తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, December 31, 2008

కూర్మి గూర్చుగాత కొత్త ఏడు!


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఎప్పుడు తలచుకున్నా తలుచుకోకపోయినా కాలం గురించి కాల గమనం గురించి, ఇలా సంవత్సరాలు మారే సమయంలో తప్పక తలుచుకుంటాం. కొత్తపాళీగారి టపా చూడగానే నాకు దువ్వూరివారి పానశాలలోని ఈ పద్యాలు గుర్తుకొచ్చాయి:

కాల మహర్నిశం బనెడి కత్తెరతో భవ దాయురంబర
శ్రీల హరించు; మోముపయి జిల్కును దుమ్ముదుమార మేలొకో
జాలిపడంగ? నీ క్షణము సంతసమందుము; నీవు వోదు, నీ
రేలు బవళ్ళు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్

కాలం - రాత్రి పగలు రెండు భాగాలుగా కలిగిన కత్తెరలాంటిదిట. మన ఆయువనే బట్టనది కత్తిరిస్తూ పోతుంది! ఉమ్రఖయాముదో, దువ్వూరివారిదో కాని ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది!

గతము గతంబె యెన్నటికి కన్నుల గట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ! యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్య విషాదపాత్ర కీ
మతమున దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్

ఇదీ ఉమ్రఖయాము మతం!

కానలేము కాలపు మర్మ మేను నీవు;
ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబె మనకు!
తెరవెనుక నేను నీవను పొరపు గలదు
ఆ విభేదము తెరయెత్త నంతరించు!

సతము దత్త్వవిచారంబు సలిపిసలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారె?
నేడు నిన్నట్లు, రేపును నేటియట్లు
అందని ఫలంబు చేచాప నందుటెట్లు?


కాలాన్ని గురించి ఎంతమందో కవులు కవిత్వం రాసారు. ఎందరో తాత్వికులు చింతన చేసారు. అయినా అవన్నీ అసంపూర్ణాలే! ఎప్పటికప్పుడు కాలం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. కాలమెప్పుడూ నిత్య నూతనమైనదే!

యాదృఛ్చికంగా, ఈ మధ్యనే ఓ టపాకి రాసిన వ్యాఖ్యలో యోగిగారు Eliot కవిత తాలూకు ప్రస్తావన తీసుకువచ్చారు. యాదృఛ్చికమని ఎందుకన్నానంటే, అది Eliot రాసిన నాలుగు సుదీర్ఘ కవితల్లో ఒకటి. ఆ నాలుగు కవితలూ కూడా కాల తత్త్వాన్ని గురించినవే!
కొత్తపాళీగారు అన్నట్టు మన ఋషులు కాలాన్ని వర్తులంగా ఊహించారు. ఒక పరిధిలో ఆలోచిస్తే అది వర్తులమే. పగలు తర్వాత రాత్రి తర్వాత పగలు! కాని నిన్న పగలూ, నేటి పగలూ, రేపటి పగలూ వేరువేరు! Eliot కూడా కాలాన్ని వర్తులంగానే ఊహించాడు. కాలాన్ని గురించి ఇతను రాసిన ఆ నాలుగు కవితలూ చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు. చాలా చోట్ల అర్థమవ్వకపోయినా, ఆంతరంగికంగా ఉన్న ఒకానొక ప్రవాహ వేగంలో, కాలంలో లాగానే కొట్టుకుపోతాం. ఆసక్తి (దానితో పాటు కాసింత ఓపిక, కూసింత ధైర్యం :-) ఉంటే చదివే ప్రయత్నం చెయ్యొచ్చు!
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, Eliot కవితలో తనకిష్టమైన పంక్తులని యోగిగారు నన్ననువదించమని కోరారు. వారికి నామీద అంత నమ్మకం ఎందుకేర్పడిందో మరి! సరే నా ప్రయత్నం నేను చేసాను (ఛందోబద్ధమైన పద్యమే), దాన్నొక టపాలో పెడదామనుకున్నాను. ఇంతలో మరో అవిడియా వచ్చింది! అంతర్జాలంలో ఇంకా చాలామంది పద్య ప్రియులున్నారు కదా వాళ్ళకీ పద్య రచనలో ఒక అభ్యాసంగా ఇదిస్తే ఎలా ఉంటుంది అని. కొత్త సంవత్సరం పూటా ఒక పద్యాన్ని రాయడంలో మరింత తృప్తి ఉంటుంది కదా! మరింక ఆలస్యం దేనికి? పద్య రచనాసక్తులైన వాళ్ళందరూ ప్రయత్నించి, అనువదించి మీ మీ బ్లాగుల్లో టపా వెయ్యండిక. బ్లాగులేని వాళ్ళు ఈ మిషతోనైనా బ్లాగులు తెరిస్తే మరీ మంచిది:-)


