తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, February 24, 2008

లావొక్కింతయు లేదు...


ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్ళన్నీ స్లాబులే కానీ నేను పుట్టి పెరిగిన ఇల్లు పెంకుటిల్లు. పెంకుటిళ్ళకి వాసాలుంటాయి. ఆ వాసాలకి చీర వేళాడదీసి సులువుగా ఉయ్యాల వేసేవారు. ఆ ఉయ్యాలలో చిన్నపిల్లల్ని ఊపుతూ నిద్రపుచ్చేవారు. అలా నిద్రపుచ్చుతూ జోలపాటలు పాడేవారు.

మా చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని నిద్రపుచ్చుతూ పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం పద్యాలు చదివేవారట. అంచేత ఆ పద్యాలు ఊహ తెలియనప్పటినుంచి కూడా మనసు మూలల్లో ఎక్కడో నాటుకు పోయాయి. అందుకే బహుశా ఆ పద్యాలు విన్నప్పుడూ, చదువుకున్నప్పుడూ కాళిదాసన్న "జననాంతర సౌహృదాని"వంటి భావనేదో ఆవరిస్తుంది.



లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


ఆ గజేంద్రుడెవడు? నేనెవరిని? ఈ పద్యాన్ని ఎలుగెత్తి చదివితే ఎందుకు నా గుండె ద్రవిస్తుంది? అది నా బాధేనా అన్న అనుభూతి ఎందువల్ల? ఇదంతా అలోచిస్తే చాలా విచిత్రంగా తోస్తుంది!

గజేంద్రుడు మొసలితో కొన్ని వేల యేళ్ళు యుద్ధం చేసాడట, ఇది సాధ్యమేనా? కాదు. అవును, ప్రతీకాత్మకంగా.

కష్టాలొచ్చినప్పుడు, ఒక నెల రోజులైనా, కొన్ని వేల సంవత్సరాల్లా గడవడం సాధరణ విషయమే. ఆ సమయంలో దేవుడి మీద నమ్మకం ఉన్నవారు (కొందరు లేనివారు కూడా కలిగించుకొని) ఇలా కుయ్యి పెట్టడం కుడా తెలిసిన విషయమే. పై అవస్థ దీనికి ప్రతీక.

మరొక రకంగా ఆలోచిస్తే, సమస్త మానవ జాతీ వేన వేల సంవత్సరాలుగా ఎదో ఒక సంఘర్షణ పడుతూనే ఉంది. అలాటి ఒకానొక సందర్భంలో దేవుడనే ఒక నమ్మకంపై ఆధారపడాల్సిన సన్నివేశం తటస్థించింది. పై అవస్థ దీనికి కూడా ప్రతీకే!

మా తాత తెలుగు పండితుడు కాదు, లెక్కల మాష్టారు. గొప్ప భక్తుడూ కాదు. అయినా పోతన భాగవత పద్యాలతనికి కంఠగతం, హృద్గతం. ఎలా? అది తెలుగు పద్యంలో, పోతన రచనలో ఉన్న గొప్పదనం. సామాన్య తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కొద్దిమంది కవులలో పోతన ఒకడు.

"రావే ఈశ్వర", "కావవే వరద" అన్న పదాలలో నిండిన ఆర్తి అనితర సాధ్యం.

పోతన భాగవతంలోని పద్యాలని మన పిల్లలకి అందించడం ఒక్కటీ చాలు, తెలుగుభాషని సంరక్షించుకోడానికి!


పూర్తిగా చదవండి...

Sunday, February 17, 2008

ముందుగ వచ్చితీవు...

ఈ రోజు మళ్ళీ తిరుపతివెంకటకవులదే ఇంకొక పద్యాన్ని తలుచుకుందాం:

ముందుగ వచ్చితీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్
బందుగులన్న యంశమది పాయకనిల్చె సహాయ మిర్వురున్
జెందుట పాడి, మీకునయి చేసెద సైన్య విభాగ మందు మీ
కుం దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు ముందుగన్

