తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, June 29, 2009

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు...

మొన్న రవిగారు తన కామెంటుతో ఒక మంచి పద్యాన్ని గుర్తుచేసారు. తీగలాగారు - డొంకంతా కదిలింది!

తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది. తెలుగు కవిత్వమ్మీద ఆసక్తీ అభిమానం ఉన్నవారెవరైనా తప్పకుండా చదివి తీరాల్సిన కావ్యం విరాటపర్వం. అవును తిక్కన తీర్చిదిద్దిన విరాటపర్వం అచ్చంగా ఒక కావ్యమే!

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు

నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు

ముందు యీ పద్యాన్ని ఇక్కడ ఘంటసాల శ్రావ్యమైన గొంతులో వినండి. తర్వాత మీదైన గొంతుతో ఎలుగెత్తి కొన్ని సార్లు చదువుకోండి/పాడుకోండి. మన పద్య కవిత్వం మనలో మనం మౌనంగా చదువుకోడానికి కాదు. వినడానికీ, పాడుకోడానికీను. ఇలా గొంతెత్తి పాడితే అది మీ నోటికీ, గొంతుకీ, శ్వాసకీ మంచి ఎక్సర్సైజు కూడాను! నా మాట నమ్మండి.

అయ్యిందా? సరే, ఇప్పుడింక దీని అర్థ తాత్పర్యాలలోకి వెళదాం.

ఎవ్వాని వాకిట - ఎవని వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత, అడగు - అణగు (అణిగిపోతుందో)
అతని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.

ఎవ్వాని చారిత్రము - ఎవని చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో

ఎవ్వని కడకంట - ఎవని కనుతుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే, చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో

ఎవ్వాని గుణలతలు - ఎవని గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.

అతడు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు

అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఈ చాంతాడు సమాసం ఎందుకో ఈపాటికి అందరూ గ్రహించే ఉంటారు. ఇందులో అందమంతా పొహళింపులోనూ, ఆ కుదింపులోనూ ఉంది. మామూలు వాక్యాలలో చెప్పాలంటే అవసరమయ్యే విభక్తి ప్రత్యయాలు సమాసాల్లో అదృశ్యమైపొతాయి. క్రియలు విశేషణాలుగా మారిపోతాయి. "మహా ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము" - మామూలు భాషలో చెప్పాలంటే "మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది" అని చెప్పాలి. సమాసంలో అన్ని పదాల అవసరం ఉండదు. పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది. కవిత్వం తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది.

ఇంతకీ ఎవరితను? కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాకు కొడుకైన యుధిష్టిరుడు. పాండవుల్లో పెద్దతను. ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా? కాదు. అని ఒక అర్థం. ఇతను సాధారణ మనిషా? కాదు, స్వయానా యమధర్మ రాజు కొడుకు అని మరో అర్థం.

ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం యిది. సాధారణంగా ఎవరికీ ధర్మరాజంటే మంచి అభిప్రాయం ఉండదు. అది చాలా సహజం. కానీ యీ పద్యాన్ని చదివాక "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!" అనుకోక మానరెవరూ. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ వర్ణించాడు. మళ్ళి మూడవపాదం అతని సంపద, వైభవం. నాల్గవపాదం మళ్ళీ అతని కీర్తి ప్రసిద్ధి. ఇన్నీ అయ్యాక అసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసంలో దట్టించి చెప్పాడు. అది అతని ప్రతాపం. క్షత్రియులకి అతి ముఖ్యమైన గుణం. చివరాఖరికి అతను సాధారణ మానువుడే కాదు అని తేల్చేసాడు. అవును ఇన్నీ ఉంటే అతను మామూలు మనిషి అవుతాడా? పైగా దైవాంశ సంభూతుడు!

ఇదీ తిక్కన పద్యశిల్ప నైపుణ్యం. తీసుకున్నది సీస పద్యం. దానిలో ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తించాలి. పద్యం ఎలా ఎత్తుకుని ఎలా నడిపించి ఎలా ముగిస్తే అది వినేవాళ్ళ గుండెల్లో ముద్రపడిపోతుందో అలా నడిపించాడు. అందుకే యీ పద్యం అంత ప్రసిద్ది పొందింది.

