ఛందస్సుతో నడక మొదలుపెట్టినప్పుడు అది ఎన్నాళ్ళు ఎంత దాకా సాగుతుందో నాకు తెలియదు. ఇప్పటికీ తెలియకుండానే ఉంది! :-) వృత్తాల గురించిన టపా అయిన వెంటనే తెలుగు ఛందస్సులకి (ఆటవెలది, తేటగీతి మొదలైనవి) దారి మళ్ళించ వచ్చనుకున్నాను. కాని దానికన్నా ముందు మరికొన్ని సంగతులు వివరించాల్సిన అవసరం ఉందనిపించిది. కిందటి టపాలో వృత్తాలలోనే భేదాలను (ఉత్పలమాల, మత్తకోకిల) గుర్తించే ప్రయత్నం చేసాను. తెలుగు ఛందస్సుల వైపు వెళ్ళడానికి ఇంకా మరికొంత సమయం ఉంది. మరికొన్ని విషయాలు ఇంకా ముచ్చటించుకో వలసినవి ఉన్నాయి.
కిందటి టపా వ్యాఖ్యలలో భా.రా.రె.గారు ఈ "తనన" గోల తనకి పూర్తిగా అర్థమైనట్టు లేదన్నారు. అంతకన్నా గణాల బట్టి (భరనభభరవ లాగా) వృత్తాన్ని గుర్తించడం సులువుగా ఉందన్నారు. వారలా అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మనకి చిన్నప్పుడు బాగా అలవాటైన పద్ధతి సులువుగా అనిపిస్తుంది. ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నం, ఛందస్సు అసలుసిసలు స్వరూపం ఆ గణాలలోనే ఉందా, లేక మరేదైనానా అన్న విషయాన్ని ఆలోచించడం. ఛందస్సుని నిర్వచించడానికి "గణ" పద్ధతి మేలైనదా లేక "నడక" మేలైనదా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలంటే, ఛందస్సు చరిత్ర కొంచెం పరిశీలించాలి.
ఆ చరిత్ర పుటల్లోకి తొంగి చూసే ముందు, మీకొక చిన్న అభ్యాస ప్రశ్న (exercise). ఒక మూడు పద్య పాదాలకి మన గురు-లఘు గ్రాఫులు కింద ఇస్తున్నాను. ఆ గ్రాఫుల బట్టి ఆ మూడు పద్యపాదాలూ ఒకే ఛందస్సుకి చెందినవో కావో గుర్తించండి చూద్దాం:
పై గ్రాఫులు ఈ మూడు పద్యపాదాలవీను:
1. శుక్లాంబరధరం విష్ణుం
2. అగజానన పద్మార్కం
3. ఇదం తుతే గుహ్య తమం
గ్రాఫుల మధ్య ఎలాంటి పోలిక తెలియడం లేదు కదూ! అన్నట్టు ఇందులో విరామాలు కూడా లేవు. అది అచ్చంగా అక్షరాలలోని గురు-లఘువుల క్రమమే. ఈ శ్లోకాలతో పరిచయం ఉన్నవాళ్ళకి ఈ మూడూ ఒకటే ఛందస్సుకి చెందినవన్న విషయం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి, ఈ మూడూ ఒకటే ఛందస్సు - అది అనుష్టుప్! మరి ఒకటే ఛందస్సైతే ఆ మూడు గ్రాఫులు ఎందుకంత తేడాగా ఉన్నాయి (విరామాల గోల లేకున్నా కూడా)? దీనికి జవాబు చాలా తేలిక. అనుష్టుప్ ఛందస్సు వృత్తం కాదు కాబట్టి! వృత్తాల కైతే ప్రతి పాదంలోనూ గురు-లఘువుల క్రమం కచ్చితమై ఉంటుంది. అన్ని ఛందస్సులకీ అలా ఉండదు. సరే, పోనీ ఏమైనా repetetive patterns అన్నా ఉన్నాయా ఇందులో? ప్రతిదీ ఎనిమిది అక్షరాల పాదం, చివరి అక్షరం గురువు. ఇవే ఆ మూడిటిలో ఉన్న సామ్యాలు. అదే ఆ ఛందస్సు నిర్వచనం కూడాను! ఈ అనుష్టుప్ ఛందస్సు వృత్తాల కన్నా కూడా ప్రాచీనమైనది.
