మళ్ళీ నడక కొనసాగించే ముందు వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని ఒకసారి చూసుకుందాం. క్రిందటి మారు ఒక పద్య నిర్వచనాన్ని/ఛందస్సుని/నమూనాని (ఈ మూడూ ఒకటే) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. అలాగే పద్య నిర్మాణాన్ని (అంటే ఒక పద్య పాదాన్ని) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. ఒకే చందస్సులో ఉండే వివిధ పద్యాల గ్రాఫుల్లో తేడాలు ఎలా వస్తాయో గుర్తించాము. ఈ తేడాకి, పద్య పాదంలో ఉండే పదాల విభజన ప్రధాన కారణమని తెలుసుకున్నాము. గ్రాఫులో x-axisలో అక్షరాలని, y-axisలో గురు లఘువుల విలువలని తిసుకున్నాము. పదాల మధ్య వచ్చే విరామాన్ని కూడా ఒక అక్షరంగా పరిగణించి దానికి 1 విలువ ఇచ్చాము.
ఇప్పటి దాకా చేసిందీ చూసిందీ ఇది. వచ్చే టపాలో తెలుగు ఛందస్సులని గ్రాఫుల్లో గీసే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. కాని దానికింకా సమయం ఉంది. అంతకన్నా ముందు మరొక విషయాన్ని తెలుసుకోవాలి. క్రిందటిసారి రెండు పాటలని "తనన" భాషలో ఇచ్చి కనుక్కోండి చూద్దామన్నాను కదా. దాని వెనక ఒక కారణం ఉంది. అందులో మొదటి పాట రెండవ పాట కన్నా కనుక్కోడం సులువని నా ఆలోచన. రవి రాకేశ్వరుల ప్రయత్నాలు నా ఆలోచనని ఒక రకంగా నిరూపించాయనే అనుకుంటున్నాను. ఎందుకో మనం సులువుగానే ఊహించవచ్చు. అదేమిటంటే, మొదటి పాటలో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లయ ఉంది. అంటే? "తనన" అనేది మొదటి పాదంలో నాలుగు మార్లు వస్తోంది. అలాగే మొదటి రెండు పాదాలు ఒకటే "తనన"లు. మూడు నాలుగు పాదాల్లో కూడా ఇలాంటి సామ్యమే ఉంది. ఇది ఆ పాటకి ప్రస్ఫుటంగా కనిపించే ఒక నడకని ఇస్తోందన్న మాట. అలాంటి నడకని గుర్తించడం సులభం. అదే రెండో పాటలో అలా మళ్ళీ మళ్ళీ ఒకేలాగ వచ్చే "తనన"లు లేవు. అందువల్ల దానికి చదవగానే గుర్తుపట్ట గలిగేటంత ప్రత్యేకమైన నడక లేదు.
సరే, దీనికీ ఛందస్సుకీ ఏమిటి సంబంధం? అంటే, పాటల్లో లాగానే ఇలాంటి తేడాలు పద్యాలలో కూడా ఉన్నాయి! ఉదాహరణకి ఈ క్రింద "లయగ్రాహి", "మత్తకోకిల" అన్న రెండు ఛందస్సులకి (రెండూ వృత్తాలే) గ్రాఫులు ఇస్తున్నాను. లయగ్రాహి గురించి రాకేశ్వరగారు తన బ్లాగులో వివరంగా వ్రాసారు.
ఇప్పుడు ఈ గ్రాఫులని కిందటి టపాలో ఉన్న ఉత్పలమాల గ్రాఫుతో పోల్చి చూడండి. వృత్యనుప్రాసలో మళ్ళీ మళ్ళీ ఒకే అక్షరాలు వచ్చినట్టుగా, ఇక్కడ (లయగ్రాహి, మత్తకోకిల వృత్తాలలో) ఒకే గురు లఘు క్రమం మళ్ళీ మళ్ళీ వస్తోంది కదా. ఇలాంటి repetitive pattern మనకి ఉత్పలమాలలో కనిపించదు.
