నిరుపహతిస్థలం మృదుతరాసన మొళ్ళుణి సింపుదంబులం
నరపిద పుస్తకప్రతతి లేఖకవాచకసంగ్రహం నిరం
తర గృహనిశ్చితస్థితి విచారకసంగతి సత్కళత్ర సా
దరతయి నుళ్ళ సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియం
ఇదే భాషో గుర్తుపట్టారుగా, కన్నడం. మరి పద్యాన్ని కూడా గుర్తుపట్టారా? ఆఁ... అవునదే... పెద్దనగారి చాటువు. ఒకేసారి రెండు భాషల్లో సినిమా విడుదల చేసినట్టు పెద్దనగారు కూడా ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో యీ చాటువు చెప్పేరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పద్యం సూక్తిసుధార్ణవము అనే కన్నడ గ్రంథంలోది . ఈ గ్రంథం క్రీ.శ. 1240 ప్రాంతంలో కూర్చబడింది, అంటే సుమారు పెద్దనగారి కాలానికి మూడువందల సంవత్సరాల ముందరన్న మాట. ఇది ఒక సంకలన గ్రంథం. అంటే రకరకాల కావ్యాలనుండి ఏర్చికూర్చిన పద్యాల సంకలనం. అయితే యీ పద్యం ఏ కావ్యంలోనిదో స్పష్టంగా తెలియలేదు.
సరే మరి తెలుగుపద్యం బ్లాగులో తెలుగుపద్యం లేకపోతే ఎలా! చాలామందికి నోటికొచ్చే ఉంటుంది కాని తెలియనివాళ్ళ కోసం:
నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!
ఈ తెలుగు పద్యాన్ని చెప్పినది పెద్దనగారో మరెవరో కచ్చితంగా తెలియదు. ఒకవేళ పెద్దనగారే అయితే మాత్రం, కన్నడపద్య స్ఫూర్తితోనే యీ పద్యాన్ని చెప్పుంటారనడంలో సందేహం లేదు. అయితే మాత్రమేం! కిట్టనివాళ్ళు వట్టి అనువాదం అని కొట్టిపారేస్తూ ఉంటారు గాని, మూలాన్ని సానబెట్టి మెరుగులు దిద్ది రాతినుండి రత్నాన్ని తయారుచెయ్యడం మన తెలుగు కవులకి వెన్నతో బెట్టిన విద్య. తెలుగుభాషపై నాకున్న పక్షపాతం అని మీరన్నా ఫరవాలేదు, నాకు మాత్రం కన్నడపద్యం కన్నా మన తెలుగుపద్యమే ఎంతో అందంగా ఉందనిపించింది. ఎందుకంటారా? చూడండి.
కన్నడంలో "మృదుతరాసనం" అని చెప్పి ఊరుకున్నారు కాని తెలుగులో "ఊయల మంచ"మని ఎంత చక్కగా బొమ్మకట్టి చూపించారు! ఒక రసిక కవికి అంతకన్నా మృదుతరాసనం ఏముంటుంది! ఆ రసికతే పద్యమంతా కనిపిస్తుంది. కన్నడ పద్యం, ఒక బుద్ధిమంతుడైన పండితకవి తనకి కావలసిన సామగ్రి చిట్టా ఏకరువు పెట్టినట్టుంది. మరి తెలుగు పద్యమో! సరస రమణీయంగా, అచ్చంగా ఓ కవి చెప్పినట్టుగానే ఉంది. కన్నడ కవి కోరుకున్నది సత్కళత్ర సాదరత, అంటే మంచి భార్య తనని సాదరంగా చూసుకోవడం. దానికి దీటుగా తెలుగు కవి కోరుకున్నదేమిటి? "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడెము". కన్నడ పద్యంలో "ఇంపు దంబులం" ఇక్కడ "కప్పురవిడెము" అయ్యింది. అవతల భార్య తన రాకకై వేచి చూస్తోంది. ఇతను రాకపోయేటప్పటికి తన చెలికత్తె ఒకర్తికి తాంబూలాన్ని యిచ్చి దూతగా పంపింది. కప్పురవిడెము పంపడంలోని ఆంతర్యం రసజ్ఞులు గ్రహించగలరు. కన్నడ పద్యంలో ఉటంకించిన "నిరంతర గృహనిశ్చిత స్థితి", "సత్కళత్ర సాదరత" అనే అంశాలిందులో ఎంత చక్కగా ధ్వనిస్తున్నాయో గమనించండి. ధ్వని కలిగినదే మంచి కవిత్వం. ఇక, కన్నడ పద్యంలోని "ఒళ్ళు ఉణిసి" అంటే మంచి భోజనం, తెలుగులో "ఆత్మకింపయిన భోజన" మయింది. కన్నడంలోని "విచారక సంగతి", తెలుగులో "ఒప్పు తప్పరయు రసజ్ఞు" లయ్యారు. కేవలం విచారణ, విశ్లేషణ ఉంటే సరిపోదు. ఒప్పు తప్పులు తెలిస్తే చాలదు. వారు రసజ్ఞలై ఉండాలి. లేదంటే ప్రతి దానికీ ఏదో ఒక నెరసు చూపిస్తూ కవిత్వాన్ని బొత్తిగా ఆస్వాదించలేని వారవుతారు. భాస్కరశతకంలో "చదువది ఎంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. కవిత్వాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞత చాలా ముఖ్యం. అలాగే, కన్నడంలో "లేఖకవాచక సంగ్రహం", తెలుగులో "ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము" లయ్యారు. వట్టి లేఖక వాచక సంగ్రహ ముంటే చాలదు. వాళ్ళు ఎలాంటి వారై ఉండాలో మన తెలుగు కవి చెపుతున్నాడు. వాళ్ళు ఊహ తెలియగల వారై ఉండాలి. ఇది చాలా విశేషమైన అంశం. ఆ రోజులలో కవికి లేఖకులుండేవారు. కవి చెపుతూ ఉంటే పక్కనే కూర్చొని ఒక వ్రాయసకాడు దానిని తాళపత్రాలమీద లిఖించేవాడు. ఆధునిక కాలంలో కూడా విశ్వనాథ వారికి యిలానే లేఖకులుండేవారు. కవితాధార అవిశ్రాంతంగా సాగుతూ ఉంటే దాన్ని అంత వేగంగానూ లేఖకుడు పట్టుకొని వ్రాయాలంటే మరి ఆ లేఖకునికి కవి చెపుతున్న విషయమ్మీద చక్కటి అవగాహన ఉండాలి. పైగా మధ్యలో ఏదైనా ఒకచోట ఆ వేగాన్ని అందుకోలేకపోతే, అక్కడ కవి చెప్పినది ఏమిటో ఊహించగలిగే ప్రజ్ఞ ఉండాలి. లేదంటే కుంటినడకే అవుతుంది. కవిత్వం ధ్వని ప్రధానం కాబట్టి, దాన్ని చదివే పాఠకులకి కూడా అందులోని ధ్వని గ్రహించ గలిగే ఊహశక్తి ఉండాలి. లేకపోతే ఎంత గొప్ప కవిత్వం రాసీ ఏమిటి ప్రయోజనం? అందుకే ఇవన్నీ దొరికితే తప్ప లేకపోతే కవిత్వం వస్తుందయ్యా అంటున్నాడీ కవి. దాన్ని సొగసైన తెలుగు నుడికారంలో చెపుతున్నాడు "ఊరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే!" అని.
పాతకాలపు కవిత్వాన్ని నిరసించేందుకు కొంతమంది యీ పద్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు.
