తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, April 20, 2012

ముసలివాని ప్రేమలేఖ

మొన్నీ మధ్య మిథునం కథ గురించి చర్చ చదివినప్పుడు, నేనెప్పుడో పదమూడేళ్ళ కిందట వ్రాసిన యీ పద్యకవిత గుర్తుకు వచ్చింది. సరే, కవిత పాతదైనా కొత్త మిత్రులతో పంచుకుందామని యిక్కడ పెడుతున్నాను. ఇది వ్రాసిన తర్వాత కూడా ఎవో పద్యాలు వ్రాస్తూనే ఉన్నాను కాని, యింతగా మనసుకి హత్తుకొన్న కవిత మరేదీ యీ పదమూడేళ్ళగా రానే లేదు! అప్పట్లో మనసుకున్న సున్నితత్వం క్రమేపీ మాయమైపోతూ ఉండడం దానికి కారణమేమో!

ప్రియమగు భార్య సన్నిధికి ప్రేమగ నీ పతి వ్రాయు లేఖ, ఆ
దయగల దైవమే మనల దారుణరీతిని వేరు జేసె, యీ
వయసున నొంటిగా బ్రతుకు భారము నీడ్చుట కష్టమే సుమీ!
అయినను నీ స్మృతుల్ కవితలల్లుచు కాలము నెట్టుచుంటి నే

చూచి యేళ్ళు దాటె నీ చిన్నకొడుకుని,
పక్షమయ్య పెద్దవాని గలసి
ఎవరి బ్రతుకు వారి దీ తండ్రి కోసమై
సమయమీయ నెవరి సాధ్యమగును!

కన్నకొడుకులు నన్నింత కనికరించి
వృద్ధ శరణాలయమ్మున వేసినారు
నెలకి చెరి యైదువందల నిచ్చుచుండి
రింత యైనను చేయు వారెంతమంది?

ఐన నదేమొగాని హృదయమ్మున నొక్క విషాదరేఖ, దుః
ఖానల తప్తమైనటుల ఆత్మ తపించుచునుండె, గుండెలో
యే నరమో కలుక్కుమను యే గతజీవిత జ్ఞాపకమ్ములో
మానసవీధిలో నిలచి మాటికి మాటికి గేలిసేయగా!

ప్రక్కచూపులు చూడ పసిగట్టి ఒక మొట్టి
కాయను నెత్తిపై వేయు చేయి,
గోరుచుట్టైనపుడు కొసరి గోర్ముద్దలు
ప్రేమ మీరగ తినిపించు చేయి,
పొలమారినంతనె తలచెనెవరో యంచు
తలపైని పలుమార్లు తట్టు చేయి,
నడిరేయి దడబుట్టి తడబాటుతో లేచి
నప్పుడు గుండెల నద్దు చేయి,

పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!
ఒక్క చేయి రాదె ఓదార్పు నీయగా
మ్రోడులేమొ! యెదలు బీడులేమొ!

నీడవైన నీవే నను వీడినావు
ఆదరింతురె నన్నింక అయినవారు?
కట్టె ముట్టించుటకె వేచె కన్నకొడుకు
లక్కటా! యేల జీవిత మారిపోదు?

ప్రతి ఉదయము సూర్యుడు నను,
"బ్రతికే ఉన్నావ?" అనుచు ప్రశ్నించినటుల్
మతి దోచును! సతి వీడిన
పతి జీవన్మృతుడు శుష్కవాక్యము రీతిన్!

ఇచట నావంటి వార లనేకమంది
యంత్ర జీవితమనెడి బకాసురునకు
కన్నబిడ్డల బలిజేసి ఖిన్నులగుచు
మూగమనసుల రోదించు ముసలివారు!

ఆదివారము అనుమతింతురు అతిథి జనులను లోనికిన్
ఎదురు జూతురు, ఎదురు జూతురు, ఎదురు జూతురు ఆశతో!
చెదరిపోవును ఆశ కాటుక చీకటుల్ చెలరేగగా
ముదుమి మనసుల మరల మరలిటు మోసపుచ్చుట న్యాయమే?

