అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
శివము శక్తిని గూడిన సృష్టి జరుగు
లేక దైవము స్పందనే లేని జడము
అట్టి నిను, హరిహర విరించాదులకును
పూజ్యమౌ దాని, నుతియింప మ్రొక్కులిడగ
అకృత పుణ్యులకున్ సాధ్యమగుట యెట్లు?
అమిత సూక్ష్మము, నీ పాదకమల భవము,
అయిన రేణువుచే లోక మవికలముగ
నా విరించి రచించు; సహస్ర శీర్ష
ములను హరి యెట్లొ భరియించు, బూదివోలె
హరుడు దానిని పొడి జేసి అలముకొనును
ఇవి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకాలకీ నా అనువాద ప్రయత్నం. దసరా పండగంటే అమ్మవారిని కొలిచే పండగ. అమ్మవారు శక్తి స్వరూపిణి. మన దేశంలోని మతాలలో శక్తిని ఆరాధించే వారి మతాన్ని శాక్తేయం అంటారు. ఈ శాక్తేయం ఎక్కువగా వంగ ప్రాంతంలో వర్ధిల్లిన మతం. అందుకే ఇప్పటికీ బెంగాలీలకి దసరానే అతి ప్రధానమైన పండగ. ఈ పండగని వాళ్ళు "పూజో" అంటారు. పదిరోజులు జరిగే ఈ దసరా పండగలో ఆ శక్తి వివిధ రూపాలని పూజిస్తాం.
శివము, శక్తి అనే ఈ ద్వంద్వం మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. వాక్కు-అర్థము, ప్రకృతి-పురుషుడు, బీజము-క్షేత్రము, చైతన్యము-జడము, energy-mass ఇలా. అవి రెండు కాదు ఒకటి అని తెలుసుకోవడం అద్వైతం. మన మెదడు ఉంది. అది ఏమిటంటే కొన్ని కోట్ల న్యూరాన్ల కలయిక. అయితే, అన్ని కొట్ల న్యూరాన్లు కలిసినంత మాత్రానే మెదడు ఏర్పడిపోతుందా? వాటిలోని స్పందన శక్తి ఏదో వాటిని పని చేయిస్తోంది. ఆ శక్తి లేకపోతే వట్టి న్యూరాన్లు మాత్రమే మెదడు కాలేవు. అలాగే ఒక పెద్ద జడపు ముద్దగా ఉన్న రూపంలో విశ్వానికి ఉనికి లేదు. ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి - ఆ జడపు ముద్దని విశ్వంగా మార్చిందని మన సైంటిస్టులు కూడా ఊహిస్తున్న విషయమే. విచిత్రం ఏమిటంటే, ఈ శక్తి జడంలో ఉన్నదే! దానికి భిన్నమైనది కాదు. మనిషి మెదడులోని అన్ని కోట్ల న్యూరాన్లూ ఒక్క అండము, శుక్రము కలయికలోంచి ఉద్భవించాయి. ఏ ఏ న్యూరాన్లు ఎలా పనిచెయ్యాలన్న విషయమంతా పరమాణు సదృశమైన DNAలో నిక్షిప్తమై ఉంది. అందులోంచే మనిషి (జీవం) సృష్టించబడుతోంది. జీవి మనుగడకి, చావుకీ కూడా అది కారకమవుతోంది. ఇది ప్రాణశక్తి. విశ్వం పుట్టుక ఎలా అయితే మనకింకా అంతుబట్ట లేదో, అలానే ప్రాణం పుట్టుక కూడా అంతుబట్ట లేదు. అయితే ఈ రెంటికీ కూడా మూలమైనది శక్తి అని మాత్రం తెలుసు. ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు. సృష్టి, స్థితి, లయ అనేవి అటు విశ్వానికీ, ఇటు ప్రాణానికీ కూడా సమానంగా ఉన్న లక్షణాలు.
ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ తేలతామో తెలీదు! శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.
శక్తిని స్త్రీ రూపంగా ఎందుకు పూజిస్తాం అన్నది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. అది అలా ఉంచితే, వివిధ రూపాల్లో శక్తిని అమ్మవారిగా పూజించడం మనకి బహుశా అనాదిగా వస్తున్న ఆచారమే అనుకుంటాను. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవత రూపంలో పూజించేది శక్తినే కదా. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు, మా ఊరి అమ్మవారైన పైడితల్లి ఉత్సవం జరుగుతుంది. మహా వైభవంగా జరుగుతుందది. చిన్నతనంలో అమ్మవారిపండగ అంటే మాకు భలే సంబరం! ఊరినిండా ఎక్కడ పడితే అక్కడ హరికథలు, బుఱ్ఱకథలు రాత్రంతా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ళల్లోని జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఊరంతా కిటకిట, కళకళ. దసరా మొదటి రోజునించే పులివేషాలు, ఇంకా మిగతా పగటి వేషాలు ఊరంతా తిరగడం మొదలయ్యేవి. ఇక పైడితల్లమ్మవారి పండగ రోజైతే మరి చెప్పనే అక్కర లేదు. సాయంత్రం సుమారు నాలుగ్గంటలకి సిరిమాను ఉత్సవం మొదలయ్యేది. పైడితల్లి అమ్మవారి గుడినుండి కోటదాకా అమ్మవారు ముమ్మారు సిరిమాను రూపంలో తిరుగుతారు. ముందు జాలరివల, వెల్ల యేనుగు, రథం. వాటి వెనక సిరిమాను. మాను అంటే చెట్టు. శుభాన్ని చేకూర్చే మాను కాబట్టి సిరిమాను అని పేరు. ఆ మాను చివర అమ్మవారి గుడి పూజారి కూర్చుంటారు. వారిలో అమ్మవారు ఆవేశిస్తారని నమ్మకం. అలా ఆ సిరిమాను గుడినుండి కోటకి, మళ్ళీ కోటనుండి గుడికి మూడుసార్లు తిరిగుతూ ఉంటే దాన్ని చూడ్డానికి ఆ తోవంతా కిక్కిరిసిపోయి ఉంటారు జనం. ఆ తోవలో రెండు పక్కలా ఉన్న మేడలన్నీ జనాలతో నిండిపోతాయి. మా అదృష్టం ఏమిటంటే, మా ఇల్లు కోటకి సరిగ్గా ఎదురుగ్గా ఉండే వీధిలోనే! కాబట్టి ఇంటి అరుగుల మీద (ఇప్పుడు రోడ్డు విస్తరణ పుణ్యమా అని అరుగులని తెగనరికేసారనుకోండి :-() నిలబడితే హాయిగా కనిపించేది ఉత్సవం. ఆ రోజు, తెలుసున్న బంధువులు స్నేహితులు కుటుంబాలతో సహా మా ఇంటికే వచ్చేసేవారు, ఉత్సవాన్ని చూడ్డానికి. ఇంటి ముందు పెద్ద చెక్క మంచమొకటి వేసేవాళ్ళం, వచ్చిన వాళ్ళందరూ దాని మీద నిలబడి చూడ్డానికి. అతిథులందరికీ కాఫీ, టీ సరఫరాలు. వచ్చిన వాళ్ళ పిల్లలతో మా గెంతులు. పండగనగానే భలే సందడిగా ఉండేది ఇల్లంతా.
నాకు దసరా అంటే అమ్మవారిపండగే! ఈ ఏడాది కూడా పండక్కి ఇంటికి దూరంగా, చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది...ప్చ్...
పూర్తిగా చదవండి...