తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, September 23, 2010

ఆదిన్ శ్రీసతి కొప్పుపై...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!

పోతన భాగవతంలో వామనావతార ఘట్టం తెలియని వాళ్ళు అరుదు. ఇందులో చాలా ప్రసిద్ధమైన పద్యాలే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. దానమియ్యవద్దని బోధించిన శుక్రాచార్యునితో బలిచక్రవర్తి అంటున్న మాటలు. వచ్చినవాడు వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువని శుక్రాచార్యుడు కనిపెట్టాడు. అదే బలిచక్రవర్తికి చెప్పాడు. నిజానికీ విషయం చూచాయగా బలిచక్రవర్తికి కూడా తెలిసింది. లేకుంటే, ఒక బాల వటువు తన యజ్ఞశాలకు వస్తే, "ఇయ్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్, గడు ధన్యాత్ముడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె, నా కోరికల్ గడతేఱెన్" అని అనడంలో ఔచిత్యమేముంది? అయితే ఆ జ్ఞానం పరిపూర్ణమవ్వలేదు. అందుకే వెంటనే, "వర చేలంబులొ, మాడలో, ఫలములో..." ఏవి కావాలంటే అవి కోరుకోమన్నాడు. సరే శుక్రాచార్యుడు చెప్పిన తర్వాత అతడు శ్రీమహావిష్ణువే అన్న ఎఱుక పూర్తిగా స్థిరపడింది. రాక్షసుడైనా, బలిచక్రవర్తి విష్ణు భక్తుడే! అతనికి తన తాత ప్రహ్లాదుని పోలికలే వచ్చాయి మరి. అటువంటి విష్ణుమూర్తి స్వయంగా తన దగ్గరకి వచ్చి దానం అడుగుతూంటే, అంత కన్నా అదృష్టం మరేముంది అనుకున్నాడు. ఎందుకు? ఎవరా విష్ణుమూర్తి? సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి పెనిమిటి. అంటే ప్రపంచంలోనున్న సర్వ సంపదలతో నిత్యభోగాన్ని అనుభవించే వాడు. మరొకళ్ళకి ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియనివాడు. ఆ వైభోగాన్ని ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. భార్య అయిన లక్ష్మీదేవి కొప్పుపైన శరీరంపైన పైటకొంగుపైన పాదాలపైన బుగ్గలపైన పాలిండ్లపైన ఉండే చెయ్యి ఆయనది. అలా ఉండడం వల్ల ఆ చేయికి ఎప్పుడూ నూత్న మర్యాద కలుగుతుందట! ఇదొక వింత మాట! ఇక్కడ విష్ణువుని ఒక మామూలు పురుషుడిగా లక్ష్మీదేవిని మామూలు స్త్రీగా ఊహించుకొని, ఇక్కడ వర్ణించినది ఆ భార్యాభర్తల శృంగారాన్ని అనుకుంటే, ఈ "నూత్న మర్యాదన్ జెందు" అనే మాట పొసగదే! ఇది వట్టి సాంసారిక శృంగారమైతే, ఆ చేతికి కొత్త మర్యాద ఎక్కడనుండి వస్తుంది? రాదు. ఇక్కడ వర్ణించిన లక్ష్మీదేవి అంగాలన్నీ వివిధ రకాలైన సంపదలని మనం భావించాలి. అలాంటి సంపదలని లోకానికి ఎప్పుడూ దానం చేస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఆ చేతికొక కొత్త గౌరవం వస్తుందన్నమాట. అలా ఎప్పుడూ పైనే ఉండే చెయ్యి ఇప్పుడు కిందయ్యింది! తన చేయి ఆ చేతిపైన ఉంది. అంటే లోకానికి సమస్త సంపదలనీ అందించే విష్ణువుకి కూడా తాను ఇవ్వగలిగింది ఏదో ఉందన్న మాట. అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఏముంటుంది! ఇక రాజ్యం గీజ్యం ఉంటేనేం పోతేనేం. కాయము (శరీరం) ఎప్పటికైనా నశించేదే కదా. ఈ జ్ఞానం బలిచక్రవర్తిలో పరిపూర్ణంగా ఏర్పడింది.