కాటికి కాలుసాచియు నకారణ మీ మమకార బంధముల్
ఏటికి సెప్పు? కాని మనసే వినదాయెను, నాది నాదనున్!
పూటకి పూట కష్టమయి పోయెను లోకపు చీకటింట యీ
నాటక, మింక చాలు, తుది నా గది తల్పులు తట్టుటెన్నడో?

నిన్ను చేరు వేళ యెన్నాళ్ళ కెన్నాళ్ళ
కనుచు, కనుచు నుంటి కాలుని దెస
క్షణము యుగములైన కాలమ్ము సాగదు
మరణమునకునైన కరుణ రాదు!

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప?

ఇప్పటికే నా బాధలు
చెప్పీ చెప్పీ మనస్సు చెడగొట్టితినా?
చప్పున నిక ముగియించక
తప్పదు...

మరి సెలవు,
                                       నీ సదా,
                                       హృదయశ్రీ.

పూర్తిగా చదవండి...

Friday, April 13, 2012

నను మెడబట్టి గెంటితివి...


నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి, చేత కా
దని బతిమాలుకొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్
గనుగొనినంత కాళ్ళు వడకన్ దొడగెన్ - సరికొత్త నర్తనం
బనుకొని చప్పటుల్ జరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభూ!

మొన్ననీ పద్యమెందుకో హఠాత్తుగా గుర్తుకువచ్చింది. ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో పోల్చడం పాత విషయమే. ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకతంతా, వద్దు మొఱ్ఱో అంటున్నా దేవుడు తనని నాటకరంగంపైకి మెడబట్టి గెంటాడనడం. ఆ తర్వాత, ఎదురుగా ఉన్న సభ్యులని చూసి యితని కాళ్ళు వణుకుతూ ఉంటే ఆ ప్రేక్షకులేమో అదేదో కొత్త నాట్యమనుకొని చప్పట్లు కొట్టడం. భలే తమాషా అయిన ఊహ కదూ. తమాషాగా కనిపించినా, చాలా లోతున్న ఊహ. మామూలుగా - లోకం నాటకరంగం, మనుషలందరూ నటులు అనే పోలికలో ఆంతర్యం ఈ జగత్తంతా మిథ్య అని, జీవితమంతా కనిపించని శక్తి మన చేత ఆడిస్తున్న నాటకమని చెప్పడం. ఇక్కడ విషయం అది కాదు! ఇక్కడ కవికి తాను నటుడిని కానని తెలుసు. నటించాలన్న కోరికా లేదు. కాని, యితరులు తనని నటుడనుకుంటున్నారు. తన ప్రతి చేష్టను ఒక అద్భుతమైన నటన అనుకుంటున్నారు. అంటే యితరులు తనకు లేని శక్తి తనపైని ఆరోపిస్తున్నారు. వారే తనకొక లేని పాత్రని సృష్టిస్తున్నారు! తనకా శక్తి లేదని, తానా పాత్రకి అర్హుణ్ణి కాదని పరిపూర్ణ జ్ఞానం కవిగారి కున్నది. అయినా ఏమీ చెయ్యలేని విపత్కర పరిస్థితి!

మనందరి జీవితాల్లోనూ అడుగడుగునా యిలాంటి సన్నివేశం ఎదురుపడుతూనే ఉంటుంది. ఒక కుఱ్ఱాడికి ఒకటి రెండు పోటీల్లో బహుమతులు వచ్చాయనుకోండి. ఇక వాడి తల్లిదండ్రులకి అతనొక ప్రతిభామూర్తిగా కనిపించడం మొదలవుతుంది. అంతకుముందుకూడా అతడు పోటీల్లో పాల్గొని బహుమతులు రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడవేవీ గుర్తుకు రావు. అప్పటినుండీ ప్రతి పోటీలోనూ అతడే బహుమతి గెల్చుకోవాలని తహతహ! అలా అతనికా పాత్ర ఆపాదింపబడుతుంది. ఇదింకా కాస్త నయమే! కొందరు పిల్లలయితే, వాళ్ళు పుడుతూనే ఇంజనీరో డాక్టరో అయిపోతారు. ఇక పెరిగి పెద్దవుతూ వాళ్ళా పాత్రని నిర్వహించడానికి నానా కష్టాలూ పడాల్సిందే!

