తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, July 2, 2008

ఏ లీలన్ నుతియింపవచ్చు...


ఏ లీలన్ నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపమున్
చాలుంజాలు, కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో!
చీ! లజ్జింపరుగాక మాదృశ కవుల్, శ్రీకాళహస్తీశ్వరా!

కిందటిసారి ధూర్జటిలోని కవిని చూసాం. ఇప్పుడా కవిని ధిక్కరించే భక్తుని చూస్తున్నామీ పద్యంలో!
సాకారమైన శివమూర్తిని చూసి హాస్యమాడిన ధూర్జటిని ఆటపట్టించాలని ఆ శివుడుకి కూడా అనిపించింది కాబోలు.
చిదంబరుడై దర్శనమిచ్చి ఇప్పుడు వర్ణించు చూద్దాం అని సవాలు విసిరుంటాడు! చిదంబరుడంటే చిత్(మనసు/బుద్ధి) అంబరంగా(వస్త్రముగా) కలవాడని అర్థం. అతడు మనసు పొరలమాటున దాగుంటాడన్నమాట. అప్పుడతని రూపం ఎలా ఉంటుంది? మనిషి బుద్ధిలో ఉన్నది చైతన్యం. అంటే అప్పుడు శివుడు చైతన్యస్వరూపుడవుతాడు. ఎంతటి ఊహశాలురైనా, పాపం కవుల ఊహకికూడా కొన్ని పరిమితులుంటాయి కదా! నిరాకారమైన చైతన్యపు ముద్దని కవి ఏమని ఊహించగలడు! సాధారణభాష కన్నా కవిత్వభాష శక్తివంతమైనదైనా, దానికీ కొన్ని పరిమితులున్నాయి. కవి ఊహకే అందని విషయం గురించి వర్ణించడానికి భాషకూడా తోడ్పడదు.
ఆ సత్యాన్ని గ్రహించాడు ధూర్జటి. తన పరిమితులని తాను తెలుసుకున్నాడు.
ఉపమ, ఉత్ప్రేక్ష, ధ్వని, వ్యంగ్యము, శబ్దాలంకారాలూ - ఇవన్నీ కవిత్వభాషలో కనిపించే విశేషాలు. వీటివేటికి చిక్కని రూపం! మరో మాటకూడా అన్నాడు ధూర్జటి. "సత్యాన్ని వర్ణించాలంటే కవిత్వం నిలుస్తుందా?" అని. అంటే కవిత్వం వొట్టి అబద్ధాలపుట్టని తేల్చెస్తున్నాడా? కాదేమో. ఇక్కడ సత్యం అంటే "సత్యం శివం సుందరం"లోని సత్యం. అంటే The complete truth అన్న మాట. దాన్ని వర్ణించడం ఎవరితరం చెప్పండి!
ఈ పద్యంలో నాకు నచ్చేవి రెండు అంశాలు. ఒకటి ధూర్జటిలోని నిజాయితీ. కవిగా తాను ఓడిపోయాడు. దాన్ని నిర్లజ్జగా ఒప్పుకున్నాడు. పైగా "చీ, నాలాంటి కవులు సిగ్గుపడాలి" అన్నాడు. అంటే అహంకారంతో విర్రవీగకూడదూ అని అర్థం.
ఇక రెండో అంశం ఇందులోని భాష, పలుకుబడి. మొదటి రెండుపాదాలూ కవిత్వభాషలోని విశేషాలను చెప్పడంతో అయిపోయినా, మిగిలిన రెండు పాదాలూ వ్యావహారిక భాషాలోని వాడీ వేడీ కలిగున్నాయి. "చాల్చాలు" అన్న తృణీకార వ్యంజకమైన పలుకుబడి, "చాలుంజాలు" అని శార్దూలంలో ఒదిగిపోయింది. తర్వాత "కవిత్వముల్" అన్న బహువచన ప్రయోగం. ఇదీ కవిత్వం తాలూకు తక్కువతనాన్ని సూచించేదే. "మాదృశ కవుల్" అనడంలో తనతోపాటు, తనలా అహంకరించే కవులందరినీ కలుపుకోడం కూడా తెలుగు పలుకుబడిలో కనిపించేదే కదా. వాడుకభాషలోని పలుకుబడికున్న శక్తిని పద్యరూపంలో ప్రయోగించడం ఎలానో ఈ పద్యం చూపిస్తోంది!

