తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, December 23, 2010

ఖడ్గసృష్టి

శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" పుస్తకం పేరు చాలామంది వినే ఉంటారు. ఆ పేరు వెనక ఒక పద్యం ఉందని ఎంతమందికి తెలుసు? ఆ పుస్తకం చదివిన వాళ్ళకి బహుశా తెలియవచ్చు. పుస్తకం మొదట్లోనే ఆ పద్యం ఉంటుంది. ఆ పద్యం ఇది:

గరళపు ముద్ద లోహ; మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్;
హరు నయనాగ్ని కొల్మి; ఉరగాధిపు కోరలు పట్టకార్లు; ది
క్కరటి శిరంబు దాయి; లయకారుడు కమ్మరి - వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్

ఒక ఖడ్గ సృష్టిని (కత్తి తయారీ విధానాన్ని) వర్ణించే పద్యమిది. కత్తి తయారికీ కావలసినవేమిటి - ముడిసరుకు లోహం (అంటే ఇనుములాంటి గట్టి మెటల్), దాన్ని అచ్చుపోసి బాగా కాల్చడానికి కొలిమి, కొలిమిలో కాల్చేటప్పుడు పట్టుకోడానికి పెద్ద పెద్ద పట్టకార్లు, ఒక దాయి, పెద్ద సమ్మెట. కాలుస్తూ, కత్తిని సాపు చెయ్యడానికి దాయి (ఇనప దిమ్మ) మీద పెట్టి, దాన్ని సమ్మెటలతో (పెద్ద సుత్తులు) దభీ దభీమని మోదుతారు. ఖణేల్ ఖణేల్ మంటు చప్పుడవుతుంది. సరే ఇదంతా చేసే కమ్మరి కూడా కావాలి కదా!

ఇక్కడ చెపుతున్న కత్తిని తయారు చెయ్యడానికి ఇవన్నీ ఎలా సమకూరాయో కవి చెపుతున్నాడు. లయకారుడయిన శివుడే స్వయానా ఈ కత్తిని తయారుచేసాడట! అతని దగ్గర ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయంటే - లోహమేమో గరళపు ముద్ద, అంటే ముద్దగా చేసిన కాలకూట విషం! దద్దరిల్లుతూ కోట్లకొలదిగా పడే పిడుగులు సమ్మెటలు. హరుని నిప్పుకన్నే మండే కొలిమి. ఉరగాధిపుడంటే పాములరాజైన వాసుకి (శివుడి మెడలో ఉండేది ఇతడే). ఆ వాసుకి కోరలు పట్టకార్లట. ఎనిమిది దిక్కులా భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తూంటాయని అంటారు కదా! వాటినే దిగ్గజాలంటారు. అలాంటి ఒక దిగ్గజం తల దాయిగా మారింది. ఈ సామాగ్రి అంతటితో లయకారుడయిన హరుడే కమ్మరిగా ఆ ఖడ్గాన్ని సృష్టించాడట. అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! ఇంతకీ ఎవరిదీ ఖడ్గం అంటే, శత్రు రాజులను సంహరించే గుణంతో శోభిల్లే మైలమ భీమునిదట. మైలమ భీముని ఖడ్గం ఎంత శక్తివంతమయినదో, శత్రువులపాలిట ఎలా మృత్యుసమానమయినదో ధ్వనించే పద్యమిది. చదవగానే ఒళ్ళు గగుర్పొడిచేలా లేదూ! తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! ఈ భీషణ వాక్కు వేములవాడ భీమకవిది.

వేములవాడ భీమకవి పదకొండవ శతాబ్దానికి చెందిన కవి. దక్షారామ భీమేశ్వరుని కొలిచి, అతని చేత నిగ్రహానుగ్రహ శక్తి కలిగిన వాక్కును సంపాదించాడని కథ. ఇతని కావ్యాలేవీ దొరకలేదు కాని ఇతనివిగా చెప్పబడుతున్న ఒక 53 పద్యాలు మాత్రం లభించాయి. ఇందులో చాలా వరకూ చాటువులే. ఒకో చాటువుకీ ఒకో కథ! తిట్టు కవిత్వంలో ఇతడు మహా దిట్ట. బహుశా చిన్నతనంనుండీ ఎదుర్కున్న
ఈసడింపే (తండ్రిలేని బిడ్డ కావడాన) అతని వాక్పారుష్యానికి కారణమని ఒక ఊహ. చాటుపద్యాలయినా, వాటిలో చిక్కని ధార, తళుక్కున మెరిసే భావాలు కనిపిస్తాయి. ఇతను దేశ సంచారం చేస్తూ ఎందరో రాజులని దర్శించినట్టుగా అతని చాటువుల వల్ల తెలుస్తుంది. భీమకవి ప్రభావం శ్రీనాథుని మీద చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. భీమకవిలాగానే శ్రీనాథుడుకూడా దేశసంచారం చేసి వివిధ రాజాస్థానాలని దర్శించినవాడు. అతని మాదిరిగా శ్రీనాథుడుకూడా ఎన్నో చాటువులు చెప్పాడు. అతని కవిత్వ ధార కూడా శ్రీనాథుని బాగా ఆకట్టుకున్నట్టుగా ఉంది. "వచియింతు వేములవాడ భీముని భంగి నుద్దండ లీల నొక్కొక్క మాటు" అని చెప్పుకున్నాడు!