ఈ అభ్యాసం వల్ల మనకి తెలుస్తున్న విషయాలు ఏమిటంటే:
1. అన్ని ఛందస్సులూ వృత్తాలు కావు.
2. వృత్తాలు కాని ఛందస్సులకి గురు-లఘు గ్రాఫులు పెద్దగా ఉపయోగ పడవు
3. ప్రతి ఛందస్సుకీ గురు-లఘువుల pattern (అసలు ఎలాంటి repetetive pattern) ముఖ్యం కాదు
గురు-లఘువులు (లేదా మాత్రలు) ముఖ్యం కాని ఛందస్సులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే మనం బళ్ళో ఛందస్సు చదువుకోవడం ఈ గురు-లఘువులతోనే మొదలుపెడతాం కాబట్టి. గురు-లఘువుల క్రమంతో సంబంధం లేని ఛందస్సు మనం నేర్చుకోలేదు కాబట్టి!
సరే ఇప్పుడు ఛందస్సు చరిత్ర మీద కాస్త దృష్టి సారిద్దాం. దీని గురించి ఇప్పటికే నా ఛందస్సు - కథా కమామీషు టపాలో వ్రాసాను. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేస్తాను. ఛందస్సు పుట్టుక రెండు రకాలుగా జరిగింది. ఒకటి ఋషుల వేదాలలోను. మరొకటి జానపదుల పాటలలోనూ. ఈ రెండిటిలో ఏది ప్రాచీనం అన్న విషయం మనకి తెలియదు, అది ప్రస్తుతానికి అప్రస్తుతం కూడా. వేద ఛందస్సు మార్పులు చెంది సంస్కృత కావ్య ఛందస్సు అయ్యింది. ఆ సంస్కృత కావ్య ఛందస్సు నుంచి కన్నడం, తెలుగు వంటి దేశభాషల కావ్యాలలోని ఛందస్సు పుట్టుకొచ్చింది. ఈ పరిణామ క్రమంలో కావ్య ఛందస్సు జానపద ఛందస్సు నుంచి చాలా లక్షణాలని స్వీకరించింది.
ఛందస్సు గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అనే మాట - ఛందస్సు పద్యానికి చక్కని వినసొంపైన నడకని ఇస్తుంది, ఆ నడక మనసుని వెంటనే ఆకర్షిస్తుంది అని. ఇది నిజానికి నిజం కాదు, పూర్తిగా. ఈ మాట కేవలం జానపద ఛందస్సుకి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకో కాసేపట్లో చూద్దాం. ముందుగా వేదాలలోని ఛందస్సుని తీసుకున్నట్లయితే, అవి ప్రధానంగా అక్షర బద్ధమైన ఛందస్సులు. అంటే, అందులో మాత్రలు కాని, గురు-లఘువుల క్రమం కాని, ఇవేవీ ముఖ్యం కాదు. ప్రతి పాదంలోనూ ఉండాల్సిన అక్షరాల సంఖ్యని మాత్రమే నిర్దేశిస్తాయవి. గురు-లఘువుల నియమం ఏ కొన్ని అక్షరాలకో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చూసిన అనుష్టుప్ ఛందస్సు తీసుకుంటే, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. చివరి అక్షరం గురువు అవ్వాలి అన్నది మాత్రమే దాని నియమం. మరి ఇలాంటి ఛందస్సులో చెవికి స్పష్టంగా తెలిసే "నడక" ఎలా సాధ్యమవుతుంది? అసలు వేదాలలో ఛందస్సు ప్రయోజనం ఏమిటి? చెవికి ఇంపు గూర్చే నడక ఇవ్వడమా? కాదు. జానపద గీతాల్లాగ, మానసిక ఆహ్లాదాన్ని గూర్చడం కాదు