తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు!

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!

శివము శక్తిని గూడిన సృష్టి జరుగు
లేక దైవము స్పందనే లేని జడము
అట్టి నిను, హరిహర విరించాదులకును
పూజ్యమౌ దాని, నుతియింప మ్రొక్కులిడగ
అకృత పుణ్యులకున్ సాధ్యమగుట యెట్లు?

అమిత సూక్ష్మము, నీ పాదకమల భవము,
అయిన రేణువుచే లోక మవికలముగ
నా విరించి రచించు; సహస్ర శీర్ష
ములను హరి యెట్లొ భరియించు, బూదివోలె
హరుడు దానిని పొడి జేసి అలముకొనును

ఇవి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకాలకీ నా అనువాద ప్రయత్నం. దసరా పండగంటే అమ్మవారిని కొలిచే పండగ. అమ్మవారు శక్తి స్వరూపిణి. మన దేశంలోని మతాలలో శక్తిని ఆరాధించే వారి మతాన్ని శాక్తేయం అంటారు. ఈ శాక్తేయం ఎక్కువగా వంగ ప్రాంతంలో వర్ధిల్లిన మతం. అందుకే ఇప్పటికీ బెంగాలీలకి దసరానే అతి ప్రధానమైన పండగ. ఈ పండగని వాళ్ళు "పూజో" అంటారు. పదిరోజులు జరిగే ఈ దసరా పండగలో ఆ శక్తి వివిధ రూపాలని పూజిస్తాం.

శివము, శక్తి అనే ఈ ద్వంద్వం మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. వాక్కు-అర్థము, ప్రకృతి-పురుషుడు, బీజము-క్షేత్రము, చైతన్యము-జడము, energy-mass ఇలా. అవి రెండు కాదు ఒకటి అని తెలుసుకోవడం అద్వైతం. మన మెదడు ఉంది. అది ఏమిటంటే కొన్ని కోట్ల న్యూరాన్ల కలయిక. అయితే, అన్ని కొట్ల న్యూరాన్లు కలిసినంత మాత్రానే మెదడు ఏర్పడిపోతుందా? వాటిలోని స్పందన శక్తి ఏదో వాటిని పని చేయిస్తోంది. ఆ శక్తి లేకపోతే వట్టి న్యూరాన్లు మాత్రమే మెదడు కాలేవు. అలాగే ఒక పెద్ద జడపు ముద్దగా ఉన్న రూపంలో విశ్వానికి ఉనికి లేదు. ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి - ఆ జడపు ముద్దని విశ్వంగా మార్చిందని మన సైంటిస్టులు కూడా ఊహిస్తున్న విషయమే. విచిత్రం ఏమిటంటే, ఈ శక్తి జడంలో ఉన్నదే! దానికి భిన్నమైనది కాదు. మనిషి మెదడులోని అన్ని కోట్ల న్యూరాన్లూ ఒక్క అండము, శుక్రము కలయికలోంచి ఉద్భవించాయి. ఏ ఏ న్యూరాన్లు ఎలా పనిచెయ్యాలన్న విషయమంతా పరమాణు సదృశమైన DNAలో నిక్షిప్తమై ఉంది. అందులోంచే మనిషి (జీవం) సృష్టించబడుతోంది. జీవి మనుగడకి, చావుకీ కూడా అది కారకమవుతోంది. ఇది ప్రాణశక్తి. విశ్వం పుట్టుక ఎలా అయితే మనకింకా అంతుబట్ట లేదో, అలానే ప్రాణం పుట్టుక కూడా అంతుబట్ట లేదు. అయితే ఈ రెంటికీ కూడా మూలమైనది శక్తి అని మాత్రం తెలుసు. ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు. సృష్టి, స్థితి, లయ అనేవి అటు విశ్వానికీ, ఇటు ప్రాణానికీ కూడా సమానంగా ఉన్న లక్షణాలు.

ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ తేలతామో తెలీదు! శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.