సరే ఇంతకీ యీ పద్యాన్ని ఎవరు చెప్పారు? దీని కథా కమామీషు ఏమిటి? నర్తనశాల చూసినవాళ్ళు యిది బృహన్నల భీమ ద్రౌపదులకి చెపుతున్న పద్యమని అనుకుంటారు. ఆ సినిమాలో అక్కడ సన్నివేశానికి తగ్గట్టు అలా చూపించారు. కాని భారతంలో యీ పద్యం చెప్పింది బృహన్నల కాదు.

ద్రౌపది!

ఇది చదివుతున్న చాలామంది ఒక్కసారి కుర్చీల్లోంచి లేచే ఉంటారు! మరి ద్రౌపది ధర్మరాజు గురించి ఇంత గొప్పగా చెపుతుందని ఊహించడం కష్టమే కదా. అక్కడే ఉంది చమత్కారం. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?
సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:

"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు
గాన, బతుల విధమ కాక యే శైలూషి
గాననంగ రాదు కంక భట్ట

అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"

"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!

సరే ఇదంతా అయిపోయాక, తనలో రగులుతున్న బాధ తీరే మార్గమేదీ అని ఆలోచించి, భీమసేనుడికి చెప్పుకోడానికి వస్తుంది. కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది. తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. "మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ" అంటుంది. "ఇంతా జరిగాక మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూసావుగదా, ఇంక నేనేమనాలి?" అని నిలదీస్తుంది. నన్నా కీచకుడలా తనిన్నప్పుడు ధర్మరాజు ఎలా చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే నేనా కీచకుణ్ణీ విరటుణ్ణి కూడా అక్కడికక్కడే చంపేసేవాడినని, అదే జరిగితే మళ్ళీ మనం వనవాసానికి వెళ్ళాల్సి వచ్చేదనీ, అప్పుడందరూ ద్రౌపదినీ తననే తప్పుబట్టే వారనీ చెపుతాడు. అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని తిట్టకూడదని అంటాడు. అప్పుడు మళ్ళి ద్రౌపది అందుకుంటుంది. నేను పొందిన బాధలోనీ కోపంలోనీ అలా అన్నానే కాని నాకు ధర్మం తెలియక కాదు, ధర్మరాజు గొప్పదనం తెలియకా కాదు అంటుంది. ధర్మరాజు గుణగణాలని పొగడ్డం మొదలుపెడుతుంది. అప్పుడా వరసలో చెప్పిన పద్యమే యీ పైన చెప్పిన పద్యం.
ధర్మరాజుని పొగిడి ఊరుకోదు. అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది. ఆ తర్వాత వరుసగా భీమసేనణ్ణి, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనీ పేరుపేరునా పొగుడుతుంది. వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది. చివరికి తనంత దానికి వచ్చిన కష్టాలని చెప్పుకుంటుంది. అన్నీ అయ్యాక మళ్ళీ చివరాఖరికి ఏమిటంటుంది?

ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ
వలసె ధర్మతనూభవు వలన జేసి
దాయ లొడ్డిన మాయజూదంపుటురుల
బడి కులంబున కతడిప్పాటు దెచ్చె

ఇదీ ద్రౌపది వాక్పటిమ. ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ!

ఇంచుమించు ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే. కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా తీర్చిదిద్దాడు. సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి, పాండవులందరి గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే, దీనంతటికీ కారణం ధర్మరాజే అని ముగిస్తుంది. భీముడు ఆ తర్వాత మాట్లాడతాడు. కాని తెలుగు భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి. అది తిక్కన రచనలోని నేర్పు.

విరాటపర్వంలోని మరిన్ని ఆణిముత్యాలని ముందుముందు రుచిచూద్దాం!

మళ్ళీ చెపుతున్నాను. తెలుగు కవిత్వం అంటే ఆసక్తి అభిరుచి ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన కావ్యం తిక్కన విరాట పర్వం (ఆ మాటకొస్తే భారతమంతానూ!).