ఇప్పుడు మత్తకోకిలలో ఉన్న ఈ రెండు పాదాలు, వాటికి సంబంధించిన గ్రాఫులు పరిశీలించండి:
నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో
నా మనస్సు వ్యథన్ భరింపగ జాలకుండె క్షమింపవే
మొదటి ఉదాహరణలో ఛందస్సు నిర్వచనంలో ఉన్న repetitive patternని సరిగ్గా అనుసరించి పద్యం నడిచింది. అంటే అందులో పదాలు సరిగ్గా ఆ patternకి తగ్గట్టు ఉన్నాయి. రెండో ఉదాహరణలో అలా జరగడం లేదు. అవునా. అయినా రెండో ఉదాహరణని రెండు మూడు సార్లు చదివి చూడండ్ది. అది మత్తకోకిల నడకలోనే ఉందని సులువుగానే గ్రహించ గలుగుతారు. రెండు గ్రాఫులు చూసినా వాటి మధ్య పోలికలు బాగానే కనిపిస్తాయి (ముఖ్యంగా దీన్ని ఉత్పలమాల, దాని ఉదాహరణలతో పోల్చి చూస్తే తేడా బాగా తెలుస్తుంది). Pattern Recognitionతో కొంత పరిచయం ఉన్నవాళ్ళకి, repetitive patterns ఉన్నప్పుడు వాటిని గుర్తుపట్టడం సులువన్న విషయం తెలిసే ఉంటుంది.
అంతే కాదు, repetitive pattern ఛందస్సుకి ఒక ప్రత్యేకమైన నడకని ఇస్తుంది. ఆ ఛందస్సులో పద్యాలని అలాంటి నడకతో రాయడమే సాధ్యమవుతుంది! ఎంత విరగ్గొట్టి రాద్దామనుకున్నా ఇంచుమించు ఆ నడక వచ్చే తీరుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన నడక లేని ఉత్పలమాల లాంటి పద్యాలకి రకరకాల నడకలు వస్తాయి. అంటే నడక పరంగా చూస్తే, మత్తకోకిల లయగ్రాహి లాంటి వృత్తాలు చాలా rigid వృత్తాలన్న మాట. వీటిని nonelastic ఛందస్సు అని పిలవవచ్చు. ఛందస్సుకి ఎలాస్టిసిటీ అన్న విషయాన్ని శ్రీశ్రీ ఒకచోట ప్రస్తావించారు. కానీ దాని గురించి ఎక్కడా వివరించినట్టు లేదు. ఉత్పలమాలలాంటి వృత్తాలు పూర్తి elastic వృత్తాలు.
దీని సారాంశం రెండు ముక్కల్లో చెప్పాలంటే, Repetitive pattern ఉన్న ఛందస్సులకి రెండు ప్రత్యేకతలు ఉంటాయన్న మాట:
1. ఈ ఛందస్సులో ఉన్న పద్యాలని గుర్తుపట్టడం సులువు
2. ఈ ఛందస్సులో వ్రాసే పద్యాలకి ఒకటే ప్రత్యేకమైన నడక ఉంటుంది. దాని కారణంగా అది nonelastic ఛందస్సు అవుతుంది.
ఇంకొక విషయం. సంస్కృతంతో పోలిస్తే, తెలుగు వృత్తాలకి ఎలాస్టిసిటీ ఎక్కువ! ఎందుకంటారా, అదంతా "యతి" మహత్తు! సంస్కృతంలో యతి విరామాన్ని నిర్దేశిస్తుంది. అంటే సరిగ్గా యతిస్థానంలో ఉన్న అక్షరంతో ఒక కొత్త పదం మొదలవ్వాలన్న మాట. ఉదాహరణకి ఉత్పలమాలలో యతి స్థానం 10. కాబట్టి ఏ ఉత్పలమాల పద్యంలోనైనా పదవ అక్షరంతో కొత్త పదం కచ్చితంగా మొదలవ్వాలి. క్రితం టపాలో ఇచ్చిన రెండు ఉదాహరణలూ దీన్ని అనుసరించడం యాదృఛ్చికం!