కదా వేద మంత్రాల పని. అంచేత అందులో ఛందస్సు ప్రయోజనం వేరే ఉంది. వేదాలు ముఖే ముఖే వ్యాప్తి చెందినవన్న విషయం మనకి తెలుసు. వేద శ్లోకాలు వల్లెవేసి, కంఠస్థం చెయ్యడం ద్వారా గురువులనుంచి శిష్యులు నేర్చుకొనేవారు. ఇలా శ్లోకాలను గుర్తు పెట్టుకోడానికి, వాటిని ఇతరులకి నేర్పడానికి, ఆ శ్లోకాలకి కొంత నిర్దిష్టత అవసరం. మామూలుగా మనం మాట్లాడే వాక్యాలకి ఆ నిర్దిష్టత ఉండదు. అంచేత ఒకరు చెప్పిన వాక్యాలు అక్షరం పొల్లుపోకుండా తిరిగి ఒప్పచెప్పాలంటే ఇంచుమించు అసాధ్యం. ఈ సమస్యని అధిగమించే ఒక సాధనమే వేదాలలో ఛందస్సు. ఒక శ్లోకంలో ఇన్ని అక్షరాలు మాత్రమే ఉండాలి, అందులో కొన్ని అక్షరాలు గురువు లేదా లఘువే ఉండాలి అన్న నియమాలు ఆ చెప్పే శ్లోకానికి ఒక నిర్దిష్టతని ఇస్తాయి. వల్లెవేసి గుర్తుపెట్టుకోడానికి కూడా కొంత సులువవుతుంది. వేదాలలోని ఛందస్సు ప్రయోజనం ఇదే. ఛందస్సుతో పాటు, ఇతర వేదాంగాలైన వ్యాకరణము, నిరుక్తము, శిక్ష ద్వారా శ్లోకాలకి మరింత నిర్దిష్టత చేకూరుతుంది.
వేదాలనుంచి కావ్యలకి వస్తే, ఆదికావ్యమైన రామ్యాయణం తప్పించి, తర్వాతి కాలంలో వచ్చిన కావ్యాలలో చాలా వృత్తాల ప్రయోగం కనిపిస్తుంది. అక్షర ఛందస్సు నుంచి ఏర్పడ్డవే వృత్తాలు. అక్షర ఛందస్సు పాదంలోని అక్షర సంఖ్యని మాత్రమే నియంత్రిస్తే, అందులోని అక్షరాల గురు-లఘు క్రమాన్ని నియంత్రించేవి వృత్తాలు. ఒకో అక్షర ఛందస్సుకీ ఎన్ని వృత్తాలు ఉండగలవు అన్నది ప్రాచీన ఛందశ్శాస్త్రకారులు గణించేరు. అంటే permutations అన్న మాట. దీన్ని ప్రస్తారం అంటారు. పాదంలోని గురు-లఘువుల క్రమాన్ని నిర్దేశించడమే వృత్త నిర్వచనం చేసేది. వృత్త నిర్వచనంలో ఇప్పుడు మనకి కనిపించే "యమాతారాజభానసలగం" గణాల ప్రసక్తి లేనే లేదు. ఈ గురు-లఘు క్రమాన్ని గుర్తుపెట్టుకోడానికి, రక రకాల పద్ధతులు అవలంబించేవారు. మూడు లేదా రెండు అక్షరాలని కలిపి ఒక గణంగా ఇలా గుర్తించడాన్ని కనిపెట్టింది పింగళుడని అంటారు. ఇవి అక్షర గణాలు (అంటే అక్షరాల సమూహంతో ఏర్పడ్డ గణాలు). పింగళుడి ముందు నాలుగు/రెండు అక్షరాలని ఒక గణంగా గుర్తించే పద్ధతి అమలులో ఉండేదట. ఆ గణాలకి వేరే పేర్లు ఉండేవి. అంచేత మనం నేర్చుకున్న అక్షరగణాలు కేవలం గురు-లఘు క్రమం గుర్తుపెట్టుకొనడానికి ఉపయోగపడే సాధనమే కాని, వృత్త నిర్వచనానికి వాటి అవసరం లేదు. ఒకవేళ పదాలు అక్షర గణాన్ని అనుసరించే విరగాలి అన్న నియమం ఉంటే, వాటికి నిర్వచనంలో ప్రాధాన్యం ఉండేది. కాని అలాంటి నియమమేమీ లేదు.