పెళ్ళవ్వగానే అబ్బాయి "బాధ్యతగల భర్త" పాత్ర, అమ్మాయి "ఆదర్శవంతమైన గృహిణి" పాత్ర, ఆఫీసులో "ప్రతిభగల ఉద్యోగి" పాత్ర, స్నేహితులకి "మంచి మిత్రుని" పాత్ర - ఇలా, ప్రేక్షకులని బట్టి ఒకే మనిషి అనేక పాత్రలను ఏకకాలంలో నిర్వహిస్తూ ఉండాల్సిందే! ఏదో ఒకటి రెండు చక్కని కవితలో, కథలో కలంనుండి జాలువారితే చాలు, ఇక అతను/ఆమె గొప్ప కవి లేదా రచయిత పాత్రని నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడుతుంది! తెలిసిన వాళ్ళందరూ కనిపించినప్పుడల్లా, "అదేమిటండీ ఈ మధ్యన బొత్తిగా రాయడం మానేసారు" అంటూ ప్రశ్నలు సంధించడం మొదలుపెడతారు! లోకం కొంతమంది మీద ఆపాదించే మరొక అతి క్లిష్టమైన కష్టమైన పాత్ర "మేధావి" పాత్ర. ఒకరి మాటలో రాతలో కొన్నిటిని చూసి వాళ్ళ మీద మనకి కాస్త గురి ఏర్పడిందనుకోండి, వాళ్ళు నిజానికి ఆముదం చెట్టే అయ్యుండొచ్చు గాక - కానీ మన కళ్ళకి వాళ్ళు మహావృక్షంలా కనిపిస్తారు. వాళ్ళని సాక్షాత్తూ పుంభావసరస్వతనో సరస్వతీపుత్రులనో (మగవాళ్ళయితే! :) కీర్తిస్తాం. ఇక వాళ్ళా భారాన్ని మొయ్యడానికి అష్టకష్టాలూ పడాల్సిందే! పై పద్యంలో కవిగారిలా వాళ్ళకి తమ గురించీ, తమ శక్తి గురించీ స్పష్టమైన అవగాహన ఉంటే కాస్త ఫరవా లేదు. లేదంటే అథఃపాతాళానికి కూరుకుపోవలసిందే! సదరు "మేధావి" ఎప్పుడయినా ఏదైనా తనకు తెలియని విషయమ్మీద ఒక తెలివితక్కువ ప్రశ్న అడగడమో వ్యాఖ్య చెయ్యడమో చేసాడనుకోండి. "మీవంటి వారి దగ్గరనుండి ఇలాంటి ప్రశ్న/వ్యాఖ్య వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదండీ!" అని ఆశ్చర్యపోతూ పెదవి విరిచేస్తాం! మరికొందరు ప్రేక్షకులయితే మరీ విచిత్రంగా ఉంటారు. తమకి సంబంధం లేనివాళ్ళకి సంబంధం లేని పాత్రని తామే అంటగట్టేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒకతను మరొక తెలుసున్న మనిషి దగ్గరకి వెళ్ళి, "మీకేమండీ! రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ళు మీ మాటను జవదాటరు." అన్నాడనుకోండి, అంత కన్నా విడ్డూరం ఉంటుందా! తన బిడ్డలు (బిడ్డలుగా) రత్నాల్లాంటి వారో కాదో, తన మాట వింటారో వినరో, అయితే గియితే ఆ తండ్రి చెప్పాలి. ఆ మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఆ రకంగా పాపం ఆ బిడ్డలు "రత్నాల్లాంటి" బిడ్డలుగానూ, సదరు తండ్రి అలాంటి బిడ్డల తండ్రిగానూ పాత్రధారణ చెయ్యాల్సి వస్తుంది.