"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి..." అన్న పద్యంలో ఈ నియమం పాటించబడ లేదు. యతిస్థానం లో "దం" అన్నది పదం మధ్యలో ఉంది. ఇది తెలుగు పద్యం కనక సరిపోయింది. ఇలాంటిది సంస్కృతంలో కుదరదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన గ్రాఫు రెండు భాగాలు అయిపోతుంది. యతి స్థానం ముందు వరకూ ఒక భాగం. తర్వాతది మరొక భాగం. ఈ రెండిటి మధ్య 1 విలువ ఉండే విరామం ఎప్పుడూ ఉంటుంది. దీనితో పద్యానికి కొంతవరకూ ఒక ప్రత్యేకమైన నడక అంటూ ఏర్పడుతుంది. అందులోని ఎలాస్టిసిటీ కొంత తగ్గుతుంది. అంతే కాదు, సంస్కృతంలో ప్రతి పాదం చివరకూడా ఇలాగే విరామం ఉండాలి. అంటే ఒకే పదం రెండు పాదాల్లోకి సాగకూడదన్న మాట. అంచేత ఒక పాదం పూర్తయ్యాక తప్పనిసరిగా చిన్న విరామం ఇచ్చి తరువాత పాదాన్ని చదవడం మొదలుపెడతాం. దీనివల్ల నడక మరింత సులభంగా తెలుస్తుంది. అదే తెలుగు పద్యాలలో అయితే ఈ నియమం లేదు. అంచేత తెలుగులో ప్రతిపాదం తర్వాత ఒక విరామం ఉండవలసిన పనిలేదు. అలా లేనప్పుడు, అలాంటి పద్యాలని గుర్తుపట్టడం మరింత కష్టం! అయితే దీనివల్ల పద్యాలకి ఎలాస్టిసిటీ మరింత పెరుగుతుంది.
ఇవాళ్టికి ఇక్కడకి ఆపుదాం. ఈసారి విషయం కొంచెం బరువైనట్టుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదివి, ఏమైనా సందేహాలుంటే నిరభ్యరంతరంగా అడగండి.
ఆ... ఆగండాగండి. ఈసారి మీ మెదడుకి మేత ఏమీ ఇవ్వలేదు కదూ! సరే, కిందటి టపా వ్యాఖ్యలలో "కన్నెపిల్లవని" పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రశ్న. అందులో "తనన తనన అన్న తాన అన్న తాళం ఒకటే కదా" అన్న వాక్యం గుర్తుందా? దీని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇప్పుడు ఆలోచించండి. ఆలోచించి, ఏమిటనుకుంటున్నారో చెప్పండి. సరేనా!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Sunday, November 22, 2009
ఛందస్సుతో నడక - 3
Subscribe to:
Post Comments (Atom)
"తనన తనన అన్న తాన అన్న తాళం ఒకటే కదా"
ReplyDeleteతనన = III = 3 మాత్రలు
తాన = UI = 3 మాత్రలు
"తనన" లోని మాత్రల సంఖ్య, "తాన" లోని మాత్రల సంఖ్య ఒకటే కాబట్టి వాటికి వచ్చే తాళం కూడా ఒకేలాగ ఉంటుంది అని అనుకుంటానండి.
కామేశ్వరరావు గారు,
ReplyDeleteపోతన్న గారి భాగవతము లో అక్కడక్కడ ఉన్న మత్త కోకిల పద్యాలలో, ఎక్కువ భాగము ఈ Repetitive pattern ను సరిగా అనుసరించినట్టు కనపడదు. ఇటువంటి Repetitive pattern ని సరిగా అనుసరించట కావ్య స్థాయికి తగినది కాదా?
చాలా బాగుందండి మీ విశ్లేషణ.
ReplyDelete~సూర్యుడు
రెండూ కూడా సూర్య గణాలేననేమో.. ??
ReplyDeleteతనన = నగణం,
తాన = హగణం.. కాబట్టి "తనన తనన అన్న తానా అన్నా తాళం" సూర్యగణమే అని కవిహృదయమేమో????
సనత్
మీ ఛందస్సుతో నడక అన్నీ చదివాను, కానీ ఈ తానన తన్నన ;) నాకెందుకో చాలా అయోమయంగా అనిపిస్తుందండి.బహుశా మొదటినుంచి భరనభభరవ అలవాటయ్యో ఏమో కానీ. సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు ఈ ట్యూన్ అర్థం చేసుకోలేకపోతున్నాను.ఇంతకీ ఈ pattern ను ఉపయోగించి పద్యాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా లేక పద్య నడకలలో విధానాలను గుర్తించి నడక ద్వారా ఆ పద్యమేదో గుర్తించే ప్రయత్నమా?
ReplyDelete@సూర్యుడుగారు, నెనరులు.
ReplyDelete@సనత్ గారు, అయితే ఇంద్ర/సూర్య గణాలకీ తాళానికీ సంబంధం ఉందంటారా?
@సత్యనారాయణగారు, మాత్రల సంఖ్య సరిపోతే తాళం సరిపోతుందంటారా? భాగవతంలో మీ దృష్టిలో ఉన్న పద్యాలని ఇక్కడ ఇస్తారా? దాని గురించి చర్చించవచ్చు.
