తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, July 20, 2009

అర్జునుడిపై ద్రౌపది అభిమానం

మాగంటి వంశీగారు మొదలుపెట్టిన ఆడియో పుస్తకాల ప్రయత్నంతో నాలో నాటుకున్న ఆలోచన, మొన్న కొత్తపాళీ, రవిగార్ల ప్రయత్నాలు చూసి మొలకెత్తి, భాస్కర రామిరెడ్డిగారు మొన్నటి టపాలో పెట్టిన కామెంటుతో చిగురించి, ఇదిగో ఇప్పుడిలా ఫలించింది.
నాకు సంగీతం రాదు, నేను రాగయుక్తంగా పద్యాలని పాడలేను. కాబట్టి అవి "వినసొంపు"గా అయితే ఉండవు. అసలందుకే వీటిని వినిపించడం ఎందుకని ఊరుకున్నాను. కాని భాస్కర్ గారు అన్నట్టు కనీసం పదాల సమాసాల ఉచ్చారణ, ఆసక్తి ఉన్నవాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందని ఇప్పుడిలా సాహసం చేస్తున్నాను. ధైర్యం ఉన్నవాళ్ళు వినవచ్చు :-)

ప్రస్తుతం మనం విరాటపర్వంలో ఉన్నాం కదా. ద్రౌపది తనకు కీచకునివల్ల కలిగిన అవమానాన్ని భీముడికి వివరించి, తన బాధని అతనికి చెప్పుకుంటున్న సన్నివేశం. ఎలాంటి పాండవులు ఎలా అయిపోయారు అని దుఃఖపడుతోంది ద్రౌపది. ధర్మరాజు గొప్పతనం గంభీరంగా వర్ణించింది. అలాంటి అతను ఇప్పుడిలా పరుల పంచన చేరాడే అని వాపోయింది. భీముని బలపరాక్రమాలు సొగసుగా వర్ణించింది. అలాంటివాడు గరిటపట్టుకున్నాడే అని బాధపడింది. ఇప్పుడు అర్జునుడి వంతు.



తొడరిన హరునైన దోర్బలంబున దన్ను
మిగులంగనీడను మేటి మాట
యమరేంద్రు నర్ధాసనమునకు నైన న
ర్హుండెంతయును నను రూఢిమాట
జమునిల్లు సొచ్చిన జంతువు నైనను
గాచు నెమ్మెయి నను రాచమాట
దను గోరి యూర్వశి దాన వచ్చిననైన
లోలుండు గాడను మేలిమాట

శౌర్యవైభవప్రాభవశౌచములకు
నొరులకైన గైవారమై యుల్లసిల్లు
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె
యెందు గలుగునె యర్జును నీడువాడు

ఇది కాస్త సులువుగా అర్థమయ్యే పద్యమే.

తొడరిన = ఎదిరించిన, హరునైన = శివుడినైనా, దోర్బలంబున = తన భుజబలంతో, మిగులంగనీడు = మించనియ్యడు, అను మేటి మాట
ఎదిరించినవాడు శివుడైనా తన భుజబలంతో తనని ఓడించనివ్వకుండా చెయ్యగలవాడు. అంటే అతనితో సరిసమానంగా తన శక్తి చూపించగలడు అని అర్థం. అలాంటి గొప్ప మాట,

అమరేంద్రున్ = ఇంద్రుని, అర్ధాసనమునకైన = అర్ధ సింహాసనానికైనా, అర్హుడు ఎంతయు = ఎంతైనా తగినవాడు, అను రూఢి మాట = అని నిశ్చయంగా చెప్పగలిగే మాట
ఇంద్రుని అర్ధ సింహాసనానికి కూడా అర్హుడితను అని నిశ్చయంగా చెప్పగలిగిన మాట,