"ఏకాంతము, చెలికత్తె తెచ్చి యిచ్చిన కర్పూర తాంబూలమూ, ఉయ్యాల మంచమూ, మంచి భోజనమూ - కవిత్వం రాయాలంటే యివన్నీ కావలట! ఇదేమి కవిత్వం, వట్టి భోగపు కవిత్వం." అని పెదవి విరుస్తూ ఉంటారు. నిజమే, ఆ కాలంలో వచ్చినది చాలా వరకూ కడుపునిండిన కవిత్వమే. మరి ఆ పద్యంలో తర్వాత చెప్పినవాటి సంగతేమిటి? తప్పొప్పులు తెలిసిన రసజ్ఞులు, ఊహ తెలిసిన లేఖక పాఠకులు. ఏ కాలాంలోనైనా మంచి కవిత్వం రావడానికి అవసరమైనవే కదా యివి. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనకి నచ్చిన కవి, మనకి నచ్చిన అంశాన్ని గూర్చి ఏది రాసినా దాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడమూ, కానప్పుడు అథః పాతాళానికి తొక్కెయ్యడమూ రసజ్ఞత అనిపించుకుంటుందా? అలా చేసినప్పుడు మంచి కవిత్వం వస్తుందా? ఇప్పటి విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలివి. ఈ కాలంలో "లేఖకులు" లేరు. కాని వారి స్థానంలో యిప్పుడు ప్రచురణకర్తలున్నారు. సంపాదకులున్నారు. వాళ్ళకుండాల్సిన లక్షణం "ఊహ తెలియడం". ఇక పాఠకుల సంగతి సరేసరి! ఇక్కడొక అనుమానం రావచ్చు. కవిత్వం అనేది కవి వ్యక్తిగత విషయం. పాఠకులూ, విమర్శకులూ, సంపాదకులూ బయటవారు. కవి తనకోసం రాసుకుంటాడు కాని వీళ్ళకోసం కాదు కదా. అందువల్ల, ఒక కవి మంచి కవిత్వాన్ని రాయగలగడానికి వీరంతా ఎందుకూ? - అని. నిజమే, ఇక్కడ చెప్పినదాన్ని ఒక కవికి వ్యక్తిగతంగా అన్వయించడం అంత సమంజసం కాదు. సామాజికంగా అన్వయించుకోవాలి. అంటే, ఒక భాషలో, సమాజం నుండి మంచి కవిత్వం రావాలీ అంటే, ఆ భాషాసమాజంలో రసజ్ఞులైన విమర్శకులు, ఊహ తెలిసిన పాఠకులు సంపాదకులు తప్పకుండా ఉండాలి. మంచి కవిత్వానికి గుర్తింపు, ప్రచారం లభించినప్పుడే అది సమాజంలో నిలుస్తుంది. ఆ బాధ్యత, పైన చెప్పిన ముగ్గురిదీ. ఈ పద్యం మనకా విషయాన్ని గుర్తు చేస్తుంది.
ఇదీ మన తెలుగుపద్యం గొప్పదనం. మరో సంగతి మీరు గమనించారో లేదో. కన్నడ పద్యానికి యతి నియమం లేదు! ప్రాస ఒక్కటే ఉంది. తెలుగుపద్యానికి రెండూ ఉన్నాయి. అయినా తెలుగుపద్యం ఇంత కవితాత్మకంగా ఉందంటే దాని అర్థమేమిటి? వ్రాసే సత్తా ఉండాలే కాని, మంచి కవిత్వం పుట్టించేందుకు యతిప్రాసల నియమాలు బంధకం కావనే కదా. నిజానికీ యతిప్రాసలు, అభివ్యక్తిలో పద్య నిర్మాణంలో కొత్తదనం కోసం కవిని ఆలోచింపజేసే ఉపకరణాలని నా అభిప్రాయం. ఆ సాధన చేసే ఓర్పు నేర్పు కవికి అవసరం. మంచి కవిత్వం అప్పుడే పండుతుంది.
పూర్తిగా చదవండి...
Friday, January 27, 2012
నిరుపహతి స్థలం...
Thursday, December 23, 2010
ఖడ్గసృష్టి
శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" పుస్తకం పేరు చాలామంది వినే ఉంటారు. ఆ పేరు వెనక ఒక పద్యం ఉందని ఎంతమందికి తెలుసు? ఆ పుస్తకం చదివిన వాళ్ళకి బహుశా తెలియవచ్చు. పుస్తకం మొదట్లోనే ఆ పద్యం ఉంటుంది. ఆ పద్యం ఇది:
గరళపు ముద్ద లోహ; మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్;
హరు నయనాగ్ని కొల్మి; ఉరగాధిపు కోరలు పట్టకార్లు; ది
క్కరటి శిరంబు దాయి; లయకారుడు కమ్మరి - వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్
ఒక ఖడ్గ సృష్టిని (కత్తి తయారీ విధానాన్ని) వర్ణించే పద్యమిది. కత్తి తయారికీ కావలసినవేమిటి - ముడిసరుకు లోహం (అంటే ఇనుములాంటి గట్టి మెటల్), దాన్ని అచ్చుపోసి బాగా కాల్చడానికి కొలిమి, కొలిమిలో కాల్చేటప్పుడు పట్టుకోడానికి పెద్ద పెద్ద పట్టకార్లు, ఒక దాయి, పెద్ద సమ్మెట. కాలుస్తూ, కత్తిని సాపు చెయ్యడానికి దాయి (ఇనప దిమ్మ) మీద పెట్టి, దాన్ని సమ్మెటలతో (పెద్ద సుత్తులు) దభీ దభీమని మోదుతారు. ఖణేల్ ఖణేల్ మంటు చప్పుడవుతుంది. సరే ఇదంతా చేసే కమ్మరి కూడా కావాలి కదా!
