తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, May 29, 2009

జుగల్‌బందీ

నిన్న రాత్రి నేను గంధర్వలోకానికి వెళ్ళివచ్చాను. మీరు నమ్మరు కాని, ఇది నిజంగా నిజం!

టీవీ రొద కంప్యూటరు సొద కట్టిపెట్టి, స్టీరియో ఆన్ చేసాను. చేతిలో పుస్తకం తీసుకుని పక్కమీదకి ఒరిగాను.

आपको देख कर देखता रह गया!
क्या कहूँ और कहने को क्या रह गया!


మెల్లగా జగ్జీత్ సింగ్ పాట శ్రావ్యంగా మొదలయ్యింది.

మలయ పవను కౌగిలిలోనె పులకరించి
హాయిగా కంఠమెత్తు ప్రాయంపు వంశి
విశ్వమోహను జిలిబిలి పెదవులంటి
అవశమైపోయి ఏమి చేయంగ లేదు


కృష్ణశాస్త్రి గీతం మెత్త మెత్తగా మనసుకి హత్తుకోడం మొదలు పెట్టింది.

ఒకపక్క జగ్జీత్ సింగ్ మరోపక్క కృష్ణశాస్త్రి. ఇద్దరి సంగీతం ఒకేసారి - చుక్కా చుక్కా హృదయంలోకి ఇంకుతూ ఉంటే, చిక్కని మధువేదో గొంతులో బొట్టుబొట్టూ దిగుతున్న అనుభూతి. ఒక తీయని మైకం కమ్ముకుంటోంది.

ओ मेरे सामनेही गया... और मै...
रासतेकी तरहा देखता रह गया...


జగ్జీత్ సింగ్ గొంతులో భావం ఎంత బాగా పలుకుతుంది!

నాటి తుది సందె చీకటి కాటుకల విలీనమైపోవు రాజమార్గాన,
నీవు కదలిపోతివి విషాదసుఖమ్ము గూర్చి
సగము నిద్దురలో క్రమ్ము స్వప్న మటుల
ఆపుకోలేని మమత, ఘంటాపథమ్ము నడుమ పరువిడి,
నిలబడినాడ నట్టె


విషాదసుఖం! ఆ అనుభూతి కృష్ణశాస్త్రికి మాత్రమే తెలుసు.

కృష్ణశాస్త్రి నాకు సరిగ్గా సరైన వయస్సులోనే పరిచయమయ్యారు. మాకు ఇంటరులో అతని "అన్వేషణము" పాఠంగా ఉండేది. కృష్ణశాస్త్రి నాకు పరిచయమయ్యింది అప్పుడే! అప్పుడప్పుడే యవ్వనపు రెక్కలు వస్తూ వస్తూ ఉన్నాయి. ప్రపంచాన్ని నా కళ్ళతో చూడాలని కొత్తగా తెలుస్తోంది. ఎవో తెలియని కొత్త కొత్త భావాలు మనసుని గిలిగింతలు పెట్టే రోజులవి. సరిగ్గా అప్పుడు పరిచయమైన కవి కృష్ణశాస్త్రి. ఆ మాటలు కొత్త. ఆ భావాలు కొత్త. అప్పుడప్పుడే విచ్చుకుంటూన్న మొగ్గ రేకులపై, మెల్లిగా తుమ్మెద వాలినట్లు - ఆ కవిత్వం నా హృదయాన్ని తాకేది.

इश्ख की दास्तान है प्यारी
अपनि अपनि ज़बान है प्यारी


సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?


పాత రోజులు గుర్తుకు తెచ్చుకోడానికి కొంతమంది పాత ఫొటోలు చూస్తారు. కొందరు డైరీలో పాతపేజీలు తిరగేస్తారు. చదివిన పుస్తకాలని, విన్న పాటలని మళ్ళీ ఒకసారి స్పృశిస్తాను నేను. జ్ఞాపకాల జల్లుని కురిపిస్తున్నాయి జగ్జీత్ సింగ్ పాటలు. జ్ఞాపకాల పరిమళాలని విరజిమ్ముతునాయి కృష్ణశాస్త్రి కవితలు. ఒకేసారి, వాన జల్లులో తడుస్తూ తడి మట్టివాసన పీల్చిన అనుభూతి.

