తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, January 27, 2012

నిరుపహతి స్థలం...


నిరుపహతిస్థలం మృదుతరాసన మొళ్ళుణి సింపుదంబులం
నరపిద పుస్తకప్రతతి లేఖకవాచకసంగ్రహం నిరం
తర గృహనిశ్చితస్థితి విచారకసంగతి సత్కళత్ర సా
దరతయి నుళ్ళ సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియం

ఇదే భాషో గుర్తుపట్టారుగా, కన్నడం. మరి పద్యాన్ని కూడా గుర్తుపట్టారా? ఆఁ... అవునదే... పెద్దనగారి చాటువు. ఒకేసారి రెండు భాషల్లో సినిమా విడుదల చేసినట్టు పెద్దనగారు కూడా ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో యీ చాటువు చెప్పేరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పద్యం సూక్తిసుధార్ణవము అనే కన్నడ గ్రంథంలోది . ఈ గ్రంథం క్రీ.శ. 1240 ప్రాంతంలో కూర్చబడింది, అంటే సుమారు పెద్దనగారి కాలానికి మూడువందల సంవత్సరాల ముందరన్న మాట. ఇది ఒక సంకలన గ్రంథం. అంటే రకరకాల కావ్యాలనుండి ఏర్చికూర్చిన పద్యాల సంకలనం. అయితే యీ పద్యం ఏ కావ్యంలోనిదో స్పష్టంగా తెలియలేదు.

సరే మరి తెలుగుపద్యం బ్లాగులో తెలుగుపద్యం లేకపోతే ఎలా! చాలామందికి నోటికొచ్చే ఉంటుంది కాని తెలియనివాళ్ళ కోసం:

నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు  లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఈ తెలుగు పద్యాన్ని చెప్పినది పెద్దనగారో మరెవరో కచ్చితంగా తెలియదు. ఒకవేళ పెద్దనగారే అయితే మాత్రం, కన్నడపద్య స్ఫూర్తితోనే యీ పద్యాన్ని చెప్పుంటారనడంలో సందేహం లేదు. అయితే మాత్రమేం! కిట్టనివాళ్ళు వట్టి అనువాదం అని కొట్టిపారేస్తూ ఉంటారు గాని, మూలాన్ని సానబెట్టి మెరుగులు దిద్ది రాతినుండి రత్నాన్ని తయారుచెయ్యడం మన తెలుగు కవులకి వెన్నతో బెట్టిన విద్య. తెలుగుభాషపై నాకున్న పక్షపాతం అని మీరన్నా ఫరవాలేదు, నాకు మాత్రం కన్నడపద్యం కన్నా మన తెలుగుపద్యమే ఎంతో అందంగా ఉందనిపించింది. ఎందుకంటారా? చూడండి.

