తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, November 4, 2009

ఛందస్సుతో నడక - 1

ఒకోసారి ఏదైనా పాట వింటున్నప్పుడు హఠాత్తుగా మరో పాత పాట గుర్తుకొస్తుంది. "అరే! ఇది దానిలాగానే ఉందే" అనిపిస్తూ ఉంటుంది. కొందరికిలా సర్వధారాణంగా జరిగితే చాలామందికి ఎప్పుడో కాని ఇలా జరగదు. ఇది ఒక రకమైన రాగ జ్ఞానం. ఒకే రాగంలో ఉన్న రెండు పాటల మధ్యనున్న పోలికని గుర్తుపట్టే సామర్థ్యం ఇది. సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ రాగమేమిటో కూడా గుర్తుపడతారు. ఇలాంటి సామర్థ్యాన్నే సాంకేతికంగా Pattern recognition అంటాం. అచ్చ తెలుగులో చెప్పాలంటే నమూనాలని ఆనవాలు పట్టడమన్నమాట. ఒకటే నమూనానుంచి ఏర్పడిన రకరకాల మూర్తులని ఒకే నమూనాకి చెందినవిగా గుర్తుపట్టడం. మనిషి మెదడుకి ఈ శక్తి అమోఘంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటే, ఆ తర్వాత ఆ అక్షరాలని ఎన్ని రకాలుగా (రంగులు, ఫాంట్లు, టైప్ సెట్లు) ముద్రించినా, మరీ డాక్టరు దస్తూరీలా కాకుండా కాస్తో కూస్తో అర్థమయ్యేట్టు ఎంతమంది చేత్తో వ్రాసినా మనం గుర్తుపట్టగలం! ఇది నమూనాల ఆనవాలే కదా. ఇదే ఒక కంప్యూటరుతో చేయించాలంటే తల ప్రాణం తోక్కి వస్తుంది!

పాటలలో రాగాలని గుర్తుపట్టినట్టుగానే పద్యాలలో ఛందస్సుని గుర్తుపట్టవచ్చు. అంటే ఒక పద్యాన్ని చదవగానే లేదా వినగానే అదే ఛందస్సులో మనకి బాగా తెలిసిన ఇతర పద్యాలు గుర్తుకు రావడమన్నమాట. ఉదాహరణకి:

కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద

అని మూడు పాదాలు చెప్పగానే, వేమన పద్యాలు చదువుకున్న ఎవరైనా నాల్గవ పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అని పూరిస్తారు. ఈ పద్యాన్ని చదవగానే మనకి వేమన పద్యాలు గుర్తుకొస్తాయి. ఈ పద్యం అలాగే ఉందన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అది ఆటవెలది ఛందస్సు అని కాని, ఆ ఛందస్సు స్వరూపం కాని తెలియాల్సిన అవసరం లేదు. అలాగే మరో ఉదాహరణ:

పిల్లులు పిల్లలు బెట్టును
నల్లను త్రావెడి కతాన నల్లి యనబడెన్
అల్లురు దశమోగ్రహములు
వెల్లుల్లికి తీపి లేదు ...

అని ఆపగానే, వినరా సుమతీ అని పూర్తి చెయ్యడానికి కంద ఛందస్సు తెలియాల్సిన పనిలేదు. ఇదెలా సాధ్యం?! వేమన, సుమతీ శతకాలు కంఠస్థం చేసిన వాళ్ళకి ఆయా ఛందస్సుల నమూనాలు మెదడులో ముద్రపడి ఉంటాయి. ఈ పద్యాలని చూడగానే మెదడు గుర్తుపట్టేస్తుంది!

ఇప్పుడు మరో పద్యం చూద్దాం:

సిరి గల నాడు మైమరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్
పొరి పొరి చేయనైతి నని పొక్కిన గల్గునె? గాలి చిచ్చు పై
కెరలిన వేళ, డప్పి గొని కీడ్పడు వేళ, జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె? ...

దీన్ని పూరించాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది, యీ శతకాన్ని ఇంతకుముందు చదివిన వాళ్ళకి కూడా. అంటే ముందు ఉదాహరణలతో పోలిస్తే, ఇక్కడున్న నమూనని గుర్తుపట్టడానికి కొంత పరిశ్రమ అవసరమవుతోంది. ఎందుకు? ఒక కారణం - ఈ శతకం వేమన, సుమతీ శతకాలంత ప్రాచుర్యం పొందకపోవడం అనుకోవచ్చు. కాని అదొక్కటే కారణం కాదు. వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం.