సరే, అది అలా ఉంచితే, కావ్యాలలో ఛందస్సు ప్రయోజనం ఏమిటి? శ్లోకాలను సులువుగా గుర్తుపెట్టుకొనేటట్టు వాటికి నిర్దిష్టమైన రూపం ఇవ్వడం అన్న ప్రయోజనం ఎప్పుడూ ఛందస్సు చేస్తుంది. వృత్తాలు మరింత నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తాయి. అయితే, కావ్యాలలో మనోరంజన ప్రధానం కాబట్టి, చెప్పే విషయానికి అనువుగా, చెవికి ఇంపుగా ఉండేటట్టు పద్యాలని వ్రాసే ప్రయత్నం పూర్వ కవులు చేసారు. అందుచేతనే బహుశా వేల వేల వృత్తాల లోంచి కేవలం కొన్ని వందల వృత్తాలని మాత్రమే కావ్యాలలో ప్రయోగించారు. అందులోనూ వేళ్ళ మీద లెక్కబెట్టగల వృత్తాలే ఎక్కువ ప్రచారం పొందాయి. కవులు ఒకో వృత్తాన్ని ఒకో ప్రత్యేక సందర్భంలో ఎక్కువగా ప్రయోగించినట్టు కూడా కొన్ని దాఖలాలు కనిపిస్తున్నాయి. క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో దీనిని వృత్తౌచిత్యమని పేర్కొని దీని గురించి కొంత వివరించాడు. చెప్పే విషయాన్ని విన సొంపుగా (ఒక ప్రస్ఫుటమైన నడకతో) చెప్పే ప్రయత్నంలోనే, జానపద ఛందస్సుల ప్రభావం కావ్య ఛందస్సులలో కనిపిస్తుంది. ఆ ప్రభావం గురించి తెలుసుకొనే ముందు, అసలు జానపద ఛందస్సు అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా!
జానపదులలో సంగీతం సాహిత్యం బాగా పెనవేసుకుపోయి ఉంటాయి. అంటే జానపదుల పాటల్లో ఒకే పాటని వేరువేరు వరసల్లో పాడటం అన్నది సాధారణంగా ఉండదు. ఎందుకిలా అవుతుంది? జానపదుల పాటలకి "దరువు"(beat) ప్రధానం. ఆ దరువుకి తగ్గట్టు పదాలు సహజంగా విరుగుతాయి. ఉదాహరణకి ఎండ్రకాయ పాటలో ఈ రెండు చరణాలు చూడండి:
వరీమడీ నాటబోతి ఓరి మగడా - నేను
గెనుం వార మునుం బడితి ఓరి మగడా
గెనుం వార మునుం బడితి ఓరి మగడా - నన్ను
ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా
ఎండ్రకాయ తేలు గుట్టె ఓరి మగడా - నాకు
ఒళ్ళు సర్తుబోసినాది ఓరి మగడా - నాకు
ఉలవపిండి పట్టెయ్ రా ఓరి మగడా - నువ్వు
రాతిరంత మేలుకోర ఓరి మగడా
*(ఇది త్రివిక్రం గారి "అవీ ఇవీ" బ్లాగునుండి సంగ్రహించబడింది :-)
ఇది మనకి మనం చదువుకుంటే వెంటనే దాని నడక తెలిసిపోతోంది. దీన్ని ఎవ్వరు పాడినా అదే నడకతో పాడగలరు. ఎందుకు? "తందనాన తందనాన తందనాననా - తాన, తందనాన తందనాన తందనాననా" అనే నడకకి తగ్గట్టుగా రెండు మూడు అక్షరాల చిన్న చిన్న పదాలతో ఉంది కాబట్టి. ఇది జానపద ఛందస్సు. జానపద ఛందస్సుకి ముఖ్య లక్షణాలు ఇవి:
1. ఇందులో repetitive patterns చిన్నగా ఉండి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఉదాహరణకి పై పాటలో "తందనాన" అన్నది మళ్ళి మళ్ళీ వస్తోంది.