కన్నడంలో "మృదుతరాసనం" అని చెప్పి ఊరుకున్నారు కాని తెలుగులో "ఊయల మంచ"మని ఎంత చక్కగా బొమ్మకట్టి చూపించారు! ఒక రసిక కవికి అంతకన్నా మృదుతరాసనం ఏముంటుంది! ఆ రసికతే పద్యమంతా కనిపిస్తుంది. కన్నడ పద్యం, ఒక బుద్ధిమంతుడైన పండితకవి తనకి కావలసిన సామగ్రి చిట్టా ఏకరువు పెట్టినట్టుంది. మరి తెలుగు పద్యమో! సరస రమణీయంగా, అచ్చంగా ఓ కవి చెప్పినట్టుగానే ఉంది. కన్నడ కవి కోరుకున్నది సత్కళత్ర సాదరత, అంటే మంచి భార్య తనని సాదరంగా చూసుకోవడం. దానికి దీటుగా తెలుగు కవి కోరుకున్నదేమిటి? "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడెము". కన్నడ పద్యంలో "ఇంపు దంబులం" ఇక్కడ "కప్పురవిడెము" అయ్యింది. అవతల భార్య తన రాకకై వేచి చూస్తోంది. ఇతను రాకపోయేటప్పటికి తన చెలికత్తె ఒకర్తికి  తాంబూలాన్ని యిచ్చి దూతగా పంపింది. కప్పురవిడెము పంపడంలోని ఆంతర్యం రసజ్ఞులు గ్రహించగలరు. కన్నడ పద్యంలో ఉటంకించిన "నిరంతర గృహనిశ్చిత స్థితి", "సత్కళత్ర సాదరత" అనే అంశాలిందులో ఎంత చక్కగా ధ్వనిస్తున్నాయో గమనించండి.  ధ్వని కలిగినదే మంచి కవిత్వం. ఇక, కన్నడ పద్యంలోని "ఒళ్ళు ఉణిసి" అంటే మంచి భోజనం, తెలుగులో "ఆత్మకింపయిన భోజన" మయింది. కన్నడంలోని "విచారక సంగతి", తెలుగులో "ఒప్పు తప్పరయు రసజ్ఞు" లయ్యారు. కేవలం విచారణ, విశ్లేషణ ఉంటే సరిపోదు. ఒప్పు తప్పులు తెలిస్తే చాలదు. వారు రసజ్ఞలై ఉండాలి. లేదంటే ప్రతి దానికీ ఏదో ఒక నెరసు చూపిస్తూ కవిత్వాన్ని బొత్తిగా ఆస్వాదించలేని వారవుతారు. భాస్కరశతకంలో "చదువది ఎంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. కవిత్వాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞత చాలా ముఖ్యం. అలాగే, కన్నడంలో "లేఖకవాచక సంగ్రహం", తెలుగులో "ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము" లయ్యారు. వట్టి లేఖక వాచక సంగ్రహ ముంటే చాలదు. వాళ్ళు ఎలాంటి వారై ఉండాలో మన తెలుగు కవి చెపుతున్నాడు. వాళ్ళు ఊహ తెలియగల వారై ఉండాలి. ఇది చాలా విశేషమైన అంశం. ఆ రోజులలో కవికి లేఖకులుండేవారు. కవి చెపుతూ ఉంటే పక్కనే కూర్చొని ఒక వ్రాయసకాడు దానిని తాళపత్రాలమీద లిఖించేవాడు.  ఆధునిక కాలంలో కూడా విశ్వనాథ వారికి యిలానే లేఖకులుండేవారు. కవితాధార అవిశ్రాంతంగా సాగుతూ ఉంటే దాన్ని అంత వేగంగానూ లేఖకుడు  పట్టుకొని వ్రాయాలంటే మరి ఆ లేఖకునికి కవి చెపుతున్న విషయమ్మీద చక్కటి అవగాహన ఉండాలి. పైగా మధ్యలో ఏదైనా ఒకచోట ఆ వేగాన్ని అందుకోలేకపోతే, అక్కడ కవి చెప్పినది ఏమిటో ఊహించగలిగే ప్రజ్ఞ ఉండాలి. లేదంటే కుంటినడకే అవుతుంది. కవిత్వం ధ్వని ప్రధానం కాబట్టి, దాన్ని చదివే పాఠకులకి కూడా అందులోని ధ్వని గ్రహించ గలిగే ఊహశక్తి ఉండాలి. లేకపోతే ఎంత గొప్ప కవిత్వం రాసీ ఏమిటి ప్రయోజనం? అందుకే ఇవన్నీ దొరికితే తప్ప లేకపోతే కవిత్వం వస్తుందయ్యా అంటున్నాడీ కవి. దాన్ని సొగసైన తెలుగు నుడికారంలో చెపుతున్నాడు "ఊరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే!" అని.