कल चौदवी की रात थी, शब् भर रहा चरचा तेरा
कुछ ने कहा ये चाँद है, कुछ ने कहा चहरा तेरा


నిన్న రాతిరి చికురంపు నీలికొనల
జారిపడిన స్వప్నమ్ము నిజమ్మొ ఏమొ
కోమ లామోద కౌముదీ కోరకమ్మొ
సుర విలాసవతీ ప్రేమ చుంబనమ్మొ


కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి - ఇంటర్ తర్వాత తెలుగు నేలకి దూరంగా కలకత్తాలో ప్రవాసం చెయ్యాల్సి వచ్చినప్పుడు నాకు తోడున్న మిత్రులలో వీళ్ళూ ఉన్నారు. ఈ పాత స్నేహితుల్ని పలకరించేసరికి ఆ పాతరోజులు గుర్తుకొచ్చాయి. కేంపస్ లో మా హాస్టల్ ముందు ఒక చిన్న సరస్సు. చుట్టూ కొబ్బరిచెట్లు. కొబ్బరీనెల సందుల్లోంచి జాలువారే వెన్నెల కిరణాల్లో తడుస్తూ, ఆ సరసు చుట్టూ చక్కర్లు కొట్టడం ఎంత మజాగా ఉండేదో! ఆలా నడుస్తూ నడుస్తూ "తలిరాకు జొంపముల సందుల త్రోవల నేలవాలు తుహినకిరణ కోమల రేఖవొ!" అని కృష్ణశాస్త్రి కవితలని స్మరించుకుంటూ ఉంటే అది మరెంత మజా! హాస్టల్ డాబా మీద, పున్నమి ఏకాంతంలో, కృష్ణపక్షం చదువుకోడం - అదో వింత అనుభూతి!

పాట మధ్యలో దీపక్ పాండె వాయులీన స్వరప్రస్తారం సమ్మోహనంగా వినిపిస్తోంది. అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా?

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
పడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనలపైని
తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ,
పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు
కడలిగా, పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమైపోయె నెడద


వాయులీన ప్రస్తారం తారస్థాయిని అందుకుంది.

పరువు పరువున పోవు నెదతో
పరువులెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరచి నడిరేయిన్


మరో కొత్త గజల్ మొదలయ్యింది.

तेरे कदमोंपे सर होगा... कज़ा सरपे खड़ी होगी...
फिर उस सजदे का क्या कहना... एक अनोखी बंदगी होगी...


ఏ మాటని ఎలా ఎంతవరకూ ఉచ్చరిస్తే అందులో భావం పలుకుతుందో - ఆ కళ సంపూర్ణంగా తెలిసిన గాయకుడు జగ్జీత్ సింగ్. జాగ్జీత్ సింగ్ నాకు కొంచెం ఆలస్యంగా పరిచయమయ్యారు. అవి డిగ్రీ అయిపోయి పీజీ చదువుతున్న రోజులు. పీజీలో కొత్తగా చేరిన రాజేష్ శుక్లా నాకితన్ని పరిచయం చేసాడు. తన రూములో ఉన్న కేసెట్ చూస్తూ ఉంటే, నీకు నచ్చుతాయి తీసుకెళ్ళి విను అని ఇచ్చాడు. ఆ కేసెట్ తెచ్చుకొని వాక్ మేన్ లో పెట్టి మొట్టమొదటిసారి జగ్జీత్ సింగ్ గొంతు విన్న ఆ క్షణం ఇంకా గుర్తే!

तुम्हें दानिस्ता महफ़िल में जो देखा हो तो मुजरिम
नज़र आखिर नज़र है बे-इरादा उठ गयी होगी


ఏను మరణించుచున్నాను ఇటు నశించు
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు...

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె
నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను
నేనె నాపయి వాలినా నేనె జాలి
నెదనెద గదించినాను, రోదించినాను


కృష్ణశాస్త్రి, జగ్జీత్ సింగ్. ఎన్నో ఏళ్ళనుంచీ ఇద్దరూ తెలుసు. అయినా, ఇద్దరినీ ఒకేసారి పలకరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇన్నాళ్ళూ రాలేదు. ఆశ్చర్యం!
ఇది కవిత్వాన్ని మించిన ఆల్కెమి!

