తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, June 22, 2009

తెలివి యొకింత లేనియెడ...

భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:

యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం
తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం:

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్

బహుశా యిది నాకు చాలాసార్లు అనుభవమయ్యింది కాబట్టి బాగా హత్తుకొని ఉంటుంది. చాలాసార్లు అనుభవం అయ్యిందంటే, ఎన్నిసార్లు అనుభవమైనా ఆ రోగం కుదరలేదని అర్థం! ఎప్పటికైనా కుదురుతుందనే ఆశ. నాలాగే యీ రోగం చాలామందికి ఉందన్న సంగతి తెలుసుకొని ఊరటపొందాలో మరింత బాధపడాలో మాత్రం తెలియటం లేదు. అందుకే సిసలైన తెలివిగలవాళ్ళు తక్కువైపోతున్నారు. నా అదృష్టం కొద్దీ యీ రోగంలేని ఆరోగ్యవంతులైన విజ్ఞుల సాంగత్యం నాకు కలిగింది.
ఇప్పటి Personality Development నిపుణులకి యీ శ్లోకాన్ని కాని వినిపిస్తే, "This is sheer inferiority complex of this poet" అని కొట్టిపారేస్తారేమో! "ఇలాటివి నువ్వు చదివి వంటపట్టించుకుంటే యిక నీ జన్మలో బాగుపడవు, జీవితంలో ముందుకి వెళ్ళలేవు" అని బెదరగొట్టే అవకాశమూ లేకపోలేదు. "ఇది పాచ్చింతకాయ పచ్చడి, యీ కాలంలో యిది పనికిరాదు. మనకి తెలిసింది గోరంతైనా తెలుసున్నది కొండంత అని చూపించుకోవాలి. చూపించుకోడమే కాదు అదే నిజమని నమ్మాలి కూడా. అవతలవాడసలు నీకన్నా తెలివైనవాడు ఎలా అవుతాడు?" ఇలా లెక్చరు మొదలుపెడతారు కూడా!
బహుశా ఇప్పుడున్న సమాజంలో "విజయం"(success) సాధించడానికి ఈ ధోరణి అవసరమే కావచ్చు. కాని ఎప్పుడైతే మనం మనకి సర్వం తెలుసు, లేదా మనకి తెలిసినది మనం విశ్వసించేదీ నూటికి నూరుపాళ్ళూ నిజం, మరొకళ్ళ దగ్గర మనమేదీ నేర్చుకోలేం అనే స్థితికి వస్తామో అప్పుడు బుద్ధిజీవిగా మనం చచ్చిపోయినట్టే అని నేననుకుంటాను. ఎందుకంటే మనిషి మెదడుకున్న అతి ముఖ్యమైన శక్తి నేరుచుకోవడం తెలుసుకోవడం (దీన్నే గ్రహణ శక్తి అంటారు). ఇది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండి వయసు మీదపడే కొద్దీ తగ్గుతుందంటారు. నా మనసెప్పుడూ ఆ పసితనాన్ని కోల్పోకూడదని నా కోరిక.