పూర్తిగా చదవండి...

Monday, June 22, 2009

తెలివి యొకింత లేనియెడ...

భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:

యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం
తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం:

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్

బహుశా యిది నాకు చాలాసార్లు అనుభవమయ్యింది కాబట్టి బాగా హత్తుకొని ఉంటుంది. చాలాసార్లు అనుభవం అయ్యిందంటే, ఎన్నిసార్లు అనుభవమైనా ఆ రోగం కుదరలేదని అర్థం! ఎప్పటికైనా కుదురుతుందనే ఆశ. నాలాగే యీ రోగం చాలామందికి ఉందన్న సంగతి తెలుసుకొని ఊరటపొందాలో మరింత బాధపడాలో మాత్రం తెలియటం లేదు. అందుకే సిసలైన తెలివిగలవాళ్ళు తక్కువైపోతున్నారు. నా అదృష్టం కొద్దీ యీ రోగంలేని ఆరోగ్యవంతులైన విజ్ఞుల సాంగత్యం నాకు కలిగింది.
ఇప్పటి Personality Development నిపుణులకి యీ శ్లోకాన్ని కాని వినిపిస్తే, "This is sheer inferiority complex of this poet" అని కొట్టిపారేస్తారేమో! "ఇలాటివి నువ్వు చదివి వంటపట్టించుకుంటే యిక నీ జన్మలో బాగుపడవు, జీవితంలో ముందుకి వెళ్ళలేవు" అని బెదరగొట్టే అవకాశమూ లేకపోలేదు. "ఇది పాచ్చింతకాయ పచ్చడి, యీ కాలంలో యిది పనికిరాదు. మనకి తెలిసింది గోరంతైనా తెలుసున్నది కొండంత అని చూపించుకోవాలి. చూపించుకోడమే కాదు అదే నిజమని నమ్మాలి కూడా. అవతలవాడసలు నీకన్నా తెలివైనవాడు ఎలా అవుతాడు?" ఇలా లెక్చరు మొదలుపెడతారు కూడా!
బహుశా ఇప్పుడున్న సమాజంలో "విజయం"(success) సాధించడానికి ఈ ధోరణి అవసరమే కావచ్చు. కాని ఎప్పుడైతే మనం మనకి సర్వం తెలుసు, లేదా మనకి తెలిసినది మనం విశ్వసించేదీ నూటికి నూరుపాళ్ళూ నిజం, మరొకళ్ళ దగ్గర మనమేదీ నేర్చుకోలేం అనే స్థితికి వస్తామో అప్పుడు బుద్ధిజీవిగా మనం చచ్చిపోయినట్టే అని నేననుకుంటాను. ఎందుకంటే మనిషి మెదడుకున్న అతి ముఖ్యమైన శక్తి నేరుచుకోవడం తెలుసుకోవడం (దీన్నే గ్రహణ శక్తి అంటారు). ఇది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండి వయసు మీదపడే కొద్దీ తగ్గుతుందంటారు. నా మనసెప్పుడూ ఆ పసితనాన్ని కోల్పోకూడదని నా కోరిక.