ఇప్పుడు ఇంకొక పద్యం:

నీ మనసు తెలుసుకొని నడచుకొనెద నేను, చెలి! నిజము నే మునుపటి నీ ప్రియుడను గాను, నమ్ముమో ప్రేయసీ! కలిసిమెలిసి గడిపెదము జీవితమును

ఇది నేను పద్యంలాగా నాలుగు పాదాలు విడగొట్టి ఇవ్వలేదు (ఇచ్చినా కస్ఠమే అనుకోండి!). ఇందులో ఛందస్సుని కనుక్కోండి చూద్దాం! మీ జుట్టు కాస్త మీ చేతిలోకి వస్తే నా పూచీ కాదు సుమా :-) పై పద్యాలలో ఛందస్సు అంత సులువుగా తెలిసిందే మరి ఇదెందుకు ఇంత కష్టం?

ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెడదాం. కొత్తగా ఏదో నేను కనిపెట్టి చెప్పబోవటం లేదు. మనందరికీ తెలుసున్న విషయాలే, కాని అంతగా గుర్తించని విషయాలు.

ఛందస్సు వేద పురుషుడి పాదాలని చెప్పబడింది. అంటే ఛందస్సు పద్యాలకి నడకనిస్తాయన్న మాట. నాకు సంగీతం పెద్దగా తెలీదుకాని, పాటకి తాళం ఏమి చేస్తుందో, కాస్త అటు ఇటుగా పద్యానికి ఛందస్సు అదే చేస్తుందనుకుంటాను. ఒక వాక్యాన్ని లేదా వాక్య సముదాయాన్ని పలికేటప్పుడు, అందులోని ప్రతి అక్షరం పకలడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది. ఆ ప్రత్యేక క్రమమే ఛందస్సు. అందుకే ఛందస్సు పద్యం నడిచే తీరుని నిర్దేశిస్తుంది.

అర్థమయ్యీ అవ్వనట్టు ఉందా? ఇప్పుడే కదా నడక మొదలుపెట్టాం. మెల్లిగా అన్నీ అవే అర్థమవుతాయి. వచ్చే టపాలో దీని గురించి మరింత వివరిస్తాను. ప్రస్తుతానికి ఒక చిన్న క్విజ్:

ఈ మధ్యనే మొదలుపెట్టిన ఒక పుస్తకంలో ఈ కిందనిచ్చిన శ్లోకాలు చదువుతూ ఉన్నాను. ఇలాంటి శ్లోకాలు ఎక్కడో విన్నానే అని అనిపించింది. ఒక అయిదు నిమిషాల తర్వాత తట్టింది. వీటిలాగే ఉండే ఆ మరో శ్లోకాలు బాగా తెలుసున్నవే! తెలుగువాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు తప్పక వినే ఉంటారు. నేను చదివిన శ్లోకాలలో ఒక రెండు:

సత్యం న మే విభవనాశకృతాస్తి చింతా
భాగ్యక్రమేణ హి ధనాని భవంతి యాంతి
ఏతత్తు మాం దహతి నష్ట ధనాశ్రయస్య
యత్ సౌహృదాదపి జనాః శిథిలీ భవంతి

కిం త్వం భయేన పరివర్తిత సౌకుమార్యా
నృత్యప్రయోగ విశదౌ చరణౌ క్షిపంతీ
ఉద్విగ్న చంచల కటాక్ష విసృష్ట దృష్టిః
వ్యాధానుసార చకితా హరిణీవ యాసి

ఈ శ్లోకాల నమూనాతో ఉన్న మరో ప్రసిద్ధ శ్లోకాలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!

21 comments:

  1. ప్చ్.. తెలీటం లేదు :(

    కమలాకుచ చూచుక ... ? :P

    ReplyDelete
  2. వయసు కాస్త ఎక్కువై, జ్ఞాపక శక్తి తగ్గింది కానీ, లేకపోతే ఇట్టే పట్టేసి ఉందును. ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. :-)

    అయితే మొదటి శ్లోకం చివర్లో - శిథిలీ భవంతి అని చూడగానే కుమార సంభవం లో ఓ శ్లోకం గుర్తొచ్చింది.