పాతకాలపు కవిత్వాన్ని నిరసించేందుకు కొంతమంది యీ పద్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు.
"ఏకాంతము, చెలికత్తె తెచ్చి యిచ్చిన కర్పూర తాంబూలమూ, ఉయ్యాల మంచమూ, మంచి భోజనమూ - కవిత్వం రాయాలంటే యివన్నీ కావలట! ఇదేమి కవిత్వం, వట్టి భోగపు కవిత్వం." అని పెదవి విరుస్తూ ఉంటారు. నిజమే, ఆ కాలంలో వచ్చినది  చాలా వరకూ కడుపునిండిన కవిత్వమే. మరి ఆ పద్యంలో తర్వాత చెప్పినవాటి సంగతేమిటి? తప్పొప్పులు తెలిసిన రసజ్ఞులు, ఊహ తెలిసిన లేఖక పాఠకులు. ఏ కాలాంలోనైనా మంచి కవిత్వం రావడానికి అవసరమైనవే కదా యివి. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనకి నచ్చిన కవి, మనకి నచ్చిన అంశాన్ని గూర్చి ఏది రాసినా దాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడమూ, కానప్పుడు అథః పాతాళానికి తొక్కెయ్యడమూ రసజ్ఞత అనిపించుకుంటుందా? అలా చేసినప్పుడు మంచి కవిత్వం వస్తుందా? ఇప్పటి విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలివి. ఈ కాలంలో "లేఖకులు" లేరు. కాని వారి స్థానంలో యిప్పుడు ప్రచురణకర్తలున్నారు. సంపాదకులున్నారు. వాళ్ళకుండాల్సిన లక్షణం "ఊహ తెలియడం". ఇక పాఠకుల సంగతి సరేసరి! ఇక్కడొక అనుమానం రావచ్చు. కవిత్వం అనేది కవి వ్యక్తిగత విషయం. పాఠకులూ, విమర్శకులూ, సంపాదకులూ బయటవారు. కవి తనకోసం రాసుకుంటాడు కాని వీళ్ళకోసం కాదు కదా. అందువల్ల, ఒక కవి మంచి కవిత్వాన్ని రాయగలగడానికి వీరంతా ఎందుకూ? - అని. నిజమే, ఇక్కడ చెప్పినదాన్ని ఒక కవికి వ్యక్తిగతంగా అన్వయించడం అంత సమంజసం కాదు. సామాజికంగా అన్వయించుకోవాలి. అంటే, ఒక భాషలో, సమాజం నుండి మంచి కవిత్వం రావాలీ అంటే, ఆ భాషాసమాజంలో రసజ్ఞులైన విమర్శకులు, ఊహ తెలిసిన పాఠకులు సంపాదకులు తప్పకుండా ఉండాలి. మంచి కవిత్వానికి గుర్తింపు, ప్రచారం లభించినప్పుడే అది సమాజంలో నిలుస్తుంది. ఆ బాధ్యత, పైన చెప్పిన ముగ్గురిదీ. ఈ పద్యం మనకా విషయాన్ని గుర్తు చేస్తుంది.

ఇదీ మన తెలుగుపద్యం గొప్పదనం. మరో సంగతి మీరు గమనించారో లేదో. కన్నడ పద్యానికి యతి నియమం లేదు! ప్రాస ఒక్కటే ఉంది. తెలుగుపద్యానికి రెండూ ఉన్నాయి. అయినా తెలుగుపద్యం ఇంత కవితాత్మకంగా ఉందంటే దాని అర్థమేమిటి? వ్రాసే సత్తా  ఉండాలే కాని, మంచి కవిత్వం పుట్టించేందుకు యతిప్రాసల నియమాలు బంధకం కావనే కదా. నిజానికీ యతిప్రాసలు, అభివ్యక్తిలో పద్య నిర్మాణంలో కొత్తదనం కోసం కవిని ఆలోచింపజేసే ఉపకరణాలని నా అభిప్రాయం. ఆ సాధన చేసే ఓర్పు నేర్పు కవికి అవసరం. మంచి కవిత్వం అప్పుడే పండుతుంది.

12 comments:

 1. చాలా మంచి వ్యాసం. (కన్నడంలో యతిస్థానం పదవిశ్రామం కావాలనో యేదో విన్నట్లు గుర్తు. కాని మీరుటంకించిన కన్నడపద్యంలో అటువంటి నియమం కనిపించలేదు మొదటిపాదంలో)యతిప్రాసలు, అభివ్యక్తిలో పద్య నిర్మాణంలో కొత్తదనం కోసం కవిని ఆలోచింపజేసే ఉపకరణాలన్న మీ అభిప్రాయం సమంజసం.

