తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, July 6, 2010

దీర్ఘ విరామం తర్వాత - "దీర్ఘ వాసరా"ల గురించి

ఈసారి బ్లాగుకి కాస్త సుదీర్ఘమైన విరామమే వచ్చింది! బ్లాగుకైతే దూరమయ్యాను కాని తెలుగు పద్యానికి కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పద్యాన్ని తలుచుకోకుండా రోజే గడవదు. అలా ఈ మధ్య తలచుకున్న పద్యం ఇది:

నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్

ఇది నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది. ప్రసిద్ధమైన పద్యమే. భారతం చదవకపోయినా, కన్యాశుల్కం చదివిన వారిక్కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది. కరటకశాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు. వెంకటేశం, "పొగచుట్టకు" పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ "నలదమయంతులిద్దరు" పద్యం చదవమంటాడు. మొదటి పాదం చదవగానే కరటకశాస్త్రి ఆపి, "మనఃప్రభవానల" అంటే అర్థం చెప్పమంటాడు వెంకటేశాన్ని. గుర్తుకొచ్చిందా?

అరణ్యపర్వంలో వచ్చే అనేక కథలలో నల మహారాజు కథ ఒకటి. ఇది కూడా చాలామందికి తెలిసిన కథే. ఇందులో హంస రాయబారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస, ప్రత్యుపకారంగా దమయంతిదగ్గరకి వెళ్ళి నలుణ్ణి గురించి గొప్పగా చెప్పి, నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే దమయంతి రూపవైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది. ఈ హంస రాయబర ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి, విరహితులౌతారు. ఆ విరహ బాధ తగ్గించుకోడానికి నానా తిప్పలూ పడతారు. వాటిని వర్ణించే పద్యం ఇది!

మనఃప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు, మన్మథుడు. మనఃప్రభవానలం - ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని. మన్మథ తాపం అన్న మాట. ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరూ. ఇక్కడ "మనః ప్రభవానల"లో "నః" యతి స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి. అలా అక్కడ, ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసుని ఎంతగా దహిస్తోందో చక్కగా తెలుస్తుంది.
"దీర్ఘవాసర నిశల్" - పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు. వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు. ఈ "దీర్ఘవాసరనిశల్" అనేది భలే అద్భుతమైన ప్రయోగం. చెపుతున్నది రాత్రుల గురించి. ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి. అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి. పగళ్ళు మాత్రం జీళ్ళపాకంలా సాగుతునే ఉన్నాయని. ఎందుకిలా జరుగుతోంది? దీనికి రెండు కారణాలు. ఒకటి అసలే విరహ తాపంతో ఉన్నారు. దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది! అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి. మరొక కారణం - వేసం కాలంలో (వసంత గ్రీష్మ ఋతువుల్లో) పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం తొందరగా అవుతుంది. సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి. కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవి కాలమని ధ్వనిస్తోంది. వేసవి కాలం విరహార్తులకి మరింత గడ్డు కాలం కదా! అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్న మాట. ఇదంతా "దీర్ఘవాసరనిశల్" అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య. అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది! సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చల్లనీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడిపారట - ఆ తాపాన్ని తట్టుకోలేక!

