తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, July 2, 2013

ఓ పలకరింపు టపా

ఈ బ్లాగు ద్వారా చాలామంది పాఠకలు మిత్రులయ్యారు. అందరూ ఇప్పటికీ మిత్రులే, పాఠకులవునో కాదో మాత్రం తెలియదు. :-) ఇంకా పాఠకులే అయిన మిత్రుల కోసం, మిత్రులు కాని పాఠకుల కోసం కూడా, బ్లాగు మూసెయ్య లేదన్న సూచనగా, ఒక చిన్న పలకరింపు టపా యిది, అంతే. పనిలో పనిగా కొంత సొంత ప్రోపగాండా కూడా చేసుకుందామని.

సుజనరంజని పత్రికలో "పద్యాలలో నవరసాలు" అనే శీర్షికతో ఒక వ్యాసపరంపర వ్రాస్తున్నాను, ఆరు నెలలుగా. అందులో యీ నెల బీభత్స రసాన్ని గురించిన వ్యాసం ఇక్కడ చదవుకోవచ్చు:

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july13/padyam-hrudyam.html

ఈమాట పత్రికలో వస్తూ ఉన్న "నాకు నచ్చిన పద్యం" శీర్షికని యీ నెలనుంచీ నేను కొనసాగిస్తున్నాను. ఈ నెల వ్యాసం ఇక్కడ:

http://www.eemaata.com/em/issues/201307/2116.html

(నేను బ్లాగుకి దూరమవ్వడానికి అసలు కారణం ఇప్పుడర్థమయ్యిందా! అంచేత దీనికి బాధ్యులు ఆయా పత్రికల సంపాదకులే తప్ప నేను కాదు. :))

ఎంత పలకరింపు టపా అయినా, ఒక్క పద్యంకూడా లేకపోతే ఎలా? అందుకోండి ఒక పద్యం. ఈ పద్యం వ్రాసిన కవి ఎవరో కనుక్కోండి చూద్దాం!

నెట్టిన ప్రతి గుమ్మంలో
మెట్టిన ప్రతి గడపలోన మేమేం చూశాం?
పుట్టల చెదపట్టిన తు
ప్పట్టిన భావాల బీరువాలు, అనేకం!

తెలియలేదా? పోనీ మరొక్క పద్యం కూడా ఆ కవిదే చూడండి:

నేటి తెలుగుసాహిత్య వాణిజ్యవీథి
కేవల నిరక్షరాస్యులు కృతకవేత్త
లెంత పెత్తనమ్మును చలాయింపగలరొ
నాడెపుడయిన తలపోసినామ మనము?

ఎప్పుడైనా వీలూ, 'విల్లూ' కుదిరినప్పుడు, యీ కవి గురించి కొంచెం వివరంగా టపాయిస్తాను.
పూర్తిగా చదవండి...

Thursday, April 11, 2013

వసంతవిజయం


పదిరోజుల కిందట హఠాత్తుగా మా యింటి మందారం, నిండా మొగ్గలతో నిండుగా కనిపించింది. అబ్బా! వసంతం వచ్చేసింది అనుకున్నా. ఆరునెలలయి ఒక్క పువ్వు కూడా పూయనిది రోజూ పూలతో కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో! అదే కదా మరి పూల ఋతువు మహిమంటే!
"పేరంటమున కేగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత" వసంతం వచ్చిందని తెలిసిందంటారు విశ్వనాథ, తన తెలుగు ఋతువులలో. వసంతమంటే కవులకి ఒక ప్రత్యేక అభిమానం. ఎక్కడెక్కడి కవికోకిలల గొంతుకలూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి.

పూర్వకవులకి వసంతమంటే, మన్మథుడు పూలబాణాలతో చిగురాకుబాకుతో చిలుకతేజీనెక్కి జైత్రయాత్ర చేసే కాలం. వసంతవిజయమంటే మన్మథవిజయమే!