జమునిల్లు సొచ్చిన = యముని ఇంట్లోకి వెళ్ళిపోయిన, జంతువు నైనను = జంతునునైనా సరే, కాచు నెమ్మెయి = ఎలాగైనా రక్షిస్తాడు, అను రాచమాట = అనే క్షత్రియోచితమైన మాట
యమపురికి వెళ్ళిన జంతువునైనా ఎలాగైనా కాపాడగలడనే క్షత్రియోచితమైన మాట,

తను గోరి యూర్వశి = తనని వరించి ఊర్వశి, తాన వచ్చిననైన = తానే వచ్చినా కూడా, లోలుండు కాడను = చంచలుడు కాడనే, మేలి మాట = మంచి మాట
ఊర్వశి స్వయంగా తనని కోరివచ్చినా చలించడనే మంచిమాట,

శౌర్య, వైభవ, ప్రాభవ శౌచములకు = శౌర్య, వైభవ, ప్రాభవ, శీలములకు సంబంధించి
ఒరులకైన = వేరేవాళ్ళకైతే, కైవారమై = పొగడ్తగా వట్టి స్త్రోత్రంగా, ఉల్లసిల్లున్ = ప్రకాశిస్తాయి
శౌర్యము, వైభవము, ప్రాభవము, శీలముల గురించిన యీ మాటలన్నీ వేరేవాళ్ళకైతే (అర్జునుడికి కాకుండా), అవి వట్టి స్తోత్రాలుగా మాత్రమే ప్రకాశిస్తాయి.

ఒక్కరునికి ఇవియెల్లను నిక్కము అట్టె = ఒక్కడి విషయంలో మాత్రం ఇవన్నీ నిజమే

అర్జును ఈడువాడు = అర్జునుడికి సమానమైనవాడు, ఎందు కల్గునె = ఎక్కడైనా ఉంటాడా!

ఇది దీని అర్థం. ఎవరి శౌర్యాన్నైనా పొగడాలంటే "వీడు శివుడినైనా ఎదిరించగల మొనగాడురా అంటాం". ఇది అతిశయోక్తి. నిజంగా శివుడు యుద్ధానికి వస్తే ఎదురించగల నరుడెవడు? ఒక్క అర్జునుడు తప్ప! అర్జునుడు పాశుపతాస్త్రం గురించి తపస్సు చేసినప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసిన సంగతి మనకి తెలుసు కదా. కాబట్టి అర్జునుడి విషయంలో ఆ మాట అతిశయోక్తి కాదు, నిజమే. మిగతా విషయాలు కూడా అంతే. ఇంద్రుని అర్ధాసనం, జంతు రక్షణ, ఊర్వశి వలచి వచ్చినా కాదనడం. ఇక్కడ అర్జునుడు జంతువుని రక్షించిన కథ ఏమిటో తెలియడం లేదు. వ్యాఖ్యానాలలో "గో రక్షణ" అని మాత్రం ఇచ్చి ఊరుకున్నారు.