अपनि होठों पर सजाना चाहताहूँ
आ तुझे मैं गुनगुनाना चाहताहूँ


నాకు మాత్రము గానమున్నంత వరకు
చాలు చాలు నీ ప్రణయనిశ్వాస మొకటి
మోసికొందునొ నా గీతములను నిన్ను
మూగవోదునొ రాయియైపోయి చిరము


మత్తు మనసంతా ఆవరిస్తోంది. నన్ను నేనే మరచిపోయే స్థితికి చేరువవుతున్నాను. బరువెక్కిన కన్నులు అక్షరాల వెంట చాలా మెల్లగా కదులుతున్నాయి. తెరలు తెరలుగా చెవులని సోకుతున్న గజల్.

कोई आंसू तेरे दामन पर गिराकर
बूंदको मोती बनाना चाहताहूँ


ప్రియతమా ఇక నిదురింతు పిలువబోకె
బాసిపోకు నిర్భాగ్యపు బ్రతుకు దాటి!
ప్రియతమా పొరలి పొరలి మొయిళులేవొ
మేలుకొననీవు రెప్పల వాలి అదిమి!


थक गया मैं करते करते याद तुझको
अब तुझे मैं याद आना चाहता हूँ


రెప్పలు మూసుకుపోయాయి. ఎక్కడో దూరం నుంచి వినిపిస్తోంది.

आखरी हिच्चकी तेरे ज़ानों पे आये... आखरी हिच्चकी... हिच्चकी... हिच्चकी

हिच्चकी మంద్రస్థాయికి... ఇంకా మంద్రస్థాయికి వెళ్ళిపోతోంది...

आखरी हिच्चकी तेरे ज़ानों पे आये...
मौत भी मै शायराना चाहताहूँ...


పూర్తిగా చదవండి...

Friday, May 22, 2009

కవిత్వము - కాంతిసంవత్సరాలు


ఇంక నా వల్ల కాదు బాబోయ్! ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. మొన్నీ మధ్యన ఒక బ్లాగులో ఏదో కథల సంపుటి గురించిన టపాలో బ్లాగరొక విషయం చెప్పారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒకరికి కాలం ఒక కాంతిసంవత్సరంలా గడిచిందని ఆ కథలో ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. (సరిగ్గా ఇదే కాకపోవచ్చు కాని తాత్పర్యం ఇదే). దానికి కొత్తపాళిగారు కామెంటులో ఈ కాంతిసంవత్సరం ఇంకా శాస్త్ర పరిభాషేనని సాహిత్యంలో రచయితలకి అంతగా తెలిసనట్టు లేదని అన్నారు. అప్పుడే ఈ టపా రాద్దామనుకున్నాను. కాని ఆవు వ్యాసం కథ మాదిరి అవుతుందేమోనని ఆ ఉత్సాహాన్ని అణుచుకున్నాను. మొన్నటికి మొన్న మళ్ళీ "నా ప్రపంచం" బ్లాగులో ఇన్నయ్యగారు రాసిన ఈ వాక్యం నా కంటబడింది: " భూమికి అతి సమీపం లో వుండే తార నుండి కిరణాలు రావడానికి 4 కాంతి సంవత్చరాలు పడుతుంది". ఇక రాయకుండా ఉండలేక పోయాను :-)

ఇది చాలామందికి తెలిసిన విషయమే (అయినా చాలామంది పప్పులో కాలేస్తూ ఉంటారు!). "కాంతి సంవత్సరాలు" కాలాన్ని కొలిచే పరిమాణం కాదు. అది దూరాన్ని కొలుస్తుంది. కాంతి, శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" అంటారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల మధ్య ఎంత దూరం ఉంటుందంటే, ఒక గోళం కాంతి మరొక గోళాన్ని చేరడానికి ఏళ్ళకి ఏళ్ళే పడుతూ ఉంటుంది. అంచేత వాటి మధ్యనున్న దూరాన్ని కొలవడానికి దీన్ని వాడతారు. ఇక్కడ మరో విశేషం ఏవిటంటే, ప్రస్తుత భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. అంచేత పెద్ద పెద్ద దూరాలని కొలవడానికి కాంతి సంవత్సరానికి మించిన ప్రమాణం లేదు.
"ఇంతకీ యీ సోదంతా ఎందుకు. గూగులిస్తే దీనికన్నా ఎన్నో రెట్ల సమాచారం మాకు దొరుకుతుంది. ఇందులో కవిత్వం ఏవిటుంది?" అనుకుంటున్నారా. ఇదిగో వస్తున్నా, వస్తున్నా.


గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు
బయనముం జేయ నబ్దముల్ బట్టునట్లు
రాచదేవిడీలందు వార్తలును జేర
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు బట్టు

ఒక గోళపు కాంతి కిరణాలు మరొక గోళానికి ప్రయాణించడానికి కొన్ని సంవత్సరాలే పట్టవచ్చు. అలాగే రాచదేవిడీల మధ్య రాజుకీ రాజుకీ వార్తలు ప్రయాణం చెయ్యడానికి సంవత్సరాలే పట్టేస్తుందిట. ఇదేం పోలిక! ఎక్కడి పోలిక?
ఇది అరణ్య కాండలోని మొట్టమొదటి పద్యం. ఈ పోలిక ద్వారా, రాచదేవిడీల మధ్యనుండే భౌతికమైన దూరమే కాదు, వాటి మధ్యనుండే శూన్యాన్ని కూడా స్ఫురింప జేస్తున్నాడు కవి. ఇంతకీ వార్తలు తెలియడానికి అంత కాలంపట్టేదని ఎందుకంటున్నాడు? దానికి ఈ పోలిక ఎందుకు చెప్పాడు? నేను వివరించడం ఎందుకు. శ్రీ వడలి మందేశ్వర రావుగారి యీ వివరణ చదవండి ("<>" మధ్యనున్న మాటలు నా పుడకలు):

***
ఈ పద్యాన్ని ఈ శతాబ్దపు కవే వ్రాయాలి. ఏమంటే వెనుకటివాళ్ళకు కాంతిసంవత్సరాలతో అంత పరిచయం లేదు కనుక. అయితే ఈ ఆధునిక భావాన్ని ఉపమానంగా గ్రహించి కవి సాధించింది ఏమిటి? అంటే - చాలా ఉంది. అయోధ్యకాండ అంతా ఉంది.
కవి చెప్పదలచుకున్నది: బహుశా నీవు 20వ శతాబ్దిలో ఉండి, నీ రేడియో, ట్రాన్సిస్టర్ సాధనాలతో ప్రపంచంలో ఎక్కడ, ఏమూల జరిగిన వార్తనైనా క్షణాలమీద అందుకో గలవు కదా అని, ఈ కథలోని వార్తలు కూడా అలా ప్రయాణం చేస్తాయని అనుకుంటావేమో, అలా కాదు సుమా! అంటున్నాడు కవి.

నాటికీ, నేటికీ విశ్వాంతరాళంలోని ఒక గోళపు కాంతి మరో గోళానికి ప్రయాణం చేయడానికి పట్టే వ్యవధి కొన్ని క్షణాలనుంచి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. అలాగే ఆనాడు కొన్ని వార్తలు గుప్పున వ్యాపించేవి. కాని, ప్రభువుకూ ప్రభువుకూ మధ్య రాచదేవిడీలలో వార్తలందడానికి ఆ రోజుల్లో ఏండ్లు పూండ్లు పట్టేది.

దీనికింత ప్రాధాన్యం ఇస్తూ తొలిపద్యంలోనే ఎందుకు చెప్పాలి అంటే, ఇందులోని కథ అంతా దీనిమీదనే ఆధారపడి ఉన్నది కనుకనే.
రామునికి ఆత్మలో ఒక విరాగం కలిగింది. ఆ మీద అది శాంతించింది(<ఇదంతా జరగడానికి ఏడాదిపైగా పట్టింది!>). ఇంత కథ జరిగాక కాని, దశరథున కా విషయం తెలియనే తెలియదు. తెలిస్తే తొందరపడి భరత శత్రుఘ్నులుండగానే రాముని యౌవ రాజ్యాభిషేకం జరిగి ఉండేది. రామకథ బాలకాండతో ముగిసి ఉండేది.