అత్తఱి చిత్తజాత విజయాంబుజమందిర కాటపట్టు నా,
గొత్త మెఱుంగు గ్రొన్ననల గుంపుల చక్కలిగింతనా, శుభా
యత్తత నొప్పె బుష్పసమయంబు సమంచిత చంచరీక లో
కోత్తరవిత్తమై, వనసముజ్జ్వల పైకవధూ సదుక్తమై

మన్మథుని విజయలక్ష్మికి (అంబుజమందిర అంటే పద్మనిలయ లక్ష్మి) ఆటపట్టులాగా ఉందట పుష్పసమయం. అప్పుడే విరిసి మెరిసే పూలగుంపుల చక్కిలిగింతలాగా కూడా ఉన్నదట. తుమ్మెదలు కూడబెట్టిన లోకోత్తరమైన విత్తం (అంటే తేనెపట్టు) వసంతం. "పైకవధూ" అన్న పదం దగ్గర కొంతసేపు ఆగిపోయాను. పైకము అచ్చ తెలుగుపదం. అయితేగియితే పైకపువధూ అని ఉండాలి కాని సమాసంలో "పైకవధూ" ఏమిటి? - అని పెద్ద అనుమానం వచ్చేసింది. కాస్త ఆలోచించిన మీదట తట్టింది. "పైకము" అంటే పిక సంబంధమైనది అనే అర్థం వస్తుంది. పికమంటే తెలుసు కదా, కోకిల. పైకవధూ అంటే ఆడకోయిల. ఆడకోయిలలల చక్కని గాత్రాలు ప్రతిధ్వనించే అడవులతో వెలిగిపోతోంది వసంతం - అని తాత్పర్యం. పద్ధెనిమిదవ శతాబ్దానికి చెందిన తక్కెళ్ళపాటి లింగన అనే కవి రచించిన సూర్యతనయాపరిణయం అనే కావ్యంలోని పద్యమిది. ఎప్పుడూ పేరైనా వినని కావ్యంలోంచి నాకీ పద్యం ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఇలా ఎన్నో తెలియని (తెలిసినవి కూడా) కావ్యాలనుండి రకరకాల అంశాలకి సంబంధించిన వర్ణనలను ఏర్చికూర్చి దాసరి లక్ష్మణస్వామిగారనే అతను "వర్ణనరత్నాకరము" అనే పుస్తకాన్ని నాలుగు భాగాలుగా ప్రచురించారు. ఆ పుస్తకంలోనే చదివానీ పద్యాన్ని. Digital Libraryలో నాలుగుభాగాలూ రెండు పుస్తకాలుగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు అక్కణ్ణుంచి దింపుకోవచ్చు. ఇటీవల యీ పుస్తకానికి "పాఠకమిత్రవ్యాఖ్య" అనే బేతవోలు రామబ్రహ్మంగారి చిరు వ్యాఖ్యానంతో మూడు భాగాలు ప్రచురించారని విన్నాను. ఇంకా అది నా కంటపడ లేదు.

అన్నట్టు మన్మథుడంటే గుర్తుకు వచ్చింది, సుజనరంజని పత్రికలో నేను నెలనెలా "పద్యాలలో నవరసాలు" అనే పేరుతో వ్యాసాలు (పద్యం-హృద్యం అనే శీర్షిక క్రింద) వ్రాస్తున్నాను. ప్రస్తుతం శృంగారరసం నడుస్తోంది. ఆసక్తిగల వాళ్ళు యిక్కడ చూడవచ్చు: http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr13/padyamhrudyam.html

ఇంతకీ, పూర్వకవుల తీరు అలా ఉంటే, నవకవులది ఎంతైనా మరి కొత్త దారి. వీరికి వసంతం అంటే కొత్తదనానికి ప్రతీక. లేత చివుళ్ళతో, విరిసే పూలతో నవకాంతులీనే ప్రకృతి క్రొంగొత్త ఆశలకి స్వాగతం పలుకుతుంది. సరిగ్గా అప్పుడే, కొత్త సంవత్సరం కూడా మన ముంగిట అడుగుపెడుతుంది.