ఎప్పటి శ్లోకం ఇది! భర్తృహరి కాలం సరిగ్గా తెలియదు కాని ఉజ్జాయింపుగా రెండువేల సంవత్సరాల కిందటివాడనుకోవచ్చు. అప్పుడతను చెప్పిన సుభాషితాలు ఇన్నేళ్ళుగా ఎలా నిలిచాయి?! కాగితాలులేవే. పుస్తకాల ప్రచురణ లేదే. కంప్యూటర్లు లేవే. సీడీలు లేవే. వీటన్నిటికన్నా కూడా సమర్థవంతమైన టెక్నాలజీ ఒకటుంది. అది మనిషి మనసు. "సుకవి జీవించు ప్రజల నాలుకల మీద" అన్నారు కదా జాషువా. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి! ఇదే పద్ధతిలో మనకి చాలా సారస్వతం కొన్ని వేల యేళ్ళుగా ప్రసారమవుతూ వచ్చింది. ఈ పద్ధతివల్ల కలిగిన సిసలైన లాభం - ఈ చెప్పిన విషయాలని ప్రజలు తమ హృద్గతం చేసుకోడం. అంటే వీటిని మనసారా నమ్మి ఆచరించడం.
ఏ దేశానికైన సంస్కృతికైనా అయా దేశానికి లేదా సంస్కృతికి చెందిన పౌరులు ఆచరించవలసిన కొన్ని నీతి సూత్రాలు, నైతిక విలువలు (Moral values) ఉంటాయి. ఇవి కాలానుగుణంగా మార్పు చెందుతూ ఊండవచ్చు. కాని ఏ కాలంలోనైనా ఇవి ఉండకుండా పోవు. వీటిని ఆ ప్రజలందరి చేత ఎలా ఆచరింపజెయ్యాలి? ఇది చాలా కష్టమైన విషయం! మన సంస్కృతి కొన్నేళ్ళ క్రితం వరకూ దీనికోసం ఎంచుకున్న మార్గం సాంస్కృతిక ప్రచారం - ఇది ప్రధానంగా కళల ద్వారా, సంప్రదాయాల ద్వారా జరిగేది. ఈ నైతిక విలువలు ప్రజల జీవితంలో భాగమై పోయేవి. దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ నీత్రి సూత్రాలని పాటించని వాళ్ళు అరుదుగానే ఉండేవారని ఊహించవచ్చు.
సరే, ఇప్పుడు మనకా నీతి సూత్రాలు పనిచెయ్యవు. నిజమే! వీటన్నిటినీ కట్టకట్టి ఏ అరేబియా సముద్రంలోనో పడేద్దాం. మంచిది. ఇప్పుడు మన సమాజంలో మనం పాటించాల్సిన నీతి సూత్రాలేంటి? మనది సర్వ తంత్ర స్వతంత్ర దేశం. ఈ దేశ పౌరులుగా మన రాజ్యాంగానికి మనం బద్ధులమై ఉండాలి. మన రాజ్యాంగంలో Fundamental Duties అని ఉన్నాయని ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో చదువుకున్నాం. అంతకు మించి ఎందరికి వాటి గురించి తెలుసు? తెలిసినవాళ్ళు ఎంతమంది వాటిని పాటిస్తున్నారు? మనకి కావలసిందల్లా మనం చేసే పనులు చట్టబద్ధమా కాదా అని. అది తేల్చడానికి కోర్టులు! చట్టం నుంచి తప్పించుకోగలిగినంత వరకూ అందరూ దొరలే! ఇప్పుడు మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలో ప్రజలు తప్పులు చెయ్యకుండా ఉండేట్టు చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నమూ లేదు. తప్పు చేస్తే విచారించి శిక్షించడానికి తప్ప! తప్పు చేస్తే విచారించి శిక్షించాల్సిన వ్యవస్థ ఉండాలి, కాదనడం లేదు నేను. అది మనకి ఎప్పుడూ ఉంది. But that should be for exceptions. ఇప్పుడు నీతిగా బతక గలగడం ఒక exception అయి కూర్చుందే!
మనం నమ్మిన నీతిని ప్రజల మనసుల్లోకి వెళ్ళేలా చేసి, అది వారి జీవితంలో భాగం కాగలిగినప్పుడే దాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యడం సాధ్యం. లేని నాడు కోట్లకి కోట్లు రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఖర్చు పెడుతూనే ఉంటాం. వాటికి అందనంత ఎత్తులో అవినీతి ఎప్పుడూ తాండవం చేస్తూనే ఉంటుంది! దీనికి ప్రత్యామ్నాయం వెతకాలంటే మనం కళలనీ సాహిత్యాన్ని ఆశ్రయించాలి. వాటికున్న శక్తిని తక్కువ అంచనా వెయ్యడం సబబు కాదు. మొన్న మొన్న జాతీయోద్యమ కాలంలో ప్రజలలో దేశభక్తిని రగల్చడానికి ఇవి ఎంతగా సాయపడ్డాయో మనకి తెలుసు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు వయోజనవిద్య కుటుంబనియంత్రణ మొదలైన విషయాల ప్రచారానికి ప్రభుత్వం కళలని వాడుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది మధ్యలో ఎప్పుడో తెగిపోయింది. నీతిశతకాలకీ, వీథి భాగవతాలకీ, హరికథలకీ, నాటకాలకీ కాలం చెల్లిపోయింది సరే. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన "కళ" సినిమా. దీనిద్వారానైనా ఎందుకు మన ప్రభుత్వం ప్రచారం చెయ్యకూడదు? ఓ సినిమాలో ఓ పెద్ద హీరో తన మేనకోడలి హత్యకి ప్రతీకారంగా విలన్ని చంపాలనుకుంటాడు. ఒక హీరోయిన్ ఇది తప్పుకాదా అంటుంది. "అలనాడు రాముడు వాలిని చెట్టుచాటునుండి చంపాడు. అవసరమైనప్పుడు అలా చెయ్యడం న్యాయమే!", అని మన హీరోగారి జవాబు. దానికి జనాలు ఈలలూ చప్పట్లూనూ! చట్టవిరుద్ధమైన పనిని అంత బహిరంగంగా ప్రోత్సహిస్తున్న ఆ సినిమా అసలెలా సెన్సారవ్వకుండా విడుదలయ్యింది? అని నిలదీసేవాడు ఒక్కడూ లేడు. ఇది ఏదో ఒకటో రెండో సినిమాల్లో కనిపించే ధోరణి కాదే! మరి దీని గురించి ఒక్కడూ గొంతు పెగల్చడేం? రామాయణమ్మీద విరుచుకుపడమంటే మాత్రం మనకి అమితోత్సాహం!
ఇప్పటికీ మన దేశంలో ఒక సగటు పౌరునికి రక్షణకోసం ప్రభుత్వం ఖర్చుపెట్టే నిధులు అమెరికాలాంటి ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అనీ, అయినా మన దేశ పౌరుడికున్న భద్రత, ఆ ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువనీ అమర్త్య సేన్ చాలా స్పష్టంగా చెప్పారు. సాంస్కృతికంగా మనకున్న నైతిక విలువలే దీనికి కారణమై ఉండాలని కూడా అన్నారు. ఇప్పటికైనా ఈ విషయమై అందరూ కళ్ళు తెరిచి ఏదైనా చేస్తే బాగుంటుంది.

