మొన్న బెంగుళూరులో కొంతమంది నెణ్మిత్రులం (నెట్+మిత్రులు = నెణ్మిత్రులు :-)) కలుసుకున్నప్పుడు, నేనీ మధ్య బ్లాగు టపాలు బొత్తిగా తగ్గించేసానని కొందరు ముద్దుగా కోప్పడ్డారు. పండగలకే వ్రాస్తున్నానని మరొకరి సన్నాయి నొక్కు :-) ఇందులో నిజం లేకపోలేదు. కొంత ఆసక్తి తగ్గడం మాట అలా ఉంచితే, అసలు కారణం, వ్రాయడానికేమీ పెద్దగా లేకపోవడమే. ఏళ్ళ తరబడి అంతే కాంతితో వెలిగిపోడానికి నేనేమీ సూర్య నారాయణున్ని కాదు కదా! ఏదో చిన్న గుడ్డి దీపాన్ని. చమురు తగ్గిపోయే కొద్దీ కాంతి తగ్గిపోతుంది. ఏదైనా కొత్తగా చదివినా విన్నా తెలుసుకున్నా కొత్త చమురుపోసినట్టు కొత్త టపాలేవైనా వెలుగుతాయి. దీపం పూర్తిగా కొడిగట్టకుండా ప్రయత్నించడమే, బహుశా నేను చెయ్యగలిగేది!
యీసారి పండగ మామూలుగా కాకుండా, పండక్కి నాల్రోజుల ముందే, ఆ పండక్కి సంబంధం లేని ఒక టపా...
నన్నెచోడుడు అనే రాజకవి వ్రాసిన "కుమారసంభవం" అనే కావ్యం ఇటీవలి కాలం దాకా, అంటే సుమారు నూరేళ్ళ కిందటి వరకూ, తెలుగు సాహిత్య ప్రపంచంలో అజ్ఞాతంగా ఉండిపోయింది. సాధారణంగా కవులు తమ పూర్వకవులని స్తుతించడమూ, లక్షణకారులు తమ సిద్ధాంతాలకు పూర్వ కవుల పద్యాలను ఉదాహరణలుగా చూపించడమూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రస్తావనలు సాహిత్యచరిత్ర వ్రాసే వాళ్ళకి ఆయా కవుల/కావ్యాల కాలనిర్ణయంలో ఎంతో ఉపయోగపడతాయి. నన్నెచోడుని గురించి కానీ, అతని కుమారసంభవం కావ్యం గురించి కానీ ఇలాంటి ప్రస్తావనలు మనకెక్కడా కనిపించవు! శ్రీ మానవల్లి రామకృష్ణకవి అనే గొప్ప పరిశోధకులు దీన్ని వెలికితీసి, పరిష్కరించి మొట్టమొదటిసారి 1909లో ప్రచురించారు. ఈ నన్నెచోడుడు నన్నయ్య కన్నా ముందటి వాడని అతను ప్రకటించారు! అది సహజంగానే పెద్ద సంచలనాన్ని సృష్టించింది. పెద్ద దుమారం రేగింది. కొంతమందయితే అసలీ కావ్యం రామకృష్ణకవిగారి కూట (దొంగ) సృష్టి అని నిందారోపణ చేసేదాకా వెళ్ళింది. మొత్తానికి ఆనాటి పండితులందరూ తేల్చిన విషయం - యిది నన్నెచోడుని కావ్యమేననీ, నన్నెచోడుడు నన్నయ్య తిక్కనల మధ్య కాలానికి చెందినవాడనీను. కుమారసంభవం ఎన్నో విశిష్టతలు కలిగిన కావ్యం. వాటి గురించి కొంత తెలుసుకోవాలంటే ఈమాటలో శ్రీ మోహనరావుగారి మంచి వ్యాసం చదవండి (
http://www.eemaata.com/em/issues/200901/1389.html). ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఈ కావ్యంలో నన్ను బాగా ఆకట్టుకొన్న ఒక మంచి పద్యాన్ని గురించి యిప్పుడు ముచ్చటించుకుందాం.
పవడంపులతమీద ప్రాలేయపటలంబు
బర్వెనా మెయినిండ భస్మమలది
లాలితంబగు కల్పలత పల్లవించెనా
గమనీయ ధాతువస్త్రములు గట్టి
మాధవీలత కళిమాలికల్ ముసరెనా
రమణ రుద్రాక్షహారములు వెట్టి
వర హేమలతికపై బురినెమ్మి యూగెనా
సన్నుతమగు నెఱిజడలు బూని
తపస్సు చేస్తున్న పార్వతీదేవి వర్ణన యిది. ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు? ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత (పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది, ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు. జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో నిగనిగలాడుతూ ఉంటుంది. కాని తపోదీక్షలో, సంరక్షణ లేక ఆమె కురులు బిరుసెక్కి ఎఱ్ఱెఱ్ఱని రంగులోకి మారాయి. అందుకూ నెమలి పురితో పోలిక. ఇవన్నీ చాలా అందమైన పోలికలు. అన్నీ ప్రకృతినుంచి తీసుకున్నవే. పార్వతి ప్రకృతి స్వరూపమే కదా మరి! పైగా నాలుగుపోలికలలోనూ మనకి కనిపించేది తీగే. ఆమె శరీరం తపస్సుకి ఎంతగా కృశించిపోయిందో, అయినా తన సహజ సౌందర్యంతో ఎలా శోభిస్తోందో, ఈ పోలిక వల్ల చాలా చక్కగా ధ్వనిస్తోంది. ఇంతటితో ఆగిపోతే ఇదేమంత పెద్ద గోప్ప వర్ణన అని చెప్పలేం. ఎత్తుగీతితో యీ వర్ణన స్థాయిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాడు నన్నెచోడుడు.