ఈ పద్యంలోని గొప్పదనం తెలియాలంటే అది వచ్చే సందర్భాన్ని ఒక్కసారి సింహావలోకనం చెయ్యాలి.
కౌరవ పాండవులకి యుద్ధం నిశ్చయమైపోతుంది. సైన్య సమీకరణంలో భాగంగా, కృష్ణుణ్ణి తనవైపుకు తిప్పుకోవాలన్న ప్రయత్నంతో దుర్యోధనుడు స్వయంగా కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు. అది తెలుసుకుని ధర్మరాజు అర్జునుణ్ణి కృష్ణుడి వద్దకు పంపిస్తాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి చేరుకుంటారు. దుర్యోధనుడు కాస్త ముందువస్తాడు. కానీ కృష్ణుడి తలదగ్గరున్న ఆసనంలో కూర్చోడంతో, కాళ్ళదగ్గరున్న అర్జునుణ్ణి ముందుచూస్తాడు కృష్ణుడు. తను ముందొచ్చాను కాబట్టి, తనకే సాయంచెయ్యాలంటాడు దుర్యోధనుడు. ఇదీ సందర్భం. కృష్ణుడు తన మాటల చాకచక్యాన్నంతా చూపించే పద్యమిది. పద్యం చూడ్డానికి సాధారణంగా ఉన్నా, ఇలాటి పద్యం రాయడం కష్టం. తనకి మాత్రమే సాయం చెయ్యాలన్న దుర్యోధనుడితో, అర్జునుడికి భాగం ఇవ్వడమే కాక, ముందుగా అతనికే కోరుకొనే అవకాశం కలిగిస్తానని చెప్పాలి, చెప్పి ఒప్పించాలి. అదంతా ఒక్క పద్యంలో! అందుకే ఈ పద్యం ఈ మొత్తం ఘట్టానికంతా కీలకమైన పద్యం. తిక్కన ఈ సందర్భంలో మూడు నాలుగు పద్యాలు రాసాడు. తన సైన్య భాగాల గురించి చెప్పి, తర్వాత అర్జునుడు బాలుడు కాబట్టి ముందతన్ని కోరుకోమని అంటాడు కృష్ణుడు భారతంలో. ఇక్కడ, సైన్య భాగాలగురించి వివరించకముందే, ఈ పద్యంలో అర్జునుడు బాలుడు కాబట్టి ముందతను కోరడమే సమంజసమని నిర్ణయిస్తాడు. ఇదొక విధంగా దుర్యోధనుడికి ఉత్కంఠను రేపుతుంది.

"అసలు అర్జునుడికి ముందు కోరుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? దుర్యోధనుడికి ముందవకాశం వచ్చినా సైన్యాన్నే కోరుకుంటాడు కాని యుద్ధం చెయ్యని కృష్ణుణ్ణి కోరుకోడుకదా?", అన్న అనుమానం రావచ్చు.
దీని వెనక రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి, దుర్యోధనుడు కాస్త తెలివి ఉపయోగించి కృష్ణుణ్ణి కోరుకుంటే, పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అలా కోరుకోడానికి అవకాశం లేకపోలేదు. దాన్ని నివారించడం ఒకటి. అంతా కన్నా ముఖ్యమైనది అర్జునుడి భక్తికి పరీక్ష. మొత్తానికీ పరీక్షలో అర్జునుడు నెగ్గుతాడు. దుర్యోధనుడు కూడా చివరికి తనకే మేలు జరిగిందని సంతృప్తుడౌతాడు! విపత్కర పరిస్థితిలో, win-win పరిష్కారాన్ని చూపించిన కృష్ణుని నేర్పు, ఈ కాలంలో negotiation skillsకి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు!

పాడి, ఒప్పు లాంటి అచ్చ తెలుగు మాటలతో హాయిగా సాగిపోయే ఈ పద్యం, "ముందుగ" అన్న పదంతో మొదలై, అదే పదంతో పూర్తికావడం ఒక శిల్ప విశేషం.

పూర్తిగా చదవండి...

Tuesday, February 12, 2008

చెల్లియొ చెల్లకో...

"మంచిపద్యంతో కొంచెంసేపు" అన్న విభాగంలో వీలుచిక్కినప్పుడల్లా నాకు నచ్చిన పద్యాలగురించి రాయాలని ఆలోచన. మొదటిగా ఏ పద్యం గురించి రాద్దామా అనుకుంటే వెంటనే తట్టిన పద్యం ఇది.

చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!