ఇక్కడ చెపుతున్న కత్తిని తయారు చెయ్యడానికి ఇవన్నీ ఎలా సమకూరాయో కవి చెపుతున్నాడు. లయకారుడయిన శివుడే స్వయానా ఈ కత్తిని తయారుచేసాడట! అతని దగ్గర ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయంటే - లోహమేమో గరళపు ముద్ద, అంటే ముద్దగా చేసిన కాలకూట విషం! దద్దరిల్లుతూ కోట్లకొలదిగా పడే పిడుగులు సమ్మెటలు. హరుని నిప్పుకన్నే మండే కొలిమి. ఉరగాధిపుడంటే పాములరాజైన వాసుకి (శివుడి మెడలో ఉండేది ఇతడే). ఆ వాసుకి కోరలు పట్టకార్లట. ఎనిమిది దిక్కులా భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తూంటాయని అంటారు కదా! వాటినే దిగ్గజాలంటారు. అలాంటి ఒక దిగ్గజం తల దాయిగా మారింది. ఈ సామాగ్రి అంతటితో లయకారుడయిన హరుడే కమ్మరిగా ఆ ఖడ్గాన్ని సృష్టించాడట. అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! ఇంతకీ ఎవరిదీ ఖడ్గం అంటే, శత్రు రాజులను సంహరించే గుణంతో శోభిల్లే మైలమ భీమునిదట. మైలమ భీముని ఖడ్గం ఎంత శక్తివంతమయినదో, శత్రువులపాలిట ఎలా మృత్యుసమానమయినదో ధ్వనించే పద్యమిది. చదవగానే ఒళ్ళు గగుర్పొడిచేలా లేదూ! తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! ఈ భీషణ వాక్కు వేములవాడ భీమకవిది.
వేములవాడ భీమకవి పదకొండవ శతాబ్దానికి చెందిన కవి. దక్షారామ భీమేశ్వరుని కొలిచి, అతని చేత నిగ్రహానుగ్రహ శక్తి కలిగిన వాక్కును సంపాదించాడని కథ. ఇతని కావ్యాలేవీ దొరకలేదు కాని ఇతనివిగా చెప్పబడుతున్న ఒక 53 పద్యాలు మాత్రం లభించాయి. ఇందులో చాలా వరకూ చాటువులే. ఒకో చాటువుకీ ఒకో కథ! తిట్టు కవిత్వంలో ఇతడు మహా దిట్ట. బహుశా చిన్నతనంనుండీ ఎదుర్కున్న
ఈసడింపే (తండ్రిలేని బిడ్డ కావడాన) అతని వాక్పారుష్యానికి కారణమని ఒక ఊహ. చాటుపద్యాలయినా, వాటిలో చిక్కని ధార, తళుక్కున మెరిసే భావాలు కనిపిస్తాయి. ఇతను దేశ సంచారం చేస్తూ ఎందరో రాజులని దర్శించినట్టుగా అతని చాటువుల వల్ల తెలుస్తుంది. భీమకవి ప్రభావం శ్రీనాథుని మీద చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. భీమకవిలాగానే శ్రీనాథుడుకూడా దేశసంచారం చేసి వివిధ రాజాస్థానాలని దర్శించినవాడు. అతని మాదిరిగా శ్రీనాథుడుకూడా ఎన్నో చాటువులు చెప్పాడు. అతని కవిత్వ ధార కూడా శ్రీనాథుని బాగా ఆకట్టుకున్నట్టుగా ఉంది. "వచియింతు వేములవాడ భీముని భంగి నుద్దండ లీల నొక్కొక్క మాటు" అని చెప్పుకున్నాడు!
