"అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు చేరనేర్తు" అన్నది ఇప్పుడు నా విషయంలోనే నిజమయినట్లుంది! ఎంత తియ్యని పానీయమైనా, తెగ తాగితే చివరికి మొహం మొత్తుతుంది. ఒక్క అమృతం విషయంలో మాత్రం ఇలా జరగదుట! భాగవతామృతం రుచి చూడ్డం మొదలుపెట్టేసరికి మరి వదలబుద్ధి కావటం లేదు!
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి దల్లుల కడుపుచేటు
ఇంత చిన్న పద్యంలో ఏముందని? మనసుకి ఎందుకంతలా పట్టేసింది! పోనీ నేనేదో వీర భక్తాగ్రేసరుణ్ణైతే, ఆహా ఓహో అని ఇందులోని భక్తిరసంలో మునిగిపోయే అవకాశం ఉంది. కాని అలా కాదే. నేను చూస్తే ప్రసాదం భక్తుణ్ణి! మరి గుండెను అంతలా తట్టేదేమిటుంది ఇందులో? అచ్చమైన తెలుగుదనం! భావాన్ని గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయేట్టు చేసే సముచిత భాష. "చేతులారగ", "నోరు నొవ్వగ" - చక్కని తెలుగు నుడికారం. శీవపూజ కాని హరికీర్తి కాని ఏదో తూతూ మంత్రంగా కాకుండా, మనస్ఫూర్తిగా చెయ్యడం గురించి ఈ పదాలు చెప్పక చెప్పటం లేదూ! అలా చెయ్యని వాళ్ళగురించి చివరన, పదునైన తెలుగు జాతీయంతో, ఎంత సూటిగా చెప్పాడు పోతన! పోతన మనసూ, మాటా మృదువైనవే కావొచ్చు. కానీ అవసరమైనప్పుడు ఎంత వాడిగా మారగలదో ఆ చివరిపాదం నిరూపిస్తోంది!
ఇంతకీ ఈ పద్యం ఎవరిగురించి? శివుడిని చేతులారా పూజించని వాడి గురించి. హరిని నోరార కీర్తించని వాడి గురించి. దయ సత్యము లేని వాడి గురించి. మరి అలాటి "వాడి"ని పేర్కొనే పదం - నామవాచకం కానీ, సర్వనామం కానీ ఈ పద్యంలో ఒక్కటైనా ఉన్నాదా? లేదే! అంటే అలాటి వాడిని, "వాడు" అని కూడా తలచుకోడం పోతనకి ఇష్టం లేదన్న మాట! అంతటి తిరస్కార భావాన్ని ధ్వనిస్తున్నాది కాబట్టే, ఈ పద్యం గుండెలోకి చొచ్చుకుపోతుంది.
సరే, ఇంక ఇందులో విషయానికి వస్తే...భగవద్భక్తినీ, హరిహరుల అద్వైతాన్ని చాటే మొదటి రెండు పాదాలతో బాటు, మూడవ పాదం ఎందుకు చేర్చాడు పోతన? ఇప్పుడంటే భక్తికీ, సత్ప్రవర్తనకీ లింకు తెగిపోయింది కానీ, నిజానికి మొదటినుంచీ మన దేశంలో దయ, సత్యం, ధర్మం లాంటి సద్గుణాలు భగవదారాధనలో భాగమే. మనిషి సంఘ జీవిగా సజావుగా బతకాలంటే, ఇలాటి లక్షణాలు కాస్తో కూస్తో అవసరం. అవి సహజంగా మనిషికి కలిగితే మంచిదే. కానీ అలా జరగడం సాధారణం కాదు. అందుకే భగవంతుని పేరుతో వాటిని ప్రచారంచేసారు కాబోలు. పోతన కాలానికే బహుశా వీటి మధ్య సంబంధం సన్నగిల్లడం మొదలయ్యిందేమో. అందుకే భక్తిని మాత్రం చెప్పి ఊరుకోకుండా, దయకి సత్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని పోతన నొక్కి చెప్పాడు.ఈ కాలంలో, దుర్మార్గాలు చేసేస్తూ పాపాలు పోవాలని గుడికి వెళ్ళి మొక్కుతీర్చుకొనే భక్త శిఖామణులు ఈ పద్యం నుంచి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.
హేతువాద ఆలోచనా ధోరణి మంచిదే. విజ్ఞానవంతుడిగా ఎదుగుతున్న మానవునికి దైవమనే నమ్మకం తాలూకు అవసరం తగ్గిపోవడమూ సహజమే. అయితే, విజ్ఞానంతో పాటు వ్యక్తి స్వార్థం పెరిగిపోతున్న సందర్భంలో, మానవ అస్థిత్వానికీ, సమాజ సమతౌల్యానికి అవసరమైన దయ, సత్యం, ధర్మం వంటి గుణాలని మనుషుల్లో పెంపొందించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలని ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.
ప్రస్తుతానికి ఈ పద్యాన్ని మననం చేసుకొంటూ అది బోధించే మంచితనాన్ని అలవర్చు కోడానికి ప్రయత్నిద్దాం!
పూర్తిగా చదవండి...