మీరొక నాటకం వేస్తున్నారనుకుందాం. అందులో మీదొక చక్రవర్తి పాత్ర. అద్భుతంగా నటిస్తున్నారు. అందులో ఎంతగా నిమగ్నమైపోయారంటే, నిజంగానే మీరొక చక్రవర్తి అన్న భావం కలిగింది. దానిలో పూర్తిగా లీనమైపోయారు. కాని నాటకానికి ఒక కథ ఉంటుంది కదా. దానికి అనుగుణంగానే కదా పాత్రలు ప్రవర్తించాలి. మీరీ పాత్రలో లీనమైపోయి చేస్తూ ఉండడంతో నాటకం దారితప్పే సూచనలు కనిపించాయి. దాంతో డైరెక్టర్ లాభం లేదు, ఈ పాత్రని బయటకి రప్పించడం కన్నా మార్గం లేదనుకున్నాడు. కాని ఎలా? అందుకోసం తన స్క్రిప్టులో లేని ఒక పాత్రని హఠాత్తుగా సృష్టించాల్సి వచ్చింది. తనే మేకప్ వేసుకొని రంగస్థలమ్మీదకి అడుగుపెట్టాడు. ఆ వచ్చింది డైరెక్టరే అని మీరు గుర్తుపట్టారు. "అర్రే! నేను నాటకం వేస్తున్నాను కదూ" అని జ్ఞాపకం వచ్చింది. మీరు వేస్తున్న పాత్రని నాటకం నుంచి తప్పించాలి కదా. ఇప్పుడు నువ్వు నాటకంలో నే చెప్పినట్టు చేస్తే, ఈ ఏడాది నీకే ఉత్తమనటుడిగా బంగారునంది గ్యారెంటీ అని మీతో దర్శకుడు చెప్పేడు. చెయ్యాల్సింది ఏమిటంటే, ఆ రాజుగారి పాత్ర తన రాజ్యాన్ని వదిలేసి అరణ్యాలు పట్టుకొని పోవాలి. అప్పుడు మీరేం చేస్తారు? వచ్చింది స్వయానా డైరెక్టరాయె! మీకు ఉత్తమనటుడిగా నంది వచ్చే అవకాశం ఉందాయె. "ఓ, తప్పకుండా!" అనే కదా అంటారు. పక్కనున్న మంత్రి, "అదేంటి రాజా! నీ రాజ్యాన్నీ, సంపదనీ వదిలేసి అడవులకి పోతావా" అని నచ్చజెప్పబోయాడనుకోండి. మీరేంటంటారు? "ఓరి పిచ్చివాడా! ఇది నాటకంలో పాత్రరా. ఈ రాజ్యం గీజ్యం ఏమైనా శాశ్వతాలా. స్వయాన వచ్చి అడిగినవాడు డైరెక్టరు. కావలిస్తే నేనీ పాత్రలో చచ్చిపోడానికైనా రెడీనే!" అని అనరూ? సరిగ్గా బలిచక్రవర్తి కూడా అదే అన్నాడు.

"రాజ్యము గీజ్యము" అని ఒక అచ్చమైన తెలుగు కవే అనిపించగలడు. అంతకుముందే శుక్రాచార్యుడు బలికి హితబోధ చేస్తూ "కులుమున్ రాజ్యము దేజమున్ నిలుపు..." అన్న పద్యంలో "వలదీ దానము గీనమూ" అంటాడు. సరిగ్గా దానికి సమాధానంగా ఈ పద్యంలో "రాజ్యము గీజ్యమున్ సతతమే" అని బలి చేత అనిపించాడు పోతన. ఇదొక చక్కని వాక్శిల్పం.