శతక పద్యాలలో మకుటం ఒకటి ఉంటుంది. అది పద్యంలో కొంతభాగం ఆక్రమించుకోడమే కాక, అదనపు నిబంధనలని కూడా ప్రవేశపెడుతుంది. ఉదాహరణకి ఈ శతకంలో "శ్రీకాళహస్తీశ్వరా" అన్న మకుటంలో "శ్రీ" అన్నది యతిస్థానంలో ఉంది. కాబట్టి శతకంలోని అన్ని పద్యాల చివరిపాదాలూ ఈ అక్షరంతో యతిమైత్రి ఉన్నవే వాడాలి. అయితే ఇక్కడున్న ఒక విశేషమేమిటంటే, నాకు తెలిసి "శ్రీ" అన్న అక్షరం అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలతో యతిమైత్రి కలిగి ఉంటుంది. దీన్ని తలదన్నే మరో అక్షరం "స్త్రీ" ఒక్కటే :-) హల్లుల్లో "శ"కి "ర"కి దేనికైనా యతి వేసుకోవచ్చు. అంటే, "చ, ఛ, జ, ఝ, శ, ష, స, ర, ల"లో ఏదైనా హల్లు రావచ్చన్నమాట! అలానే అచ్చుల్లో "ఇ, ఈ, ఎ, ఏ, ఋ" ఏవైనా రావచ్చు. అంతే కాదండోయ్, "రి"కి "ఋ" అచ్చుతో మైత్రి కుదిరితే చాలు, ఏ హల్లైనా వేసుకోవచ్చు! ఇంతటి విస్తృతమైన మిత్రబృందం(friends circle) మరే అక్షరానికీ లేదనుకుంటాను :-)
ఎలాగూ యతిమైత్రి విషయం వచ్చింది కాబట్టి ఈ పద్యం మొదటి పాదంలో యతిమైత్రి ఎలా కుదిరిందో చెప్పుకోండి చూద్దాం?

ఈ పద్యం ఎప్పుడు చదివినా, నాకు ధూర్జటి కాళహస్తీశ్వరమాహాత్మ్యములోనిదే ఒక కథ గుర్తుకు వస్తుంది. ఆ కథే ఈ పద్యానికి స్ఫూర్తేమోనన్న అనుమానం కూడా ఉంది. ఆ కథా కమామీషూ వచ్చే సారి...

9 comments:

 1. చిన్నప్పుడు “ఏ వేదంబు పఠించె లూత”, “కొడుకుల్ పుట్టరటంతునేడ్తు రవివేకుల్”, “రాజుల్ మత్తుల్” లాంటి పద్యాలు చదివడమే కాని, రెండు నెలల క్రితం పుస్తకం కొని “శ్రీవిద్యుత్కలితాజవంజవ” తో ప్రారంభించే దాక నాకు ధూర్జటి పద్యాల గురించి ఎక్కువ తెలియదు. శ్రీకాళహస్తీశ్వర శతకం చదవడం మొదలుపెట్టక ముందు దాశరధీ శతకం చదివిన నాకు, ధూర్జటి గొప్పదనం మొదటి పద్యంలోనే తెలిసింది. భక్త రామదాసు, భక్తుడు ముందు కవి తరువాత అని శతకం చదివితే నాకు అనిపించింది. ధూర్జటి అలా కాదు - భక్తి ఉంది కానీ ప్రతి పద్యంలోనూ కవితాపటుత్వం అంతకు మించి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది, కొన్ని పద్యాలు మళ్ళీ మళ్ళీ చదవుకోవాలనిపించేలా ఉంటాయి.. ఈమధ్య నన్ను అలరించిన పద్యాలు “ఱాలున్ ఱువ్వఁగ జేతులాడవు”, “తరగల్, పిప్పల పత్రముల్”, “రోసీ రోయదు..”
  మీరు కాళహస్తీశ్వర మహాత్మ్యంలోని పద్యాలు గురించి ఎప్పుడు కొంతసేపు గడుపుతారా అని ఎదురుచూస్తున్నాను..

  ReplyDelete
 2. ఉపమ +ఉత్ + ప్రేక్ష, అవడం వల్ల (సంధి ఉండడం వల్ల)యతిమైత్రి కుదిరిందని నా అభిప్రాయం..

