తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, December 30, 2011

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం - తరువాయి భాగం

క్రిందటి టపాలో సత్యాపతి తన ప్రియసతి పదపల్లవ తాడననాన్ని రుచిచూసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాం కదా. అతను కాక (అంత కన్నా ముందే) ఆ సత్కారాన్ని పొందిన ఆ మరో దేవుడెవరో తెలుసుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నారా?:-) ఆ దేవుడు ఆదిదేవుడు, శంకరుడు. దాని గురించి చెప్పినది స్వయంగా ఆదిశంకరులు. ఆ అయ్యవారు అమ్మవారి పాదతాడనాన్ని పొందడమే కాదు, అది పొందాలని ఉవ్విళ్ళూరారట కూడా!

నమోవాకం బ్రుమో నయన రమణీయాయ పాదయోః
త వాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచి రసాలక్త కవతే
అసూయ త్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా మీశానః ప్రమదవన కంకేళి తరవే

అమ్మవారి పాదాలు లత్తుకతో అలంకరింపబడి నయనరమణీయంగా ప్రస్ఫుటమైన కాంతితో వెలుగుతున్నాయి. ఉద్యానవనంలోని కంకేళి తరువులు (అశోక వృక్షాలు) ఆ పాదాల తాడనాన్ని (అభిహననము) పొందుతున్నాయి. వాటిని చూసి పశుపతి అయిన ఈశ్వరుడు, తనకా భాగ్యం దక్కలేదే అని వాటిని చూసి ఈర్ష్యపడుతున్నాడట. ఎంత చోద్యమో చూసారా! అలాంటి పాదాలకి నమోవాకాలు చెపుతున్నారు శంకరాచార్యులవారు, సౌందర్యలహరిలో. ఇంతకీ అశోకవృక్షాలను అమ్మవారు తన్నడమేమిటి?

చెట్లు చక్కగా పుష్పించడానికి పూర్వకాలంలో కొన్ని చిత్రమైన పద్ధతులు ఆచరించేవారట. వీటిని దోహదక్రియలంటారు. ఒకో చెట్టుకి ఒకో రకమైన క్రియ. ఆలింగనాత్ కురువకః - అంటే కురువకాన్ని కౌగలించుకుంటే బాగా పుష్పిస్తుంది, కరస్పర్శేణ మాకందః - చేతి స్పర్శ చేత మామిడి పుష్పిస్తుంది. ఇలా చాలా చెట్లకి దోహదక్రియలున్నాయి. ఇవన్నీ స్త్రీలు మాత్రమే చెయ్యాలి. నాకు తెలిసిన మరికొన్ని:

సల్లాపతః కర్ణికారః - కర్ణికారానికి (కొండగోగు) చక్కని మాటలు
నమేరుః హసితేనచ - నమేరువుకు (సురపొన్న) నవ్వు
వకుళో ముఖసీధునా - వకుళానికి (పొగడ) నోట్లో మధువు తీసుకొని పుక్కిలించాలి
అశోకః చరణాహత్యా - అశోకానికి చరణాహతి, అంటే మనం చెప్పుకుంటున్న కాలితాపు
సిందువారో ముఖానిలాత్ - సిందువారానికి (వావిలి చెట్టు) నోటితో ఊదడం
తిలకో వీక్షణేనచ - తిలకానికి (బొట్టుగు చెట్టు) కంటిచూపు

పదహారవశతాబ్దానికి చెందిన కృష్ణనందుడనే అతను తంత్రసారమనే గ్రంథంలో యీ దోహదక్రియలన్నిటినీ వివరించాడట. కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోకూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది.

ఇంతకీ అసలు సంగతికి మళ్ళీ వద్దాం. అలా పార్వతీదేవి తమ ఉద్యానవనంలోని అశోకవృక్షాలు బాగా పుష్పించాలని నిత్యమూ వాటిని తంతోంది. అంత అందమైన పాదాల తాకిడి వాటికి మాత్రమే దక్కుతోందని శివునికి వాటి మీద అసూయ కలిగిందట! తనకీ ఆ అదృష్టం దక్కాలని తహతహ లాడేడు. మరి ఆయన కోర్కె తీరిందా? ఎందుకు తీరదు! అది తీరిన విధానాన్ని ఆ తర్వాతి పద్యంలోనే ఆదిశంకరులు వివరించారు.

మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితమ్
లలాటే భర్తారమ్ చరణకమలే తాడయతి తే
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా

సౌందర్యలహరిలో శ్లోకాలన్నిటిలోకి నాకు బా...గా... యిష్టమైన శ్లోకమిది. శివుడు పార్వతీదేవి చేత తల దన్నించుకోడానికి ఒక ఉపాయం పన్నాడు. మృషా అంటే కపటం, నాటకం. పార్వతి దగ్గరున్నప్పుడు గోత్రస్ఖలనం చేసినట్టు నటించాడు. గోత్రస్ఖలనమంటే భార్యని పొరపాటుగా వేరే స్త్రీ (సవతో, ప్రేయసో) పేరుతో పిలవడం. బహుశా మరి "గంగా" అని పిలిచాడేమో పార్వతిని! అలా చేస్తే ఆమెకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత కోపం వస్తుంది! శివుడలా చేసి, నాలిక్కరుచుకొని, ఏమీ పాలుపోవనివాడిలాగా (వైలక్ష్య), పాదాలకి వంగి తన శిరసుతో నమస్కరించాడు, క్షమించమని వేడుకున్నట్టుగా. అలా తన కాళ్ళకు మ్రొక్కిన భర్త లలాటాన్ని తన చరణకమలంతో పార్వతి తన్నింది. ఆ రకంగా శివుని కోరిక తీరింది! చూసారా కపట నటనలో ఆ జగన్నాటకసూత్రధారిని మించిపోయాడీ జగత్పిత! భార్య పాదతాడన భాగ్యం కోసం ఎంతటి సాహసానికి పూనుకున్నాడు!

ఇంతవరకూ చెప్పి ఆపేస్తే అతను ఆదిశంకరులు ఎందుకవుతారు, మహాకవి ఎలా అవుతారు! అసలు కవిత్వమంతా ఆ మిగిలిన రెండు పాదాలలోనూ ఉంది. పార్వతీదేవి అలా కాలితో శివుని ఫాలభాగాన్ని తన్నినప్పుడు, ఆమె కాలియందెలు గలగలమన్నాయి. ఆ సవ్వడి ఎలా ఉన్నదంటే - శివుని ఫాలాగ్నికి కాలి బూడిదైన (దహనకృతం) మన్మథునికి (ఈశానరిపు - ఈశ్వరుని శత్రువు), జరిగిన ఆ పరాభవం ఒక బాణమై హృదయంలో చిరకాలంనుండి గుచ్చుకొని ఉందట (చిరాత్ అంతః శల్యం). పార్వతీదేవి తన కాలితో ఆ శివుని ఫాలభాగాన్ని ఎప్పుడైతో తన్నిందో, ప్రతీకారం జరిగినట్టయింది. పరాభవ బాణం పెకిలించబడింది (ఉన్మూలితా). మన్మథుని మనసుకి ఎంతో హాయి కలిగింది. ఆ ఆనందంలో అతను కిలకిలా నవ్వాడు. ఆ కిలకిలలల్లాగా ఉన్నాయట కాలియందెల గలగలలు!
ఆహా! ఎంత మహాద్భుతమైన ఊహ! ఎంత రమణీయ కల్పన! ఎంతటి ధ్వని! దీనికి మించిన కవిత్వముంటుందా! జాగ్రత్తగా గమనిస్తే, యిక్కడ నిజంగానే మన్మథునికి జయం కలిగింది. అమ్మవారి పాదతాడన సౌఖ్యాన్ని అనుభవించాలన్న శివుని కోర్కె మన్మథ ప్రేరితమే కదా! ఇక్కడ మనమొక మనోహరమైన ఊహ చేయవచ్చు. తనకు జరిగిన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకొనేలా చెయ్యమని మన్మథుడు అమ్మవారి పాదాలని ఆశ్రయించాడు. అమ్మ ఎప్పుడైనా కరుణాహృదయ కదా. మారాం చేసే తన బిడ్డ మురిపం తీర్చాలని అనుకున్నది. ఏ పాదాలనయితే మన్మథుడు ఆశ్రయించాడో, ఆ పాదాలపైనే తన భర్తకి కోరిక కలిగేలా ఆమె చేసింది. అతడు తన కాళ్ళకి మ్రొక్కేలా చేసింది. అలా మ్రొక్కిన అతడి ఫాలాన్ని తన కాలితో తన్నింది. ఆ పని ద్వారా అటు తన భర్త కోర్కెను, యిటు మన్మథుని ఆకాంక్షనూ కూడా నెరవేర్చింది. శివుడు శృంగారి కావడమే మన్మథుని జయ సూచకం. అది చాలదన్నట్టు ఆ శృంగారలీలలో మన్మథుని దహించిన ఫాలభాగమే తన్నబడడం, మన్మథునికి సంపూర్ణ విజయం. ఇదంతా ఒక ఎత్తైతే, ఆనంద హృదయడైన మన్మథుని నవ్వుల కిలకిలలతో, పార్వతీదేవి శింజినుల మంజుల స్వనాన్ని పోల్చడం అన్నది పరమ రమణీయమైన ఉపమ!