ఈ పద్య రచనని ఇంతకుముందు పద్యాలతో పోల్చిచూడండి. ధర్మరాజు గురించిన పద్యంలో గాంభీర్యమూ, భీముని గురించిన పద్యంలో సొగసూ ఉంటే, ఈ పద్యంలో అభిమానంతో కూడిన గర్వం కనపడటం లేదూ! ఆ భావమంతా "ఎందు గలుగునె అర్జును నీడువాడు!" అనడంలో ఉంది. ధర్మరాజంటే ద్రౌపదికి చాలా గౌరవం. అంతకు మించి ఆ పద్యంలో మరేమీ కనిపించదు. అదే భీముడైతే, కాస్త చనవుంది. అయినా అతడంటేనూ ప్రేమతోకూడిన గౌరవం ఉంది. వాళ్ళిద్దరూ దైవాంశ సంభూతులనే దృష్టి ఎక్కువగా ఉంది. అదే అర్జునుడి దగ్గరకి వచ్చేసరికి, ఈ పద్యంలో అతడు అచ్చంగా మనిషే. మామూలు మనుషులకి సాధ్యం కాని పనులని చేసిన గొప్ప మనిషి. అంచేత అతనికి సాటి రాగలవాడు మరొకడు లేడు. అతణ్ణి భర్తగా పొందడం ద్రౌపదికి గర్వం. అందుకే అతను చేసిన పనులన్నీ వివరంగా వర్ణించింది. ధర్మజ భీముల విషయంలో అతిశయోక్తి అవసరమయ్యింది. అదే అర్జునుడి విషయంలో అవసరం లేదు. మిగతావాళ్ళ విషయంలో అతిశయోక్తులు కూడా ఇతని విషయంలో స్వభావోక్తులైపోతాయి కదా మరి! ధర్మజ భీముల విషయంలో భాషకీ, చెప్పే తీరుకీ ప్రాధాన్యం ఉంది. ఠీవిగా, సొగసుగా పద్యాలు నడిచాయి. అదే అర్జునుడి విషయంలో అది అవసరం లేదు. అతను చేసిన పనులు వివరిస్తే చాలు. అందుకే భాష, పద్యపు నడక యీ పద్యంలో సాధారణంగా ఉన్నాయి.
జాగ్రత్తగా గమనిస్తే, చివరన "ఒక్కడి విషయంలో మాత్రం ఇవన్నీ నిజమే" అన్న తర్వాత, ఆ ఒక్కడూ ఎవరన్నది ద్రౌపది చెప్పిందా? "ఎందు కలుగునె అర్జును నీడువాడు" అని అనేసింది. అంటే అక్కడ ఆ ఒక్కడూ అర్జునుడు అని మనం అన్వయించుకోవాలి. ఇది ద్రౌపది మనస్థితిని అద్దంపడుతూ, సహజంగా సాగే సంభాషణా శైలి. అర్జునుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ మైమరచిపోయింది ద్రౌపది. ఆ ఒక్కడూ అర్జునుడే అని ప్రత్యేకించి చెప్పాలని ఆమెకి తట్టనే లేదు! అలా అర్జునుడి గురించిన తలపులలో మునిగిపోయిన ఆమె, "అర్జునుడికి ఈడైనవాడు ఎక్కడా లేడు" అని తనలో తానే ఆనందపడుతూ, గర్వపడుతూ ఆ మాటే బయటకి అనేసింది!

ఇంత ఆలోచించి పద్య రచన చేస్తాడు కాబట్టే తిక్కన గొప్ప కవి అనిపించుకున్నాడు! పూర్వం కవిత్వమంటే, ఆత్మాశ్రయమైన గాఢానుభూతి మాత్రమే కాదు. కథా కావ్యాలలో ఈ అనుభూతి పాత్రలని ఆశ్రయించుకొని ఉంటుంది. అందుకే, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణలూ ఇవన్నీ విశిష్టంగా నిర్వహించడం గొప్ప కవిత్వ లక్షణంగా ఉండేది. ఈ కాలపు కవిత్వ నిర్వచనం వీటికి ఆపాదించి, ప్రాచీన కావ్యాలలో అక్కడక్కడే కవిత్వం కనిపిస్తుందని కొంతమంది అభిప్రాయపడతారు. ఇది సమంజసం కాదని నా ఉద్దేశం. కావ్య రచన మొత్తాన్నీ కవిత్వంగానే పరిగణించాలి.
ఇక్కడ నాకు వీలునుబట్టి కొన్ని కొన్ని పద్యాలని ఎంచుకొని వివరిస్తూ పోతున్నాను కాని, ఆయా కావ్యాలలో ఇవే కవిత్వమున్న పద్యాలని ఎవరూ అనుకోకండి. ఇలా విడిగా పద్యాలు చదవడం కన్నా, మొత్తం కావ్యాన్ని చదివితే మరింతగా బావుంటుందది. ముఖ్యంగా తిక్కన విషయంలో మరీను. ఉదాహరణకి, పై పద్యం తర్వాత వచ్చే యీ పద్యాలు చూడండి. ఇందులో ద్రౌపది ఆర్తి ఎంతగా మనసుకి హత్తుకుంటుందో స్వయంగా అనుభవించండి.