క్రొత్తదనాలు పూవులయి గుత్తులుగట్టి యుగాది పందిటన్
మత్తిలి నృత్తమాడినవి, మామిడికొమ్మలు కొత్తగా చివు
ళ్ళెత్తి సుమించి కాచి ఫలియించెను, తీయని క్రొత్త కోరికల్
మెత్తని మన్మనః పథముమీది పదమ్ముల నూని సాగినన్

అని దాశరథివంటి నవకవి పులకించి పాడతాడు. దాశరథికి పూవులన్నిటిలోనూ మోదుగపూలంటే యిష్టం. "పల్లెపడుచు కచమ్ముల నుల్లసిల్లు మోదుగను మించినట్టి పువ్వేది జగతి!" అంటారాయన. అంతే కాదు,

కోట్ల చిలుక ముక్కు లిట్లేకమైనట్లు
కింశుకమ్ము లందగించె నేడు
పేదవాని మదిని పెకలివచ్చిన ఆశ
అరుణతరుణ మగుచు విరిసె ననగ

అని కూడా అంటారు. కోట్ల చిలుకల ముక్కులు ఒక్కదగ్గర చేరినట్లు ఉన్నాయట ఆ కింశుకాలు. అక్కడితో ఆగిపోతే అది దాశరథి కవిత్వం అవ్వదు. విరగపూచిన ఆ మోదుగపూలు, పేదవాని మదిలోని ఆశ పైకి పెకలివచ్చిన తొలిసంధ్య వెలుగులా ఉన్నాయనడం ఆయనకే చెల్లింది! పేదతనమనే చీకటి పూర్తిగా తొలగిపోయే కొత్త ఉషస్సునీ ఉగాదినీ ఆకాంక్షిస్తాడు అభ్యుదయ కవి. అతని దృష్టిలో వసంతవిజయమంటే అదీ.

ఏ పేరుతో వచ్చినా క్రొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించాలని దాశరథి నిష్కర్షగా అంటారు. "విజయ" అనే మంచి పేరుతో వచ్చిన యీ కొత్త సంవత్సరం కొత్త మంచిని తెస్తుందని ఆశిస్తూ దాన్ని స్వాగతిద్దాం. మంచిచెడుల సరిహద్దులు చెరిగిపోయిన యీ కాలంలో ఎవరు ఎవరిని జయించాలని కోరుకుంటాం? ఈ కాలంలో మనకు బాగా తెలిసిన Win-Win situation అనే పదబంధ స్ఫూర్తితో, అందరికీ విజయం చేకూరాలనీ, ఎవరికివారు తమలోని చెడుపైన విజయం సాధించాలనీ కోరుకుందాం, ప్రయత్నిద్దాం.

అందరికీ "విజయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! విజయీభవ!

పూర్తిగా చదవండి...

Friday, February 15, 2013

నన్నయ్యగారి గడుసుదనం


మన పూర్వకవుల రూపురేఖలు కానీ, వారి స్వరూపస్వభావాలు కానీ మనకి తెలియదు. వారివారి కవిత్వ లక్షణాల బట్టి కొంతా, వారి గురించి లభిస్తున్న ఇతరత్రా సమాచారం ద్వారా కొంతా, అనూచానంగా వచ్చే కథల ద్వారా మరికొంతా, కొందరికి కొన్ని ఊహాచిత్రాలను మనం కల్పించుకున్నాం. నన్నయ్యగారు అనేసరికల్లా ఒక శాంతగంభీర స్వరూపం మన మనసులో మెదులుతుంది. తిక్కన  అనేసరికి, ఒక నిండైన విగ్రహం, ఒకింత తీక్ష్ణమైన చూపు, నిటారుగా నిలబడి కనిపిస్తారు. శ్రీనాథుడైతే నిగనిగలాడే పచ్చని మేనితో విబూధిరేఖలతో తాంబూలంతో ఎఱ్ఱబడ్డ నోటితో చిలిపి నవ్వు నవ్వుతూ కనిపిస్తాడు (ఎంటీవోడి పంఖాలకైతే అతనే కనిస్తాడనుకోండి :-)). పోతనగారంటే మాత్రం నాగయ్యగారే, మరో మాట లేదు. అదే పెద్దనగారైతే పండుమీసంతో, చిరుబొజ్జతో, కప్పురవిడెము సేవిస్తూ, ఊయల ఊగుతూ కనిపిస్తారు. ఇక తెనాలి రామకృష్ణుడైతే సరేసరి! 