కైకకు అధికార పూర్వకంగా రామపట్టాభిషేక వార్తనంద జేసింది మంథర!(<అదీ ఎప్పుడు? పట్టాభిషేకం ఈ రోజో రేపో అనగాను!>) అవును -
"గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు బయనముం జేయ నబ్దములు పట్టు!"

అయోధ్యలోనే ఒకరి మాట ఒకరి కందడానికి ఇలా ఉంటే, అయోధ్యనుంచి కేకయ రాజధానికి వార్తలందటానికి దశాబ్దాలే పడుతుంది. రాచదేవిడీలోనికి అడుగుపెట్టి కైకమ్మను చూసేవరకూ భరతునికి ఏ వార్తా తెలియనే తెలియదు. తెలిస్తే కథే లేదు కదా!
అయోధ్యకాండ అంతా ఈ వార్త నత్తనడకలా నడవడంలోనే ఉంది. వార్తలోని వ్యవధానం వల్లనే మంథర కైక మనసును మార్చ యత్నించింది. వార్తలందడంలోని వ్యవథానం వల్లనే కౌసల్యనుంచీ, భరద్వాజునినుంచీ, లక్ష్మణుడూ, గుహుని వరకూ అందరూ భరతుణ్ణి అవమానంగా చూశారు.

(<ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, పట్టాభిషేకం రోజువరకూ కైకేయికి ఆ వార్త ఎందుకు తెలియలేదు, భరతుడికి కూడా తల్లిని చూసే దాకా ఎందుకు తెలియలేదు అన్న విషయం వాల్మీకంలో స్పష్టంగా లేదు. అందికే, దశరథుడు కోరుండే ఈ వార్త కైకేయికీ కేకయ రాజుకీ తెలియకుండా దాచాడన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక్కడకూడా మన తెలుగు కవి దీనికి వివరణ ఇవ్వలేదు. కవితాత్మకంగా ఒక పోలిక చెప్పి వదిలేసాడు!>)

చిత్రమేమంటే "గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు" చేరడానికి అబ్దములు పట్టగా కొన్ని వార్తలు మాత్రం ఎన్నాళ్ళయినా అందనే అందవు.
రాముడొక స్వయం ప్రకాశ జ్యోతి అనుకుంటే, అతనిలో కల్గిన వైరాగ్య భావమన్న కాంతి దశరథ గోళానికి అందడానికి తగినంత కాలం పట్టింది. కాని దేవతలు వచ్చి రాముని రాజ్యమేల వద్దన్న వార్త దశరథునికి అందనే లేదు. రాముని కోర్కె మీదనే - దేవతల ఋణాన్ని తీర్చడానికే - కైకమ్మ వరాలను కోరిందన్న వార్త లోకానికి తెలియనే తెలియదు! అవును:
"గోళ కాంతి చ్ఛటల్ పెరగోళములకు
బయనముం జేయ నబ్దముల్ బట్టు!"

(<"ఏవిటీ కొత్త కథ? ఏమిటి లోకానికి తెలియని యీ వింత వార్త!" అనుకుంటున్నారా? దీని గురించి తీరుబడిగా మరోసారి మరోచోట ముచ్చటించుకుందాం.>)

***

అన్నట్టు, ఈ కవి ఎవరో ఇది ఏ కావ్యంలోదో నేను వేరేగా చెప్పక్కరలేదు కదా! :-)


పూర్తిగా చదవండి...

Monday, May 11, 2009

కందుకూరి జనార్దనా!