భీమకవి దర్శించిన రాజులలో మైలమ భీముడు ఒకడు. భీమకవికి మైలమ భీమునితో చాలా మైత్రి కలిగింది. మైలమ భీముడు విజయనగర (అంటే రాయల విజయనగరం కాదు, గజపతుల విజయనగరం, మా ఇజీనారం :-) రాజులయిన పూసపాటివారికి పూర్వీకుడు. "ఏరువ భీమ", "భండన భీమ", "చిక్క భీమ" అనే మొదలయిన పేర్లున్నాయితనికి. దేవవర్మకీ మైలమదేవికీ జన్మించినవాడు మైలమ భీమన. ఇతను చాలా పరాక్రమశాలి, సాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు "పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి" అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఈ ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు. మరి ఇప్పుడది ఉందో లేదో నాకు తెలీదు!


పూర్తిగా చదవండి...

Sunday, December 5, 2010

వేటూరి పాట - ఒక "మాత్రా"కావ్యం

మొన్న కార్తీక సోమవారంనాడు పుణ్యంపురుషార్థం కలిసొస్తాయని నాకు బాగా ఇష్టమైన (ఆమాటకొస్తే ఎవరికిష్టం కాదు!) భక్త కన్నప్ప సినిమాలో కిరాతార్జునీయం పాటని నెట్లో వెతికి మరీ విన్నాను. మా చిన్నప్పుడీ పాట రేడియోలో ఉదయాన్నే భక్తిరంజని కార్యక్రమంలో చాలాసార్లు వచ్చేది, ముఖ్యంగా సోమవారాల నాడు. ఒకో దేవుడికి ఒకో రోజు ప్రత్యేకం కదా. అలా ఆ రోజు బట్టి ఆ దేవుడి పాటలు వేసేవారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు ఇలా. ఇదొక సినిమా పాటని, భక్త కన్నప్ప సినిమాలోదని తెలీని వయసునుండే ఈ పాటని వింటూ వచ్చాను. మనసులో అలా పట్టేసింది. ఇప్పుడు రేడియో భక్తిరంజని లేకపోయినా ఇంటర్నెట్టూ గూగులూ ఉన్నాయి కదా! కాబట్టి వెతికిపట్టుకొని వినగలిగాను. అప్పటి రేడియో కన్నా ఇప్పటి ఇంటర్నెట్ మెరుగైన ప్రసారసాధనం. అయితే దాన్ని వాడుకొనే బాధ్యత మాత్రం మనదే. ఉదయాన్నే రేడియో వేస్తే చాలు, ఎంపికచేసిన మంచి పాటలు మనకోసం వినిపించేవి. ఇప్పుడు వెతుక్కొని వేసుకోవలసిన బాధ్యత మనమీద పడింది.

ఈ పాటలో వేటూరి తన విశ్వరూపం చూపించారు. శివుడు కైలాసంలో తాండవమాడుతూంటే ఒక్కసారి ఆ కైలాసగిరి కంపించింది. అకాలప్రళయ జ్వాల కనిపించింది. అప్పుడేమయ్యిందో చూడండి:

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

పార్వతీదేవి నివ్వెరపోయింది, శివుని మొహమంతా నవ్వు పరచుకుంది - అని ఎంత సొగసుగా చెప్పాడు వేటూరి.