ఎప్పటి శ్లోకం ఇది! భర్తృహరి కాలం సరిగ్గా తెలియదు కాని ఉజ్జాయింపుగా రెండువేల సంవత్సరాల కిందటివాడనుకోవచ్చు. అప్పుడతను చెప్పిన సుభాషితాలు ఇన్నేళ్ళుగా ఎలా నిలిచాయి?! కాగితాలులేవే. పుస్తకాల ప్రచురణ లేదే. కంప్యూటర్లు లేవే. సీడీలు లేవే. వీటన్నిటికన్నా కూడా సమర్థవంతమైన టెక్నాలజీ ఒకటుంది. అది మనిషి మనసు. "సుకవి జీవించు ప్రజల నాలుకల మీద" అన్నారు కదా జాషువా. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి! ఇదే పద్ధతిలో మనకి చాలా సారస్వతం కొన్ని వేల యేళ్ళుగా ప్రసారమవుతూ వచ్చింది. ఈ పద్ధతివల్ల కలిగిన సిసలైన లాభం - ఈ చెప్పిన విషయాలని ప్రజలు తమ హృద్గతం చేసుకోడం. అంటే వీటిని మనసారా నమ్మి ఆచరించడం.
ఏ దేశానికైన సంస్కృతికైనా అయా దేశానికి లేదా సంస్కృతికి చెందిన పౌరులు ఆచరించవలసిన కొన్ని నీతి సూత్రాలు, నైతిక విలువలు (Moral values) ఉంటాయి. ఇవి కాలానుగుణంగా మార్పు చెందుతూ ఊండవచ్చు. కాని ఏ కాలంలోనైనా ఇవి ఉండకుండా పోవు. వీటిని ఆ ప్రజలందరి చేత ఎలా ఆచరింపజెయ్యాలి? ఇది చాలా కష్టమైన విషయం! మన సంస్కృతి కొన్నేళ్ళ క్రితం వరకూ దీనికోసం ఎంచుకున్న మార్గం సాంస్కృతిక ప్రచారం - ఇది ప్రధానంగా కళల ద్వారా, సంప్రదాయాల ద్వారా జరిగేది. ఈ నైతిక విలువలు ప్రజల జీవితంలో భాగమై పోయేవి. దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ నీత్రి సూత్రాలని పాటించని వాళ్ళు అరుదుగానే ఉండేవారని ఊహించవచ్చు.
సరే, ఇప్పుడు మనకా నీతి సూత్రాలు పనిచెయ్యవు. నిజమే! వీటన్నిటినీ కట్టకట్టి ఏ అరేబియా సముద్రంలోనో పడేద్దాం. మంచిది. ఇప్పుడు మన సమాజంలో మనం పాటించాల్సిన నీతి సూత్రాలేంటి? మనది సర్వ తంత్ర స్వతంత్ర దేశం. ఈ దేశ పౌరులుగా మన రాజ్యాంగానికి మనం బద్ధులమై ఉండాలి. మన రాజ్యాంగంలో Fundamental Duties అని ఉన్నాయని ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో చదువుకున్నాం. అంతకు మించి ఎందరికి వాటి గురించి తెలుసు? తెలిసినవాళ్ళు ఎంతమంది వాటిని పాటిస్తున్నారు? మనకి కావలసిందల్లా మనం చేసే పనులు చట్టబద్ధమా కాదా అని. అది తేల్చడానికి కోర్టులు! చట్టం నుంచి తప్పించుకోగలిగినంత వరకూ అందరూ దొరలే! ఇప్పుడు మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలో ప్రజలు తప్పులు చెయ్యకుండా ఉండేట్టు చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నమూ లేదు. తప్పు చేస్తే విచారించి శిక్షించడానికి తప్ప! తప్పు చేస్తే విచారించి శిక్షించాల్సిన వ్యవస్థ ఉండాలి, కాదనడం లేదు నేను. అది మనకి ఎప్పుడూ ఉంది. But that should be for exceptions. ఇప్పుడు నీతిగా బతక గలగడం ఒక exception అయి కూర్చుందే!
మనం నమ్మిన నీతిని ప్రజల మనసుల్లోకి వెళ్ళేలా చేసి, అది వారి జీవితంలో భాగం కాగలిగినప్పుడే దాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యడం సాధ్యం. లేని నాడు కోట్లకి కోట్లు రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఖర్చు పెడుతూనే ఉంటాం. వాటికి అందనంత ఎత్తులో అవినీతి ఎప్పుడూ తాండవం చేస్తూనే ఉంటుంది! దీనికి ప్రత్యామ్నాయం వెతకాలంటే మనం కళలనీ సాహిత్యాన్ని ఆశ్రయించాలి. వాటికున్న శక్తిని తక్కువ అంచనా వెయ్యడం సబబు కాదు. మొన్న మొన్న జాతీయోద్యమ కాలంలో ప్రజలలో దేశభక్తిని రగల్చడానికి ఇవి ఎంతగా సాయపడ్డాయో మనకి తెలుసు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు వయోజనవిద్య కుటుంబనియంత్రణ మొదలైన విషయాల ప్రచారానికి ప్రభుత్వం కళలని వాడుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది మధ్యలో ఎప్పుడో తెగిపోయింది. నీతిశతకాలకీ, వీథి భాగవతాలకీ, హరికథలకీ, నాటకాలకీ కాలం చెల్లిపోయింది సరే. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన "కళ" సినిమా. దీనిద్వారానైనా ఎందుకు మన ప్రభుత్వం ప్రచారం చెయ్యకూడదు? ఓ సినిమాలో ఓ పెద్ద హీరో తన మేనకోడలి హత్యకి ప్రతీకారంగా విలన్ని చంపాలనుకుంటాడు. ఒక హీరోయిన్ ఇది తప్పుకాదా అంటుంది. "అలనాడు రాముడు వాలిని చెట్టుచాటునుండి చంపాడు. అవసరమైనప్పుడు అలా చెయ్యడం న్యాయమే!", అని మన హీరోగారి జవాబు. దానికి జనాలు ఈలలూ చప్పట్లూనూ! చట్టవిరుద్ధమైన పనిని అంత బహిరంగంగా ప్రోత్సహిస్తున్న ఆ సినిమా అసలెలా సెన్సారవ్వకుండా విడుదలయ్యింది? అని నిలదీసేవాడు ఒక్కడూ లేడు. ఇది ఏదో ఒకటో రెండో సినిమాల్లో కనిపించే ధోరణి కాదే! మరి దీని గురించి ఒక్కడూ గొంతు పెగల్చడేం? రామాయణమ్మీద విరుచుకుపడమంటే మాత్రం మనకి అమితోత్సాహం!
ఇప్పటికీ మన దేశంలో ఒక సగటు పౌరునికి రక్షణకోసం ప్రభుత్వం ఖర్చుపెట్టే నిధులు అమెరికాలాంటి ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అనీ, అయినా మన దేశ పౌరుడికున్న భద్రత, ఆ ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువనీ అమర్త్య సేన్ చాలా స్పష్టంగా చెప్పారు. సాంస్కృతికంగా మనకున్న నైతిక విలువలే దీనికి కారణమై ఉండాలని కూడా అన్నారు. ఇప్పటికైనా ఈ విషయమై అందరూ కళ్ళు తెరిచి ఏదైనా చేస్తే బాగుంటుంది.