భీమకవి దర్శించిన రాజులలో మైలమ భీముడు ఒకడు. భీమకవికి మైలమ భీమునితో చాలా మైత్రి కలిగింది. మైలమ భీముడు విజయనగర (అంటే రాయల విజయనగరం కాదు, గజపతుల విజయనగరం, మా ఇజీనారం :-) రాజులయిన పూసపాటివారికి పూర్వీకుడు. "ఏరువ భీమ", "భండన భీమ", "చిక్క భీమ" అనే మొదలయిన పేర్లున్నాయితనికి. దేవవర్మకీ మైలమదేవికీ జన్మించినవాడు మైలమ భీమన. ఇతను చాలా పరాక్రమశాలి, సాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు "పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి" అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఈ ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు. మరి ఇప్పుడది ఉందో లేదో నాకు తెలీదు!
పూర్తిగా చదవండి...
Saturday, September 11, 2010
భాగ్యములకుప్ప పిళ్ళారప్ప!
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!
మా తమిళనాడులో వినాయకుడిని పిళ్ళయ్యార్ అంటారు. అక్కడనుంచి వచ్చిందే "పిళ్ళై" అన్న పేరు. తెలుగులో కూడా కొన్ని చోట్ల వినాయకుణ్ణి ఈ పేరుతో పిలుస్తారనుకుంటాను. ఆ పిళ్ళారప్పని గురించి కొన్ని చాటు పద్యాలు:
శ్రీకర దంతరుచిజితసు
ధాకర మృడపార్వతీముదాకర గుణర
త్నాకర వరధీకర పర
భీకర భాగ్యములకుప్ప పిళ్ళారప్పా!
(శుభాలనిచ్చేవాడూ, తన దంతకాంతులతో తెల్లని జాబిల్లినే ఓడించినవాడూ, శివపార్వతులకి ఆనందం చేకూర్చేవాడూ, సద్గుణ సాగరుడూ, వరము (సిద్ధి), ధీ (బుద్ధి) ఇచ్చేవాడూ, శత్రుభయంకరుడూ - భాగ్యముల కుప్పైన ఆ పిళ్ళారప్పే!)
ఓరీ బాలుడ నీవిటు
రారా యని నన్ను బిలిచి రంజిలు దయచే
గోరిక లొసగుము భువి నీ
పేరును బ్రకటించి చెప్ప బిళ్ళారప్పా!
భక్షింపుము గావలసిన
భక్షణములు నీకు నిత్తు భక్షించియు నీ
కుక్షి గల విద్య మాకున్
బిక్షంబిడి కావుమప్ప పిళ్ళారప్పా!
అన్నట్టు ప్రతిసారీ వినాయకచవితికి వినాయకుడి మీదనేనా పద్యాలు, నా మీద ఒక్క పద్యమైనా లేదా అని ఆ వినాయకుణ్ణి మోసుకువెళ్ళే మూషిక రాజం కిచకిచమంటూ అడిగింది. దాని కోరిక కాదంటే ఇంకేమైనా ఉందా! అందుకే దాని మీద కూడా ఒక చాటువిదిగో!
నిర్ణిద్రవిషయుక్త నిశితదంష్ట్రలు బూని
భేదించు నెటువంటి గాదెలైన
దారుణోద్యద్దంతతతి చేత ఖండించు
గుఱుతుగా నెటువంటి కోకలైన
పటుసురాంగాగారభరితంబుగా ద్రవ్వు
బొంకాన నెటువంటి భూమినైన
కీచుకీచుధ్వని ప్రాచుర్యమహిమచే
వర్ణించు నెటువంటివారినైన
అతడు సామాన్యుడే నరేంద్రాలయాంత
రంతరానేక పేటికా క్రాంత వస్తు
హరణసురధాణి యవ్వినాయకుపఠాణి
చారుతరమూర్తి మూషకచక్రవర్తి!