  ReplyDelete
 3. నిజానికి ఉత్ప్రేక్ష ని విడగొట్టవచ్చునో లేదో నాకు తెలియదండి..

  ReplyDelete
 4. ఉత్ప్రేక్ష లోని ఏకారంతో యతి.కరక్టేనా సారూ

  ReplyDelete
 5. గిరిగారు,
  అవునండీ మీరు చెప్పిన పద్యాలు ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో ఉండేవి. అంత చిన్నప్పుడు "అంతా మిథ్య దలంచి చూచిన..." అన్న పద్యం గురించి టీచరేం చెప్పేరో, మాకేమర్థమయ్యిందో ఇప్పుడైతే గుర్తులేదు! కానీ పద్యాలు మాత్రం గుర్తుండడం వల్ల, పెద్దయ్యేక ధూర్జటి గురించి తెలిసి చదువుకొనే వీలు కలిగింది.

  యతి విషయానికి వస్తే, ఒక అక్షరం అచ్చైనప్పుడు (హల్లులేకుండా), రెండో అక్షరం కూడా హల్లులేని అచ్చు కానీ, "య" లేదా "హ" హల్లు కానీ ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ "ఏ" అన్న అక్షరంతో మొదటి పాదం మొదలయ్యింది కాబట్టి, యతి స్థానంలో, "ఇ ఈ ఎ ఏ ఋ" అనే అక్షరాలు కానీ, "యి యీ యె యే" అనే అక్షరాలు కానీ, "హి హీ హె హే హృ" అనే అక్షరాలు కానీ ఉన్నప్పుడే యతి కుదురుతుంది. అంచేత "ఏ"కి "ప్రే" అన్న అక్షరంతో యతి కుదరదు. మరిక్కడ ఎలా కుదిరింది అన్నది ప్రశ్న.
  గిరిగారు పదాలని కొంతవరకూ విడగొట్టారు. ఇంకొంచెం విడగొడితే, ముడివిడిపోతుంది.

  ReplyDelete
 6. ఈ బ్లాగు తెలుగు పద్యాల గూర్చి అని తెలిసాక, నాకు సాయం చేస్తారేమో అని ఇక్కడ అడుగుతున్నా.

  మాకు తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలో "తామసి" అని ఒక పద్యపాఠం ఉండేది. ఎవరు రచించారో గుర్తు లేదు కానీ.. పద్యాలన్నీ "చీకటి"లో అందాన్ని ఆనందాన్ని ఆవిష్కరిస్తాయి. చాలా చాలా బాగుంటాయి. మీ ఎవరికైనా ఆ పద్యాల గూర్చి తెలుసా. అవే కాకపోయినా చీకటి గూర్చి ఇంకా ఏమైనా పద్యాలు చెప్పగలరా??

  వ్యాఖ్యానించాల్సిన చోట నా ప్రశ్నని అడుగుతున్నానని మరోలా భావించకండి. ధన్యవాదాలు!!

  ReplyDelete
 7. ఓహో, ప్రేక్ష = ప్ర+ ఈక్ష; ముడి విడిందా?

  ReplyDelete
 8. పూర్ణిమగారు,
  అవి దాశరథి రాసిన అమృతాభిషేకం లోనివి. నాకెలా తెలుసనుకుంటున్నారా, మా అమ్మగారు తెలుగు టీచరు మరి:-) వీలుచూసుకొని ఆ పద్యాలు బ్లాగులో పెడతాను.

  గిరిగారు,
  ముడి విప్పేసారు. "ఏ"కి "ఈక్ష"లోని "ఈ"తో యతి కుదురుతుంది.

  ReplyDelete
 9. మీకూ మీ అమ్మగారికీ ఓ టన్ను వందనాలు అండి. అసలు ఏ పదో తరగతి చదువుతున్న పిల్లల పుస్తకాలను కొట్టేస్తే తప్ప నేను వాటిని కనుగొనలేను అనుకున్నా!!

  నా అదృష్టం మీ బ్లాగు చూశాను. వీలు పడగానే ’టపా’యించండి ఆ పద్యాలను.

  కృతజ్ఞతలు,
  పూర్ణిమ

  ReplyDelete