2. ఈ repetitive patternsలో గురు-లఘు క్రమం ముఖ్యం కాదు. మొత్తం మాత్రల సంఖ్య ముఖ్యం. ఉదాహరణకి పై పాటలో "వరీ మడీ", "ఎండ్రకాయ", "ఉలవ పిండి" - వీటిలో గురు-లఘు క్రమం తేడా ఉన్నా మొత్తం మాత్రల సంఖ్య ఒకటే. మాత్రల మీద ఆధారపడే ఈ repetitive patternsని "మాత్రా గణాలు" అంటాం.
3. మాత్రా గణానికి తగ్గట్టు సాధారణంగా పదాలు విరుగుతాయి. ఒక వేళ కాని సందర్భంలో కూడా పాడేటప్పుడు అలా విరిచి పాడతారు.
4. మాత్రా గణాలకి నప్పడానికి ఒకోసారి అక్షరాలని సాగదియ్యడం, కుదించడం చేస్తారు. ఉదాహరణకి పై పాటలో "వరిమడి" అన్నది అసలు పదం. కాని నడక సరిపోవడం కోసం పాడేటప్పుడు "వరీమడీ" అని పాడతారు.
5. జానపద గీతాలలో, ఒకే రకమైన మాత్రా గణాలు ఎన్ని పాదాలకి ఉండాలన్న నియమం స్పష్టంగా ఉండదు.
అన్ని జానపద గీతాలకీ పై అన్ని లక్షణాలూ ఉంటాయని చెప్పలేను కాని సాధారణంగా ఈ లక్షణాలని గమనించవచ్చు. ఈ జానపద ఛందస్సునే "మాత్రా ఛందస్సు" అని కూడా అంటారు.
జానపదగీతాల నుంచి లలిత గీతాలు, వాటినుంచి సినిమా గీతాలు వచ్చాయి కాబట్టి, సినిమా పాటల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సంగీతంలో శాస్త్రీయ తాళాలు (మేళకర్త తాళాలు) ఛందస్సులో వృత్తాలవంటివైతే, చాపు తాళాలు మాత్రా ఛందస్సు వంటివి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పోలికలని మరికొంత వివరంగా పరిశీలించండి.
ఇది జానపద/మాత్రా ఛందస్సు!
జానపద ఛందస్సుల ప్రభావం కావ్యలపై ఉందని అన్నాను కదా. ఆ ప్రభావం ఏమిటో ఈపాటికి చూచాయగా మీకు తెలిసే ఉంటుంది. పైన చెప్పిన లక్షణాలలో 1, 3 లక్షణాలు కలిగిన వృత్తాలని కొన్నిటిని కవులు గుర్తించి, వాటిని తమ కావ్యాలలో అక్కడక్కడ ప్రయోగించారు. అలా వచ్చినవే మనం క్రితం టపాలో చూసిన "మత్తకోకిల", "లయగ్రాహి" వంటి వృత్తాలు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి - భుజంగ ప్రయాతం, పంచచామరం మొదలైనవి.
మత్తకోకిల ఛందస్సుని మళ్ళీ మీరు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అందుకే అలాంటి ఛందస్సులని వాటి నడకతో ("తాన తానన..." లాగ) గుర్తుపెట్టుకోవడం సులువు అవుతుంది.