@భా.రా.రె.గారు, సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు ఆ ట్యూన్ని అర్థం చేసుకోలేకపోవడం మీ లోపం కాదు :-) అది ప్రస్తుతానికి పక్కన పెడితే, ఈ "తనన" pattern గురించి మీకు బాగా అర్థమవ్వాలంటే ఒక చిన్న పని చెయ్యండి. పైన చెప్పిన మత్తకోకిల ఛందస్సు మీ "గణాల" భాషలో చెపితే "రసజజభర". ఈ నిర్వచనాన్ని ఉపయోగించి, "సఖ్యతన్ విడి సత్యభామ ప్రసన్న భావమున్ త్యజించి తా" అన్నది మత్తకోకిల ఛందస్సేనా కాదా అని పరీక్షించండి (పెన్నూ పేపరూ, కంప్యూటరూ లేకుండా ;-). అలాగే "తాన తానన" అని పై టపాలో పేర్కొన్న నడకని ఉపయోగించి పరీక్షించండి. ఈ రెండు విధానాల్లోనూ ఏది సులువయ్యిందో చూడండి. ఇంకా ఓపిక ఉంటే, రసజజభర అన్న నిర్వచనాన్ని ఉపయోగించి ఒక మత్తకోకిల పద్యపాదం రాయడానికి ప్రయత్నించండి. అలాగే "తాన తానన" అన్న నడక బట్టి కూడా ప్రయత్నించండి. రెండిటిలో ఏది సులువో గమనించండి.
>>ఇంతకీ ఈ pattern ను ఉపయోగించి పద్యాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా లేక పద్య నడకలలో విధానాలను గుర్తించి నడక ద్వారా ఆ పద్యమేదో గుర్తించే ప్రయత్నమా?
కొన్ని రకాల పద్యాలకి ఒకే రకమైన pattern/నడక ఉంటుంది (ఉదా. మత్తకోకిల). అలాంటి పద్యాలని ఆ patternతో సులువుగా గుర్తుపట్టవచ్చు. కొన్ని రకాల పద్యాలకి ఒకే రకమైన నడక ఉండదు (ఉదా. ఉత్పలమాల). అలాంటి పద్యాలని ఆ నడకల ద్వారా గుర్తుపట్టడం కష్టమవుతుంది.
పద్యాలలో ఉన్న ఈ తేడాని గుర్తించి, వాటి వెనకనున్న కారణాలని వెతికే ప్రయత్నం చేస్తున్నాను నేనిక్కడ.
మత్తకోకిల:
ReplyDeleteకందమూల ఫలాశియై బహుకాల ముగ్ర తపః పరి
స్పందుడై యటమీఁదటం దృణపర్ణ భక్షణసేసి యా
చంద మేది జలాశి యై నృపసత్తముం డది మాని తా
మంద గంధవహాశి యయ్యెఁ గ్రమంబునన్ దృఢచిత్తుడై!!
(నాల్గవ స్కందము - 646వ పద్యము - పృథు చక్రవర్తి ముక్తినొందుట)
మత్తకోకిల:
దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండ మండల మధ్య సంస్థిత! తత్వరూప! గదాసి కో
దండ శంఖ సుదర్శనాంక! సుధాకరార్క సునేత్ర! భూ
మండలోద్దరణార్త పోషణ! మత్తదైత్య నివారణా!!
(ఐదవ స్కందము - 167వ పద్యము - ఆశ్వాసాంతపు పద్యము)
ఇందులో కొంత వరకు Repetitive pattern ని అనుసరించినట్టు ఉన్నది కాని పూర్తిగా కాదు.
భైరవా యిది ఏమి సూత్రమొ, భైరవాంశయె వింతగా
ReplyDeleteధైర్య సాహసముల్ ఒసంగి "తథై తకా తకి" టంచు నే
వర్ణమాలను కూర్తు "కోకిల భాష" తోడనె భాస్కర!
భైరవాంశ మదిన్ స్మరించు! నాపై "తనానతనే" కదా
కామేశ్వర రావు గారూ, ఈ రోజు ట్రైన్ లో వస్తూ మీ సూత్రం తో మొదలు పెట్టి తుదకు వచ్చేటప్పటికి ర స జ జ భ జ ర నే ఆశ్రయించాను. కానీ రెండిటినీ కలిపి ప్రయత్నిస్తే సులభమనే అనిపిస్తుంది.