అయితే, వారివారి స్వరూపాలకు విరుద్ధమైన లక్షణాలు వారి కవిత్వంలో కనిపించినప్పుడు మనకి ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. ఉదాహరణకి, నన్నయ్యగారు ఒక గడుసైన పద్యాన్ని, కొన్ని పాత్రల దుస్థితిని గడుసుగా వెక్కిరిస్తూ, వ్రాసారంటే ఆశ్చర్యం వెయ్యదూ! నాకైతే వేసింది. ఆ పద్యమేమిటో చూద్దామా? ఆ పద్యంలోకి వెళ్ళే ముందు శబ్దశక్తిని గురించి - అభిధ, లక్షణ, వ్యంజన - అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇద్దామనుకున్నాను కానీ అవన్నీ చెప్పి యిప్పుడు సుత్తికొట్టడం దేనికని నేరుగా పద్యంలోకే వెళుతున్నాను. అది కుమారాస్త్ర ప్రదర్శనా ఘట్టం. అంటే కురుపాండవ రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తమ తమ విద్యలనీ, శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలాన్నీ ప్రదర్శించే సన్నివేశం.

సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క
నెంతయును సంతసంబున గుంతిదేవి
రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి
కెలన నుండె, నున్మీలితనలిననేత్ర

ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం! 

"కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. అందమైన కళ్ళని పద్మాలతో పోల్చడం మామూలుగా ప్రాచీన కవిత్వం అంతటా కనిపించేదే. ఇక్కడ మామూలు పద్మాలు కాదు, బాగా విచ్చుకున్న పద్మాలు. అంటే కుంతి కళ్ళు అంతగా విచ్చుకొని ఉన్నాయన్న మాట! పద్యం మొదట్లో చెప్పనే చెప్పాడు కాదా - ఆమె వేడ్కతోనూ సంతోషంతోనూ తన కుమారుల విద్యని చూడాలని కూర్చుంది. ఆ ఉత్సాహమూ ఆ సంతోషమూ, బాగా విచ్చుకున్న ఆమె కన్నుల్లో కనిపిస్తున్నాయన్న ధ్వని యీ విశేషణంలో ఉంది. ఇలా సార్థకమైన విశేషణాల ద్వారా ఒక విషయాన్ని ధ్వనింపజేయడం మంచి కవిత్వ లక్షణం.
బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొంది. అంచేత పాపం వాళ్ళు తమ పుత్రుల విద్యా ప్రవీణతని కళ్ళారా చూడలేరు. చూడగలిగింది కుంతి మాత్రమే. కుంతి సంతోషానికి అది కూడా కారణమేమో కూడానూ! ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని చూస్తోంది అని నొక్కి చెప్పడం ద్వారా, పాపం ఆ చూడలేని వారి దుస్థితిని వెక్కిరించినట్టు లేదూ! పైగా, అదెక్కడా పైకి తేలకుండా, పోలీసువాళ్ళ దెబ్బల్లాగా, కేవలం పద్యనిర్మాణం ద్వారా, చివర్న వేసిన విశేషం ద్వారా ధ్వనింపజేసారు నన్నయ్యగారు. అద్గదీ ఆయనగారి గడుసుదనం!