మీరు జాగ్రత్తగా చూసి ఉంటే, కిందటి టపాలో నేనిచ్చిన మత్తకోకిల ఉదాహరణ నిజానికి మత్తకోకిల పద్యపాదం కాదు, యతి కుదరలేదు కాబట్టి. అది నేనెప్పుడో రాసుకున్న ఒక పాట పల్లవిలోనిది. ఆ పల్లవి ఇది:
నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో
గతము మరచెను వెఱ్ఱి హృదయము తేలిపోయెను హాయిలో
ఈ పల్లవిలో రెండో పాదం చూస్తే విషయం పూర్తిగా అర్థమవుతుంది! అది కచ్చితంగా మత్తకోకిల కాదు. కాని ఇది ఒక మాత్రా ఛందస్సు. దీని లక్షణం "3+4+3+4+3+4+3+2". ఇందులోని సంఖ్యలు మాత్రలని సూచిస్తాయి. మొదటి పాదం, రెండో పాదం కూడా ఇదే ఛందస్సులో ఉన్నాయి. అంటే "మత్తకోకిల" ఈ మాత్రా ఛందస్సుకి subset అన్న మాట!
ఈసారికి ఇక్కడతో ఆపుదాం. ఇప్పటికే ఎక్కువైపోయింది. మీ బుఱ్ఱలు వేడెక్కిపోయి ఉంటాయి :-) అందుకే ఈసారి ప్రశ్న సులువుగానే ఇస్తున్నాను. మాత్రా ఛందస్సుకి గ్రాఫు ఎలా గియ్యాలో ఆలోచించండి.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Friday, December 4, 2009
ఛందస్సుతో నడక - 4
Subscribe to:
Post Comments (Atom)
కామేశ్వర రావు గారూ, ఇంత మంచి వివరణాత్మ పరిశోధక వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు. అప్పుడు తడబడ్డాను కానీ, ఇప్పుడు అబ్బే భరనభభరవ చాలా ఇబ్బందిగా వుందండి. అన్నింటికి కాదండీ మత్తకోకిల కు మాత్రమే. ఉత్పలమాల / కందము ఇంకా పాతపాటే బాగుంది.
ReplyDeleteఇక మీరిచ్చిన ప్రశ్న
>>మాత్రా ఛందస్సుకి గ్రాఫు ఎలా గియ్యాలో ఆలోచించండి
అంటే X,Y axis ఎలా represent చేస్తే బాగుంటదని అడుగుతున్నారా? లేక వేరే భావనా?
భా.రా.రె గారూ,
ReplyDeleteటపా నచ్చినందుకు సంతోషం. ఈ టపాలో కాస్త థియరీ ఎక్కువ దట్టించేసానేమో అని అనుమానం వచ్చింది.
ఉత్పలమాల సరే కాని, కందం గురించి ముందుముందు మీ అభిప్రాయం మారొచ్చు, keep watching! :-)
ప్రశ్న మీరు సరిగానే అర్థం చేసుకున్నారు. మాత్రా ఛందస్సుని గుర్తించే గ్రాఫుకి x-axis, y-axis ఏది తీసుకుంటే బాగుంటుందన్నదే నా ప్రశ్న.
కామేశ్వర రావు గారూ,
ReplyDeleteఇప్పటి వరకు మీరు రాసిన వ్యాసాలనుంచి చాలా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నాను అంటే, సొంతగ ఒక చంపకమాల వృత్తము రాయగలిగేటంత. దానికి తోడు, ఎక్కడైనా వృత్త పద్యం కనపడినా వినపడినా సుళువుగా "తానన తాన తాన" logic తో decode చేయగలుగుతున్నాను. ఈ పద్దతి వివరించినందుకు ధన్యవాదాలు. భా.రా.రె గారి "భరనభభరవ" approach కన్నా నాకు ఇదే సుళువుగా ఉన్నది.
పోతే ఈ వ్వాసము కొంచెము అర్ధము అయీ అవ్వనట్టుగా ఉంది. మీరు ఈ discussionను ఎటు తీసుకొని వెళ్లబోతున్నారూ అని curiousగా ఎదురుచూస్తున్నాను.