ఈ పాట నిజంగా ఒక కాప్స్యూల్ కావ్యమే. అయినా ఇది పాట కాని పద్యం కాదు కదా, తెలుగుపద్యంలో దీని గురించి ఎందుకు అని చొప్పదంటు ప్రశ్న వెయ్యొద్దు. నచ్చిన ఈ పాట గురించి నాకిక్కడ చెప్పాలనిపించింది చెపుతున్నానంతే. :-)

ఇంతకుముందు ఎప్పుడో నా బ్లాగులోనే చెప్పినట్టు, ఛందస్సన్నది పద్యాలకి పరిమితం కాదు. పాటల్లో కూడా ఛందస్సుంటుంది. అందులోనూ ఇది శివుని గురించిన పాటాయె. తనికెళ్ళ భరణిగారు అన్నట్టు, శివుడే ఒక యతి. గణాలు అతని చుట్టూ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పైగా అతను "లయ"కారుడు. జాగ్రత్తగా చూస్తే పై రెండు పాదాలూ ఇంచుమించు సీస పద్యపాదాలే, యతి మైత్రితో సహా! ఈ పాటలో చాలా చోట్ల ఈ సీసలక్షణాలే కనిపిస్తాయి. వేటూరికి ఛందోధర్మాలు ఎంతగా తెలుసో యీ పాట నిరూపిస్తుంది. ఎలాంటి గణాలు వేస్తే పాటకి ఎలాంటి నడక వస్తుంది, భావానికి తగిన నడక ఎలా రప్పించాలి అన్న విషయాల మీద ఎంతో శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే కాని ఇలా రాయలేరు. తాండవానికి తగిన తాళం "తకిటతక తకతకిట"తో మొదలుపెట్టారు పాటని. ఇది అయిదు మాత్రల గణాలు, 3-2/2-3 విరుపుతో సాగుతుంది. దీన్ని సంగీత భాషలో ఖండ చాపు అంటారనుకుంటా (సంగీతం తెలుసున్నవాళ్ళెవరైనా చెప్పాలి).

ఆ తర్వాత అర్జునుడు తపోదీక్షలో చూపిన ఉత్సాహాన్ని ధ్వనిస్తూ, "అతడే అతడే అర్జునుడూ" అని మొదలుపెట్టి, "అనితర సాధ్యము పాశుపతాస్త్రము" అంటూ పాటని పరుగులు తీయించారు. "తకధిం తకధిం", "తకధిమి తకధిమి" అనే తాళాలు (ఛందస్సులో చెప్పుకోవాలంటే, స, నల గణాలు) పరుగులాంటి నడకనిస్తాయి, పాటకైనా పద్యానికైనా. గజేంద్రమోక్షంలో "సిరికిం జెప్పడు" అని సగణంతో మొదలయ్యే పద్యం గుర్తు తెచ్చుకోండి. నాలుగు మాత్రల పదాలతో వచ్చే ఈ నడకని చతురస్ర గతి అంటారు. "UII, IUI, UU" కూడా నాలుగు మాత్రల గణాలే. కాని ఒకో దానికి ఒకో ప్రత్యేకత ఉంది. వేటూరి ఈ పాటలో వాడిన IIU, IIII మాత్రమే వీటిల్లో పరుగులాంటి నడకనిస్తాయి.

అలా పరిగెత్తిన పాట ఒక్కసారి మళ్ళీ శివుని రూపంలోని మార్పుని వర్ణించడం కోసం సీసపు తూగుని సంతరించుకుంటుంది. శివుని రూపాన్ని వర్ణించే ఆ పాదాలన్నీ ఇంచుమించుగా సీసపద్య పాదాల మొదటి భాగాలే! అయితే ఇందులో మరో గమ్మత్తుంది. సీసపద్యంలో ఇంద్రగాణాలు ఏవైనా రావచ్చు అంటే "నల, నగ, సల, భ, ర, త"లు. కాని ఇందులో నల, భ గణాలు నాలుగు మాత్రలు. మిగతావి అయిదు మాత్రలు. ఇక్కడ వచ్చేవన్నీ ఈ అయిదు మాత్రల గణాలే. అంటే మళ్ళీ ఖండ గతి. అయితే దీని నడక తకిట-తక అన్న విఱుపు లేకుండా తకధింత/తద్ధింత అనే వస్తుంది. నడకలోనే కాదు, భాషలో కూడా ఎంత తేడా చూపించారో వేటూరి. భావానికి అనుగుణమైన భాష. తాండవం దగ్గర సంస్కృత పదాల సమాసాల పొహళింపు చూపిస్తే, ఇక్కడ చక్కని జాను తెనుగు కనిపిస్తుంది. అంత శివుడూ ఎఱుకలవానిగా మారుతున్న సందర్భం కదా. ఎంతో నిసర్గ సుందరంగా ఉంటుందీ వర్ణన.