శక్తిని స్త్రీ రూపంగా ఎందుకు పూజిస్తాం అన్నది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. అది అలా ఉంచితే, వివిధ రూపాల్లో శక్తిని అమ్మవారిగా పూజించడం మనకి బహుశా అనాదిగా వస్తున్న ఆచారమే అనుకుంటాను. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవత రూపంలో పూజించేది శక్తినే కదా. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు, మా ఊరి అమ్మవారైన పైడితల్లి ఉత్సవం జరుగుతుంది. మహా వైభవంగా జరుగుతుందది. చిన్నతనంలో అమ్మవారిపండగ అంటే మాకు భలే సంబరం! ఊరినిండా ఎక్కడ పడితే అక్కడ హరికథలు, బుఱ్ఱకథలు రాత్రంతా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ళల్లోని జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఊరంతా కిటకిట, కళకళ. దసరా మొదటి రోజునించే పులివేషాలు, ఇంకా మిగతా పగటి వేషాలు ఊరంతా తిరగడం మొదలయ్యేవి. ఇక పైడితల్లమ్మవారి పండగ రోజైతే మరి చెప్పనే అక్కర లేదు. సాయంత్రం సుమారు నాలుగ్గంటలకి సిరిమాను ఉత్సవం మొదలయ్యేది. పైడితల్లి అమ్మవారి గుడినుండి కోటదాకా అమ్మవారు ముమ్మారు సిరిమాను రూపంలో తిరుగుతారు. ముందు జాలరివల, వెల్ల యేనుగు, రథం. వాటి వెనక సిరిమాను. మాను అంటే చెట్టు. శుభాన్ని చేకూర్చే మాను కాబట్టి సిరిమాను అని పేరు. ఆ మాను చివర అమ్మవారి గుడి పూజారి కూర్చుంటారు. వారిలో అమ్మవారు ఆవేశిస్తారని నమ్మకం. అలా ఆ సిరిమాను గుడినుండి కోటకి, మళ్ళీ కోటనుండి గుడికి మూడుసార్లు తిరిగుతూ ఉంటే దాన్ని చూడ్డానికి ఆ తోవంతా కిక్కిరిసిపోయి ఉంటారు జనం. ఆ తోవలో రెండు పక్కలా ఉన్న మేడలన్నీ జనాలతో నిండిపోతాయి. మా అదృష్టం ఏమిటంటే, మా ఇల్లు కోటకి సరిగ్గా ఎదురుగ్గా ఉండే వీధిలోనే! కాబట్టి ఇంటి అరుగుల మీద (ఇప్పుడు రోడ్డు విస్తరణ పుణ్యమా అని అరుగులని తెగనరికేసారనుకోండి :-() నిలబడితే హాయిగా కనిపించేది ఉత్సవం. ఆ రోజు, తెలుసున్న బంధువులు స్నేహితులు కుటుంబాలతో సహా మా ఇంటికే వచ్చేసేవారు, ఉత్సవాన్ని చూడ్డానికి. ఇంటి ముందు పెద్ద చెక్క మంచమొకటి వేసేవాళ్ళం, వచ్చిన వాళ్ళందరూ దాని మీద నిలబడి చూడ్డానికి. అతిథులందరికీ కాఫీ, టీ సరఫరాలు. వచ్చిన వాళ్ళ పిల్లలతో మా గెంతులు. పండగనగానే భలే సందడిగా ఉండేది ఇల్లంతా.

నాకు దసరా అంటే అమ్మవారిపండగే! ఈ ఏడాది కూడా పండక్కి ఇంటికి దూరంగా, చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది...ప్చ్...

12 comments:

 1. meeku vijayadasami subhaakankshalu :)

  ReplyDelete
 2. దసరా శుభాకాంక్షలు .

  ReplyDelete
 3. విజయ దశమి శుభాకాంక్షలు

  ~సూర్యుడు

  ReplyDelete
 4. >>శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.

  చాలా బాగా చెప్పారు మాస్టారూ, ఆలోచన, అన్వేషణ రెండు మానేసాము అనిపిస్తోంది. మూడ భక్తి ఎక్కువ అయిపోతోందని కూడా అనుమానం వస్తోంది.