తాననా తననా తనాన తనాన తానన తాననా ఈ నడతలో నాకు కలిగిన ఇబ్బంది మూడు మూడు అక్షరాల పదాల కొరత. తెగ ఇబ్బంది పెట్టేసిందండీ. మొత్తానికి పైన ౩ పాదాలకే పద్యం ముగిసి పోయింది. మరి నాలుగో పాదం కావాల కాబట్టి అలా సాగతీసాను :). తప్పులు ఏమైనా వున్నాఏమో చెప్తారా?
భాస్కర=భాస్కరా
ReplyDeleteదీర్ఘము మిస్సింగూ ;)
భాస్కర్ గారు,
ReplyDeleteమీ పద్యములో
1. ప్రాస నియమము పాటించ లేదు. ప్రాస ఒక హల్లుతో వేస్తే మిగత మూడు పాదాలు అదే హల్లు (ఒకే హల్లు) రావలెను. ప్రాస సమ్యుక్తాక్షరమైన అదే సమ్యుక్తాక్షరము అన్నిపాదాలలోను రావలె. మీరు రెండు పాదలలో ఒక హల్లుతో ప్రాస వేసి రెండు పాదాలలొ వేరు వేరు సమ్యుక్తాక్షరలు వాడారు.
2. 4వ పాదములో "నాపై" అన్న చోట గణాలు సరిపోలేదు. "నా" లఘువు కావలె.
3. "సాహసముల్ + ఒసంగి" - సంధి చెయ్యకపోతే వ్యాకరణము ఒప్పుకోదేమో! సంధి చేస్తే మీకు గణాలు సరిపోవు.
భా.రా.రెగారు,
ReplyDeleteనా కోరిక మన్నించి ప్రయత్నించినందుకు నెనరులు. రసజజభర ని ఆశ్రయించ వలసి వచ్చీందంటే ఆశ్చర్యంగానే ఉంది! అయినా సత్యనారాయణగారు చెప్పినట్టు చివరి పాదంలో గణం తప్పింది :-) మీరు బేసిగ్గా నడకనే తప్పుగా తీసుకున్నట్టున్నారు. మత్తకోకిల (సహజమైన)నడక మీరిచ్చిన "తాననా తననా తనాన తనాన తానన తాననా" కాదు. నేను పై టపాలో చెప్పినట్టు "తాన తానన తాన తానన తాన తానన తాననా". దీనితో ప్రయత్నిస్తే మీకు సులువయ్యేది.
ఈ "నడక" vs. "గణాలు" గురించి నా తర్వాతి టపాలో ఇంకొంచెం వివరిస్తాను. మీకు మరికాస్త స్పష్టత వస్తుందేమో చదివిన తర్వాత చెప్పండి. మనం బళ్ళో ఛందస్సు నేర్చుకునే పద్ధతి కన్నా ఇది కాస్త భిన్నమైనది కాబట్టి మొదట్లో కొంత తికమక ఉంటుంది.
సత్యనారాయణగారు,
repetetive patternని సరిగ్గా అనుసరించక పోవడం అంటే పదాలు సరిగ్గా "తాన తానన తాన తానన..." అన్న విభాగానికి తగ్గట్టు విరగలేదన్నది మీ ఉద్దేశం అనుకుంటాను. మీరిచ్చిన పోతన పద్యాలలో అలా విరగ లేదు (నా టపాలో ఇచ్చిన రెండో ఉదాహరణ లాగ). నిజమే. కాని మీరా పద్యాలని చదివినప్పుడు మత్తకోకిల నడక స్పష్టంగానే గుర్తించ గలుగుతారు. ఇది ఆ ఛందస్సు నిర్మాణం వల్ల సాధ్యమవుతోంది. అందుకే ఇటువంటి వాటిని పూర్తి rigid/non-elastic ఛందస్సులు అని అనుకోవచ్చన్నాను. అంటే మీరు అందులోని repetetive patternని సరిగ్గా అనుసరించక పోయినా, ఆ నడక వచ్చేస్తుంది. దీని పూర్తి విరుద్ధమైనవి ఉత్పలమాల వంటి ఛందస్సులు. వీటిలో స్పష్టమైన repetetive pattern ఉండదు. అంచేత వీటికి అసలు ఒక ప్రత్యేకమైన/ప్రస్ఫుటమైన నడకే ఉండదు. ఇవి పూర్తిగా elastic ఛందస్సులు.