పూర్తిగా చదవండి...

Thursday, January 24, 2013

సాపుటేరుపై సరదా పద్యం


చిన్నప్పుడు మన బళ్ళో తెలుగు తరగతిలో ప్రకృతి-వికృతులని చదువుకున్నాం గుర్తుందా?

ఆశ్చర్యము - అచ్చెరువు
భాష - బాస
పుస్తకము - పొత్తము

యిలా... ఇవన్నీ సంస్కృతంనుండి ప్రాకృతానికీ అక్కడినుంచి తెలుగుకీ వచ్చిన పదాలు కొన్ని, నేరుగా సంస్కృతం నుంచి వచ్చినవి కొన్నీను. వీటిలో మూల పదాల స్వరూపం మన భాషాస్వరూపానికి తగ్గట్టుగా మారడం గమనించవచ్చు. ఇవన్నీ ఎవరో తీరికూర్చుని తయారుచేసినవి కావు. ప్రజల నోళ్ళల్లో నలుగుతూ ఏర్పడిన మాటలు. ఇలా వేరే భాషనుంచి రూపాంతరం చెంది తెలుగులోకి రావడం, ఒక్క సంస్కృత ప్రాకృతాలకే పరిమితం కాదు. ఆధునిక కాలంలో హిందీలాంటి యితర భాషల నుండి కూడా ఎన్నో పదాలు వచ్చాయి. ఇటీవల ఇంగ్లీషునుండి కూడా వచ్చిన పదాలు మనకెన్నో వాడుకలో ఉన్నవే. Car - కారు, Bus - బస్సు, Hospital - ఆసుపత్రి, యిలా. అయితే మన వ్యాకరణ పండితులు సంస్కృత ప్రాకృతాలనుండి వచ్చిన వాటిని తత్సమ, తద్భవాలనీ మిగిలిన భాషలనుండి వచ్చినవాటిని అన్యదేశ్యాలనీ వర్గీకరించారు. ఈ వర్గీకరణ వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు కాని ఒక రకంగా చూస్తే అది కృత్రిమమైన వర్గీకరణే.

ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఇంగ్లీషు పదాలని కూడా, అవసరమైన మేరకు, వీలైన వాటిని, యిలా మన భాషారూపంలోకి దిగుమతి చేసుకోడం తప్పుకాదని నా అభిప్రాయం. ఆ దృష్టితో software రంగానికి సంబంధించిన కొన్ని పదాలని వాడుక భాషలోకి ఎలా అనువదించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటే మనసులో కొన్ని పదాలు మెదిలి, ఆ పదాలతో ఒక పద్యం అల్లుకుంది. ఇలాంటి అనువాదం కొంతమందికి రుచించకపోవచ్చు. ఇది ఇంగ్లీషు భాషని భ్రష్టుపట్టించడంగా కొంతమంది భావించవచ్చు. ఇంగ్లీషుతో సంకరం చేసి తెలుగుని భ్రష్టుపట్టించడం అని మరికొందరు అనుకోవచ్చు. ఇందులో తప్పుపట్టేందుకేమీ లేదు. అది వారివారి అభిరుచి, అంతే. అలాంటి వారు దీన్ని కేవలం ఒక సరదా పద్యంగా తీసుకొని మరిచిపోవలసిందిగా మనవి. కానివారు ఈ తరహా అనువాదాన్ని గురించి ఆలోచించవచ్చు. స్ఫూర్తికూడా పొందవచ్చు. అయితే ఇలాంటి పదాలు సృష్టించినప్పుడు, అవి తెలుగుభాషా స్వరూపానికి తగినట్టుగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి.