  ReplyDelete
 2. చాలా బాగున్నది

  ReplyDelete
 3. ఆర్యా! నమస్తే.
  ఈ క్రింది లింక్ తెరచి, చదివి, ఔత్సాహికులైన మీ బ్లాగ్ పాఠకులకు తెలియడం కోసం మీ బ్లాగులో ప్రకటిస్తే బాగుంటుందేమోనని భావిస్తున్నాను.
  నమస్తే.
  http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

  ReplyDelete
 4. అనువుగ ప్రక్కటింటి నగ నప్పుగదెచ్చి యలంకరించె పె
  ద్దన తలమానికంబగు నిదర్శనమేర్పడ తెన్గుయోషితన్
  మణిమయ రత్నభూషణము నవ్విధి మేన ధరించి పెద్దనా
  ర్యుని చలువన్ కడుంగడు మెఱుంగులుబొంది తెనుంగుజాణ తా
  నె నగకు వన్నెతెచ్చి తని నిక్కులుపోవ గ్రహించి కన్నడిం
  చెనొ పొరుగింతి పండితవిశిష్టులు కన్నడసేయ కుందెనో

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. కామేశ్వరరావుగారు, కన్నడపద్యమును తెలుగుపద్యముతో పోల్చిచూచి కన్నడీయులు ఏమి ఊహిస్తారో అని ఆలోచిస్తే పుట్టిన పద్యము.
  అయితే, కొద్దినెలల క్రితము నా కన్నడ స్నేహితునికి మూలపద్యం వినిపించాను కానీ ఈ కాలంలో ప్రాచీనకన్నడము అర్థముచేసుకోవడం నావల్ల కాదని తేల్చేసాడు :-)

  ReplyDelete
 7. SRI KAMESVARA RAO GARU...
  NAMASTHE...
  I AM REGLARLY SEEING YOUR POST
  I WANT TO PARTICIPATE ..
  BUT DON'T KNOW HOW TO WRITE IN
  TELUGU LIPI..
  SOON I SHALL ALSO JOIN ..
  THANK YOU..
  --INDRAKANTI PINAKAPANI

  ReplyDelete
 8. పినాకపాణిగారు,

  నమస్తే. నా బ్లాగుపై మీ ఆసక్తి చాలా సంతోషం. తెలుగు లిపిలో వ్రాయడానికి చాలా పరికరాలున్నాయండి. ఈ సైటు చూడండి: http://lekhini.org/. ఇంగ్లీషు లిపిలో తెలుగు వ్రాస్తే, అది తెలుగు లిపిలోకి మారుతుంది.

  ReplyDelete
 9. వ్యాఖ్యలు వ్రాసినందరికీ ధన్యవాదాలు.
  గిరిగారు, మొత్తానికి కన్నడీకుల కన్నడింపుకూడా తెలుగుపద్యంలోనే చెప్పాల్సి వచ్చిందన్న మాట :) ఈ కన్నడ పద్యం గురించి నేను గూగుల్లో వెతికితే విడిగా ఎక్కడా కనపడలేదు. తెలుగుపద్యం ప్రస్తావించిన కొన్నిచోట్ల మాత్రమే కనిపించింది. మన తెలుగుపద్యం మాత్రం చాలా చోట్ల కనిపించింది. చిన్నపాటి గర్వంతో ఛాతీ కాస్తంత ఉబ్బింది :)

  ReplyDelete
 10. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా!
  పద్యము గురించి నేను వ్రాసిన పద్యమును తిలకించండి:

  పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
  సాద్భుత రచనా మహత్వ ఫలము
  పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
  వీచీవిలోల కవిత్వ మయము
  పద్యమ్ము సముచిత పదగుంఫనోపేత
  రసవిశేష పటుత్వ రాజితమ్ము
  పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
  బాహుళ్య రుచిర సంపల్లలితము
  సాహితీ నందనోద్యాన జనిత పారి
  జాత సుమధుర సౌరభ సార కలిత
  పద్యము మనోహరాకార వైభవమ్ము
  భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి

  (ఇందులో మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ అనే విషయాలను -- ఓం, ఐం, హ్రీం, శ్రీం లను ప్రస్తావించుట జరిగినది.) స్వస్తి.

  ReplyDelete
 11. పద్యము గురించి వ్రాసిన పద్యం మనోహరం.

  ReplyDelete