అబ్బో! పద్యాన్ని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాను. మనసు కోతి కాబట్టి అదెప్పుడూ శాఖాచంక్రమణం చేస్తూనే ఉంటుంది. సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, లక్ష్మణ కవి యీ శ్లోకానికి చేసిన అనువాదం నాకంతగా నచ్చలేదు. ఎందుకంటే మూల శ్లోకంలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలని అనువదించకుండా వదిలేశాడు.
ఒకటి: "గజ ఇవ మదాంధః". ఏనుగువలె మదాంధుడినయ్యాను అని. మదము అంటే రెండర్థాలున్నాయి. గర్వం అన్న అర్థం ఒకటైతే, ఏనుగు చెక్కిళ్ళనుంచి కారే ద్రవం అని మరో అర్థం. ఇక్కడ ఏనుగు పరంగా మదం అంటే రెండవ అర్థం వస్తుంది. తన పరంగా గర్వం అన్న అర్థం వస్తుంది. అందుకక్కడ ఏనుగుతో పోలిక సమంజసం. కాని అనువాదంలో ఆ పదం లేదు. అంచేత ఆ ఔచిత్యం లేదు.
రెండు: గర్వమనే జ్వరం పోయింది అని సంస్కృతంలో ఉంది. ఇది చాలా హృద్యమైన పోలిక. ఇది కూడా అనువాదంలో లోపించింది.
అయినా తెలుగు పద్యం చదువుకోడానికి హాయిగా ఉంది!

21 comments:

 1. వ్యాఖ్యగా నాకు నచ్చిన సుభాషిత రత్నం

  "స్వాయత్తమేకాంతహితం విధాత్రా
  వినిర్మితం చాదనమజ్ఞతాయాః
  విశేషతః సర్వ విదాం సమాజే
  విభూషణం మౌనమపణ్డితానామ్"

  మొన్నామధ్య ఓ పనికిమాలిన హెచ్ ఆర్ వాళ్ళ ట్రయినింగులో ఓ ప్రశ్న అడిగారు ఒక్కొక్కరినీ. "నీలో నీకు కనిపించే గొప్ప గుణాలేవి" అని. అందరూ ఏవేవో చెప్పారు. నా వంతు వస్తే, "ఏవీ లేవని" నేను, నా మిత్రుడూ చెప్పాం. మీరన్నట్టు అది "inferiority" గా ప్రొజెక్ట్ చేయబడింది. :)

  ReplyDelete
 2. It will be nice to first give tAtparyam (pratipdArdhaM) first and then write your commentary. BTW the first line itself has a typo. (saMBavaM?) Or is the samaBavaM correct?

  cUsArA? tAtparyaM lEkapOtE EmI teliyani nAku kUDA tappulu vedikE power vaccEsiMdi. ;-) me looking like yEnugu already? :-(

  ReplyDelete
 3. భైరవభట్ల గారు - మంచి పద్యం పరిచయం చేసారు. ధన్యవాదాలు.