కాపీపేసుటు చేసిచేసి పలు ప్రోగ్రాముల్ లిఖించున్ మరిన్
మాపున్‌దోపును బగ్గులెన్నొ తుదకుం బ్రాప్తించు స్థానోన్నతుల్
ఆపై దొంతరదొంతరల్ వరడుపత్రాళుల్ మరింకెన్నొ సొం
పౌ పీపీటులు గళ్ళపొత్తములు తయ్యార్ చేయుచున్ గాలమున్
దీపిన్ బుచ్చును సాపుటేరు బ్రతుకింతేకాదటోయ్ చూడగన్!

దీనికి టీకా టిప్పణి:

కాపీ - Copy, పేసుటు - Paste, ప్రోగ్రాము - Program, మాపున్ - fix, దోపున్ - insert, బగ్గు - bug, వరడుపత్రం - Word Document, పీపీటి - PPT(PowerPoint) (బహువచనం పీపీటులు), గళ్ళపొత్తం/గళ్ళపుస్తకం - Excel Workbook, సాపుటేరు - Software.

ఇంతకన్నా దీని అర్థం వివరించాల్సిన అవసరం లేదనుకుంటా! ఏ పనీ యిచ్చిన గడువులోపల పూర్తి చేసే అలవాటు బొత్తిగా సాపుటేరు వాళ్ళకి లేదనే విషయం, పద్యం నాలుగు పాదాల్లో పూర్తికాక అయిదవ పాదానికి సాగడం ద్వారా ధ్వనింపజేసానని పద్యాన్ని "లోనారసి"న సారమతులు గ్రహించిగలరు. :)



పూర్తిగా చదవండి...

Tuesday, January 8, 2013

నన్నెచోడుని పద్యశిల్పం


మొన్న బెంగుళూరులో కొంతమంది నెణ్మిత్రులం (నెట్+మిత్రులు = నెణ్మిత్రులు :-)) కలుసుకున్నప్పుడు, నేనీ మధ్య బ్లాగు టపాలు బొత్తిగా తగ్గించేసానని కొందరు ముద్దుగా కోప్పడ్డారు. పండగలకే వ్రాస్తున్నానని మరొకరి సన్నాయి నొక్కు :-) ఇందులో నిజం లేకపోలేదు. కొంత ఆసక్తి తగ్గడం మాట అలా ఉంచితే, అసలు కారణం, వ్రాయడానికేమీ పెద్దగా లేకపోవడమే. ఏళ్ళ తరబడి అంతే కాంతితో వెలిగిపోడానికి నేనేమీ సూర్య నారాయణున్ని కాదు కదా! ఏదో చిన్న గుడ్డి దీపాన్ని. చమురు తగ్గిపోయే కొద్దీ కాంతి తగ్గిపోతుంది. ఏదైనా కొత్తగా చదివినా విన్నా తెలుసుకున్నా కొత్త చమురుపోసినట్టు కొత్త టపాలేవైనా వెలుగుతాయి. దీపం పూర్తిగా కొడిగట్టకుండా ప్రయత్నించడమే, బహుశా నేను చెయ్యగలిగేది! 
యీసారి పండగ మామూలుగా కాకుండా, పండక్కి నాల్రోజుల ముందే, ఆ పండక్కి సంబంధం లేని ఒక టపా...