ఈ రెండిటికీ మధ్య semi-elastic ఛందస్సులు కూడా ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు ముచ్చటించుకుందాం.
ఎక్కడో విన్నమీదట మత్తకోకిలకి నే పెట్టుకున్న బండగుర్తు:
ReplyDeleteమత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిలా
ఉదా:
ఊకదంపుడు ఒట్టిమాటలు ఓటిఒట్టులు మానరా
ఊకదంపుడు ఒట్టిమాటలె ఓట్లుదెచ్చును సోదరా
యతి అక్షరం చెప్పు అని నిలదీయకండి.
This comment has been removed by the author.
ReplyDeleteమత్తు మత్తుగ పద్య భైరవ మత్త కోకిల చెప్పగా
ReplyDeleteఎత్తు లన్నియు చిత్తు చిత్తుగ ఎక్కె నంతట చిత్తమున్
జిత్తు లన్నియు తాన తానన చిందు లయ్యెగ నంతటన్
చిత్త మంతయి మత్త కోకిల చిత్ర మయ్యెను చూడగా!
ప్రాస మీద ఒక సందేహం. మొదటి పాదంలో సంయుక్తాక్షరం లేకుండా ప్రాస వస్తే మిగిలిన పాదాల్లో సంయుక్తాక్షరం రాకూడదా? ఎక్కడో చదివిన గుర్తు, మొదటి పాదము సంయుక్తాక్షరమైతే మిగిలిన అన్ని పాదాలూ సంయుక్తాక్షరాలు కావాలని, కానీ సత్యనారాయణ గారు చెప్పినట్టు మొదటిది హల్లు అయితే అన్నీ హల్లులే కావాలా?
ఊ.దం.గారు, మీ పాదాలలో రెండు చోట్ల యతిని పాటించేరే! "మత్తకోకిల..."లాగా "ఊకదంపుడు ఊకదంపుడు ఊకదంపుడు దంపరా" అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు :-)
ReplyDeleteభా.రా.రెగారు,
ఇకనేం నడక చక్కగా వంటబట్టినట్టే!
ప్రాస నియమం - అన్ని పాదాలలోనూ రెండవ అక్షరంలో ఉండే హల్లులు ఒకటే అవ్వాలి. అంచేత ఒక పాదంలో సంయుక్తాక్షరం ఉంటే అన్ని పాదాల్లోనూ అదే సంయుక్తాక్షరం (అచ్చు వేరు కావచ్చు) ఉండాలి.
ఇంతకీ మాటల్లో పడేసి మీరు అసలు సంగతి పక్కన పెట్టేశారు. "తనన తనన అన్నా తానా అన్నా తాళం ఒకటే కదా" అనటంలోని ఆంతర్యం ఏమిటి?
ReplyDeleteసనత్ గారూ,
ReplyDeleteదీని గురించి కచ్చితంగా నాకు సమాధానం తెలియదండి. మీరూ సత్యనారాయణగారూ అన్నట్టుగానే నేనూ ఆలోచించాను. అయితే సంగీతంలో తాళానికీ, ఛందస్సులో మాత్రలకీ ఏమైనా సంబంధం ఉందా అన్న విషయం స్పష్టంగా నాకు తెలియదు. సంగీతంలో కూడా మాత్రలు ఉన్నాయి!
ఇది నిజానికి "తననా తననా అన్నా, తానా అన్నా తాళం ఒకటే కదా". అంచేత ఇక్కడ సూర్య గణం ప్రసక్తి లేదు. మాత్రల సంఖ్యే ప్రధానం. "తననా"కి "తానా"కి మాత్రల సంఖ్య ఒకటే కాబట్టి. మాత్రా ఛందస్సులో మాత్రల సంఖ్యే ప్రధానం కాని గురు-లఘు క్రమం కాదు. ఇక్కడ అదే వర్తిస్తుందనుకుంటున్నాను.
ఈ టపాలు ఎప్పుడు వేశారండోయ్ నేను చూడనేలేదు.
ReplyDeleteతనన తాన
తెలుగు తెల్గు రెండూ ఒకటే కదా. తెలుగులో ఇలా న గణానాన్ని హగణంగా మన ఇష్టానుసారం మార్చేయవచ్చుగా. ఇక తననా అనేది తనన కీ పెద్ద అన్నగారు లాంటిదంతేగా. తెలుగు తెలుగూ నాలుగు నాలుగూ.
