తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, February 24, 2009

ఇల్లరికపుటల్లుడు!


నిన్న చంద్రమోహన్ గారి బ్లాగులో శివుడు పార్వతి చేత మొట్టికాయ తిన్న సందర్భాన్ని చదివినప్పుడు, అదే హరవిలాసంలో మరో సందర్భం, మరో పద్యం గుర్తుకువచ్చింది.
శివపార్వతులు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొని చివరికి పెళ్ళిచేసుకున్నాక, శివుడు సపరివారంగా హిమగిరిపైనే, మావగారింటనే నివాసమున్నాడట. "శివుడికి తన భార్యంటే ఎంత ప్రేమో, అలా ఇల్లరికం ఉండిపోయాడు!" అని ఆశ్చర్యపడతాడు శ్రీనాథుడు. అయితే ఆ సంబడం ఎంతో కాలం సాగదు. కొన్నాళ్ళు గడిచాక అత్తమామమలకి అతనిమీద చిరాకు కలుగుతుంది.
ఏవండీ, అల్లుడు ఒక్కడే తమ ఇంట్లో ఉండి కార్యనిర్వాహకుడై అన్నీ చూసుకుంటూ ఉంటే ఏ అత్తమామలైనా ఎన్నాళైనా అతన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారు. విష్ణుమూర్తి మాత్రం ఇల్లరికపుటల్లుడు కాదూ! పాలకడలిపై శేషతల్పమున హాయిగా సంసారం సాగించుకుంటాడు కదా. అతనిమీద ఎప్పుడైనా సముద్రుడికి చిరాకు కలిగిందా? మరి హిమవంతుడికి శివుడిమీద ఎందుకొచ్చింది చిరాకు?
అసలే శివుడు బిక్షపతి! దానికి తోడు, తన పరివారాన్నంతా మావగారింత్లో దింపాడు. ఆ పరివారం ఎవరయ్యా? భూత పిశాచగణం, పశుగణమూను. వాళ్ళు చేసే భీభత్సం ఇక అంతా ఇంతానా! రాత్రీ పగలు కల్పలతాప్రసూన మాధ్వీకాన్ని తాగి తందనాలాడారు. ఇంకా చాలా చాలా గందరగోళం చేసారు. దానితో హిమవంతుడికి చిఱ్ఱెత్తుకొచ్చింది. రాదు మరీ! కానీ ఏం చేస్తాడు పాపం. తన కూతురు కోరి ప్రేమించి పెళ్ళిచేసుకున్న అల్లుడాయె! వెళ్ళి తన కూతురిదగ్గరే మొరపెట్టుకుంటాడు.
ఇలా శివుడి బంధుగణాన్నీ, శివుడినీ ఆక్షేపిస్తూ హిమవంతుడన్న మాటల్లో శివుడి ఆకారాన్ని వెక్కిరించే మాంచి అందమైన చమత్కార పద్యం ఒకటి మనకందించాడు శ్రీనాథుడు. అవధరించండి మరి:


తలమీద చదలేటి దరిమీల దినజేరు
కొంగలు చెలగి కొంగొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
భూతి మై జిలికిన బుస్సు రనగ

దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి
దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!

సీసమంటే శ్రీనాథుడే అన్నదానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. శ్రీనాథుడు సంస్కృతానికి "డు ము వు లు" చేర్చి తెలుగు పద్యాలు రాసేస్తాడనే వారికి ఇదో చురక. ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! ఆ ఎత్తుగడే ఎంత ఒయ్యారంగా ఉందో మరొక్కసారి చదివి అనుభవించండి!

శివుడు భిక్షకి వెళ్ళే సందర్భంలో ఎంత గోల గోలగా ఉంటుందో వర్ణిస్తున్నాడు.