నాకు చిన్నపటినుంచీ ఈ వామనావతారం కథ విన్నప్పుడల్లా ఒక్కటే అనుమానం. ఒక అడుగుతో భూమినీ మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసాడు వామనుడు. మరి మూడో అడుగు ఎక్కడ అంటే తన శిరస్సుపైన పెట్టమని బలి అంటాడు కదా. ఇక్కడే నాకు సందేహం. భూమీ ఆకాశాన్నీ మొత్తం ఆక్రమించేసాడు కదా. మరి బలిచక్రవర్తి శిరస్సు కూడా అందులో భాగమే కదా! మరి ఆ రెండడుగుల భాగంలో అతని శిరసు మాత్రం ఎందుకు లెక్కలోకి రాదు? దీని గురించి ఆలోచించగా ఆలోచించగా, ఈ మధ్యనే ఒక సమాధానం తట్టింది. శిరసు అంటే ఇక్కడ మనసుకి సంకేతం అయ్యుండాలి. ఈ "మనసు" అన్నది భూమ్యాకాశాల్లాగా భౌతిక పదార్థం కాదు. కాబట్టి అది వాటి లెక్కలోకి రాదు. మూడో అడుగుకి తన మనసునే అర్పించాడు బలి. అంతకన్నా కావలిసిందేముంది! బలిని పాతాళానికి అణగదొక్కడం అంటే, అతడిని అంతర్ముఖుణ్ణి చెయ్యడం. మనసంతా ఎప్పుడైతే శ్రీహరి ఆక్రమించుకున్నాడో, అతనికి సమస్తమైన ఆలోచనలూ బాహ్యమైన ప్రాపంచిక విషయాల వైపు కాక, తనలోని ఆత్మ వైపుకి ప్రయాణిస్తాయి. అలా మనసు తన ఆత్మలో కలిసిందంటే అది నిర్మలమైన జ్ఞానానికి చిహ్నం. పైగా ఆ శ్రీహరికి తన భక్తుడంటే ఎంత ఇష్టమో చూసారా! స్వయయంగా అతని దుర్గానికి తానే కాపలాదారుడిగా మారాడు. అంటే మరే ఇతర చింతనలు అతనిలోకి జొరబడకుండా తను కాపలా ఉన్నాడన్నమాట!
కాబట్టి, ఏదో దేవతల కోసం విష్ణువు బలిని అణిచేసి పాతాళానికి పంపేసాడు అనుకోవడం వట్టి తెలియనితనమే. బలి శ్రీహరి భక్తుడే అని, తన భక్తుడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికే విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తాడనీ మనకి భాగవతం చదివితే స్పష్టంగా బోధపడుతుంది. బలిచక్రవర్తి గురించి ఆ విష్ణువే అన్న మాటలివి:

బద్ధుండై గురుశాపతప్తుడయి తా బంధువ్రజ త్యక్తుడై
సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యమున్ గరుణయున్ సొంపేమియున్ దప్ప డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుండితం డల్పుడే
పూర్తిగా చదవండి...

Saturday, September 11, 2010

భాగ్యములకుప్ప పిళ్ళారప్ప!

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

మా తమిళనాడులో వినాయకుడిని పిళ్ళయ్యార్ అంటారు. అక్కడనుంచి వచ్చిందే "పిళ్ళై" అన్న పేరు. తెలుగులో కూడా కొన్ని చోట్ల వినాయకుణ్ణి ఈ పేరుతో పిలుస్తారనుకుంటాను. ఆ పిళ్ళారప్పని గురించి కొన్ని చాటు పద్యాలు:

శ్రీకర దంతరుచిజితసు
ధాకర మృడపార్వతీముదాకర గుణర
త్నాకర వరధీకర పర
భీకర భాగ్యములకుప్ప పిళ్ళారప్పా!

(శుభాలనిచ్చేవాడూ, తన దంతకాంతులతో తెల్లని జాబిల్లినే ఓడించినవాడూ, శివపార్వతులకి ఆనందం చేకూర్చేవాడూ, సద్గుణ సాగరుడూ, వరము (సిద్ధి), ధీ (బుద్ధి) ఇచ్చేవాడూ, శత్రుభయంకరుడూ - భాగ్యముల కుప్పైన ఆ పిళ్ళారప్పే!)

ఓరీ బాలుడ నీవిటు
రారా యని నన్ను బిలిచి రంజిలు దయచే
గోరిక లొసగుము భువి నీ
పేరును బ్రకటించి చెప్ప బిళ్ళారప్పా!

భక్షింపుము గావలసిన
భక్షణములు నీకు నిత్తు భక్షించియు నీ
కుక్షి గల విద్య మాకున్
బిక్షంబిడి కావుమప్ప పిళ్ళారప్పా!