-సురేష్
సురేష్ గారు,
ReplyDeleteచాలా సంతోషమండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ చంపకమాల పద్యాన్ని ఇక్కడో మీ బ్లాగులోనో మాతో పంచుకోండి. లోకో భిన్న రుచిః అన్నట్టు ఒకోరికి ఒకో విధానం సులువుగా ఉంటుంది. ఎలాగైనా, అందమైన పద్యం రాసామా లేదా అన్నదే ముఖ్యం! (అయినా కొన్నాళ్ళు పద్యాలమీద కృషి చేస్తే భా.రా.రెగారు కూడా మన తోవలోకి వచ్చేస్తారన్న నమ్మకం నాకుంది :-)
ఈ టపాలో మీకు అర్థం కానివేమైనా ఉంటే చెప్పండి, మళ్ళీ వివరిస్తాను. ఈ చర్చ ఎటు తీసుకువెళుతున్నాను అన్నది నాకూ తెలియదు! దీనికి ప్రత్యేకమైన గమ్యమంటూ ఏమీ లేదు (నేను అనుకోలేదు). ఛందస్సు గురించి నాకు తెలిసిన విషయాలని, నాకున్న ఆలోచనలని నలుగురితో (అంత కన్నా ఎక్కువమంది ఇవి చదువుతారని నేననుకోను) పంచుకోవడం, ఆసక్తి ఉన్నవాళ్ళతో చర్చించడం నా ఉద్దేశం.
కామేశ్వర రావు గారూ,
ReplyDeleteమొదటి పద్యము దైవాన్ని తలుచుకుంటూ ఉండాలనే ఉద్దేశ్యముతో ఈ చంపకమాల రాయటము జరిగినది. అలాగే ఛందస్సు మీద నా అభిప్రాయము మరో టపాలో, త్వరలో మీ ముందుకు తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నాను.
-సురేష్
పిలిచిన తోడనే బలికి, విఘ్నము లెల్లయు రూపు మాపి పొం
గులొసగు నేక దంతునకు, కోరిన కోర్కెలు దీర్చు దైవమా
కలియుగ వేల్పు వెంకనకు, గౌరికి, వాణికి, కాల కంఠుకం
జలిడుతు, శాంతి సౌఖ్యములొసంగుమటంచుచు భ క్తి వేడెదన్
సురేష్ గారు,
ReplyDeleteపద్యం బావుంది. "కాల కంఠుకం జలిడుతు" అన్నదొక్కటే కాస్త ఇబ్బందిగా ఉంది వినడానికి, విడగొట్టుకోడానికి. అయినా ఇది మీ మొదటి చంపకమాలలా మాత్రం లేదు!
ఛందస్సు గురించి మీ టపాకోసం ఎదురుచూస్తాను.
నా చిన్నప్పుడు మా స్కూల్లో తెలుగు మాస్టారు సులభంగా గణాలు గుర్తుంచుకోవటానికి ఈ పద్యాలు నేర్పించారు.
ReplyDeleteగురువులు మూడిడ మగణము
పర గంగా నాది గురువు భగణంబయ్యెన్
ధర మధ్య గురువు జగణము
సరస గుణా నంత్య గురువు సగణంబయ్యెన్
నగణంబునకు మూడు లఘువులు
యగణముబున కాది లఘువు యమతనయనిభా
రగణంబునకు మధ్య లఘువగు
తగణముబునకంత్య లఘువు దాక్షిణ్య నిధీ
అలాగే తెలుగు పద్యాల చందస్సు గుర్తుంచుకోవటానికి ఈ పద్యాలు.
ఇనగణత్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు నాటవెలది
సూర్యుడొక్కండు సుర రాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి
ఇంద్రగణములారు ఇనగణములు రెండు
పాద పాదమందు వచ్చుచుండు
తేట గీతి యైన ఆటవెలది యైన
చెప్పవలయు మీది సీసమునకు
Ayya baboi... entha bagundidendentha suluvuga nundi! nenu nercheskunta deenni.. office lo kurchoni evaru lenappudu browse chesthunna roju ee site ni... anduke ila english lo rayalsochhinanduku baadha ga vundi
Deleteకామేశ్వరరావుగారూ,
ReplyDeleteమీరన్నట్టు, "కాల కంఠుకం జలిడుతు" కొంచెము ఇబ్బంది గానే ఉన్నది. ఛందస్సు ప్రకారము పద్యము రాయటము లో నాకు కష్టముగా అనిపిస్తున్న పార్టు, ప్రాస. ఉదాహరణకు ఇక్కడ 'ల' తో కూడే పదము కానాలి. మీకు తెలిసి ఏమైనా మార్గాలు ఉంటే చెప్పగలరు.