అరయనతండు మానధను డక్కట రంగమునందు నిల్చి సుం
దరులకు నాట సూపెడు విధం బతిదీనము దాని జూచి యే
పురపుర బొక్కుదుం గడుపు బ్రోచికొనన్ లఘువృత్తి కిమ్మెయిన్
జొరనగువాడె దేవపతిసూనుడు దైవముచేత సూచితే!


మగలకు మేటియైన బలమర్దన నందను బేడిజేయగా
దగునె విధాత నీకునని దైవము దూరుదు నోర్వరాని నె
వ్వగ దలకొన్న నెంతయును వందుదు నిద్దురవస్థ యెన్నడో
తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమిసేయుదున్


పూర్తిగా చదవండి...

Thursday, July 16, 2009

మూర్ఖోపాఖ్యానం

రామాయణంలో పిడకల వేటలాగా, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తిక్కన భారతం మధ్యలో యీ మూర్ఖోపాఖ్యానం! నేనేం చెయ్యను, హఠాత్తుగా నాకీ పద్యాలు ఇవ్వేళ (మళ్ళీ) గుర్తుకొచ్చాయి మరి. గుర్తుకు రావడం వెనక ఒక కారణం ఉంది కాని, అదిక్కడ చెప్పడం సభ్యత కాదు, అవసరమూ లేదు. అసలీ పద్యాలు (వచ్చిన వాళ్ళకి), ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో భర్తృహరి రాసినా, ఆ తర్వాత ఎప్పుడో లక్ష్మణకవి తెలుగు చేసినా, వీటికి కాలదోషం పట్టకుండా (అదే expire అవ్వకుండా) ఉండడానికి మనవేఁ కారణం. మూర్ఖులున్నంత వరకూ ఇవి నిలిచే ఉంటాయి!

బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయ దూషితా
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితం

బోద్ధలగువారు మత్సరపూర్ణ మతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజు లబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు

తెలిసినవాళ్ళేమో అసూయాపరులు, ప్రభువులేమో గర్వాంధులు. ఇతరులకి విని బోధపరచుకొనే తెలివిలేదు. చెప్పాలనుకున్న సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది.

మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా
యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటకు తియ్యవచ్చు, నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతోకూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు, పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. మూర్ఖుడి మనసుని మాత్రం ఒప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు! (సంస్కృతంలో మొండిపట్టుపట్టిన మూర్షుడు అని ఉంటుంది)

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప లేము

ప్రయత్నిస్తే ఇసుకలోంచి చమురుని తియ్యడం సాధ్యమవచ్చేమో. ఎండమావి వెంటబడి అందులో నీరు తాగవచ్చునేమో. కొమ్మున్న కుందేలుని వెతికి పట్టుకోవచ్చేమో. ఇవేమీ చేసే అవకాశం లేదు కాని కనీసం చెయ్యవచ్చేమో అని ఆలోచించవచ్చు. కాని మూర్ఖుని మనసుని ఒప్పించే, మార్చే ప్రయత్నాన్ని మాత్రం ఊహలో కూడా చెయ్యలేము!

కరిరాజున్ బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింప, దీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుం జింద యత్నించు, ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్

మదపుటేనుగును తామరతూళ్ళతో కట్టడానికి ప్రయత్నించేవాడు, దిరిసెనపువ్వులతో వజ్రాన్ని కోయ్యాలనుకునేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చాలని చూసేవాడు, మంచిమాటలతో మూర్ఖులకి చెప్పే ప్రయత్నం చేసేవాడు వీళ్ళందరూ ఒకలాంటి వాళ్ళేనట!


