తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, July 16, 2009

మూర్ఖోపాఖ్యానం

రామాయణంలో పిడకల వేటలాగా, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తిక్కన భారతం మధ్యలో యీ మూర్ఖోపాఖ్యానం! నేనేం చెయ్యను, హఠాత్తుగా నాకీ పద్యాలు ఇవ్వేళ (మళ్ళీ) గుర్తుకొచ్చాయి మరి. గుర్తుకు రావడం వెనక ఒక కారణం ఉంది కాని, అదిక్కడ చెప్పడం సభ్యత కాదు, అవసరమూ లేదు. అసలీ పద్యాలు (వచ్చిన వాళ్ళకి), ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో భర్తృహరి రాసినా, ఆ తర్వాత ఎప్పుడో లక్ష్మణకవి తెలుగు చేసినా, వీటికి కాలదోషం పట్టకుండా (అదే expire అవ్వకుండా) ఉండడానికి మనవేఁ కారణం. మూర్ఖులున్నంత వరకూ ఇవి నిలిచే ఉంటాయి!

బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయ దూషితా
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితం

బోద్ధలగువారు మత్సరపూర్ణ మతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజు లబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు

తెలిసినవాళ్ళేమో అసూయాపరులు, ప్రభువులేమో గర్వాంధులు. ఇతరులకి విని బోధపరచుకొనే తెలివిలేదు. చెప్పాలనుకున్న సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది.

మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా
యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటకు తియ్యవచ్చు, నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతోకూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు, పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. మూర్ఖుడి మనసుని మాత్రం ఒప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు! (సంస్కృతంలో మొండిపట్టుపట్టిన మూర్షుడు అని ఉంటుంది)

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప లేము

ప్రయత్నిస్తే ఇసుకలోంచి చమురుని తియ్యడం సాధ్యమవచ్చేమో. ఎండమావి వెంటబడి అందులో నీరు తాగవచ్చునేమో. కొమ్మున్న కుందేలుని వెతికి పట్టుకోవచ్చేమో. ఇవేమీ చేసే అవకాశం లేదు కాని కనీసం చెయ్యవచ్చేమో అని ఆలోచించవచ్చు. కాని మూర్ఖుని మనసుని ఒప్పించే, మార్చే ప్రయత్నాన్ని మాత్రం ఊహలో కూడా చెయ్యలేము!

కరిరాజున్ బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింప, దీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుం జింద యత్నించు, ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్

మదపుటేనుగును తామరతూళ్ళతో కట్టడానికి ప్రయత్నించేవాడు, దిరిసెనపువ్వులతో వజ్రాన్ని కోయ్యాలనుకునేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చాలని చూసేవాడు, మంచిమాటలతో మూర్ఖులకి చెప్పే ప్రయత్నం చేసేవాడు వీళ్ళందరూ ఒకలాంటి వాళ్ళేనట!


ఈ పద్యాలు చదివినప్పుడల్లా, భర్తృహరి ఎంతమంది ఎలాంటి మూర్ఖులని కలిసి వాళ్ళతో వాదించాల్సి వస్తే ఇంతలా యీ మూర్ఖపద్ధతిని వర్ణించేవాడూ అనిపిస్తుంది. ఆ బాధ ఏవిఁటో తెలుసుకాబట్టి, అతని మీద జాలికూడా కలుగుతుంది.

మూర్ఖులు చాలా రకాలుగా ఉంటారు. తాము మూర్ఖులమని తెలియని వాళ్ళు కొందరైతే, తెలిసిన వాళ్ళు మరికొందరు. వీళ్ళు తెలుసున్న మూర్ఖులన్న మాట! మళ్ళీ ఇందులో, కొంతమంది తమ మూర్ఖత్వానికి సిగ్గుపడి మౌనంగా ఉండలనుకొనేవారు కొందరైతే, తమ మూర్ఖత్వానికి తాము గర్వపడుతూ, దానికి రకరకాల పేర్లుపెట్టి విజృంభించేవారు మరికొందరు.
వీళ్ళందరూ కాక మూర్ఖులలో మరో రకం కూడా ఉన్నారు. అదెవరో తెలుసా, ఇదుగో పైన చెప్పినట్టు, మూర్ఖుల మనసు మార్చలేమని తెలిసి తెలిసీ వాళ్ళతో వాదనకి దిగేవాళ్ళున్నారు చూడండీ, వాళ్ళది తెచ్చిపెట్టుకున్న మూర్ఖత్వం!