ఇది వరకు చెప్పానేమో తెలియదు, సర్వసంగపరిత్యాగి అయిన ఒక సన్న్యాసి, మహాకవి కూడా కావడమన్నది వింతలలో వింత. అది ఒక్క ఆదిశంకరుల విషయంలో మాత్రమే నిజమయ్యింది! పై శ్లోకానికి ఆధ్యాత్మికపరమైన వివరణ కూడా ఉన్నది. అదేమిటో తెలుసుకో గోరినవారు చాగంటి కోటేశ్వరరావుగారిని వినాలి. :-) ప్రస్తుతానికి నాకు మాత్రం ఇందులోని కవిత్వమే ముఖ్యం.

తెలుగు పద్యం లేకుండా యీ తెలుగుపద్యం బ్లాగులో వేసిన మొట్టమొదటి టపా (ఒకే ఒక్క టపాకూడా అవుతుందేమో) యిదేనేమో! ఇంతటి గొప్ప శ్లోకాన్ని గురించి చెప్పే టపాకి ఆ మాత్రమైనా ప్రత్యేకత ఉండొద్దూ మరి. పద్యాభిమానులెవరైనా దీనికి అందమైన ఆంధ్రీకరణ జేసి వ్యాఖ్యలలో యిచ్చినట్లయితే ఆ ప్రత్యేకత మరింత ఇనుమడిస్తుంది!

పూర్తిగా చదవండి...

Thursday, December 22, 2011

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!

భార్య పాదతాడనం రుచిచూసిన దేవుడనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడొక్కడే. అదికూడా, మన నంది తిమ్మనగారి పుణ్యమా అని తెలుగు కృష్ణుడికి మాత్రమే దక్కిన భాగ్యమది. మరి టపా శీర్షికలో "దేవుళ్ళు" అని బహువచనమేమిటి? మరో దేవుడు కూడా భార్య చేత తన్నించుకున్నాడా?! అన్న అనుమానం ఈపాటికి మీకు కలిగుండాలి. అవును, భార్య చేత తలదన్నించుకున్న దేవుడు మరొకడున్నాడు. అసలు నంది తిమ్మనగారి కృష్ణుడికి స్ఫూర్తినిచ్చింది కూడా ఆ దేవుడే అని నా నమ్మకం. అతనెవరో ఆ సందర్భమేమిటో తెలుసుకొనే ముందు, నంది తిమ్మనగారి పారిజాతాపహరణ కావ్యంలో మనందరికీ పరిచయమైన పద్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
దొలగన్ ద్రోచె లతాంగి, యట్లయగు, కాంతుల్ నేరముల్ సేయ పే
రలుకన్ బూనినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే!

ఈ సన్నివేశాన్ని ఎరుగని వారుండరు కదా. పారిజాతాపహరణ కావ్యం గురించి తెలియకపోయినా, శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో "అలిగితివా సఖీప్రియా..." పాట, చాలామందికి తెలిసే ఉంటుంది. నారదుడు తెచ్చి యిచ్చిన పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా రుక్మిణికి యిచ్చాడని సత్య అలకబూనుతుంది. ఆమె అలక తీర్చే ప్రయత్నంలో చివరికి ప్రేమతో ఆమె కాళ్ళకి మ్రొక్కుతాడు శ్రీకృష్ణుడు. సత్యభామ చిగురులవంటి పాదాల ఎఱ్ఱని వెలుగులు తన కిరీటములోని మణికాంతులకి వన్నెపెట్టే విధంగా తలవంచి ఆ పాదాలని మ్రొక్కాడట! నిజంగా తానేదో అపరాధం చేసేశానన్న పశ్చాత్తాపంతోనా? అబ్బే! కృష్ణుడంటే ఎవరు? జగన్నాటకసూత్రధారి. అదంతా ఆయనకొక లీక. శృంగారలీల. అప్పుడేమయ్యింది? అతడు కోరుకున్నదే జరిగింది! బ్రహ్మేంద్రాది దేవతలచేత పూజింపబడే ఆ తలని తన ఎడంకాలితో త్రోసేసిందా భామ.