ఈ పద్యాలు చదివినప్పుడల్లా, భర్తృహరి ఎంతమంది ఎలాంటి మూర్ఖులని కలిసి వాళ్ళతో వాదించాల్సి వస్తే ఇంతలా యీ మూర్ఖపద్ధతిని వర్ణించేవాడూ అనిపిస్తుంది. ఆ బాధ ఏవిఁటో తెలుసుకాబట్టి, అతని మీద జాలికూడా కలుగుతుంది.

మూర్ఖులు చాలా రకాలుగా ఉంటారు. తాము మూర్ఖులమని తెలియని వాళ్ళు కొందరైతే, తెలిసిన వాళ్ళు మరికొందరు. వీళ్ళు తెలుసున్న మూర్ఖులన్న మాట! మళ్ళీ ఇందులో, కొంతమంది తమ మూర్ఖత్వానికి సిగ్గుపడి మౌనంగా ఉండలనుకొనేవారు కొందరైతే, తమ మూర్ఖత్వానికి తాము గర్వపడుతూ, దానికి రకరకాల పేర్లుపెట్టి విజృంభించేవారు మరికొందరు.
వీళ్ళందరూ కాక మూర్ఖులలో మరో రకం కూడా ఉన్నారు. అదెవరో తెలుసా, ఇదుగో పైన చెప్పినట్టు, మూర్ఖుల మనసు మార్చలేమని తెలిసి తెలిసీ వాళ్ళతో వాదనకి దిగేవాళ్ళున్నారు చూడండీ, వాళ్ళది తెచ్చిపెట్టుకున్న మూర్ఖత్వం!

నా స్నేహితుడొకడు మొన్నొకసారి హఠాత్తుగా ఓ పొడుపుకథ పొడిచాడు. "ఒరేయ్! జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది కదా. అలాగే మూర్ఖుడూ మూర్ఖుడూ రాసుకుంటే ఏం రాలుతుంది(తాయి) చెప్పుకో?" అని అడిగాడు. నేను చాలాసేపు ఆలోచించి... రకరకాలుగా ప్రయత్నించి... చించి... ఆఖరికి ఓటమిని ఒప్పేసుకొని వాడినే జవాబు చెప్పమన్నాను. అప్పుడు వాడు, "ఈ మాత్రం తెలీదా, బ్లాగులలో కామెంట్లు!" అని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి చక్కా జారుకున్నాడు!
"హు... వాడంతే...వాడొక నిజమైన బ్లాగరి (బ్లాగ్ + అరి = బ్లాగులకి శత్రువు)!" అనుకొని వాడన్నమాటని తీవ్రంగా కొట్టిపారేసాననుకోండి. వాడి మాటలకి మీరెవ్వరూకూడా ఏవీఁ "ఫీలు" కాకండేం.

పిడకలవేట సమాప్తం. తర్వాత పోస్టులో తిరిగి మనం తిక్కన దగ్గరికి వెళ్ళిపోదాం.


పూర్తిగా చదవండి...

Monday, July 6, 2009

నీ వలమూపులావు...

కిందటిసారి ద్రౌపది ధర్మరాజుగురించి చెప్పిన పద్యాన్ని వివరించాను కదా. ఇప్పుడు భీముడి గురించి చెప్పిన పద్యం చూద్దాం. ఇది భీముడి గురించి అతనితోనే చెపుతున్న పద్యం అన్నమాట. అంచేత ఇది మరికాస్త సొగసుగా ఉంటుంది!

నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో
త్రావనిభృద్దిశాకరుల కారయ నూఱటపట్టు గాదె సం
భావన భూజనంబులకు బండువు గాదె మహోగ్ర కోప రే
ఖా విభవంబు వైరులకు గాలము చేరువ కాదె పావనీ!