We shall not cease from exploration
And the end of all our exploring
Will be to arrive where we started
And know the place for the first time


పూర్తిగా చదవండి...

Monday, December 29, 2008

కొండ-గోదారి, నేను

నదికి కొండకి స్నేహ మేనాటిదో కదా!
ఉరకలెత్తు నది నిరంతరము చెప్పు ఊసులెన్నొ.
వాటికి తలయూచలేదు కొండ,
కాని ఆగదు నది.
గొప్ప చెలిమి!

కొండపైనున్న ఓ చెట్టుకొమ్మ మీంచి
ఎగురుకొని వచ్చి,
నదికి ఊసేదొ చెప్పి
ఎగిరిపోయింది ఒక పిట్ట.
ఏమి కబురు
చెప్పి పంపించెనో?
ఎంత చిత్ర మైత్రి!

ఆ నిరంతర స్నేహాని కడ్డు తగిలి
వాటి ఏకాంత స్వేఛ్చని భంగపరిచి
ఇంగితము లేక అట విహరించుచున్న
వెఱ్ఱి స్వార్థము రూపైన వింత పశువు
నేను!
పూర్తిగా చదవండి...

Monday, December 8, 2008

రెండు పద్యాలూ, బోలెడన్ని జ్ఞాపకాలూ


అష్టావక్రగారి బ్లాగులో ఈ పద్యాన్ని గురించిన ప్రస్తావన చూసేసరికి నేనెక్కడికో వెళ్ళిపోయాను. జ్ఞాపకాల గుడుసుళ్ళు గుండ్రాలు గుండ్రాలుగా తిరిగి నన్నో పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాయి! అప్పట్లో ఇంటర్నెట్టంటే ఒక అద్భుతం! ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో తెలియని వ్యక్తులతో సంభాషణలు. వయసు, చదువు, పరపతీ - ఇలాటి భేదాలేవీ లేని, తెలీని ఒక కొత్త లోకం! ఉద్యోగంలో చేరిన కొత్త. ఇంటర్నెట్టు మరీ కొత్త. అప్పటికింకా యాహూ, గూగులు గుంపులేవీ లేవు. Mailing Lists అని ఉండేవి. వాటి గురించి తెలిసి ఇంక మనసూరుకుంటుందా! మనకిష్టమైన వాటికోసం అన్వేషణ. ఎలా తగిలిందో ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు కాని, వెదకబోయిన తీగ "తెలుసా" ("తెలుగు సాహిత్యా"నికి సంక్షిప్త రూపం) రూపంలో నా కాలికి తగిలింది. అప్పటికే ఆ గుంపుకి మూడేళ్ళ వయసు. ఎందరో హేమాహేమీలు (అప్పటికి వాళ్ళు హేమాహేమీలని నాకు తెలీదు!) జరిపే ఆసక్తికరమైన చర్చలూ, అంతుతెగని వాదనలూ, కొత్త సాహిత్యాన్ని గురించిన పరిచయాలూ - ఒకటా రెండా, అబ్బో అదొక మహత్తర సాహిత్య శాల. అదే నాకు పెద్ద పాఠశాలయ్యింది. దింగంబర కవిత్వం రుచిచూసినా, స్త్రీవాద కవిత్వాన్ని గురించి తెలుసుకున్నా, భాషాశాస్త్రంలో ఓనమాలు దిద్దుకున్నా అవన్నీ ఆ పాఠశాలలోనే! అన్నిటికీ మించి, పద్యసుమాల పరిమళం ఆ ఆవరణ అంతటా పరచుకునేది. మన పద్యసాహిత్యంలోని అందాలగూర్చి వివరించడమూ చర్చించడమూ అయితేనేమి, చమత్కార సమస్యాలూ పూరణలూ అయితేనేమి, స్వీయ కవిత్వాలయితేనేమి, ఛందో బందోబస్తులగురించిన వాడి వేడి చర్చలయితేనేమి ఆ గుంపులో ఎప్పుడూ పద్యాస్వాదన జరుగుతూనే ఉండేది. అదిగో అలాటి సందర్భంలోనే ఒకరు పంపిన యీ పద్యం నా కంటబడింది:


కాలము మారె; మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తే; జం
బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె; నం
ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ
తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!


ఇది దువ్వూరి రామిరెడ్డి పద్యం. ఈ పద్యాన్ని చదవగానే, ఎందుకో ఠక్కున మరో పద్యం గుర్తుకువచ్చింది. అది దాశరథి మహాంధ్రోదయంలోని పద్యం:

వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!

వెంటనే టకటకా టైపుచేసి పంపించేసాను. అదే అంతర్జాలంలో నా మొట్టమొదటి టపా! దీనితోనే నా అంతర్జాల ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. అప్పటి టపాలు ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవాళ్ళు యీ archives మధ్యలో పడితే, రత్నాకరంలో పడ్డట్టే :-)
ఎందుకీ పద్యం గుర్తుకువచ్చింది అనే ప్రశ్నకి అప్పుడు నేనిచ్చిన వివరణ:

దువ్వూరి, దాశరథి వారి యీ రెండు పద్యాలలో నాకు చాలా సామ్యము కనిపిస్తోంది.
రెండు పద్యాలూ ఆంధ్రుల దాస్యవిముక్తి గూర్చినవి. రెంటిలోనూ దానిని ఒక నవోదయంతో పోల్చడమే కాక, ఆ ఉదయ వర్ణన కూడా చాలా దగ్గరగా ఉంది. ఇద్దరూ సూర్య కిరణాలనీ, తామర మొగ్గలనీ కొత్త ఆశలకు, ఆలోచనలకు ప్రతీకగా చేసుకున్నారు. "రుధిర నిర్ఝరిపారె" అని దాశరథి అంటే, "రక్త దళ పద్మిని మోసిడి పూలు పూచె" అని కవికోకిల అంటారు. ఇద్దరి లోనూ విప్లవ ఛాయ గోచరిస్తుంది.

ఇది యథాతథంగా అప్పటి వివరణే అయినా, అప్పుడది ఉన్నది ఇంగ్లీషు(లిపి)లో. అప్పటికింకా తెలుగు ఫాంట్ల వినియోగం ఎక్కువగా లేదు. Rice Universityలోని కొంతమంది తెలుగువాళ్ళు తయారుచేసిన transliteration scheme, RTS అన్న పేరుతో చాలామంది వాడేవారు. ఇప్పటికీ చాలామంది వాడుతున్నారు. నా మొట్టమొదటి ఆ టపా రాసినప్పటికి నాకు దీనిగురించి కూడా తెలీదు! అప్పటికి చూసిన టపాల ఆధారంగా నాకు తోచిన transliteration schemeలో రాసేవాడిని. ఆ తర్వాత RTSగురించి తెలిసింది. RTS రాయడం చదవడం అలవాటై, కొన్నాళ్ళకి అనర్గళంగా ఇంగ్లీషులిపిలో(RTSలో) తెలుగు టైపు చెయ్యడం చదవడం వచ్చేసింది :-) తెలుగు మిత్రుల దగ్గర ఈ విద్యని ప్రదర్శించి వాళ్ళని ఆశ్చర్యపరచడం సరదాగా ఉండేది. ఆ తర్వాత సిరిగిన దంపతల ధర్మమా అని Telugu Lipi Editor వచ్చింది. నేను ఇంగ్లీషులిపిలో ఏ తెలుగు కవితో రాస్తే, అది వేరే వాళ్ళకి చదవడానికి వీలుగా తెలుగు ఫాంటులోకి తర్జుమా చేసి HTMLగానో imageగానో భద్రపరచే వీలు కల్పించింది తెలుగు లిపి. ఆ తర్వాత చాలా పరికరాలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రభారతివారి rts2pdf వాడేవాణ్ణి. ఇప్పటికీ pdfలో ఏదైనా భద్రపరచడానికి అది వాడుతూ ఉంటాను.