అన్నట్టు ప్రతిసారీ వినాయకచవితికి వినాయకుడి మీదనేనా పద్యాలు, నా మీద ఒక్క పద్యమైనా లేదా అని ఆ వినాయకుణ్ణి మోసుకువెళ్ళే మూషిక రాజం కిచకిచమంటూ అడిగింది. దాని కోరిక కాదంటే ఇంకేమైనా ఉందా! అందుకే దాని మీద కూడా ఒక చాటువిదిగో!

నిర్ణిద్రవిషయుక్త నిశితదంష్ట్రలు బూని
భేదించు నెటువంటి గాదెలైన
దారుణోద్యద్దంతతతి చేత ఖండించు
గుఱుతుగా నెటువంటి కోకలైన
పటుసురాంగాగారభరితంబుగా ద్రవ్వు
బొంకాన నెటువంటి భూమినైన
కీచుకీచుధ్వని ప్రాచుర్యమహిమచే
వర్ణించు నెటువంటివారినైన

అతడు సామాన్యుడే నరేంద్రాలయాంత
రంతరానేక పేటికా క్రాంత వస్తు
హరణసురధాణి యవ్వినాయకుపఠాణి
చారుతరమూర్తి మూషకచక్రవర్తి!

ఆ మూషికనాయకుని నుండీ నాయకమూషికాలనుండీ ఆ వినాయకుడు మనందరినీ రక్షించుగాక!
పూర్తిగా చదవండి...

Thursday, September 9, 2010

ఈద్ ముబారక్!

ఈద్ ముబారక్!

ముస్లిముల కాలమానం ప్రకారం రమాదాన్ తొమ్మిదవ నెల. ఇది చాలా పవిత్రమైన నెల. ఆ నెలాఖరున వచ్చే పండగ ఈద్. హిందూ కాలమానం ప్రకారం తొమ్మిదవ నెల మార్గశిరం. అది కూడా మనకి చాలా పవిత్రమైన మాసమే! మాసానాం మార్గశీర్ష్యం అని గీత చెపుతోంది కదా. ఈ పోలిక యాదృచ్ఛికమే కావచ్చు కాని నాకు బాగుందనిపించింది. మరొక విశేషం ఏమిటంటే, ఈ రమాదాన్ సాధారణంగా మన శ్రావణమాసంలో వస్తుంది. మరి శ్రావణమాసం కూడా మనకి పవిత్రమైన మాసమే, చాలా నోములూ వ్రతాలూ ఉన్న మాసం. అలాగే ఈద్ పండగకి ఇటు అటుగానే (ఈసారి అది రేపే!) వినాయకచవితి కూడా వస్తుంది. ఆనందంగా జరుపుకోడానికి ఏ పండగైతేనేం! భక్తితో కొలవాడానికి ఏ దేవుడైతేనేం!

ఈ ఈద్ పండగ సందర్భంగా, ఉమర్ ఆలి షా కవిగారు ఆల్లా మీద రాసిన కొన్ని పద్యాలు చదివి ఆనందించండి. ఇవి కాళహస్తీశ్వర శతక పద్యాలకి దగ్గరగానే ఉంటాయి! ఏకం సత్ విప్ర బహుధా వదంతి.

ఉమర్ ఆలి షా 1885వ సంవత్సరంలో పిఠాపురంలో పుట్టారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆధ్యాత్మిక విద్యాపీఠంలో వీరు ఆచార్యులుగా ఉండేవారు. యోగశాస్త్ర ప్రవీణులు. అంతేకాక సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పారశీకం, ఇంగ్లీషు భాషలలో పాండిత్యం సంపాదించారు. ఉర్దూ వీరి మాతృభాష. తెలుగులో ఎన్నో నాటకాలు, నవలలు, పద్య కావితలు రాసారు. ఉమర్ ఖయాం రుబాయితులని పారశీకం నుండి నేరుగా తెలుగు పద్యాలలోకి అనువదించారు.
ఉమర్ ఆలి షాగారి "అల్లా ప్రభూ" అనే కవితా ఖండిక నుండి కొన్ని పద్యాలు:

శ్రీ లీజాలిన మేటివంచెఱిగి నే సేవింపగాబోను, ఆ
శ్రీలన్ గైకొననెంచి కుంటినయి అర్థింపంగ రాలేదు నీ
శ్రీ లావణ్య ప్రపుణ్య మార్గమున నా చిత్తంబు సంధిల్ల నే
వేళన్ గొల్చెద భక్తి పూర్ణమతినై విశ్వజ్ఞ అల్లాప్రభూ!