పద్యాలలో పదాలని ఆచితూచి వెయ్యడంలో దిట్ట నంది తిమ్మన. బ్రహ్మేంద్రాది దేవతలచే పూజింపబడేది అని చెప్పి ఊరుకో లేదు చూసారా. అది "లతాంతాయుధు కన్నతండ్రి" శిరసు అని కూడా మనకి గుర్తుచేసారు. అక్కడుంది కీలకం! లతాంతము అంటే లత చివరల పూచేది, పువ్వు అని అర్థం. లతాంతాయుధుడంటే సుమశరుడయిన మన్మథుడు, శృంగారదేవత. అతని తండ్రి అంటే సర్వ సృష్టిలోని శృంగారానికి కారణభూతమైన వాడన్న మాట. దీనివల్ల మనకి ధ్వనిస్తున్న విషయమేమిటి? సత్యభామ చేష్టని శృంగార రస దృష్టితోనే చూడాలి తప్ప ఏదో పరమపూజనీయమైన ఆ శిరసుకి అవమానం జరిగిందని భావించకూడదు సుమా అని కవి మనలని హెచ్చరిస్తున్నాడు. ఆ శిరసు ఎంతటి పూజనీయమైనదైనా కావచ్చు. కాని ఆ సన్నివేశంలో అది మన్మథ జనకుని శిరసు. శ్రీకృష్ణుడు  శృంగారనాయకుడు. ఆ చేష్ట శృంగారలీల. అందుకే ఆ తాకిడికి శ్రీకృష్ణుడు "ఉద్దీపిత మన్మథ సామ్రాజ్యాన్ని" పొందాడని తర్వాతి పద్యంలో అంటాడు తిమ్మన.  పైగా, తన్నినది ఎవరు? "లతాంగి". అతను లతాంతాయుధు కన్నతండ్రి, ఈమె లతాంగి. పొత్తు సరిగ్గా కుదరింది. లతలాంటి మేను ఎంత సున్నితంగా ఉంటుంది! అందుకే ఆ తాకిడికి ఆయనగారి మేను పులకించింది. ఆ పులకల ములుకులు ఆమె పదపల్లవానికి గుచ్చుకుంటే ఎక్కడ నొప్పి కలుగుతుందోనని తెగ బెంగపడ్డాడట ఆ కపట గోపాలుడు! ఆమె "నెయ్యపు కినుక"తో ("ప్రణయకోపాని"కి ఎంత ముచ్చటైన తెలుగు పదం!), తనని తన్నినా అది మన్ననే అని కూడా అంటాడు. అదంతా ఒక రసరమ్య విలాసం. దాన్ని తన ముద్దుముద్దు పలుకులతో మనోహరంగా చిత్రించాడు నంది తిమ్మన.

చెలునికి నెచ్చెలి కాలితాపు అనుగ్రహించడమన్నది పూర్వకాలంలో ప్రసిద్ధమైన విషయం లాగానే అనిపిస్తుంది.  దీని గురించి చాలా రిసర్చికూడా జరిగినట్టుంది! :) వాత్స్యాయనుడు నాయికా పదప్రహరణనాన్ని శృంగారలీలగా సూత్రీకరించాడు. వాత్స్యాయుని వ్యాఖ్యానించిన జయమంగళుడైతే ఏకంగా "క్రోధ వశాత్తస్య శిరసి పాదతాడనమపి నదోషాయ సౌభాగ్య చిహ్నం తదితి నాగరకవృద్ధాః" అన్నాడు. ఆలంకారికులు కూడా దీన్ని గురించి ప్రస్తావించారు. సాహిత్యదర్పణంలో విశ్వనాథ కవిరాజు రూపకాలంకారానికి యిచ్చిన ఉదాహరణ చూడండి:

"దాసే కృతాగసి భవత్యుచితః ప్రభూణాం పాదప్రహార ఇతి సుందరి నాస్మి దూయే, ఉద్యత్కఠోర పులకాంకుర కంటకాగ్రై ర్యద్భిద్యతే మృదుపదం నను సా వ్యథా మే"
(శ్లోకం  ఛందస్సు గుర్తుపట్టారా?!)

ఈ శ్లోకం రెండవ భాగానికి ఇంచుమించు తెలుగుసేతే మనందరికీ బాగా తెలిసిన ఈ పద్యం:

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని తా
చిన, యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్రకంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా! 