ఏతావాతా తేలిందేమిటయ్యా అంటే, మనం జీవితంలో ప్రతినిత్యం ఎవిరికో ఒకరికి ఏదో ఒక పాత్రని అంటగట్టి చప్పట్లు చరుస్తూనే ఉంటాం. ఏప్పుడూ ఎవరో ఒకరి చేత ఏదో ఒక పాత్రలోకి నెట్టివేయబడుతూనే ఉంటాం. ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతామా లేదా అన్నది ముఖ్యం. గ్రహించగలిస్తే, అందంగా నటించ గలిగినన్నాళ్ళు నటించి (నటించడం కన్నా నిర్వహించడం గౌరవమైన మాట కావచ్చు, కాని నిజానికి యీ సందర్భంలో రెండూ ఒకటే!)  మరియాదగా తప్పుకో గలుస్తాం. లేదంటే అయ్యేది రసాభాసే!

ఇంతకీ యీ పద్యం ఎవరిదో చెప్పనే లేదు కదూ! ఈ పద్యం కరుణశ్రీగారి "అమర్ ఖయాం"లోది. ఒమర్ ఖయ్యాం రుబాయితుల స్ఫూర్తితో వ్రాసిన పుస్తకమిది. ఖయ్యాము రుబాయితుల అనువాదంగా కన్నా ఒక స్వతంత్ర కావ్యంగా నాకిది నచ్చుతుంది. చక్కని ధారతో, హాయిగా అర్థమయ్యే అందమైన కల్పనలతో రమ్యంగా సాగే పద్యాలు దీనిలోని ప్రత్యేకత.

తా.కా.: అంతర్జాలలోకం కూడా ఒక పెద్ద నాటకరంగమే. దీనికీ పై పద్యం అమోఘంగా వర్తిస్తుందన్న సంగతి గమనించారా?! :-)

పూర్తిగా చదవండి...

Sunday, April 1, 2012

జానక్యాః కమలామలాఞ్జలిపుటే...


జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః

పూర్వం తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం. పెళ్ళి శుభలేఖ మీద యీ శ్లోకం ఎందుకంటే, సీతారాముల పెళ్ళంత వైభవంగానూ తమ పెళ్ళివేడుక జరగాలని ఆకాంక్ష. సీతారాముల పెళ్ళంటే తెలుగువాళ్ళకి ఒక పండగ, ఒక సంబరం. ఈ శ్రీరామనవమి రోజు, సీతారాములు కొలువున్న ప్రతి హృదయమూ ఒక భద్రాచలమే. ప్రతి గుండెలోనూ మంగళవాద్యాలు మ్రోగవలసిందే.

పెళ్ళికన్నా ముందు శివధనుర్భంగ ఘట్టం మదిలో మెదులుతుంది. ఆ దివ్యమోహనమూర్తి, వినీలనీరదశ్యాముడు, విశ్వామిత్రుని వెనుకగా నిలబడి కనిపిస్తాడు. అదుగో చూడండి:

ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా, రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క నా
జూకుగ నిల్చియుండె ప్రియసోదరుతో అభిరామమూర్తియై.   

కరుణశ్రీగారి కవిత్వంలో మూర్తికట్టిన మనోజ్ఞ రూపం అది. కరుణశ్రీగారి గడుసుదనం గమనించండి. వీరరసం ఆకృతిగొన్నట్టుగా ఉన్నాడని వీరరసాన్ని గురించి వాచ్యంగా చెప్పి, నిలుచున్న తీరులోని నాజూకుదనంలో శృంగారరసాన్ని వ్యగ్యంగా చెప్పారు! ఆ అభిరామమూర్తి వీరశృంగార రసాకృతి.