నిను జింతించి భజించి మ్రొక్కి మదిలో నిత్యంబు సేవించి నీ
వినుతిన్ జేసియు దానికిన్ ఫలముగా విశ్వజ్ఞ మోక్షంబు దె
మ్మని నే బేరము పెట్టలేను భవదీయంబైన ధ్యానంబు నా
పనిగా జేసెద నూపిరింబలె స్వభావం బొప్ప నల్లాప్రభూ!

జలరాశిన్ విలసిల్లు వీచికలతో సఖ్యంబు గావించి, పు
వ్వులతో నెయ్యము సల్పి తత్సుధలతో బొత్తై, నభోవీథి జు
క్కలతో వియ్యములంది, నీ ఘనఘనాకారంబు జింతింతు, ని
ర్మల సౌభాగ్యసుధా ప్రవృష్టి గురియన్ రావయ్య అల్లాప్రభూ!

జలమధ్యంబున లేచు బుద్బుదము లోజన్ బెద్దలై కొన్ని, కొ
న్ని లవాకారములై తనర్చు పగిదిన్ నీ యందు రూపించు మ
ర్త్యులు నీచాధిక తారతమ్య భవ సందోహమ్ములన్ భ్రాంతులై
కలహింపన్ జనుచుందు రీవని యెఱుంగన్ లేక అల్లాప్రభూ!

కలుముల్ లేములు వచ్చుపోవునవి మేఘవ్రాతముల్ మింటిపై
కలయం బ్రాకుచు నేగునట్లు సుఖదుఃఖ ప్రాప్తమప్రాప్తముల్
కలలం బోలె దనర్చు గోరికలు వృక్షచ్ఛాయలన్ బోలె మ
ర్త్యుల వెన్నాడు మహేంద్రజాలము జగంబూహింప నల్లాప్రభూ!

ధనహీనుండయి పుత్రదార గృహయుక్తంబైన సంసార దుః
ఖ నిధిన్ మున్గుచు తేలుచున్ నిను మదిన్ గాసంత నూహింప లే
కనయంబున్ మృగతృష్ణకై జనెడు దాహాసక్తునిన్ బోలె బో
వును మోహావిలచిత్తుడై చపలుడై మూర్ఖుండు నల్లాప్రభూ!

నిను తేజోలసితాంతరాత్మ వనుచున్ వీక్షింతునో లేక లో
క నికాయ ప్రణుతాఖిల ప్రజనుగా గాంక్షింతునో పుణ్య స
జ్జన దృగ్గోచరతత్త్వమూర్తివని నే సాధింతునో భక్తి నే
మని పూజింతు బరాత్పరాత్మవు మహాత్మా! దేవ! అల్లాప్రభూ!

రాజుల్ ధూర్తులు దుష్టచిత్తులు మృషాప్రాగల్భ్యమూర్తుల్ వృథా
వ్యాజస్త్రోత్ర పరాయణుల్ కుమతులా పాపాత్ములన్ జేర నే
యోజన్ జెల్లదు కోవిదప్రతతి యుద్యోగించి నీ కర్థులై
యోజింపన్ నిఖిలార్థముల్ బడయలేరో రాదొ అల్లాప్రభూ!

నీవే విశ్వమయుండవైన దివిపై నీరేజజాండంబుపై
ఆ వైకుంఠముపై వసింతువన మిధ్యావాదమే గాద టెం
కే వృక్షాకృతినైన వేళ్ళ నది వీక్షింపంగ రానేర న
ట్లీ వెందున్ గనరావు సర్వము భవత్ దృశ్యంబు అల్లాప్రభూ!


పూర్తిగా చదవండి...

Wednesday, September 1, 2010

గ్లోబల్ దేవుడు గోవిందుడే!


శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంతర్జాతీయ "గుర్తింపు" పొందిన మన ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణుడు! :-) తిరుపతి వెంకన్నకి కూడా ప్రపంచమంతా పెద్ద భక్తబృందమే ఉంది కాని, అతని పేరిట అంతర్జాతీయ సంస్థ లేదు కదా! పైగా ఆ వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే కదా చేస్తారు! కాబట్టి మన "గ్లోబల్" దేవునిగా కృష్ణయ్యనే నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను. ఈ రోజతని పుట్టినరోజు సందర్భంగా బ్లాఙ్ముఖంగా ఆ "దేవదేవునికి" (చూసారా దేవుళ్ళకే దేవుడాయన!) జన్మదిన శుభాకాంక్షలతో పాటు "గ్లోబల్" దేవునిగా ఎన్నికైనందుకు నా అభినందనలని కూడా అందిస్తున్నాను.

అలనాడు ధర్మరాజు రాజులలో మాత్రమే అగ్రస్థానాన్నిచ్చి శ్రీకృష్ణుణ్ణి గౌరవించాడు. ఇప్పుడు నేనతనికి దేవుళ్ళందరిలోనూ కూడా అగ్రేసరస్థానాన్ని ఇచ్చి గౌరవించానంటే, నేనింకెంత ధర్మాత్ముణ్ణో అందరూ గ్రహించగలరు, నేను మళ్ళీ దాన్ని నొక్కి వక్కాణించనక్కరలేదు. పైగా ధర్మరాజు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళు "బంధుప్రీతి" స్కాండల్ లేవదీసే అవకాశం లేకపోలేదు. నాకదీ లేదు. నేను కృష్ణుడి రెలెటివ్నీ కాను, నాకు ప్రతిపక్షమూ లేదు. అయినా నా తృప్తి కోసం, శ్రీకృష్ణుడు ఈ పదవికి ఎంచేత అర్హుడో ఇప్పుడు వివరిస్తాను. ఇదంతా చదివిన తర్వాత కూడా మీరు నాతో ఒప్పుకొని తల ఊపకపోతే, అలనాడు శిశుపాలుని తలకి ఏం గతి పట్టిందో తెలుసు కదా! ఆ తర్వాత నా పూచీలేదు.

శ్రీకృష్ణుడంటే చిన్నపిల్లల నుంచీ ముసలివాళ్ళ దాకా అందరికీ ఎంతో మురిపెం!

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు, పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి గొలుతు

అంటూ ఆ చిన్ని కన్నయ్యని తమ ముద్దు ముద్దు పలుకులతో కొలుస్తారు మన సిసలైన తెలుగింటి పిల్ల భక్తులు. చిన్నపిల్లల సంగతి ఇలా ఉంటే, ఆ పండు ముదుసలి భీష్ముడు శ్రీకృష్ణదేవుని రూపాన్ని, అదీను తనని చంపడానికి వస్తున్న వాడిని ఎంత భక్తి తన్మయతతో దర్శించాడో చూడండి!

కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు

ఇలా జాతి, లింగ, వయో భేదాలు లేకుండా ఎందరెందరో భక్తులు శ్రీకృష్ణుని ఆరాధించారు. మరొక విశేషం ఒకటి చెప్పనా. అసలీ ప్రపంచంలో ఎన్ని రకాల భక్తి మార్గాలుండవచ్చో అన్ని మార్గాల్లోనూ కృష్ణుడికి భక్తులున్నారు. ఇల్లాంటి ప్రత్ర్యేకత, నాకు తెలిసి, మన దేవుళ్ళకే కాదు అసలీ భూప్రపంచంలో ఉన్న ఏ దేవుడికీ లేదు!

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి మెట్లైన ను
ద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

శత్రుత్వంతో కూడా భక్తులవ్వడం ఎంత చోద్యమో చూడండి! భావంలో ఏకాగ్రత ఉంటే అది ఏ భావమైనా సరే యోగంలాంటిదే అని నారదులవారు ధర్మరాజుకి చెపుతున్న మాటలివి. కడపున పుట్టకపోయినా కన్న ప్రేమకి పరాకాష్ఠ అనిపించే యశోద వాత్సల్య భక్తి మొదలుకొని ఎందరెందరో భక్తులు చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆ స్వామిని కొలిచి తరించలేదూ! ఇక్కడ మీకొక అనుమానం రావచ్చు. రాముడిపై కౌసల్యకి ఉన్నది మాత్రం వాత్సల్య భక్తి కాదా అని. నా ఉద్దేశంలో కాదు. అది వాత్సల్యమే కాని అందులో భక్తి ఉందని చెప్పలేం. కృష్ణుడైతే "చంటి పాప"గా ఉన్న నాటినుండీ ఎన్నెన్నో సాహసాలని చేసి చూపించి తన దైవత్వాన్ని చాటుకున్నాడు. అంచేత యశోదకి కృష్ణుడు దైవమే అన్న స్పృహ తన అంతరాంతరాల్లోనైనా ఉండి ఉండాలి. పైగా తన నోరు తెఱచి విశ్వాన్నంతటినీ చూపించాడు కూడా కదా! "కలయో వైష్ణవ మయయో యితర సంకల్పార్థమో" అంటూ ఆశ్చర్యపడిన యశోద చివరకి,