  >> ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు.

  సృష్టికి మూల కారణం ఐన శక్తి ని సైంటిస్ట్లు నిర్వచించే రోజు దగ్గర లోనే ఉంది.అయినా మత విశ్వాసాలు చెక్కు చెదరవు అనే అనుకుంటాను.
  థాంక్స్ చాలా మంచి విషయం బోధించారు.

  ReplyDelete
 5. మాస్టారూ మీది ఇజీనారామా? చెప్పారు కాదు. మాది కూడానండీ. మీరు గురాచారివారి వీధిలో ఉంటున్నారా? మేము పొత్తురివారి వీధిలో ఉంటున్నామండీ. అయితే మీకు మా నాన్నగారు తెలిసే ఉంటారు. రేపు పైడితల్లి అమ్మవారు పండుగ, నా మనసంతా అక్కడే ఉంది. మీరు రాసినది చదువుతూ ఉంటే అమ్మవారి పండగ అలా కళ్ళకి కట్టినట్టు కనిపిచింది. చిన్నప్పుడు ఎంత సరదావో ఆ పండగ వస్తే. పులివేషాలు, బాజాలు, సిరిమాను చూడడం, అమ్మవారికి ఉపారం పెట్టడం, ...ఓహ్ భలే సందడి.

  ReplyDelete
 6. >>నాకు దసరా అంటే అమ్మవారిపండగే!<< మాకూ అంతే :)
  గత పదేళ్ళుగా మిస్ అవుతున్నా అమ్మవారి పండగని. ఈసారీ వెళ్ళే అవకాశం లేదు ప్చ్.

  ReplyDelete
 7. ఇందుగారూ, మాలాకుమార్ గారూ, సూర్యుడుగారూ, నెనరులు.

  సుబ్రహ్మణ్యంగారూ,
  మీ వ్యాక్యకి ధన్యవాదాలు. నా ఆలోచనలని నలుగురితో పంచుకోడమే తప్ప ఏదో బోధించడం నా ఉద్దేశం కాదండీ. "సృష్టికి మూల కారణం ఐన శక్తి ని సైంటిస్ట్లు నిర్వచించే రోజు దగ్గర లోనే ఉంది." - మీరు చాలా ఆశావాది అనుకుంటా :-)
  మత విశ్వాసాలకీ దీనికీ సంబంధమంతగా లేదని నా ఉద్దేశం. ఒక మామూలు మనిషికి జీవించడానికి కొన్ని నమ్మకాలు అవసరం అనుకుంటా. లేదంటే తన జీవితానికి అర్థమే లేకుండా పోతుంది. సైన్సు బతుక్కి అర్థాన్ని చెప్పలేదు, మహా అయితే అది వ్యర్థం అని తేల్చెయ్యడం తప్ప! ప్రతి మనిషి తన బతుక్కి ఏదో అర్థాన్ని తానే వెతుక్కోక తప్పదు. ఆ అన్వేషణలో కొన్ని నమ్మకాలు ఏర్పరచుకోవడమూ తప్పదు!

  సౌమ్యగారూ,
  అవునండీ మాది విజయనగరమే, ఇంతకుముందే ఎప్పుడో బ్లాగులో ఈ విషయం ప్రస్తావించినట్టే ఉన్నానే :-) కోటకి సరిగ్గా ఎదురికి ఉండేది గురాచారి వీధే అయినా, ఆ వీధిలోంచి సిరిమాను సరిగా కనిపించదు కదా! కాబట్టి మాది ఆ పక్క వీధి :-) "పొత్తురివారి వీధి" అంటే తప్పకుండా తెలిసే ఉంటుంది, నాకు కాకపోయినా మా నాన్నగారికి. మీకభ్యంతరం లేకపోతే మీ నాన్నగాఅరి వివరాలు నాకు మైలు పంపించండి.

  ReplyDelete
 8. అవునా, చెప్పారా, నాకు గుర్తు లేదండీ. సరే మైల్ చేస్తాలెండి.