నన్నెచోడుడు అనే రాజకవి వ్రాసిన "కుమారసంభవం" అనే కావ్యం ఇటీవలి కాలం దాకా, అంటే సుమారు నూరేళ్ళ కిందటి వరకూ, తెలుగు సాహిత్య ప్రపంచంలో అజ్ఞాతంగా ఉండిపోయింది. సాధారణంగా కవులు తమ పూర్వకవులని స్తుతించడమూ, లక్షణకారులు తమ సిద్ధాంతాలకు పూర్వ కవుల పద్యాలను ఉదాహరణలుగా చూపించడమూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రస్తావనలు సాహిత్యచరిత్ర వ్రాసే వాళ్ళకి ఆయా కవుల/కావ్యాల కాలనిర్ణయంలో ఎంతో ఉపయోగపడతాయి. నన్నెచోడుని గురించి కానీ, అతని కుమారసంభవం కావ్యం గురించి కానీ ఇలాంటి ప్రస్తావనలు మనకెక్కడా కనిపించవు! శ్రీ మానవల్లి రామకృష్ణకవి అనే గొప్ప పరిశోధకులు దీన్ని వెలికితీసి, పరిష్కరించి మొట్టమొదటిసారి 1909లో ప్రచురించారు. ఈ నన్నెచోడుడు నన్నయ్య కన్నా ముందటి వాడని అతను ప్రకటించారు! అది సహజంగానే పెద్ద సంచలనాన్ని సృష్టించింది. పెద్ద దుమారం రేగింది. కొంతమందయితే అసలీ కావ్యం రామకృష్ణకవిగారి కూట (దొంగ) సృష్టి అని నిందారోపణ చేసేదాకా వెళ్ళింది. మొత్తానికి ఆనాటి పండితులందరూ తేల్చిన విషయం - యిది నన్నెచోడుని కావ్యమేననీ, నన్నెచోడుడు నన్నయ్య తిక్కనల మధ్య కాలానికి చెందినవాడనీను. కుమారసంభవం ఎన్నో విశిష్టతలు కలిగిన కావ్యం. వాటి గురించి కొంత తెలుసుకోవాలంటే ఈమాటలో శ్రీ మోహనరావుగారి మంచి వ్యాసం చదవండి (http://www.eemaata.com/em/issues/200901/1389.html). ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఈ కావ్యంలో నన్ను బాగా ఆకట్టుకొన్న ఒక మంచి పద్యాన్ని గురించి యిప్పుడు ముచ్చటించుకుందాం.

పవడంపులతమీద ప్రాలేయపటలంబు
         బర్వెనా మెయినిండ భస్మమలది
లాలితంబగు కల్పలత పల్లవించెనా
         గమనీయ ధాతువస్త్రములు గట్టి
మాధవీలత కళిమాలికల్ ముసరెనా
         రమణ రుద్రాక్షహారములు వెట్టి
వర హేమలతికపై బురినెమ్మి యూగెనా
         సన్నుతమగు నెఱిజడలు బూని

తపస్సు చేస్తున్న పార్వతీదేవి వర్ణన యిది. ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు? ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత (పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది, ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు. జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో నిగనిగలాడుతూ ఉంటుంది. కాని తపోదీక్షలో, సంరక్షణ లేక ఆమె కురులు బిరుసెక్కి ఎఱ్ఱెఱ్ఱని రంగులోకి మారాయి. అందుకూ నెమలి పురితో పోలిక. ఇవన్నీ చాలా అందమైన పోలికలు. అన్నీ ప్రకృతినుంచి తీసుకున్నవే. పార్వతి ప్రకృతి స్వరూపమే కదా మరి! పైగా నాలుగుపోలికలలోనూ మనకి కనిపించేది తీగే. ఆమె శరీరం తపస్సుకి ఎంతగా కృశించిపోయిందో, అయినా తన సహజ సౌందర్యంతో ఎలా శోభిస్తోందో, ఈ పోలిక వల్ల చాలా చక్కగా ధ్వనిస్తోంది. ఇంతటితో ఆగిపోతే ఇదేమంత పెద్ద గోప్ప వర్ణన అని చెప్పలేం. ఎత్తుగీతితో యీ వర్ణన స్థాయిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాడు నన్నెచోడుడు.

హరుడు మాహేశ్వరీ రూపమైన చెలువ
మభినయించెనొ యని మును లర్థి జూడ
గురుతపశ్శక్తి మూర్తి సేకొనిన కరణి
దగిలి యుమ తపోవేషంబు దాల్చి పొల్చె!