  అనానిమస్ గారు -

  తాత్పర్యం: కొద్దిపాటి జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నప్పుడు మదగజం లాగా మదించి నేనే సర్వజ్ఞుణ్ణని భావించినాను. తరువాత మెధావంతులైన పెద్దలవల్ల కొద్దికొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత నాకేమీ తెలియదనీ, మూర్ఖుణ్ణనీ భావిస్తూ పూర్వపు గర్వాన్ని వదలి సుఖంగా ఉన్నాను.

  వివరణ: ఒక పండితుడు ఈ పద్యం లో తన అనుభవాన్ని వివరిస్తున్నాడు.
  "అల్పో విద్యో మహాగర్వీ" అనే న్యాయానుసారం కొద్దిగా చదువుకున్న వాడికి గర్వమెక్కువగా ఉంటుంది. ఆ గర్వం తో వాడు సర్వజ్ఞుణ్ణని భావిస్తాడు. తర్వాత పండితుల వద్ద విద్యలను నేర్చుకుని కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత అతని వివేకం కలిగి అంతకు పూర్వపు గర్వం తొలగిపోయి ’నేను మూఢుణ్ణి, ఏమీ తెలియని వాడిని అని భావిస్తాడు’ వేమన కూడా ఇలాంటివాళ్ళ గురించే

  "అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను
  సజ్జనుండు పల్కు చల్లగాను
  కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా" - అని అన్నాడు
  ఎవడు అల్పజ్ఞ్నుడైనా తనను సర్వజ్ఞుడని భావిస్తాడో వాడు మూర్ఖుడనీ, ఎవడు సర్వజ్ఞుడైనా తనను మూఢుణ్ణి గా భావిస్తాడో వాడు విద్వాంసుడనీ తాత్పర్యం.


  గమనిక: పైన తాత్పర్యం నాకు గ్ర్తుకు ఉన్నంతలో రాసినది. దాని క్రింద ఉన్న "వివరణ" ఆచార్య రవ్వా శ్రీహరి గారి "బర్తృహరి నీతిశతకము - దీపికా వ్యాఖ్యాసహితం" అను పుస్తకం లోనిది. మిగతా చదువరుల సౌలభ్యం కోసం ఇక్కడ ఉంచడం జరిగింది.

  :)

  ReplyDelete
 4. బాగుందండి, బాగా చెప్పారు.

  ~సూర్యుడు :-)

  ReplyDelete
 5. Thanks Bhairava Bhatla gaaru

  ReplyDelete
 6. మన సంస్కృతినీ,భాషనూ కాపాడుకోవాలని అనుకుంటున్నవారు మన బ్లాగ్మిత్రులలో చాలా మంది ఉన్నారు.వారంతా వారి వారి బ్లాగులలో వారికి చేతనయిన విధంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఆ కృషి బహుముఖంగా కొనసాగాలన్నదే మనందరి ఆకాంక్షానూ. ఎందుకంటే బ్లాగింగ్ అనే ప్రక్రియ కూడా నేటి సినిమాలవలె చాలా ప్రభావం చూపగల ప్రక్రియ.నేటి కంప్యూటరు యుగంలో సాంకేతికతను సంస్కృతీ ప్రచారానికి వాడుకోవటం వలన మంచి ఫలితాలు చాలా తక్కువ కాలంలోనే సాధించటానికి వీలుకలుగుతుందని నా కనిపిస్తుంది.నేటి యువతరం కూడా మనందరం ఆశ్చర్యపోయే రీతిలో ఈ బ్లాగింగ్ వలన ప్రభావితం అవుతున్నది.మంచిని గ్రహించటానికి ప్రయత్నిస్తున్నది. చాలామంది తమ వృత్తివిరమణానంతరం మొదట్లో కేవలం కాలక్షేపానికి మాత్రమే బ్లాగింగ్ లో ప్రవేశించినా తరువాత తరువాత వారు వారి అనుభూతుల్ని అందరికీ పంచిపెట్టి లోకా స్సమస్తా స్సుఖినో భవంతు అనే వారి ఆకాంక్షను సాకారం చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లుగా నా కనిపిస్తుంది. మీరు చేస్తున్నది కూడా అదే కదా. మనం వ్రాసిన దానిని అందరికీ తేలికగా చేర్చగలిగే మార్గం సరిగా ఉపయోగిస్తే మిరకిల్స్ సృష్టించవచ్చు. నా శ్రీమదాంధ్రమహా భారతం ఫాలో అవుతున్న వారిలో పెద్దవారికంటే యువకులే అధికంగా ఉన్నారని నాకు అనిపిస్తున్నది. ఎవరిమటుకు వారు వారి వారి పరిధుల్లో చేయగలిగినంత చేసుకుంటూ పోవటమే మన కర్తవ్యం. తెలుగు పద్యాల వ్యాప్తి, సంస్కృతశ్లోకాల పట్ల అనురక్తి, తెలుగులో ఉపయోగించటానికి వీలయ్యే సాంకేతిక పరిభాషా పదాస కొత్త సృష్టి, తెలుగులో అంతర్జాలం ద్వారా ఫద్యావధాన నిర్వహణ -ఇవన్నీ కూడా ఈ మన ప్రచారంలో భాగాలే. అందరూ కలసి నడుద్దాం. అప్పుడే మన గమ్యాన్ని త్వరగా చేరగలుగుతాం.