  ReplyDelete
 9. కామేశ్వరరావుగారు, సౌందర్యలహరి శ్లోకాలకి మీ అనువాద పద్యాలు చాలా సులభం గా ఉన్నాయి. అయితే అది చదవగానే సౌందర్య లహరి లో అపరిష్కృతంగా ఉండిపోయిన ఓక్ చిన్నడౌటు మళ్ళీ బుర్ర దొలిచెయ్యటం మొదలెట్టింది.

  ఇక్కడది అసందర్భం ఏమో తెలీదు కానీ, 100 శ్లొకాలలో 1 వ శ్లోకమూ,100 వ శ్లోకమూ తప్ప మిగిలినవి అన్నీ అమ్మవారితో మాట్లాడినట్టూ లేదా అమ్మ వారిని వర్ణిస్తునట్టు అనిపిస్తాయి. ఈ రెండు మాత్రం వేరే ఎవరితోనో సంభాషిస్తున్నట్టు, వారికి సమాధానం ఇస్తున్నట్టు, లేదా జస్టిఫికేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తాయి (నా పరిమిత జ్ఞానానికి)

  "శక్తియుతుడైనప్పుడు శివుడు ఈ జగాలను సృష్టించగలుగుతున్నాడు. అదే, శక్తిలేకున్నచో ఒక వేలుకూడా కదపలేడు; అటువంటి హరి,హర, విరించి మొదలగు వారిచే ఆరాధింపబడే నిన్ను స్తుతించిన వాడు అకృతపుణ్యుడెట్లా ఔతాడు తల్లీ? (అంటే అవ్వడు, అవ్వలేడు అనే భావాన్ని ప్రతిపాదిస్తున్నట్టున్న శ్లోకంతో సౌందర్యలహరి ప్రారంభించినట్లుంటుంది.

  శంకరుల స్త్రోత్రాన్నో, వర్ణననో అర్థంచేసుకోటానికికూడా నా పురాకృతం సరిపోదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అయినా నాకొచ్చిన సందేహం తెలియజేస్తేనేగా నివృత్తి అయ్యేది. అందుకే సాహసం చేస్తున్నా.

  ఈ శ్లోకంలో స్తుతింపబడుతున్న దేవత, ప్రతిపాదింపబడుతున్న సత్యమూ, వీటికీ అన్వయము చెబుతూ అసంపూర్ణంగా (లేదా అన్యాపదేశంగా) చేసిన ప్రశ్న అసంబధ్ధంగా ఉన్నదేమో అని నా భావం. అమ్మవారిని స్తుతిస్తున్నప్పుడు ఎవరికో సమాధానం చెబుతున్నట్టు/ జస్టిఫికేషన్ లాగా "కథం అకృత పుణ్యః ప్రభవతి?" అని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంటుంది?

  అసలు శంకరులంతటివారు చేసిన ఏ స్తుతిలోనూ ఇటువంటి ప్రతిపాదనలేదు.
  కావాలంటే శివానందలహరి లో చూడండి.

  కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతప:
  ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే
  శివాభ్యాం మస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
  ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియం

  సౌందర్యలహరి లో మొదటిశ్లోకం, అల్లానే 100వ శ్లోకం భిన్నంగా కనిపిస్తాయి.
  పోతన భాగవతంలో కొన్ని పద్యాలు మిగిలిన వాక్ప్రవాహానికి సరిపోనట్టుగా ఉంటాయి కదా.. అలాగే ఇవికూడా వేరే ఎవరైనా రాసి ఉండి ఉంటారేమో అని నా అనుమానం.(నిర్ధారించటానికి కూడా కావలసినంత పరిజ్ఞానం నాకు లేదనుకోండి..)

  మీకేమైనా వాటికి కారణం తెలుసా?

  ReplyDelete
 10. సనత్ గారూ,

  మీ ప్రశ్నకి మీరే జవాబిచ్చేసినట్టుగా నాకనిపించింది :-) లేదా మీ ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదో!