తలమీద ఉన్న "చదల ఏరు"(అంటే ఆకాశ గంగ)లో దరిమీనులు (ఇవో రకం చేపలు) ఉన్నాయట! జుమ్మని ఎగసిపడే గంగలో చేపలేంటని చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దు. శివుడి తలే పెద్ద మడుగైపోయి ఉంటుంది. అందులో చేపలు చేరి ఈదులాడుకోవచ్చు కదా. వాటిని తినడానికి కొంగలతని తల చుట్టూ మూగుతున్నాయట. అవి "కొంగు కొంగు" అని చేసే గోల అంతా ఇంతానా!
మెడలోనేమో పుఱ్ఱెల మాల. శివుడు కదులుతూ ఉంటే, ఆ పుఱ్ఱెలు ఒకదానితో ఒకటి రాసుకుంటూ చేసే "బొణుగూ బొణుగూ"మనే శబ్దం ఒకటి. అంతేనా! కట్టుకున్న పులితోలు కొంగుచివర, శివుడెక్కి కూర్చున్న నందిని తాకుతూ ఉంటే అది చిరాకుతో (భయంతోనో) చిఱ్ఱుబుఱ్ఱు లాడుతోంది. చేతికి కడియాలుగా కట్టుకున్న పాములు, చేతిలో ఉన్న కకపాలలోని విభూది మీద తుళ్ళినప్పుడల్లా బుస్సు బుస్సు మంటున్నాయి. అంతా గోల గోల!
ఇంత గోలా అవుతూండగానే, "తమ్మిపూ చూలి" (అంటే పద్మంలోంచి పుట్టిన బ్రహ్మ) కపాలాన్ని ఓ చేత్తో పట్టుకొని భిక్షాందేహీ అంటూ వీధివీధి తిరిగి బిచ్చమెత్తుకొంటాడు. అలాటి ముష్టెత్తుకున్న కూడు తప్ప శివుడికి మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా?
పాపం ఎంతగా ఇబ్బందిపడ్డాడో ఆ హిమవంతుడు. లేకపోతే ఇంత ఘాటుగా తన కూతురిముందే అల్లుణ్ణి మరే మావైనా గేలిచేస్తాడా! శ్రీనాథుడికి శివుడంటే ఎంత చనువులేకపోతే ఇలాటి పద్యాలు రాయగలడు!

భక్తి, తత్త్వం, వేదాంతం, మతం ఇవన్నీ పక్కన పెట్టీండి. తమకి తెలియని, ఎన్నడూ చూడని, ఒక నిర్గుణ నిరాకార శక్తికి ఇలాటి అద్భుతమైన ఆకారాన్ని ఊహించిన కల్పనా ప్రతిభకి "ఆహా!" అనకుండా ఉండగలమా? ఒకవైపు నెలవంక, మరోవైపు నీటి బుగ్గ. నుదుటి మధ్య నిప్పు కన్ను. మెడ చుట్టూ పాములు. కట్టుకునేది పులితోలు లేదా ఏనుగుతోలు. ఒక చేత త్రిశూలం, మరో చేత ఢమరుకం. ఇలాటి కల్పన చేసినవాడు ఎంత గొప్ప కవి అయ్యుంటాడు! ఆ కల్పనకి తోడుగా మరెన్ని కథలు, ఎన్ని చమత్కారాలు, ఎన్ని కావ్యాలు!

శ్రీనాథా! నీ ఈ పద్యానికి కనకాభిషేకం చేసే శక్తి నాకు లేదు కాని, నా ఆనందాశ్రువులతో నీకు నా మనసులోనే అభిషేకం చేసాను అందుకోవయ్యా!


చిన్న ప్రశ్న: ఎత్తుగీతి చివరి పాదంలో యతి ఎలా సరిపోయిందో చెప్పుకోండి చూద్దాం?


పూర్తిగా చదవండి...

Monday, February 16, 2009

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు...