  ReplyDelete
 7. పదాస అని తప్పు పడింది. పదాల అని గ్రహించగలరు.

  ReplyDelete
 8. మళ్ళీ వేలు పెడుతున్నాను. యోగి గారి వివరణ టపాకు ధీటుగా ఉంది.

  కామేశ్వర రావు గారు,

  "ఏనుగు చెక్కిళ్ళ నుంచి కారే ద్రవం" .... ఏనుగు చెక్కిళ్ళ మీదుగా అని ఉండాలనుకుంటున్నాను. గండ స్థలం, (మగ) ఏనుగు తలపై, మెడ భాగానికి మధ్య ఓ గుంత అని విన్నట్టు గుర్తు.

  రఘువంశం 6 వ సర్గ లో ఓ ఉత్ప్రేక్ష్యాలంకారం గుర్తొచ్చింది. (పద్యం గుర్తు లేదు). ఇందుమతి అనే ఆవిడ స్వయంవరానికి అనేక రాజులు వచ్చారు. వారి వెంటనే పరివారమూ, గజరాజులూ...అక్కడ ఎంత మంది రాజులు వచ్చారంటే...ఆ వచ్చిన గజాల మదజలంతో తడిసి, అక్కడి ప్రదేశమంతా చిత్తడి చిత్తడిగా మారిపోయిందట.

  ReplyDelete
 9. avunu subhashitalanu max mullar kaapadaledu kadaa avi elaa batiki unnayi chepmaa??

  ReplyDelete
 10. మాక్సుముల్లర్ వేదాలని కాపాడాటనటంలో ఇసుమంతైనా వాస్తవంలేదు...!!
  వేదాలు కాని, మన ప్రాచీన విద్యలు కాని కేవలం మౌఖికంగా ఒక తరం నుంచి మరొక తరానికి వేల సంవత్సరాలపాటు సంక్రమిస్తూ వచ్చాయి.

  ReplyDelete
 11. @రవిగారు,
  మీరిచ్చిన సుభాషితంలో నీతిని నేను కూడా పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు చెప్పిన ఏనుగు తలపైన భాగం కుంభస్థలం, గండస్థలం కాదు. గండస్థలమంటే చెక్కిలనే అనుకుంటాను. "గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత..." అని శ్యామలాదండకంలో వస్తుంది. అయినా మీరన్నట్టు చెక్కిళ్ళనుంచి అంటే నా ఉద్దేశం చెక్కిళ్ళ మీదనుంచి అనే.
  మీరన్న రఘువంశ శ్లోక స్ఫూర్తితోనే అనుకుంటాను తిక్కన యీ పద్యం రాసింది: "ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజి నణగు"

  @యోగిగారు,
  మీ వివరణకి నెనరులు. ఒక చిన్న విషయం. ఎవడూ సర్వజ్ఞుడు కాలేడు. అంచేత తనింకా తెలుసుకోదగినది చాలా ఉంది అని భావించేవాడే విజ్ఞుడు.