అననగనగా ఒక రాజు. ఆ రాజుగారు ఉదయాన్నే వాహ్యాళికి వెళ్ళేప్పుడు అతనికెవరూ ఎదురురాకూడదని శాసనం చేసారు, ఎవరెదురొస్తే ఏం అశుభం జరుగుతుందో అని. ఇది తెలియని ఒక పరాయి దేశపు పండితుడు ఒకాయన యీ రాజ్యం వచ్చి, ఓ రోజు పొద్దునే రాజుగారికి ఎదురయ్యాడు. అంతే! రాజుగారు ఆగ్రహించి "ఈ రోజు పొద్దునే నువ్వు నాకు ఎదురయ్యావు. నాకూ, ఈ రాజ్యానికి ఏమరిష్టం రాబోతోందో! నీకు మరణ శిక్ష విధిస్తున్నాను" అన్నాట్ట. అది విన్న పండితుడు నవ్వాడట. మరణ శిక్ష విధిస్తే వీడు నవ్వుతాడేమని రాజుకి ఆశ్చర్యం వేసింది. "నీకేమైనా పిచ్చా, మరణ శిక్ష వేస్తే ఎందుకలా నవ్వుతున్నావ్?" అని అడిగాడట. దానికా పండితుడు, "మహారాజా! నేనెదురైతే మీకేం అశుభం కలుగుతుందో నాకు తెలీదు కాని, ఈ రోజు పొద్దున్నే నేను మిమ్మల్ని చూసాను. దాని ఫలితంగా నాకు ఏకంగా మరణమే ప్రాప్తిస్తోంది! ఇంతకన్నా అశుభం ఏముంటుంది. అలాంటిది నావల్ల అశుభమేదో అవుతుందని మీరు భయపడ్డం చూస్తే నాకు నవ్వొచ్చింది" అన్నాట్ట. దానితో రాజుగారు పెద్ద ఆలోచనలో పడిపోయారు. అప్పుడతనకి తన మూర్ఖత్వం తెలిసొచ్చింది. వెంటనే ఆ పండితుణ్ణి సగౌరవంగా ఆస్థానానికి పిలిపించి మంచి సత్కారం చేసారు.
ఈ కథని చాలామంది వినే ఉంటారు. వేరు వేరు విధాలుగా విని ఉంటారు, వేర్వేరు రాజుల పేర్లతో, పండితుల పేర్లతో. తెలుగు సాహిత్యంలో చాటు పద్యాల్లాగ ఇలాంటి చాటు కథలు కూడా చాలా ఉన్నాయి. నేనీ మధ్య దీన్ని విన్నది కందుకూరి రుద్రకవి విషయంలో. ఆ పండితుడు కందుకూరి రుద్రకవి అని, ఆ రాజు శ్రీకృష్ణదేవరాయలని. చారిత్రకమైన ఆధారాలు స్పష్టంగా లేకపోయినా, ఇలాటి కథలలో ఎంతో కొంత నిజం ఉండకుండా ఉండదు. అది రుద్రకవి కాక మరొక పందితుడు కావచ్చు. ఆ రాజు రాయలు కాక వేరే ఎవరైనా కావచ్చు. అయినా ఆ పండితుని ధైర్యానికీ, సమయస్ఫూర్తికీ, తన తప్పుని గ్రహించి ఆ పండితుని సత్కరించిన ఆ రాజు ఇంగితానికీ అబ్బురపడకుండా ఉండలేం!

కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారన్న కథ ప్రసిద్ధమే. అది కూడా చాటు కథే కాని దానికి చారిత్రకమైన ఆధారాలు సరైనవేమీ లేవు. ఈ కందుకూరి రుద్రకవి కూడా అష్ట దిగ్గజాలలో ఒకడనీ, అతను ఈశాన్యపు దిక్కునున్న పీఠాన్ని అధిష్టించాడనీ ఒక కథ. ఈ రుద్రకవి గురించి చాలా చాటు పద్యాలూ, వాటికితోడుగా కథలూ ప్రచారంలో ఉన్నాయి. ఇతనికి తాతాచార్యులతోనూ అలాగే భద్రకవితోనూ (ఇతను రాయల కొలువులో మరొక కవి అయ్యలరాజు రామభద్ర కవే అని కొందరంటారు) వాదోపవాదాలు జరిగాయని పద్యాలున్నాయి. సభకి వచ్చినప్పుడు ఇతనికి కూర్చోడానికి ఆసనమివ్వకుండా అవమానించినప్పుడు యీ పద్యం చెప్పాడట రుద్రకవి:

పండితులైనవారు దిగువం దగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మకు నెక్కిన గ్రింద గండ భే
రుండ మదేభ సింహములు రూఢిగ నంతట నిండియుండవే!