నా మగడు నేను గోవులు
నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధము గని
యేమఱితిమి గాని యీశు డీతడు మాకున్

అని నిశ్చయానికి కూడా వచ్చింది కదా. అంచేత యశోదకి ఒక పక్క తల్లిగా వాత్సల్యంతో పాటు మరో వంక పరమాత్ముడన్న భక్తిభావం అంతరాత్మలో నిండి ఉండే ఉంటుంది.

మరొక వింతైన భక్తురాలు కుంతీదేవి. ఆమె స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త. ఆమె జీవితంలో ఎన్నెన్ని కష్టాలు అనుభవించిందని! అన్ని కష్టాలామె ఓర్చుకున్నదంటే, అది ఆమెకి కృష్ణుడిపైనున్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగానే. ఇది చాలామంది గ్రహించని విషయం. పోతన్నలాంటి భక్త కవులే దీన్ని తెలుసుకున్నారు. కుంతి శ్రీకృష్ణుడిని కోరినది ఇది:

యాదవులందు పాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగ భంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న
త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయగదయ్య యీశ్వరా!

తన బంధువులైన యాదవులపైనా, తన కుమారులైన పాండవులపైనా కూడా తనకున్న మోహాన్ని త్రుంచెయ్యమని కోరిందా మహా భక్తురాలు.

సరే అర్జునుడి సఖ్య భక్తి అందరికీ తెలిసినదే. తన సఖుడు, ఆత్మబంధువు, తండ్రంతటివాడు, దిక్కు, దైవం అన్నీ ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఇలాంటి సఖుడే కృష్ణుడికి మరొకడున్నాడు. అతని గురించి చాలామందికి తెలీదు. అతని పేరు ఉద్ధవుడు. మన భాషలో చెప్పాలంటే అతను శ్రీకృష్ణుడికి "Thickest Friend" అన్నమాట! ఎంతటి గాఢస్నేహం కాకపోతే గోపికల దగ్గరకి తన ప్రణయసందేశాన్ని అందించడానికి ఇతణ్ణి దూతగా పంపిస్తాడా గోపీమనోహరుడు! అప్పుడా గోపికలు ఉద్ధవుణ్ణి ఏమడుగుతారో తెలుసా!

ఏకాంతంబున నీదు పైనొరగి తానేమేని భాషించుచో
మా కాంతుండు వచించునే రవిసుతామధ్యప్రదేశంబునన్
రాకాచంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మాతోడ నం
గీకారంబొనరించి బంధనిహతిన్ గ్రీడించు విన్నాణముల్

ఏకాంతంలో మీరిద్దరూ దగ్గరగా కూర్చొని కబుర్లాడుకొనేటప్పుడు, యమునానదిలో వెన్నెల రాత్రుళ్ళు మాతో జరిపిన రాసలీలా వినోదాల విశేషాలని నీకు చెప్పాడా? అని అడుగుతున్నారు. అంటే ఆ ఉద్ధవునికి శ్రీకృష్ణుడి దగ్గర ఎంత చనవో మనం ఊహించుకోవచ్చు! అంతటి దగ్గరవాడు కాబట్టే, అతనికి కూడా అర్జునుడిలాగానే ప్రత్యేకంగా గీతా బోధ చేసాడు!

