తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, April 3, 2009

పిబరే రామరసం


ఎప్పుడైనా ఏదైనా చదివినప్పుడు మీకు గుండెలోంచి ఏదో తెలియని వింత ఏడుపు పొంగుకొచ్చి కళ్ళని తడిపేసిన అనుభవం ఉందా? అది దుఃఖమో ఆనందమో ఆశ్చర్యమో తెలియదు. అలా అలా అందులో సాంతమూ మునకలేసిన తర్వాత ఒక ప్రశాంతత అణువణువూ నిండిపోతుంది.
దీన్నే "రసానుభూతి" అంటారేమో! అవును, అదే అయ్యుండాలి. కవిత్వాన్ని అనుభవించాలంటే అలాగే అనుభవించాలని అనిపిస్తూ ఉంటుంది. తర్కము, హేతువు అనే బౌద్ధిక శృంఖలాలని ఛేదించుకొని మనమొక కొత్త లోకాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుందప్పుడు. అది ఏ కొద్ది క్షణాలో... అంతే!
ఆ తర్వాత మళ్ళీ మన మనసు తన గాజుగూటిలోకి తిరిగివచ్చి అందులోంచి మనం చదివిన కవితనో, కావ్యాన్నో విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. చాలా శ్రమిస్తుంది కూడా. కానీ అదంతా వ్యర్థం కాదూ? అలా ఎంత శ్రమపడ్డా అది మొదట మనకిచ్చిన అనుభూతిని తిరిగి మనం పొందనూ లేము (ఆ విశ్లేషణ ద్వారా), మరొకళ్ళకి దాన్ని రుచి చూపించనూ లేము.

ఇలాటి అనుభూతి, అనుభవం నాకు కలిగించిన (ఎప్పుడూ కలిగిస్తూ ఉండే!) పుస్తకాలు కొన్నున్నాయి. అలాటి వాటిలో ముఖ్యమైనది రామాయణమూ, రామాయణం గురించి ఏవైనా మంచి వ్యాఖ్యలు. నిజానికి నేను వాల్మీకి రామాయణం చదవలేదు, కొన్ని కొన్ని సన్నివేశాలు తప్ప. చాలావరకూ దాని గురించి తెలుసుకొన్నది వ్యాఖ్యానాల వల్లనే. తెలుగులో మొల్ల రామాయణం పూర్తిగా చదివాను. వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా అనుసరించి రాసిన కొన్ని రామాయణాలని అక్కడక్కడా చదివాను. ద్విపదలో ఉన్న రంగనాథ రామాయణాన్ని కొద్దిగా చదివాను. రామాయణ కల్పవృక్షాన్ని చాలావరకూ చదివాను.
అన్నిటిలోకీ నాకు పైన చెప్పిన అనుభూతిని కలిగించేది కల్పవృక్షమొక్కటే. అందుకే రామాయణం గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది అదే.

ఒనర బోర్కాడించి యుయ్యెల తొట్టెలో
పండ బెట్టిన పసిపాపవోలె
వీథులంబడి తిర్గి బూదియ మై జల్లు
కొని పర్వులం బెట్టు కుఱ్ఱవోలె
నన్నమ్ము దించు మోమంతయు బెరుగన్న
మును జేసికొన్నట్టి బొట్టివోలె
జిట్టి! తలంటి పోసెద నన్న నందక
తొలగి పర్వులు వెట్టు నులిపివోలె

వెల్ల దుస్తులు కట్టించి వీథులన్ షి
కారు పంపిన రాజకుమారు వోలె
మింట నడుచక్కి జాబిల్లి మేదినీశు
నేత్రములకు జలువ బండించి పోసె

దశరథుడు సంతానంకోసం యజ్ఞం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఒక రాత్రి ఆ దశరథునికి చంద్రుడిలా కనిపించాడట! ఇతడు చంద్రుడా, రామచంద్రుడా, అచ్చమైన తెలుగింటి "రాము"నా? ఇలాటి చంద్రుడు మరే రామాయణంలోనూ నాకు దొరకలేదు.
దశరథుని యజ్ఞఫలంగా యజ్ఞపురుషుడు పాయసాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ పాయసంలోకి పరమాత్మ శక్తి ప్రవేశిస్తుంది. అది ఎలాంటి శక్తి?

క్షీరాబ్ధి తరగలో శ్రీపయోధరములో
తొలిపాము పొలసులో దూగుశయ్య
చలువవెన్నెల చాలొ మలయునెండల వాలొ
యగ్గిమంటలడాలొ నిగ్గుచూపు
ప్రామిన్కు చివళ్ళొ బహుళసృష్టి మొదళ్ళొ
యచ్చతెల్వి కరళ్ళొ అసలు మూర్తి
తెఱగంట్ల హాళికో దితిజాళి మోళికో
వట్టిన కేళికో వచ్చు నటన

ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్ర హృదయ
మందొ తనదహరాకాశమందొ యైన
చిత్తు నానందమును మించు సత్తొకండు
జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె!

ఆ పాయసపు గిన్నెని చేతపట్టుకొని దశరథుడు ఆనందోత్సాహలతో వెళ్ళి కౌశల్యకి అందులో సగమిచ్చాడు. అప్పుడామె ఆ పాయసాన్ని ఎలా ఆరగించింది?

