంగా వారికి నా బ్లాగు ముఖంగా శుభాకాంక్షలు!

4 comments:

  1. జెజ్జాల వారి వ్యాసాలు ఈమాటలో వదలకుండా చదివే ఆయన అభిమానిని నేను. ఆయన బహుముఖ ప్రజ్ఞను గురించి ఇప్పుడే తెలుస్తున్నది, మీరు రాసిన టపా వలన. ఆయన గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

    ఆయనకు హార్దిక శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. Thanks for the interesting information.

    ~sUryuDu

    ReplyDelete
  3. బెజ్జాల గారికి శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. అనుష్టుప్ లో పాదం చివర గురువుంటుందన్నారు.
    తపస్స్వాధ్యాయనిరతం (బాలరామాయణం) మొదలు గా గల శ్లోకాల్లో అలా లేదే!

    ReplyDelete