ఏడాదైపోతోంది కదా మూసని మారుద్దామని మొన్నీ మధ్యనే అనుకున్నాను, మార్చాను కూడా. కొత్త మూస గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో హఠాత్తుగా ఉప్పుకప్పురంబు పద్యం గుర్తుకు వచ్చింది. అరే ఈ పద్యాన్ని గురించి ఎప్పుడూ బ్లాగులో ప్రస్తావించనే లేదే అనిపించింది! తెలుగు పిల్లలందరూ మొట్టమొదట నేర్చుకొనే పద్యమాయె. దానికి సముచిత స్థానం కల్పించాలని బ్లాగు శీర్షికలో చేర్చాను.

తెలుగువాళ్ళకి ఈ పద్యం అర్థాన్ని చెప్పాల్సి వస్తే అంత కన్నా దుస్థితి మరొకటుండదు! ఇది అంత సులువైన పద్యం.

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ

అయితే ఇందులో ఒక చిన్న విశేషం దాగుంది. నా చిన్నప్పుడెవరో (మా అమ్మగారో, మా ముత్తాతగారో అయ్యుంటారు బహుశా) చెప్పినంత వరకూ నాకీ విషయం తెలీదు. ఒక రోజు నేనీ పద్యం చదువుతూ ఉంటే ఆపి, "ఒరేయ్, ఇక్కడ రుచి అంటే అర్థమేవిటిరా?" అని అడిగారు. చిన్నతనం కదా, వాళ్ళ వంక ఓ తేలిక చూపు విసిరుంటానా ప్రశ్నకి. "రుచి అంటే taste" అని అనుంటాను, అప్పటికే నే చదువుకుంటున్న ఇంగ్లీషు మీడియం పాండిత్యం వంటబట్టి ఉంటుంది (ఈ రోజుల్లో ఇలా తెలుగు పదాలకి ఇంగ్లీషర్థాలు చెప్పి పిల్లలకి బోధపరచడం సర్వసాధారణమైపోయిందనుకోండి!). నా సమాధానానికి ఒక చిరు మందహాసం చేసి, "పప్పులో కాలేసావ్"అన్నారు. నేను తికమక మొహం పెట్టుంటాను. "రుచి అంటే ఇక్కడ కాంతి అని అర్థం. కర్పూరానికి ఉప్పు కన్నా మెరుపెక్కువ" అని వివరణ. మనదసలే లాజిక్ బుఱ్ఱ, "రుచి అంటే కాంతి అని కూడా అర్థం ఉండి ఉండొచ్చు. కాని ఇక్కడ రుచి అంటే మాములు రుచి ఎందుకవ్వదూ?" అని పాయింటు లేవదీసుంటాను. "చూడ చూడ అన్నాడు కదా వేమన. పోని అది రుచి చూడ్డం అనుకుంటే, దాన్ని మరీ అంతగా పరిశీలించి, పరిశీలించి చూడక్కరలేదు. ఒకసారి రుచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలని చెప్పాడు కాబట్టి, అది దీక్షగా చూడ్డమే. అలా చూస్తే ఆ రెంటి మధ్యనున్న మెరుపులో తేడా తెలుస్తుంది. మామూలు కంటికి అది వెంటనే కనిపించకపోవచ్చు." అని ఓర్పుగా నాకు బోధపరిచారు.
ఇంతకీ పురుషులు, పుణ్యపురుషులు కూడా అంతే. చూడ్డానికి ఒకలాగే ఉంటారు. పరికించి చూస్తే వాళ్ళలోని భేదం కనిపిస్తుంది. ఈ తేడాని గమనించి తెలుసుకోడమే విచక్షణ.
ఆటవెలది పద్యాలు రాయాలనుకున్నవారికి వేమన పద్యాలు మంచి మూసని ప్రసాదిస్తాయి. వేమన పద్యాలన్నీ కంఠస్తం చేస్తే దాని నడక పట్టుబడుతుంది. అప్పుడు ఆటవెలది చేత అందంగా నాట్యం చేయించవచ్చు. ఆ నడక పట్టుబడకుండా రాద్దామని ప్రయత్నిస్తే బ్రేక్ డాన్సరు భరతనాట్యం చేసినట్టుంటుంది.
వేమన పద్యాలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. సంస్కృతంలో నాకు తెలిసిన ఒక అనువాదం శ్రీ శ్రీరామ దేశికన్ అనే అతనిది. ఉప్పుకప్పురంబు పద్యానికి వీరి సంస్కృత అనువాదం ఇది:

కర్పూరే లవణే చైవ రూపమేకం రుచిః పృథక్
తథైవ పుణ్యపురుషః పరస్మాత్ భిధ్యతే ధియా

నాకు సంస్కృతం రాదు కాబట్టి ఇది తెలుగు పద్యానికి ఎంత దగ్గరగా ఉందో చెప్పలేను కాని, ఇది అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ కూడా ఆటవెలదిలా చిన్న పద్యం. అందుకే ఆటవెలదిని అనువదించడానికి ఇది అనువైన ఛందస్సు.

వేమన పద్యాలకి ఒక రకమైన శాశ్వతత్వం కలగడానికి కారణం అవి చెప్పే విషయాలు కాలానికి నిలబడ్డం. అవి సార్వకాలికాలుగా అనిపిస్తాయి. ఉదాహరణకి ఈ "ఉప్పుకప్పురంబు" పద్యం ఈ ఇంటర్నెట్ యుగానికి కూడా ఎలా వర్తిస్తుందో చూడండి! మనకి ఇటీవల తెలుగు బ్లాగుల్లో ఐడీ తస్కరలు మొదలయ్యారు. వీళ్ళు రాసే కామెంటు అసలు వాళ్ళు రాసినట్టే కనిపిస్తుంది. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. కాని చూడ చూడ, జాగ్రత్తగా పరిశీలిస్తే తేడా గ్రహించ వచ్చు. Blogger icon కనపడకపోవడం లాంటివి బాహ్యమైన తేడాలు. అవికాదు ముఖ్యం. వాటిలో ఉండే కాంతి భేదం, రుచి భేదం అదీ ముఖ్యం! అసలువాళ్ళ కామెంట్లలో సంస్కారపు వెలుగుని చూడగలం. డూప్లికేటు వాళ్ళ కామెంట్లలో అది కొరవడుతుంది. విచక్షణ ఉన్న బ్లాగర్లు దీన్ని గుర్తించగలరు.
అంచేత ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, దొంగ ఐడీలతో రాసే వ్యాఖ్యలని ఇట్టే పసిగట్ట వచ్చు. ఈ పద్యం అర్థం చేసుకుంటే ఎవరూ దొంగ ఐడీలతో వ్యాఖ్యలని రాసే ప్రయత్నం చెయ్యరు కూడా! ఎందుకంటే ఎంత ప్రయత్నించినా ఉప్పు కర్పూరం కాలేదు కదా! ఒక వేళ పెరిగిన టెక్నాలజీతో ఉప్పుకికూడా మెరుపుని తెద్దామని ప్రయత్నించినా అదీ వృధాయే. చిన్న నిప్పు కణిక అంటిస్తే తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఉప్పు టప్పుటప్పు మంటూ పేలిపోయి తుళ్ళిపోతుంది. కర్పూరం తాను కరిగి మరింత వెలుగుని విరజిమ్ముతుంది. ఇక్కడ కూడా వాటి రుచుల(కాంతుల) జాడ వేరే!
చెడుని వేరుచెయ్యడానికి విచక్షణకి మించిన ఆయుధం లేదని ఈ వేమన పద్యం చెప్పే నీతి.


పూర్తిగా చదవండి...