    కపోల కణ్డూః కరిభిర్వినేత్తుం
    విఘట్టితానాం సరళ ద్రుమాణాం
    యత్ర శ్రుత క్షీరతయా ప్రసూతం
    సానూని గంధః సురభీ కరోతి.

    (మదపుటేనుగులు తమ కపోలాలను దేవదారు వృక్షాలకేసి రుద్దుకోవడం ద్వారా, వాటి మదజలం, వృక్షాల నుండీ కారిన పాలతో కలిసి, ఆ హిమవత్పర్వత సానువులను పరిమళభరితం చేస్తున్నాయి)

    ReplyDelete
  3. RK, దగ్గరగానే వచ్చారు! :-)
    రవి, శ్లోకాలని చిన్న రాగమిచ్చి ఒకటి రెండుసార్లు చదివితే గుర్తుకొస్తుందేమో, ప్రయత్నించండి :-)

    ReplyDelete
  4. శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపథ్యే

    ReplyDelete
  5. చాలా బాగుంది. ఓపికతో, ఒంటిచేత్తో ఇట్లాంటి బ్లాగు నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు.

    గుర్తుకొచ్చినవి-

    అత్ర్యాది సప్తఋషయస్సముపాస్య సంధ్యా
    ఆకాశసింధు కమలాని మనోహరాణి
    ఆదాయపాదయుగ మర్చయితుం ప్రసన్నా
    శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం

    పంచాననాభ్జ భవ షణ్ముఖ వాసవాద్యా
    త్రైవిక్రమాది చరితం విభుధాః స్తువంతి
    భాషాపతిః పఠతి వాసరశుద్దిమారాత్
    శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతం

    "సౌకుమార్యా" వినగానే "కాంతావవాజ్ఞానస గోచర సౌకుమార్యౌ" లాగా అనిపిస్తుంది.
    ---
    విధేయుడు
    శ్రీనివాస్

    ReplyDelete
  6. ఆ.వె
    నీ మనసు తెలుసు కొని నడచుకొనెద నే
    ను చెలి! నిజము నే మునుపటి నీ ప్రి
    యుడను గాను, నమ్ముమో ప్రేయసీ! కలి
    సి మెలిసి గడిపెదము జీవితమును

    ReplyDelete
  7. శ్రీనివాస్ గారు, చదువరి గారు,
    సరిగ్గా గుర్తుపట్టేసారు! అభినందనలు. వేంకటేశ్వర సుప్రభాతంలోని శ్లోకాలు. ఈ ఛందస్సు పేరు వసంతతిలకం.

    చదువరిగారు,
    మీకు మళ్ళీ అభినందనలు. గద్యంలో దాక్కొన్న పద్యాన్ని బాగా వెలికి తీసారు!

    ReplyDelete
  8. చాలా మంచి టపా! సుప్రభాతం బాణీలో చదువుతుంటే మీరు ఉదహరించిన పద్యాలకు కూడా ఒక కొత్త అందం వచ్చినట్లుంది.
    "జలంబుగోరి తత్తరమున ద్రవ్వినం గలదె?..." తప్పక గుర్తుకు వచ్చె భాస్కరా :-)

    ReplyDelete
  9. బ్లాగు చాలా బాగుంది, మీ క్విజ్ కి జవాబు తెలుసుకోలేకపోయినా మీరు చెప్పాక కాస్త అర్థమయింది! తరువాతి భాగం కోసం అదురు చూసున్నాను ..

    శ్రీనాధ్

    ReplyDelete
  10. చదువరి, శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత గుర్తొచ్చిందేమిటబ్బా నాకు? సుప్రభాతం మర్చిపోయి చాలా కాలం అయింది, పైగా వయసు పైబడింది కాబట్టి క్షమించేసేసుకుంటాను.

    అభినందనలు.

    కొత్త ఛందస్సు పేరు వింటున్నాను.

    ReplyDelete
  11. శ్రీనథ్ గారు, చంద్రమోహన్ గారు, ధన్యవాదాలు.

    చంద్రమోహన్ గారు, "తప్పున వేసిరి కాలు ధీనిధీ" :-) సగం సరిగానే గుర్తుపట్టారు. భాస్కర శతకంలో కూడా ఇదే ఛందస్సులో పద్యాలు వస్తాయి. కాని భాస్కర శతకంలో పద్యమైతే "భాస్కరా" అన్న పదం ముందువరకూ పద్యాన్ని ఇచ్చేవాడిని కదా!