తెల్గు నాల్గు తెల్సు వంటి పదాలు అనేకం.
కామేశ్వర రావు గారికి,
ReplyDeleteమీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది.
నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:
నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా
దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా
నమస్కారాలతో
రాధేశ్యామ్
radhemadhavi@gmail.com
www.radhemadhavi.blogspot.com
ReplyDeleteమత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ
చిత్తమందున తలపుకొచ్చుట చిత్రమూ బహు చిత్రమూ
వృత్తవివరణ చాలబాగుగ విశదపరచిన భైరవా..
కొత్త నాకిది తప్పులున్నచొ కాయుమో కామేశ్వరా..!
నమస్కారాలతో
రాధేశ్యామ్
radhemadhavi@gmail.com
www.radhemadhavi.blogspot.com
ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము
ReplyDeleteగ్రాసమిప్పుడు నాదు మెదడుకు గట్టిగా నే పూనగా
దోస వేసిన చందమున పద్దెములనే నే కూర్చగా
దోసమున్నచొ పెద్దమనసుతొ దిద్దిపెట్టు కవీశ్వరా..!
నమస్కారాలతో
రాధేశ్యామ్
radhemadhavi@gmail.com
www.radhemadhavi.blogspot.com
రాధేశ్యామ్ గారూ,
ReplyDeleteచాలా సంతోషమండి. మత్తకోకిల నడకని చక్కగా పట్టుకున్నారు!
అయితే మీ పద్యాలు కచ్చితమైన మత్తకోకిల వృత్తంలో ఉన్నవని చెప్పలేము, సరిగ్గా అలాగే ఉండే మాత్రాఛందస్సులో ఉన్నాయి. ఈ తేడా తెలియాలంటే తర్వాతి టపా "ఛందస్సుతో నడక - 4" చదవండి. :-)
కామేశ్వర రావు గారూ,
Deleteమీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.
"ఛందస్సుతో నడక - 4" చదివాను. మత్తకోకిల నన్ను గట్టిగానే ఆవహించింది. నా పద్యాలు కొద్దిగా సరిచేసాను(అని అనుకొంటున్నాను). చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.
నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
పండు వెన్నెల సాటిరాగల పాప నిద్దుర పుచ్చగా
దిండు సర్దుచు జోలపాడెడు దల్లియేగద కోయిలా!
మత్తకోకిల వృత్తమందున మున్ను వ్రాసిన పద్యమూ
చిత్తమందు తలంపుకొచ్చుటె చిత్రమూ బహు చిత్రమూ
వృత్తలక్షణ మర్మమెల్లను వ్యక్తపర్చిన యొజ్జవే ..
కొత్త నాకిది తప్పులున్నచొ కోపగింపక గావవే!
ప్రాసయతులన నాకు దెల్వదు పట్టులేనిది సత్యమూ
గ్రాసమిప్పుడు నాదు మేథకు పట్టువచ్చుట తథ్యమూ
దోశ క్రొత్తగ వేయురీతిగ తెల్గు పద్దెము కూర్చగా
దోసమున్నచొ, నీకు మ్రొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..!
శ్రీ గురుభ్యోనమః
ప్రణామాలతో
రాధేశ్యామ్
radhemadhavi@gmail.com
www.radhemadhavi.blogspot.com
మళ్ళీ తప్పింది..
Deleteఈసారి ఇది చూడండి గురువుగారూ..!
ప్రాసయన్నది నాకుదెల్వదు పట్టులేనిది సత్యమూ
గ్రాసమిప్పుడు నాదుమేథకు పట్టువచ్చుట తథ్యమూ
దోశ కొత్తగ వేయురీతిగ దెల్గుపద్దెము కూర్చగా
దోసమున్నచొ, నీకు మొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..!
రాధేశ్యామ్ గారూ,
Deleteబాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల గణాలన్నీ సరిపోయాయి. దోశలు తిప్పడం బాగా వచ్చినట్ట! :-)
మొదటి పద్యంలో భావం కూడా చాలా బాగుంది.
అన్ని పద్యాలలోనూ ప్రాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల యతులు మాత్రం సరిపోలేదు. యతిలో అచ్చు మైత్రి, హల్లు మైత్రి అని రెండుంటాయి. ఇంచుమించు అన్నిచోట్లా హల్లు మైత్రి కుదిరింది కాని అచ్చు మైత్రి కుదరలేదు. యతి గురించి వివరణ యిక్కడ చూడండి:
http://dracharyaphaneendra.blogspot.in/2009/04/2009_11.html
వృత్త లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, పద్యాలు చదువుకోడానికి చక్కగా ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చనవసరం లేదు. కొత్తగా వ్రాసేటప్పుడు యతి గురించి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో నడక చక్కగా కుదిరి, మంచి భావాలతో వ్రాయగలిస్తే అవి మంచి పద్యాలే, యతి సరిపోకపోయినా.
