వచ్చే శుక్రవారంనుంచి ఆదివారం వరకు మూడు రోజులు (డిసెంబరు 25, 26, 27) మా విజయనగరంలో శ్రీ గరికిపాటి నరసింహారావుగారి శతావధానం జరగబోతోంది. ఇందులో నేనూ ఒక పృచ్ఛకునిగా పాల్గొనబోతున్నాను. నేనిచ్చే అంశం సమస్య. ఈ ఏడాది జనవరిలో వారి అష్టావధానంలో పాల్గొన్నాను. ఇంచుమించు ఏడాదికి మళ్ళీ ఇలా వారి శతావధానంలో పాల్గొనడం నా అదృష్టం.
వందమంది పృచ్ఛకులతో జరిగేది శతావధానం అని చాలామందికి తెలిసే ఉంటుంది. నిర్వాహకులకి అష్టావధానం కన్నా శతావధానం కష్టం. వందమంది పృచ్ఛకులని సమకూర్చుకోవడం ఒక కష్టం. పైగా దీనికి పట్టే సమయం ఎక్కువ. ఇప్పుడు జరగబోయే అవధానం మూడు రోజులు! అయితే అవధానికి మాత్రం అష్టావధానం కన్నా శతావధానం కొంత సులువు. జ్ఞాపక శక్తి (ధారణ) గట్టిగా ఉంటే చాలు. మొత్తం వందమంది పృచ్ఛకులున్నా ఉండే అంశాలు మాత్రం నాలుగే. సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు. ఇందులో ఆశువుకి చెప్పే పాతిక పద్యాలూ మళ్ళీ ధారణ చెయ్యక్కరలేదు. అష్టావధానంలో ఉండే నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి వంటి అంశాలు కష్టమైనవి. పైగా అందులో పలురకాల విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి (ఘంటా గణనం/పుష్ప గణనం, వ్యస్తాక్షరి మొదలైనవి).
అయితే చూసేవాళ్ళకి శతావధానం రోజుకి ఎనిమిది గంటలు, మూడురోజులపాటు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో అభిరుచి ఉన్నవాళ్ళకి మంత్రముగ్ధమైన వాతావరణం అనిపిస్తుంది. అందులోనూ గరికిపాటివారు "ధారణా బ్రహ్మరాక్షసులు" అని అనిపించుకున్న వారాయె! అయితే అవధానం రక్తిగట్టడానికి పృచ్ఛకులు అడిగే ప్రశ్నలు కూడా బాగుండాలనుకోండి.
ఆసక్తీ వీలు ఉన్నవాళ్ళు, మూడు రోజులూ సెలవు రోజులే కాబట్టి, రావచ్చు. మరిన్ని వివరాలకి ఇక్కడ చూడండి: http://vijayabhavana.blogspot.com/2009/12/blog-post_5240.html
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Saturday, December 19, 2009
శ్రీ గరికిపాటి నరసింహారావుగారి శతావధానం
Subscribe to:
Post Comments (Atom)
మీకీ అవకాశం దక్కినందుకు ఆనందంగా వుంది.ఆ అవధానం వీడియోని శ్రమ అనుకోకుండా రికార్డు చేసి బ్లాగులో అందిస్తే పాఠకులకు ఎనలేని సహాయాన్ని చేసినవారవగలరని మనవి.
ReplyDeleteగరికిపాటి వారి మాటలు వినడమే ఓ అద్భుత అనుభవం. మీకు నా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు.
ReplyDeletebhaskar gaaru annattu srama anukokunda video teesi upload chesi kustinta garikapatigaari dhArnA mAku vinpinchi punyam kattukondi. please.
ReplyDeleteకొన్ని రోజుల క్రితము మీ బ్లాగు చదువుతూ ఉంటే గరికిపాటి వారి అవధానము గురించి కనపడినది. download చేసుకొని విన్నాను. అద్భుతముగ ఉన్నది. Flight సమయము 4 గంటలు ఇట్టే గడిచిపోయింది. వారి పిల్లల పేరు్ల మీ ప్రశ్నకు బలే సమాధానము చెప్పారు. కాకతాలీయముగా, కాళహస్తీశ్వర మహాత్మ్యం మీద వారి MP3 కూడా ఈ మధ్యన విన్నాను. చాలా బాగుంది. ఆయన చెప్పినాక చదివితే ఆ పద్యాలు మరింత అందముగా ఉన్నాయి.
ReplyDeleteతప్పకుండా ఈ సారిగూడా కుదిరితే audio/videao పెట్టగలరు.
మీరు గత సంవత్సరం అందించిన అవధానం ఇంకా వింటున్నాము అప్పుడప్పుడూ! వచ్చే సంవత్సరం కోసం ఈ అవధానాన్ని కూడా రికార్డు చేయండి వీలైతే (కనీసం ముఖ్యమైన సమస్యలు, దత్తపదులను).
ReplyDeleteఅభినందనలు!
మూడు రోజులు జరిగే కార్యక్రమం కనక వీడియో తియ్యడం సాధ్యపడదేమో. ఆడియో కుదురుతుందేమో ప్రయత్నిస్తాను.
ReplyDeleteసంతోషమండీ
ReplyDeleteశ్రీ కామేశ్వర రావు గారూ,
ReplyDeleteమీ దగ్గర గరికిపాటి వారి అష్టావధాన, శతావధాన ఆడియోలు వుంటే దయచేసి లంకెల్ ఇవ్వగలరు. దూర దేశాలలో వున్న మాకు (సాహితీ మిత్రులం చాలా మంది వున్నాం ఇక్కడ) అదే కర్ణామృతం.
బుధజన విధేయుడు,
చంద్రశేఖర్.
సీడీలుగా ఉన్నాయండి. అప్లోడ్ చెయ్యడమే కొంచెం కష్టం. భాగాలుగా విడగొట్టి యూట్యూబ్ లోకి చెయ్యడం కుదురుతుందేమో చూస్తాను.
ReplyDelete