అదుగో వినండి. జనకమహారాజు తన సింహాసనమ్మీద నుండి లేచి నిలుచుని యేదో ప్రకటన చేస్తున్నారు:

స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే మది ప్రహర్ష పరిప్లుతమయ్యె, యీ ధను
ర్యాగమునందు శంకరుశరాసన మెక్కిడు నెవ్వ డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్

జనకమహారాజా! ఓ రాజర్షీ! ఆనందంతో ఉరకలువేస్తున్నది నీ మనసొక్కటే కాదయ్యా. మా అందరి మనసులూను. ఎప్పుడెప్పుడు రామయ్య ఆ శంకరుని విల్లు ఎక్కుపెట్టి మా సీతమ్మను పెళ్ళాడతాడా అని మేమందరమూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం. అవునయ్యా అవును! నీ అనుగుపట్టి, మా సీతమ్మ, వరించినది కాబట్టే మా రామయ్య మహాభాగుడు, మహా భాగ్యవంతుడు అయ్యాడు. కాదన్నదెవరు! మా త్యాగయ్య స్పష్టంగా తేల్చిచెప్పాడు కదా, "మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి" అని. సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన సీతమ్మని పెళ్ళాడిన తర్వాతే కదా రామునికి నారాయణాంశ పూర్ణంగా లభించినది. సీతలేని రాముడు లేడు. సీతమ్మవారిని తెలుసుకోకుండా రాముడు అర్థం కాడని అశోకవనంలో సీతని చూసిన తర్వాతనే హనుమంతునికి తెలిసివచ్చిందట (మాకు మా విశ్వనాథవారు చెప్పారులే):

చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నెరింగినట్లుగా
నే తలపోసినాడ, నిపుడీయమ గాంచినయంత సర్వ మ
జ్ఞాతము గాగనుండెనను సంగతి నా కెరుగంగ నయ్యెడున్
సీత నెరుంగకుండ రఘుశేఖరు డర్థము కాడు పూర్తిగా 

అరే, అదేమిటీ! రామయ్య కాకుండా ధనుస్సు వద్దకు వేరెవరెవరో వెళుతున్నారేమిటి!

బిగువు నిండారు కొమ్ముటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు

అయితేనేం,

శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు!

అంతేకదా మరి. శివధనుస్సుని సాధించడం ఆషామాషీ వ్యవహరమా! వశిష్ఠ విశ్వామిత్రులవంటి గురువుల దగ్గర యోగవిద్యని అభ్యసించిన గొప్ప సాధకుడైన రామయ్యకే అది సాధ్యం.
ఆఁ! ఎక్కడనుండి వస్తోందా సింహధ్వని?! ఓహో లక్ష్మన్న ఏదో ఎలుగెత్తి చాటుతున్నాడు. అదేమిటో మొల్ల మనకు చెపుతోంది:

కదలకుమీ ధరాతలమ! కాశ్యపి బట్టు ఫణీంద్ర! భూవిషా
స్పదులను బట్టు కూర్మమ! రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి! ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు! భూవరుడీశుని చాప మెక్కిడున్

రామయ్య చాపాన్ని ఎక్కుపెట్టబోతున్నాడట. భూమిని, భూమిని భరించే ఆదిశేషు, ఆదికూర్మ, ఆదివరాహ, దిగ్గజాలకి బహుపరాకు చెపుతున్నాడు లక్ష్మన్న. ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా పట్టుకోమని. అదరవద్దని, బెదరవద్దని. రాముడు విల్లెక్కు పెట్టబోతూ ఉంటే యింతటి ఆర్భాటం దేనికంటారా? రామయ్య ఆ ధనువుని ఎక్కుపెట్టగానే అది దిక్కులదిరే పెనుసవ్వడితో విఱిగిపడుతుందని లక్ష్మన్నకి తెలుసుగా. అందుకే ఆ హెచ్చరిక! అదిగదిగో, రామయ్య సదమల మదగజ గమనముతో స్వయంవర వేదిక చెంతకి వేంచేసాడు. వచ్చి:

ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప, మునీశ్వరుండలర, కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్

అంతే! సముద్రఘోషతో ఫెళ్ళుమని ఆ విల్లు విరిగింది. అప్పుడేమయింది?

ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె
జానకీదేహ మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర!

నయము, జయము, భయము, విస్మయము - రెప్పపాటు కాలంలోనే అన్ని రకాల భావాలు ఒకేసారి విజృంభించాయట!

శివధనుర్భంగమైన ఆ క్షణంలోనే రామయ్య శ్రీరాముడయ్యాడు. జానకీరమణుడయ్యాడు. సీతారాముల విషయంలో విశ్వనాథవారి నిశ్చయం యిది:

ఆయమ పుట్టె పాల్కడలి నంగనగా దనవంతు తీసికోన్,
ఈయమ ధాత్రిలోన జనియించెను విల్లునువంప బెండ్లమై,
ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము, తానె యామయై
ఆయమ కంటి యాన బడి యాచరణం బఖిలంబు చేయుచున్

ఈ పద్యంలో "ఆయమ" అంటే లక్ష్మీదేవి. "ఈయమ" అంటే సీతాదేవి. ఆమె యేమో క్షీరసాగర మధన సందర్భంగా, విష్ణువు తన వంతుగా స్వీకరించడంకోసం పాలకడలిలో పుట్టుంది. ఆమె శ్రీవారి మాటలని అనుసరించేది. కాని యీమె? ఈమె భూమిజాత. అయాచితంగా లభించినది కాదు. శివధనుస్సుని విఱిచిన ఫలంగా రాముని యీమె వరించినది. ఈమె వేదతత్త్వము. ఈమె కంటి ఆన చేతనే రాముడు అఖిల కార్యాచరణమూ చేస్తాడు. అందుకే, ఆ క్షణమే శ్రీరాముడు సర్వశక్తిమంతుడయ్యాడు, సంపూర్ణుడయ్యాడు. అప్పుడే అసలు రామాయణం, సీతాయాశ్చరితం మొదలయ్యింది. ఇక ఆ తర్వాత జరిగిన పెండ్లి వేడుకంతా మనకోసం మనం చేసుకొనేదే!
ముఖ్యంగా మన మన తెలుగువారికి తలంబ్రాల ముచ్చట ఎంతో సరదా! అందులోనూ సీతారాముల కల్యాణమంటే అవి మామూలు తలబ్రాలు కావుకదా! ముత్యాల తలంబ్రాలు. మామూలు ముత్యాలా! ఆణిముత్యాలు! అలాంటి ఆణిముత్యాల కాంతులు ఎన్నెని వింత వింత పోకడలు పోయాయో వర్ణించే శ్లోకమే పైన చెప్పుకున్నది. అది శంకరాచార్యుల విరచితమని కొందరంటారు కాని, నాకయితే ఎవరో అచ్చమైన తెలుగు కవి వ్రాసినదే అని గట్టి నమ్మకం! ఆ కవిత్వానికి నా పైత్యం కొంత కలిపి చేసిన అనువాదం ఇదిగో:

కెందామరౌ జానకీదేవి దోసిట
పద్మరాగమ్ములై పరిఢవిల్లి
రఘురాము తలపైని రహి నుంచినంతనె
మొల్లలై వెలుగులు వెల్లివిరిసి
అటనుండి జాఱి యా శ్యామలతనురుచి
నింద్రనీలమ్ములై యింపుమీరి
కరిమబ్బు చిరుజల్లు కురిసిపోయినయట్లు
నేలపై చినుకులై జాలువారి

వేడ్క సీతమ్మ రామయ్య పెండ్లినాడు
అలరు తలబ్రాల చినుకుముత్యాలజల్లు
తెలుగువారిండ్ల సిరిసంపదలును శుభము
బ్రగతి గూర్చుత శ్రీరామరక్ష యగుచు!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

పూర్తిగా చదవండి...