Deleteవామ్మో..! ఇన్నున్నాయంటే చిక్కుపడకపోదునే..!!
ReplyDeleteఅయిననూ ప్రయత్నించెదను..!! :)
మీ సలహాలకు ధన్యవాదాలండీ..చాలా నేర్చుకోగలుగుతున్నాను.
- రాధేశ్యామ్
మరి మార్చక్కర్లేదన్నారు, ఇహ ఇబ్బంది పెట్టను..!
ReplyDeleteధన్యవాదాలు గురువుగారూ..!
నేనప్పుడే మీరిచ్చిన లింకుతో డా. ఫణీంద్ర గారి బ్లాగ్సాగరమథనానికి పూనుకొనేశా..!!
- రాధేశ్యామ్
కామేశ్వర రావు గారు , నమస్కారం. మా మిత్రుడు రాధేశ్యామ్ తను తొలి సారి రాసిన పద్యాల పై నా స్పందన కోరగా , నేను కూడా స్పందించి ఒక పద్యం వ్రాసాను. కింద ఉంది. నాకు కూడా ఇది తొలి సారే. ఇది వ్రాస్తున్నప్పుడు చిత్రంగా నాకు కూడా మత్త కోకిల లో వ్రాసిన ఒక కీర్తన వంటిది జ్ఞప్తికి వచ్చింది. అది: " రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము" . మీ బ్లాగ్ కూడా ఇప్పుడే చూసి చదవడం మొదలు పెట్టాను.
ReplyDeleteఇప్పుడు నేను వ్రాసిన తొలి పద్యం:
నీదు కవితయు చదివినంతనె ముదమహో బహు ముదమహో
నాదు హృదయము స్పందించ వచ్చెను మత్త కోకిల అదరహో
లేదు ఇప్పుడు మనసు పలికెను తప్పులెంచ వలదహో
కాదు అన్నచొ ఏమి చేతును మునగ చెట్టు దించాలహో
మీ అభిప్రాయము తెలుపగలరు.
ధన్యుణ్ణి,
చంద్రశేఖర మూర్తి
చంద్రశేఖర మూర్తిగారూ, నమస్కారం. మొదటి పాదం గణాలు సరిపోకయినా నడక సరిపోయింది. తక్కిన మూడు పాదాలలో నడకకూడా అక్కడక్కడ తప్పింది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నడక గమనించండి.
Deleteమీరన్న "రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము" అన్న భజన కీర్తన చాలావరకూ మత్తకోకిల నడకే. మత్తకోకిల చివర్న "తాన నా" అని ఆగిపోతుంది, ఈ కీర్తన చివర "తాన నానన" అని ముగుస్తుంది.
This comment has been removed by the author.
Deleteగురువుగారూ,
ReplyDeleteకందపద్యాల నియమాలను చదివిన మీదట ఈ క్రింది పద్యం వ్రాశాను. యతి ఎలా సాధించాలో తెలియలేదు. అసలు మిగిలిన నియమాలు కూడా సరిపొయాయా లేదా సరిచూచి మీ అభిప్రాయాన్ని చెప్పగోరుతాను.
నమ్మితి నిను యుల్లంబున
నమ్మితి చరణారవింద యుగ్మము నిజమున్
నమ్మితి సాగర సంసా
రమ్మును నడి లోతులోన దాటింప తగున్
నమ్మితి యుల్లంబందున
నమ్మితి శ్రీ వేంకటపతి పద పద్మములన్
నమ్మితి సాగర సంసా
రమ్మిలలో మొల లోతున దాటింతువనిన్
నమ్మితి యుల్లంబందున
నమ్మితి శ్రీ వేంకటపతి పల్లవ పదమున్
నమ్మితి సాగర సంసా
రమ్మిలలో మొల లోతున దాటింతువనిన్
http://radhemadhavi.blogspot.in/2013/04/blog-post_6.html)
మీ సలహాకై ఎదురుచూస్తూ..
నమస్కారాలతో
- రాధేశ్యామ్