తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, June 3, 2009

బాల రసాల...

బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.

మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:

బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

ఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.

చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!

17 comments:

 1. హృద్యమంగా వుందండీ మీవిశ్లేషణ. నాతప్పులతడక పద్యం తొలగించి, కరెక్టు వెర్షను అక్కడ పెట్టుకుంటాను, మీరు అభ్యంతరం లేకపోతేనే. పూర్తి వివరణకి మీ బ్లాగుకి లింకు ఇస్తాను.
  - మాలతి

  ReplyDelete
 2. నిజానికి ఈ పద్యం అర్ధంకాకపోయినా చదువుకోడానికి బాగానే ఉంటుంది, ఆ పద్యం నడక అలా ఉందేమో!!

  గహనము = అడవి
  గగనము = ఆకాశం (అనుకుంటున్నాను?) (వాడుకలో కష్టంగా పని జరిగింది అనేదానికి కూడా గగనమైపోయింది అంటారు, అది ఏ అర్ధంలో అంటారో తెలీదు)

  ఏవరైనా హ కి బదులుగా గ పలికేవారుంటే అర్ధం చాలా మారిపోతుందికదా :-)

  ~సూర్యుడు :-)

  ReplyDelete
 3. సాలము - అంటే చెట్టు అన్నారు. సాధారణంగా, సాల అనే శబ్దం మద్ది (టేకు) చెట్టుకు వాడతారా అని నాకు అనుమానం.

  "వ్యూఢోరస్కో వృషస్కంధః సాలప్రాంశుః మహాభుజః" అని రాముణ్ణి వర్ణిస్తాడు నారదుడు బాలరామాయణంలో. "సాలప్రాంశుః" అంటే మద్దిచెట్టు లాగా పొడవైన వాడు (ప్రాంశు - పొడవు) అని అర్థం విన్నట్టు గుర్తు. (కేవలం పాఠం విన్నదే. నాకు సంస్కృతంలో అభినివేశం లేదని మనవి).

  ఈ చాటువు పోతన, బావమరిది శ్రీనాథునితో చెప్పాడని ఓ కథనం.

  ReplyDelete
 4. ఆల్కహాలికులైన నేమి అని శ్రీశ్రీ pun చేశారుట

  ReplyDelete
 5. నేను రాసింది ఇప్పుడే చూసుకున్నాను. రాసింది సరిగ్గానే వుంది కానీ పాదాలవిరుపు సరిగ్గా లేదు. ఇప్పుడు సరి చేసుకున్నాను. థాంక్స్

  ReplyDelete
 6. కామేశ్వర రావు గారూ,

  చాటూక్తుల గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది. చాటువుల గురించి మీరు మరింత వ్రాయాలి.

  రవి గారు,

  ఆ పద్యం బాల రామాయణం లోనిది కాదు. రఘు వంశం ప్రథమ సర్గలో కాళిదాసు దిలీపుని వర్ణిస్తూ వ్రాసింది. పూర్తి పద్యం ఇదీ:

  వ్యూఢో రస్కః వృషస్కంధః
  సాలప్రాంశుర్మహాభుజః
  ఆత్మ కర్మక్షమం దేహం
  క్షాత్రో ధర్మ ఇవాశ్రితః

  సాల వృక్షాలను సాల సాలములనొచ్చా! రామాయణమంతా ఈ సాల వృక్షాల ప్రసక్తి వస్తుంది. శ్రీలంకలో ఈ సాలవృక్షాలు లేవు కనుక శ్రీలంక ఆ లంక కాదని చరిత్ర కారుల వాదన.

  ReplyDelete
 7. సూర్యుడు గారు,

  కఠినమైనది, అసాధ్యమైనది అన్న అర్థాల్లో గగన కుసుమం, గగన చిత్రం అన్న మాటలు ఉన్నాయి. అది క్లుప్తమైపోయి గగనం అన్న మాట వాడుకలో నిలిచిందేమో.

  'హ' ను 'గ' గా పలకడానికి మేమున్నాము కదా:)

  ReplyDelete
 8. @ మాలతిగారు,
  తప్పకుండా. మీ పద్యంలో గహనాంతర తర్వాత "సీమల" పదం లోపించింది. అదొక్కటి సరిచేస్తే చాలు.

  @సూర్యుడుగారు @చంరమోహన్ గారు,
  "గగనము" "గహనము" ఒకలాగే ఉన్నా వాటి ధాతువులు వేరనుకుంటాను. "గం" (వెళ్ళడం) అనే ధాతువునుంచి వచ్చింది గగనం (దేవతలు, పక్షులు వెళ్ళే మార్గం గగనం). "గాహ్" అనే (కలచబడ్డం) ధాతువునుంచి వచ్చింది గహనం (జంతువులచే కలచివేయబడ్డది). గహనము అంటే చొరరానిది అనే వ్యుత్పత్తికూడా ఉంది. "గగన కుసుమం" లాంటి పదబంధాల్లో గగనం అంటే అందరానిది అనే అర్థం వస్తుంది.
  ఇవి రెండూ సంస్కృతం నుంచి వచ్చినవి కాబట్టి "హ గ యో రభేదః" అనే సూత్రం వీటికి వర్తించదు :-)

  @రవిగారు,
  అవును. సాలము అంటే మద్ది చెట్టు అనే అర్థం కూడా ఉంది.

  @ఉదం గారు,
  ఎ.గో.వా!:-)

  ReplyDelete
 9. చంద్ర మోహన్ గారు, సవరణకు ధన్యవాదాలు. పూర్తి పద్యం మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. :)

  ReplyDelete
 10. మళ్ళీ తప్పు! పూర్తి శ్లోకం...

  ReplyDelete
 11. కామేశ్వర రావు గారు :)

  చంద్ర మోహన్ గారు,
  భారతంలో కూడా అర్జనుడికి, కర్ణుడికి సాలప్రాంశు వర్ణనలున్నాయి.
  కర్ణుడి పద్యం ఈమాట లో ఇక్కడ: http://www.eemaata.com/em/issues/200901/1393.html

  ReplyDelete
 12. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి – “చాటు పద్య మణి మంజరి” లో కొంత వివరం దొరకవచ్చు. వీరి పుస్తకాలు, హైదరాబాదులో వేటూరి వారి పేరు మీదే ఉన్న ట్రస్టు ద్వారా ఇదివరలో దొరికేవి.

  అలాగే, జి. లలిత గారి – ” చాటు పద్య కవిత్వం” లో కూడ. వీరి పుస్తకాన్ని “క్వాలిటి పబ్లికేషన్స్ “,౨౯-౨-౩౯, (29-2-39) రామమందిరం వీధి, విజయవాడ ౫౨౦ ౦౦౨ వారు ప్రచురించారు. (౦866)2433261 / 9848415560

  ReplyDelete
 13. ప్రొఫెసర్ జి లలిత గారి పుస్తకం పేరు "తెలుగులో చాటు కవిత్వం" ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ప్రస్తుతం ఆ పుస్తకం బాగా చిరిగిపోయి హీనదశకు వచ్చేసింది. దాన్ని త్వరలో తిరిగి బైండు చేయించుకోవాలి.మళ్ళీ ఇంకోసారి చదవాలి వీలు చూసుకుని.

  ReplyDelete
 14. మీ బ్లాగు చాలా బాగుంది.
  మీ శ్రమకి విధ్వత్తుకి జోహార్లు
  నాలాంటి సామాన్యుడి బ్లాగు చూడగలరా.
  pothana-telugu-bhagavatham
  blogspot.com

  ReplyDelete