ఈ పదేళ్ళ ప్రయాణంలో, ఎన్నో పరిచయాలు. వాటిల్లో ప్రత్యక్ష పరిచయాలుగా మరినవి చాలా తక్కువే. ముఖాముఖీ కలుసుకోకుండా సంభాషించుకోవడం అదో ప్రత్యేకత! తెలుసా తర్వాత రచ్చబండ, ఛందస్సు గుంపులూ, ఈమాట పత్రికా, తెలుగు పీపుల్ డాట్ కాం, ఈ మధ్యనే పొద్దు, ఇతర అంతర్జాల పత్రికలూ - ఇలా సాగిన ప్రయాణం ప్రస్తుతానికి ఇదిగో యీ బ్లాగులవరకూ వచ్చింది. ఇంకా ముందుముందు ఎలాటి మలుపులు తిరగనుందో!
ఏదేమైనా, ఈ ప్రయాణంలో నేనెన్నో నేర్చుకోగలిగాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సాహిత్యంతో ఇప్పుడు నాకున్న అతి కొద్ది పరిచయం ఏర్పడడంలో అంతర్జాలం ముఖ్య పాత్ర నిర్వహించిందనడంలో ఏ మాత్రం సందేహమూ లేదు. దానికిగానూ అంతర్జాలానికీ, అందులో పాల్గొన్న (పాల్గొంటున్న) వ్యక్తులందరికీ యీ టపా ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

చూసేరా, నా జ్ఞాపకాలలో కొట్టుకుపోయి పద్యం గురించి మరిచే పోయాను! ఇది నాకు చాలా ఇష్టమైన పద్యం. ఉదయాన్ని మన కవులెంతమంది వర్ణించ లేదు! ఒక అభ్యుదయ కవి, విప్లవ స్ఫూర్తితో దర్శించిన ఉదయమిది. వెలుతురనే బాకుతో చిక్కని చీకటి రాత్రి గుండెలని చీల్చితే, అందులోంచి పారిన రక్తపుటేరు లాగా ఉందిట ఉదయాకాశం. ఆకాశంలో దిక్కులనే కాంతల ముఖాలమీద కుంకుమ కాంతులు విరిసాయట. కింద నేలపై అదే సమయానికి తామర మొగ్గలుకూడా విచ్చుకుంటాయి కదా. పైన ఆ కుంకుమ ప్రభలు కూడా, కిందనున్న తామర మొగ్గల్లానే ఉన్నాయిట! ఇంకేముంది తెల్లవారింది, తలుపులు తెరవండి, రండి, ఇంకా పడుకొని ఉన్నవాళ్ళందరినీ నిద్రలేపండి అని కవి పిలుపు. ఇక్కడ ఉదయమంటే అభ్యుదయం, స్వేఛ్చ. చిక్కని కాళరాత్రి - అజ్ఞానంతో నిండిన దాస్యం. దిగంగనల ముఖాలపై కుంకుమ కాంతులు, లోకానికి శుభం జరుగుతోందని సూచన. కవి ఇచ్చిన పిలుపు స్వేఛ్చా వాయువులని పీల్చి, అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యమని. ప్రకృతి వర్ణనలో, చెప్పదలచుకున్న విషయాన్ని ధ్వనింపచెయ్యడం మంచి కవిత్వం.
కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయిందా? నిజంగానే నిజమయ్యిందా? నిజమౌతుందా? ఇవి మనందరం ఆలోచించుకోవాలసిన ప్రశ్నలు...


పూర్తిగా చదవండి...