అబ్బో! పద్యాన్ని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాను. మనసు కోతి కాబట్టి అదెప్పుడూ శాఖాచంక్రమణం చేస్తూనే ఉంటుంది. సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, లక్ష్మణ కవి యీ శ్లోకానికి చేసిన అనువాదం నాకంతగా నచ్చలేదు. ఎందుకంటే మూల శ్లోకంలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలని అనువదించకుండా వదిలేశాడు.
ఒకటి: "గజ ఇవ మదాంధః". ఏనుగువలె మదాంధుడినయ్యాను అని. మదము అంటే రెండర్థాలున్నాయి. గర్వం అన్న అర్థం ఒకటైతే, ఏనుగు చెక్కిళ్ళనుంచి కారే ద్రవం అని మరో అర్థం. ఇక్కడ ఏనుగు పరంగా మదం అంటే రెండవ అర్థం వస్తుంది. తన పరంగా గర్వం అన్న అర్థం వస్తుంది. అందుకక్కడ ఏనుగుతో పోలిక సమంజసం. కాని అనువాదంలో ఆ పదం లేదు. అంచేత ఆ ఔచిత్యం లేదు.
రెండు: గర్వమనే జ్వరం పోయింది అని సంస్కృతంలో ఉంది. ఇది చాలా హృద్యమైన పోలిక. ఇది కూడా అనువాదంలో లోపించింది.
అయినా తెలుగు పద్యం చదువుకోడానికి హాయిగా ఉంది!


పూర్తిగా చదవండి...

Sunday, June 14, 2009

పద్యంతో లెక్కల మేజిక్!