నా స్నేహితుడొకడు మొన్నొకసారి హఠాత్తుగా ఓ పొడుపుకథ పొడిచాడు. "ఒరేయ్! జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది కదా. అలాగే మూర్ఖుడూ మూర్ఖుడూ రాసుకుంటే ఏం రాలుతుంది(తాయి) చెప్పుకో?" అని అడిగాడు. నేను చాలాసేపు ఆలోచించి... రకరకాలుగా ప్రయత్నించి... చించి... ఆఖరికి ఓటమిని ఒప్పేసుకొని వాడినే జవాబు చెప్పమన్నాను. అప్పుడు వాడు, "ఈ మాత్రం తెలీదా, బ్లాగులలో కామెంట్లు!" అని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి చక్కా జారుకున్నాడు!
"హు... వాడంతే...వాడొక నిజమైన బ్లాగరి (బ్లాగ్ + అరి = బ్లాగులకి శత్రువు)!" అనుకొని వాడన్నమాటని తీవ్రంగా కొట్టిపారేసాననుకోండి. వాడి మాటలకి మీరెవ్వరూకూడా ఏవీఁ "ఫీలు" కాకండేం.

పిడకలవేట సమాప్తం. తర్వాత పోస్టులో తిరిగి మనం తిక్కన దగ్గరికి వెళ్ళిపోదాం.

16 comments:

  1. ప్రసహ్య మణిముద్ధరేత్ మకర వక్త్ర దంష్ట్రాక్తరౌ
    సంతరేత్ ప్రచల దూర్మిమాలాకులం
    భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్
    నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్

    (ఏదో తప్పు కనిపిస్తుంది. అదేదో తెలియట్లేదు)

    ఇది వరకు ఇంకో బ్లాగరి ...కాదు ..బ్లాగర్ ను కలిసినప్పుడాయన ఈ శ్లోకం తోనే తను సంస్కృతం మొదలెట్టేనని చెప్పారు. అప్పుడూ, తిరిగి ఇప్పుడూ గుర్తు చేసుకున్నాను.

    మీరు చెప్పిన మూర్ఖుల కోవలో నేను 3వ కోవకి చెందిన వాణ్ణే. వారం ముందు 5 వ తరగతి తెలుగు వాచకం చూశాను. అందులో కూడా ఈ పద్యాలున్నాయి. గొప్ప వాళ్ళకంటే కూడా ముందు మూర్ఖుల గురించి తెలుసుకోవడం ముఖ్యమని బాగానే కనుక్కున్నారు, మన ఎడ్యుకేషన్ బోర్డు వారు!

    ReplyDelete
  2. సంతరేత్ సముద్రమపి

    ReplyDelete
  3. వ్యాళం బాల మృణాలతంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే
    భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాన్తేన సన్నహ్యతే
    మాధుర్యం మధుబిన్దునా రచయితుం క్షారాంబుధేరీహతే
    మూర్ఖాన్ యః ప్రతినేతుమిచ్ఛతి బలాత్ సూక్తైః సుధాస్యన్దిభిః

    ReplyDelete
  4. రవిగారు, నాగమురళిగారు,

    తక్కిన రెండు పద్యాలకికూడా సంస్కృత శ్లోకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీలుచూసుకొని వీటన్నిటినీ కలిపి పద్యం.నెట్లో పెడతాను.
    నాకు "వ్యాళం బాలమృణాలతంతు..." అన్న శ్లోకానికి లక్ష్మణకవి అనువాదం అంతగా నచ్చలేదు. ఎలకూచి బాలసరస్వతి అన్నతనుకూడా భర్తృహరి శతకాలని తెలుగులోకి అనువదించారు. కొన్ని పద్యాలు అతని అనువాదాలు నాకు ఎక్కువ నచ్చుతాయి. దీనికి అతను చేసిన అనువాదం:

    దిరిసెంపువ్విరిచేత వజ్రమణి భేదింపం దలంచు న్మద
    ద్విరదేంద్రంబు మృణాళతంతువున బంధింపంగ నూహించు మా
    ధురి నింపం జను దేనెచే లవణపాధోరాశికి న్మూర్ఖు దె
    ల్ప ఋజూక్తం బిడువాడు శ్రీసురభిమల్లా నీతివాచస్పతీ

    నాకెందుకో యిది ఇంకా నచ్చింది.