Sunday, February 8, 2009

Digital Library లో విశ్వనాథ + నా సోది


సి.బి.రావుగారి బ్లాగులో ఈ మధ్య విశ్వనాథ గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించడం, దాని గురించి వాదనలు చెలరేగడం కొంతమందికి తెలిసే ఉంటుంది. సి.బి.రావుగారు విశ్వనాథ భావజాలం గురించి రాద్దామనుకుంటున్నానని, Digital Libraryలో విశ్వనాథ రచనలకి లంకెలిమ్మని అడిగారు. DLIలో విశ్వనాథ రచనలు చాలా కొద్దిగానే ఉన్నాయి. అయినా అవి అక్కడ వ్యాఖ్యగా ఇవ్వడానికి ఎక్కువే! అంచేత ఇదిగో ఇలా నా బ్లాగులో టపాగా పెడుతున్నాను. ఇవి విశ్వనాథ రచనలు, విశ్వనాథ రచనలగురించిన ఇతర రచనలు.
విశ్వనాథ భావజాలాన్ని అర్థం చేసుకోడానికి "నా రాముడు" అన్న అతని రచన బాగా ఉపయోగపడుతుంది. అది DLIలో లేదు.
DLIలో ప్రస్తుతం ఉన్న పెద్ద అసౌకర్యం, పుస్తక వివరాలలో ఒక consistancy లేకపోవడం. విశ్వనాథ రచనల గురించి వెతకాలంటే, Author అన్న దాన్లో "visvanatha", "viswanatha", "vishwanatha", "viswanadha" ఇలా రకరకాల పదాలతో వెతకాలి. అంచేత నాకు కనపడనివి ఇంకా ఏమైనా ఉండవచ్చు. DLIలో మరొక అసౌకర్యం, పేజి పేజీ Download చేసుకోవాలి.

విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు
కావ్యపరీమళము
లలితాపట్టణపు రాణి
శ్రీకుమారాభ్యుదయము
వల్లభమంత్రి
అల్లసానివని అల్లికజిగిబిగి
ఏకవీర
శ్రీమద్రామాయణ కల్పవృక్షము-యుద్ధకాండము
విష్ణుశర్మ ఇంగ్లిషు చదువు
విశ్వనాథ మధ్యాక్కరలు
ఆంధ్ర ప్రశస్తి
శ్రీమద్రామాయణ కల్పవృక్షము : కిష్కింధ కాండము వొల్.4
కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్ళి
మా స్వామి(విశ్వేశ్వర శతకము)
విశ్వనాథ జీవిత సమగ్రము
విశ్వనాథ నవలలు మనస్తత్వచిత్రణ
విశ్వనాథ సాహిత్య దర్శనం
విశ్వనాథవారి_భక్తి-దేశభక్తి
జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్య వైభవము
విశ్వనాథ శబరి

సరే, ఎలాగూ టపా రాస్తున్నాను కాబట్టి నా సోది కూడా కొంత చెప్పుకుందామనుకున్నాను.
విశ్వనాథ కవిత్వం రాసారు, గేయాలు, పద్యాలు. కథలు రాసారు. నవలలు, నాటకాలు, విమర్శ వ్యాసాలు రాసారు. నేనన్నీ చదవలేదు. చదివిన వాటిలో అన్నీ నచ్చలేదు. విశ్వనాథ నవలలు, కొన్ని కథలూ నాకూ నచ్చలేదు, ముఖ్యంగా అతని శైలి. అతను చేసిన విమర్శతో నేను పూర్తిగా ఏకీభవిస్తాననీ చెప్పలేను. నేను విశ్వనాథని అభిమానించేది కవిగా. నా ఉద్దేశంలో విశ్వనాథ సహజంగా కవి. ఇతర ప్రక్రియలలో కూడా అతని కవిత్వ గుణం చొచ్చుకు రావడం వల్ల వాటి స్థాయి తగ్గిందని నా అభిప్రాయం.
కవిగా మాత్రం అతని స్థాయి చాలా గొప్పదని నా నిశ్చితాభిప్రాయం. దీని గురించి వివరంగా మరో సారి.