దీనికి ఆడియో నాకెక్కడా దొరకలేదు. కొత్తపాళీగారిలా నా గొంతు అందరికీ వినిపించే సాహసం నేను చెయ్యలేను :-) అంచేత ఎవరికి వారు పాడుకుని ఆనందించండి! పాడుకునేటప్పుడు "నాగకూర్మ గోత్రావనిభృద్దిశాకరుల కారయ" అన్న సమాసాన్ని ఒక్క గుక్కలోనే అనడం మర్చిపోకండి. "మహోగ్ర కోప రేఖా విభవంబు" అనేటప్పుడు "ఖా" మరో పాదంలోకి వెళుతోంది కాబట్టి దానికి కాస్తంత ఊనిక (అదే force/stress) ఇవ్వండి. ఇంక చివరనున్న "పావనీ" అన్న సంబోధనని ఎంత మనోహరంగా సాగదియ్యగలిస్తే అంతగా తియ్యండి. మొత్తంగా భావయుక్తంగా పాడుకోండి. ఇంతకీ ఏవిటా భావం?

వలమూపు - కుడి భుజం, లావు - బలం

ఎత్తుకోడంతోనే "నీ వలమూపులావు" అనే అందమైన అచ్చతెలుగు సమాసంతో పద్యాన్ని ఎత్తుకుంది ద్రౌపది. ఎందుకు? ఇక్కడొక భార్య తన భర్తతో మురిపెంగా మాట్లాడుతోంది. ఆప్యాయంగా మాట్లాడుతోంది, ఆంతరంగికంగా మాట్లాడుతోంది. ఆ మురిపెం అంతా ఆ చక్కని తెలుగు సమాసంలో ఉంది. పైగా "నీ" అని ముద్దుగా ఏకవచన ప్రయోగం కూడానూ!
ఈ ఎత్తుగడని "ఎవ్వాని వాకిట..." పద్యపు టెత్తుగడతో పోల్చి చూడండి, ఎంత తేడానో. అక్కడ చెపుతున్నది ధర్మరాజు గురించి భీమునితో. అందుకా ఠీవి, ఆ గాంభీర్యం అవసరమయ్యింది. ఇక్కడ నేరుగా భీమునితో అతని గురించే చెపుతోంది. అందుకే యీ చనవు.

మును నేల వహించిన - ఇంతకుముందు భూమిని మోసిన (అంటే ఇప్పుడు మొయ్యటం లేదన్న మాట!). ఎవరు?

నాగ కూర్మ గోత్రావనిభృత్ దిశాకరులకు ఆరయ ఊరటపట్టు కాదె :

నాగ - ఆదిశేషువు, కూర్మ - తాబేలు, గోత్ర అవనిభృత్ - అవనిభృత్ అంటే భూమిని ధరించేవి అంటే పర్వతాలు. కుల పర్వతాలు, దిశాకరులు - ఎనిమిది దిక్కులా ఉండి భూమిని మోసే దిగ్గజాలు.
చూద్దునుకదా, వీటన్నిటికీ నీ ఒక్క కుడి భుజ బలమే ఊరటపట్టు అయింది కదా! అంటే ఇప్పుడు భూభారాన్నంతా నువ్వే నీ కుడి భుజం మీద మోస్తున్నావు అని భావం. రాజు తన భుజ బలంతో భూభారాన్ని వహిస్తాడు అని కవిసమయం. అది ఆ రాజు పరాక్రమానికి చిహ్నం.
"వలమూపులావు" అన్న చిన్న తెలుగు సమాసం తర్వాత "నాగకూర్మ..." అన్న పెద్ద సంస్కృత సమాసం. ఎందుకు? అంత పెద్ద, భారమైన పనిని ఇంత చిన్న చేత్తో (భుజంతో) నువ్వు చేస్తున్నావని ధ్వనించడానికి. అది భీముని పరాక్రమాన్ని మరింతగా ధ్వనిస్తోంది కదా!
శబ్దశక్తి తెలుసున్న కవిత్వం ఇది. వాక్శక్తి తెలిసినవాడు కాబట్టే తిక్కన కవిబ్రహ్మ అయ్యాడు. ఎక్కడ తెలుగు పదాలు వెయ్యాలో, ఎక్కడ తద్భవాలు వాడాలో, ఆ రెంటినీ పద్యాలలో ఎంత సొగసుగా అతకాలో తిక్కనకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. దానికి యీ పద్యం ఒక మచ్చుతునక. మన ప్రాచీన సాహిత్యమంతా వట్టి సంస్కృతభూయిష్టమే అనుకోడం శుద్ధ భ్రమ. అది ఉత్త అనువాదమనో లేదా అర్థంకాని భాష అనో నిరసించి చదవనివాళ్ళనీ, చదవక్కరలేదనేవాళ్ళనీ చూసి జాలిపడ్డం తప్ప వేరే చెయ్యగలిగింది ఏమీ లేదు.