    మరో ఆసక్తికరమైన విషయం ఏవిటంటే, పుష్పగిరి తిమ్మకవి అన్నతనుకూడా భర్తృహరిని అనువదించారు. అతను "వ్యాళం" అంటే పాము అన్న అర్థం తీసుకొన్నారు! కాని అందులో ఔచిత్యం లేదు.

    ReplyDelete
  5. ఇందాకటి నా కామెంటు చూస్తే మళ్ళీ గుర్తొచ్చింది. ’సముద్రమపి సంతరేత్’ అని ఉండాలి.
    ’తివిరి యిసుమున’కి సంస్కృత పాఠం పూర్తిగా గుర్తు రావడం లేదు. ’లభేత సికతాసు తైలం’ అని మొదలౌతుంది. రిఫర్ చేసి చెప్పొచ్చనుకోండి. అయినా వదిలేస్తున్నా.

    ఇందాకా రవి గారు సంస్కృతం మొదలెట్టింది ఈ శ్లోకంతోనే అన్నది బహుశా నా గురించే అయ్యి ఉంటుంది. నేను మొదలెట్టింది ఈ క్రింది శ్లోకంతో -

    స్వాయత్తమేకాంతహితం విధత్రా
    వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః
    విశేషత: సర్వవిదాం సమాజే
    విభూషణం మౌనమపండితానామ్ ||

    ఇంటరు ఫస్టియర్లో సంస్కృతం మొదటి క్లాసు మొత్తం గంటసేపూ ఇదే శ్లోకం వివరంగా ప్రతీ పదం విడదీసి, విశేషాలన్నీ వివరించి చెప్పారు మా లెక్చరరు గారు. క్లాసయ్యేసరికి శ్లోకం నోటికొచ్చేసింది. తర్వాత చెప్పిన శ్లోకం ’వ్యాళం బాల మృణాళ తంతుభిః’. ఆ తర్వాతది ’ప్రసహ్య మణిముద్ధరేత్’.

    మీరు చెప్పిన విశేషాలు బాగున్నాయి. లక్ష్మణకవి కాకుండా వేరేవాళ్ళు కూడా భర్తృహరిని అనువాదం చేశారని నాకు తెలియదు.

    బ్లాగరూ, బ్లాగరూ రాసుకుంటే కామెంట్లు రాల్తాయి - బాగుంది. కొంతమంది సాహిత్య బ్లాగర్లు రాసుకుంటే పద్యాలూ, శ్లోకాలూ రాల్తాయి.

    నాకు చిన్నతనంలో భర్తృహరి ఎందుకు పనిగట్టుకుని మూర్ఖులగురించీ, దుర్జనుల గురించే రాశాడో అర్థమయ్యేది కాదు. ఎందుకండీ ఒకళ్ళని తిట్టడం అనవసరంగా, మంచివాళ్ళని పొగిడి వదిలేస్తే సరిపోతుందిగా అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థమౌతోంది, ఎందుకు రాశాడో.