  మొదటి శ్లోకం అమ్మవారితో నేరుగా మాట్లాడుతున్నట్టే కదా ఉంది. అలాగే "కథం అకృతపుణ్యః ప్రభవతి" అనడంలో ఉన్నది సందేహం కాదు. అకృతపుణ్యులకి సాధ్యం కాదు అనే కదా అర్థం. ఒకరకంగా ఇది తనని తాను ప్రశ్నించుకొని సమాధానపరచుకున్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఏ శక్తి అయితే శివునితో కలిసి సర్వ జగత్కారణమవుతోందో, ఏ శక్తి చేత సృష్టి స్థితి లయమనే మూడు కార్యాలు నిర్వహించబడుతున్నాయో అలాంటి శక్తిని తాను స్తుతించబోతున్నాడు, వర్ణించబోతున్నాడు. దానికి తాణు తగిన వాడా? అలాంటి సంకల్పం కలగడమే పుణ్యమని స్ఫురించి ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకోవడం మూలానే తానీ పని చెయ్యగలుగుతున్నానని నచ్చచెప్పుకున్నాడు అనుకోవచ్చు.

  100 శ్లోకంలో కూడా నాకు సందేహం ఏదీ కనిపించలేదు.

  ReplyDelete
 11. కామేశ్వరరావు గారు,

  నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయితే నా ప్రశ్న కూడా అదే. ఏ స్త్రోత్రాన్ని చేసేముందు తన మీద తనకి రాని డౌటు శంకరభగవత్పాదులకి అమవారిని స్తుతించే సౌందర్య లహరి లోనే ఎందుకు వచ్చి ఉంటుంది? ద్వైత, అద్వైత, విసిష్తాద్వైతాలను ఆకళింపు చేసుకుని తత్త్వ జ్ఞనాన్ని సంపాదించుకున్న శంకరులకు తన సామర్థ్యం అంటూ వెరె ఒకటి ఉంటుందని, అమ్మ వారిని స్తుతించటానికి అది సరిపోతుందా సరిపోదా అనే శంక కలగటం, అంతలోనే "కాదులే, ఇట్లాంటి అమ్మవారిని స్తుతించేటప్పుడు ఇంక అకృతపుణ్యుణ్ణి ఎట్లా ఔతాను" అని సమాధానం చెప్పుకోవటం సాధ్యమా? సంభావ్యమేనా?

  ఇంకొకటి. సౌందర్యలహరి గురించి (చాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన ప్రవచనంలో అనుకుంటాను)... సాక్షాత్తూ పరమశివుడు తప్ప అన్యులెవరూ అమ్మవారి వైభవాన్ని అంత అద్భుతంగా చెప్పలేరు. ఆదిశంకరులు సాక్షాత్తూ కైలాసశంకరులే. కైలాసశంకరులు చెప్పిన సౌందర్యలహరిని ఆదిశంకరులు భూమిపైకి తెచ్చారు. దానిలో కొంత భాగం ఖిలమైపోగా ఆదిశంకరులు తానే పూర్తిచేసారు.ఒకవేల గనక కైలాసశంకరులే గనక కీర్తిస్తే వారికి సందేహం కలగటమా?

  మరొకటి. శంకరుల ఏ స్త్రోత్రాన్ని చూసినా "తనను" గురించిన (లేదా తనవంటి భక్తుడి గురించిన) ప్రస్తావనతో మొదలు కాలేదు. స్తుతింపబడుతున్న దేవతనుద్దేశించి చేసినవే అన్నీను. రెండవ శ్లోకం నుండీ అదే పంథా కనిపిస్తుంది. అమ్మవారిని స్తుతించతమే ఉంది కానీ ఇతరమైనవి కనిపించవు. మొదటి శ్లోకం లో మాత్రం ఉపాస్య దీవం ప్రస్తావన తో పాటు మానవ మాత్రుల అదృష్తం గురించిన ప్రస్తావన కనిపిస్తోంది.

  ఇది నా భావన, తప్పేమో కూడా... తెలీదు...

  ReplyDelete
 12. దీపావలి శుభాకాంక్శలు

  ReplyDelete