అయితే, కవిత్వాన్ని ఆస్వాదించడంలో రెండు రకాలు. ఒకటి కవి చెప్పే విషయం మనసుకి దగ్గరైనదైతే దాని మీద సహజంగా ఇష్టం ఏర్పడుతుంది. అలానే ఆ కవి భావజాలం ఇష్టం లేకపోతే ఆ కవిత్వాన్ని ఆస్వాదించ లేరు. ఇలాటి సందర్భంలో విమర్శ చేసేటప్పుడు, కవిత్వం (శైలి, రూపం వగైరాల) జోలికి పోకుండా, విమర్శ భావజాలానికి పరిమితమై ఉండాలి.
ఇక రెండవది, కవి భావజాలంతో ప్రసక్తి లేకుండా అతని కవిత్వాన్ని ఆస్వాదించగలగడం, లేదా అది నచ్చకపోవచ్చు. ఇలాటి సందర్భంలో అతని భావజాలం ప్రసక్తి తేకుండా కేవలం అతని కవిత్వ రూపాన్ని గురించిన విమర్శ సరిపోతుంది. నాకంటూ ఒక ప్రత్యేక భావజాలం లేదు (అని నేననుకుంటున్నాను) కాబట్టి సాధారణంగా నా ఆసక్తి కవిత్వాన్ని భావజాలంతో సంబంధం లేకుండా ఆస్వాదించడం, విమర్శించడం. నాకు విశ్వనాథా ఇష్టమే, గురజాడ ఇష్టమే, శ్రీశ్రీ ఇష్టమే. వాళ్ళ రచనలని చదివి నేను ఆనందించగలను.
వస్తు రూపాల రెంటి గురించీ విమర్శ చేసినప్పుడు అది నిజానికి సమగ్రమైన విమర్శ అవుతుంది. అయితే అలా చెయ్యాలంటే ఆ భావజాలం గురించిన మంచి అవగాహన ఉండాలి. లేకపోతే అది పొగడ్తగానో తెగడ్తగానో మిగిలిపోతుంది తప్ప ఉపయోగకరమైన విమర్శ అవ్వదు. అయితే, ఈ భావజాలం గురించి చేసే విమర్శ గురించి నాకు అంత సదభిప్రాయం లేదు. ఎందుకంటే, ఇది విమర్శ చేసే వ్యక్తి భావజాలమ్మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి.