  @ఒకటో అనానిమస్ గారు,
  (పూర్వం నాటకాల్లో ఒకటో కృష్ణుడూ, రెండో కృష్ణుడూ ఇలా ఉండేవారట ఒకే నాటకంలో. ఇలా సంబోధిస్తూ ఉంటే అది గుర్తుకొచ్చింది :-)
  తాత్పర్యం ఇవ్వకపోవడం నా తప్పే. తెలుగు పద్యం ఇచ్చాను కదా వేరే తాత్పర్యం అక్కరలేదనుకున్నాను. ఈసారి నుండి క్లుప్తంగా తాత్పర్యాన్ని కూడా ఇస్తూ ఉంటాను. సమభవం కరక్టేనండి. దాని అర్థం "ఉన్నానో" అని (ఎప్పుడు కొంచెమే తెలిసి ఏనుగులా మదాంధుణ్ణయి ఉన్నానో - అని ఆ మొదటి పాదం అర్థం).

  @ నరసింహగారు,
  మీ ఉత్సాహమ్మీద నీళ్ళు జల్లడం నాకిష్టం లేదు. అయినా ఒక చిన్న విషయం. నేనిక్కడ రాస్తున్నవి నా మనసుకి తృప్తినివ్వడానికే కాని ఏదో ప్రచారం చెయ్యాలని కాదు. నాకంత పాపులారిటీ కూడా లేదు! రెండు, నేనీ టపాలో ప్రస్తావించింది మన ప్రాచీన సంస్కృతిని సంప్రదాయాలనీ ప్రచారం చెయ్యాలని కాదు. మన దేశంలోని ప్రజలందరికీ ఉండాల్సిన నైతికవిలువలని ప్రజల జీవన విధానంలో భాగమయ్యే విధంగా చూసుకోవాలని. దానికొక మార్గం సాహిత్యం, కళలూను. అమెరికాలో కూడా కొన్ని విలువలు ప్రజల జీవన విధానంలో అంతర్భాగమైనవి ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళ traffic sense, time sense మొదలైనవి. ఇవి కేవలం వాళ్ళు చట్టానికి లొంగి అనుసరిస్తున్నవిగా కనిపించవు. వాళ్ళ స్వభావాల్లో స్వతహాగా ఆ విలువలు పెంపొందించ గలుగుతున్నారు. నేను ప్రశ్నిస్తున్నది మనం మన పౌరులలో మనకి అవసరమైన విలువలని పెంపొందిస్తున్నామా అని.

  @రెండో అనానిమస్ గారు, మల్లేశ్వర్ గారు,
  ఇవన్నీ నిరుపయోగమైన వాదాలని నా ఉద్దేశం (స్వానుభవం మీద తెలుసుకున్నది). అంచేత దయచేసి ఇందులోకి నన్ను లాగకండి.

  @సూర్యుడుగారు, కుమార్ గారు,
  నెనరులు.

  ReplyDelete
 12. వేదాలు అపౌరుషేయాలు. అక్షరాలను కలిపి చదువు కునే పుస్తకాలు కాదు. స్వరయుక్తంగా గురుముఖంగా నేర్చుకునేవి. వేదాలలోని సామవేదానికి, వేయికి పైగా శాఖలున్నాయి. ఒక్కొక్క శాఖ నేర్చుకుంటానికి 8 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది వేదరాశి. బాషా, సంస్కృతి, తెలియని వ్యక్తి తన సగం జీవితంలో వేదాలన్నీ ఉద్దరించేశాడంటే నమ్మేవారికి, వేదాలగురించి ఎంతతెలుసు? మాక్సుముల్లర్ మహాశయుడు చేసినది తనకు లభ్యమయిన కొలదిపాటి వేదాలను పుస్తకరూపంలో ఉంచాడు. వాటికి తనకున్న సంస్కృత పరిజ్ఞానంతో వ్యాఖ్యానం చెప్పారు. జర్మనులో, ఇంగ్లీషులో పుస్తకాలు ప్రచురించి పశ్చ్యాత్తులకు పరిచయం చేశాడు.

  ReplyDelete
 13. "ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజ..." ఈ పద్యం ధర్మ రాజును గురించి బృహన్నల చెప్పినట్టు నర్తన శాల సినిమాలో చూశాను. ఈ పద్యం (ఇంకా తిక్కన పద్యాలవీ) అంతర్జాలంలో ఎక్కడైనా దొరికితే చెప్పగలరా? తితిదే వారి భారతం కొనాలని వెతుకుతున్నాను. దొరకట్లేదు.