నిజం చెప్పండి, యీ ఎత్తుగీతి చదివేదాకా పార్వతి తపోవేషం సరిగ్గా శివుని రూపాన్ని పోలినదన్న స్ఫురణ మీకు కలిగిందా? నాకైతే కలగలేదు. అలా కలగకుండా చాలా జాగ్రత్తగా పద్యాన్ని చెక్కాడు కవి. ప్రతి పాదంలోనూ పార్వతీదేవి వేషధారణ చెప్పడానికి ముందు, దాని గురించిన రమణీయమైన పోలిక చూపించి, మనసుని కట్టిపడేసాడు, అసలు వేషమ్మీదకి దృష్టి మళ్ళకుండా. ఇది కవి దృష్టి. ఎత్తుగీతి మొదటి పాదంలో హఠాత్తుగా శివుని రూపాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింప జేసాడు. అది మునుల చూపు! ఇది గొప్ప పద్యశిల్పం. ఈ శిల్పం ద్వారా కవి సాధించినదేమిటని అలోచిస్తే, మామూలు మనుషుల చూపుకీ, మునుల చూపుకీ ఉన్న అంతరాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం. మనం మామూలు మనుషులం. ప్రకృతి రామణీయకతకి పరవశులమైపోతాం.  కానీ మహర్షులు అసలు స్వరూపాన్ని దర్శించగలుగుతారు. ప్రకృతిలో పరమాత్మను దర్శిస్తారు. పార్వతీ పరమేశ్వరులు, ప్రకృతీపురుషులు ఒకటే అన్న జ్ఞానాన్ని పొందుతారు. ఇంత గొప్ప తత్త్వాన్ని అందమైన వర్ణనల మాటున, సీసపద్య శిల్పం ద్వారా ఎంత చక్కగా ధ్వనింప జేసాడో చూసారా! నా దృష్టిలో యిది గొప్ప కవిత్వం. పైగా ఎత్తుగీతిలో ఎంతటి ఔచిత్యముందో జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. పార్వతీదేవి శివునిలాగా ఉంది అనుకోలేదు మునులు. ఆ హరుడే పరమేశ్వరి అందాన్ని అభినయిస్తున్నాడా అని అనుకొన్నారు!  వారికక్కడ కనిపించింది పరమేశ్వరుడే. ఎందుకంటే అప్పటికింకా పార్వతి శివపత్ని కాలేదు. అంచేత మునులకి ఆమె ఒక స్త్రీ మాత్రమే. ఆమె వారికి స్త్రీగా కనిపిస్తే వారు "అర్థితో" చూడడం కుదరదు. పైగా వారి శివదీక్షకి అది తగదు. అందువల్ల వారికక్కడ కనిపించినది స్వయానా ఆ పరమేశ్వరుడే. అలా కనిపించడానికి కారణం వారి శివదీక్షతో పాటు, ఘనమైన పార్వతి తపశ్శక్తి . తపశ్శక్తికి ఆకారం వచ్చిందా అన్నట్టుగా ఉన్నదామె. శివుడు నిత్య తపస్సమాధిమగ్నుడు. అంచేత అమ్మవారు తపశ్శక్తి స్వరూపిణి కావడం చాలా సమంజసం కదా. 

ఈ వర్ణనలో మరొక చిన్న విశేషం కూడా దాగి ఉంది! శివదీక్ష చేపట్టే వారు ఆ శివునిలా రుద్రాక్షలు ధరించి, బూడిదపూసుకొని అతని రూపాన్ని అనుసరించడం ఒక పద్ధతి. అయితే, తమాషా ఏంటంటే, శృంగారచేష్టలలో "లీల" అన్నది ఒకటి ఉంది. ప్రియుని వేషభాషలను ప్రియురాలు అనుకరించడం లీల. ఇక్కడ పార్వతీదేవి తపోవేషం ఆ "లీల"గా కూడా మనం భావించ వచ్చు! కుమారసంభవం పూర్తిగా శృంగారరసాత్మకమైన కావ్యమే మరి! ఆ ఆదిదంపతుల సంభోగమే కదా యీ సర్వసృష్టికీ కారణం.

పూర్తిగా చదవండి...