అన్నట్టు అష్టదిగ్గజాలకి (రాయలకొలువులో అష్టదిగ్గజాలు కాదు, ఎనిమిది దిక్కలా ఉన్న ఏనుగులు) పేర్లున్నాయి తెలుసా? ఐరావణ(త), పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. వీటి పేర్లూ, అవి ఏ ఏ దిక్కులని మోస్తాయి అన్న విషయమ్మీద ఏకాభిప్రాయం లేదు. ఈ ఏనుగుల భార్యల పేర్లు కూడా పురాణాల్లో ఉన్నాయి. అభ్ర, కపిల, పింగళ, అనుపమ, తామ్రపర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి.

సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, ఇంకా ద్రౌపది ఇలా అంటోంది.

సంభావన - దానధర్మాలు, భూజనంబులకు పండువు కాదె - ప్రజలందరికీ పెద్ద పండగే
అతను ప్రజలకి చేసే దానధర్మాలతో వాళ్ళు నిత్యం పండగజరుపుకుంటారట.

మహోగ్ర కోప రేఖా విభవంబు - భీకరమైన కోపం అతను రేఖామాత్రంగా చూపించినా, దాని ఆధిక్యానికి
వైరులకు కాలము చేరువ కాదె - శత్రువులకి కాలం దగ్గరపడినట్టే!
భీముడు తన కోపం రేఖామాత్రంగా చూపించినా అది అతని శత్రువులకి కాలం దగ్గరపడ్డట్టే అని. ఈ కాలం దగ్గరపడ్డం ఇప్పటికీ మనం వాడే పలుకుబడి (కొంచెం ఆధునికంగా చెప్పాలంటే టైం దగ్గరపడిందిరోయ్ అన్నది).

ఇక్కడితో చెప్పవలసిందంతా అయిపోయింది. భీముని భుజబలం, అతని దాతృత్వం, అతని శౌర్యం అన్నీ పొగిడింది. కాని పద్యం పూర్తవ్వలేదు. ఆ చివర్న ఏ మాట వెయ్యాలి? ఇక్కడ మళ్ళీ తిక్కనగారికి శబ్దం మీద ఉన్న పట్టు కనిపిస్తుంది. చివర్న యీ "పావనీ" అన్న సంబోధన ఎంత ఆత్మీయంగా వినిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. "నీ"తో మొదలుపెట్టిన పద్యాన్ని మళ్ళీ "నీ"తోనే ముగించాడు. పావని అంటే పవన కుమారుడు, వాయుపుత్త్రుడు. ఇది సాధారణంగా హనుమంతునికి వాడతారు. కాని భీముడుకూడా వాయువు కుమారుడే కదా. అక్కడ ధర్మరాజు గురించి చెప్పిన పద్యంలో "ధర్మసుతుడు" అని పూర్తయ్యింది. ఇక్కడ పావనీ అని. భీముని దైవాంశని ద్రౌపది సూచిస్తోందన్న మాట! ఈ పదంలో ఇంత ప్రత్యేకత ఉంది.

తిక్కనలాంటి కవి మన తెలుగుసాహిత్యానికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కవిత్వాన్ని మనం నిలుపుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉంది.


పూర్తిగా చదవండి...