హరుడు మాహేశ్వరీ రూపమైన చెలువ
మభినయించెనొ యని మును లర్థి జూడ
గురుతపశ్శక్తి మూర్తి సేకొనిన కరణి
దగిలి యుమ తపోవేషంబు దాల్చి పొల్చె!
నిజం చెప్పండి, యీ ఎత్తుగీతి చదివేదాకా పార్వతి తపోవేషం సరిగ్గా శివుని రూపాన్ని పోలినదన్న స్ఫురణ మీకు కలిగిందా? నాకైతే కలగలేదు. అలా కలగకుండా చాలా జాగ్రత్తగా పద్యాన్ని చెక్కాడు కవి. ప్రతి పాదంలోనూ పార్వతీదేవి వేషధారణ చెప్పడానికి ముందు, దాని గురించిన రమణీయమైన పోలిక చూపించి, మనసుని కట్టిపడేసాడు, అసలు వేషమ్మీదకి దృష్టి మళ్ళకుండా. ఇది కవి దృష్టి. ఎత్తుగీతి మొదటి పాదంలో హఠాత్తుగా శివుని రూపాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింప జేసాడు. అది మునుల చూపు! ఇది గొప్ప పద్యశిల్పం. ఈ శిల్పం ద్వారా కవి సాధించినదేమిటని అలోచిస్తే, మామూలు మనుషుల చూపుకీ, మునుల చూపుకీ ఉన్న అంతరాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం. మనం మామూలు మనుషులం. ప్రకృతి రామణీయకతకి పరవశులమైపోతాం. కానీ మహర్షులు అసలు స్వరూపాన్ని దర్శించగలుగుతారు. ప్రకృతిలో పరమాత్మను దర్శిస్తారు. పార్వతీ పరమేశ్వరులు, ప్రకృతీపురుషులు ఒకటే అన్న జ్ఞానాన్ని పొందుతారు. ఇంత గొప్ప తత్త్వాన్ని అందమైన వర్ణనల మాటున, సీసపద్య శిల్పం ద్వారా ఎంత చక్కగా ధ్వనింప జేసాడో చూసారా! నా దృష్టిలో యిది గొప్ప కవిత్వం. పైగా ఎత్తుగీతిలో ఎంతటి ఔచిత్యముందో జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. పార్వతీదేవి శివునిలాగా ఉంది అనుకోలేదు మునులు. ఆ హరుడే పరమేశ్వరి అందాన్ని అభినయిస్తున్నాడా అని అనుకొన్నారు! వారికక్కడ కనిపించింది పరమేశ్వరుడే. ఎందుకంటే అప్పటికింకా పార్వతి శివపత్ని కాలేదు. అంచేత మునులకి ఆమె ఒక స్త్రీ మాత్రమే. ఆమె వారికి స్త్రీగా కనిపిస్తే వారు "అర్థితో" చూడడం కుదరదు. పైగా వారి శివదీక్షకి అది తగదు. అందువల్ల వారికక్కడ కనిపించినది స్వయానా ఆ పరమేశ్వరుడే. అలా కనిపించడానికి కారణం వారి శివదీక్షతో పాటు, ఘనమైన పార్వతి తపశ్శక్తి . తపశ్శక్తికి ఆకారం వచ్చిందా అన్నట్టుగా ఉన్నదామె. శివుడు నిత్య తపస్సమాధిమగ్నుడు. అంచేత అమ్మవారు తపశ్శక్తి స్వరూపిణి కావడం చాలా సమంజసం కదా.
ఈ వర్ణనలో మరొక చిన్న విశేషం కూడా దాగి ఉంది! శివదీక్ష చేపట్టే వారు ఆ శివునిలా రుద్రాక్షలు ధరించి, బూడిదపూసుకొని అతని రూపాన్ని అనుసరించడం ఒక పద్ధతి. అయితే, తమాషా ఏంటంటే, శృంగారచేష్టలలో "లీల" అన్నది ఒకటి ఉంది. ప్రియుని వేషభాషలను ప్రియురాలు అనుకరించడం లీల. ఇక్కడ పార్వతీదేవి తపోవేషం ఆ "లీల"గా కూడా మనం భావించ వచ్చు! కుమారసంభవం పూర్తిగా శృంగారరసాత్మకమైన కావ్యమే మరి! ఆ ఆదిదంపతుల సంభోగమే కదా యీ సర్వసృష్టికీ కారణం.
పూర్తిగా చదవండి...