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కృష్ణభక్తుల పట్టికకి అంతమే ఉండదు! కురూపి అయిన కుబ్జ, పరమ దారిద్ర్య పీడితుడు కుచేలుడు, భాగవతోత్తముడైన విదురుడు ఇలా ఎందరెందరో ఆ కృష్ణయ్య కరుణాకటాక్షానికి నోచుకున్న భక్తులు మనకి అడుగడుగునా భాగవతంలో కనిపిస్తారు! అందరికన్నా విశిష్టమైన భక్తి గోపికలది. అల్లాంటి భక్తులు మరే దేవునికి ఉన్నారు చెప్పండి! శృంగారాన్ని ఒక భక్తిసాధనంగా చూపించిన ఘనత ఒక్క గోపీరమారమణుడికే దక్కుతుంది. అంతశ్శత్రువులలో మొదటిదైన కామాన్ని భక్తియోగంగా మార్చి, శత్రువుని చంపనవసరం లేదు మార్చగలిస్తే చాలనే గొప్ప సత్యాన్ని నిరూపించినవాడు ఆ లీలామానుషస్వరూపుడే. ఆ గోపికల భక్తి తీవ్రత, అందులోని ఏకాగ్రత ఎలాంటిదంటే,

ఒక్క లతాంగి మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కితీగెలం
జిక్కగబట్టి, హృద్గతముజేసి, వెలిం జనకుండ నేత్రముల్
గ్రక్కున మూసి మేన వులకంబులు గ్రమ్మగ కౌగిలించుచున్
చొక్కములైన లోచవుల జొక్కుచునుండెను యోగికైవడిన్

ఒక గోపిక ఆ మాధవుని ఉజ్జ్వల రూపాన్ని తన చూపులనే తీగలతో కట్టేసి, హృదయంలో పొదువుకుని, మళ్ళీ బయటకి పోకుండా కన్నులు మూసేసుకొని, తన శరీరంపై పులకలు వచ్చేట్టు కౌగిలిలో అతన్ని బంధించి, స్వచ్ఛమైన లోపలి కాంతులతో పరవశించిపోతోందిట - ఒక యోగిలాగా! ఇది మధురభక్తి వర్ణనల్లోకెల్లా మకుటాయమైన పద్యం! ఇందులో శృంగారం ఉంది, భక్తి ఉంది, యోగం ఉంది! ఆ మూడూ గోపిలలో ఎలా కలగలిసిపోయేయో ఆ చిత్రం ఉంది.

భక్తి మార్గాల్లో ఇంత వెరైటీ, వేరియేషను చూపించిన కృష్ణపరమాత్ముడు కాక, "గ్లోబల్" దేవుని పదవికి ఇంకెవరు అర్హులు చెప్పండి? సరే మరొక పాయింటు చెప్తాను. కృష్ణుడిలా అన్నిమార్లు, అందరిమందికి "గ్లోబల్"రూపాన్ని, అదే "విశ్వ"రూపాన్ని చూపించిన దేవుడు ఇంకెవరైనా ఉన్నాడా?

సరే, ఇలా ఏకరువు పెడుతూ పోతే ఆ నల్లనయ్యకున్న ప్రత్యేకతలకీ, విశేషాలకీ కరువే లేదు. భాగవతం, మహాభారతం, హరివంశం ఎన్నెన్ని పురాణాలు కావలసి వచ్చాయి అతని లీలా విశేషాలని వర్ణించడానికి! ఇంకొక్క విశేషం మాత్రం చెప్పి నా వివరణని ముగిస్తాను.

పూర్వమెప్పుడో మొత్తం భూప్రపంచానికంతటికీ ఒక పెద్ద సమస్య వచ్చిందట, అంటే "global problem" అన్న మాట! భూమినుంచి విడిపోయిన ఒక పెద్ద గోళం (meteorite అనుకోండి), gravitational forcesలో వచ్చిన ఏవో తేడాల వల్ల, మళ్ళీ భూమ్మీదకి దూసుకువచ్చిందట. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ గోళాన్ని తన చక్రంతో తునాతునకలు చేసి భూమిని రక్షించాడట. ఆ కథాకమామీషు మరోసారి తీరిగ్గా ముచ్చటించుకుందాం. అలాంటి గ్లోబల్ సమస్యని తీర్చిన దేవుడే కదా గ్లోబల్ దేవుని పదవికి అర్హుడు.

అందుకే అంటున్నాను, గ్లోబల్ దేవుడు గోవిందుడే!

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడవనగా
విశ్వము జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!


పూర్తిగా చదవండి...