ఆ మూషికనాయకుని నుండీ నాయకమూషికాలనుండీ ఆ వినాయకుడు మనందరినీ రక్షించుగాక!
పూర్తిగా చదవండి...
Sunday, June 14, 2009
పద్యంతో లెక్కల మేజిక్!
నాకు పద్యాలంటే ఎలా ఇష్టమో లెక్కలంటేనూ అలాగే ఇష్టం. మనవాళ్ళు పద్యాలలో కవిత్వం సృష్టించినట్టే లెక్కలుకూడా చేసారు. లెక్కలతో మేజిక్కులు చేసారు. అలాటి ఒక లాజిక్ మేజిక్ ఇప్పుడు మీ కోసం.
ఈ కింద ఇచ్చిన పద్యం ఒకసారి చూడండి:
1. అరి భయంకర చక్ర కరి రక్ష సాగర చాయ శ్రీ కర్బురసాటి యుగళ
2. నాళీక సన్నిభ నయన యండజవాహ వాణీశజనక వైభవ బిడౌజ
4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష వర జటి స్తుత శౌరి వాసుదేవ
8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల పాప భుజంగమ పరమ గరుడ
16. దోష శైలేశ శచిదక్ష ద్రుహిణి హేళి
ఇది సీస పద్యం. కాకపోతే ఎత్తుగీతి తేటగీతిలో ఒక పాదమే ఉంది. ఇది విష్ణుమూర్తి స్తోత్రం. ప్రస్తుతం మనం లెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని అర్థ తాత్పర్యాలు పక్కన పెడదాం (కావలసిన వాళ్ళు ప్రయత్నించవచ్చు).
ఇంతకీ వీటి ముందున్న నెంబర్లేమిటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.
ఇప్పుడు మీరు తెలుగులో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకోండి. కాకపోతే చిన్న చిన్న కండిషన్లు. అచ్చుల్లో "అ" ఒకటే తలుచుకోవాలి. హల్లుల్లో "ఙ్", "ఞ్" తలుచుకోకూడదు. అల్ప ప్రాణాలకీ మహా ప్రాణాలకీ తేడా లేదు ("ప", "ఫ" ఒకే అక్షరం. "చ", "ఛ" ఒకటే అక్షరం. ఇలా అన్నమాట). అలాగే "ర", "ఱ" కి తేడా లేదు. గుణింతాలకీ తేడా లేదు ("ప", "పా", "పి"... అన్నీ ఒకటే).
సరే ఒక అక్షరం తలుచుకున్నారా? ఇప్పుడు మీరేం చెయ్యాలంటే, మీరు తలుచుకున్న అక్షరం ఏయే పాదాల్లో ఉన్నాదో గుర్తించండి. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు అసలు అక్షరమే లెక్క, వత్తులు కాదు. అంటే "ప్ర" అన్నది "ప" తలుచుకున్నప్పుడే లెక్కలోకి వస్తుంది, "ర" తలుచుకున్నప్పుడు కాదు. ఒక అక్షరం ఒకే పాదంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వచ్చినా అది ఒకసారే లెక్క. ఆయా పాదాలకి సంబంధించిన సంఖ్యలని కలపండి. ఆ వచ్చిన సంఖ్యని నాకు చెప్పండి. ఉదాహరణకి "డ" తలుచుకున్నారనుకోండి. అది రెండు నాలుగు పాదాల్లో ఉంది. వాటికి సంబంధించిన సంఖ్యలు 2, 8. 2+8 = 10. మీరు నాకు 10 అని చెప్పండి. అప్పుడు మీరు తలుచుకున్న అక్షరం "డ" అని నేను చెప్పేస్తాను. మీరు తలుచుకున్న అక్షరం సరిగ్గా నేను చెప్పేస్తానన్న మాట.
దీనికి నా దగ్గర కంప్యూటరు ప్రొగ్రాములాంటిది ఏదీ లేదు. ఒక్క రెండు వాక్యాలు గుర్తుంచుకుంటే చాలు. అవేవిటో తర్వాత చెప్తాను. ముందు ఆట మొదలుపెడదామా?
అక్షరం తలుచుకొని నెంబరు చెప్పండి. కాయ్ రాజా కాయ్!
పూర్తిగా చదవండి...