    ReplyDelete
  6. లభేత సికతాసు తైలమపి యత్నత: పీడయన్
    పిబేచ్ఛ మృగతృష్ణికా సుసలిలం పిపాసార్దిత:
    కదాచిదపి పర్యటన్ శశవిషాణ మాసాదయే
    న్నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్॥

    పద్యాల మధ్యలో ఒక గద్యం ప్రసక్తి కూడా చేస్తాను. నీతి చంద్రికలో ఒక కథ వుంది- ఎండమావిలో నీటికోసం వెదకిన కోతులకు ఒక కుందేలు మంచినీటికి త్రోవ చూపుతుంది. మనకు నీతులు చెబుతుందా అని ఆ కోతులకు కోపం వచ్చి, కుందేలును "కాలంజమరి, కృతాంత నిశాంతంబునకథిదింజేసి, తరువాత నవియన్నియుంగదలి జలాశయమునకుంబోయి తోయంబులాపోవద్రావి, యధేష్టంబుగాజనియె" నట. ఈ కథ చివర నీతి యేమిటంటే, "కావున నెంతమాత్రము మూర్ఖులకుపదేశింప బూనరాదు. అట్లు పూనువానికి మానక కీడు మూడును." అని.

    మూర్ఖులగురించి మన పూర్వులు చాలా రీసెర్చి చేసినట్లే కనిపిస్తోంది!

    ReplyDelete
  7. మురళి గారు, సవరణకు ధన్యవాదాలు.

    ఆయన అర్థపద్ధతి, సజ్జన పద్ధతి, దుర్జన పద్ధతి ఇలా ఎన్నో చెప్పినా మూర్ఖ పద్ధతి బాగా ఫేమస్సయింది ఎందుకో మరి. నాకు మాత్రం మానసౌర్య పద్ధతి శ్లోకాలు నచ్చాయి.

    "క్వచిపృథ్వీ శయ్యః క్వచిదపి పర్యంకశయనః.."
    "ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు బూసజ్జపై ..." ఇది విపరీతంగా నచ్చేసింది అప్పట్లో.

    చంద్రమోహన్ గారి శ్లోకంలో శశవిషాణమంటే వివరించాలి, మీరు ఎవరైనా.

    ReplyDelete
  8. ఇంకో చిన్న సమాచారం. భర్తృహరి శ్లోకాల సంకలనం, తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా, ఈ మధ్య విశాలాంధ్రలో కొత్తగా వెలువడింది.

    ReplyDelete
  9. రవి గారు,

    విషాణమంటే కొమ్ము (ఇంకా ఏనుగు దంతం, కొమ్ముబూర లాంటి అనేక అర్థాలున్నాయి వామన్ ఆప్తే గారి సంస్కృత నిఘంటువులో). శశవిషాణమంటే కుందేటి కొమ్ము.

    "ఒకచో నేలను పవ్వళించు..." -- మూలంకంటే అనువాదమే బాగుందని నాకు అనిపించిన అతి కొద్ది సుభాషితాల్లో ఇది ఒకటి.

    ReplyDelete
  10. కొన్ని పొట్టి గీతలు లేనిదే పొడుగు గీతేదో ఎలా తెలుస్తుంది :-)

    ReplyDelete
  11. శశి అంటే చంద్రుడు అలానే గాక కుందేలు అని ఇంకో అర్ధం కూడా ఉంది . శశవిషాణం అంటే కుందేటి కొమ్ము అని అర్ధం.

    ReplyDelete
  12. నందుగారు,

    శశి అంటే కుందేలు కాదు. శశము అంటే కుందేలు. 'శశ్' అనే ధాతువుకి గెంతడము అని అర్థం. గెంతుతూ వెళుతుంది కాబట్టి కుందేలుకి శశము అని పేరు.
    శశము ఉన్నవాడు కాబట్టి శశి అని చంద్రునికి పేరు వచ్చింది (చందమామలో కుందేలుని చూస్పిస్తూ ఉంటారు కదా!)

    ReplyDelete
  13. నేనెప్పుడు చదువుకున్నానో గుర్తు లేదు కానీ ఎందుకో నా అనుభవంలో ఎప్పటికప్పుడు గుర్తొచ్చే పద్యాలీ రెండూ (మకర ముఖాంతరస్థమగు.... తిరిగి యినుమును తైలంబు.....) ఏ సంవత్సరపు??? ఏ తరగతివో తెలుప ప్రార్థన ����

    ReplyDelete
  14. “యినుమును” కాదు, యిసుమున.

    తివిరి యిసుమున దైలంబు దీయవచ్చు
    దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
    దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
    జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ।।


    ReplyDelete