ఇంతకీ ఈ పద్యం ఈ మధ్యన గుర్తుకు రావడానికి కారణం, "దీర్ఘవాసర నిశల్" అన్న పదం. ఈ మధ్యనే ఆఫీసుపని మీద అమెరికాకి వచ్చాను. అందులోనూ అమెరికాలో పైన కెనడాకి దగ్గరగా ఉండే చోటు. తస్సాదియ్య "దీర్ఘవాసర నిశల్" అంటే ఏమిటో ఇక్కడకి వచ్చాక తెలిసివచ్చింది! ఇక్కడ ప్రస్తుతం వేసవి కాలం. ఉదయం అయిదు గంటలకే సూర్యోదయమైపోతుంది (నేనెప్పుడూ చూడలేదనుకోండి). రాత్రి(?) తొమ్మిదయ్యాక సూర్యాస్తమయం! అంటే ఉదయం అయిదునుంచీ రాత్రి(?) తొమ్మిది దాకా, పదహారు గంటలు పగలే నన్నమాట! పొడవైన పగళ్ళంటే ఇవి కదూ! చలికాలం వచ్చిందంటే ఎనిమిదింటి దాకా తెల్లవారదు. సాయంత్రం నాలుగింటికల్లా పొద్దుపోతుంది. ఇంత వైవిధ్యం మన దేశంలో ఉండదు. భారతదేశంలో ఉంటేనే నలదమయంతులకి అవి "దీర్ఘవాసర నిశల్" అనిపించాయే, అదే వాళ్ళు అమెరికాలో వేసంకాలం గడిపితే మరేమనిపించేదో! ఐతే ఇక్కడ ఎండకి మన ఎండంత తీక్ష్ణత ఉండదు కాబట్టి కాస్త నయమే :-) మన సూర్యుడు నిజంగా "ఖరకరుడే".

ఈ సందర్భంలోనే ఆముక్తమాల్యదలోని మరో పద్యం కూడా గుర్తుకు వచ్చింది. అద్భుతమైన ఊహ. రాయలంటేనే ఇలాంటి ఊహలకి పెట్టింది పేరు.

పడమరవెట్ట నయ్యుడుకు బ్రాశనమొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవి యాజ్ఞ మాటికిన్
ముడియిడ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్
జడను వహించె నాగ దివసంబులు దీర్ఘములయ్యె నత్తఱిన్

వేసం కాలంలో పగళ్ళు ఎంత పొడుగవుతాయో ముచ్చటించుకుంటున్నాం కదా. అలా ఎందుకవి పొడుగవుతాయో అన్నదానికి రాయల వారి ఊహ ఈ పద్యం. పగళ్ళెందుకు పొడుగవుతాయి? సూర్యుడు ఆకాశంలో తూర్పునుండి పడమరకి మెల్లగా ప్రయాణిస్తాడు కాబట్టి (ఇది ఊహ కాదు నిజమే!). సూర్యుడెందుకంత మెల్లగా ప్రయాణిస్తున్నాడు? సూర్యుడు రథమ్మీద కదా ప్రయాణం చేస్తాడు. ఆ రథానికి ఏడు గుఱ్ఱాలు. వాటికి పగ్గాలేమో పాములు. పాములు గాలిని భోంచేస్తాయి. వాటికి వాయుభుక్కులు, గాలిమేపరులు అని పేరు. వేసం కాలంలో పడమటినుండి గాలులు (ఎదురుగాలులన్న మాట) బాగా వేడిగా వీస్తున్నాయి. ఎవరైనా వేడన్నం తినగలరు కాని పొగలు క్రక్కుతూ నోరు కాలిపోయేట్టున్న అన్నాన్ని తినగలరా? లేదుకదా. అంచేత పాపం ఆ పాములకి ఆహారం లేకపోయింది. దానితో నీరసం వచ్చి వడలిపోయాయి. పట్టుతప్పి మాటిమాటికీ ఊడిపోతున్నాయి. వాటిని సరిచెయ్యమని సూర్యుడు చెపుతున్నాడు. సరిచెయ్యడానికి సూర్యుడి సారథి అనూరుడు (పిచ్చుకుంటు) మాటిమాటికీ రథాన్ని ఆపవలసి వస్తోంది. అంచేత ప్రయాణం మెల్లగా సాగుతోంది. కాబట్టి పగళ్ళు అంతసేపుంటున్నాయిట! ఏం ఊహ! ఇక్కడ అమెరికా సూర్యుడి పాములు మరీ నిస్సతువలై ఉన్నట్టున్నాయి :-) ఏకంగా పదహారు గంటలపాటు సాగుతోందతని ప్రయాణం!


పూర్తిగా చదవండి...