తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, March 29, 2010

భవిష్యత్తు

ఈ రోజు నిశ్యాలోచనాపథం ఫేం సౌమ్యగారి గూగుల్ బజ్ చూడగానే నాకీ కవిత గుర్తుకు వచ్చింది! ఇది ఎవరిదో ఎక్కడిదో వివరాలు త్వరలో విడుదల :-)

భవిష్యత్తు
======

నడచుచున్న పథంబు కంటక శిలావృ
తంబు, కటికచీకటి పైన, దారిసుంత
నాకు దోచదు, లాగుచున్నదియు నన్ను
కాలశైవలిన్యావర్తగర్భమునకు

(నడుస్తున్న దారంతా ముళ్ళూ రాళ్ళూ. పైనంతా కటికచీకటి. దారి ఏమాత్రం కనబడటం లేదు. కాలమనే నది నీటి సుడిలోకి నన్ను లాగుతున్నట్టుగా ఉంది.)

సురిగిపోయితి నంచు నెంచుకొనులోన
ముందు దూరాన కనవచ్చె పురుషుడొకడు
శతసహస్ర మార్తాండ తేజస్సహితుడు
హృదయ బాధా నివారణ మదనమూర్తి

(పూర్తిగా ఆ సుడిలో మునిగిపోతున్నానని అనుకొనే లోపల ముందు అల్లంత దూరంలో ఒక పురుషుడు కనిపించాడు. వందవేల సూర్యుల తేజస్సుతో ఉన్నవాడు. గుండెలో బాధని తీర్చే అందగాడు.)

అతి ప్రయాసంబు మీద నే నతనియున్న
తావునకు బోయి పడితి, నతండ దేమొ
అంజనావనీధర మట్టు లతి భయంక
రాకృతి వహించె, నాకు భయంబు తోచె

(అతి కష్టమ్మీద నేనతను ఉన్న చోటుకి వెళ్ళి పడ్డాను. అదేమిటో, అతను నల్లని అంజనా పర్వతాకారంలో భయంకరంగా కనిపించాడు. నాకు భయం వేసింది.)

పరుగులెత్తి మిక్కిలి దూర మరిగి వెనుక
తిరిగి చూచితి, నా చిత్రపురుషుడేలొ
నన్నుగని శాంతముగ నిల్చి నవ్వుచుండె
నా కతని నవ్వు దోచె స్వప్నంబువోలె

(పరుగులు పెట్టి, చాలా దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసాను. ఆ చిత్రపురుషుడు ఎందుకో నన్ను చూసి శాంతంగా నిల్చుని నవ్వుతున్నాడు. అతని నవ్వు ఏదో స్వప్నంలాగా అనిపించింది నాకు.)

వివిధ సూచీముఖోపలవిషమమైన
మార్గమున బోవుచుంటిని మరల నేను
ఇటుల జూతునుగద, ముందు నీ పురుషుడె
అతి మనోహరమూర్తి నన్నాహరించి

(ఎన్నో సూదుల్లాంటి మొనలున్న రాళ్ళతో నిండి నడవడానికి కష్టంగా ఉన్న త్రోవలో మళ్ళా పోతున్నాను. ఇటు తిరిగి చూసేసరికి ముందు ఆ పురుషుడే, ఎంతో మనోహరమైన మూర్తితో నన్ను ఆకర్షిస్తూ!)


పూర్తిగా చదవండి...

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండంకరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖంశరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

ఇది తెలుగువాళ్ళకి చాలందికి పరిచయమైన శ్లోకమే, కనీసం మొదటి పాదం. ఇది భద్రాచల ఆలయంలో గర్భగుడికి ముందు గది గోడపై ఉంటుంది కూడాను. ఈ శ్లోకం శ్రీరామకర్ణామృతంలోనిది అని ఈ మధ్యనే నాకు తెలిసింది. ఇది వ్రాసింది ఆది శంకరాచార్యులవారని అంటారు. ఇదే నిజమైతే శంకరాచార్యూలవారి కాలానికే భద్రాద్రిపై శ్రీరాముడు వెలశాడని అనుకోవాలి! ఏదైతేనేం ఆ భద్రాద్రి రాముని రూపాన్ని వర్ణించే చక్కని ధారాసారమైన శ్లోకమిది. శ్రీరామకర్ణామృతాన్ని సిద్ధయోగి అనే అతను తెలుగులోకి మొట్టమొదట అనువదించారని చెప్తారు. ఇతనెవరో ఏ కాలానికి చెందినవారో నాకు తెలియదు. పై శ్లోకానికి అతని అనువాదం:

శరచాపాబ్జరథాంగముల్ కరచతుష్కప్రాప్తమైయుండ సు
స్థిర వామాంకమునందు సీత నియతిన్ సేవింప భద్రాద్రిపై
నిరదైనట్టి సరోజనేత్రు బలు యోగీంద్రేంద్ర సంస్తోత్రు భా
సుర కేయూరవిభూషణున్ దలచెదన్ శుద్ధాంతరంగమ్మునన్

ఇక్కడ అబ్జమంటే శంఖం, రథాంగం అంటే చక్రం. విల్లు, బాణము, శంఖము, చక్రము నాలుగు చేతుల్లో వెలుగుతూంటే, ఎడమతొడపై కూర్చుని ఉన్న సీతతో కేయూరాది భూషణాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భద్రాద్రి కొండకొనపై వెలసి ఉన్న రాముని నీలమేఘశ్యాముని మనసారా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం.


ఇంక, అంతటి భాషాపటిమ నాకు లేకపోయినా, నాకు వచ్చిన భాషలో రాముని గూర్చి చాన్నాళ్ళ క్రితం నేను వ్రాసిన పద్యాలు కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మరోసారి ఇక్కడ తలచుకుంటున్నాను:

"శ్రీరామా!" అని భక్తిన్
నోరారగ బిల్చినంత నుప్పొంగె మనో
వారాశి, కురిసె నమృతము
పారిన కన్నీటి సుధలు పద్యములయ్యెన్

నీ నామము నెమ్మనమున
నే నీమముతో స్మరింతు నిత్యము శ్యామా!
నానాటి జీవితమ్మిది
నీ నైవేద్యమ్మొనర్తు నిర్గుణధామా!

కలలోననైను నిన్నే
తలచే సౌభాగ్యగరిమ తక్క మరేదీ
వలదింక నాకు వరదా
కొలువై నీవుండ గుండెగుడిలో స్థిరమై!

ఆ రావణు బరిమార్చిన
ధీరోదాత్తుడవు నీవు, దీనుడ నేనున్
నా రాక్షసగుణముల సం
హారము గావించి బ్రోవవయ్యా రామా!

ఒకరికి తల్లివి తండ్రివి
ఒకరికి నువు బిడ్డవౌదు వొకరికి తోడున్
ఇక మరి నాకేమౌదువు
సకలము నీవే యటంచు స్వామీ కొలువన్!

నినునెన్నడు గనలేనని
మునుపెన్నడొ భాధపడుచు మూల్గితి గానీ
నను నేనే కనలేనని
కనుగొంటిని నేడు తుదకు కనువిప్పయ్యెన్!

నీలోపల నేనుంటినొ
నాలోపల నీవు దాగినావో యేమో
యేలాగున తెలియునురా
లీలా మానుష విలాస శ్రీరఘురామా!


పూర్తిగా చదవండి...