నెలవంక తలపాగ నెమలియీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి పారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా (ఎఱుక అంటే జ్ఞానం. సర్వజ్ఞుడైన శివుడు ఎఱుకలవానిగా మారాడు!)
తల్లిపార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

పై వర్ణన శ్రీనాథుని యీ సీసపద్యానికి ఏమాత్రం తీసిపోదు. (ఇంకా పైనుంటుందన్నా తప్పులేదు!)

వికటపాటల జటామకుటికా భారంబు
కఱకైన జుంజుఱు నెఱులు గాగ
జారు సుధాధామశకలావతంసంబు
పెడకొప్పుపైనుండు పీకెగాగ
ఘనలలాటంబున గనుపట్టు కనువిచ్చు
గైరికద్రవ తిలకంబు గాగ
భుజమధ్యమున గ్రాలు భుజగహారంబులు
గురిజపూసల గుబ్బసరులు గాగ

శంకరుండు కిరాతవేషంబు దాల్చి
యగజ చెంచెతయై తోడ నరుగుదేర
బాణి నోంకార దివ్యచాపము ధరించి
వచ్చె వివ్వచు వరతపోవనము కడకు

ఆ తర్వాత మూకాసురుడు వరాహరూపము ధరించి రావడం, అలా చిచ్చర పిడుగై వచ్చిన దాన్ని రెచ్చిన కోపంతో అర్జునుడు కొట్టడం, అది విలవిలలాడుతూ అసువులు వీడడం. ఆ పైన కిరాతార్జునుల వాదులాట, వాళ్ళ యుద్ధం, చివరికి తాడియెత్తు గాండీవంతో ముత్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపంతో అతిపవిత్రమైన శివుని తలని మోదేసరికి, ఆ దెబ్బకి శివుడు ప్రత్యక్షమవ్వడం. ఒకో సందర్భానికి ఒకో నడక, దానికి తగ్గ యతిప్రాసలతో - ఎన్నెన్ని హొయలు పోతుందో! మొత్తం జరుగుతున్న కథంతా మన కళ్ళకి కట్టేస్తుంది, మనసుకి పట్టేస్తుంది!

వేటూరీ నీకు మరోసారి జోహార్! పాట పూర్తి సాహిత్యం ఇదిగో. చదువుకొని, వింటూ చదువుకొని, చూస్తూ వింటూ చదువుకొని ఆనందించండి.

తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా (వికటమైన గంగ దూకిన జట అనే సంకెల గలవాడు అని)

హరిహరాంచిత కళా కలిత నిలగళా (ఇది సరిగా అర్థం కాలేదు!)
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా (దట్టని కాంతుల సమూహంతో వెలిగే నిటలమున్న చంద్రకళాధరుడు)

జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా

అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా

కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!

అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు

అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి యింద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు

నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా

చిచ్చరపిడుగై
వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి
చూసినంతనే, వేసినంతనే

తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ

కొట్టితి నేనని అర్జునుడూ, పడ
గొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడ
గొట్టిన వీరముతో నపుడు

వేట నాది, వేటు నాది
వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలు
మీటి పలికె శివుడూ

చేవ నాది, చేత నాది
చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కను
సైగ చేసె అర్జునుడు

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ

ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
(ఇక్కడ "ఘన" అంటే గొప్పది అనే అర్థమే కాకుండా మేఘం అన్న అర్థం కూడా వస్తుంది. మేఘంలాంటి ధనుస్సు ఉఱుములా ధ్వనిస్తూ బాణ వర్షాన్ని కురిపించింది అని అర్థం.)

చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె

అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!

జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల (అలోకంబౌ పెంజీకటికవ్వల నేకాకృతి వెల్గు!)
గంగకు నెలవై, కళ కాదరువై (కళకి అంటే చంద్రకళకి ఆదరువై అంటే ఆధారమైనదై)
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై (అఘము అంటే పాపం. లవిత్రము అంటే కొడవలి. కొడవలి గడ్డిని కోసినట్టు పాపాన్ని కోసేస్తుందని అర్థం!)
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా,
సృష్టి చెదరగా,

తాడి యెత్తు గాండీవముతో ము
త్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే

తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు

కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!


పూర్తిగా చదవండి...