ఈ పద్యం గురించి తెలియని తెలుగువాళ్ళు అరుదే కదా! ఇది అందరికీ సులువుగానే అర్థం అవుతుంది కూడానూ! అదే దీని గొప్పతనం. ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగు పద్యానికొక కొత్త ఊపిరినిచ్చి, ప్రజలమధ్యకి తీసుకెళ్ళినవాళ్ళు తిరుపతివెంకట కవులు. అవధానాల సాముగారడీలతో ఆగిపోక, గొప్ప నాటకాలూ మంచి కావ్యాలు రాసి కవులనిపించుకున్నారు.
ముఖ్యంగా తెలుగు పద్యంలో - నాటకీయతనీ, సంభాషణలో కాకువునీ, వ్యవహార భాషనీ ప్రదర్శించే తీరులో తిక్కనంత ప్రజ్ఞని కనబరిచారు. అందుకే వాళ్ళ పాండవోద్యోగ విజయాలు అంత ప్రజాదరణ పొందాయి!
ఈ పద్యమే అందుకు మంచి ఉదాహరణ. పద్యం ప్రారంభించటంతోనే, "చెల్లియొ చెల్లకో" అనడంలో మామూలుగా సంభాషించుకునే తీరు (అయిందేదో అయింది అన్నట్టుగా) మనసుకు హత్తుకుంటుంది. సంధి చేస్తే నీ పిల్లలూ పాపలూ ప్రజలూ చక్కగా ఉంటారు అని చెప్పడంలోనే యుద్ధం చేస్తే వాళ్ళందరూ నాశనమౌతారని అన్యాపదేశంగా చెప్పడంలోని గడుసుతనం చూడండి! "ఎల్లి" అంటే రేపు అని అర్థం. "ఎల్లుండి"లో(రేపు తర్వాతి రోజు) ఉన్న ఎల్లి ఇదే.
అలతి పదాలతో, సంభాషణా శైలిలో, నాటకీయత ఉట్టిపడే అందమైన పద్యం!
ఈ నెల పదిహేనో తారీకున చెళ్ళపిళ్ళవారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈ రూపంలో నా నివాళి...

పూర్తిగా చదవండి...

Wednesday, February 6, 2008

తెలుగు పద్యమంటే...

తెలుగువాళ్ళకి తెలుగుపద్యమంటే ఏమిటో చెప్పాల్సిన అవసరమేముందీ అని దీర్ఘం తీస్తున్నారా?
నిజమే, కానీ "పద్యం" అన్న పదానికి కాలక్రమంలో నానార్థాలు ఏర్పడ్డాయి కదా. కాబట్టి స్పష్టతకోసం ఈ వివరణ.


కొందరు పద్యం అన్న పదాన్ని కవిత్వానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ఛందోబద్ధమైనా కాకపోయినా కవితాఖండికని పద్యం ఆంటూ ఉంటారు. కానీ నా నిర్వచనం అదికాదు.
ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. అలాటి పాదాల సమాహారం పద్యం. ఇదీ నా నిర్వచనం.
"పద సముదాయం" అని కాకుండా "అక్షర సముదాయం" అని ఎందుకన్నానూ అంటే, తెలుగులో, ఒక పదంలో కొంత భాగం ఒక పాదంలోనూ మరికొంత రెండవపాదంలోనూ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:


శ్రీరఘురామ, చారు తులసీ దళ ధామ, శమ క్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

ఇందులో ఏ పాదం తీసుకున్నా చివరి పదం కొంతభాగమే ఆ పాదంలో ఉండి మిగతాభాగం రెండవ పాదంలోకి వెళుతోంది.
అయితే, ఈ నిర్వచనంలో ఒక చిన్న చిక్కుందండోయ్!

తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన
తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన

పైది ఛందోబద్ధమైన పాదాల సమాహారమే. కానీ పద్యం కాదు, దానికి అర్థం లేదు కాబట్టి. అందువల్ల పద్యాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు.

"ఛందోబద్ధమైన అక్షరాల సమాహారం పాదం. పాదాల అర్థవంతమైన సమాహారం పద్యం".

హమ్మయ్యా! ఒక పెద్దపని అయిపోయింది!
ఏమిటీ, "ఛందోబద్ధమైన" అంటే ఏమిటా... అమ్మో పెద్దపని ఇప్పుడే మొదలయ్యిందిలా ఉందే! దాని గురించి మరో సారి మాట్లాడుకుందామేం...


పూర్తిగా చదవండి...