ఉదాహరణకి విశ్వనాథపై వచ్చిన విమర్శనే తీసుకుందాం. నార్లవంటి వారు, ఇతర అభ్యుదయవాదులు (ఆవంత్స సోమసుందర్ వంటివారు కూడా) విశ్వనాథని సాంప్రదాయవాది, తిరోగమనవాది అన్నారు. ఇక్కడ సౌలభ్యం కోసం Rationalistsని కూడా అభ్యుదయవాదూల లెక్కలోకి తీసుకున్నాను. జి.వి.సుబ్రహ్మణ్యం వంటి వారు విశ్వనాథది నవ్య సాంప్రదాయం అన్నారు. ఈ రెండు విమర్శలూ రెండు వేర్వేరు దృక్పథాల నుండి చేసినవి.
వేదాలు, పురాణాలు, కావ్యాలు మొదలైన ప్రాచీన భారతీయ సంప్రదాయానికి చెందిన సమస్త సాహిత్యం పూర్తిగా మానవ సమాజానికి హానికరమని, వాటిలో మంచి ఏమాత్రమూ లేదని అభ్యుదయ వాదుల నమ్మకం. అంచేత వాటిని విలువైనవని భావించే ఎవరైనా వాళ్ళ దృష్టిలో తిరోగమన వాదులే.
జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు సంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించ లేని వాళ్ళు. సంప్రదాయంలో కూడా మంచి కొంచెమైనా ఉందని దాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని భావించే వారు. అంచేత విశ్వనాథ వాళ్ళకి "నవ్య" సాంప్రదాయ వాదిగా కనిపించారు. విశ్వనాథ సంప్రదాయంలోని నవ్యత వాళ్ళకి కనిపించింది. సంప్రదాయంలోని మంచిని గ్రహించి, చెడుని విడిచిపెట్టి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పడమే విశ్వనాథ భావజాలం అని జి.వి. సుబ్రహ్మణ్యం గారు నిరూపించడానికి ప్రయత్నించారు.
ఈ రెండు రకాల విమర్శలలోని ఏది సరైనది అంటే, దానికి జవాబు లేదు. "అభ్యుదయ వాదుల" భావజాలం నచ్చిన వాళ్ళకి వాళ్ళ విమర్శ సరైనదనిపిస్తుంది. సంప్రదాయమ్మీద గౌరవం ఉన్నవాళ్ళకి రెండవ వాళ్ళ విమర్శ నచ్చుతుంది. ఇక్కడవరకూ బాగానే ఉంది. నాకు హాస్యాస్పదంగా కనిపించే విషయం ఏవిటంటే, ఒకరు మరొకరి విమర్శ తప్పనడం, అది తప్పని ఋజువు చెయ్యబూనడం. ఇది పూర్తిగా నిరర్థకమైన పని! మరొక దురదృష్టకరమైన విషయం ఏవిటంటే, భావజాల విమర్శ పేరుతో కవిత్వ రూప విమర్శకి, ఇంకా ముందుకి వెళ్ళి వ్యక్తి దూషణకీ దిగడం.
సద్విమర్శకీ, కువిమర్శకీ తేడా సి.బి.రావుగారు తన బ్లాగులో లేటెస్టుగా పెట్టిన నార్లగారి విమర్శ, అంతకుముందు రెండు విమర్శలు. నార్లవారిది సద్విమర్శ. మరికొంత వివరంగా ఉంటే ఇంకా బావుండేది. దీనితో నాకు విభేదమూ లేదు, అంగీకారమూ లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు నాకు "భావజాల" విమర్శ మీద (దాని ప్రయోజనమ్మీద) సదభిప్రాయం లేదు.

భావజాలాన్ని గురించి మరొక రకమైన విమర్శ కూడా ఉంది. అది మార్క్సిస్టు విమర్శ. గతి తార్కిక భౌతిక వాదాన్ని సాహిత్య విమర్శలో ఉపయోగించడం. కొన్ని పరిమితులున్నా, ఇది సాహిత్య విమర్శని నిస్సందేహంగా పరిపుష్టం చేసింది. అయితే దీని ద్వారా సాహిత్యాన్ని "విలువ" కట్టడం కుదరదు. ఒక రకమైన సాహిత్యం వెలువడడానికి కారణమైన సాంఘిక, చారిత్రక, ఆర్థిక పరిస్థితుల గురించి విశ్లేషించేది మార్క్సిస్టు విమర్శ. నాకు తెలిసి విశ్వనాథ సాహిత్యం గురించి అటువంటి విమర్శ రాలేదు. అది దురదృష్టకరం. విశ్వనాథ మొదట్లో అభ్యుదయ భావాలు కనపరచినా, పోను పోను కరుడుగట్టిన సంప్రదాయవాదిగా మారిపోయారని చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. మార్క్సిస్టు విమర్శ గురించి క్షుణ్ణంగా తెలిసిన విమర్శకులు కూడా, విశ్వనాథలోని ఆ మార్పుని అతని వ్యక్తిత్వానికి వదలిపెట్టేసి అతన్ని తిరోగమనవాది అని ఊరుకున్నారు కాని, అటువంటి మార్పు వెనకనున్న కారణాలని సహేతుకంగా విశ్లేషించే ప్రయత్నం చెయ్యలేదు, నాకు తెలిసి. అలాటి విమర్శ, ఆనాటి సామాజిక సాహిత్య వాతావరణం గురించి మరింత లోతుగా తెలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
సి.బి. రావుగారు చెయ్యాలనుకొంటున్న విశ్లేషణ ఆ దిశగా సాగితే బావుంటుంది.


పూర్తిగా చదవండి...