    ReplyDelete
  12. naa mattiburraku ilantivi assalu arthamkaavandi...

    ReplyDelete
  13. ఎందుకో మా రామన్న కి సంబంధించిందేమో అని అనిపిస్తోంది...

    దాశరధీ కరుణా పయోనిధీ !!

    సనత్

    ReplyDelete
  14. ఆంగం హరే పులక భూషణ మాస్రయంతీ
    భృంగాంగ నేవ ముకులాభరణం తమాలం
    ఆంగీకృతాఖిల విభూతిరపంగ లీలా
    మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయ

    ReplyDelete
    Replies
    1. idi Kanakadhaaraa Stotram kaadu...
      Mughda muhurvidadathi muraare prema trapa prana hitaani drismormadhukareeva......

      Delete
  15. కార్తిక్ గారు, ఇలాటివి అర్థం కానంత మాత్రాన మీది మట్టిబుఱ్ఱ అనుకోనక్కరలేదండి :-) ఆసక్తి ఉంటే కాస్త ప్రయత్నించండి, మరీ కష్టం కాదు.

    సనత్ గారు, మీరూ వేసుకోండి ఒక వీరతాడు :-)

    అనానిమస్ గారు, మీరిచ్చిన శ్లోకమూ వసంతతిలకమే. మీకూ ఒక వీరతాడు! ఈ శ్లోకాలు కూడా సుబ్బలక్ష్మిగారి గొంతులో అద్భుతంగా ఉంటాయి!

    ReplyDelete
  16. ఆటవెలది చాలా తేలికగానే తెలిసిపోతుందిలెండి.

    ఆ సంస్కృత శ్లోకాలు కాస్త భయానకంగా వుండే సరికి గుర్తుపట్టలేదు.
    అప్పటికీ తత్తంత తాం తతత తాతత తత్త తత్తా అని చాలా సేపు పాడాను. :)

    కానీ క్రిందికి స్కోరోలు చేస్తుంటే, సుప్రభాతం అని చూడగానే.
    వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
    అన్న చరణం ఒక్కసారిగా తట్టింది.

    చాలా బాగుంది మీరు చేయిస్తున్న కసరత్తు. మొన్న భగ్యనగరంలో రాఘవని కలిస్తే ఈ ఆటవెలది గుఱించే చెప్పాడు. ఆటవెలది అని చెప్పలేదు కానీ పద్యాన్ని వాక్యంగా వ్రాసారు గుర్తుపట్టండి అని చెప్పాడు. నాకూ నరసింహం గారికీ.

    ReplyDelete
  17. యతి స్థానాలు తెలిస్తే గుర్తుపట్టడాలు ఇంకా తేలికవుతుందనుకుంట.

    ReplyDelete
  18. రాకేశ్వర గారు,

    ఆటవెలది చాలా కష్టపడి చీల్చి చీల్చి చెండాడి తయారు చేసాననుకున్నానే, తేలికగా తెలిసిపోయిందా! ఒకో అక్షరానికి గురువు లఘువు పెట్టుకుంటూ వెళ్ళకుండానే తెలిసిపోయిందా?

    సంస్కృతంలో యతి ఉన్నది పద్యాన్ని సులువుగా గుర్తుపట్టడానికే! దాన్ని వివరించే ప్రయత్నం తదుపరి టపాల్లో చేస్తాను.

    ReplyDelete
  19. టపా చాలా బాగుంది. కానీ సమాధానాలు చెప్పలేను. అంత పాండిత్యం నాకు లేదు.

    ReplyDelete
  20. మీరు చదువుతున్న పుస్తకం నేను నిన్న ఇక్కడ పుస్తక ప్రదర్శనలో కొన్నాను, చదువుతున్నాను. మీరు ఉటంకించిన శ్లోకం, ఆ పుస్తకంలో చూసి ఇక్కడికొచ్చాను. నాకు ఓ సినిమా, కథనం నడిపిన తీరు, మెలోడ్రామా ఇవన్నీ గుర్తొస్తున్నాయి.వీలు కుదిరితే ఆసాంతం చదివిన తర్వాత నా బ్లాగులో రాస్తాను.

    ReplyDelete