దేవుళ్ళైనా దేవుళ్ళాడేంత మహత్తు దీనిలో ఉన్నదంటే ఇంక సామాన్యుల మాటేం చెపుతాం! ఇంతకీ ఆ రెండో దేవుడెవరో ఆలోచించారా? కనిపెట్టారా? అబ్బా ఆశ! అప్పుడే చెప్పేస్తే మజా ఏముంటుంది. అది తెలియాలంటే తదుపరి టపాకోసం ఎదురుచూడండి మరి. :-)

(తెలిసిన వాళ్ళు గుట్టు రట్టు చెయ్యకుండా, ఈ టపాకి వ్యాఖ్యలని మోడరేట్ చేస్తున్నానోచ్!)

పూర్తిగా చదవండి...

Thursday, December 15, 2011

చెప్పుకోండి చూద్దాం! - సమాధానం


శ్రీశ్రీ సిప్రాలి గురించిన టపా వ్యాఖ్యలలో, అచ్చులతో ప్రాస ఉన్న పద్యానికి ఉదాహరణగా కందిశంకరయ్యగారు కవిజనాశ్రయంనుండి యీ క్రింది పద్యాన్ని ఉదహరించారు:

అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!

ఇది యతుల గురించి వివరించే పద్యం. ఏయే అచ్చులకి యతిమైత్రి ఉన్నదో చెపుతోంది. ఈ పద్యంలో అచ్చుల ప్రాసతో పాటు, ఛందస్సుకి సంబంధించి మరొక విశేషం కూడా ఉంది! అదేమిటో చెప్పుకోండి చూద్దాం! ఛందస్సు, భాషల పైన ఆసక్తి ఉన్నవాళ్ళకి మంచి మెదడుకి మేత. ఈ విశేషం గురించి కందిశంకరయ్యగారి వంటి వారికి ఈపాటికే తెలిసి ఉంటుంది కాబట్టి, వారు చెప్పవద్దని ప్రార్థన. తెలియనివాళ్ళు ప్రయత్నించండి.

సమాధానం
----------


సనత్ గారు సరిగానే కనుకున్నారు. గోపాలకృష్ణగారు చక్కగా వివరించారు!


"అఆ", "ఇఈ" - ఇలా అచ్చులు కలిపి చదివేటప్పుడు మొదటి అచ్చు హ్రస్వమే అయినా, దాన్ని పలకడంలో కొంత ఎక్కువ సమయం తీసుకుంటాము కాబట్టి అది గురువే అవుతుంది. ఒక రకంగా యిది విసర్గకి దగ్గర చుట్టం. "దుఃఖము" అన్న పదంలో దు అనేది దీర్ఘం కాదు. "ఖ" సంయుక్తాక్షరమూ కాదు. అయినా "దుః" అన్న అక్షరం గురువెందుకు అవుతోంది? దాన్ని ఉచ్చరించేటప్పుడు కాస్తంత ఆగి, తర్వాత "ఖ"ని ఉచ్చరిస్తాము. అందుకు "దుః" అన్నది గురువు. అలాగే "అఆ" అని కలిపి చదివేటప్పుడు "అ"ని పలికిన తర్వాత కొద్దిగా ఆపి "ఆ"ని పలుకుతాము. దీన్నే ఇంగ్లీషులో glottal stop అంటారు. ఎందుకిలా ఆపుతాము? మన భాషా స్వరూపం వల్ల! తెలుగులో పదం మధ్యలో అచ్చు అక్షరం రాదని తెలుసు కదా. ఒక వేళ రెండు పదాలు కలిపేటప్పుడు, రెండవ పదం మొదట అచ్చు ఉందంటే, అది "య"కారంగా మారిపోతుంది!  "మా అమ్మ"ని కలిపి గబగబా అనాలంటే మాయమ్మ అవుతుంది. అలాగే "మా ఇల్లు" మొదలైనవి.
అయితే "అఆ"ని పలికాల్సినప్పుడు "ఆ" అన్నది పలికి తీరాలి, అది "యా"గా మార లేదు. అంచేత ఆ రెంటిని గబగబా కలిపి పలకడం కుదరదు. పలకడంలో వాటి మధ్య అనివార్యంగా కొంత ఖాళీ వస్తుంది. కాబట్టి, ఆ ఖాళీ సమయాన్ని కూడా "అ" ఉచ్చారణలో భాగం చేసి, "అ" గురువైపోతుందన్న మాట!

పూర్తిగా చదవండి...