పోతే ఈ సవరణ చూడండి..
పిలిచిన తోడనే బలికి, విఘ్నము లెల్లయు రూపు మాపి పొం
గులొసగు నేక దంతునకు, కోరిన కోర్కెలు దీర్చు దైవమా
కలియుగ వేల్పు వెంకనకు, గౌరికి, శూలికి, వాణికేను మొ
క్కులిడుతు, శాంతి సౌఖ్యములొసంగుమటంచుచు భ క్తి వేడెదన్
సురేష్ గారు,
ReplyDeleteమీరన్నట్టు తెలుగు పద్యాప్రవాహానికి అడ్డుకట్ట వేసేవి యతి ప్రాసలు. అందులో ముఖ్యంగా ప్రాస. ఉపజాతి పద్యాలలో (ఆటవెలది, సీసం మొదలైనవి) ప్రాసయతి ఇచ్చే అందం వృత్తాలలో యతిప్రాసలు సాధారణంగా ఇవ్వవు. అయితే మహాకవులు ఏదో ఒక విశేషాన్ని సాధించడం కోసం వీటిని ప్రత్యేకంగా ఉపయోగించి పద్యానికి అందాన్ని తెచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.
మీ సవరణ విషయానికి వస్తే, ఈ మార్పువల్ల యతి తప్పుతోంది, నాల్గవపాదంలో. ఇలా మార్చుకుంటే సరిపోతుంది:
కలియుగ వేల్పు వెంకనకు, గౌరికి, శూలికి, వాణికిన్ గృతాం
జలినయి, శాంతి సౌఖ్యములొసంగుమటంచుచు భక్తి వేడెదన్
"కృతాంజలినయి" అంటే అంజలి చేసినవాడనై అని అర్థం వస్తుంది.
కామేశ్వరరావుగారూ,
ReplyDelete"శూలికి, వాణికేను" కి బదులు "శూలికి, వాణికిన్" అనే చిన్న సవరణ మూలాన ఎంత అందమొచ్చిందండీ!!! న్ అనేది గణాలకోసము మాత్రమే అనుకున్నాను. కాని సరిగ్గా వాడితే లయకూడా చక్కగా మారే అవకాశము ఉందన్నమాట.
ఒకదానికి మందేస్తే ఇంకోటి వికటించినట్టు, ప్రాసగురించి ఆలోచిస్తూ, యతి సంగతి మర్చిపోయాను. సవరణకు ధన్యవాదములు.
మొన్న నేనొక మత్త కోకిల గట్టిగా దాని లయలో బయటకు చదువుతుంటే, ప్రక్కనుండి మా నాన్న,
ReplyDeleteరామనామము రామనామము రమ్యమైనది రామనా-మము
అన్నారు.
దీని బట్టి అస్సులు ఛందస్సుతో ఏ పరిచయమూ లేని వారు కూడా చాలా తేలికగా ఇలాంటి జనపద సమీప నడకలను గుర్తించగలరని తెలుస్తుంది.
నేను కూడా ఈ అంశం మీద కాస్త మెటిరియలు తయారు జేశాను.
త్వరలో వేస్తాను.
చక్కగా విశ్లేషణాత్మకంగా తెలియఁజేసిన మీకు ధన్యవాదపూర్వక నమస్కారములూ.
ReplyDeleteతెలుగుతల్లికి తెలుగువారికి ఎంతగానో అవసరమైన విషయాలు తెలియజేశారు.
ReplyDeleteకవులకు పండితులకు పాఠంలాంటిది మీ రచన