చాటువుల్లో తిట్టుకవిత్వం కూడా చమత్కారమైన పోలికలతో చతురంగా ఉంటుందన్నదానికి ఇదొక ఉదాహరణ. కవి రాజుగారి కొలువులో ఇంత నిబ్బరంగా మాట్లాడగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఇలా పద్యం చెప్పేసరికి తాతాచార్యులవారు "ముందైతే నీ పండిత్యమూ కవిత్వ పటుత్వమూ నిరూపించుకో" అని కొన్ని దుష్కర ప్రాసలతో సమస్యలిచ్చి పూరించమన్నారట. వాటినన్నిటినీ రుద్రకవి ఆశువుగా అవలీలగా పూరించాడట. అందులో ఒక సమస్యాపూరణ:

సమస్య: దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములురేగె నదేమి చిత్రమో!
పాల సముద్రం మధ్యలో దుమ్ములు రేగాయని అర్థం. ఇక్కడ "గ్ధ" ప్రాస కష్టమైనది.
దీని పూరణ:

స్నిగ్ధపువర్ణు డీశ్వరుడు చిచ్చఱ కంటను బంచబాణునిన్
దగ్ధము చేసెనంచు విని తామరసేక్షణు మ్రోలనున్న యా
ముగ్ధపు లచ్చి మోదుకొన మోహన గంధము పిండి పిండియై
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములురేగె నదేమి చిత్రమో!

శివుడు మన్మథుణ్ణి భస్మంచేసాడన్న వార్త విన్న లక్ష్మీ దేవి పుత్రశోకంతో గుండెలు బాదుకుంటే, ఆమె శరీరమ్మీద ఉన్న గంధము పిండిపిండైపోయి, ఆ ధూళి పాలసముద్రం మధ్య దుమ్ములా రేగిందని తాత్పర్యం. ఇలా తన పాండిత్యాన్నీ, కవిత్వ శక్తినీ నిరూపించుకొని రాయల అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడని కథ.
అయితే యీ రుద్రకవి ఆశ్రయించినది శ్రీకృషదేవరాయలని కాదనీ మరొక చిన్న రాజుననీ మరికొందరంటారు.
మల్కిభరాముని (ఇబ్రహీం కులీ కుతుభ్షా) ఆశ్రయించిన రుద్రకవి ఒకడున్నాడు. ఇతడూ అతడూ ఒకరో కాదో స్పష్టంగా తెలీదు. ఈ రుద్రకవి పేరు మీద చాలానే గ్రంధాలున్నాయి. నిరంకుశోపాఖ్యానము, సరసజన మనోరంజనము అనే కావ్యాలు, సుగ్రీవవిజయము అనే యక్షగానం (ఇదే మనకి లభిస్తున్న యక్షగానాలలో అతి ప్రాచీనమైనది) మొదలైనవి.
అన్నిటికన్నా ప్రసిద్ధి పొందిన రచన జనార్దనాష్టకము. "కందుకూరి జనార్దనా" అనే మకుటంతో ఉన్న ఎనిమిది పద్యాలు. అందమైన మధురమైన శృంగార రసవంతమైన పద్యాలివి. ఇవన్నీ మాత్రా ఛందస్సులో సొగసైన నడకతో సాగే పద్యాలు. యతి ప్రాసలు వీటికి అదనపు నిగనిగలు. మత్తకోకిల నడకలా సాగే ఈ పద్యాలు పాడుకోడానికి కూడా బావుంటాయి. ఈ జనార్దనాష్టకంలోని పద్యాలకు రాగం కట్టి పూర్వం దేవదాసీలు నృత్యం చేసేవారట. ఇవి కొన్నాళ్ళ క్రితం అందమైన బాపూ బొమ్మలతో ఒక పత్రికలో ప్రచురింపబడ్డాయి. తర్వాత పుస్తకంగా కూడా వచ్చినట్టుంది.
జనార్దనాష్టకంలోని ఒక పద్యం:

సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

మిగతా పద్యాలు పద్యం.నెట్లో చదువుకొని ఆస్వాదించండి.


పూర్తిగా చదవండి...