ఏ యించుక యెడమైనను
పాయసముననుండి హరియు బరువెత్తునొ నా
నా యమ దీక్షా వ్రత నిధి
పాయసమును బ్రేమమీర భక్షించె వెసన్

ఆలస్యం చేస్తే ఎక్కడ హరి ఆ పాయసన్నుంచి వెళిపోతాడో అనే ఆతృతతో, ఎంతో ప్రీతితో ఆ పాయసాన్ని గబగబా తాగేసిందిట!
రావలసిన శుభవేళ రానే వచ్చింది. ఆ రోజే చైత్ర శుద్ధ నవమి.

కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె, మంత్రసానియున్
బువ్వునబోలె జే శిశువు బూనెను, బట్టపురాణియున్ గనుల్
నొవ్వగు మూత విచ్చుచు గనుంగొనె భాగ్యము నామె కన్నులన్
నవ్వెనొ జాలిపొందెనొ సనాతనమౌ మధుకాంతి జిందెనో!

అంతలోనే బయట చిరుజల్లులు, నవ్వుల విరిజల్లులు ఏకమై కురిసాయి.

చిటపట సవ్వడి వినబడె
గిటకిటనన్ బట్టమహిషి కిటికి దెస గనన్
చిటికలు గుటికలు మెటికలు
పటపట చిటచిటని జల్లువాన కురిసెడున్

క్రిందటేడు సీతాకల్యాణమప్పుడు పడ్డ వాన యీ ఏడు శ్రీరాముడు పుట్టగానే కురిసింది!

రామాయణాన్ని చదివేవాళ్ళు దాన్ని ఒక మత గ్రంధంగానో, చరిత్రగానో కాక కవిత్వంగా ఎందుకు చదవరో నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. అది అచ్చంగా కవిత్వం. మరొకటేమైనా అయ్యిందీ అంటే అది ఆ తర్వాత కథ. రాముడు దేవుడా, మనిషా? నిజంగా ఉన్నాడా లేడా? అతను చేసింది ధర్మమా అధర్మమా? రామాయణాన్ని కవిత్వంగా చదివితే ఇలాటి ప్రశ్నలన్నీ గాల్లో కలిసిపోతాయి. శ్రీశ్రీ "పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి" అన్నప్పుడు తొక్కిసలాడుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోమని చెప్పాడా? "నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు" అని తిలక్ అన్నప్పుడు అభౌతికమైన అక్షరాలు భౌతికమైన ఆడపిల్లలుగా ఎలా మారేయని మనం ప్రశ్నిస్తామా? మరి రామాయణంలో రాముడు శూర్పణఖ ముక్కూచెవులూ కోసెయ్యడం న్యాయమా అన్యాయమా అని వాదులాడుకోడం ఎందుకు? అలా వాదులాడుకోడం వెనక చాలా సజావైన కారణాలే ఉండవచ్చు. కాదనను. కాని ఒక్కసారి వాటన్నిటినీ పక్కన పెట్టి, రామాయణాన్ని కూడా కవిత్వంగా చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు కలిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇట్టే దొరుకుతాయి. ఆ సమాధానాలు మరొకళ్ళకి అంగీకారం కాకపోవచ్చు. నష్టం లేదు. కవిత్వం కలిగించే అనుభూతి సార్వత్రికం కాదు, కేవలం వైయక్తికం అంటే వ్యక్తిగతం.

యాదృచ్ఛికంగా (అదృష్టవశాత్తూ!) నిన్ననే రామాయణం గురించిన ఒక మహత్తర వ్యాఖ్య చదివాను (ఆ రచయిత బ్లాగ్లోకానికి సుపరిచితులే :-). మళ్ళీ అదే అనుభూతిని కలిగించింది! ఎక్కడో అంతరంగంలో మరుగునపడిపోయిన ఒక సుమధుర రాగమేదో హఠాత్తుగా తిరిగి వినిపించినట్టయ్యింది.
సీతాన్వేషణ మళ్ళీ మొదలయ్యింది.

నేనన్నన్ మఱి యెవ్వరో తెలియదే నీవైన చెప్పో ప్రభూ!
నేనే రాముడ నీవు జానకివి యన్వేషింతు నీకై ప్రభూ!
నేనే సీతను నీవొ రాముడవు నన్నేలంగ రావే ప్రభూ!
నేనే నీవును నీవె నేనునగుటల్ నిత్యంబెగా నా ప్రభూ!

సెలవు తీసుకొనే ముందు,
రాఘవగారి వాగ్విలాసంలో అతను వ్రాసిన సంస్కృత శ్లోకానికి నా తేట తెలుగు అనువాదం:

ఎండ వెన్నెల గనులు తామెవని కనులు
వెలుగు రేఱేడు లెవ్వని కొలము, పేరు
మేటి పాలేటిపట్టింటి మెరుపు తీగ
కెవడు మొయిలయ్యె పగటివేల్పింట బుట్టి
అతని, సీతమ్మ పెనిమిటి, నంజి యెదను
కొలువు జేసిన రామయ్య గొలుతు నేను

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
ఇంతకీ పండగ ఇవాళా? రేపా? నేనైతే రెండ్రోజులూ జరుపుకుంటున్నాను! రెండ్రోజులూ వడపప్పు పానకం ఆస్వాదించడం ఆనందమే కదా:-) అలానే రామసుధా రస పానం కూడాను!


పూర్తిగా చదవండి...