  నర్తన శాల లోనే మరో పద్యం, "కాంచన వయ వేదికా సముద్యేతనోజ్జ్వల విభ్రమము వాడు కలశజుండు..." ఇదీ తిక్కనదేనా? నాకు చాలా చాలా ఇష్టమైన ఘంటశాల వారి పద్యం ఇది.

  ReplyDelete
 14. "ఎవ్వానివాకిట..." పద్యం నిజానికి బృహన్నల చెప్పిందికాదు. ఎవరు చెప్పారో తెలుసుకోవాలంటే నా తర్వాత టపా దాకా వేచి ఉండండి :-) నాకిష్టమైన పద్యాల్లో అదొకటి కాబట్టి దాని గురించి రాద్దామన్న ఉత్సాహం కలిగింది. తిక్కన భారత భాగాలు కొన్ని digital libraryలో ఉన్నాయి. "కాంచన మయ..." - ఇది కూడా తిక్కన పద్యమే. నిజమే, ఘంటసాల గొంతులో యిది ఎంతో అద్భుతంగా వినిపిస్తుంది! అసలా సందర్భంలో ఎన్నెన్ని మంచి పద్యాలున్నాయో!

  ReplyDelete
 15. రవి గారు

  http://ghantasala.info/padyaalu/index.html

  ఇక్కడ కొన్ని ఘంటసాల వారి పద్యాలున్నాయి కానీ నర్తనశాలవి కనిపించలా!

  ReplyDelete
 16. @యోగి: అక్కడ లేదండి. నేను వెతికానక్కడ ఒకప్పుడు. నా వద్ద నర్తన శాల డీవీడీ ఉంది. సినిమా డీవీడీ లో చూశానా పద్యాలు.

  ReplyDelete
 17. గండస్థలం అంటే చెక్కిలి మీరన్నట్టు. కాళిదాసు ఋతుసంహారంలో ఈ శ్లోకం ఆస్వాదించండి.

  నేత్రేషు లోలః మదిరాలసేషు
  గండేషు పాండుః కఠిన స్తనేషు
  మధ్యేషు నిమ్నో జఘనేషు పీనః
  స్త్రీణామనంగో బహుధా స్థితోధ్య

  గండేషు పాండుః - పాండువర్ణపు చెక్కిళ్ళలో.

  ReplyDelete
 18. గండకు మరో ఉదాహరణ:
  జయదేవ అష్టపది 'హరిరిహ ముగ్ధవ'/'చందన చర్చిత'లో వినిపించే "గండ యుగ స్మిత శాలీ .." అనే మాట. ఇక్కడా చెక్కిలి అనే అర్థం కదా?

  ReplyDelete
 19. కాలనేమిJuly 8, 2009 at 1:24 PM

  ఇంటర్మీడియట్ సంస్కృతం పాఠ్యాంశాల్లో ఒక పాఠంలోని ఒకానొక సమాసం బాగా గుర్తుంది -

  "అభినవమదరేఖాశ్యామగండస్థలానాం" - మదపుటేనుగును గూర్చిన వర్నన అనుకుంటా. ఇక్కడ కూడా ’గండ’ అంటే చెక్కిలి నే.

  ReplyDelete
 20. అవును, గండస్థలం అంటే చెక్కిలే. ఇందులోంచే "గండూషము" (పుక్కిలింత) కూడా వచ్చిందనుకుంటాను.
  రవిగారు, మీరిచ్చిన శ్లోకాన్ని చక్కగా ఆస్వాదించాను :-) కాళిదాసు గొప్పదనమంతా అక్కడ "అనంగ" అన్న పదప్రయోగంలో ఉంది!

  ReplyDelete
 21. @రవి .. That is so cool. నిన్ననే కొంపెల్ల భాస్కర్ గారు వాల్మీకి కాళిదాసుల ప్రకృతివర్ణనల్ని పోలుస్తూ రాసిన వ్యాసంలో ఈ శ్లోకం చదివి, హమ్మ కాళిదాసూ, నీతో పనికాదు అనుకున్నా.
  ఇంకా నిక్కచ్చిగా చెప్పాలి అంటే, ఏకవచనంలో గండ అంటే ఒక బుగ్గ. మీరు గమనిస్తే, సంస్కృత ప్రయోగాలన్నిట్లోనూ రెండు బుగ్గలు అనే ద్వివచనంలోనో, లేక సంఖ్య ప్రస్తావన లేకుండా బుగ్గలు అన్న బహువచన వాడుకలోనో కనిపిస్తుంది.

  ReplyDelete