నాకు పద్యాలంటే ఎలా ఇష్టమో లెక్కలంటేనూ అలాగే ఇష్టం. మనవాళ్ళు పద్యాలలో కవిత్వం సృష్టించినట్టే లెక్కలుకూడా చేసారు. లెక్కలతో మేజిక్కులు చేసారు. అలాటి ఒక లాజిక్ మేజిక్ ఇప్పుడు మీ కోసం.
ఈ కింద ఇచ్చిన పద్యం ఒకసారి చూడండి:

1. అరి భయంకర చక్ర కరి రక్ష సాగర చాయ శ్రీ కర్బురసాటి యుగళ
2. నాళీక సన్నిభ నయన యండజవాహ వాణీశజనక వైభవ బిడౌజ
4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష వర జటి స్తుత శౌరి వాసుదేవ
8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల పాప భుజంగమ పరమ గరుడ
16. దోష శైలేశ శచిదక్ష ద్రుహిణి హేళి

ఇది సీస పద్యం. కాకపోతే ఎత్తుగీతి తేటగీతిలో ఒక పాదమే ఉంది. ఇది విష్ణుమూర్తి స్తోత్రం. ప్రస్తుతం మనం లెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని అర్థ తాత్పర్యాలు పక్కన పెడదాం (కావలసిన వాళ్ళు ప్రయత్నించవచ్చు).
ఇంతకీ వీటి ముందున్న నెంబర్లేమిటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.

ఇప్పుడు మీరు తెలుగులో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకోండి. కాకపోతే చిన్న చిన్న కండిషన్లు. అచ్చుల్లో "అ" ఒకటే తలుచుకోవాలి. హల్లుల్లో "ఙ్", "ఞ్" తలుచుకోకూడదు. అల్ప ప్రాణాలకీ మహా ప్రాణాలకీ తేడా లేదు ("ప", "ఫ" ఒకే అక్షరం. "చ", "ఛ" ఒకటే అక్షరం. ఇలా అన్నమాట). అలాగే "ర", "ఱ" కి తేడా లేదు. గుణింతాలకీ తేడా లేదు ("ప", "పా", "పి"... అన్నీ ఒకటే).

సరే ఒక అక్షరం తలుచుకున్నారా? ఇప్పుడు మీరేం చెయ్యాలంటే, మీరు తలుచుకున్న అక్షరం ఏయే పాదాల్లో ఉన్నాదో గుర్తించండి. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు అసలు అక్షరమే లెక్క, వత్తులు కాదు. అంటే "ప్ర" అన్నది "ప" తలుచుకున్నప్పుడే లెక్కలోకి వస్తుంది, "ర" తలుచుకున్నప్పుడు కాదు. ఒక అక్షరం ఒకే పాదంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వచ్చినా అది ఒకసారే లెక్క. ఆయా పాదాలకి సంబంధించిన సంఖ్యలని కలపండి. ఆ వచ్చిన సంఖ్యని నాకు చెప్పండి. ఉదాహరణకి "డ" తలుచుకున్నారనుకోండి. అది రెండు నాలుగు పాదాల్లో ఉంది. వాటికి సంబంధించిన సంఖ్యలు 2, 8. 2+8 = 10. మీరు నాకు 10 అని చెప్పండి. అప్పుడు మీరు తలుచుకున్న అక్షరం "డ" అని నేను చెప్పేస్తాను. మీరు తలుచుకున్న అక్షరం సరిగ్గా నేను చెప్పేస్తానన్న మాట.

దీనికి నా దగ్గర కంప్యూటరు ప్రొగ్రాములాంటిది ఏదీ లేదు. ఒక్క రెండు వాక్యాలు గుర్తుంచుకుంటే చాలు. అవేవిటో తర్వాత చెప్తాను. ముందు ఆట మొదలుపెడదామా?

అక్షరం తలుచుకొని నెంబరు చెప్పండి. కాయ్ రాజా కాయ్!


పూర్తిగా చదవండి...

Wednesday, June 3, 2009

బాల రసాల...

బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.

మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:

బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.

చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!


పూర్తిగా చదవండి...